వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం – 3

ఖిలాఫత్‌.. ‌జిహాద్‌.. ‌భారత్‌

1919-24 మధ్య దేశంలో జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమానికి ఉన్న చారిత్రక, మత నేపథ్యం గురించి మొదటి రెండు భాగాలలో తెలుసుకున్నాం. ఆధునిక కాలంలో టర్కీ ఒట్టొమాన్‌ల పట్ల వీరవిధేయత దేశంలో క్రమంగా పెరిగింది. ఆ వీరవిధేయత మొదట సూఫీ సన్యాసుల నుండి ముస్లిం మతపెద్దలకు, తర్వాత ఉన్నత వర్గ ముస్లింలకు, ఆ తర్వాత ముస్లిం పాత్రికేయులకు 1830వ దశకం నుండి ప్రారంభ మైందని చరిత్ర చెప్పే వాస్తవం. అంతకముందు గడచిన శతాబ్ది కాలంలో ఆ వీరవిధేయత పెరగటా నికి కావలసిన సైద్ధాంతిక భూమికను తయారు చేశారు.

1857లో జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింలు హిందువులతో పాటు సమానంగా, చురుకుగా పాల్గొన్నారు. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంగ్రామంలో విజయం సిద్ధిస్తే భారత దేశాన్ని ఎవరు పాలించాలి? ఈ ప్రశ్నకు జవాబు హిందువులు ఆలోచించలేదు. ముస్లింలకు ఇది జవాబు లేని ప్రశ్నేమీ కాదు. అంతకుముందు వేయి సంవత్సరాలపాటు దేశంలో కొనసాగిన విదేశీ ముస్లిం పాలనకు ఆంగ్లేయులు చరమగీతం పాడారు. అయితే ఆంగ్లేయుల ఏలుబడిలో దార్‌-ఉల్‌-ఇస్లాంగా ఉన్న భారతదేశం దార్‌-ఉల్‌-‌హబ్‌గా మారిపో యిందని ముస్లిం ఛాందసవాదులు భావించారు. అంటే ముస్లింలకు నివాసయోగ్యం కాని దేశంగా మారిపో యిందని ఆ మతపెద్దలు భావించారు. కనుక 1857 విప్లవంలో విజయం భారతీయులను వరించి ఉంటే ఇస్లామిక్‌ ‌పాలన పునరుద్ధరణ జరిగి ఉండేది. ప్రత్యామ్నాయం వారిని తృప్తిపరిచేది కాదు.

డా।।బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ 1857 ‌స్వాతంత్య్ర సంగ్రామం జిహాద్‌ ‌స్వభావాన్నీ దానికి ఖిలాఫత్‌ ఉద్యమానికి మధ్య ఉన్న సంబంధాన్నీ విశ్లేషిస్తూ ఈ విధంగా రాశారు. ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను పరిశీలిస్తే, ఆ తిరుగుబాటు ఆంగ్లవలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన జిహాద్‌ అనే వాస్తవం గుర్తించటానికి ఎంతో సమయం పట్టదు. ఆంగ్లవలస పాలకులు ఆక్రమించిన కారణంగా భారతదేశం దార్‌-ఉల్‌-‌హబ్‌గా మారి పోయిందని సయ్యద్‌ అహమ్మద్‌ ‌దశాబ్దాల పాటు ముస్లింలకు చేసిన ప్రబోధాల ఫలితంగానే ఆ తిరుగు బాటులో వారు పాల్గొన్నారు. ఆ తిరుగుబాటు దార్‌-ఉల్‌-‌హబ్‌గా మారిన భారతదేశాన్ని దార్‌- ఉల్‌-ఇస్లామ్‌గా తిరిగి మార్చటానికి చేసిన ప్రయత్నం. 1919లో అఫ్ఘానిస్తాన్‌ ‌భారతదేశంపై దాడి చే•యటానికి కూడా అదే కారణం. ఖలీఫా ఆంగ్లేయు లకు వ్యతిరేకంగా జోక్యం చేసుకోవటానికి నిరాక రించిన కారణంగా కొందరు భారతీయ ముసల్మానులు భారతదేశంపై అఫ్ఘ్ఘానిస్థాన్‌ ‌దాడికి కుట్ర చేశారు’ (Pakistan or the Partition of India, Vol. 8, Government of Maharastra, 1990, .295)

1857కు ముందు జరిగిన

ముస్లిం ఏకీకరణ ఉద్యమాలు

వలస పాలన దేశంలో ప్రారంభమై, రాజ్యాధి కారం ముస్లింల చేతుల్లో నుండి ఆంగ్లేయులకు బదలీ అవుతున్న కాలంలో ఇస్లాంను కాపాడుకొనే ప్రయత్నం జరిగింది. అందుకు కృషి చేసిన వారిలో 18వ శతాబ్దికి చెందిన షావాలీ ఉల్లా ప్రముఖుడు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలందరూ ఏకం కావాలని ఒక ఖలీఫా ఏలుబడిలో జాతిభేదాలు మరచి ముస్లిం లంతా కలసిమెలసి మనుగడ సాగించాలని ఆయన బోధించాడు. పూర్వవైభవం సాధించేందుకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జిహాద్‌ ‌చేయవలసిన అవసరం గురించి ప్రభోదించేవాడు. ఒక తరం ముస్లిం పండితులందరూ ఆయన ప్రభావానికి లోనయ్యారు. తమ పొరుగున ఉన్న ముస్లిమేతరులతో ఎంత తక్కువ సంబంధం కలిగి ఉంటే అంత ఎక్కువగా అల్లా దయకు పాత్రులు అవుతారని కూడా షావల్లీ ఉల్లా ప్రబోధించేవారు. (The Muslims of British India, P. Hardy, Cambridge University Press, 1972, pp 29-30). 1857 స్వాతంత్య్ర సంగ్రామ సందర్భంలో కాని, ఖిలాఫత్‌ ఉద్యమకాలంలో కాని ముస్లిం నాయకత్వం వారి అవసరార్థం హిందువులతో కలిసారు తప్ప, హిందూ ముస్లిం ఐక్యత పట్ల వారికేమీ మక్కువలేదు.

మహారాజా రంజిత్‌సింగ్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధానికి పిలుపును ఇచ్చిన సయ్యద్‌ అహమ్మద్‌ ‌బరేల్వి బెంగాల్‌లో ముస్లింల శుద్ధి ఉద్యమానికి ఆద్యుడు. ఎన్నో తరాల క్రితం బలవంతంగా ముస్లింలుగా మారినా, పూర్వ హిందువులు తమ విశ్వాసాలను వదులుకోలేదు. హిందువుల పండు గలలో పాల్గొనేవారు. ప్రసిద్ధి చెందిన ఆలయాలను దర్శించేవారు. మంచిచెడుల కోసం బ్రాహ్మణ పండితులను సంప్రదించేవారు. ముస్లిం మత ఛాందసవాదులకు ఇది నచ్చలేదు. వీటన్నిటికి వ్యతిరేకంగా బర్వేలి పెద్ద ప్రచారాన్ని నిర్వహించాడు. ఏ ముస్లిం కూడా తమ పాత అలవాట్లును, హిందూ మత సంప్రదాయాలను గౌరవించకూడదని ప్రబో ధించాడు. బెంగాల్‌కు చెందిన టిటూమీర్‌ ఇం‌కొక అడుగు ముందుకు వేసి వేషభాషలలో ముస్లింలు తమ ప్రత్యేకతను నిలుపుకోవాలని, గడ్డాలు పెంచాలని ప్రబోధిస్తూ ఊరూరు తిరిగాడు.

ఈ ఛాందసవాదుల లక్ష్యం ఒక్కటే. రాజ్యాధి కారం జారిపోయింది, సంఖ్యాబలాన్ని కాపాడు కోవటం, ప్రత్యేక అస్థిత్వాలను నిలుపుకోవటం, పూర్వ హిందువులు తిరిగి తమ మతంలోకి వెళ్లకుండా నిరోధించటం. చాలావరకు వారు అనుకొన్నది సాధించగలిగారు కూడా.

ఆంగ్లవలస పాలకులు ముస్లిం వేర్పాటు శక్తుల ఆకాంక్షలను గమనించారు. 1838లో మొదటి అఫ్ఘాన్‌ ‌యుద్ధసమయంలో వహాబీ తెగకు చెందిన ముస్లింలు అఫ్ఘాన్‌ ‌పక్షం వహించి, వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. అంతేకాక ఆంగ్లేయుల సైన్యంలో ఉన్న ముస్లిం సైనికులును తిరుగుబాటు చే•యమని ప్రోత్సహించారు.

1857 స్వాతంత్య్ర సంగ్రామమా? జిహాదా?

1857 భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి హిందువుల ఆలోచనలు ఒక రీతిగా ఉంటే ముస్లింల, ఆంగ్లేయుల ఆలోచనలు మరొకరీతిగా ఉన్నాయి. ముస్లింలకు అది జిహాద్‌. ఆం‌గ్లేయులకు సిపాయిల తిరుగుబాటు. హిందువుల దృష్టిలో అది పప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ప్రముఖ చరిత్రకారుడు థామస్‌ ‌మెట్‌కాల్ష్ ఇలా రాశాడు. ‘అసంతృప్తి జ్వాలలు మొదటిగా హిందూ సిపాయీలలో వచ్చినాయి. ముస్లింలు వాటికి ఆజ్యం పోసి, ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు ముందుకు ఉరికారు. హిందూ, ముస్లిం సైనికుల మత సంబంధమైన అసంతృప్తిని వాడుకొని రాజ్యాధికారం తిరిగి కైవసం చేసుకోవాలని  కుట్రపన్నారు. ఆంగ్లేయుల దృష్టిలో అది కేవలం ముస్లింల పన్నాగం. సిపాయీల తిరుగుబాటును ఆధారంగా చేసుకొని తమను దేశం నుంచి తరిమికొట్టాలని ముస్లిం నాయకత్వం చేసిన పెద్దకుట్రగా ఆంగ్లేయులు భావించారు’ (The After Math of Revolt: India 1857-70, Princeton, 1965, p 298).

ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌లలో వివిధ ప్రాంతాలలో 1857 మే, జూన్‌ ‌నెలలలో జరిగిన తిరుగుబాటులో సైనికులతో పాటు, ఆయుధాలు చేపట్టిన జిహాదీలు కూడా పాల్గొన్నారు. గ్వాలియర్‌ ‌వంటి ప్రాంతాలలో ముస్లిం సిపాయిలే నాయకత్వం వహించారు. అలహాబాద్‌, ‌లక్నో, గ్వాలియర్‌లలో చెలరేగిన జిహాదీలకు నాయకత్వం వహించింది కొందరు సూఫీ సన్యాసులు. వహాబీలు 1857 జిహాద్‌లో చేరటానికి కొంత సంకోచించారు. ఆంగ్ల పాలకులకు వ్యతిరే కంగా హిందూ ప్రముఖులతో కలసి పనిచేయటం సిద్ధాంతపరంగా వారికి నచ్చలేదు. వారి దృష్టిలో హిందువులు పాలితులు మాత్రమే. పాలకులు పాలితులతో కలిసి ఉద్యమించటం తమ స్థాయికి తగినదికాదని వారు భావించారు (The Wahabis in the 1857 Revolt: A Brief Reapprisal of their role, Iqtidar Alam Khan, Social Scientist, Vol 41, May – June 2013, p 17, 19)

మే 11, 1857న ఢిల్లీ నగరం భారతీయుల (తిరుగుబాటుదారుల) వశం అయ్యాక చ్టిచివరి మొగలాయి చక్రవర్తి బహుదూర్‌షా జాఫర్‌ ‌ముఖ్య సైన్యాధికారిగా బఖ్తిఖాన్‌ను నియమించాడు. ఖాన్‌ 100 ‌మంది జిహాదీలతో ఢిల్లీ చేరాడు. హిందూ- ముస్లింల ఐక్యతను కొనసాగించటం పట్ల వారికి నిష్టలేదు. మే 20, 1857న ఒక ప్రముఖ మౌల్వి మొహమ్మద్‌ ‌సయ్యద్‌ ‌చక్రవర్తికి ఇచ్చిన ఒక అభ్యర్ధనలో ఈ విధంగా పేర్కొన్నాడు. ‘హిందువులకు వ్యతిరేకంగా పవిత్రయుద్ధం కోసం ముస్లిం సైనికులను రెచ్చగొట్టాం’. జూన్‌ 14‌న ఆంగ్లేయుల మేజర్‌ ‌జనరల్‌ ‌పంజాబు చీఫ్‌ ‌కమీషనర్‌కు ఒక లేఖ రాస్తూ, ‘ముస్లింలు తమ ఆకుపచ్చ జెండాను ఢిల్లీలో ప్రదర్శిస్తూ, హిందువులను బెదిరిస్తున్నారు. బెనారస్‌లో కొన్ని దేవాలయాలపై ఆకుపచ్చ జెండాలను ఎగరవెయ్యాలన్న కుట్ర జరుగుతున్నది’ అని హెచ్చరించాడు. (Sepoy Mutiny and the Revolt of 1857, R.C. Majumdar, 1957, p 230). 1857 స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన ముస్లిం ప్రముఖులు తిరుగుబాటు విఫలం అయ్యాక దేశం విడిచి మక్కా, కైరో, కానిస్టాంట్‌ ‌నోపిల్‌ ‌వంటి ప్రముఖ ముస్లిం కేంద్రాలకు పారిపోయారు. వారికి అక్కడి వారు ఆశ్రయం కల్పించారు. ((Fugitive Mullahs and Outlawed Fanatics: Indian Muslims in the 19th Century Trans – Asiatic Imperial Rivalaries, Seema Alavi, Modern Asian Studies, Vol 45, Nov 2011 pp. 1337-1382)

రౌలట్‌ ‌కమిటీ నివేదిక

ఆంగ్లేయులు నియమించిన రౌలత్‌ ‌కమిటీ 1918 లో 226 పుటల సుదీర్ఘ నివేదికలో ఆంగ్లపాలకులకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలను, కుతంత్రాలను పేర్కొన్నారు. 178, 179 పుటలలో ముస్లింల వైఖరి గురించి ఈవిధంగా పేర్కొన్నారు.

–        క్రిమియన్‌ ‌యుద్ధం సందర్భంలో  భారతీయ ముస్లింలు టర్కీ పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు.

–        కొన్ని ముస్లిం ఛాందసవాదవర్గాలలో తిరిగి ఇస్లామిక్‌ ‌పాలనను నెలకొల్పాలనే ఆకాంక్ష ప్రబలంగా ఉంది.

–       వాయువ్య సరిహద్దు ప్రాంతం నుండి బయ• దేశాల నుండి ముస్లింలు దాడి చెయ్యాలని, అదే సమయంలో దేశంలోని ముస్లింలు తిరుగుబాటు చెయ్యాలని పన్నాగం పన్నారు.

–    కొందరు ప్రముఖ ముస్లిం నాయకులు వాయువ్య సరిహద్దు ప్రాంతం నుండి టర్కీ చేరుకుని, మిలటరీ గవర్నర్‌ ‌నుండి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1916లో జిహాద్‌ ‌ప్రకటనను భారతదేశానికి  తీసుకొని వచ్చారు.

–       ఆ జిహాద్‌లో పాల్గొనేందుకు దేశమంతటా ‘పవిత్రయోధులను’ సమకూర్చుకోవాలని, మదీనా ప్రధాన కేంద్రంగా కానిస్టాంట్‌నోపిల్‌, ‌టెహ్రాన్‌, ‌ట్రిపోలీ ఉపకేంద్రాలుగా సైనిక వ్యూహాలకు పదును పెట్టాలని కుట్రపన్నారు.

ఇంగ్లండులో నివసిస్తున్న ముస్లింల పాత్ర కూడా కీలకమైందే. 1886లోనే అంజుమాన్‌ – ఇ-ఇస్లామ్‌ అనే సంస్థను ఇంగ్లండ్‌లో నెలకొల్పారు. 1903 ఆ సంస్థను పునరుద్ధరించి ‘పాన్‌ ఇస్లామిక్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌లండన్‌’ అని పేరు పెట్టారు. టర్కీ పాలకులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవటంతో పాటు ‘పాన్‌ఇస్లామ్‌’ అనే పత్రికను కూడా నడిపారు. టర్కీ, ఇస్లామ్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ పత్రిక దృష్టిపెట్టింది. 1911లో బ్రిటన్‌, ‌ఫ్రాన్స్‌ల సహకారంతో ఇటలీ ట్రిపోలీ మీద దాడి చేసినప్పుడు, భారతదేశపు ముస్లింలు నొచ్చుకొన్నారు. టర్కీకి సహాయంగా సైనికులును, వైద్యులను, నిధులును పంపటానికి ప్రత్యేక యత్నాలు చేశారు. లాహోర్‌ ‌నుండి మద్రాసు వరకు ఉన్న ముస్లింలు వారు సున్నీలు అయినా, షియాలు అయినా ఉత్సాహంగా నిధులు సమకూర్చి పెట్టారు. షియాల మద్దతుకోసం సున్నీలు రష్యా ఉత్తర పర్షియాను ఆక్రమించటాన్ని పెద్దపెట్టున ఖండించారు కూడా (•ష్ట్రవ ఖష్ట్ర•శ్రీఱ••• వీశీఙవఎవఅ• ఱఅ ×అ•ఱ•, 1919-24, వీశీష్ట్ర•ఎఎ•• చీ•వవఎ •బవతీష్ట్రఱ, ణఱవతీ•••ఱశీఅ బఎఱ••వ• •శీ •ష్ట్రవ •అఱఙవతీఱ•• శీ• •శీఅ•శీఅ, 1973, జూజూ 19-23).

1912 అక్టోబరులో బాల్కన్‌ ‌దేశాలు ఉమ్మడిగా •ర్కీ మీద దాడి చేసినప్పుడు భారతీయ ముస్లింలు దాన్ని జీర్ణించుకోలేకపొయారు. తమ నిరసనను తీవ్రంగా తెలియచేశారు. ‘ఇస్లాం ప్రమాదంలో పడింది’ అనే నినాదాన్ని ఎత్తుకొన్నారు. అబుల్‌ ‌కలామ్‌ ఆజాద్‌ ‌జిహాద్‌కు సమయం ఆసన్నమయిందని ప్రకటించాడు. షౌకత్‌ ఆలీ ‘కామ్రేడ్‌’ ‌పత్రికలో టర్కీకి నిధులను, స్వచ్ఛందసేవకులను పంపేందుకు ప్రకటనలు ఇచ్చాడు. ఆయన సోదరుడు మహమ్మద్‌ అలీ అలీఘర్‌ ‌విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన నిధులను టర్కీకి అప్పుగా అందివ్వాలని డిమాండ్‌ ‌చేశాడు. డా।। ముక్తర్‌ ‌మహమ్మద్‌ అన్సారీ 1912 డిసెంబరులో కానిస్టాంట్‌నోపుల్‌ ‌చేరుకొని టర్కీ యంగ్‌టర్కు నాయకులతోనూ, ఈజిప్టు జాతీయ వాదులతోనూ సంప్రదింపులు జరిపాడు. టర్కీ దేశ భద్రతా బాండ్లను కొనుగోలు చేసి, ఉదారంగా నిధులు ఇమ్మని ‘కామ్రేడ్‌’ ‌పత్రికలో పిలుపును ఇచ్చాడు.

ప్రపంచవ్యాప్త ముస్లిం సమాజంతో అనుబంధం పెంచుకొనేందుకు 1913 మేలో ‘కాబాసేవకుల సంఘం’ను నెలకొల్పారు. రెండు లక్ష్యాలకోసం ఆ సంఘం పనిచేయటం మొదలెట్టింది. మొదటిది ముస్లిమేతర దాడులను ప్రతిఘటించటానికి ముస్లింలను సంఘటిత పరచటం. రెండవది ఇస్లామిక్‌ ‌సామ్రాజ్యంగా, శక్తిమంతమైన రాజ్యంగా, టర్కీ ఎదగటానికి తోడ్పడటం. భారత ముస్లిం ఛాందస వర్గాల కంటే విధేయత కలిగిన పంచమాంగదళం టర్కీకి ఎక్కడనుండి వస్తారు? తమంత తాముగా టర్కీ యోగక్షేమాలకోసం నిరంతరం తపించే ఈ సీమాంతర విధేయులకు ఆయుధాలను సమకూరిస్తే, ఏనాటికైనా తమకు ఉపయోగపడతారన్న కుతంత్రంతో టర్కీ ఆయుధాలను సరఫరా చేయటానికి ఒక జర్మనీ సంస్థతో  సంప్రదింపులు కూడా జరిపింది. ముస్లిం ఛాందసవర్గాలు దేశమంతటా మసీదులలో టర్కీ అనుకూల ప్రసంగాలు చేసి, సామాన్య ముస్లింలను సైతం మతోన్మాదులుగా తయారుచేశారు. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యేనాటికి భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు ముస్లింలు రెచ్చిపోవటానికి అనువుగా ఉన్నాయి. పేలటానికి సిద్ధంగా ఉన్న మందుగుండు సామాగ్రికి అగ్గిపుల్ల వెలిగించటమే తరువాయి.

వచ్చేవారం.. ఖిలాఫత్‌కు నాయకత్వం ఎవరిది?

ఆంగ్లమూలం : శ్రీరంగ గాడ్బొలే

అను : డా।। బి. సారంగపాణి

About Author

By editor

Twitter
Instagram