మానవ మనుగడకే కాదు, సమస్త జీవరాశుల ఉనికికి  అత్యంతావశ్యకమైనది- సజీవమైన పుడమితల్లి. ఈ నేలే ప్రాణకోటికి ఆలవాలం. మొక్కలకు, జంతువులకు, మానవులకు కావలసిన గాలి, నీరు, శక్తి, భుక్తి, సుస్థిరత వంటి సమస్త అవసరాలను తీర్చేది- ఈ మట్టి. అంటే కాలచక్రాన్ని తిప్పేది మన్ను. సృష్టిలోని 95 శాతం జీవరాశులు నేలలోనే జీవిస్తున్నాయి. ఈ ధరణి ఇంతటి మహత్తర శక్తిని దట్టించుకోవడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. కర్బనం, హైడ్రోజన్‌, ఆక్సిజన్లతో జీవసృష్టికి నిలయమైంది మన నేల. మొక్క, చెట్టూచేమా, పాడీపంటల సృష్టికి దోహదకారి అయింది. అయితే ఈ అమృతభాండం విలువను ఆధునికుడు విస్మరిస్తున్నాడా? ఇది ఇటీవలి మహా ప్రశ్న.

మట్టి రూపురేఖలే, అవతారాలే, మార్పులే అంతుచిక్కని అద్భుతాలు. నేలలోని కర్బన కణాలు మట్టిరేణువులు కలిపి, చిన్న చిన్న ముద్దలుగా-చిక్కుడు గింజల పరిమాణంలో – ఏర్పడతాయి. ఇవి బుజ్జి బుజ్జి జలాశయాలంటే అతిశయోక్తి కాదు. ఇవి నీటిని పీల్చుకొనే స్వభావం కలిగి, నీరు ఆవిరిరూపంలో పోకుండా ఆపుతాయి. ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉంచి, ఉత్పాదకత పెంచేందుకు కూడా సూక్ష్మజీవులు దోహదపడతాయి. సూక్ష్మజీవుల సమన్వయంతో, సహకారంతో తనలోని పోషకాలను నీరు లేదా తేమతో కరిగించి మొక్కలకు సకాలంలో అందిస్తుంది నేల. మొక్కల్లో పిండి పదార్థాలు, ఇతర మూల పదార్థాలు ఏర్పడే తీరు ఇదే. అవే మొక్కల ఎదుగుదలకు తోడ్పడతాయి.

 మొక్కకు నిలబడే శక్తినిస్తుంది నేల. తనలోని పోషకాలు మొక్క వేర్లకి చేరడానికీ, నీరు, గాలి, వెలుతురు అందించేందుకూ దోహదం చేస్తుంది. సేంద్రియ కర్బనంతో జీవరాశులకు అవసరమైన శక్తి, జీవం వస్తాయి. జీవ వైవిధ్యం, జన్యు సంపదలను రక్షించడం, ద్రవపదార్థాలు ఇంకేటట్లు చేయడం కూడా పుడమి లీలల్లోనివే. పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాకే కాదు, మనందరి భౌతిక, కళాసంస్కృతులకు, మౌలిక సదుపాయాలకు నిలయమై విలసిల్లుతున్నదీ ఈ నేలే.

మొక్క, నేలలోని సూక్ష్మజీవి

ఇదో అద్భుత బంధం. పచ్చటి మొక్కల వేళ్ల దగ్గరగా ఉండే సూక్ష్మజీవులు ఆ వేళ్ల ద్వారా వెలువడే ద్రవాల నుండే శక్తిమంతమైన కర్బన మూలకాలను గ్రహిస్తాయి.ఈ పరిణామం ఫలితంగానే ఖనిజ లవణాలు, సూక్ష్మధాతువుల మూలకాలు, ఇతర పోషకాలను నేల వృద్ధి చేసుకుంటుంది. దీనితోనే తన ఆరోగ్యం, భౌతికస్థితిగతులను మెరుగుపరుచు కుంటూ ఉంటుంది. పంటల నుండి ఆరోగ్యకరమైన వ్యవసాయోత్పత్తుల• రావడానికి దోహదకారి అవుతున్నది. ఉపరితలం మీద, కింది పొరలలో ఉండే జీవరాశుల వల్ల మొక్కలకు, పంటలకూ – సూక్ష్మ జీవరాసులకూ నడుమ బంధం సుస్థిరంగా ఉంటుంది. పరస్పర వృద్ధి సమర్థంగా సాగుతుంది. ఇప్పుడు ఈ అమృత వలయం ఛిన్నాభిన్నమవుతున్నది.

మన మట్టిని మనమే….

కానీ కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అవాంఛనీయ వ్యవసాయ పద్ధతుల వల్ల మొక్కల వేళ్ల ద్వారా నేలలోని సూక్ష్మజీవరాశ•లకు సరఫరా కావలసిన కర్బన ద్రవాలకు అంతరాయం కలిగింది. దీనితో నేలకు చేరవలసిన కర్బన పరిమాణం గణనీయంగా తగ్గింది. నేలలోని సూక్ష్మజీవులు- మొక్కల మధ్య జరిగే పరిణామ పక్రియ నిలిచిపోయి, ఆ రెండింటి మధ్య సమతౌల్యం బాగా దెబ్బతింది. గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో కర్బన మూలకాల పరిమాణం 30 నుండి 75 శాతం వరకు తగ్గటం తీవ్ర ఆందోళన కలిగి స్తుంది. అవాంఛనీయ సేద్య పద్ధతులు, దరిమిలా పతనమైన నేల ఆరోగ్యం, స్థితిగతుల వల్ల ఈ 40 ఏళ్లలో వ్యవసాయ యోగ్య భూములు ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మేర నిరుపయోగమైనాయన్న వాస్తవం మరింత కలవరం కలిగిస్తుంది. నేల ఆరోగ్యం, స్థితిగతులు, భూసారం సక్రమంగా లేకుంటే అటు జంతువుల, ఇటు మనుషుల మనుగడ మీద ప్రమాదకర ప్రభావం పడుతుంది. 2050 సంవత్స రానికల్లా ప్రపంచ మానవ జనాభా 10 బిలియన్ల (1000 కోట్ల)కు చేరుతుందన్న అంచనాల నేపథ్యంలో, వ్యవసాయ యోగ్య భూమి విస్తీర్ణం ఘోరంగా కుంచించుకుపోవడమంటే ప్రమాద ఘంటికలు మోగినట్టే. జనాభా పెరుగుదల నిజమే. పెరిగే జనాభా ఆహార అవసరాలూ నిజమే. కాబట్టి భూసారంతో పాటు భూ భౌతిక స్థితిగతులను మెరుగు పరుచుకుంటూనే ఆరోగ్యవంతమైన వ్యవసాయో త్పత్తులను పెంచడమే తక్షణ కర్తవ్యంగా స్వీకరించాలి.

 పోషక విలువల పతనం

భూసారం దెబ్బతినే పక్రియ గడచిన 70 ఏళ్లుగా వేగంగా సాగుతున్నది. అందుకే పంటల్లో, జీవుల్లో పోషక పదార్థాల విలువలు 10 నుండి 100 శాతం వరకు కూడా పడిపోయాయని స్పష్టమైపోయింది. ఆస్ట్రేలియా వైద్య పరిశోధనా సంస్థలు, డేవిడ్‌ ‌థాంప్సన్‌ అనే శాస్త్రవేత్త 1940 నుండి 1991 వరకు ఆహార పదార్థాలలో క్షీణించిన పోషక విలువల గురించి పరిశోధించారు. ఆ పరిశోధన ప్రకారం 27 రకాల కూరగాయల్లో రాగి ధాతువు (76%), కాల్షియం (46%), ఇనుప ధాతువు (27%), మెగ్నిషియం (24%), పొటాషియం (16శాతం) ఖనిజ లవణ పరిమాణం గణనీయంగా తగ్గినాయి. 10 రకాల మాంసోత్పత్తులకూ ఇది తప్పలేదు. వీటిలో కాపర్‌ (24%), ‌కాల్షియం (41%), ఇనుప ధాతువు (54%), మెగ్నిషియం (10%), పొటాషియం (16%), భాస్వరం (28%) తగ్గాయని (1940-91 మధ్య) తేలింది. ఇంకా, 1940 సంవత్సరం నాటి పోషక విలువలను అదే పరిమాణంలో ఇప్పుడు పొందాలంటే మాంసమైతే రెండు రెట్లు, పండ్లు మూడు రెట్లు, కూరగాయలు 4.5 రెట్లు తీసుకో వలసిందేనని నిర్ద్వంద్వంగా వెల్లడించారు. ఖనిజ లవణాల్లోని ఈ మార్పుల వల్ల మన ఆరోగ్యం గణనీయంగా ప్రభావితమైందనీ తేలింది. వీటన్నింటికీ మూలం భూసారంలో వచ్చిన అవాంఛనీయ మార్పులే.

ఏమిటా మార్పులు?

రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల సాయంతో పండించే వ్యవసాయోత్పత్తులలో పోషక విలువలు-ముఖ్యంగా ఖనిజ లవణాలలో- అవసర మైన నిష్పత్తుల్లో లేనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఖనిజ లవణాలు ఉండి, మొక్కకు అవి చేరకపోవడం భూ భౌతిక లక్షణాల మేరకు జరుగుతుంది. మొక్కలు, పంటల ఉత్పత్తుల్లో కనిపిస్తున్న ఖనిజ లవణాల సంబంధ లోపాలను సరిచేయాలంటే, అవి నేల నుండి పోషకాలను గ్రహించేందుకు తగిన పరిస్థితులు కల్పించడమే పరిష్కారం. మొక్కలు నేల నుండి పోషకాలను (ఖనిజ లవణాలు సహా) గ్రహించే పక్రియను భూమిలోని సూక్ష్మజీవులు నియంత్రిస్తాయి. మొక్కల వేళ్లతో మమేకమైన ఈ సూక్ష్మజీవుల చర్యలు వాటికి పోషకాల చేరవేతలో సాయపడతాయి. భూ భౌతికస్థితుల చుట్టూ ఉండే ఎకోసిస్టమ్‌ ‌మొక్కల వైవిధ్యం, ఎదుగుదల, మొక్కల కిరణ జన్య పక్రియ, రసాయనిక పదార్థాల హెచ్చుతగ్గులు వంటి చర్యలపైనే ఆధారపడి ఉంటుంది.

నేలలోనే కర్బన ఉనికి

 కర్బన ఉనికికీ•, అది నిల్వ ఉండే స్థితికీ, ఉత్పత్తుల మూలాలకూ పుడమే ఆలవాలం. భూ యాజమాన్యాన్ని అనుసరించి కర్బనచక్రం కొన్ని కోట్ల సంవత్సరాల నాడే రూపొందింది. ఈ చక్రంలో కర్బనం- జీవరసాయనిక శక్తి- పలు మార్పులు చెందుతూ, నేల నుండి ఆహార పదార్థాల ఉత్పత్తుల వరకు పరివర్తనం చెంది జీవ రసాయనిక చర్యతో మన దైనందిన జీవితానికి శక్తిని ప్రసాదిస్తూంటుంది. ఈ కర్బన చక్రం సక్రమంగా, సజీవంగా భ్రమణం సాగిస్తున్నంత వరకు భూసార పరిరక్షణ, మొక్కల, జంతువుల, మనుషుల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

కాబట్టి భూమి సారవంతంగా, సజీవంగా ఉండి మొక్కల పెరుగుదలకూ, జంతువులకూ, మనిషికీ అవసరమైన ఆహారపదార్థాలను, ముడిపదార్థాలను అందించాలంటే, జీవుల ఆరోగ్యం బాగుండాలంటే నేల, ఆ నేల భధ్రత అత్యంత అవసరమని అర్థమవు తుంది. కానీ అనాలోచిత ప్రయోగాలతో పుడమి కొన్ని దశాబ్దాలుగా పటుత్వాన్నీ, జీవాన్నీ కొద్ది కొద్దిగా కోల్పోతూనే ఉంది. పుడమిని సజీవం చేసి, శక్తిని పునరుద్ధరించేందుకు ఇప్పుడు అయిదు అంశాలపై దృష్టి సారించాలి.

 సంవత్సరమంతా పచ్చదనం

కిరణజన్య పక్రియ ద్వారా వాతావరణం (గాలిలో)లో ఉన్న కోట్ల టన్నుల కర్బనాన్ని వినియోగించుకుని ఏడాది కాలం జీవ రసాయనిక శక్తి ఉత్పత్తి అవుతుంది. పచ్చటి మొక్కలు సూర్యరశ్మిని నింపే కర్బన పంపులే. కిరణ జన్య పక్రియ ద్వారానే భూమికి తగినంత కర్బనం చేకూరుతుంది. ఇందుకు దోహదపడే విధంగా ఏడాది పొడవునా నేలను పచ్చదనంతో కప్పి ఉంచటం అవసరం. పంటలు, పచ్చిక బయళ్లతో ఏర్పడే పచ్చదనం వల్ల కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా వాతావరణంలోని కర్బనం భూమిలోకి, పంట ఉత్పత్తులలోకి చేరుతుంది. అంటే ఆశించిన స్థాయిలో నేలకు కర్బనం చేకూరి, అది సజీవమై ఉత్పాదకత పెంపునకు దోహదపడుతుంది. ఈ క్రమంలోనే జీవ రసాయనిక శక్తి విరివిగా చేకూరి మన మనుగడకు తోడవుతుంది.

సూక్ష్మజీవుల ఉనికి, పక్రియ

ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులు జీవపక్రియకు తోడ్పడతాయి. నేలలోని సూక్ష్మజీవులు మొక్కలతో అనుసంధానమై, జీవ పక్రియలకు తోడ్పడే విధంగా భూమి సజీవం కావడానికి తోడ్పడుతాయి. నీటిని అందుబాటు లోకి తెచ్చేందుకు, చీడపీడలను నియంత్రించేందుకు, పోషకాల రవాణాలో, కర్బన ద్రవాన్ని పరస్పరం మార్చడంలో మైకోరైజా సూక్ష్మజీవులు కీలకపాత్ర పోషిస్తాయి. జీవ సంబంధిత నత్రజనిని సేంద్రియ సంబంధిత పదార్థాలుగా మార్చటంలోనూ ఈ సూక్ష్మజీవులే కీలకం. అలానే ఆకులలో ఉన్న 20-60శాతం కర్బనంతో సూక్ష్మజీవులు పక్రియలను నిర్వహించేందుకు కూడా మైకోరైజా సూక్ష్మజీవులే తోడ్పడతాయి. నేలలోని ఈ సూక్ష్మజీవుల చర్యల వల్ల భూసారం, భూ భౌతికస్థితి వృద్ధికీ, గాలి చొరబడేందుకు వీలుగా నేలను గుల్లబరచడానికీ, కేటయాన్ల పరస్పర మార్పుకూ, మొక్కల ఎదుగుదలకూ అవకాశం కలుగుతుంది.కానీ నేల లక్షణాన్ని నిలబెట్టడానికి అవసరమైన సూక్ష్మజీవులు అంతరించి పోయే దుస్థితి బాధాకరం. అయితే సరైన భూ సంరక్షణతో చక్కటి వ్యవస్యసాయ పద్ధతులను పాటించినట్టయితే భూమి సహజ లక్షణాన్ని పునరుద్ధరించే వీలుంది. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వేయటం, జీవన ఎరువుల వాడకాన్ని పెంచటం, నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవుల వినియోగాన్ని పెంచటం, చిక్కుడు జాతి పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించటం వంటి చర్యలు ఇందుకు అవసరం.

 వైవిధ్యమైన, వాతావరణ అనుకూల పంటల సాగు

 కర్బన పదార్థాల గురించి (ఉదా।। చక్కెరలను, ఎంజైములు, పినాల్స్, ‌న్యూక్లిక్‌ ‌యాసిడ్సీ, ఆక్జిన్స్) ‌భూమిలోని సూక్ష్మజీవులకు మొక్క వేళ్ల ద్వారా సంకేతాలను పంపి, జీవ పక్రియలకు తోడ్పడుతుంది. మొక్కల్లో ఎక్కువ వైవిధ్యం, సూక్ష్మజీవుల్లో వైవిధ్యం సారవంతమైన నేలకు అనుకూలిస్తాయి. ఒకే రకమైన పంటను సంవత్సరాల తరబడి సాగు చేస్తుంటే భూమి సత్తువ తగ్గుతూ వస్తుంది. ఎక్కువ వైవిధ్య భరితమైన (70 రకాల మొక్కలు / పంటలు) సాగు భూమి పునరుద్ధరణకు ఎంతో దోహదపడుతుంది. సాగు వైవిధ్యంతో చీడపీడల ఉధృతి తగ్గుతుంది. ముఖ్యంగా అధికోత్పత్తికి వీలవుతుంది. వైవిధ్య భరితమైన పంటల సాగు, పంటల పద్ధతులు, పంటల సరళి, ఇతర పద్ధతులను (పాడి, కోళ్లు, తేనేటీగల సాగు, చేపల, గొర్రెల పెంపకం) పాటించి భూ పునరుద్ధరణకు దోహదపడాలి.

లాభసాటి పంటల సరళి

అందుబాటులో ఉండే నేలలోనే, లభ్యమయ్యే నీరు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే మన రైతులు సాగు చేసుకోవడం అనాదిగా వస్తున్నది. దీనితో కొన్ని పంటలు మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యంలోకి వచ్చాయి. మళ్లీ మళ్లీ సాగుచేయటం వల్ల ఆ పంట నేలలో దానికి అవసరమైన పోషకాలనే అధికంగా తీసుకుంటుంది. దీనితో ఆ నేలలో ఆ పోషకాల పరిమాణం తగ్గి, భూసారం తగ్గిపోతుంది. అందుకే దిగుబడులు తగ్గిపోవడం సహజం. భూసారాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించేందుకు తోడ్పడే విధంగా పంటలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి. ఉదాహరణకు, ధాన్యాలను సాగుచేసిన తర్వాతగాని ముందుగాని చిక్కుడు జాతి సంబంధిత పంటలను, ముఖ్యంగా పప్పుధాన్యాల సాగు. ఖరీఫ్‌, ‌రబీ, వేసవికాలాల్లో ఆయా వాతావరణ పరిస్థితులన•, నేల స్వభావాన్ని నేలలోని పోషక విలువలను, నీటి సౌకర్యాలను (లేదా వర్షాధార పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యాలు (వరి, మొక్కజొన్న, జొన్న); సిరిధాన్యాలు (సజ్జ, రాగి, తైదలు, కొర్ర, అండ్రు కర్రలు సామ); పప్పుధాన్యాలు (పెసర, మినుము, కంది, శనగ, సోయా చిక్కుడు అలసంద); నూనె గింజలు (వేరుశనగ, నువ్వులు, కుసుమలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, ఆవాలు); వాణిజ్య పంటలు (పత్తి చెరకు, మిరప, పసుపు); కూరగాయలు వంటి వాటిని ఆయా పరిస్థితులకు అనువుగా ఎంపిక చేసుకొని సాగు చేయాలి.

వ్యవసాయ పరిశోధనల ఆధారంగా ఆ శాస్త్ర వేత్తలు ఇలాంటి సాగుకోసం రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. అనువైన పంటలను సూచిస్తున్నారు. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు, కూరగాయల రకాలను ఎంపిక చేసి, పంట కాలానికి ముందుగానే రైతులకు తెలియజేసి, వ్యవసాయ శాఖ ద్వారా ప్రోత్సహిస్తు న్నారు. వైవిధ్యమైన పంటలను సూచించడంతో పాటు, ఆయా వ్యవసాయోత్పత్తులకు ఉన్న మార్కెట్‌ ‌విలువను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్‌ ‌మేరకు సాగు విస్తీర్ణాన్ని కూడా వ్యవసాయ శాఖ పలు కార్యక్రమాల ద్వారా రైతులకు ఎరుక పరిచి, చైతన్యవంతులను చేస్తున్నది. పరిస్థితులను, మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైవిధ్యమైన పంటల సాగును రైతులు చేపట్టాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవాలి. ఇందుకు ప్రభుత్వం కూడా మార్కెట్‌ ‌పరంగా భరోసా కల్పిస్తూ, చర్యలు తీసుకోవాలి.

విచక్షణా రహిత రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి. ఇప్పటికే విచ్చలవిడిగా వాటిని వినియోగించడం వల్ల జరిగిన అనర్థాలను మనమంతా గమనించాం. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తే భూమిని పునరుద్ధరించుకొనే అవకాశం చాలా ఉంది.

ఎక్కువగా దున్నటమూ తగ్గించాలి

నేలను కొంతమేరకు దున్నటం వల్ల లోతుగా వేళ్లూకునే పంటలకు దోహదపడవచ్చునేమోకాని, లోతుగా దున్నడం వల్ల దీర్ఘకాలంలో పోషకాలు తగ్గిపోయే ప్రమాదముంది. చేలకు మేలుచేసే సూక్ష్మజీవులు తగ్గిపోయే ప్రమాదమూ ఉంది. సేంద్రియ పదార్ధాలు ‘ఆక్సిడేషన్‌’ ‌పక్రియకు లోనై, తక్కువ కిరణ జన్య పక్రియతో పాటు, కర్బనం వాతావరణంలోకి విడుదలవుతుంది. కనుక భూమిని ఎక్కువసార్లు, అతిగా దున్నడం మంచిదికాదు. తక్కువగా దున్నడం భూమి పునరుద్ధరణకు దోహదపడుతుంది.

ఆహారం, వస్త్రాలు, కలప వంటి జీవనావసరా లన్నింటిని అందించగలిగేది- సజీవమైన నేల. సజీవమైన నేలకు వాతావరణంలోని కర్బనాన్ని ఇతోధికంగా చేర్చి, మేలైన సూక్ష్మజీవులు, కిరణజన్య పక్రియలతో పంటలు, ముడిపదార్థాల ఉత్పత్తులను గణనీయంగా పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చు. జీవరసాయనిక శక్తిని ఆరోగ్యకరమైన ఆహారం, ఇతర అవసరాలకు కావలసిన పదార్థాల రూపంలోకి మార్చగలిగే శక్తిని కిరణజన్య పక్రియ ద్వారా ప్రకృతి మనకు ప్రసాదించటం వరమే. ఎక్కువ పరిమాణంలో భూమిలోకి కర్బనాన్ని చేర్చి, మేలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా, పౌష్టికాహారాన్నీ, పరిశుభ్రమైన నీటిని పొంది మనందరం సంతోషంగా ఉందాం!

ప్రకృతికి చేరువగా

సేంద్రియ వ్యవసాయం అటు ప్రకృతిపరంగాను, ఇటు మానవాళికి ఎంతో శ్రేయస్కరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సాగుతో పొలాలు పునరుజ్జీవంతో, మిగతా పోషకాల వినియోగంతో, చక్కటి దిగుబడుల నివ్వగల జన్యుపరమైన మొక్కల వైవిధ్యంతో ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పడుతున్న మాట సత్యం. భూసుపోషణకు ఎదురవుతున్న అడ్డంకులను ఫలవంతమైన పరిశోధనల ద్వారా అధిగమించటమే మన బాధ్యత. సేంద్రియ ఉత్పత్తుల ప్రాముఖ్యం, ఆరోగ్యకరమైన వాటి ఉపయోగాలను గుర్తించి ప్రపంచంలో ఎందరో వినియోగదారులు తీసుకుంటు న్నారు. సేంద్రియ ఆహారోత్పత్తులకు తగిన మార్కెట్‌ ‌లేదనేది అపోహే. నిజానికి మార్కెట్‌ అవసరాల మేర సేంద్రియ ఉత్పత్తులను అందించలేకపోతున్నారన్న వాదనా యోచించదగినదే. ఇవాళ ఆచరణలో ఉన్న సేంద్రియ వ్యవసాయ సాంకేతిక పద్ధతుల• అవలంబిస్తూనే, కొత్త ఆవిష్కరణలకు దోహదపడే విధంగా పరిశోధనలనూ ముమ్మరం చేయాలి. వీలయినంతవరకు ఖర్చులు తగ్గించి ఉత్పాదకతను పెంచే పరిజ్ఞానాన్ని సాగుదారులకు అందించి సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలి. ఇందుకు తగినట్టు పరిశోధనలకు నిధులను కేటాయించాలి. ఐసిటి, నాకో పరిజ్ఞానాన్ని వినియో గించుకుంటూ, తక్కిన పోషకాలతో మంచి దిగుబడుల నివ్వగల జన్యువులు కల్గిన కొత్త పంటలకు రూపకల్పన చేయాలి. సేంద్రియ సాగును తీర్చిదిద్దవలసిన బాధ్యత పరిశోధకులుపై, పాలకులపై ఉంది. ఆదరించ వలసిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది.

– ప్రొ।। పి. రాఘవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

About Author

By editor

Twitter
Instagram