విష్ణు హృదయవాసిని నమామ్యహమ్‌

– ‌డా।।ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌క్షీరసాగరమథనంలో శ్రీక్ష్మీదేవి ఆవిర్భావం ఒకటి అద్భుత ఘట్టం. సాగర మథనంలో మాఘ బహుళ చతుర్దశి నాడు పుట్టిన తర్వాత హాలాహాలాన్ని శివుడు స్వీకరించి నీలకంఠుడిగా వినతికెక్కాడు. సరిగా పక్షం రోజులకు ఫాల్గుణ పౌర్ణమి ఉత్తర ఫల్గునీ నక్ష త్రంలో అమృతంతో పాటు జగన్మాత అవతరించారు. విష్ణువును వరించి, ఆయన మెడలో పుష్పహారం సమర్పించి స్వామి వక్షఃస్థలంలో స్థిర నివాసం ఏర్పరచు కున్నారు. ఇది కేవలం అమ్మవారి జయంతే కాకుండా అయ్యవారిని చేపట్టిన రోజు కూడా కావడం విశేషం. అలా శ్రీహరి ఉన్నచోటనే శ్రీ మహాలక్ష్మి ఉంటుందనే నానుడిని సార్థకం చేశారు.

‘యత్ర నాస్తి హరేః పూజా తదీయ గుణ కీర్తనమ్‌

‌నోత్సుకశ్చ ప్రశంసాయాం నయామి తస్య మందిరమ్‌’

(శ్రీ‌హరి పూజ, శ్రీహరి గుణకీర్తనం, శ్రీహరిని ప్రశంసించడం పట్ల ఉత్సుకత లేని వారి మందిరం లోకి నేను ప్రవేశించను) అని ఆమె ప్రకటించారట. ‘సిరిసంపదల కన్నా హరి దంపతులు మిన్న’ అనే నానుడి అలా పుట్టిందంటారు. అమ్మవారు అలా పతిపట్ల అనురాగం, భక్తిని చూపితే, స్వామి వారు ఇలా సతీప్రేమను చాటారు. విష్ణుసహస్రనామ పారాయణం ప్రారంభానికి ముందు అమ్మవారి అష్టోత్తర పఠనం ఆనవాయితీ అలా వచ్చి ఉండవచ్చు. విష్ణువు సమస్త ‘పురుష ప్రకృతి’కి ప్రతీకలా, లక్ష్మి సమస్త ‘స్త్రీ ప్రకృతి’కి ప్రతీకగా చెబుతారు. వారిద్దరిది అవినాభావ సంబంధం. పాల్గుణ మాసానికి ‘తపస్య మాసం’ (తపస్సు నందు యోగ్యమైనది) అని పేరు. లక్ష్మీనారాయణులు అన్యోన్య తపఃఫలంగా దివ్య దంపతులై, ఆది దంపతులుగా వినుతికెక్కారు. విష్ణువు అవతరించిన ప్రతిసారీ అమ్మవారు అందుకు అనుగుణంగా వివిధ పేర్లతో అవతరిస్తుంటారు కష్టసుఖాలలో పాలుపంచు కుంటూనే ఉంటారు. పురుష దేవతలకు ‘జయంతి’ పేరిట ఉత్సవాలు నిర్వహించడం సర్వసాధారణం కాగా, స్త్రీ దేవతలలో ఆ ప్రత్యేకత లక్ష్మీదేవికే దక్కిందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇతర స్త్రీ దేవతలకు ‘వ్రతం’ పేరిట జరుపుకోవడం తెలిసిందే.

వాత్సల్యాది సద్గుణవతి

జగన్మాత మహావాత్సల్యాది సద్గుణవతి. భక్తులకు, భగవంతునికి మధ్యవర్తిని. ఆమెను శరణాగతి కోరాలి. ఆమె కరుణకు పాత్రులైతే చాలు, వారి కష్టనష్టాలను స్వామి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తుందని విశ్వాసం. ఆ కోణంలోనే ‘దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం, అసన్మాతరం అశరణ్య శరణ్యం అనన్య శరణ్యం’ అని భగవద్రామానుజులు శరణాగతి చేశారు. ‘హరికిన్‌ ‌పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చందురుడు తోబుట్టువు …’ (శ్రీమద్భాగవతం) పద్యంలో ‘శ్రీహరికి పట్టపు దేవియైన శ్రీదేవి, పుణ్యాల దీవి, సిరిసంపదల గని, చంద్రుని సోదరి, వాణీశర్వాణీలతో క్రీడించే పూబోణి, తామర పువ్వులో నివసించే సౌందర్య రాశి, ముల్లోకాలకు పూజనీయురాలు, దారిద్య్రాన్ని రూపుమాపే తల్లి శ్రీమహాలక్ష్మి శాశ్వత శుభాలు ప్రసాదించుగాక’ అని పోతనామాత్యుడు వర్ణించారు. ‘అపరిమితం, విఖ్యాత వైభవం కలిగి మంగళా లకు మంగళప్రదమై, అనంత కాంతులతో విష్ణుదేవుని వక్షఃస్థలాన్ని అలంకరించిన నీవే అందరికి శరణ్యం’ అని శ్రీ వేదాంతదేశికులు కీర్తించారు. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ అంటూ కంచర్ల గోపన్న (రామదాసు) కూడా అయ్యవారి కరుణాకటాక్షాల కోసం అమ్మవారికి మొరపెట్టుకున్నారు. శ్రీనివాసుడి పట్టమహిషి పద్మావతిదేవికి శ్రీమహాలక్ష్మికి అభేదం చెబుతూ ‘శ్రీమహాలక్ష్మియట సింగారాల కేమరుదు/కాముని తల్లియట చక్కదనాల కేమరుదు/సోమును తోబుట్టువట సొంపుకళల కేమరుదు’ అని అన్నమాచార్య కీర్తించారు. ‘సకల సంపదలు ప్రసాదించే ఆమె,మన్మథునికి తల్లి. చక్కదనాలకు చిరునామా. చల్లని కాంతులతో అలరారే చంద్రుని సోదరి. కనుక ఆమెది అంతే చల్లటి మనసు. పతితో కూడి ఉన్న ఆమె మన చింతలువంతలు తీరుస్తోంది కనుక తనివితీరా సోబాన పాడండి’ అని వర్ణించారు. ‘విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు’ అనీ కీర్తించారు అన్నమాచార్య. విష్ణువే విశ్వాత్ముడు, విశ్వాధిపుడు అయినప్పుడు ఆయన హృదయవాసిని అన్నిటికన్నా మిన్నని, శ్రీదేవిని ఆశ్రయించడం ఉత్తమ ఫలదాయనమని అంటారు ఆధ్యాత్మికులు. ‘అలాంటి మహనీయుల మార్గదర్శకత్వంలో అమ్మవారిని ఆశ్రయిస్తే భక్తులపై ఆమె అనుగ్రహం ప్రసరిస్తుందని విశ్వాసం.

‘సిరి’ అంటే ధనమొక్కటే కాదు. ధాన్యం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం లాంటి వాటిని కూడా సంపదగానే భావించాలి. అనంత సంపదలు కలిగిన వారికి పైవాటిలో ఏ ఒక్కటి లేకపోయినా జీవిత నిస్సారమే నంటారు. అయితే అందరికీ అవన్నీ దక్కుతాయా? అని ప్రశ్నించుకుంటే అది వారి యోగ్యత, అదృష్టాలను బట్టి ఉంటుంది. సిరిసంపదలు, భోగభాగ్యాలను అందరూ కోరుకుంటారు. ‘చేసుకున్నవారికి చేసుకున్నంత…’ నానుడిలా అవి వరించేవారినే వరిస్తాయి. అయినంత మాత్రాన అవి శాశ్వతం అనలేం. తారుమారు కావచ్చు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సిరి రాకపోకలు దైవాధీనాలు. సిరిసంపదలు రావడానికి పూజలు, పుణ్యాలు ఎంతమేరకు పనిచేస్తాయో కానీ దక్కిన దానిని నిలుపుకోలేని వారి నిర్లక్ష్యాన్ని అమ్మవారు సహించరు. ‘సిరితా వచ్చిన వచ్చును సలిలము భంగిన్‌’ అన్న శతక కర్త మాటలు గమనార్హం. అలా అని నిరాశ చెందనవసరంలేదు. అత్యాశకు పోకుండా, లౌకిక జీవయాత్రను ధర్మబద్ధంగా సాగించే వారిని అమ్మవారు అష్టలక్ష్మీ రూపంలో కరుణిస్తారని ఆధ్యాత్మిక••వేత్తలు చెబుతారు.

విష్ణుపత్నీం క్షమాం దేవీం

మాధవీం మాధవ ప్రియామ్‌!

‌విష్ణోః ప్రియసఖీం దేవీం

నమామ్యచ్యుత వల్లభామ్‌!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram