బార్ల నుంచి నెలకు రూ.100 కోట్లు గుంజమని హోంమంత్రి ఆదేశించారు.

నెలకి వందకోట్లు వసూలు చేసి తీసుకురమ్మని సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి ఆదేశించాడు. ఈ వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించవలసిందని ఒక పోలీసు అధికారికి అదనపు బాధ్యత కూడా ఇచ్చాడా హోంమంత్రి. పోలీసు శాఖ నెలకు వందకోట్లు గుంజుకు రావాలని హోంమంత్రి ఆదేశిస్తున్నారని రాష్ట్ర పోలీసు అధిపతే స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించాడు. ఇది మహారాష్ట్ర అనే రాష్ట్రంలో కనిపించిన తాజా దృశ్యం. చిత్రంగా ఇదేమీ పెద్ద విషయమే కాదన్నట్టు హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత దేశాన్ని నమ్మించాలని చూశాడు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంతవరకు ఈ వసూళ్ల రాజా గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అక్కడ కొవిడ్‌ ఎం‌త ప్రమాదకరంగా పరిణమించిందో, నీచ రాజకీయాలు కూడా అంతే స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొవిడ్‌ ‌ప్రజలను చంపుతూ ఉంటే, నీచ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నాయి.


పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అం‌బానీ నివాసం అంతలియా దగ్గర జిలెటిన్‌ ‌స్టిక్స్ ఉన్న స్కార్పియోను నిలపడం దగ్గర నుంచి, ఇందులో పోలీసుల ప్రమేయం దగ్గర నుంచి, హోంమంత్రి డబ్బులు గుంజుకు రమ్మని ఆదేశించడం దగ్గర నుంచి, ఆఖరికి ఈ వ్యవహారానికి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్న రాజకీయ పక్షాల వరకు దేశాన్నీ, ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రమాదకర స్థితిలోకి నెట్టి వేయాలని చూశాయనే అనిపిస్తుంది. ఒక పారిశ్రామిక దిగ్గజం ఇంటి ముందు హోంమంత్రికి సన్నిహితుడైన పోలీసు పేలుడు సామగ్రి ఉన్న వాహనాన్ని నిలపడం, బెదిరింపు లేఖను కూడా ఉంచడం ఎందుకో సమాధానం కావాలి. అయితే ఆ సమాధానం పరమ భయంకరమైనదే. తీవ్ర పరిణామాలకు తావిచ్చేదే. అంతలియా తీగ లాగితే కదిలిన డొంకను చూసి ఇప్పుడు దేశం భయపడుతున్నది.

శివసేన నేత ఉద్ధవ్‌ ‌ఠాక్రే ఆధ్వర్యంలోని మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం ఎన్ని అవకతవలకు పాల్పడగలదో అన్ని అవకతవకలకు పాల్పడుతున్నది. పాలనకు రెండు కళ్లు వంటి అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ముఖ్యమంత్రి కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన కళ్లముందు కొనసాగుతున్న అవినీతి కార్యకలాపాలను అడ్డుకోలేకపోతున్నారు. కఠినంగా వ్యవహరిస్తే కూటమిలోని మిత్రపక్షాలైన నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌ ఎక్కడ  దూరమవుతాయోనన్న భయం, ముఖ్యమంత్రి పీఠం జారిపోతుందేమోనన్న భీతి ఠాక్రేను వెంటాడుతున్నాయి. అందుకే ఉత్సవ విగ్రహాన్ని తలపిస్తున్నారు. పాల్ఘర్‌ ‌సాధువుల హత్య, రిపబ్లిక్‌ ‌టీవీ చానెల్‌ అధిపతి అర్ణబ్‌ ‌గోస్వామికి వేధింపులు, కంగనా రనౌత్‌ ‌వ్యవహారం, కరోనా కట్టడిలో ఘోర వైఫల్యంతో అరేబియా అంతటి అపకీర్తిని మూటకట్టుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చిక్కుకున్న వివాదం మరీ హీనమైనది. ఆ సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్న సూచనలు కూడా కనపడుతున్నాయి.

హోంమంత్రి అనిల్‌ ‌వసంతరావు దేశ్‌ముఖ్‌పై ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలు సంచలనమే. ఒకదశలో సంకీర్ణ ప్రభుత్వ పునాదులే కదిలిపోతాయన్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం కనపడనప్పటికీ, మున్ముందు ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని మరొకసారి రుజువైంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్‌ అం‌బానీ నివాసం (అంతలియా) ఎదుట పేలుడు పదార్థాల వాహనం నిలిపిన కేసులో పోలీసు అధికారి సచిన్‌ ‌వాజే అరెస్టు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు సంకీర్ణ సర్కారులో ప్రకంపనలు సృష్టించాయి. హోంమంత్రి దేశ్‌ముఖ్‌ ‌ప్రతి నెలా రూ.100 కోట్ల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారు. ఇటీవల బదిలీ అయిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ ‌పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌  ఈ ‌మేరకు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టాయి. అనిల్‌ ‌లీలలు చాలామంది మంత్రులకు కూడా ఎరుకేనని సింగ్‌ ‌కొత్త మలుపు తిప్పారు. ఆయనేమీ ఆషామాషీగా ఈ ఆరోపణలు చేయలేదు. తన దగ్గరున్న కచ్చితమైన ఆధారాలతోనే నేరుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు లేఖ రాశారు. 1988 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సింగ్‌ ‌హోంమంత్రిపై సంధించిన ఆరోపణలివి. నెలకు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి నిర్దేశించారని సింగ్‌ ఎలాంటి శషభిషలు లేకుండానే ఆరోపించారు. తనను కీలకమైన ముంబయి పోలీస్‌ ‌కమిషనర్‌ ‌పదవి నుంచి తొలగించి హోంగార్డుల డైరెక్టర్‌ ‌జనరల్‌గా బదిలీ చేయడం వెనక గల కారణాలనూ తన ఎనిమిది పేజీల లేఖలో పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌ ‌కూలంకషంగా వివరించారు. ముంబై క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‌విభాగం అధిపతి సచిన్‌ ‌వాజేను హోంమంత్రి దేశ్‌ముఖ్‌ ‌గత కొన్ని నెలల్లో అనేకసార్లు తన వద్దకు పిలిపించుకున్నారు. నెలకు కనీసం వంద కోట్లయినా కావాలని నిర్దిష్టంగా చెప్పారు. నగరంలో దాదాపు 1750 బార్లు ఉన్నాయని అంచనా. వాటి యజమానుల నుంచి కనీసం రెండు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినా నెలకు 40 నుంచి 50 కోట్లు రాబట్టవచ్చని సూచించారు. ఈ విషయాన్ని వాజే తనకు చెప్పినట్లు పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌ ఆరోపించారు. కొద్దిరోజుల తరవాత ఏసీపీ (అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌) ‌సంజయ్‌ ‌పాటిల్‌ను సైతం హోంమంత్రి దేశ్‌ముఖ్‌ ‌పిలిపించుకుని ఇదే విషయాన్ని చెప్పారని పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌ ఆరోపించారు. నిర్దిష్ట ఆధారాలు, వాస్తవాలు లేకపోతే ఒక అధికారి ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయలేరు. అదీ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసేంత సాహసం అసలే చేయరు. అంతేకాక ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆయన చేసినవి ఆధారరహిత ఆరోపణలు అయితే సంకీర్ణ సర్కారు కఠిన చర్యలు తీసుకునేది. అంతర్గత విచారణ పేరుతో ఆయనను వేధించేది. కిందిస్థాయి అధికారుల చేత ఆయనపై తిరిగి ఆరోపణలు చేయించేది. పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌ ‌నిర్దిష్ట ఆరోపణలు చేయబట్టే సర్కారు కక్కలేక, మింగలేక చందంగా వ్యవహరిస్తోంది. మరోపక్క అంబానీ ఇంటి ఎదురుగా నిలిపిన పేలుడు పదార్థం వాహనం యజమాని మన్‌సుఖ్‌ ‌హిరేన్‌ అనుమానాస్పద మరణం కేసులో కొత్త మలుపుగా పేర్కొనవచ్చు. హోంమంత్రి వందకోట్ల వసూళ్ల బాధ్యత అప్పగించిన పోలీస్‌ అధికారి సచిన్‌ ‌వాజే అరెస్టయినది ఈ కేసులోనే. వినాయక్‌ ‌శిందే అనే పోలీస్‌ అధికారిని, నరేశ్‌ ‌గౌర్‌ అనే బుకీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంబానీ, అనిల్‌, ‌సింగ్‌, ‌వాజే వంటి కీలక వ్యక్తులే ఇందులో పాత్రలు కావడంతో ఇది ఎంతో రసవత్తరంగా సాగుతోంది.    ఇప్పటికీ ముఖ్యమంత్రి ఠాక్రే ఈ విషయమై మౌనాన్ని వీడలేదు.

 దేశ్‌ముఖ్‌ ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌ ఇరకాటంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఠాక్రే తగిన చర్య తీసుకుంటారని, అంతిమ నిర్ణయం ఆయనదేనని మొదట్లో పవార్‌ ‌స్పష్టం చేశారు. పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌ ఆరోపణలు తీవ్రమైనవేనని ఆయనా ఒప్పుకోక తప్పలేదు. అదే సమయంలో దేశ్‌ముఖ్‌ ‌వాదనా వినాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం. ఆయన వాదన వినవద్దని ఎవరూ చెప్పలేదు. ఇరువైపులా వాదనలు విన్న తరవాతే నిజాలను నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. పరమ్‌ ‌వీర్‌ ‌బదలీ అయిన తరవాతే ఆరోపణలు చేయడంపై పవార్‌ అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వం తమదే కాబట్టి విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కాదు. నిజాయితీ గల పోలీస్‌ అధికారిగా పేరున్న పంజాబ్‌ ‌మాజీ డీజీపీ (డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌) ‌జులియో రెబీరో నాయకత్వంలో విచారణ జరపాలని తొలుత ఠాక్రేకు పవార్‌ ‌సూచించారు. వయోభారం వల్ల ఆ బాధ్యతలను చేపట్టలేనని రెబీరో స్పష్టం చేయడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. రెబీరో కాకపోతే మరో అధికారితో విచారణ చేయించడానికి గల అభ్యంతరాలు ఏమిటో? విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయమే అసలు కారణం. పైగా ఈ మాత్రానికే అనిల్‌ ‌రాజీనామా చేయడం అనవసరం అని కూడా మనసులో మాట చెప్పారు. పరమ్‌ ‌వీర్‌ ‌సింగ్‌ ‌తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను తేల్చేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు ముఖ్యమంత్రి ఠాక్రే నిర్ణయం తీసుకున్నారని దేశ్‌ముఖ్‌ ‌చెబుతున్నారు. అయితే  ఈ విషయాన్ని ఠాక్రే చెబితేనే అధికారికం అవుతుంది తప్ప దేశ్‌ముఖ్‌ ‌చెబితే కాదు. ప్రభుత్వ వర్గాల నుంచి కూడా దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు రాగానే మొదట్లో రాజీనామా అని, విచారణ అని హడావిడి చేసిన నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ అధినేత శరద్‌ ‌పవార్‌ ఆ ‌తరవాత మాట మార్చారు. ఆరోపణలు రాగానే ఏం చేయాలనే అంశంపై సంకీర్ణ సర్కారు భాగస్వాములు తర్జనభర్జనలు పడ్డారు. ఢిల్లీలో పవార్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ ‌పాటిల్‌, ‌పార్టీలో కీలకనేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌, ‌పవార్‌ ‌కుమార్తె సుప్రియా సూలే, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ అగ్రనేత ప్రఫుల్‌ ‌పటేల్‌తో పాటు శివసేన అగ్రనేత, సామ్నా పత్రిక మాజీ సంపాదకుడు సంజయ్‌ ‌రౌత్‌ ‌సమావేశమయ్యారు. ఈ వ్యవహారంలో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి తదితర అంశాలపై చర్చించారు. తరవాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత, మధ్యప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ‌కూడా పాల్గొనడం విశేషం. దేశ్‌ముఖ్‌ను కాపాడటమే లక్ష్యంగానే సమావేశం సాగింది. ఈ సమావేశం అనంతరమే దేశ్‌ముఖ్‌ ‌రాజీనామా అవసరం లేదని పార్టీ అధ్యక్షుడు జయంత్‌ ‌పాటిల్‌ ‌స్పష్టం చేశారు. తరవాత ఇదే విషయాన్ని అధినేత పవార్‌ ‌ప్రకటించడం గమనార్హం.

  శివసేనకు చెందిన సంజయ్‌ ‌రౌత్‌ ‌మాత్రం నిజాయతీగా స్పందించారు. ‘హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ ఏర్పడిన మాట వాస్తవం. దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో అన్న విషయమై కూటమిలోని పార్టీలన్నీ కలసి కూర్చొని మాట్లాడుకోవాలి’ అని ఆయన అన్నారు. అంతేకాక కొత్తదారుల కోసం అన్వేషిస్తున్నాం అని ట్వీట్‌ ‌చేయడం విశేషం. ఈ గొడవ అంతటికీ దేశ్‌ముఖ్‌ అసమర్థతే కారణమని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’కు రాసిన వ్యాసంలో ఆయన ఒకింత కఠినంగానే మాట్లాడారు. దేశ్‌ముఖ్‌ను యాదృచ్ఛిక హోంమంత్రి అంటూ విమర్శలు సంధించారు. కొంతమంది సీనియర్‌ అధికారులను మంత్రి అకారణంగా బదిలీ చేశారని అసలు విషయాన్ని చెప్పారు. పోలీసులకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన మంత్రి కేవలం వారి నుంచి గౌరవ వందనాలు స్వీకరించడానికే పరిమితం అయ్యారని చురకలు వేశారు. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నేతలు జయంత్‌ ‌పాటిల్‌, ‌దిలీప్‌ ‌వాల్పె వంటి నేతలు హోంమంత్రి పదవి చేపట్టేందుకు ముందుకురాని నేపథ్యంలో దేశ్‌ముఖ్‌ను పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌ ఎం‌పిక చేశారని రౌత్‌ ‌పేర్కొనడం కూడా సంచలనమే. పరమ్‌వీర్‌ ‌సింగ్‌ ఆరోపణలతో సంకీర్ణ సర్కారు ప్రతిష్ట దిగజారిందని, సకాలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టే యంత్రాంగం కరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ముంబయి పోలీస్‌ ‌యంత్రాంగంలో వాజే ఓ చిన్న స్థాయి అధికారి మాత్రమేనని, అసలు ఆయనకు అన్ని అధికారాలు ఎవరు ఇచ్చారని సంజయ్‌ ‌రౌత్‌ ‌ప్రశ్నించడం చూస్తే, నెపమంతా భాగస్వామి మీదకు నెట్టే యత్నమే అనుకోవాలి. ఎందుకంటే వాజే కొద్దికాలం శివసేన సభ్యుడు. అయినా రౌత్‌ ‌వ్యాఖ్యలు హోంమంత్రి దోషి అని చెబుతున్నాయి. రౌత్‌ ‌వ్యాఖ్యలను ఖండించలేక, అంగీకరించలేక పవార్‌ ‌పార్టీ సతమతమవుతోంది. సంకీర్ణ కూటమిలోని పార్టీల ఐక్యతకు రౌత్‌ ‌వ్యాఖ్యలు విఘాతం కలిగిస్తాయని, సీనియర్‌ ‌నేత రౌత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పవార్‌ ‌పార్టీ అగ్రనేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌ ఓ ‌హెచ్చరిక ఇవ్వక తప్పలేదు. దేశ్‌ముఖ్‌ ‌యాదృచ్ఛిక హోంమంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. కూటమి అంగీకారంతోనే మంత్రిమండలి కూర్పు జరిగిందన్నారు. సంజయ్‌ ‌రౌత్‌ ‌వాఖ్యలు శివసేన అధికారిక వైఖరిని బయటపెడుతున్నాయి. పార్టీలో సీఎం ఠాక్రే తరవాత రౌత్‌ ‌కీలకనేత. సంకీర్ణ సర్కారులోని మూడో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్‌ ‌సైతం వాస్తవాలను విస్మరించి మంత్రిని వెనకేసుకు రావడం ఆశ్చర్యం కలిగించక మానదు. సర్కారును అస్థిర పరిచేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని అర్థరహిత ఆరోపణలు చేసింది. కూటమిలోని మంత్రే అవినీతికి పాల్పడినట్లు బహిరంగంగా ఆరోపణలు వచ్చిన తరవాత, కేంద్రం సర్కారును ఎలా అస్థిర పరుస్తుందో ఎవరికీ అర్థం  కాని విషయం. వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ- ‌నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అదుపులోకి తీసుకున్న తరవాత పరమ్‌వీర్‌ ‌పై కేంద్ర సంస్థలు ఒత్తిడి చేసి ఉండొచ్చని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేయడం అర్థరహితం.

  అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ఆషామాషీ నాయకుడు కాదు. సీనియర్‌ ‌నేత. 1995 నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని నాగపూర్‌ ‌జిల్లా, కటోల్‌ ‌స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో అనేక  మంత్రిత్వశాఖలను ఆయన నిభాయించారు. సహజంగానే పరమ్‌వీర్‌ ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖేశ్‌ అం‌బానీ కేసులో, మన్‌సుక్‌ ‌హిరేన్‌ ‌హత్యలో సచిన్‌ ‌పాత్ర స్పష్టం. తదుపరి విచారణలో తన పేరు కూడా బయటకు వస్తుందని పరమ్‌వీర్‌ ‌భయపడుతున్నారు. అందుకే తనపై రోపణలు చేస్తున్నారు… అని అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ఎదురుదాడి చేస్తున్నారు. పరమ్‌వీర్‌ ‌సింగ్‌, అతని సహచరులు కొన్ని తప్పులు చేశారని, అందుకే బదలీ చేశామని, అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదని ఆయన అంటున్నారు. ముంబై మాజీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌పరమ్‌వీర్‌ ‌సింగ్‌ ‌గతంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌గా పనిచేశారు. సంజయ్‌ ‌బార్వే తరవాత ఆయన ముంబై పోలీస్‌ ‌సారథిగా బాధ్యతలు చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పరమ్‌వీర్‌ ‌సింగ్‌. ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌నుంచి హోంగార్డుల డైరెక్టర్‌ ‌జనరల్‌గా చేసిన బదలీని రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మరోపక్క పరమ్‌ ‌వీర్‌ ‌ముంబయి పోలీస్‌ ‌కమిషనర్‌గా ఉన్నప్పుడు తన నుంచి 2 కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ ‌చేశారని ముంబై పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆరోపించడం తాజా పరిణామం. ప్రభుత్వ వర్గాలే ఆయన చేత ఈ ఆరోపణలు చేయించినట్లు చెబుతున్నారు.

యావత్‌ ‌వ్యవహారంపై విపక్ష భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌సంకీర్ణ సర్కారుపై తీవ్ర విమర్శలు సంధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బందోబస్తు పెంచారు. హోంమంత్రి రాజీనామా చేయాలని విచారణకు అంగీకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.  తాను నిజాయితీ పరుడైతే విచారణకు మంత్రి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఫడ్నవీస్‌ ‌ప్రశ్న.

వాస్తవానికి సంకీర్ణ సర్కారులోని పార్టీలది అపవిత్ర కలయిక.  2019 చివర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ, శివసేన కలసి పోటీచేశాయి. కాంగ్రెస్‌, ‌పవార్‌ ‌సారథ్యంలోని నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పొత్తుతో ముందుకెళ్లాయి. నాటి ఎన్నికల్లో 122 స్థానాలను సాధించి భాజపా అతిపెద్ద పార్టీగా నిలిచింది. 63 సీట్లతో శివసేన రెండో పెద్ద పార్టీగా ఏర్పడింది. కాంగ్రెస్‌ 42, ‌పవార్‌ ‌పార్టీ 54 సీట్లు సాధించాయి. ముందస్తు పొత్తుతో వెళ్లిన భాజపా, శివసేన సర్కారు ఏర్పాటు కావాలి. కానీ శివసేన సీఎం పదవి తనకు కావాలంటూ పేచీ పెట్ట్టింది. ఇది పూర్తిగా అనైతికం, పొత్తుల పక్రియకు విరుద్ధం. మొత్తం 234కు గాను 63 సీట్లను సాధించిన పార్టీకి సీఎం పదవి ఇవ్వడానికి ఏ మిత్రపక్షమైనా అంగీక రించదు. సహజంగానే 122 సీట్లు సాధించిన భాజపా సీఎం పదవి కోరుకోవడంలో తప్పులేదు. అప్పట్లో శివసేన అధినేత ఠాక్రే కనీసం శాసనసభకు కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు శాసనమండలి నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పదవిపై మోజుతో చిరకాలం తాను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ ‌తో జట్టుకట్టారు ఉద్ధవ్‌ ‌ఠాక్రే. శివసేన వ్యవస్థాపకుడు, తన తండ్రి బాల్‌ ‌ఠాక్రే జీవిత కాలమంతా కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఆయన వైపు కన్నెత్తి చూడటానికి సైతం సాహసించేవి కావు. అధికారం కోసం ఆయన ఏనాడూ రాజీపడ లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భాజపాతో స్నేహాన్ని వీడలేదు. అధికార మత్తు ఆవహించిన ఉద్ధవ్‌ ‌గతాన్ని విస్మరించారు. అందువల్లే మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ ‌మేకర్‌గా పేరుగాంచిన శరద్‌ ‌పవార్‌ ‌పార్టీ సాయాన్ని తీసుకున్నారు. అటు కాంగ్రెస్‌, ఇటు పవార్‌ ‌పార్టీ సైతం అధికారం కోసం అర్రులు చాచాయి. శివసేనను మతతత్వ పార్టీగా జీవితకాలం ఈసడించిన కాంగ్రెస్‌ అయిదారు మంత్రి పదవుల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి ఆయన పంచన చేరింది. అవకాశవాద రాజకీయాలకు మారుపేరైన పవార్‌ ‌కూడా చేతులు కలిపారు. ఈ మూడు పార్టీల అపవిత్ర కలయికతోనే ఠాక్రే సర్కారు ప్రారంభమైంది. దీనికి ఒక విధానం అంటూ ఏమీ లేదు. ఏకైక లక్ష్యమల్లా అధికారాన్ని అందుకోవడమే. ఇందులో భాగమే అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వ్యవహారం. పేరుకు ఠాక్రే ముఖ్యమంత్రి అయినప్పటికీ పవార్‌ ‌చెప్పినట్లు నడుస్తు న్నారు. కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ కాబట్టి సహజంగానే పవార్‌ ‌పార్టీకే ప్రాధాన్యం లభిస్తోంది. దీనిపై మరో మిత్రపక్షం కాంగ్రెస్‌ అప్పడప్పుడూ తన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది.

ఇప్పుడు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను పవార్‌కే అప్పచెప్పినట్లు కనపడుతోంది. సొంతబలం లేని, మిత్రపక్షాల మద్దతుతో పాలన సాగించే నాయకుడు ఇంతకు మించి చేయగలిగేదేమీ కూడా ఉండదు. అధికారం కోసం రాజీపడినప్పుడు దాని వల్ల కలిగే అనర్థాలను సైతం ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు కాకపోయినా మున్ముందు అయినా ఠాక్రే తన తొందరపాటుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. భాజపాతో బంధాన్ని తెంచుకున్నదుకు ఏదో ఒకనాడు పశ్చాత్తాప పడక తప్పదు. ఎవరు సహజ మిత్రులో, ఎవరు అవసరార్థ మిత్రులో తప్పక తెలుసుకుంటారు. ఇప్పటికైనా ఉద్ధవ్‌ ‌ఠాక్రే పదవికి రాజీనామా ఇచ్చి చేతులు కడుక్కుంటే మంచిది.


ఒక ఎన్‌కౌంటర్‌ ‌స్సెషలిస్ట్

‌నేర పరిశోధనలో ఉన్న ప్రతిభ కొద్దిగా దారి తప్పితే! వారు కూడా నేరగాళ్లయి పోతారా? ముంబై పోలీసు అధికారి సచిన్‌ ‌వాజే ఉదంతాన్ని చూస్తే అది నిజమేనిపిస్తుంది. ఎన్నో సంచలనాలు రేపిన సినిమాలు నిర్మించిన ముంబై నగరానికి వాజే కథ తాజా సంచలనం. మలుపుల మీద మలుపులు తిరుగుతోందీ ఉదంతం. ప్రపంచ కోటీశ్వరుడు ముఖేశ్‌ అం‌బానీ నివాసం అంతలియా (ముంబై) దగ్గర పచ్చరంగు స్కార్పియోను మోహరించిన కేసులో, ఈ వాహనంతో సంబంధం ఉన్న కార్‌ ‌డీలర్‌ ‌మన్‌సుఖ్‌ ‌హిరేన్‌ ‌హత్య కేసుతో జాతీయ దర్యాప్తు బృందం అరెస్టు చేసిన వాజే లీలలు చూస్తే విస్తుపోతాం. నెలకు వందకోట్ల రూపాయలు వసూలు చేసి తీసుకురమ్మని మహారాష్ట్ర హోంమంత్రి ఇతడినే ఆదేశించారన్న ఆరోపణ ప్రస్తుతం దేశాన్ని కుదుపుతోంది. ఒక పోలీసు అధికారిని డబ్బు గుంజే యంత్రంగా సాక్షాత్తు హోంమంత్రి తయారు చేసిన ఘట్టం ఈ దేశంలోనే కొత్త. వాజే, అనిల్‌ ఉదంతం అంతిమంగా తేల్చేది ఈ వాస్తవాన్నే.

 భారత ప్రారిశ్రామిక రంగ దిగ్గజం అంబానీ ఇంటి దగ్గర జెలిటిన్‌ ‌స్టిక్స్‌తో ఒక వాహనాన్ని ఉంచా డంటేనే సచిన్‌ ‌వాజే ఎంత గుండెలు తీసిన బంటో అర్ధమవుతుంది. ముంబై ఎన్‌కౌంటర్‌ ‌స్పెషలిస్ట్‌గా అతడికి పేరు. 63 ఎన్‌కౌంటర్లు చేశాడు. రిపబ్లిక్‌ ‌టీవీ చానల్‌ ఎడిటర్‌ ఇన్‌ ‌చీఫ్‌ అర్ణబ్‌ ‌గోస్వామి కేసు, హృతిక్‌ ‌రోషన్‌ ‌భార్య కేసు వంటి ప్రసిద్ధ కేసులు ముంబై పోలీసు శాఖ ఇతడికే అప్పగించింది. షీనాబోరా, డేవిడ్‌ ‌హెడ్లీ వంటి కేసుల లోతుపాతులు క్షుణ్ణంగా తెలిసినవాడు. వాజేకు ఆరుకు పైగా వ్యాపారాలున్నాయని బీజేపీ నాయకుడు కిరీట్‌ ‌సోమాయా వాటి పేర్లతో సహా చెప్పారు. మల్టిబిల్డ్ ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టస్ ‌లిమిటెడ్‌, ‌టెక్‌లీగల్‌ ‌సొల్యూషన్స్,  ‌డీజీనెక్సట్ ‌మల్టీ మీడియా లిమిటెడ్‌ ‌వంటివన్నీ ఆయనవే. ఈ వ్యాపారాలలో అతడు భాగస్వాములుగా ఎంచుకున్నవారు కూడా తక్కువవారేమీ కాదు, శివసేన నాయకులు సంజయ్‌ ‌మాహెల్కర్‌, ‌విజయ్‌ ‌గవాయ్‌.

 ‌రకరకాల ఆరోపణలతో పోలీస్‌ ‌శాఖ నుంచి సస్పెండయిన తరువాత  2007లో వాజే శివసేనలో చేరాడు. అప్పటికి ఉద్యోగానికి రాజీనామా  ఇచ్చాడు. రాజీనామా ఇచ్చిన వ్యక్తి మళ్లీ పోలీసు శాఖలోకి ఎలా వచ్చాడన్నది  ప్రశ్నార్థకం. చిత్రం ఏమిటంటే ఉద్ధవ్‌ ‌ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాతనే జూన్‌ 6, 2020‌న ఇతడి సస్పెన్షన్‌ ఎత్తివేశారు. తరువాత సిబ్బంది తక్కువనే కారణంగా జూన్‌ 2020‌లో తిరిగి పోలీసు శాఖలో చేర్చుకున్నారు. వాజే మళ్లీ పోలీసు శాఖలో ప్రవేశించడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌లేదా హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ఇద్దరూ బాధ్యులు కారని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌ ‌వ్యాఖ్యా నించడం విశేషం. నిజానికి 2018లో బీజేపీ- శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడే వాజేను మళ్లీ చేర్చు కోవాలని నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన కోరింది. అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌సలహా మేరకు ఫడ్నవీస్‌ ఆ ‌కోరికను మన్నించలేదు.

పోలీసుల అదుపులో ఉండగా సంభవించిన ఖ్వాజా యూనస్‌ (2002 ‌ఘట్‌కోపర్‌ ‌పేలుళ్ల నిందితుడు) అనే నేరగాడి మరణం దరిమిలా వాజేను 17 సంవత్సరాలు సస్పెండ్‌ ‌చేశారు. సస్పెండ్‌ అయ్యే నాటికి ఇతడి హోదా కేవలం అసిస్టెంట్‌ ‌పోలీస్‌ ఇన్‌స్సెక్టర్‌. అర్ణబ్‌ ‌గోస్వామిని అరెస్టు చేసిన రాయగడ్‌ ‌పోలీస్‌ ‌బృందానికి నాయకత్వం వహించినవాడు వాజే. ఇతడిని ఉద్యోగంలోకి తీసుకున్న తరువాత మొదటిగా నియమించిన ప్రదేశం, నక్సల్‌ ‌ప్రభావిత గడ్చిరోలి. 1992లో ఇతడిని థానే బదలీ చేశారు. అక్కడ కొన్ని కీలక కేసులు ఛేదించడంతో ఇతడి పేరు మారుమోగిపోయింది. ఆ సమయంలోనే ముంబై-థానే ప్రాంతంలోని 60 మంది నేరగాళ్లను కాల్చి చంపిన బృందంలో వాజే కీలకంగా ఉన్నాడు. డబ్బు గుంజే ముఠాలను అంతం చేసేందుకు 1997లో ఏర్పాటయిన బృందంలో కూడా ఇతడు ఉన్నాడు. దీనితో వాజేను ముంబై క్రైమ్‌ ఇం‌టెలిజెన్స్ ‌శాఖకు పంపించారు. వాజే ఎన్‌కౌంటర్‌ ‌చేసినవారిలో మున్నా నేపాలి ఒకడు.

నిరంతరం ఆధునిక ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులతో కనిపించేవాడు వాజే. చాలా సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులు పరిష్కరించిన ఘనత కూడా సాధించాడు. అత్యాధునిక మైన మోబిసీఐడీ అప్లికేషన్‌ ‌కూడా అతడి వద్ద ఉంది. కానీ ఎంత గుండెలు తీసిన బంటైనా, ప్రపంచ కోటీశ్వరుడిని బెదిరించడానికి ఉద్దేశించిన ఈ వ్యవహారమంతా అతడొక్కడే చేశాడంటే ప్రపంచం మొత్తం మీద ఎవరూ నమ్మలేరు.  ప్రస్తుతం ఇతడిని జాతీయ దర్యాప్తు సంస్థ ఏప్రిల్‌ 3 ‌వరకు తన కస్టడీలోకి తీసుకుంది.

 ఒక సాధారణ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా 1990లో బొంబాయి పోలీసు శాఖలో చేరిన వాజే చాలామంది అధికారులతో పాటు హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌కు కూడా సన్నిహిత పరిచయస్థుడే అనిపిస్తుంది. అంతలియా నివాసం దగ్గర జిలిటెన్‌ ‌స్టిక్స్ ఉన్న వాహనాన్ని నిలపడానికి పది రోజుల ముందు, అంటే   ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు దక్షిణ ముంబైలోని ఫైవ్‌ ‌స్టార్‌ ‌హోటల్‌ ‌ట్రైడెంట్‌లో ఉన్నాడు. దొంగ ఆధార్‌తో, ఐదు నల్ల బ్యాగ్‌లతో లోపలికి ప్రవేశించాడు. వాటి నిండా డబ్బే ఉందని తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ పరిశీలనలో తేలింది. ఆపై ఆ బ్యాగ్‌లు ఎక్కడికి పోయాయో తెలియలేదు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం- అదే హోటల్‌లో వంద రోజుల పాటు సచిన్‌ ‌బస చేయడానికి రూమ్‌ ‌బుక్‌ ‌చేశారు. ఇందుకు ఒక వ్యాపారవేత్త రూ. 13 లక్షలు చెల్లించాడు. ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ ‌ద్వారా ఈ రూమ్‌ ‌బుక్‌ ‌చేశారు.

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు వాజే ఆ హోటల్‌లో ఉన్న కాలంలో అతడి వెనుకే ఆ గదిలోకి ఒక మహిళ కూడా ప్రవేశించింది. అయితే వాజే దర్యాప్తు చేస్తున్న అనేక కేసులలో ఒకదాని కోసం ప్రశ్నించడానికి అతడే పిలిపించిన వ్యక్తి అయి ఉండాలని భావిస్తున్నారు. అయినా ఆమె ఎవరో తెలుసుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ పరిశోధి స్తున్నది. కొన్ని ఆధారాల మేరకు ఆమె గుజరాత్‌కు చెందిన మహిళగా గుర్తించారు కూడా. ఈమె డబ్బులు లెక్కించే యంత్రంతో వచ్చిందని రిపబ్లిక్‌ ‌టీవీ చెబుతోంది.

ఉద్యోగంలో ఉండగా సచిన్‌ ‌పోలీస్‌ ‌శాఖకు అవసరమైన కొత్త నిబంధనలు తయారు చేశాడు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన తరువాత చాలా టీవీ చర్చలలో పాల్గొనడంతో పాటు, సైబర్‌ ‌క్రైమ్‌ ‌గురించి పత్రికలకు వ్యాసాలు రాశాడు. 2014లో మరాఠీలో నిర్మించిన రెగె అనే చిత్రంలో సరిగ్గా వాజేను పోలి ఉండేటట్టు ఒక పాత్రను చిత్రించారు కూడా. దీనిని పుష్కర్‌ ‌షోత్రి పోషించారు. అంతలియా వద్ద జిలెటిన్‌ ‌స్టిక్స్ ఉన్న వాహనం నిలిపిన కేసులో నిందితునిగా జాతీయ దర్యాప్తు బృందం అరెస్టు చేయడంతో ఇతడిని ముంబై పోలీసు శాఖ నుంచి మార్చి రెండోవారంలో తొలగించారు.

‘జిన్‌కున్‌ ‌హర్లెలి లథాయి’ పేరుతో ఇతడు రచించిన పుస్తకం బెస్ట్ ‌సెల్లర్‌ ‌స్థాయిని సాధించింది. ఇది 26/11 దాడుల గురించిన పుస్తకం. డేవిడ్‌ ‌హెడ్లీ జీవితం ఆధారంగా వాజే రాసిన ‘ది స్కౌట్‌’ ‌బాగా అమ్ముడుపోయింది. దేశాన్ని కుదిపేసిన షీనా బోరా హత్య గురించి కూడా ఇతడు పుస్తకం రాశాడు. హుస్సేన్‌ ‌జాయిదీ రాసిన ప్రముఖ పుస్తకం హెడ్లీ అండ్‌ ఐ, ‌మై నేమ్‌ ఈజ్‌ అబూ సలేం, బైకుల్లా టు బ్యాంకాక్‌ ‌పుస్తకాలకీ, అడ్రియన్‌ ‌లెవీ రచన ది సీజ్‌కు కూడా వాజే రచనా సామగ్రి అందించాడు.

– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

About Author

By editor

Twitter
YOUTUBE