వామపక్ష ఉగ్రవాదం ఇక్కడ పుట్టి ఐదు దశాబ్దాలు గడిచింది. ఏ దేశాన్ని చూసి ఇక్కడ వామపక్షవాదం పురుడు పోసుకుందో ఆ చైనాయే ఇప్పుడు వామపక్షం మీద విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. కమ్యూనిస్టు రాజ్యాలు కనుమరుగైపోతున్నాయి. అసలు కమ్యూనిజం అన్న మాటే చాలాచోట్ల చెత్తబుట్టలోకి చేరింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నది. అయినా భారతీయ మావోయిస్టులు ఉగ్రవాదాన్నే నమ్ముతున్నారు. సాయుధ పోరుకే మొగ్గుతున్నారు. కానీ, ఆధునిక నాగరిక సమాజంలో హింసకు తావు లేదు. అమాయకుల ప్రాణాలు హరించినంతమాత్రాన ఏ సమస్యా పరిష్కారం కాదు. చర్చలే పరిష్కారం. గుణపాఠాలు పట్టని భారతీయ మావోయిస్టులకు ఈ విషయం బోధపడటం లేదు. అనాలోచిత విధానాలతో తాము నష్టపోవడం, ఇతరులను నష్టపరచడం తప్ప వారు సాధించిందేమీ లేదన్నది చరిత్ర చెబుతున్న చేదు నిజం. పొరుగున ఉన్న నేపాల్లో కరడుగట్టిన మావోయిస్టు నేతగా పేరుగాంచిన, దశాబ్దాలపాటు అజ్ఞాతంలో ఉండి పోరాడిన పుష్పకమల్‌ ‌దహాల్‌ అలియాస్‌ ‌ప్రచండ వంటి నేతలు పోరుబాటను వీడి, జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పటికీ భారతీయ మావోయిస్టులకు కనువిప్పు కలగడం లేదు. ఇంకా తమదైన పంథాలోనే ప్రయాణిస్తూ మారణహోమానికి కారకులవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.


ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్‌ 3‌న 22మంది జవాన్లను (సీఆర్‌పీఎఫ్‌లో కోబ్రా విభాగం) బలిగొనడం, 30 మందికి పైగా గాయపరచడం ద్వారా మావోయిస్టులు మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు. కొండకోనల్లో మాటువేసి జవాన్లపై తూటాల వర్షం కురిపించడం ద్వారా రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. విధి నిర్వహణలో ఉండే భద్రతా దళాలను బలిగొంటూ వారు కోరుకునే సమ సమాజం సిద్ధిస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. గిరిజనుల కోసం, వారి అభ్యున్నతి కోసం పోరాడుతున్నామని అదేపనిగా చెప్పుకునే మావోయిస్టులు తమ మారణహోమాన్ని వారు కూడా సమర్థించడం లేదని ఎప్పటికి గుర్తిస్తారు? సానుభూతిపరులు కూడా నిరసించే విధానాలకు ఎప్పుడు అంతం పలుకుతారు? ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు. మావోయిస్టులు ఆత్మవిమర్శ చేసుకున్నా, తమ విధానాలను సమీక్షించుకున్నా ఛత్తీస్‌గఢ్‌ ‌లాంటి ఘటనలు చోటుచేసుకోవు.

 బీజాపూర్‌- ‌సుక్మాజిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మరణించిన వారిలో ఆంధప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం జిల్లాకు చెందిన రౌతు జగదీష్‌లను కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల ఆవేదన మాటలకు అందనిది. 32 ఏళ్ల మురళి ఆరేళ్ల క్రితం విధుల్లో చేరారు. సీఆర్‌పీఎఫ్‌లోని కోబ్రా-210 విభాగంలో పనిచేస్తూ మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు. త్వరలోనే ఆయనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఘటన అతని కుటుంబాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీసింది. విజయనగరం పట్టణంలోని గాజులరేకకు చెందిన రౌతు జగదీష్‌ (27) 2014‌లో సీఆర్‌పీఎఫ్‌ -210 ‌కోబ్రా దళంలో చేరారు. మరో రెండు రోజుల్లో సెలవుపై ఇంటికి వస్తానంటూ తల్లితండ్రులకు జగదీష్‌ ‌చెప్పారు. చివరికి కుమారుడు బదులు అతని భౌతికకాయం రావడం చూసిన తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మే 12న జగదీష్‌ ‌వివాహం జరగాల్సి ఉంది. ఆ కుటుంబాలు ఇంకా తేరుకోలేకపోతున్నాయి.

జవాన్ల వీరోచిత పోరాటం…

 మాటుకాచిన మావోయిస్టులు అనూహ్యంగా దాడి చేసినప్పటికీ జవాన్లు వెంటనే తేరుకుని తగిన రీతిలో జవాబిచ్చారు. ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులకు తెగబడటం మావోయిస్టులకు అను కూలంగా మారింది. మావోయిస్టుల వద్ద గల మందు గుండు పూర్తయి వారు వెనకడుగు వేసేవరకు సీఆర్‌ ‌పీఎఫ్‌ ‌కోబ్రా దళాలు వీరోచితంగా పోరాడాయి. తద్వారా మావోయిస్టులు ముందుకు రాకుండా, తమ వైపు ఎక్కువ నష్టం జరగకుండా బలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. బీజాపూర్‌- ‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా టాక్టికల్‌ ‌కౌంటర్‌ అఫెన్సివ్‌ ‌క్యాంపెయిన్‌ (‌టీసీవోసీ) నిర్వహిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో తరెం, ఊసూరు, మిన, పామేడు, నర్సాపురం బేస్‌ ‌క్యాంప్‌ల నుంచి సుమారు రెండువేల మంది జవాన్లు గాలింపునకు వెళ్లారు.  తిరిగివస్తుంటే గుట్టలపై నుంచి దాదాపు 400 మంది మావో యిస్టులు దాడికి దిగారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా విషయం తెలిసిన వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని ఛత్తీస్‌గఢ్‌ ‌వెళ్లారు. అమరవీరులకు అంజలి ఘటించారు. బలగాల్లో స్థైర్యం నింపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ ‌బఘేల్‌ ‌కూడా బలగాలను పరామర్శించారు. ప్రభుత్వం ఈ ఘటనను తేలిగ్గా తీసుకోబోదని, ప్రతీకారం తీర్చుకుంటుందని హోంమంత్రి చెప్పారు. బీజాపూర్‌ ‌జిల్లాలోని మారు మూలన గల జవాన్ల శిబిరాన్ని అమిత్‌  ‌సందర్శిం చారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతానికి ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.

గతమంతా రక్తసిక్తం

 మావోయిస్టుల ఆగడాలకు అంతు ఉండటం లేదు. గతంలోనూ వివిధ సందర్భాల్లో వారు దాడులకు తెగబడ్డారు. 2008 జూన్‌ 29‌న ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో బలిమెల రిజర్వాయరులో పోలీసులపై దాడికి దిగారు. గాలింపు అనంతరం బోటులో తిరిగివస్తున్న పోలీసులపై జరిపిన కాల్పుల్లో 38మంది మరణించారు. 2009 జూలై 13న ఛత్తీస్‌గఢ్‌లోని రాజానందగావ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ ఎస్పీ సహా 30 మంది పోలీసులు అమరులయ్యారు. 2010 ఏప్రిల్‌ 6‌న ఛత్తీస్‌గఢ్‌లోని తాడిమెట్ల అటవీప్రాంతంలో ఏకంగా 76 మంది జవాన్లను బలిగొన్నారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద దాడి. అదే ఏడాది జూన్‌ 29‌న నారాయణ్‌ ‌పూర్‌ ‌జిల్లా జగ్గాఘాట్‌ ‌వద్ద 26 మంది భద్రతా బలగాల మరణానికి మావోయిస్టులు కారకులయ్యారు. 2013 మే నెలలో కాంగ్రెస్‌ ‌ప్రచారసభపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పార్టీ అగ్రనేత మహేంద్ర కర్మ హత్యకు గురయ్యారు. మరో 20 మంది నేతలను మావోయిస్టులు హతమార్చారు. మహేంద్ర కర్మ అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ‘సల్వా జుడుం’ వ్యవస్థను రూపొందించింది ఆయనే. 2017 మార్చి 11న డోర్పపాల్‌ అటవీ ప్రాంతంలో 12మంది జవాన్లను హతమార్చారు. వీరు రహదారి నిర్మాణ పనులకు కాపలాగా ఉన్నారు. 2020 మార్చిలో జవాన్లపై దాడికి తెగబడి 17 మందిని బలిగొన్నారు. ఇలా ఎన్నో!

 తాజా ఘటనకు సంబంధించి మావోయిస్టుల వలలో బలగాలు చిక్కాయన్న వాదన వినపడుతోంది. సాధారణంగా ఏటా జనవరి నుంచి జూన్‌ ‌వరకు మావోయిస్టులు ఆయుధ సామగ్రి తయారీ, నూతన నియామకాలపై దృష్టి పెడతారు. ఈ కాలంలో వాతావరణం ఒకింత అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. ఏ ప్రాంతం తమకు సురక్షితమో గుర్తించే పనిలో ఉంటారు. గాలింపునకు వచ్చే బలగాలపై దాడులకు వ్యూహాలు రచిస్తుంటారు. దీనినే టాక్టికల్‌ ‌కౌంటర్‌ అఫెన్సివ్‌ ‌క్యాంపెయిన్‌ (‌టీసీవోసీ) గా వ్యవహరిస్తారు. గతంలో కూడా ఈ సందర్భంగానే దాడులు జరగడం గమనార్హం. బలిమెల ఘటన కూడా ఆ సమయంలోనే జరిగింది. ఇప్పుడు తరెం ఘటన సైతం ఇలాంటిదేనని నిపుణులు చెబుతున్నారు. దండకారణ్యంలో గతంలో మావోయిస్టులు భద్రతా బలగాలను ట్రాప్‌ ‌చేయడం ద్వారానే వారిని హతమార్చాయి. సాధారణంగా మావోయిస్టులు ఎక్కడైనా సమావేశమవుతున్నారన్న సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో బలగాలు గాలింపు చర్యలు చేపడుతుంటాయి. ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. ఈ సందర్భంగా బలగాలు ప్రయాణించే దారిలో బాంబులు పెట్టడం ద్వారా మావోయిస్టులు దారుణాలకు పాల్పడుతుంటారు. అదే సమయంలో బలగాలు ప్రయాణించే మార్గంలో మాటువేసి కాల్పులకు దిగుతుంటారు. బలగాలు ఎదురుదాడికి దిగినా తమకు పెద్దగా నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడతారు. ఇది సాధారణంగా మావోయిస్టులు అనుసరించే వ్యూహం. ఈ విషయాన్ని బలగాలు పసిగట్ట లేకపోయాయిన్న వాదన ఇప్పుడు వినపడు తోంది. గంటలకొద్ది బలగాలు ఒకే ప్రాంతంలో వేచి ఉండటంతో భారీ నష్టం జరిగినట్లు చెబుతున్నారు. మరో వాదన కూడా వినపడుతోంది. దండకారణ్య పరిధిలోని బీజాపూర్‌ ‌జిల్లా పువర్తి చుట్టపక్కల ప్రాంతాల్లో మావోయిస్టులు సంచ రిస్తున్నారన్న సమాచారం లభించింది. మావోయిస్టు కమాండర్‌ ‌మడావి హిడ్మా స్వగ్రామం ఇదే కావడం, అతడు ఇక్కడే ఉంటాడన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. స్థానిక పరిస్థితులపై అవగాహన గల అధికారిని సైతం తోడుగా తీసుకెళ్లారు. పువర్తి పరిసరాల్లో గల టేకులగూడెం, జొన్నగూడెం, జీరగూడెం, ఉసంపుర తదితర ప్రాంతాల్లో గాలింపు సాగించారు. మావోయిస్టులు స్నానాల కోసం తరచూ టేకులగూడెంలోని ఓ బావి వద్దకు వస్తారన్న సమాచారం కూడా వారికి అందింది. దీంతో కొంత మంది అక్కడికి వెళ్లారు. అక్కడ ఎవరూ కనిపించక పోవడంతో సమీపంలోని కొండపైకి బలగాలు వెళ్లాయి. అక్కడ మావోయిస్టులు ఎదురవడంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం జవాన్ల మృతదేహాలను టేకులగూడెం తీసుకువచ్చారు. సమయంలో పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారాన్ని బీజాపూర్‌ ఎస్పీ కార్యాలయం అందించింది. అయితే హెలికాఫ్టర్‌లో జవాన్ల మృతదేహాలను తరలించాలన్న ఉద్దేశంతో బలగాలు అక్కడే ఆగిపోయాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు.  అయితే మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా కోసం బలగాలు గాలించినప్పటికీ దాడుల్లో అతను పాల్గొనలేదని సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెరవెనక నుంచే తమ వాళ్లకు మార్గదర్శకత్వం చేశారని చెబుతున్నారు.

రాకేశ్వర సింగ్‌

22మంది జవాన్లను బలిగొన్న మావోయిస్టులు ఒక కమెండోను బందీగా తీసుకున్నారు. జమ్మూకు చెందిన రాకేశ్వర సింగ్‌ అనూహ్యంగా బందీ అయ్యారు. ఎట్టకేలకు మధ్యవర్తుల చర్చల అనంతరం ఆయనను సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో ఆయన కుటుంబం ఆనందించింది. జమ్మూ-అఖ్నోర్‌ ‌రోడ్డులోని బర్నాయిలో గల రాకేశ్వర్‌ ఇం‌టికి పెద్దయెత్తున ప్రజలు చేరుకుని భారత్‌మాతాకీ జై అని నినదించారు. బలగాలపై దాడితో ప్రజా వ్యతిరేకతను మూటగట్టకున్న మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి, చివరకు చేసేదేమీ లేక సింగ్‌ను విడిచి పెట్టారు. దీనికి మానవతా వాదమని, అమాయకుల జోలికి తాము పోమనిపైకి మావోయిస్టులు డాంబికాలు పలుకుతున్నారు. సింగ్‌ను తర్రెం బెటాలియన్‌ ‌వద్ద సీఆర్‌పీఎఫ్‌ ‌బెటాలియన్‌ ‌బీజాపూర్‌ ‌డీఐజీ కోమల్‌ ‌సింగ్‌కు అప్పగించారు. సింగ్‌ ‌విడుదల కోసం ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం మధ్యప్రదేశ్‌కు చెందిన పద్మశ్రీ ధరమ్‌ ‌పాల్‌ ‌సైనీ, గోండ్వానా తెగ అధ్యక్షుడు తేలం బోరయ్య, ఏడుగురు పాత్రికేయులతో మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. బోరయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆవుపల్లి బ్లాక్‌లోని కమర్‌ ‌గూడకు చెందిన ఆయన గోండ్వానా సమాజ్‌ ‌జిల్లా అధ్యక్షుడు. ఏడు పదుల బోరయ్య ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తనవంతు సాయానికి ఎప్పుడూ ముందుంటారు. వారు జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో జవాను సురక్షితంగా తిరిగివచ్చారు. మావోయిస్టులతో చర్చల పక్రియ సానుకూల వాతావరణంలో జరిగినట్లు 91 సంవత్సరాల పద్మశ్రీ ధర్మపాల్‌ ‌సైనీ చెప్పారు.

ఇంత జరిగినా మావోయిస్టుల వైఖరిలో మార్పు కనపడటం లేదు. ముగ్గురు మహిళలను అపహరించ డమే ఇందుకు నిదర్శనమన్న వాదన వినపడుతోంది. రాకేశ్వర సింగ్‌ను విడుదల చేసిన అనంతరం గంగలూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని కంకనార్‌ ‌గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించి ముగ్గురు గిరిజన మహిళలను అపహరించారు. అపహరణకు గురైనవారిలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త, ఇద్దరు కమ్యూనిటీ హెల్త్ ‌వర్కర్లు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళలను తీసుకెళ్లినట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులకు వైద్య సేవలు అందించేందుకు వీరిని అపహరించినట్లు పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సూత్రధారి హిడ్మా …

 అడవుల్లో వానాకాలంలో సాధారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వాగులు, వంకలు అడ్డంకులు కల్పిస్తాయి. రహదారులు కూడా నడకకు అనువుగా ఉండవు. వానలకు అడవులు చిత్తడిగా మారుతాయి. అందుకే ఆ సమయంలో శిక్షణ, అధ్యయనం వంటి కార్యక్రమా లను మావోయిస్టులు చేపడతారు. అందువల్ల గాలింపునకు బలగాలు ఎంచుకున్న సమయం కూడా సరైనది కాదని చెబుతున్నారు. మావోయిస్టుల వైపున కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అయితే ఎంతమందన్నది కచ్చితంగా తెలియదు. ఈ విషయంలో వారివైపు నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేదు. నలుగురు మాత్రమే మరణించినట్లు వారు చెబుతున్నారు. తాజా ఎదురుకాల్పులతో పాటు గతంలో జరిగిన వివిధ ఘటనల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కీలక పాత్ర పోషించారు. దండ కారణ్యంపై అతనికి మంచి అవగాహన ఉంది. అతని చుట్టూ ఎప్పుడూ నాలుగంచెల బందోబస్తు ఉంటుంది. అతని సమీపంలోకి వెళ్లడం బలగాలకు సాధ్యం కాదు. హిడ్మా వయసు, రూపురేఖల గురించి బలగాలకు స్పష్టంగా తెలియదు. యువకుడిగా ఉన్నప్పటి ఫొటోలు తప్పితే తాజా చిత్రాలు లేవు. ఆత్మరక్షణ కోసం అతను ఎప్పుడూ ఏకే-47 తన వద్ద ఉంచుకుంటాడు. అతనికి భద్రతగా ఉండే అనుచరుల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది హిడ్మాను వదిలి పెట్టబోమని, అతని అంతుచూస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి హెచ్చరించారు.

హిడ్మా ?

అమాయకుల ప్రాణాలను హరించే పోలీసులు తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని మావోయిస్టులు ఎదురుదాడి చేస్తున్నారు. వారి వాదన ప్రకారం…. ఎదురుకాల్పులకు ముందు జీరగూడెం గ్రామానికి చెందిన మడివి చుక్కాల్‌ అనే వ్యక్తిని పోలీసులు హత్య చేసి ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు అబద్ధాలు చెప్పారు. తమను అంతమొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబరులో ఆపరేషన్‌ ‌ప్రహర్‌, ఆపరేషన్‌ ‌సమాధాన్‌ ‌కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఐజీ సుందర్‌ ‌రాజ్‌ ‌సారథ్యంలో పెద్దయెత్తున బలగాలు ఏప్రిల్‌ ‌మూడున మాపై దాడికి వచ్చాయి. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో వందల మంది అమాయక ప్రజలను వేధించారు. హింసిం చారు. కొంతమందిని హత్య చేశారు. మహిళలపై అనైతిక చర్యలకు ఒడిగట్టారు. ఓ వైపు ప్రగతి పేరుతో రహదారులు, వంతెనలు నిర్మిస్తున్నారు. ఇవన్నీ ప్రజల కోసమేనని నమ్మిస్తున్నారు. కానీ మావోయిస్టులపై దాడులకు వీటిని ఉపయోగిస్తున్నారు. గతంలో కన్నా నరేంద్ర మోదీ పాలనలో అణచివేత అధికమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజా సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పేరుకు ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకుంటు న్నప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నది నూటికి నూరుశాతం నియంత పాలనే. కంద్రంలోనే కాదు… దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి… అని మావోయిస్టు నేతలు వివరించారు.

అరాచకానికి పాల్పడుతూనే పోలీసులపై సానుభూతి చూపడం మావోలకే చెల్లింది. పోలీసులు మాకు శత్రువులు కారు. పాలకవర్గాల ఆటలో వారు బలి పశువులవుతున్నారు. ఎదురుకాల్పుల్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. 2022లోగా మావోయిస్టులను అంతం చేయాలన్నది మోదీ- అమిత్‌ ‌షా ఆలోచన. గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులను కారుచౌకగా ఈ సర్కారు బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడు తోంది. దీనిని మేము అడ్డుకుని తీరుతాం. అన్ని అధికారాలూ ప్రజలకే ఉండాలి. ముఖ్యంగా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట పడాలి… అని వాదిస్తున్నారు. చేయాల్సినదంతా చేసి చర్చలకు సిద్ధమని చెప్పడం కూడా మావోలకే చెల్లింది.

 ప్రజల పక్షాన పోరాడుతున్నామని మావోయి స్టులు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి మావోయిస్టుల ఉనికి రానురాను కనమరుగవుతోంది. ఒకప్పుడు వామపక్ష ఉగ్రవాదం ఛత్తీస్‌గఢ్‌తోపాటు బిహార్‌, ‌జార్ఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌యూపీ తదితర రాష్ట్రాల్లో ఉండేది. ఇప్పడు ఆయా రాష్ట్రాల్లో దాదాపు లేదనే చెప్పాలి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌ ‌లోనే కొనసాగుతోంది. ఇక్కడ కూడా రాష్ట్రవ్యాప్తంగా లేదు. కేవలం దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌, ‌నారాయణపూర్‌ ‌తదితర ప్రాంతాలకే పరిమితమైంది.

మావోల ప్రభావం తగ్గుతోందా?

ఛత్తీస్‌గఢ్‌ ‌వ్యవసాయ మంత్రి రవీంద్రచౌబే  అభిప్రాయం ప్రకారం పదేళ్ల క్రితానికి ఇప్పటికీ గణనీయమైన మార్పు కనపడుతోంది. 2010లో 2,213 ఘటనలు జరగ్గా, 1,005 మంది మరణిం చారు. అదే 2019లో 670 ఘటనలు జరగ్గా మరణాల సంఖ్య 202కు తగ్గింది. దశాబ్దం క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో మావోయిస్టులు పెట్రేగిపోయేవారు. ఇప్పడు వారి ఉనికి ఛత్తీస్‌గఢ్‌కు మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని బస్తర్‌ ‌ప్రాంతంలో గల దండకారణ్య ప్రాంతానికి పరిమితమైంది. ఈ ప్రాంతానికి సరిహద్దుల్లోనే తెలంగాణలోని ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉంటాయి. ఒకప్పుడు ఈ జిల్లాల్లో మావోల ఉనికి కనపడేది. ప్రస్తుతం ఆ ఛాయలే లేవు. ప్రజలు తమ పిల్లల చదువులు, ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవాంఛనీయ పోరాటాలతో ఇరువైపులా నష్టపోవడం తప్ప సాధించేదేమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను జనజీవన స్రవంతిలోకి తీసుకువస్తున్నాయి. వారు స్వయం ఉపాధి పొందేందుకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నాయి. గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక చట్టాలు అమలు చేస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారులను నియమిస్తున్నాయి. వారు పథకాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడికి అందించేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పాటుపడుతున్నారు. గిరిజనుల హక్కుల రక్షణకు రాజ్యాంగం భరోసాగా నిలుస్తోంది. యువకులను విద్యవైపు మళ్లిస్తుండటంతో వారిలో జీవితంపై ఆశలు చిగురిస్తున్నాయి.

గతంలో అనేకమంది అమాయక యువకులు మావోయిస్టుల దళాల్లో చేరేందుకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. భార్యాబిడ్డలను, తల్లితండ్రులను వదిలి వెళ్లేందుకు విముఖుత చూపుతున్నారు. అక్షరాస్యత పెరగడం, అవగాహన స్థాయి పెరగడంతో మావోల మాటలను నమ్మడం లేదు. ఇంతకు ముందు దళాల్లో చేరి, ఇబ్బందులు పడ్డవారిని చూసి, ప్రాణాలను కోల్పోయిన వారి గురించి విన్నాక ఆ ఆలోచననే దరిచేరనీయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో హింసకు తావు లేదని, విధాన పరమైన, సిద్ధాంతపరమైన విభేదాలతో ప్రాణాలను తీయడం సరైనది కాదన్న నిశ్చితాభిప్రాయానికి యువత వచ్చింది. దీంతో మావోయిస్టు నేతలు ఆందోళన చెందుతున్నారు.

కొత్తగా చేరేవారు తగ్గిపోవడం, ఉన్నవారి వయసు పెరగడం, అంతర్గతంగా వేధింపుల కారణంగా మావోయిస్టులు నానాటికీ బలహీన పడుతున్నారు. గిరిజనులు, పేదల కోసం తాము పోరాడుతున్నామని మావోయిస్టులు పదేపదే చెబుతుంటారు. కానీ వారెవరూ బహిరంగంగా మావోయిస్టులకు మద్దతు పలకడం లేదు. వారి హింసాత్మక కార్యక్రమాలను సమర్థించడం లేదు. అదే సమయంలో ఎన్నికల పక్రియలో చురుగ్గా పాల్గొంటూ ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నారు. ప్రగతిని వీడి, తమ గురించి పట్టించుకోని వారిని అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో నిర్మొహమాటంగా గద్దె దించుతున్నారు. ఎంతటి గొప్ప నాయకులైన ప్రజాతీర్పునకు తలవంచక తప్పడం లేదు. అలాగని ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలు లేవని చెప్పలేం. కానీ వాటిని సవరించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. లోపాల పేరు చెప్పి పక్కదారి పడితే చివరకు మిగిలేది అరాచకమే. శాంతితోనే ఏదైనా సాధ్యం. చర్చలతోనే ఏదైనా సాధ్యం. ఈ విషయాన్ని మావోయిస్టులు గుర్తించిన నాడు దాడులు, ప్రతిదాడులు, బుల్లెట్ల కాల్పులు ఉండనే ఉండవు. శాంతి వర్థిల్లుతుంది. సుస్థిరత లభిస్తుంది. ప్రగతి పరుగులు పెడుతుంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

By editor

Twitter
Instagram