వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం-2

మనస్సాక్షి కంటె మతగ్రంథాలే ముస్లిం ఛాందసవాదులకు ప్రామాణికం. మత ఛాందస వాసులకే కాదు. ఇస్లాంను భక్తి శ్రద్ధలతో అనుసరించే సామాన్య ముస్లింలు సైతం తమ మత గ్రంథాలలోని ఆదేశాలూ, మార్గదర్శక సూత్రాలూ తిరుగులేనివని భావిస్తూ ఉంటారు. దానితో వ్యక్తిగత స్థాయిలో కాని, ప్రాపంచిక స్థాయిలో కాని వారి ఆలోచనలు, ఆచరణలు మత గ్రంథాలను అనుసరించే ఉంటాయి. మంచి-చెడు, న్యాయం- అన్యాయం, జ్ఞానం – అజ్ఞానం, పవిత్రత – అపవిత్రత మొదలైన అంశాలను వారి మతగ్రంథాలే నిర్దేశిస్తాయి. వాటిలో చెప్పిన దానికి అనుగుణంగానే వైయుక్తిక, ప్రాపంచిక థృక్పథాలను వారు సవరించుకుంటారు. ఏర్పాటు చేసుకుంటారు. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు వారి గ్రంథాలలో చెప్పిన ‘సత్యాలు’, ‘ఆదేశాలు’, ‘ఆజ్ఞలు’ ‘ప్రవర్తన’ వర్తిస్తాయని వారి తిరుగులేని నమ్మకం. వాటికి భౌగోళిక, రాజకీయ, జాతిపరమైన హద్దులు ఉంటాయన్న వాస్తవాన్ని ఇస్లాం గుర్తించదు. ఏదేశంలో ఉన్నా, ఏ జాతికి చెందినవారైనా ఇస్లాంను అనుసరిస్తే వారందరూ ఒకే విధంగా బ్రతకాలనీ, స్పందించాలనీ ఇస్లాం ఆదేశిస్తుంది. దానితో అంతర్జాతీయ ముస్లిం ఏకీకరణ భావజాలం (Pan Islamism) వివిధ చారిత్రక సందర్భాలలో వ్యాప్తి చెంది, హింసాయుత పరిణామాలకు దారి తీసింది. భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక, జాతి పరమైన భేదాలను అధిగమించి ప్రపంచవ్యాప్త ఇస్లామిక్‌ ‌సమాజ స్థాపనకు ఛాందసవాదులు కలలు కంటూ ఉంటారు. ఆ భేదాలను అధిగమించటం కోసం మత మార్పిడులకీ, హింసోన్మాదానికీ వారు పూనుకొం టారు. రాజకీయ ఇస్లాం ప్రపంచానికి పెద్ద సవాలు.

ఖిలాఫత్‌ ఉద్యమం 1919-24 మధ్య మన దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టివేసింది. మత గ్రంథాల అనుమతి, సమ్మతి ఆ భావజాలానికి ఉన్న కారణంగా తిరిగి అటువంటి ఉద్యమం భవిష్యత్తులో తీసుకొని రాబడటానికి అవకాశాలు ఉన్నాయి. ఆనాటి ఉద్యమం కాలగర్భంలో కలసిపోయినా, అందుకు దారితీసిన భావజాలం గ్రంథాలలో, ముస్లిం మతపెద్దల మస్తిష్కాలలో సజీవంగా నిలిచి ఉండటమే అందుకు కారణం.

‘ఖలీఫా’ అనే పదం ఖురాన్‌లో 2.30, 4.59, 6.165, 35.39, 38.26 వచనాలలో కనపడు తుంది. మహమ్మద్‌ ‌ప్రవక్తకు వారసులు అన్న అర్థంలో ఆ పదాన్ని ఉపయోగించారు. మొట్టమొదటి ఇస్లామిక్‌ ‌పరిపాలకుడు మహమ్మద్‌ ‌ప్రవక్త సాధారణ యుగం 610లో ఆయన ప్రబోధించటం మొదలెట్టినా, మదీనా కేంద్రంగా ఆయన పాలన మొదలయింది 622వ సంవత్సరంలోనే. ఆ తర్వాత పది సంవత్స రాలు ఆయనే ప్రవక్త, పరిపాలకుడు, సైన్యాధిపతి, న్యాయ కోవిదుడు, ప్రధాన తీర్పరి. ఖురాన్‌ ‌కాని, మహమ్మద్‌ ‌ప్రవక్త కాని ఆయన వారసుడిని పేర్కొన లేదు. మహమ్మద్‌ ‌ప్రవక్తే అంతిమ ప్రవక్త కనుక (33:40), ఆయన తదనంతరం దైవదూతగా మరొకరు ఆ స్థానంలోకి వచ్చే అవకాశమే లేదు. అయితే పరిపాలకుడిగా ఆయన వారసుడిని నియమిం చేందుకు ఖురాన్‌ అం‌గీకరిస్తుంది (4:59). హాదీసు లోనూ అందుకు అనుగుణంగా అనేక ఆదేశాలనూ మనం గమనించవచ్చు.

అబూబకర్‌ (632-4), ఉమర్‌ (634-44), ఉతమాన్‌ (644-56), ఆలీ (656-61)లు మహమ్మద్‌ ‌ప్రవక్త వారసులుగా రాజ్యమేలిన మొదటి నలుగురు ఖలీఫాలు. సున్నీ ముస్లింలు. ఈ నలుగురి పరిపాలనా కాలాన్ని ఇస్లామిక్‌ ‌స్వర్ణయుగంగా భావిస్తారు. ఈ నలుగురు మహమ్మద్‌ ‌ప్రవక్త పుట్టిన ఖురేషి తెగకు చెందినవారు. వారి కాలంలో ఇస్లాం వ్యాప్తి అప్రతిహతంగా కొనసాగింది. ఇస్లామిక్‌ ‌సైన్యాలు సనానిద్‌ ‌చక్రవర్తులను ఓడించాయి. బైజాన్‌టైన్‌ ‌సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశాయి. దక్షిణ, మధ్య ఆసియాలోకి, ఉత్తర ఆఫ్రికా ఖండంలోకి చొచ్చుకొని వెళ్లాయి. అయితే ఆ ఇస్లామిక్‌ ‌స్వర్ణయుగం లోనే నలుగురు ఖలీఫాలలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారు. నాల్గవ ఖలీఫా ఆలీ తర్వాత అధికారం ఖురేషి తెగ నుండి ఉమయాద్‌లు చేజిక్కుంచుకొని 90 సంవత్సరాలు  పాలించారు. 750లో అబ్బాసిద్‌లు వారి నుండి అధికారం చేజిక్కించుకొని, బాగ్దాద్‌ ‌కేంద్రంగా పరిపాలించారు. 1517లో ఈజిప్టును టర్కీ ఒట్టొమాన్‌లు కైవసం చేసుకొనే వరకు బాగ్దాద్‌ ఇస్లామిక్‌ ‌మత కార్యకలా పాలకు కేంద్ర స్థానంగా ఉంది. టర్కీ ఒట్టొమాన్‌లు 1517 నుండి 1924 వరకు ఇస్లామిక్‌ ‌ప్రపంచానికి తిరుగులేని నాయకులుగా నాలుగు శతాబ్దాలపాటు శాసించారు. 1453లో కానిస్టాంట్‌నోపిల్‌ ‌వారి వశమయ్యాక క్రైస్తవ ప్రపంచానికి వ్యతిరేకంగా వారు అనేక యుద్ధాలు చేశారు. పాశ్చాత్య క్రైస్తన్యానికి పెద్ద సవాలుగా నిలిచారు.

ఇస్లామిక్‌ ‌దేశాల మధ్య ఐక్యత మిధ్య

‘ప్రపంచ ముస్లింలారా, ఏకంకండి’ అన్నది నినాదంగా ఆకర్షణీయంగా అనిపించినా, ముస్లిం రాజ్యాల మధ్య చరిత్రలో ఎన్నడూ ఐక్యత లేదు. వాటి మధ్య నిరంతరం ఆధిపత్య పోరు జరుగుతూనే ఉండేది. తమ ఆధిపత్యాన్ని అంగీకరించని ఇస్లామిక్‌ ‌రాజ్యాధినేతలను ‘ఇస్లామిక్‌ ‌ద్రోహులు’గా ముద్రవేసి యుద్ధాలకు దిగేవారు. అవిశ్వాసుల విషయంలోనే వారందరూ ఉమ్మడిగా నిలబడేవారు తప్ప, వారిలో వారికి  ఎప్పుడూ కయ్యాలూ, కబ్జాలే. మహమ్మద్‌ ‌ప్రవక్త మరణించిన కేవలం రెండు దశాబ్దాల తర్వాత షియాలు ఆలీకి ముందున్న ఖలీఫాలను గుర్తించటానికి ఇష్టపడలేదు. మరికొన్ని తెగలవారు అసలు ఖలీఫాయే అవసరమేలేదన్నారు. సున్నీ ముస్లింలు సైతం ఖలీఫా మహమ్మద్‌ ‌ప్రవక్త తెగకు చెందినవాడై ఉండాలా లేదా అన్న విషయమై ఎడతెరిపి లేని చర్చ జరిపారు.

750 సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక ఇస్లాం మత పాలకుడు లేదా ఖలీఫా లేనే లేడు. ఇస్లామిక్‌ ‌దేశాలలో రాజులు, చక్రవర్తులు ఎవరికి వారు తమకు తాముగా ఖలీఫాలు ప్రకటించుకొన్నారు. 1258లో మంగోలులు బాగ్దాద్‌పై దాడిచేసి నాశనం చేశారు. దానితో ఖిలాఫత్‌ ‌కేంద్రంగా బాగ్దాద్‌ ‌శకం ముగిసింది. కొంత కాలంపాటు కైరో, ఆ తర్వాత ఒట్టొమాన్‌ ‌కానిస్టాంటి నోపిల్‌ ఇస్లామిక్‌  ‌కేంద్ర స్థానాలయ్యాయి.

711లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు. మొగలాయిలు పాలన ప్రారంభం అయ్యేవరకు విదేశీ ముస్లిం పాలకులు ముందు బాగ్దాద్‌ అబ్బాసిద్‌లకు, ఆ తర్వాత కైరోకు తమ విధేయతలను ప్రకటించారు. మహమ్మద్‌ ‌గజనీ (998-1030), షంషుద్దీన్‌ ఇల్‌టుట్‌మిష్‌ (1211-36), ‌మహమ్మద్‌ ‌బీన్‌ ‌తుగ్లక్‌ (1325-51) ఆయా కాలపు ఖలీఫాల నుండి అనుమతి పత్రాలను, బిరుదులను పొందటం గర్వంగా భావించేవారు. తాము ముద్రించిన నాణెలు అబ్బాసిద్‌ ‌ఖలీఫాల పేరుతో ఉండేవి. 1526లో మొగలాయిల భారత దేశం మీద దాడి చేశారు. అదే సమయంలో ముస్లిం మత రాజ్యాధికారానికి కేంద్రంగా కానిస్టాంటినోపిల్‌ ‌వెలిసింది. అధికారం కైరో నుండి కానిస్టాంటినోపిల్‌కు బదలీ అయ్యింది. కాని మొగలాయిలు ఖలీఫా అధికారాన్ని గుర్తించలేదు. పర్షియా చక్రవర్తులు సైతం ఇదే పంథాను అనుసరించారు. మొగలాయిల రాజ్యం విచ్ఛిన్నం అవటం మొదలైన తర్వాతే, అంటే 18వ శతాబ్దపు ఉత్తర భాగంలో భారతదేశ మత ఛాందస వాదులు టర్కీ ఒట్టొమాన్‌లపట్ల అభిమానం చూపటం మొదలెట్టారు. ప్రముఖ సూఫీ షావాలీ ఉల్లా (1730-62) టర్కీ సుల్తాన్‌ను ప్రశంసించటం కనపడుతుంది. టిప్పు సుల్తాన్‌ ‌సైతం ఒట్టొమాన్‌ ‌ఖలీఫా అబ్దుల్‌ ‌హమీద్‌ ‌గుర్తింపు కోసం ఆరాటపడ్డారు.

టర్కీ పట్ల పెరిగిన సీమాంతర విధేయత

1840వ దశకం నుండి టర్కీ చక్రవర్తుల పట్ల భారతదేశంలో భక్తి ప్రపత్తులు పెరగటం మొదలె ట్టాయి. షావాలీ ఉల్లా మనుమడు షా మహమ్మద్‌ ఇషాక్‌ (1778-1846) 1841‌లో మక్కా వలసవెళ్లాడు. టర్కీ రాజకీయ విధానాలకు  మద్దతు ప్రకటించాడు. ప్రముఖ ఇస్లామిక్‌ ‌పండితుడిగా ఆయనకు పేరుంది. ఆయన ప్రభావం భారతీయ ముస్లింలపై గాఢంగా పడింది. 1854లో అప్పటి గవర్నర్‌ ‌జనరల్‌ ‌డల్‌హౌసీ భారతీయ ముస్లింలకు టర్కీ  ఇస్లామిక్‌ ‌సామ్రాజ్యం పట్ల ఉన్న వీర విధేయత, ప్రగాఢ అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

టర్కీ పట్ల పెరుగుతున్న సీమాంతర విధేయత చాలా దూరమే వెళ్లింది. టర్కీ చేసిన యుద్ధాలలో ఆ దేశమే విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం, అలాంటి ఆకాంక్షలకు ఆ విధేయత దారితీసింది. 1854లో  రష్యా, టర్కీల మధ్య క్రిమియా యుద్ధం జరిగింది. ఇంగ్లండ్‌, ‌ఫ్రాన్స్ ‌మద్దతుతో టర్కీ ఆ యుద్ధంలో విజయం సాధించింది. దేశంలో ఇస్లామిక్‌ ‌పాలన అవశేషాలు అంతరించాక, ఆంగ్ల వలస పాలన సుస్థిరమయ్యాక, భారతీయ ముస్లిం ఛాందసవాదులు, మత పెద్దలు స్ఫూర్తి కోసం టర్కీ పట్ల వీర విధేయులుగా తయారయ్యారు. అనేకమంది ముస్లిం మతపెద్దలు క్రైస్తవ ఆంగ్ల పాలనలో పాలితులుగా ఉండటం ఇష్టంలేక కైరోకు, కానిస్టాంట్‌నోపిల్‌కు వలస వెళ్లటం మొదలెట్టారు. ముస్లిం మతపెద్దలు మాత్రమేకాక ముస్లిం పాత్రికేయులలోను, ఆలోచనాపరులలోను అప్పటి నుండి టర్కీ పట్ల వీర ఆరాధన పెరగసాగింది. 1875లో రష్యా టర్కీల మధ్య, 1896లో టర్కీ, గ్రీసుల మధ్య జరిగిన యుద్ధాలలో టర్కీ విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రమంగా ముస్లిం సమాజం టర్కీతో మానసిక అనుబంధాన్ని పెంచుకున్నది. సర్‌ ‌సయ్యద్‌ అహమ్మద్‌ (1817-98) ‌వంటి వారు టర్కీ కేంద్రంగా ఉన్న ఖిలాఫత్‌ ‌వ్యవస్థ ముస్లింలకు ఆరాధనీయమైనదన్న భావనను ప్రాచుర్యంలోకి తెచ్చారు.

టర్కీ పట్ల వీర ఆరాధన, వీర విధేయత కేవలం భారతీయ ముస్లిం వర్గాలకే పరిమితం కాలేదు. మధ్య ఆసియా, ఇండో నేషియా, మలేషియా ముస్లిం వర్గాలలో సైతం 17వ శతాబ్దం నాటికే అలాంటి భావనలు ప్రబలాయి. టర్కీ సుల్తాన్‌ అబ్దుల్‌ అజాజ్‌ (1861-76), ఆయన వారసుడు రెండవ హమీద్‌ (1876-99) ఈ ‌విధేయతను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. అంతర్గత సంక్షోభాలను అధిగమించటానికి, తమ అధీనంలోని అరబ్బు భూభాగంలో పెల్లుబుకుతున్న స్వతంత్ర పిపాసను అణచివేయటానికి, పాశ్చాత్యుల ఆధిక్యతకు అడ్డుకట్టవేయటానికి ఆ విధేయతను వాడుకున్నారు. ప్రపంచ ముస్లింలకు నాయకత్వం వహించే అర్హత తమకు ఉందని తమ నాయకత్వాన్ని అంగీకరించాలనే ప్రచారానికి పూనుకొని తమపట్ల పెరుగుతున్న సీమాంతర విధేయతను అలా తెలివిగా వాడుకొ న్నారు. టర్కీ ఒట్టొమాన్‌ ‌చక్రవర్తులకు కొన్ని పాశ్చాత్యదేశాలు వారి అవసరార్థం మద్దతు పలికాయి. షియాలు సైతం సున్నీలతో కలసి ఒట్టొమాన్‌కు మద్దతు పలికారు. మనదేశంలో బద్రుద్దీన్‌ ‌తాయబ్జీ, చిరాగ్‌ ఆలీ, అమీర్‌ ఆలీ, ఆగాఖాన్‌, ‌మహమ్మదాలీ జిన్నా వంటి ముస్లిం నాయకులు సైతం టర్కీ పట్ల ఆరాధానా భావంతో ఉండేవారు.

పై అంశాలను గమనించినప్పుడు 1919లో దేశంలో చేపట్టిన ఖలాఫత్‌ ‌పునరుద్ధరణ ఉద్యమానికి ఉన్న చారిత్రక, మత ప్రాతిపదికలు అవగాహనకు వస్తాయి. ఇస్లాంకు ఒక కేంద్రీకృత మత వ్యవస్థ ఉండాలన్న ఆలోచన, అది ఆచరణలో సాధ్యమైనా కాకపోయినా, సుల్తాన్‌లు, బాద్‌షాలు, ఆలోచనా పరులు, ముస్లిం మత పెద్దలు, ఛాందసవాదులకు బలంగా ఉండేది. అది భారతదేశానికే పరిమితమైన ఆకాంక్ష కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో వారి గ్రంథాలలో చెప్పిన దానికి అనుగుణంగా అట్టి వ్యవస్థ ఏలుబడిలో తామంతా తమ తమ జీవితాలు గడపాలని వారు భావిస్తూ వచ్చారు. అయితే దానికి ఏ దేశం, ఏ తెగకు చెందిన వారు నాయకత్వం వహించాలి అన్న దానిమీద ఏకాభిప్రాయం లేదు. బలవంతుడిదే రాజ్యం కాబట్టి, ఒట్టొమాన్‌ల కాలంలో తురుష్కులు ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

అయితే 1924 మార్చి 3న టర్కీ రిపబ్లిక్‌ ‌ఖిలాఫత్‌ ‌వ్యవస్థను రద్దు చేసింది. కెమల్‌ అటాటుర్క్ ‌మాట్లాడుతూ నాగరిక ప్రపంచం దృష్టిలో నవ్వులు పాలైన వ్యవస్థగా దానిని అభివర్ణించారు. ఈ వ్యవస్థ పునరుద్ధరణకు జరిగిన ఉద్యమాలలో భారతదేశంలో ఎగిసి, ఆగిపోయిన ఉద్యమం పెద్ద విరామం మాత్రమే. 1924 తర్వాత అనేక సందర్భాలలో ఈ వ్యవస్థ పునరుద్ధరణకోసం ప్రముఖ ముస్లిం నాయకులు పిలుపు ఇస్తునే ఉన్నారు. ఇటీవలి కాలంలో ముల్లా మహమ్మద్‌ ఉమర్‌, ‌తాలిబాన్‌, అబూబకర్‌ ‌బాగ్దాదీ, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌ఖిలాఫత్‌ ‌పునరుద్ధరణ కోసం గట్టిగా కృషి చేసిన వాస్తవం తెలుస్తుంది. అంటే ఖిలాఫత్‌ ఉద్యమం కొనసాగుతూనే ఉన్న ఉద్యమంగా మనం గమనించవచ్చు.

ఆంగ్లమూలం : శ్రీరంగ గాడ్బొలే

అను : డా।। బి. సారంగపాణి

వచ్చేవారం.. ఆ వందేళ్ల కాలంలో

By editor

Twitter
Instagram