భక్త శబరి.. లేరు సరి

శ్రీరాముడు సుగుణ ధనుడు. సీతమ్మది జగదేక చరిత. వీరిని ఆరాధించిన వాల్మీకిది కీర్తన భక్తి. హనుమ కనబరచింది శ్రవణ భక్తి. శబరిది మధురాతి మధురమైన అర్చన భక్తి. ఆమె పేరులోని మూడు అక్షరాలూ సంపూర్ణ భక్తి తత్పరతకు అర్థ తాత్పర్యాలు. కలువలు పూచినట్లు, చిరుగాలి వీచినట్లు, తీవలు తలలూపినట్లు, పసి బాలలు చేతులు చాచినట్లు వెల్లివిరిసిందా ఆరాధన! తన రాముడి కోసమే ఎంతోకాలం ఎదురుచూసింది. ఆయన రానే వచ్చాక, అంత కాలమూ తాను సమీప అడవి ప్రాంతం నుంచి సేకరించి తెచ్చిన పలు రకాల పండ్లను చేతికి అందించింది. అదే ఆతిథ్య సమయాన్ని అర్చనమయంగా మార్చుకుని, స్వామి సేవలోనే పరిపూర్తిగా తరించింది. ఆ శబరిమాత జయంతి- దైవభక్తి మార్గంలో ఆగక సాగే  కోటానుకోట్ల వెలుగుల స్రవంతి.

(మార్చి 5న శబరి జయంతిని నిర్వహించారు.)


శబరిది అడవిమల్లె జీవితమైనా, దివ్య పారిజాతంతో సరిసమానం. ఆమె భక్తి శ్రద్ధలు ఏ లోకంలోనైనా కాలమానానికి, కొలమానానికి అందనివి. తాను పుట్టిందీ గిట్టిందీ అరణ్యంలోనే. దేవులపల్లివారు తిలకించినట్లు- ఎదురుచూపుల మదికి కొలను నీరు ఊరకే ఉలికి ఉలికి పడుతోంది. మరోవైపు ఓరగా నెమలి ఒకటి పింఛం ఆరవేసు కుంటోంది. ఎందుకో కానీ అక్కడి ప్రతి ప్రాణీ ఏదో చెప్పాలన్నట్లు కనిపిస్తోంది. వనంలోని చెట్లన్నీ కళ్లు విప్పి తేరిపార చూస్తున్నాయి. రామయ్య వస్తున్నాడా అన్నట్లు ప్రతీ అడుగు చప్పుడూ దగ్గరగా వినవస్తోంది. అప్పటికే కొలనునడిగి తేటనీరు తెచ్చాననుకుంటోంది. కొమ్మనడిగి పూల తేరు తీసుకొచ్చినట్లు తలుస్తోంది. గట్టుగట్టునా చెట్టుచెట్టునూ అడిగి మరీ పట్టుకొచ్చిన ఫలాలు, పుట్ట తేనె రసాలూ ఉన్నాయి కదూ మరి! తనకా పెద్ద వయసు కారణంగా అసలే చూపు ఆనదు. దానికితోడు ఆనంద సూచకంగా పదేపదే ఉబికి వస్తున్న కన్నీరొకటి. నీల మేఘ మోహనుడిని, ఆ మనో మంగళ రూపుడిని కళ్లారా చూద్దామంటే ఎలా? నడచివచ్చిన స్వామి ఎంత ఆకలితో ఉన్నాడో కదా… అందుకే తన దగ్గరున్న కాయల్లో దోరగా ఉన్నవేవో ముందుగానే కాస్తంత రుచి చూశాకే విందుగా అందించింది. అదీ శబరితల్లి భక్తిప్రపత్తి.

నిరంతర భక్తి చింతనకు ఆమె ఏకైక ఉదాహరణ. నిజ జీవితంలో తనను కన్నవారెవరో బాహ్య లోకానికి తెలియదు. తోబుట్టులున్నారా, ఉంటే వారు ఎవరు- ఎక్కడున్నారన్నదీ స్ఫుటం కాదు. తనకు తెలిసిందల్లా చెట్టూచేమలు, కొండలూ గుట్టలే. మరి మతంగ రుషి ఆశ్రమానికి ఎందుకు చేరిందో, అక్కడే జీవనాన్నంతా ధారపోయడానికి హేతువేమిటో ఏ ఒక్కరికీ అంతుపట్టనిది. అదే ఆశ్రమ పరిసరాల్లోని ఒక మారుమూల కుటీరంలో శబరి నివాసం. రోజూ తెల్లవారుజామునే లేవడం, ఆశ్రమాన్నంతా ముగ్గులతో అలంకరించడం, మునుల దైవపూజకు పూలు తెచ్చివ్వడం- నిత్యకృత్యం. వారు అందజేసే తీర్ధ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి మళ్లడం నిత్యం తప్పనిసరి అలవాటు. ఎప్పుడూ క్షణం తీరికంటూ లేని పరిచర్య జీవిత విధానం. అన్ని ఆలోచనలూ-పనులూ ఆ చుట్టూతా మాత్రమే పరిభ్రమించేవి. కాల ప్రవాహ వేగంతో పోటీపడిన పర్యవసానం… అవ్వ తల ముగ్గుబుట్టలా మారింది. క్రమానుగతంగా నేత్ర దృష్టీ మందగించింది. దేహమంతా చిక్కి శల్యమైంది. ఎప్పుడు ఏ నిమిషంలో రాలిపోతుందో అన్నట్లుండే శారీరక పరిస్థితి. ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నా, ఆ రామభక్తురాలిలో ఎటువంటి భయాలూ వ్యధలూ లేవు. నిరాశ, ఉదాసీనత బొత్తిగా కానరావు. ఎప్పుడూ ఒంటరిగానే కుటీర వాసం, తనకు తానుగానే ఆశ్రమ ఆశ్రయం.

స్థితిగతులు అనేకం మారుతున్నా, ఎంతకీ మారనిది భక్త శబరి మనస్తత్వం. ఎప్పటి నుంచో ఆమె రామచంద్రుడి రాక కోసమే కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తోంది. ముదిమితో ముఖం ముడు తలు పడింది. నడక సాగక కాళ్లు పట్టుతప్పి వణుకు తున్నాయి. నడుమంతా వంగి, చేతి కర్రే ఊతంగా మారి, అడుగులు అతి భారంగా పడుతున్నాయి. అయినా సరే, మాటిమాటికీ ఇంటి వాకిట ఉంటోంది. ‘స్వామీ! ఇంకా ఎప్పుడొస్తావయ్యా’ అని లోలోపల అనుకుంటూ, పలుమార్లు పైకే అంటూ సదా అవే ఎదురుతెన్నులు. ఎక్కడ ఎటువైపు చీమ చిటుక్కుమన్నా, అటువైపే అవ్వ చూపు. ‘రామా రామా’ అనే పలవరింతలూ కలవరింతలూ. జగదభిరాముడి దర్శన భాగ్యంతోనే జన్మ తరిస్తుందన్న జీవితాశ. ‘నా తండ్రీ! నాకు ఇంకెంత కాలమయ్యా ఈ నిరీక్షణ’ అన్నదే ఆర్తి. ‘అప్పటికి మేమంతా ఉంటామో ఉండమో తెలియకున్నా, నీకు మటుకు రామ సందర్శన యోగం తథ్యమ’న్న కొందరు మునిశిష్యుల మాటే ఆమె హృదయంలో నాటుకుపోయింది. అందువల్లనే ఇంత భక్తి తపన. ఆ రోజు రాకపోదు, రామయ్య కనిపించకపోడు- అదొక్కటే ప్రగాఢ నమ్మిక. ఇంతా చేసి ఆయన నా ఇంటికొచ్చి పలకరిస్తే, రవ్వంత విశ్రాంతి తీసుకుంటే, నా నుంచి నేను చేయాల్సిందేమిటి? ఇంతింత దూరం నడిచి వచ్చినవాడికి ఆకలి దప్పులుండవా? ఆయనకు ఏదో ఒకటి, ఎంతో కొంత నాకున్న దానిలోనే పెట్టుకోవద్దా? ఇన్నిన్ని భావనలు ఆమెలో నిండాయి.

ఆ క్షణం ఎదురైన వేళ

ఆరోజూ ఎప్పటిలాగే ఇల్లు అలికి, రంగవల్లి దిద్ది, రామభద్రుడు కూర్చునేందుకు అనువుగా స్థానాన్ని సంసిద్ధపరచింది. వెళ్లి ఒక్కో చెట్టుకు ఒక్కొక్క పండును తెచ్చి ఉంచింది. తన దేవుడికి నచ్చుతుందో లేదోనని ముందుగానే ఒక్కోటీ రవ్వంత రుచి చూసిందా తల్లి. మంచిగా ఉన్నాయనుకున్న వాటినే ఒక చిన్న బుట్టలో పేర్చింది. ఆయన దాహం తీరేదెలా అనుకుంటూనే, సమీప ఏటి నుంచి తెచ్చుకున్న నీటిని దొప్పలో పోసింది. అంతేనా… రాములవారికి సమర్పణగా దండకు పూలనూ సిద్ధం చేసింది. కొంతసేపటి తర్వాత, బయట ఎక్కడినుంచో ఏమో- పక్షుల కిలకిల. వాటిల్లోనూ ఆమెకు రామనామమే ధ్వనించింది. ప్రకృతి మొత్తం పులకిస్తోందా, రాముడి రాక సందర్భంలో అడవి అడవంతా స్వాగతిస్తోందా? అనుకున్న క్షణం రానే వచ్చేసింది. రఘుకుల తిలకుడి పాదస్పర్శతో సమస్త ప్రకృతీ ఆనంద నర్తనం. ఒక్కసారిగా తలపైకెత్తి చూసేసరికి, లక్ష్మణ సమేత రామ దర్శన యోగం! ముందైతే ఎన్నో అనుకుంది, ఎంతో మర్యాద చేయాలని పరితపించింది. సరిగ్గా ఆ ఘడియ ఎదురయ్యేటప్పటికి, ఎన్నడూ లేనంత తొట్రుపాటు. ఇప్పుడేం చేయాలీ అన్నట్లు గదంతా తిరుగుతూ, అన్నీ ఉన్నట్లే కదూ అని ఆత్రంగా చూసుకుంటూ!!

కరుణాంతరంగుడు నవ్వులు చిందిస్తూ, భక్తి పారవశ్యంతో వణికిపోతున్న చేతులను ఆదర పూర్వకంగా అందుకునేసరికి- ఆ అవ్వ అనుభూతి మహత్తరం. తనను కూర్చోబెట్టి, తానూ కూర్చుని, ఆనంద బాష్పాలను చేతితో తుడిచేసరికి- ఆమె హృదయగత భావన అనిర్వచనీయం. పూలతో పూజ చేస్తూనే పాదాలమీద వాలిందామె. ఇద్దరి మౌన భాష అనంతరం, ఆర్ద్రతతో లేవదీసి కుశల ప్రశ్నలు అడిగిన రామస్వామికి గంప నుంచి ఒక్కో పండూ తీసి నోటికి అందించింది. ‘నీ కోసమే ఎదురుచూస్తూ ఇదిగో ఇలా మిగిలి ఉన్నా’ అంది. ‘శాప విముక్తుడైన వ్యక్తి నుంచి నీ గురించి విని ఇటుగా వచ్చానన్న మాటకు శబరి మనసంతా కరిగింది. తదనంతరం ఊతకర్రతో ముందుకు సాగుతూ ఆశ్రమం, యాగ వేదికలు, చుట్టుపక్కల వాటినీ చూపించి పేరుపేరునా వివరించి చెప్పింది. అన్నీ అయ్యాక, కట్టకడపట చేతులు జోడించి ‘ఇక సెలవివ్వండి’ అన్నట్లు చూసింది. అప్పుడు రాముడు చూసిన చూపు, నవ్విన నవ్వు, ఇచ్చిన అభయ హస్తం సాక్ష్యంగా ఆమె దరిదాపులోని యజ్ఞ కుండం నుంచి అనంత కాంతి మాలికగా వినువీధికి చేరింది. ఆ భక్తి, దైవానురక్తి ఆచంద్ర తారార్కం నిలిచే ఉంటాయి. కారణ జన్మురాలంటే ఆమే!

పవిత్ర భక్తి విశ్వాసాలే భగవంతుడిని భక్తుల దరి చేరుస్తాయి. అవే రామచంద్రుడికి శబరి ఆతిథ్యమిచ్చే ఘనాఘన భాగ్యాన్ని కలిగించాయి, సుస్థిర స్థానం అందుకునేలా చేశాయి. జీవితకాలమంతా రామనామాన్నే జపించి, ఆయన దర్శనానికే ఎంతగానో నిరీక్షించి, కృతకృత్యురాలైన భక్తి తత్పర. ఎనలేని ధార్మిక సుధా వాహినికి ఆమే నిజమైన ప్రతీక. ‘ఏమి రామ కథ శబరీ శబరీ…ఏదీ మరియొక సారి’ అనుకుందాం మనమందరం. దయా జలధి దాశరథి కరుణా కటాక్షాలు పొందిన ఆమెను హృదయసీమలో కలకాలం నిలుపుకొందాం. రాముడుకి ఆమె తాను రుచి చూసిన పండ్లు సమర్పిస్తుంది. ‘ఎంతో మధురంగా ఉన్నాయి, ఏదీ మరొక పర్యాయం’ అంటూ తింటాడాయన. అప్పుడు ఆ భక్త హృదయ ఆనందానికి అవధులంటూ ఉండవు. శ్రీరామ కథామృతాన్ని ఎందరు ఎంతగా ఎన్నిసార్లు ఆస్వాదించినా అంతే. భక్తి సుధా దాహం ఎంతకీ తీరదు. ఇంకా ఇంకా అనుభవానికే మానసం ఉవ్విళ్లూరుతూ ఉంటుంది.

ఏటేటా స్మృతి యాత్రా శోభ

మన్యంలో వికసించిన పూజా సుమంగా కీర్తిస్తూ శబరి స్మృతి యాత్రను భదాద్రి దేవస్థానం ఏటా నిర్వహిస్తోంది. రామానుగ్రహం పొందిన ఆ ధన్యురాలిని స్మరించుకుంటూ వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది. దైవాన్ని అర్చించినప్పుడు కవి పద్యం- ‘ఏ మహామహుడు సృష్టించెనో భావ వై/భవ సువిశాల భువన రాజి/ ఏ స్వయంప్రభుడు రూపించెనో ప్రతిభా ప్ర/కర్ష మై కాల చంక్రమణ చయము/ ఏ జ్ఞాన నిధి నిజ ప్రజ్ఞా ఫలమ్ముగా/ వెలయించెనో సర్వ వేద వితతి/ ఏ దయామయుడు రంజించెనో కామ్య ప్ర/సాదమ్ముపై మునీశ్వర గణమ్ము/ ఆ జగత్పిత సత్యలోకాధినేత/ కరుణ రసపూత విశ్వ మంగళ విధాత/ మహిత వాణీ విలాస సంపత్‌ ‌ప్రణేత/ ఆర్త సంత్రాతయై కొలువయ్యె ధాత’ తలపులోకి రాక మానదు. అంతటి దివ్యశక్తి అనుగ్రహానికి తపించని భక్తులు ఎవరుంటారు? వారిలో మహిళా భక్తజన ప్రథమురాలు మన శబరి.

 – జంధ్యాల శరత్‌బాబు, వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram