ఇప్పటికీ ఈ దేశానికి సేద్యమే పెద్ద ఆధారం. కాబట్టి గ్రామాలు కళకళలాడేటట్టు చేయాలి. సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నించాలి. రైతు ఆత్మగౌరవంతో జీవించాలి. రసాయనిక ఎరువులతో ధ్వంసమైన నేలను మళ్లీ సారవంతం చేయాలి. ఈ అంశాలే ప్రేరణగా ఆరంభమైన సంస్థ ఏకలవ్య ఫౌండేషన్‌. ‌గిరిజన ప్రాంతాలలో విశేషంగా శ్రమిస్తున్న ఫౌండేషన్‌ ఆశయాలు, విజయాల గురించి చైర్మన్‌ ‌పి. వేణుగోపాలరెడ్డి జాగృతి ముఖాముఖీలో వివరించారు. ఆ అంశాలు మా పాఠకుల కోసం:

ఏకలవ్య ఫౌండేషన్‌ ‌సేవ సామాన్యమైనది కాదు. గ్రామాభివృద్ధి, సేంద్రియ సేద్యం, రైతుల జీవితాలను మెరుగుపరచడం వంటి ఆశయాలతో పని చేస్తోంది. ఈ ఆలోచన ఎలా వచ్చింది?

అరవైయ్యేళ్లు నిండాక రాజకీయాలలో ఉండ కూడదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే, చెప్పడానికి నా దగ్గర కారణాలూ లేవు. అయితే అరవైల తరువాతా జీవితం ఉంటుంది. భారతీయ జనతాపార్టీలో 20 యేళ్లు (1985-2005)పని చేశాను. ఆ బాధ్యత నుంచి విరమించుకొని, హైదరాబాద్‌ ‌వచ్చాను. తిరిగి సంఘానికి (ఆర్‌ఎస్‌ఎస్‌) అన్నమాట. సంఘ పెద్దలని ఒక కోరిక కోరాను. ఒక దశాబ్దం పాటు గోండులుండే చోట సేవలందించాలని నాకు కోరిక. ఒక స్వచ్ఛంద సంస్థను నేనే ప్రారంభించి నడపాలని అనుకుంటున్నా నని చెప్పాను. సంఘం మీద ఎలాంటి భారాన్ని నేను మోపను. మానవ, ఆర్థికవనరులు రెండూ అవసరం లేదనీ చెప్పాను. అనుమతి లభించింది. అలా ఏర్పడినదే ఏకలవ్య ఫౌండేషన్‌. ‌రిజిస్ట్రర్‌ ‌చేసి 2006, మార్చిలో పని ప్రారంభించాను.

ఎక్కడ నుంచి మొదలుపెట్టారు?

వాటర్‌షెడ్‌ ‌కార్యక్రమంతో మొదలెట్టాం. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో నేను వెళ్లిన గిరిజన ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితి ఏమిటంటే భూమంతా మిట్టపల్లాలు. కొండలూ, గుట్టలే. కానీ అదృష్టం, ఆ నేల మంచిది. సుమారుగా పదకొండొందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది. అయితే మిట్టపల్లాల వల్ల ఎంత వర్షమైనా వేగంగా కిందికి పోతుంది. పైగా ఆ నీళ్లు భూమి మీద ఉండే ఒండ్రును కూడా తీసుకెళ్లిపోతాయి. ఒండ్రు లేకపోతే పంటలు రావు, భూమికి సారమే ఉండదు. దీన్ని ఆపడమే వాటర్‌షెడ్‌ ‌పథకం. పారే నీటి వేగాన్ని తగ్గించి, నేలలోకి ఇంకేలా చెయ్యడం, కొట్టుకుపోతున్న మట్టిని ఎక్కడికక్కడే ఆపడం- ఇది దాని లక్ష్యం. నాబార్డు ఇచ్చిన ఆరు పథకాలు, తర్వాత రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన 10,000 ఎకరాలు కలిపి ఒకే విడతగా 25,000 ఎకరాల్లో, ఒకే మండలంలో వాటర్‌షెడ్‌ ‌కార్యక్రమాలు పూర్తిచేశాం. ఇంద్రవెల్లి మండలం, దీనిని ఆనుకొని ఉట్నూరు మండలాలకి వాటర్‌షెడ్‌ ఇచ్చాం. ఇంక రెండు బిట్లు ఇంద్రవెల్లి మండలంలో మిగిలాయి. అందులో ఒక ఒక భాగానికి మళ్లీ నాబార్డు సహకరించింది. మరొక భాగానికి అట్లాస్‌ ‌టాప్‌కో (ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేష)• వాళ్లు ఇచ్చారు. తర్వాత విశాఖ జిల్లా, పాడేరు దగ్గర మినములూరు గ్రామంలో కంకారట్‌ ‌సహకారంతో వెయ్యి ఎకరాలలో చేపట్టాం. ఇవి మొత్తం గిరిజన ప్రాంతాలు. ప్రసిద్ధ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం ఇక్కడే ఉంది.

ఆదిలాబాద్‌లోనూ, పాడేరు దగ్గర ఒకేలా ఉంటుందా?

పాడేరు పరిస్థితి వేరు. ఇక్కడ వర్షం పడితే, ఆ నీటిని ఎలా ఆపాలన్నది సమస్య. 365 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి. నీరు పడేచోటు వేరు, గిరిజనుల ఆవాసాలు వేరు. కాబట్టి ఆ నీటిని ఎలా మళ్లించాలన్నదే వీరి సమస్య. ఇక్కడ నీటిని నిలిపి ఉండే విధానాన్ని స్ప్రింగ్‌షెడ్‌ అం‌టాం. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అదే వాటర్‌షెడ్‌. ఈ ‌సౌకర్యం పొందిన చాలాచోట్ల భూగర్భ జలాలు పెరిగాయి. మొదటి పంట వస్తున్నది. కొన్నిచోట్ల రెండో పంట కూడా వేసుకుంటున్నారు.

ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ఉన్న ఆ పరిస్థితులు గురించి చెబుతారా?

అక్కడ రెండు సమస్యలు మిగిలాయి. నేలలో బండలుంటాయి. ఒకరికి ఐదెకరాలు ఉంటే, అందులో రెండెకరాలు మొత్తం బండలుంటాయి. ఆ మేరకు దున్నకుండా వదిలేస్తారు. నేల మంచిది, వర్షపాతం ఉంది. సమస్యల్లా బండలు. ‘ఆ బండలు తీసేయండి! వ్యవసాయం చేసుకుంటాం’ అని అడుగుతున్నారు. ఆ రకంగా 200 ఎకరాలలో బండలు తొలగిస్తున్నాం. రెండో సమస్య రిగ్గులు పడవు. దీనికి ప్రత్యామ్నాయం క్రిటికల్‌ ఇరిగేషన్‌.

‌క్రిటికల్‌ ఇరిగేషన్‌ అం‌టే?

అక్కడ 10 రోజులు వర్షాలు పడకపోతే పంట పోతుంది. మనం పుణ్యం చేసుకుంటున్నప్పుడు వేళకి వర్షం పడేది. ఇప్పుడు అలా లేదు. అందుకే వాళ్లు పాతిక అడుగుల లోపల, 10 మీటర్ల లోతు బావి తీయించమంటారు. వర్షం పడినప్పుడు ఆ గుంత నిండితే, మోటర్‌ ‌పెట్టి పంటకి నీరిస్తారు. అదే క్రిటికల్‌ ఇరిగేషన్‌. ‌మేము ఒక స్టేజ్‌లో ఇద్దరిద్దరు రైతులకు కలిపి ఒక ఇంజన్‌ ఇచ్చాం. 40, 50 వేలతో బావి సమస్య తీరుతుంది. బండలు తీయడా నికి ఎనిమిదివేలు. దీనికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమస్యలు రెండూ తీర్చ గలిగితేనే ఏకలవ్య లక్ష్యం పూర్తవుతుందని భావిస్తున్నాం.మంచి పంట పండేటపుడు క్రిటికల్‌ ఇరిగేషన్‌ ఇవ్వకపోతే మొత్తం పోతుంది.

ఈ కృషిలో జనం పాత్ర ఎలా ఉంది?

స్థానికుల మద్దతు లేకుండా ఇవేమీ జరుగవు. మేము ఏ ఊరు వెళ్లినా రైతుసంఘం పెట్టాలని చెబుతాం. మేం ఇచ్చే పథకాలన్నీ ఉచితం కాదు. కొంత వారి వాటా కూడా ఉండి తీరాలన్నదే మా విధానం. సంఘాల ఏర్పాటు, కొంత మొత్తం వాళ్లు భరించకుంటే మేం పథకాల అమలు చేయం.

సేంద్రియ సేద్యం మాటేమిటి?

ఇందుకోసం ‘సేంద్రియ మిత్ర’ పథకాన్ని నాలుగు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం. చాలా అనుభవా లున్నాయి. కానీ అత్యధికంగా ప్రతికూల అనుభవాలే. అసలు రైతు పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోకుండా అందరం సేంద్రియ సేద్యం, ఇతర పద్ధతులు అంటూ ఆలోచిస్తున్నామనిపిస్తుంది. ఇప్పుడు మీకు సేంద్రియమైన పంటలు కావాలి తినడానికి. పంటలు పండించవలసింది రైతు. ఈ పద్ధతికీ, ఉమ్మడి కుటుంబాలకీ సంబంధం ఉంది. ఇప్పుడొచ్చిన సామాజిక, ఆర్థిక మార్పుల్లో ఉమ్మడి కుటుంబాలు లేవు. పాడీపంటా ఉమ్మడి కుటుంబంతోనే సాధ్యం. దీనిని అర్ధం చేసుకోవాలి. రెండవది- గ్రామాల్లో పశువుల మేతకు స్థలాలు లేవు. అందువల్ల రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. మనసు కష్టపెట్టుకునే ఆ పని చేస్తున్నారు. అయినా రైతు ఎందుకని సేద్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి? ఇంత నిరాదరణ ఉన్నా వ్యవసాయం చేస్తున్నారంటే సమాజం ఎంత సహకారం అందివ్వాలి? దీని గురించి ఆలోచించాలి. సేంద్రియ సేద్యానికి మూలాధారం ఆవు. నిస్సారమైన భూమిని తిరిగి అమృతతుల్యం చేయాలంటే, కేవలం ఆవుతో మాత్రమే సాధ్యం. భూ సుపోషణ అంటే అదే కదా! కాబట్టి ఆవుల సంఖ్య గణనీయంగా పెరగాలి దేశంలో. అంటే ఆ బాధ్యత రైతుదే కాదు, 135 కోట్ల భారతీయులది కూడా. గుజరాత్‌లో ఏం చేశారు? ఆవులకి హాస్టల్స్ ‌పెట్టారు. ఉదయం, సాయంకాలం పాలు తీసుకున్న తర్వాత తీసుకువెళ్లి అప్పగిస్తారు. గ్రాసం, నీరు అక్కడే ఉంటాయి. ఇది ప్రభుత్వం అయితేనే చేయగలదు. గుజరాత్‌ ‌సరే, అసలు ప్రభుత్వాలకు ఇలాంటి సంకల్పం సాధారణంగా ఉండదు. అలాంటప్పుడు సమాజమే ఆలోచించాలి. ఒక 100 కుటుంబాలు కలిపి పూనుకోవాలి. 70 ఏళ్లు రసాయనాలతో కుంగిన భూమిని మళ్లీ సారవంతం చేసే యజ్ఞమని అంతా గ్రహించాలి.

 రైతుల స్పందన, అభిరుచి ఎలా ఉన్నాయి?

సేంద్రియ సేద్యం అవసరమే. రైతు, నా కెందుకండీ ఈ ఆర్గానిక్‌, ‌నాకేంటి ప్రయోజనం? ఇంత శ్రమ పడాలా? అంటున్నాడు. నిజమే! కొత్త పరిజ్ఞానంతో, రసాయనిక ఎరువులతో సుఖం పెరిగింది. ఏదో డబ్బా తీసుకురావడం, వందలీటర్లు నీటిలో కలపడం, చల్లెయ్యడం. సేంద్రియ సేద్యం అలా కాదు. కషాయాలు తయారు చేసుకోవాలి. పేడతో ద్రావణం కలుపుకోవాలి. కూలీలతోనే సాగదు పని. ఇంట్లోవాళ్లు కూడా సహకరించాలి.  కానీ దేశంలో ఈ పనికి సిద్ధంగా లేని మనస్తత్వం వచ్చింది. రైతులు కొత్తలో ముందుకు రారు. అయినా మేము తర్ఫీదు ఇస్తున్నాం. మళ్లీ మళ్లీ కలుస్తూ విషయం చెబుతున్నాం. అయినా సిద్ధం కావడం లేదు. తెగులు వచ్చింది, ఏం చేయాలి అంటున్నారు. కొన్ని చెబుతాం. తగ్గలేదు. కాబట్టి సేంద్రియ సేద్యం మీద కూడా ప్రత్యేక పరిశోధనలు జరిపి, ప్రత్యామ్నాయ మందులు అందుబాటులోకి తేవాలి ప్రభుత్వం. లేకపోతే ప్రైవేట్‌ ‌వ్యక్తులకు అప్పగించి, ముందుకు నడిపించాలి. అలా అని ప్రభుత్వం ఒక్కటే ఏం చేయలేదు. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఇందుకు సదస్సులు పెట్టాలి. వాస్తవ పరిస్థితులు, భవిష్యత్తు, పర్యావరణం వంటి అంశాలతో ప్రజల ఆలోచనలు మార్చాలి.

ఎంత మేర సేంద్రియ సేద్యం జరుగుతున్నది?

నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తుంటే, మొన్నటికి మూడు వేల ఎకరాలు సేంద్రియ సేద్యం కిందికి తేగలిగాం. వచ్చే సంవత్సరానికి వీరిలో ఎంతమంది కొనసాగుతారనేదీ ప్రశ్నే. అయినా రాబోయే మూడు సంవత్సరాలల్లో 10 వేల ఎకరాను ఈ పరిధిలోకి తీసుకురావాలని మా ఆకాంక్ష. ఇవి తింటే మాకు ఆరోగ్యం బాగుంటుందన్న ఒక నమ్మకంతో ఇప్పుడు కొనడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రజలకు మోజు పుట్టిందో నకిలీలు మొదలయ్యాయి. నిజమైన సేంద్రియ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ ఏది? కిలో 50 రూపాయలు ఉండేది, 100 రూపాయలకు అమ్ముతుంటే అదే సేంద్రియ ఉత్పత్తి అని నమ్ముతున్న వారూ లేకపోలేదు. ఇది నిజం. పెద్ద పెద్ద కంపెనీలే ప్యాక్‌ ‌చేసి మరీ అమ్ముతున్నాయి.

భూసుపోషణ, సేంద్రియ సేద్యం, వాటి మధ్య బంధం, జాతి భవిష్యత్తు వంటి వాస్తవాలు ప్రజలకు అర్ధం కావడానికి ఇంకా సమయం పడుతుందంటారా?

రసాయనిక ఎరువులు, మందులతో వ్యవసాయం మొదలుపెట్టి 70 ఏళ్లయింది. మనకు తిండి గింజలు లేని సమయంలో, ఇతర దేశాల మీద ఆధారపడడం ఎందుకన్న భావనతో, నిజానికి సదుద్దేశంతోనే ఆనాడు ఆ రకం సేద్యం మొదలుపెట్టాం. ఇది మంచి ప్రత్యామ్నాయం అనుకొన్నాం. ఇంత ప్రమాదరకర పరిస్థితులు ఉంటాయని ఊహించలేదు. నా లెక్క ప్రకారం, ఆ రకమైన సాగుకు వీడ్కోలు చెప్పి, భూమి, పర్యావరణం వంటి అంశాలను అర్ధం చేసుకుంటూ సేంద్రియ సేద్యానికి మరలాలంటే మళ్లీ 50, 60 సంవత్సరాలు పడుతుంది. అదీ గట్టి ప్రయత్నం జరిగితే. పొరపాటు జరిగిందని గ్రహించినా కూడా, మళ్లీ గాడిలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సేంద్రియ విధానంలో మొదటి మెట్టు ఏమిటి? భూమిని రక్షించుకోవడం. భూమితోనే మనకు పెట్టుబడి వస్తుంది. అందుకే తల్లిగా భావిస్తున్నాం. ఆ భావననీ, శాస్త్రీయ దృక్పథాన్నీ సమన్వయం చేసుకుని భూ పరిస్థితులను సరిచేసుకుందాం! నేలను సారవంతం చేసుకుందాం!

ఇంటర్వ్యూ : కుర్రా దుర్గారెడ్డి

About Author

By editor

Twitter
YOUTUBE