భారతదేశం వ్యావసాయక దేశం. అంతకంటే సేద్యం ఈ దేశపు ఆత్మ అనుకోవాలి అంటున్నారు ఆంధ్ర ప్రాంత గోసేవా ప్రముఖ్‌ ‌భూపతిరాజు రామకృష్ణంరాజు. సీతా మహాసాధ్వి నాగేటు చాలులో దొరికింది. బలరాముడు హలధారి. అంటే భారత రామాయణ కాలాలకే ఇక్కడ సేద్యం పరిఢవిల్లింది. వివిధ రకాల వాతావరణాలూ, వైవిధ్యం కలిగిన భూములూ ఇక్కడ కనిపిస్తాయి. వేల రకాల పంటలకు ఈ దేశమే పుట్టినిల్లని ప్రపంచం భావించేది. అంతా ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయమే. ఆ ఉత్పత్తులే విశ్వమంతటికీ ఎగుమతయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చాయి. భారతదేశం అన్నపూర్ణ పేరుతో సార్థకమైంది. వేల సంవత్సరాల నాడే ‘కృషి పరాశరం’, ‘వృక్షాయుర్వేదం’ వంటి గ్రంథాలతో మన పూర్వికులు ప్రపంచ మానవాళికి వ్యవసాయం నేర్పారు. కానీ ఇదంతా గతమంటారు రామకృష్ణంరాజు.

భారత్‌కు ఆయువు పట్టులాంటి సేద్యం మీద బ్రిటిష్‌ ‌జాతి దెబ్బ కొట్టింది. ఎగుమతులు చేసిన దేశాన్ని దిగుమతుల మీద ఆధారపడే స్థితికి చేర్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సరైన ప్రణాళిక రూపొందించలేదు. 1960 దశకంలో మనకు ఆహార కొరత ఏర్పడింది. మనం కూడా సంకరజాతి వంగడాలను వాడాలన్నారు. నిజమే, అవి ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ఆ అధిక దిగుబడి ఎలా సాధ్యం? రసాయనిక ఎరువులు, పురుగుమందుల వలననే. 1960-70 దశకాల నాటి ఈ పరిణామమే పుణ్యభూమికి తూట్లు పొడవడం ఆరంభించిందని రామకృష్ణంరాజు వేదన పడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని భూసుపోషణ విధానాన్నీ, అందుకోసం గోఆధారిత వ్యవసాయాన్నీ ఆశ్రయించాలని ఆయన నినదిస్తున్నారు. ఉగాది ప్రత్యేక సంచిక కోసం రామకృష్ణంరాజుతో ‘జాగృతి’ జరిపిన ముఖాముఖి:


భూమి సుపోషణ అన్న నినాదం ఇప్పుడు ఊపందుకుంటున్నది. మనిషికీ మట్టికీ ఉన్న బంధం పునాదిగా కావచ్చు, విషతుల్యమవుతున్న పుడమి దుస్థితిని బట్టి కావచ్చు. అదొక వాస్తవిక నినాదంగా ఇవాళ దేశం స్వీకరించాలి. ఆ పని వేగవంతంగా జరుగుతున్నదా?

మీ ప్రశ్నకు సమాధానం కోసం కొంచెం వెనకటి పరిణామాల దగ్గరకు వెళ్లాలి. నేను 1970లో వ్యవ సాయంలోకి వచ్చాను. అప్పుడు అక్కుళ్లు, కృష్ణ కాటుకలు వంటి అనేక వరి రకాలు పండేవి. ఎలాంటి రసాయనిక ఎరువులూ, పురుగుమందులూ వాడేవారు కాదు. నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోసుకోవడం. 20 నుంచి 25 బస్తాల పంట. వ్యవసాయ పనులు చేసే కూలీలు ఉదయం గంజి అన్నం తినేవారు. అయినా ఆరోగ్యంగా ఉండేవారు. కారణం – ఆహారంలో ఉన్న శక్తి. నేను సేద్యం మొదలుపెట్టిన ఐదేళ్ల తరువాత జరిగిందిది. రెండో పంట సమయానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు మా పెద్దల దగ్గరకు వచ్చారు. ‘మీరు కొత్త వరి వంగడాలు వేయాలి. వాటికి అవసరమయ్యే ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది’ అని చెప్పారు. మా పెద్దలు అంగీకరించ లేదు. కానీ కలెక్టరు గారు మా పెద్దలకు నచ్చ చెప్పి తైచుంగ్‌ ‌నేటివ్‌ ‌వన్‌ అనే వరి రకాన్ని వేయించారు. 25 కేజీల రసాయనిక ఎరువు వేస్తే, 45 (75 కేజీల) బస్తాలు పండాయి. ఎండ్రిన్‌ అనే పురుగుమందు పిచికారీ చేయించారు.

అప్పుడు ఆహార కొరత ఉంది. దీనిని అధిగ మించాలంటే మన వ్యవసాయ పద్ధతులు మారాలని భావించి సేద్యంలో ఈ విధానాన్ని అనుసరించాం. సరే, ఆహార కొరతను అధిగమించాం. కానీ, రసాయనిక వ్యవసాయం వలన భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను, పెను ముప్పును అంచనా వేయలేదేమోనని కచ్చితంగా అనిపిస్తుంది. ఆధునిక వ్యవసాయం ఆరంభంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడేందుకు రైతులు ఇష్టపడేవారు కారు. మీకు తెలుసా! వాటితో ‘నా భూమిని పాడు చేసుకోమంటావా?’ అని నిలదీసేవారు. తన భూమి పట్ల ప్రతి రైతులోను మమకారం ఉండేది. భూమిని తల్లిగా భావించేవారు. ఒక పూజనీయ భావన ఉండేది. కనుక భూమిని సహజ పద్ధతులతో సారవంతం చేసుకుని పంటలు పండించాలనే కోరుకునేవారు. తరువాత ఆధునిక అవసరాల కోసం ఎక్కువ పండించాలన్న కోణంలో గుడ్డిగా వెళ్లాం. ఫలితం- వందల సంవత్సరాలు సుభిక్షంగా ఉన్న మన భూములు అని కేవలం 60, 70 ఏళ్లలో సర్వ నాశనం చేసుకొన్నాం. ఇలా మాట్లాడితే చాలా విమర్శలు వస్తాయి. కానీ, 20 బస్తాలు పండినప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవు. 70, 80 బస్తాలు పండడం మొదలైనాక నిత్యం రైతుల బలవన్మరణాల గురించి వింటున్నాం. చూస్తున్నాం. కారణం పెట్టుబడిలో 50 శాతం ఎరువులు, పురుగు మందులకు ఖర్చు పెడుతున్నాం. 50 సంవత్సరాల క్రితం ఒక ఎకరానికి 25 కేజీల రసాయనిక ఎరువు వేస్తే, ప్రస్తుతం 400 నుంచి 500 కేజీలు గుమ్మ రిస్తున్నాం. ఫలితం-సారవంతమైన నేలలు చవుడు భూములవుతున్నాయి. ఇక ఆ అధిక దిగుబడి సంగతి! అది తినడం వల్ల ఆరోగ్యం పాడవుతున్న మాట నిజం కాదా? ఇంకా, వాతావరణ కాలుష్యం పెద్ద సమస్య. కేన్సర్‌, ‌మధుమేహం, రక్తపోటు లాంటి రోగాలు పెరుగుతున్నాయి. దీనికి పరాకాష్ట ఏమిటీ అంటే- పంజాబ్‌లో భటిండా అనే చోటు నుంచి ఒక రైలు రాజస్థాన్‌లోని బికనేర్‌కు వెళుతుంది. అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ కేన్సర్‌కు ఉచితంగా వైద్యం చేస్తుంది. నిత్యం 150, 200 మంది వైద్యం కోసం బికనేర్‌ ‌వెళ్తారు. ఆ రైలుకు కేన్సరు రైలు అని పేరొచ్చింది. లాభసాటి కాదన్న అభిప్రాయం బలపడి, వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గుతున్నది. ఈ దుస్థితి నుంచి వ్యవసాయాన్నీ, తద్వారా దేశాన్నీ రక్షించాలంటే వేయవలసిన మొదటి అడుగు భూసుపోషణ.

ఇదంతా చూస్తుంటే మనల్ని మనం ఒక మహా విపత్తులోకి నెట్టుకుంటున్నట్టే ఉంది. భూసుపోషణ వైపు నడిచే క్రమం ఏదంటారు?

గతంలో మన రైతులందరికీ పశుసంపద ఉండేది. పాడిపంటలు అనేవారు. పశువుల పెంట భూమిలో వేసేవారు. పొలంలో మంద కట్టేవారు, పచ్చిరొట్ట, జీలుగ, పిల్లిపెసర, జనుం వంటివి పెంచి, వాటితోనే భూమిని కలియ దున్నేవారు. అలా భూమిని సారవంతం చేస్తూ పంట పండించేవారు. భూమి ఎంత సారవంతమైతే అంత దిగుబడి అనేవారు. ఆ వ్యవసాయ పద్ధతి పిక్సిడ్‌ ‌డిపాజిట్‌. ‌ప్రస్తుతం చేసే వ్యవసాయం క్రెడిట్‌కార్డు.

గో ఆధారిత వ్యవసాయం తీరు తెన్నులు ఎలా ఉన్నాయి?

దీనిపట్ల సమాజంలో అవగాహనకు ప్రయత్నాలు చేస్తున్నాను. 2009 నుండి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. 2014 నుండి జిలాల్ల వారీగా సంఘటనా కార్యక్రమాలు చేపట్టాం. తాడేపల్లిగూడెం దగ్గరి నాచుగుంట వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత వ్యవసాయం మీద ప్రతీ నెల 9వ తేదీన రైతులకు శిక్షణ ఇస్తున్నాం. ఒక ఆవుతో ఐదెకరాల అభివృద్ధి అన్న వాస్తవాన్ని వారి అనుభవానికి తెచ్చాం.

గో ఆధారిత వ్యవసాయంలో మీ విజయగాథను వివరిస్తారా? దీని మీద ఆధారపడిన సేంద్రియ సేద్యంలో సాధక, బాధకాలేమిటి?

కష్టేఫలి. ప్రయత్నలోపం ఉండకూడదు. ముందు నా వ్యక్తిగత అనుభవాలు మీ ముందు ఉంచుతాను. నేను గత 15 సంవత్సరాలుగా 29 ఎకరాల్లో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. పంట ప్రారంభంలో కొంత తగ్గింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఒక ఎకరాకు వరి 30 బస్తాలు, చెరకు 50 టన్నుల వరకు దిగిబడి వస్తున్నది. ఈ పద్ధతి వలన నీటి వినియోగం 30% తగ్గింది. మిత్ర కీటకాలు సంఖ్య పెరిగి పంట నష్టం కలిగించే కీటకాల వలన నష్టం తగ్గింది. కొంగలు, పిచ్చుకల లాంటి పక్షులు నష్టం చేసే పురుగులను తిని సహాయం చేస్తున్నాయి. ఈ ఉత్పత్తులు తినటం వలన ఆరోగ్యం చాలా బాగుంటున్నదని వినియోగదారులు చెప్పడం నాకో మంచి అనుభవం. నాకు మంచి ఆదాయం. తిన్నవారికి మంచి ఆరోగ్యం. ఈ పనిని భారతీ కిసాన్‌ ‌సంఘ్‌, ‌రైతులతో కలిసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం, ఆంధప్రదేశ్‌ అనే సంస్థ ప్రారంభించి అందరం కలిసి రైతులందరికి శిక్షణ ఇచ్చి ఈ పనిని ముందుకు తీసుకువెళుతున్నాం. కాబట్టి ఈ పద్ధతిలో నిలకడగా పనిచేయాలి. ఉత్పత్తుల నిలవ సామర్థ్యం పెంచుకోవాలి. ఆర్థిక వెసులుబాటు ఉండాలి. నాణ్యత ఆధారంగా క్రమంగా ఉత్పత్తులకు గిరాకీ లభిస్తుంది. గో ఆధారిత సేద్యం, ఉత్పత్తుల గురించి ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ ‌మీడియా, ‘దశదిశ’లో దీని గురించి తెలియజేశాయి. నా దగ్గర శిక్షణ పొందిన రైతులు వాళ్ల విజయాలను తోటి రైతులకు తెలియజేస్తున్నారు. వినియోగదారుల నమ్మకాన్ని చవి చూశాం. వారే నాకు మార్కెటింగ్‌ ‌రాయబారులు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, ‌ఢిల్లీ, ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిషాలే కాక అమెరికా, కెనడా, దుబాయ్‌లలో కూడా వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నది. గో ఆధారిత వ్యవసాయంతో నీటితడులు మూడు కాదు, రెండు చాలు. జలం ఆదా అవుతుంది. జీవ వైవిధ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వినియోగదారుల ఆరోగ్యం మెరుగై జీవనశైలితో సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉంటున్నారు. నా దగ్గర శిక్షణ పొందిన వారిలో వ్యవసాయం దండగ కాదు, లాభసాటే అన్న నమ్మకం బలపడింది. గోపాలపురానికి చెందిన వీరారెడ్డి, విజయనగరం వాస్తవ్యులు హనుమంతరాజు సేద్యాలు ఉత్సాహాన్ని పెంచాయి.

గో ఆధారిత వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదరణ ఎలా ఉంది?

నా కృషిని ప్రభుత్వ వ్యవసాయ అధికారులు గుర్తించారు. శిక్షణ కేంద్రాలకు పిలిచి అవగాహన కల్పించమని కోరుతున్నారు. కానీ గోశాల నిర్వహణలో ప్రభుత్వ ప్రోత్సాహం ఆశించినంతగా లేదు. వారికీ శ్రద్ధ ఉండాలి కదా?

గో ఆధారిత ఉత్పత్తులపై వినియోగదారుల స్పందన ఎలా ఉంది?

ఆవుపాలు, నెయ్యి, గో మూత్రం గూర్చి అవగాహన బాగా పెరిగింది. దేశంలో విశ్వమంగళ గో యాత్ర తర్వాత, ఆవుపై భక్తితోపాటు, గో ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. పంచగవ్య ద్వారా జరిగే సేంద్రీయ సాగు విస్తీర్ణం అధికమైంది. గో ఆధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ‌పుంజుకోవాలి. విలువ ఆధారిత విపణికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి. మేము కామధేను రైతు సంక్షేమ సంఘం ఏర్పాటుచేసి రైతులకు బాసటగా నిలిచాం. నాచుగుంట వ్యవసాయక్షేత్రంలో ఔషధాల తయారీ చేపట్టాం. గో మూత్రం, దంతమంజన్‌, ‌తలనూనె, కీళ్ల నొప్పులకు నూనె తయారు చేసి ఉత్పత్తులను విక్రయిస్తున్నాం.

చిన్న, సన్నకారు రైతులకు సేద్యం శాపమా? వరమా?

గతంలో కుటుంబ సభ్యులందరూ కృషిచేసేవారు. ఇప్పుడు జీవనశైలి మారింది. ఆశలు ఎక్కువ, ఫలితాలు తక్కువ. సేద్యం వరం కావాలంటే సమష్టి కృషి అవసరం. చిన్న, సన్నకారు రైతులు సేద్యంలో మెలకువలు పాటించి, మార్కెటింగ్‌ ‌సౌకర్యాలు పెంచుకొని కష్టిస్తే సత్ఫలితాలు సాధిస్తారు.

భారతీయ కిసాన్‌సంఘ్‌ ‌వారి బ్యాంక్‌ ‌పని తీరు ఎలా ఉంది?

దీనిపై అవగాహన క్రమేపీ పెరుగుతున్నది. 100 మంది సభ్యులతో 50 లక్షల పెట్టుబడి కలిగి రైతుల సంక్షేమానికి చేదోడుగా ఉంది. జూలైలో అప్పు ఇస్తే మళ్లీ జూన్‌లో చెల్లించాలి. పొదుపే ఆయువు పట్టు.

ఉభయగోదావరి, నెల్లూరు ఇలా పలుచోట్ల ఆక్వా సాగు కారణంగా ఆహార పంటలపై ప్రభావం ఎలా ఉంది?

దానితో క్రమేణా భూగర్భ జలాలు కలుషితమవు తాయి. తాగునీటికీ కరవొస్తుంది. ఇప్పటికే పలుచోట్ల ఈ పరిస్థితి ఉంది. ఏలూరులో వింత వ్యాధి ప్రబలటానికి కలుషిత జలం ప్రధాన కారణం అంటున్నారు. భీమవరం సమీపంలో సావపాడు, నారాయణపురం గ్రామాలలో తాగునీరు పనికి రావటం లేదు. ఆక్వాలో రిస్క్ ‌వాస్తవం. తక్కువ వ్యవధిలో లాభాలు ఆర్జించవచ్చని ఈ సేద్యాన్ని ఎన్నుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో ఉద్యానపంటలు ఊపందు కుంటున్నాయి. వాటి భవిష్యత్‌ ఏం‌టి?

సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అరటి సేద్యంలో ఒడిదుడుకులున్నాయి. అమలాపురం నుండి హైదరా బాద్‌కు అరటి ఎగుమతి చేసి బాగా ఆర్జిస్తున్నారు. కృష్ణాజిల్లాలో మరో రైతు కర్పూర అరటి, చక్కెర కేళి పండించి లాభాలు సంపాదిస్తున్నాడు. కొబ్బరితోటల్లో అంతర్‌ ‌సేద్యంగా కోకో సాగు చేస్తున్నారు. గతంలో క్యాడ్‌బరీ రైతులను ప్రోత్సహించి లాభసాటి ధరను కల్పించారు. అలవాటు పడిన తర్వాత క్యాడ్‌బరీ నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్ఫూర్తితో మంగళూరు (కర్ణాటక)లో చాక్లెట్‌ ‌ఫ్యాక్టరీని నెలకొల్పి కోకో ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు.

రాష్ట్రంలో సంప్రదాయ, దేశీ విత్తనాల అందుబాటు ఎలా ఉంది?

విద్యాధికులైన వారు ఈ విత్తనాలను భద్రపరచి పంటలను ప్రోత్సహించే ధోరణి పెరిగింది. సాఫ్ట్‌వేర్‌ ‌రంగానికి వీడ్కోలు పలికి వీటిపై దృష్టి సారించడం ముదావహం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, వీరవాసరం; గుంటూరు జిల్లా చాపారపు, పిడుగురాళ్ల ఇలా పలుచోట్ల ఔత్సాహికులైన రైతులు ఈ పంథాను ఎంచుకున్నారు.

మత్స్య, వరి ఉమ్మడి సేద్యం తీరు ఎలా ఉంది?

సొంతంగా చేస్తే బాగానే ఉంటుంది. కందకాలు తవ్వి, గట్లపై కూరగాయలు పండిస్తున్నారు. కొద్దిమంది సత్ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా దృష్టిసారించింది.

గో ఆధారిత సేద్యం విధానం ప్రకారం గో సంపద అపారంగా కావాలి. మరి దేశీ ఆవుల పెంపకం, ప్రోత్సాహం, ఆదరణ ఎలా ఉంది?

శ్రద్ధ ఉన్న రైతులు గిర్‌, ‌పుంగనూరు, కపిల, ఒంగోలు, జాతులను కేవలం లాభాపేక్షకంటే వాటిపై మక్కువతో పెంచుతున్నారు. ఆవునెయ్యి, ఆవుపాలు విక్రయాలు నగరాలలో బాగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గో ఆధారిత ఉత్పత్తుల విక్రయానికి సరైన ప్రోత్సాహం కల్గించాలి. విస్తృత ప్రచారం చేయాలి. నెడ్‌క్యాప్‌ ‌సంస్థ సంప్రదాయేతర ఇంధన వనరులైన గోబర్‌ ‌గ్యాస్‌ ఏర్పాటుకు కృషిచేస్తున్నది. అయితే గోవులు తగిన సంఖ్యలో ఉండాలి. గో ఆధారిత ఔషధాలకు ప్రచారం కల్పించి విక్రయశాలలను ఏర్పాటు చేయాలి. తయారీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహి కులకు శిక్షణ కలుగ జేయాలి.

భారతదేశంలో భూసుపోషణ భగవంతు డిచ్చిన వరం. ఒక ఆవుతో 5 ఎకరాలలో సేద్యం చేయవచ్చు. భారతీయ గోవులను వ్యవసాయానికి అనుసంధానం చేసుకొంటే సమస్య పరిష్కారమౌతుంది. పంచగవ్య, అమృతజలం, జీవామృతం, ఘన జీవామృతం తయారుచేసుకొని ఉపయోగించటం వలన భూమి తొందరగా సారవంతం అవుతుంది. ఇందుకు అవసరమైన దినుసులన్నీ మన పెరట్లోనే ఉంటాయి కూడా. కొన్ని ఉదాహరణలు:

– వేప, సీతాఫలం, జిల్లేడు, ఆముదం, వావిలి లాంటి ఆకులను దంచి, వెల్లుల్లి కలిపి కీటక నివారిణి తయారు చేసుకోవచ్చు. కేవలం రూ.70 లతో పురుగుమందు తయారవుతుంది. ఈ కషాయం వలన పచ్చదనానికి మిత్రులైన కీటకాలు నాశనం కావు. పిచికారీ చేసే మనిషికీ నష్టం లేదు.

– ప్రకృతి ఆధారంగా భూమిని సారవంతం చేసుకొంటే ఆ భూమిలో వానపాములు బతుకుతాయి. వానపాము జీవితకాలంలో 5000 మీటర్లు కిందికి పైకి తిరుగుతుంది. భూమి గుల్లబారుతుంది.దానితో మొక్కలకు ప్రాణవాయువు వేళ్ల ద్వారా అందుతుంది. నీరు లోపలికి ఇంకుతుంది. వేర్లు లోతుకు పోవడం వలన నీటి ఎద్దడికి మొక్క తట్టుకుంటుంది. ఏ భూమిలో వానపాము ఉంటే ఆ భూమి సహనంగా ఉంటుంది.

– ఎనిమిది లీటర్ల ఆవు మజ్జిగ పులియబెట్టి, పిచికారీ చేసే ముందు రెండు లీటర్ల కొబ్బరినీరు చేర్చి, 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే అది అనేకరకాల చీడపీడలను నియంత్రిస్తుంది.

– నవధాన్యాలను చల్లి, 50 రోజుల తరువాత నేలను కలియ దున్నటం వలన అన్నిరకాల పోషకాలు అందుతాయి. వేప, ఆముదం లాంటి చెక్కలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతుల ద్వారా భూమిని సారవంతం చేస్తే పంట బాగా పండుతుందనేది మన పెద్దల అనుభవం.

ఈ పద్ధతి వలన ఒనగూడే లాభాల గురించి క్లుప్తంగా. ప్రస్తుతం భూమి నిస్సారంగా మారినందున ప్రారంభంలో కొంత పంట తగ్గినా క్రమంగా పంట పెరుగుతుంది.పెట్టుబడి స్థిరంగా ఉంటుంది. తెగుళ్లు తగ్గుతాయి. నీటి వినియోగం తగ్గుతుంది. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చు. ప్రకృతిని కాపాడుకొంటే అది మనలను కాపాడు తుంది. ఇదీ గోవుకీ, సేద్యానికీ ఉన్న బంధం. అదే గో ఆధారిత సేద్యం.

గోమాతను పోషిద్దాం! – భూమాతను రక్షిద్దాం!

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram