– సామవేదం షణ్ముఖశర్మ

ప్రకృతిని దైవంగా ఆరాధించడం ఆటవిక భయోద్వేగజనిత భావంగా చిత్రీకరించారు, వక్రీకరించారు కొందరు అధునాతనులు. కానీ వేదాలను, వాటి హృదయాన్ని విశదపరచే పురాణాది ఆర్ష వాఙ్మయాన్నీ పరిశీలిస్తే ఉదాత్తమైన, దివ్యమైన, పండిన మానవ సంస్కార దృష్టితో మహర్షులు ప్రకృతిని దైవంగా దర్శించిన తపస్సు సాక్షాత్కరిస్తుంది. ప్రపంచ నాగరికతలో నేటికీ ఏ దేశమూ సాధించలేని ధార్మిక తాత్త్విక వైజ్ఞానిక దృష్టి ఆ రచనల్లో గోచరిస్తుంది. వాటిని అనుసరించి యుగాల నుండి వర్థిల్లిన భారతీయ ఐతిహాసిక, చారిత్రక వైభవం వాటికి తార్కాణంగా వ్యక్తమౌతుంది.

పంచభూతాలలో ఒకటైన భూమి మిగిలిన నాలుగు మహాభూతాలను తనలో ఐక్యం చేసుకుని పూర్ణ స్వరూపంగా ఉందని భారతీయ దర్శనం. భూవాసులకే కాక, దివినున్న దేవతలకు కూడా పోషకురాలిగా భూమిని దర్శించడంతోపాటు ‘భూదేవి’, ‘భూమాత’ అని భక్తితో ఆరాధించే ఔన్నత్యం మన పరంపర.

నిద్రలేస్తూనే – ‘సముద్రవసనే దేవి! పర్వతస్తన మండలే! విష్ణుపత్నీ! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ – అని భూమిని ప్రార్థించి, పక్క దిగే సుప్రభాత సంప్రదాయం మనది. ప్రకృతిని జడంగా కాక చైతన్య స్వరూపంగా హృదయబంధం కలిగిన ఆ సున్నిత సంస్కారం- నాగరకంగా ఎదిగిన గొప్ప జాతికి మాత్రమే సాధ్యం. పంచభూతాలూ పరమేశ్వర స్వరూపంగా చూడడమేకాక, పంచ భూతాతీతునిగా కూడా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించిన తాత్త్వికత మరొక అద్భుతం.

అసలు భూమికి వేదవాఙ్మయం పెట్టిన పేర్లే ఆశ్చర్య జనకాలు. ఇన్ని పేర్లు మరో భాషలో, సంస్కృతిలో కనబడతాయా! మచ్చుకి కొన్ని చెప్పుకున్నా – భూమి, పృథ్వి, వసుంధర, వసుమతి, వసుధ, ధరణి, ధరా, అవని, క్షమా, గోవు, మేదిని, కామదుఘ, విపుల, రత్నగర్భ, అగ్నిగర్భ, పయస్వతే; సురభి, ధేనువు… ఇలా ఎన్నో నామాలు వేదమాత వాక్కులుగా కనిపిస్తాయి. ఈ నామాలకు వ్యుత్పత్త్యర్థాలు చూసినా, పృథ్వీ సంబంధమైన విజ్ఞానం నామరూపంలో ఋషులు ఆవిష్కరించారని స్పష్టమౌతుంది.

భౌతిక విజ్ఞానం పూర్ణంగా ఆర్జించుకుని, దానికి పై స్థాయి అయిన ఆధ్యాత్మికానుభవాన్ని తపస్సుతో పొందిన యోగశక్తిమంతులకు మాత్రమే సాధ్యమైన పృథ్వీ విజ్ఞానం అపారంగా ప్రాచీన వాఙ్మయంలో కనబడుతుంది.

‘‘సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మయజ్ఞః పృథివీం ధారయన్తి’’ అంటూ అధర్వవేదీయ పృథ్వీసూక్తం పృథ్విని ధరించునవి (రక్షించునవి, పోషించునవి) సత్యము, మహత్వం (గొప్ప గుణముల ప్రభావం), ఋతం (సృష్టి కారణ హేతువులు), ఉగ్రత (మేటితనం), దీక్ష, తపస్సు, బ్రహ్మము (జ్ఞానం- ఇక్కడి అర్థం) యజ్ఞము. ఇది గంభీర సత్య ప్రతిపాదన.

ధర్మ స్వరూపాలైన పై సత్యాదులు లుప్తమౌతున్న కొద్దీ పృథ్వికి, దానిపై నివసించే వారికీ క్షేమం ఉండదనే ఈ భావం అనేక దృష్టాంతాలతో పురాణేతి హాసాలు వర్ణించాయి.

పృథ్వీసూక్తాన్ని గమనిస్తే ఇంకా ఎన్నో అద్భుతభావాలు, నేటి నాగరకతకు పాఠాలు, హెచ్చరికలు కనిపిస్తాయి.

అసంబోధం బధ్యతో మానోవానాం

యస్యా ఉద్యతః ప్రవతః సమంబహు,

నానా వీర్య ఓషధీర్యా బిభర్తి

నాః ప్రథతాం రాధ్యతాం నః।।

మానవుల మధ్య విభిన్నత ఉన్నా ఆ నానా రూపులందరికీ బాధా రహిత స్థితిని సమంగా కల్పించడానికై శక్తిమంతమైన ఓషధులను దాల్చిన పృథ్వి మాకై విస్తృతిని, సమృద్ధిని కలిగించుగాక. ఇంత విశ్వమానవ సమదృష్టి ఇంకెక్కడైనా ఉంటుందా!

…. యస్యామన్నం కృష్టయః సంబభూవుః।

సముద్ర, నదీజలాలలో జన్మభూమి అన్నాదులను, కృషి ద్వారా ఉత్పన్నమయ్యే పదార్థాలను సంపూర్ణంగా కలిగిస్తున్నది.

… సానో భూమిర్గోష్వప్యత్రే దధాతు।।

ఆ భూమి గోవులను, అన్నాలను ప్రచురంగా ఉంచుగాక (ధరించుగాక).

గోవుకీ-భూమికీ ఐక్యతని వేదం ప్రతిపాదించింది.

భూమిని ఒక ధేనువుగా దర్శించడం గొప్ప భావం. ఆవు పొదుగు ద్వారా పాలను, తద్వారా ఆహారం (పోషణ) అందించినట్లు భూదేవి ఆహారాదులను అందిస్తున్నది. అందుకే భూమాతను గోమాత రూపంగానే వేద – పురాణాదులు వర్ణించాయి.

భాగవతంలో, విష్ణుపురాణాదుల్లో చెప్పబడ్డ పృథు చక్రవర్తి కథ ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది.

స్వాయంభువ మనువు, ధ్రువుడు మొదలైన ఉత్తమ చక్రవర్తుల కాలంలో లోక క్షేమం దృష్టిలో పెట్టుకున్న ధర్మం వలన భూమి ఓషధులను ప్రసాదించింది. కానీ ధర్మ విరుద్ధంగా, చోరప్రాయంగా ప్రవర్తించిన వేనరాజు కాలంలో ప్రజాక్షేమం కుంటుపడింది. అతడు, అనేక దుష్ట అధికారులతో కలసి స్వార్థపరుడై నీతిని తప్పడం చేత క్షోభ ఏర్పడింది.

ఆ తరువాత వచ్చిన పృథు చక్రవర్తి కాలంలో భూమి నుండి ఓషధుల ఉత్పత్తి క్షీణించింది. సస్య సంపద దెబ్బతింది. ప్రజల వేదన గ్రహించిన పృథువు ధర్మబద్ధంగా తాను పాలిస్తున్నా భూమి సంపదల నివ్వడం లేదేమిటి? అని విచారిస్తాడు. అప్పుడు భూమి గోమాతగానే ప్రత్యక్షమౌతుంది.

ధర్మఫలంగా ఓషధులు, సస్యాలు ఇవ్వవలసిన భూమి దానికి విరుద్ధంగా ప్రవర్తించడం క్షంతవ్యం కాదని, భూమాతను నిలదీశాడు పృథువు. ధర్మపాలనకు ఆ హక్కు ఉంటుంది.

అప్పుడు భూమాత చెప్పిన మాటలు సార్వకాలిక సందేశాలు :

అస్మిన్‌ ‌లోకే థవా ముష్మిన్‌ ‌మునిభిస్తత్త్య దర్శిభిః।

దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధయే,

తత్త్వవేత్తలైన మహర్షులు ఇహపరాలలో మనుష్యులకు శ్రేయస్సును కలుగజేసే గొప్ప ఉపాయాలను దర్శించి చెప్పారు. అవి పాటించ బడ్డాయి. కానీ మీ నాన్న (వేనరాజు) కాలంలో ఆ ధర్మాలు దెబ్బతిన్నాయి.

అపాలితా నా దృతా చ భవద్భిర్లోక పాలకైః।

చోరీ భూతే థ లోకే హం యజ్ఞార్థే గ్రహసమే క్షధీః।।

‘‘పాలకులు ధర్మాన్ని రక్షించకపోవడం వలన, (భూ రక్షణ ఉపాయాలను) ఉపేక్ష చేసి, చోరులుగా మారడం వల్ల ‘వట్టిపోయిన’ విధంగా మారి ఓషధులను యజ్ఞార్థం (విశ్వ నియమానికై) లోపలికి లాగివేశాను.’’

స్వార్థం కోసం ఖనిజాలను, వృక్షాలను విచక్షణా రహితంగా విధ్వంసం చేసి, దొంగల వలె అవినీతి పరులైన పాలకుల వల్ల భూమి క్షోభిస్తుందని దీని భావం.

అప్పుడు పృథుచక్రవర్తి తన ధర్మనిరతితో భూమిని ప్రసన్నం చేసుకొని తిరిగి ఓషధులను, సస్యాలను పొందాడు. అటుపై దేవతలు, ఋషులు కూడా భూమి ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందారు.

ఈ కథలో ఎన్నో సంకేతాలను పొందవచ్చు. ప్రకృతి నియమాలను అతిక్రమించితే, ధర్మప్రవృత్తిని విడనాడితే భూమి నిస్సారమౌతుందని పురాణం చేస్తున్న హెచ్చరిక.

భూమిని గోవుగా, ధర్మదేవతను వృషభంగా సంకేతించి- భాగవత ప్రారంభంలోనే ఒక కథ ఉన్నది. దీనంగా ఉన్న గో(భూ)మాత వద్దకు వృషభం (ధర్మదేవుడు) కుంటుతూ వచ్చి వేదనపడతాడు. కలి ప్రభావంచేత ఒంటికాలి నడక కలిగిన ధర్ముడు, కృశించిన గోవు ఇందులో కనబడతాయి.

ఆవు పాడినిచ్చే సమర్ధత వృషభం వల్లనే పొందుతుంది. ‘మాత’ అవుతుంది. అంటే భూమి ధర్మం ద్వారానే సంపదలిచ్చే మాత అవుతుందని అద్భుతంగా సంకేతించారు.

సానో భూమి ర్విసృజతాం

మాతా పుత్రాయ మేపయః।। (పృథ్వీసూక్తం)

తల్లి భూమి పుత్రుడనైన నాకు అమృతాన్ని సృజించుగాక!

… మాతా భూమిః పుత్రో అహం పృథివ్యాః।

పర్జన్యః పితాస జనః పిపర్తు।। (పృథ్వీసూక్తం)

భూమి నా తల్లి, నేను పృథ్వికి పుత్రుడను. పర్జన్యుడు తండ్రి. అతడు నన్ను పాలించుగాక. ధర్మమే పర్జన్య శక్తి.

….నానా ధర్మాణాం పృథివీ యథౌకసమ్‌।।

‌వివిధ ధర్మాలను ఆచరించేవారిని పోషిస్తున్నది భూమాత.

వైవిధ్యాన్ని అంగీకరించి, అన్ని రకాల సిద్ధాంతాలు సమన్వయంతో భూమిపై సహజీవనం చేయాలనే గొప్ప భావం ఇందులో ధ్వనిస్తుంది.

ఇలాంటి భూమిపై శ్రమతో, కృషితో జీవించాలని చెబుతూ, శ్రమలేని అడ్డదారుల జీవనం ద్యూతం వంటిదనీ అది నింద్యం అనీ స్పష్టపరచింది ఋగ్వేదం-

అక్షైర్మా దీవ్యః కృషిమతే కృషస్య

పాచికలలో (కుత్సిత వ్యూహాలతో – వంచనలతో) బ్రతుకకు- ఆడుకోకు. పరిశ్రమించి జీవితాన్ని నిర్వహించు.

సు సస్యాః కృషీస్కృధి। (శుక్ల యజుర్వేదం)

కృష్యై త్వా క్షేమాయ త్వారయ్యై త్యా పోషాయత్వా (శుక్ల యజుర్వేదం)

ఇలాంటి మంత్రాలు కష్టించే వ్యవసాయానికే గౌరవాన్నిచ్చాయి.

సస్యాదులతో కర్షకులు భూమిని వర్ధిల్ల జేస్తే, భూమి వర్ధిల్లి అందరినీ వృద్ధి చేస్తుంది అని అధర్వవేదం చెబుతోంది.

సా నో భూమి ర్వర్ధయత్‌ ‌వర్ధమానా।

అదే విధంగా పాలకులు కృషిని (వ్యవసాయాన్ని) పరిరక్షించాలని, విస్తరించాలని సూచించారు.

నో రాజా ని / కృషిం తనోతు।। (అధర్వవేదం)

వ్యవసాయ పద్ధతుల్లో వేదం చెప్పిన విషయాలు అబ్బురపరుస్తాయి. భూసారం దెబ్బతినకుండా, జలవనరులను, వృక్షాలను రక్షించుకోవలసిన పద్ధతులు వేదభాగాలలో కనబడడమేకానీ, పురాణ వృత్తాలలో విస్తారంగా వర్ణించబడ్డాయి.

వృక్షాలను దేవతలుగా, నీటిని తీర్థాలుగా పరిరక్షించుకొనే సంస్కారం ఆర్ష సంస్కృతి వైశిష్ట్యం. అది వేద పురాణాల్లోనే కాక, కావ్యనాటకాలలో కూడా కనిపిస్తుంది.

చెట్లు, తీగలు, పొదలు, మొక్కలు – వాటి ఔషధ విలువలు ఆయుర్వేదాది గ్రంథాలు వర్ణించడమేగాక, వాటిని ప్రసాదించే భూమిని ప్రాకృతిక పద్ధతులలోనే పోషించి, రక్షించే పక్రియలు చెప్పాయి.

దానికి ప్రధానంగా గోవును పేర్కొన్నాయి. గోమయం, గోజలం (మూత్రం) వంటివి వినియోగించి గొప్ప పంటను పొందడమే కాక, భూసార రక్షణ చేయడం గొప్ప పక్రియ. గోవుల (వృషభం) చేత దున్నించిన భూమికి ఉన్న ప్రత్యేకత కూడా భారతీయ వ్యవసాయ పద్ధతి.

నాగలి, కాడెద్దులు… ఇత్యాది ప్రాచీన పద్ధతులు పాతపడిపోయాయని, కృత్రిమమైన రసాయనిక ఎరువులలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టామని, అభివృద్ధి సాధించామని విర్రవీగుతున్న నవీనతకు భయంకరమైన పరిణామాలు ఎదురౌతున్నాయి. అధిక దిగుబడి కోసం చేసే ప్రయత్నాలు ఆహారాన్ని విషతుల్యం చేసి, భూమిని నిస్సారం చేస్తున్నాయి.

విదేశీయులు కూడా ‘ఆర్గానిక్‌’ ‌పేరు కోసం వెంపర్లాడుతూ, మళ్ళీ ప్రాచీన పద్ధతుల పట్ల ప్రాధేయ పడుతున్నారు. అవి సామాన్యులకు అందుబాటులోలేని ఖరీదైన ఉత్పత్తులుగా మారిపోయాయి.

Hands Holding Plant

సీరా యుజ్ఞాన్తి కనయో యుగా వితన్యతే పృథక్‌

…. ‌లాంగలం పవీరవత్సు శామం

…..శునాసీరా హవిషాతో శమానా

సుపిప్పలా ఓషధీః కర్తమస్మై।।

…. శునం కీనాశా అనుయన్తు నాహం

… శునం వ వహాః శునం నరః

శునం కృషితు లాంగలమ్‌।।

‌మొదలైన కృషిసూక్త (అధర్వవేదం) మంత్రాలలో

‘‘గిత్తలు బాగుండాలి, మనుష్యులందరూ ఆనందంగా ఉండాలి, చక్కని నాగళ్లతో ఆనందంగా కృషి చేయాలి. ఎద్దుల వెనుక నడుస్తూ మేము వ్యవసాయం చేయాలి’’ అనే భావాలు స్పష్టంగా ఉన్నాయి. భూమికీ, భూవాసులకీ దీర్ఘకాల పోషణనీ, జీవనాన్నీ, పుష్టిని ఇచ్చే విధానంగా వీటిని పేర్కొన్నారు.

నూతన ఆవిష్కరణలు ఈ పరిరక్షణ విజ్ఞానాన్ని విడువకుండా అభివృద్ధి సాధిస్తే తరువాతి తరాలకు మంచి భూమి దక్కుతుంది.

మట్టికి చెందిన మంత్రాలలో (మృత్తికా మంత్రాలు) కూడా మట్టి వైశిష్ట్యాన్ని దర్శించిన ఋషివాక్కులు వివిధ శాస్త్రాలుగా ప్రాచీన భారతం విస్తృతి పరచింది.

విశ్వవ్యాపక భగవశ్చైతన్యాన్ని తండ్రిగా, పృథ్విని తల్లిగా ఉపాసించే ఋషి భాషలో ‘భూనామకోశం’ గొప్ప జ్ఞానభాండారం.

కచ్చిత్తే దయితాః సర్వే కృషి గోరక్ష జీవనః

వార్తాయాం సంశ్రిత స్తాత లోకోహి సుఖమే ధత్‌।

‌తేషాం భుక్తి పరీహారైః కచ్చిత్తే భరణం కృతం।।

రక్షాహి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయ వాసినః।।

‘‘వ్యవసాయంతో, గోరక్షణతో జీవించేవారు అనుకూలంగా ఉండాలి. జనులందరూ కృషి గోరక్షణలపై ఆధారపడి సుఖంగా ఉండాలి. వారికి రక్షణనిచ్చి, ఆపద తొలగించి, పోషించడం పాలకుడి బాధ్యత. ఎందుకంటే తన దేశంలోని ప్రజలందరినీ రాజు ధర్మంతో రక్షించాలి. ఈ విధంగా నువ్వు పాలిస్తున్నావు కదా!’’ అని శ్రీరాముడు భరతుని ప్రశ్నిస్తాడు (వాల్మీకి రామాయణం- అయోధ్య కాండ- కచ్చిత్‌ (100) ‌సర్గ). ఇవే భావాలు మహాభారతంలో కనబడతాయి. గ్రంథాలు ఎన్నైనా, అవి భిన్నకాలాలలో రచించబడినా- అన్నిటిలో ఒకే ఋషిపరంపర- భారతీయ చింతన.

గో (వృషభం, ఆవు) అనే శబ్దంతోపాటు స్వరూపం కూడా భూమితో ముడిపడి ఉంది. సూర్యుని నుండి ప్రసరించే కిరణ పుంజాలలో, ప్రాణశక్తి, దివ్యత్వం అద్భుతంగా కలిగిన ‘గో’రూపి కిరణాలను గ్రహించగలిగే శక్తి భూమికి, ఆవు, వృషభాలకి మాత్రమే ఉందనే సూక్ష్మ విజ్ఞానంతో కిరణాలకు, భూమికి, ధేనుజాతికి ‘గోవు’ అని పేరు వేదమిచ్చింది. కిరణాలు ప్రసాదించే ప్రాణశక్తి, వర్షం ఎంత అవసరమో, గో ఆధారిత వ్యవసాయం కూడా అంతే ముఖ్యమనే సత్యం ‘నామిసామ్యం’లోనే వ్యక్త మౌతోంది. సూర్యునికి ‘గోపతి’ అని పేరు. ఆ సూర్యునికీ, ఈ భూమికీ, భారతీయ గోజాతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా గమనించాలి. ఈ మూడింటిలో మానవ సంబంధాన్ని కూడా గమనించాలి. ఈ మూడింటిలో మానవ జాతి మాత్రమేకాక, భూ ప్రకృతి అంతా క్షేమంగా ఉండుగాక!

వేనరాజు కథలో వలె స్వార్థపరులైన పాలకులు అవినీతి మరిగి, జలాశయాలను కప్పిపెడుతూ, అక్రమంగా నదీ తీరపు ఇసుకలను కొల్లగొడుతూ, వృక్ష సంపదలను అడ్డదారుల్లో నరికి ఎగుమతులు చేస్తూ భూమికి చేస్తున్న ద్రోహం పరిణామంలో ప్రమాదాలను కలిగిస్తుందన్న హెచ్చరిక ఇప్పుడిప్పుడే సత్యమని రుజువౌతోంది.

మట్టి సారహీనమయ్యే విధంగా, అధిక దిగుబడుల కోసం, రాబడి కోసం కృత్రిమ విష రసాయనాలు వాడి పంటపొలాలనీ, చెరువులనీ క్రమంగా నిర్వీర్య పరుస్తున్న విష సంస్కృతిని అరికట్టకపోతే భవిష్యత్తరాలకు చక్కని భూమి మిగులదు.

ఈ దారుణ దుర్గతులు కలుగకుండా ఋషిప్రసాదిత భారతీయ సంస్కారం మన ఆలోచనలలో, జీవన విధానంలో ప్రకాశించాలి. వ్యవసాయ విధానాలలో మన ప్రాచీన వాఙ్మయ విజ్ఞానం ప్రధాన సూత్రం కావడమే సమస్యలకి సరియైన పరిష్కారం.

About Author

By editor

Twitter
Instagram