జీవుల మధ్య ఉండే భిన్నత్వమే జీవ వైవిధ్యం. భూమ్మీద ఉండే లక్షలాది జీవ జాతులు, వాటి జన్యువులు, అవి ఉన్న జీవావరణ వ్యవస్థలను కలిపి కూడా జీవ వైవిధ్యం అంటారు. ఈ అధ్యయనాన్ని  నోర్స్, ‌మెక్మానస్‌ 1980‌లో మొదట జీవశాస్త్ర వైవిధ్యం అన్నారు. ఈ పదాన్ని డబ్ల్యుజి రోసెన్‌ 1985‌లో జీవ వైవిధ్యంగా మార్చారు. తరువాత దీనిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రస్తావిస్తున్న అంశానికి సంబంధించి జీవ వైవిధ్యంలోని రెండు విలువల గురించి చెప్పాలి. అవి ప్రత్యక్ష విలువలు, పరోక్ష విలువలు. జీవ వైవిధ్యం దెబ్బ తింటే పర్యావరణం దెబ్బ తింటుంది. దీనితో పంటలు దెబ్బ తింటాయి.జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడం అంటే మానవాళి తనను తాను రక్షించుకోవడమే. మితిమీరిన  రసాయనిక ఎరువులు, మందులకు జీవ వైవిధ్యం బలవుతున్నది. మానవాళి మనుగడకు కీలకమైన ఆహారోత్పత్తులకు మూలాధారం జీవ వైవిధ్యమన్న వాస్తవాన్ని కూడా మానవాళి విస్మరిస్తున్నది.


ఆవృత బీజాలకు చెందిన సుమారు 250 జాతులు మానవులకు ఆహార అవసరాలకు ఉపయోగ పడుతున్నాయి. ఉదా: వరి, గోధుమ, మొక్కజొన్న. అలాగే వివిధ మొక్కలు, చెట్ల నుండి పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు లభిస్తున్నాయి. కొన్ని అడవి జంతువులు,పెంపుడు జంతువులు, పక్షులు, చేపలు, రొయ్యలు ఆహారంగా ఉపయోగ పడుతున్నాయి. గృహోపకరణాలకు, వ్యవసాయ పనిముట్లకు కలప ఉపయోగపడుతుంది. దీనికి మూలాధారం జీవవైవిధ్యం. జీవరాశి మూలాధార మైన ఆక్సిజన్‌ ‌కూడా జీవ వైవిధ్యం నుండి లభిస్తుంది.

జన్యు విలువల గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్నో రకాల జన్యువులకు జీవ వైవిధ్యం ఒక నిధి. వన్యజాతుల్లోని ఉపయోగకరమైన జన్యువులను పంట మొక్కలలో శాస్త్రీయంగా ప్రవేశపెట్టి అధిక దిగుబడినీ, వ్యాధులను తట్టుకునే రకాలనూ రూపొందించి జనాభా అవసరాలకు తగినట్లు అధిక దిగుబడులను సాధిస్తున్నాం. కాబట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా, భవిష్యత్‌ అవసరాలకు తగిన విధంగా ఆహారం, మందులు, కలప, సుగంధ ద్రవ్యాలు, పెంపుడు జంతుజాతులు అభివృద్ధికి జీవవైవిధ్యమే కీలకంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో వన్యజాతి కర్బూజ నుండి సేకరించిన జన్యువులను అమెరికాలో పెరిగే కర్బూజ మొక్కలో ప్రవేశపెట్టి వ్యాధి నిరోధక రకాన్ని తయారుచేశారు. బాసిల్లస్తురింగి యెన్సిస్బ్ ‌బాక్టీరియా నుండి సేకరించిన జన్యువులను పత్తి, లవంగ మొక్కలలో ప్రవేశపెట్టి కీటక నిరోధక బీటీ పత్తి,వంగ రకాలు తయారుచేశారు.

డాఫోడిల్‌ అనే ఒక మొక్క, మట్టిలోని బ్యాక్టీరియా నుండి కొన్ని జన్యువులను వరి పంటలో ప్రవేశపెట్టి, విటమిన్‌  అధికంగా పెంపొందించి, నూతన వంగడాలను కృత్రిమంగా సృష్టించారు. ఆ బియ్యాన్ని పేద ప్రజలు స్వీకరించడం వలన ప్రపంచంలో కొన్ని లక్షల పేద పిల్లలు విటమిన్‌  ‌లోపం వలన కంటిచూపు కోల్పోకుండా కాపాడగలుగుతున్నాం.

ప్రకృతిలో ఉన్న అన్ని ఆవరణ వ్యవస్థలు స్వయం నియంత్రణను కలిగి ఉంటాయి. దీనితో జీవావరణ సమతుల్యత సాధ్యమౌతుంది. ఉదా : హాని కలిగించే కీటకాలను కప్పలు భక్షించి పంటలను కాపాడు తున్నాయి. అలాగే పక్షిజాతులు కూడా. ఏ కారణాలతోనైనా కప్పలు, పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు, కీటకాల సంఖ్య తగ్గితే పంట దిగుబడి తగ్గుతుంది. అంటే జీవవైవిధ్యానికి హాని జరుగుతుంది. అసలు పర్యావరణ పరిరక్షణలో అనేక జంతు / వృక్షజాతులు, సూక్ష్మజీవులు ఎనలేని సేవలు అందిస్తున్నాయి. వికిరణ జన్య సంయోగ క్రియలో సౌరశక్తిని గ్రహించడం, ఆక్సిజన్‌ ‌విడుదల చేయడం, కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌స్థాయిని తగ్గించడం, కాలుష్య నివారణకు తోడ్పడటం, పోషక మూలకాల భ్రమణం (భూ జీవ రసాయనిక వలయాలు), మృత్తికా క్రమక్షయాన్ని నివారించడం, స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతల నియంత్రణ ఆ సేవలలో ఉన్నాయి.

జీవవైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలు

ప్రకృతిలో సహజంగా, కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన కొన్ని జాతులు అదృశ్యమై, మరికొన్ని కొత్తజాతులు ఆవిర్భవిస్తాయి. ప్రస్తుతం ప్రకృతిలో వస్తున్న మార్పులను తట్టుకోలేక ఎన్నో జీవజాతులు అంతరించి పోతున్నాయి. దీనికి ప్రధాన కారకుడు మానవుడు, అభివృద్ధి పేరిట అతడు చేస్తున్న చేష్టలు. మానవుడు జరిపే ప్రకృతి ప్రతికూల చేష్టల వలన ఏటా కొన్ని వందల జాతులు అంతరించి పోతున్నాయి.

ప్రధానంగా భౌగోళిక, జీవావరణ మార్పుల వలన ఇప్పటివరకు ఐదుసార్లు జీవవైవిధ్యం చాలావరకు అంతరించిపోయింది. మళ్లీ పరిణామం చెందుతూ వచ్చింది. ఇదంతా అనేక లక్షల ఏళ్ల కాలంలో జరిగింది. దాదాపు 350 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ప్రపంచమంతా వ్యాపించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి తద్వారా మానవ జనాభా 18 రెట్లు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో సగటు జీవన ప్రమాణాలు మెరుగుపడి మానవుడి అవసరాలూ విపరీతంగా పెరిగినాయి. పెరిగిన ఆ అవసరాల నిమిత్తం సహజ వనరులు మట్టి, నీరు, గాలి, జంతు, వృక్షజాతులను అస్థిరమైన పద్ధతిలో వినియోగించుకుని పర్యావరణాన్నీ, జీవ వైవిధ్యాన్నీ నాశనం చేసుకుంటున్నాం. ఈ ‘మానవ చర్య’ అణుయుద్ధం కన్నా తీవ్రమైనదని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒకజాతి నశిస్తే మనిషి దానిని తిరిగి సృష్టించలేడు.

మనిషి మనుగడకు కీలకమైన జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఒకసారి సమీక్షించుకుందాం. ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. మానవ అవసరాల కోసం, పరిశ్రమల కోసం, నివాస గృహాల కోసం అడవులను నరికి వేయడం, సహజ ఆవాసాలను మార్చడం సర్వసాధారణమైంది. దీనితో వృక్ష, జంతుజాతులు అంతరించిపోతున్నాయి. జీవ సంపద తగ్గిపోతుంది. పరిశ్రమలు, వాహనాల వలన వాతావరణంలోకి, నీటిలోకి అనేక హానికర రసాయనిక పదార్థాలు చేరి వృక్ష, జంతుజాతుల మనుగడకు ముప్పు ఏర్పడింది. వ్యవసాయంలో వాడే క్రిమిసంహారక, కలుపు నివారణ రసాయన మందులు, రసాయన ఎరువులు, భారీ రసాయన మూలకాల వలన వాతావరణ, భూమి, నీటి కాలుష్యం జరిగి అనేక వృక్ష, జంతుజాతుల మనుగడకు ప్రమాదం సంభవిస్తున్నది. సునామీలు, తుపానులు, వరదలు, భూకంపాలు, అడవులకు నిప్పు పెట్టడం, అగ్నిపర్వతాల వలన సహజ ఆవాసాలు దెబ్బతిని జీవవైవిధ్యం తగ్గుతున్నది. జీవ కాలుష్యకాల బెడద కూడా ఉంది. విదేశీ జాతులతో ఇది సంభవిస్తున్నది. వాటిని తేవడం వలన స్థానిక జాతులకు ప్రమాదం సంభవిస్తుంది. ఉదా:పార్థీనియం, లంటానా, ఐకొర్నియా, ప్రోసోపిస్ప్రకు చెందిన జాతులు స్థానిక జాతుల వృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఇవే జీవ కాలుష్యకాలు.

అందుకే ప్రపంచదేశాలు కలిసికట్టుగా జీవ వైవిధ్య సంరక్షణ చేపట్టాలి. జీవ సంపద, వాటి వనరులను ప్రస్తుత అవసరాలకు తగినంత ఉపయోగించుకొని భావితరాలకు కూడా లభించే విధంగా కాపాడటాన్ని జీవ వైవిధ్య సంరక్షణ అంటారు. ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవ వైవిధ్యం కలిగిన దేశం. ప్రపంచంలో 2.5% భౌగోళిక వైశాల్యం కలిగి, 7.8% వైవిధ్యం ఇక్కడ ఉంది. 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు.1982 లో జాతీయ వన్యమృగ బోర్డును ఏర్పరిచారు. వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006 ఆమోదించారు. 2002లో జాతీయ జీవవైవిధ్య చట్టం చేశారు. 2003 అక్టోబర్‌ 01 ‌తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టం కిందకు జాతీయ జీవవైవిధ్య ఆధారిటీ (NBA), జాతీయ జీవవైవిధ్య బోర్డు (SBB), జీవవైవిధ్య నిర్వహణ కమిటీ (BMCs) వస్తాయి.

జాతీయ జీవవైవిద్యం ప్రాధికారసంస్థ

ఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ వాతావరణం, అడవుల మంత్రిత్వశాఖ, ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జాతీయ జీవవైవిధ్య ఆధారిటీ సంస్థనూ చట్టబద్ధ హోదాతో చెన్నైలో 2003లో ఏర్పాటు చేశారు. జీవసంపద దొంగలించకుండా జాగ్రత్తపడడం, రక్షిత ప్రదేశాల బయట కూడా జీవవైవిద్య రక్షణకు నియమాలు  రూపొందించి వాటిని అమలుపరచడం వంటివి దీని బాధ్యతలు.

ఆంధప్రదేశ్‌ ‌జీవ వైవిధ్య మండలి

ఆంధప్రదేశాష్ట్ర జీవవైవిధ్య మండలి భారత ప్రభుత్వం జీవవైవిధ్య చట్టానికి అనుగుణంగా ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం 2006లో ఏర్పాటు చేసింది. ఆంధప్రదేశ్‌ ‌విస్తీర్ణం 1,62, 968 చ.కి.మీ. అడవుల విస్తీర్ణం 37,258 చ.కి.మీ. జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియోగానికి సంబంధించిన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, జీవవనరుల వినియోగం ద్వారా సమకూరే ప్రయోజనాల న్యాయబద్ధ పంపిణీ మొదలైనవి రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రధాన ఉద్దేశాలు. ఇంకా, రాష్ట్రంలో వివిధ వ్యవసాయ వాతావరణ ప్రదేశాలలో సంప్రదాయ కంగా సాగుచేసే పంటల రకాలను పునరుద్ధరించడం ప్రోత్సహించడం, నీటిసంరక్షణ, చెట్లపెంపకం, సేంద్రియ వ్యవసాయం, నగర సుందరీకరణ, నగర జీవ వైవిధ్య సూచిక తయారు చేయడం వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జీవ వైవిధ్య మండలి బాధ్యత.

– బీఎంకే రెడ్డి, ఆంధప్రదేశ్‌ ‌జీవవైవిధ్య మండలి ఛైర్మన్‌

By editor

Twitter
Instagram