వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం – 4

మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యేనాటికి భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు ముస్లింలు రెచ్చిపోవటానికి అనువుగా ఉన్నాయనీ, పేలటానికి సిద్ధంగా ఉన్న మందుగుండు సామాగ్రికి అగ్గిపుల్ల వెలిగించటమే తరువాయి అనీ గత భాగంలో తెలుసుకున్నాం. ఖిలాఫత్‌ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? మత ఛాందసవాదాన్నీ, ప్రపంచ ముస్లింలందరూ ఒకటేనన్న భావజాలాన్నీ, ఇస్లాం దేశాలకు అనుకూలంగా స్పందిచాలనీ (•అ ×శ్రీ•ఎఱఎ) వారికి నూరిపోసింది ఎవరు? వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వారికి ఉమ్మడి లక్ష్యం ఒకటే ఎందుకైంది? మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఖిలాఫత్‌ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి గురించి తెలుసుకోవటం అవసరం. ఉద్యమానికి కొన్ని దశాబ్దాల ముందుగానే అలీఘర్‌లో ముస్లింలను సంఘటితపరిచే ఒక ఉద్యమం నడిచింది. అదే అలీఘర్‌ ఉద్యమం.

అలీఘర్‌ ఉద్యమం

రాజ్యాధికారం తమ చేతి నుండి జారిపోవటాన్నీ, అధికారంతో లభించే హోదాలు, ప్రత్యేక సౌకర్యాలు తమకు లేకపోవటాన్నీ ముస్లింలు జీర్ణించుకోలేక పోయారు. హిందువులు వారి దృష్టిలో కేవలం పాలితులు, రెండవ తరగతి పౌరులు. వారితో స్నేహంగా ఉండటం కూడా మత ఛాందసవాదులకు ఇష్టంలేదు. ఇలాంటి నేపథ్యమే అలీఘర్‌ ఉద్యమానికి దారి తీసింది. అకస్మాత్తుగా అధికారం ఆంగ్లేయుల వశం అవటంతో దాన్ని తిరిగి చేజిక్కించుకోవటానికి ముస్లింలను సంఘటితపరచవలసిన ఆవశ్యకతను వారు గుర్తించారు.

అలీఘర్‌ ఉద్యమానికి నాయకత్వం వహించింది సయ్యద్‌ అహమ్మద్‌ ‌ఖాన్‌ (1817-98). ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా, 1857 స్వాతంత్య్ర సంగ్రామాన్ని వ్యతిరేకించాడు. 1878 నుండి 83 వరకు గవర్నర్‌ ‌జనరల్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యుడిగాను ఆయన పనిచేశాడు. ఈస్టిండియా కంపెనీకి వీరవిధేయుడు. ఆంగ్లేయులకు నమ్మకంగా పనిచేసి, రాజకీయాలకు దూరంగా, ముస్లింలను విద్యావంతులను చేయటం ద్వారా ముస్లింలను తిరిగి సాధికారులును చేయవచ్చునని భావించాడు క•డా. 1857లో ఆయన ‘మొహమ్మదీన్‌ ఆం‌గ్లో-ఓరియంటల్‌’ ‌కాలేజీని అలీఘర్‌లో ప్రారంభించాడు. ఆ సంస్థ ఆశయాల గురించి ఇలా చెప్పాడు, ‘ఇస్లాంను అనుసరించటం మనందరి కర్తవ్యం. అందుకు మన పిల్లలకు ఇస్లాంను, ఇస్లామిక్‌ ‌చరిత్రను బోధించాలి. దానితో పాటుగా ఆంగ్ల విద్యనూ బోధించాలి. ఇస్లామిక్‌ ‌సహోదర త్వాన్ని వారికి అలవాటు చెయ్యాలి. అది మన విశ్వాసంలో కీలక అంశం. అరబ్బీ భాషతో కాని, పర్షియన్‌ ‌భాషతో కాని మన విద్యార్థులకు పరిచయం ఉండాలి. అనేకమంది విద్యార్థులు ఒక చోట చేరి, కలసి జీవించటం ద్వారా, తినటం ద్వారా, చదువు కోవటం ద్వారా వారి మధ్య సోదరభావం పెంపొందుతుంది. అలాంటి సోదరభావం తీసుకొని రాలేకపోతే, మనం అభివృద్ధి సాధించలేం. కనీసం ఒక సమాజంగానైనా మనుగడ సాగించలేం.

1867లో సయ్యద్‌ ఒక ఇంటర్వ్యూలో హిందువులు, ముస్లింలు రెండు విభిన్న జాతులకు చెందిన వారని మొదటిసారిగా చెప్పాడు. 1883లో ఇచ్చిన ఒక ఉపన్యాసంలో ఇలా అన్నాడు, ‘ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్తే, భారతదేశానికి పాలకులు ఎవరు అవుతారు? రెండు విభిన్న జాతులకు చెందిన హిందువు, ముస్లిం ఒకే సింహాసనం మీద కూర్చొని పాలన చెయ్యటం సాధ్యమయ్యేనా? సాధ్యంకాదు. ఎవరో ఒకరు రెండోవారిని ఓడించి, అణచివెయ్యక తప్పదు’ (The Making of Pakistan, Richard Symonds, Faber, 1950, p.31).

ఆంగ్లేయుల పట్ల విధేయులుగా ఉండాలన్న అలీఘర్‌ ‌విధానాన్ని 1906లో ప్రారంభమైన ముస్లింలీగ్‌ ‌తన విధివిధానాలలో భాగంగా అంగీక రించింది. సయ్యద్‌ అభిప్రాయంతో అనేకమంది విభేదించారు. ఆయన అలీఘర్‌ ‌సహచరులలో కూడా అనేకమంది ఆయనతో విభేదించారు. 1888లో దియోబందీలు ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేశారు. 1905లో బెంగాల్‌ను రెండుగా  విభజించారు. దానితో తూర్పు బెంగాల్‌ ‌ముస్లిం అధిక సంఖ్యాక రాష్ట్రంగా మారిపోయింది. 1911లో ఆ విభజనను రద్దు చేశారు. దానితో ఆంగ్లేయుల పట్ల విధేయత ఒక్కసారిగా వ్యతిరేకతగా మారిపోయింది. దానికితోడు 1911-13 మధ్య జరిగిన బాల్కన్‌ ‌యుద్ధంలో ఆగ్నేయ ఐరోపా నుండి టర్కీ ఒట్టొమాన్‌లు వైదొలగవలసి వచ్చింది. బల్గేరియా, సెర్బియా, గ్రీసు, మాన్టెనీగ్రో, అల్బేనియా స్వతంత్ర దేశాలు అయ్యాయి. దానితో ఐరోపాలోని తన అధీనంలోని మిగతా భూభాగం టర్కీ చేజారింది. టర్కీ సామ్రాజ్య విచ్ఛిన్నం భారతీయ మత ఛాందసవాదులను తీవ్రమైన అసంతృప్తికి గురి చేసింది.

దానితో అలీఘర్‌ ‌విశ్వవిద్యాలయం ఆంగ్లపాల నకు వ్యతిరేక రాజకీయాలకు కేంద్రమైంది. టర్కీ పట్ల వారికి ఉన్న సీమాంతర విధేయత కారణంగానే వారు ఆంగ్ల పాలకులకు వ్యతిరేకులయ్యారు. బ్రిటన్‌కు వ్యతిరేకులుయ్యారు. షౌకత్‌ ఆలీ, మహమ్మదాలీ సోదరులు ఖిలాఫత్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. వీరు అలీఘర్‌ ‌మహమ్మదీయుల ఆంగ్లో ఓరియంటల్‌ ‌కాలేజీలో చదివన వారే. తర్వాత ఆ సంస్థకు ట్రస్టీలు కూడా అయ్యారు. ముస్లింలీగ్‌ ‌ప్రారంభకులు కూడా వారే. 1906 నుండి 1913 వరకు ముస్లింలీగ్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఆగాఖాన్‌ ‌ఖిలాఫత్‌ ఉద్యమాన్ని బలపరిచాడు. మహమ్మదాలీ ఒక ఆంగ్ల పత్రిక ‘కామ్రేడ్‌’‌ను, ఒక ఉర్దూ దినపత్రికను ప్రారంభించాడు. ఇంకొక ప్రముఖ నాయకుడు, ముస్లిం లీగ్‌ అధ్యక్షుడుగా పనిచేసిన మౌలానా హస్రత్‌ ‌మోహ్నీ కూడా అలీఘర్‌ ‌పూర్వ విద్యార్థే.

దేవ్‌బంద్‌ ‌స్కూలు

వాయువ్య ఉత్తరప్రదేశ్‌లో దేవ్‌బంద్‌ ‌గ్రామంలో 1867లో ఒక మసీదులో దార్‌-ఎల్‌- ఉలుమ్‌- అం‌టే విజ్ఞాన కేంద్రాన్ని ముగ్గురు మౌల్వీలు – ఖాసిమ్‌, ‌రషీద్‌ అహమ్మద్‌, ‌జుల్ఫికర్‌ అలీ ప్రారంభించారు. భారత ఇస్లామిక్‌ ‌సంప్రదాయాలను సరిచేసి, ఖురాన్‌లో చెప్పిన ఇస్లామిక్‌ ‌సామాజిక వ్యవస్థను దేశంలో నెలకొల్పటం వారి ఉద్దేశం. ప్రభుత్వ సహాయం మీద ఆధారపడకుండా ముస్లింల తోడ్పాటుతోనే ఆ సంస్థను నడిపించారు. జాతీయ రాజకీయాలకు, కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. ఆంగ్లేయుల నుండి కొన్ని మినహాయింపులు పొందటానికి హిందువులతో కలసి పనిచేయవచ్చుననీ, అయితే ఆ కార్యకలాపాలు ప్రాథమిక ఇస్లామిక్‌ ‌సూత్రాలకు విరుద్ధంగా ఉండకూడదనీ వారు ఫత్వా ఇచ్చారు (The Khilafat Movement: Religious Symbolism and Political Mobilisation in India, Gail Minault, Oxford University Press, 1982, p.26). అలీఘర్‌ ‌మేధావులు ఆలోచించినట్లుగానే ముస్లింల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే హిందువులతో కలసి పనిచేయాలని వీరు కూడా భావించారు.

ఈ ముగ్గురి మరణం తర్వాత దేవ్‌బంద్‌ ‌విజ్ఞాన కేంద్రం బాధ్యతను నిర్వహించిన మౌలానా మహమ్మద్‌ అల్‌-‌హసన్‌ (1851-1920) ఆ ‌తర్వాత కాలంలో రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నాడు. కేంద్ర ఖిలాఫత్‌ ‌కమిటీ ‘షేక్‌-అల్‌-‌హింద్‌’ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది. ముస్లింలీగ్‌ ‌ప్రారంభ సభ్యులలో ఒకరైన అజ్మల్‌ఖాన్‌ 1919‌లో దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1919-25 మధ్య కేంద్ర ఖిలాఫత్‌ ‌కమిటీకి ఉపాధ్యక్షుడిగా, 1921లో కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. డా।। ముక్తర్‌ అహమ్మద్‌ అన్సారీ కూడా ఖిలాఫత్‌ ‌కమిటీలోనూ, కాంగ్రెస్‌లోనూ ఏకకాలంలో పనిచేసారు. 1922లో ఖిలాఫత్‌ ‌కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించాడు.

ఆ తర్వాత టర్కీ, జర్మనీ, అఫ్ఘానిస్తాన్‌ల సహాయంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు కుట్రపన్నారని మహమ్మద్‌ అల్‌-‌హసన్‌, ‌మౌలానా సింధీలపై ఆంగ్లేయులు కేసుపెట్టారు (Silk letters conspiracy). హసన్‌ ‌మరో సహచరుడైన హుస్సేన్‌ అహమ్మద్‌ ‌మద్ని మరొక కుట్రదారుడు. వీరందరూ ఖిలాఫత్‌ ఉద్యమానికి నాయకత్వం అందించినవారే. 1920 అక్టోబరులో అలీఘర్‌లో జమియా మిలియా ఇస్లామియా (జాతీయ ఇస్లామిక్‌ ‌విశ్వవిద్యాలయం) ప్రారంభకులలో అల్‌హసన్‌, అజ్మల్‌ఖాన్‌, ఎమ్‌.ఏ. అన్సారీ మొదలైన వారు ఉన్నారు.

ఫిరంగి మహల్‌

ఔరంగజేబు కాలం నుండి లక్నోలో ఫిరంగి మహల్‌ ‌ప్రాంతం ఇస్లామిక్‌ అధ్యయన కేంద్రంగా ఉంది. ముల్లా నజీముద్దీన్‌ ‌వంశానికి చెందిన మౌలానా అబ్దుల్‌ ‌బారి విద్యాభ్యాసం ఫిరంగి మహల్‌లో మొదలైంది. మక్కా షరీఫ్‌  ‌హుస్సేన్‌ అలీతో ఆయనకు స్నేహం కుదిరింది. బారి టర్కీ సామ్రాజ్యంలో విస్తృతంగా పర్యటించి, 1908లో భారతదేశం వచ్చాడు. రెడ్‌‌క్రాస్‌కు పోటీగా ప్రారంభమైన రెడ్‌‌క్రిసెంట్‌కు నిధులు సమకూర్చి పెట్టాడు. ఈ క్రమంలోనే ఆయనకు అలీ సోదరులతోనూ, డా।। అన్సారీతోనూ పరిచయం పెరిగింది. 1912లో ఎమ్‌.‌కె. కిద్వాయ్‌ ‌ప్రభావం లోకి ఆయన వచ్చాడు. అలీ సోదరులతో కలసి అంజుమన్‌-ఇ-‌ఖుద్దాం-ఇ-కాబాను 1913లో ప్రారంభించాడు. కాబాతో పాటు ఇతర ముస్లిం పవిత్ర స్థలాలను పరిరక్షించటం అంజుమన్‌ ‌ముఖ్య ఉద్దేశం. ‘జమాయిత్‌-ఉల్‌-ఉలామా-ఇ-హింద్‌’‌ను 1919లో ఆయన ప్రారంభించాడు. 1921 వరకు హిందువులతో కలసి పనిచేయటం ముస్లిం ప్రయోజనాలకు హానికరమని, ఆయన భావించేవాడు. ముస్లిం మత పెద్దలకు, పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడ్డ ముస్లిం నాయకులకు మధ్య వారధిగా మౌలానా బారి పనిచేశాడు. The Khalifat Movement in India, 1919-24, Mohammad Naeem Quershi, Dissertation submitted to the University of London, 1973, pp 58)

అబుల్‌ ‌కలామ్‌ అజాద్‌

అజాద్‌ ‌పుట్టింది మక్కాలో. ఆయన తల్లి అరబ్బీ. ఆయన విద్యాభ్యాసం కలకత్తాలో జరిగింది. తొలినాళ్లలో సర్‌ ‌సయ్యద్‌ అహమ్మద్‌ ‌రచనలతో ఆయన  ప్రభావితమయ్యాడు. మధ్య ప్రాచ్యానికి చెందిన ఇస్లామిక్‌ ‌పండితుడు, రాజకీయ దురంధ రుడు, డెమాస్కస్‌ ‌మీద దాడిచేసిన మంగోలులను ఓడించటంలో కీలకపాత్ర పోషించిన వివాదాస్పద నాయకుడు ఇబ్న్ ‌తైమీయా (1263-1328) అంటే చివరివరకు అజాద్‌కు ఆరాధనా భావం ఉండేది. ఆయన ప్రభావంతో రాజకీయ జీవితంలో జిహాద్‌ను, మేధాపరమైన జీవితంలో ఇత్తేహాద్‌ (ఏకీకరణ)ను ఆయన ప్రచారం చేశాడు. ఇబ్న్ ‌బోధనలే వహాబిజమ్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల ఏర్పాటుకు మూలాధారం.

 అజాద్‌ అనేక ఉర్దూ పత్రికలను నడిపాడు. 1913లో ముస్లిం లీగ్‌లో చేరాడు. 1920 వరకు కొనసాగాడు. 1923లో తన 35వ ఏట కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన నడిపిన లేదా సంపాదకుడిగా వ్యవహరించిన పత్రికలలో టర్కీ వార్తలకు విశేష ప్రాధాన్యమిచ్చేవాడు. అజాద్‌ ఇలా రాసాడు ‘‘ఒట్టొమాన్‌ ‌ఖలీఫా ఇస్లామిక్‌ ‌పవిత్రస్థలాల పరిరక్షకుడు. టర్కీకి మద్దతును ఇవ్వటం అంటే ఇస్లాంకు మద్దతును ఇవ్వటమే.’ (Ideological Influence of Abdul Kalam Ajad, Quazi Mohammed Jamshed, Proceedings of the Indian History Congress, Vol.71, 2010-11, p.65)

జమాయిత్‌ -ఉల్‌-ఇ-‌హింద్‌

1919‌లో ఖిలాఫత్‌ ఉద్యమకాలంలో ఈ సంస్థను నెలకొల్పారు. వివిధ ఇస్లామిక్‌ ‌న్యాయ సంప్రదాయాలకు చెందిన పండితుల, న్యాయ నిపుణుల సంస్థగా ఇది మొదలైనప్పటికి, క్రమంగా దియోబందీ మతపెద్దల ప్రాబల్యంలోకి ఈ సంస్థ వచ్చింది. ఖిలాఫత్‌ ఉద్యమానికి సంపూర్తిగా మద్దతు పలికింది. ఒక జాతీయ ముస్లిం సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. దీని ఏర్పాటులో అజాద్‌ ‌కీలక పాత్ర పోషించారు. ఆ సంస్థ పేర్కొన్న ఆశయాలను గమనిస్తే, అందులో ఉన్న జాతీయ భావాలు ఏమిటో ఇట్టే అర్థమవుతాయి.

–              మత దృక్పథంతో రాజకీయ, రాజకీయేతర అంశాలలో ముస్లింలకు మార్గదర్శకత్వం చేయటం.

–              ఇస్లామిక్‌ ‌కేంద్రాలను, పవిత్రస్థలాలను, సంప్రదాయాలను పరిరక్షించటం.

–              ముస్లింల మతపరమైన, జాతిపరమైన హక్కులను సాధించి, వాటిని పరిరక్షించటం.

–              మత పెద్దలను ఉమ్మడి వేదికపైకి తీసుకొని రావటం.

–              ముస్లిం సమాజాన్ని సంఘటితపరచి, దాని నైతిక, సామాజిక సంస్కరణల కోసం పనిచేయటం.

–              ఇస్లామిక్‌ ‌మత గ్రంథాలు, షరియత్‌ అనుమతించిన మేర ముస్లిమేతరులతో సంబంధ బాంధవ్యాలను నెలకొల్పటం.

–              షరియత్‌ ‌లక్ష్యాలకు అనుగుణంగా దేశ, మత స్వాతంత్య్రాల కోసం పోరాటం చే•యటం.

–              వివాదాల పరిష్కారంకోసం మత న్యాయస్థానాలు ఏర్పాటు చే•యటం.

–              ఇస్లాంను భారతదేశంలో బయట, లోపల ప్రచారం చేయటానికి మిషనరీ కార్యకలాపాలు చేపట్టటం.

–              ఇస్లామిక్‌ ‌మత గ్రంథాలలో పేర్కొనినట్లు ఇతర దేశాల ముస్లింలతో కలసి మెలసి మెలగటం, సహోదరభావనను పెంచటం. (The Deoband School and The Demand for Pakistan, Ziya-Ul-Hassan-Foruqi, Asia Publishing House, 1963, pp. 68-69).

ఖిలాఫత్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి మతపెద్దల గురించిన వివరాలు సంగ్రహంగా తెలుసుకున్నాం. వారికి ఇస్లాం ప్రయోజనాలు కాపాడు కోవటమే ధ్యేయంగా ఉండేది. సెక్యులర్‌ ‌భావాలు వారికి గిట్టేవి కావు. భారతదేశపు స్వపరిపాలన, స్వాతంత్య్రం పట్ల వారికి శ్రద్ధాసక్తులు లేవు. టర్కీ సామ్రాజ్య పరిరక్షణ, ఖలీఫా గౌరవ మర్యాదలే వారికి ప్రధానం. ఆ వ్యవస్థను పరిరక్షించటానికి వారు కంకణం కట్టుకొన్నారు. హిందువులతో కలసి పనిచేయటం అనేది వారి ఇస్లామిక్‌ ‌లక్ష్యాల పరిరక్షణలో వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ మాత్రమే. బ్రిటిష్‌ ‌విద్యావేత్త థియోడర్‌ ‌మారిసన్‌ అలీఘర్‌ ఉద్యమం సందర్భంగా వారితో కలసి పనిచేసాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి, ‘ఎవరితో అయితే ఈ భూభాగంలో కలసి బ్రతుకుతున్నారో అట్టి సిక్కులతో కాని, బెంగాలీలతో కాని వారికి ఎట్టి అనుబంధం లేదు. జాతీయ భావన వారికి అసలే లేదు. వారి తోటి మతస్థులతోనే వారు అనుబంధం పెంచుకున్నారు. వారు ఏ దేశంలో ఉన్నా- అరేబియాలో ఉన్నా, పర్షియాలో ఉన్నా లేక భారతదేశంలో ఉన్నా – తోటి మతస్థులతోనే వారికి అనుబంధం తప్ప తమ దేశపు ఇతర మతాలకు చెందిన పౌరులతో వారికి ఎట్టి అనుబంధమూ లేదు’ (Roots of Islamic Separatism in Indian Sub-Continent, Omprakash, Proceedings of Indian History Congress, Vol.64, 2003, p.1053) ఖిలాఫత్‌కు నాయకత్వం వహించిన వారికి మోరిసన్‌ ‌చేసిన వ్యాఖ్యానం సరిగ్గా సరిపోతుంది.

‘ఇద్దరు మహనీయులు’ ఆ ఉద్యమానికి మద్దతుదారులుగా నిలిచారు. వారిద్దరు ఆతర్వాత వారి వారి దేశాలకు జాతిపితలయ్యారు. వారి గురించి తర్వాత తెలుసుకుందాం.

– ఆంగ్లమూలం: శ్రీరంగ గాడ్బొలే

డా।। బి. సారంగపాణి

About Author

By editor

Twitter
Instagram