– ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభలో  కొత్త్త సర్‌ ‌కార్యవాహ దత్తాజీ ప్రకటన

– బెంగళూరులో ముగిసిన సమావేశాలు

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభలు బెంగళూరులో మార్చి – 19, 20 తేదీలలో జరిగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు సంస్థ తీసుకుంది. బాధ్యతలలో కూడా యథాప్రకారం మార్పులు చోటు చేసుకున్నాయి. ‘రానున్న మూడేళ్ల కాలంలో భారత్‌ ‌నలుమూలల్లోని ప్రతి మండలంలోను సంఘ కార్యాన్ని విస్తరింపజేసే ప్రణాళిక ఉందనీ, 58 వేల మండలాలకు సంఘ కార్యాన్ని విస్తరింప జేయాలనే సంకల్పంతో ఈ ప్రణాళిక రూపొందించామ’ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నూతన సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలె పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దీపావళి దాకా సంఘ శాఖలు కార్యకలాపాలు నిలిపివేశాయనీ, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తూ మెలమెల్లగా సంఘ శాఖలు ప్రారంభమయ్యాయనీ ఆయన తెలిపారు. పరిస్థితులు పూర్తిగా మెరుగుపడితే సంఘం మార్చి 2020 నాటి స్థితికి చేరుకోవచ్చు లేదా అంతకన్నా హెచ్చు స్థాయికి చేరుకోవచ్చనే ఆశాభావాన్ని దత్తాజీ వ్యక్తం చేశారు.

‘‘సంఘ కార్యమెలాంటిదో సమాజానికి తెలుసు. దేశ – విదేశాల్లో సంఘ విషయమై జిజ్ఞాస ఉంది. ప్రశంసలతో పాటు సహకారమూ ఉంది. అంతేకాదు సంఘ కార్యానికి అపూర్వ స్వాగతం కూడా లభిస్తోంది. ఇది మనందరికీ ప్రత్యక్ష అనుభవమే! సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు సంఘానికి అపూర్వ ఆదరణ, ఆత్మీయత, స్నేహ పూర్వకమైన సహకారం లభిస్తూనే ఉంది’’ అని  సంఘ్‌ ‌కొత్త సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలె (దత్తాజీ) అన్నారు. మార్చి 19-20 తేదీలలో బెంగళూరులో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో సర్‌ ‌కార్యవాహ పదవికి దత్తాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ చివరి రోజున  హొసబలె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సంఘకార్యక్రమాల మీద కూడా కరోనా తన ప్రభావం చూపిందనీ, దైనందిన శాఖలు కొనసాగలేక పోయాయనీ, అయినా ఆ సమయంలో కూడా సంఘ కార్య విస్తరణకు సంబంధించి కొత్త ఆలోచనలకు పునాదులు వేశామని దత్తాజీ తెలిపారు. ఇందులో భాగంగానే ఇంట్లో ఉంటూనే తమ తమ కార్యకర్తృత్వాన్నీ, స్వయం సేవకత్వాన్నీ జాగృతపరిచే విధంగా, క్రియాశీలకంగా స్వయంసేవకులంతా వ్యవహరించారని గుర్తు చేశారు. అలాంటి వాతావరణంలోను స్వయంసేవకులు సామాజిక బాధ్యతను నిర్వర్తించారనీ, సంక్షోభ సమయంలో సమాజ సహకారంతో సేవ చేశారనీ, కోట్లాది మందికి ప్రతిరోజూ నిత్యావసరాలను అందిస్తూ, అవసరమైన రీతిలో పునరావాసాన్ని కూడా కల్పించారని దత్తాజీ చెప్పారు. ఈ విషయమై ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించిన సంగతిని కూడా చెప్పారు. సంక్షోభ సమయంలో యావద్భాతరం ఒక్కటై నిలిచిందనీ, మహమ్మారిని ఎదుర్కొనడంలో సమాజం తన సత్తా ఏపాటిదో చాటి చూపిందనీ తెలిపారు. ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లంతా తమ బాధ్యతలను నెరవేర్చారనీ, వీరి సేవా నిరతిని రాబోయే తరం ప్రేరణగా తీసుకుంటుందని దత్తాజీ చెప్పారు. త్వరలోనే ప్రపంచం ఈ మహమ్మారి బారి నుండి బయటపడుతుందనే ఆశాభావాన్ని సర్‌ ‌కార్యవాహ వ్యక్తం చేశారు. వెంటిలేటర్‌ ‌సౌకర్యం, పీపీఈ కిట్స్, ‌కరోనా పరీక్షలక• అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాధ్యమైనంత త్వరగానే స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌ ‌తయారు చేయటంలో మనం సఫలీకృతులమయ్యామని అన్నారు.

శ్రీరామ మందిరం విషయంలో కూడా సభ ఒక తీర్మానాన్ని ఆమోదించిందని దత్తాజీ చెప్పారు. ‘‘శ్రీరామ జన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం, ఆ తర్వాత శ్రీ రామ మందిర నిర్మాణం కోసం ‘శ్రీరామ తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, అయోధ్యలో భవ్య మందిర నిర్మాణ కార్యాన్ని ఆరంభించేందుకు నిధి సమర్పణ కార్యక్రమం కొనసాగించేందుకు తీసుకున్న నిర్ణయం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయి. ఈ విషయాలన్నీ రాబోవు తరాలకి ప్రేరణాదాయకమవుతాయి. ‘తీర్థ్ ‌క్షేత్ర’ ట్రస్ట్ ‌నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు స్వయంసేవకులంతా ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చారు. నిధి సమర్పణ కార్యక్రమానికి ఉత్సాహంగా సంపూర్ణ సమాజం అందించిన సహకారం చరిత్రాత్మకం. విరాళాల సేకరణకు స్వయంసేవకులు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోయినప్పటికీ ఆయా ప్రాంతాల ప్రజలు స్వయంసేవకులకు కబురంపి మరీ మందిర నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందజేయటం విశేషం. భారత ప్రజలు శ్రీరామునితో ఎలా మమేకమై ఉన్నారో ఈ నిధి సమర్పణ కార్యక్రమం రుజువు చేసింది. గ్రామ, నగరవాసులే కాదు, గిరిజన బంధువుల దాకా, సంపన్నుల నుంచి సామాన్యుల దాకా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయటంలో తమ వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందించారు. అద్వితీయ మైన ఉత్సాహంతో రామ భక్తులంతా వ్యవహ రించారు. భావాత్మకంగా సంపూర్ణ భారతం మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిని ఆరాధిస్తోందనే విషయం స్పష్టమయింది’’ అని దత్తాజీ పేర్కొన్నారు.

రాబోయే కొన్ని సంవత్సరాలు కుటుంబ ప్రబోధనం, గోసేవ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసతకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని, ఈ కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకపోతామని దత్తాజీ తెలిపారు. భేదభావ రహితమయిన హిందూ సమాజ నిర్మాణమే సంఘ ఉద్దేశమని చెప్పారు. రానున్న రోజుల్లో గ్రామ వికాసం, వ్యవసాయ రంగాలపట్ల విశేష దృష్టిపెడుతూ కూడా సంఘం తన క్రియాకలాపాలని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 13 ‌నుండి సంఘం ‘భూమి సుపోషణ అభియాన్‌’ ‌కార్యక్రమాన్ని ప్రారంభించనున్నదని కూడా తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులను ఆ సాగువైపు మరల్చే దిశగా పథకాల రూపకల్పన చేస్తామని, తద్వారా రైతుల బతుకుల్ని మెరుగు పరచేందుకు నడుం బిగిస్తామని చెప్పారు. దీన్ని సామాజిక కార్యక్రమంగా కొనసాగించేందుకు నిర్ణయించామని సర్‌ ‌కార్యవాహ తెలిపారు. ‘భారత్‌ ‌నేరేటివ్‌, ఆలోచనా విధానం ఏమిటి? భారత్‌ ‌గతం ఏమిటి? భారత్‌ ‌సందేశం ఏమిటి? ప్రాచీన జ్ఞానం ఏమిటి? వీటిని విస్మరిస్తే ఏ పనీ కాదు, కాబోదు. వీటన్నిటి ఆధారంగానే నవ భారత నిర్మాణం సాధ్యం. నవతరానికి అనుగుణంగా వీటన్నిటినీ ఎలా అభివృద్ధి పరచాలి? దీనికోసం భారత్‌ ‌నేరేటివ్‌ని సరైన దృష్టిలో ఉంచేందుకు మేధో వికాసం, మేధో ప్రచారం కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ ప్రచారం మాకు అద్భుతమైన ప్రేరణ ఇచ్చింది. కార్య విస్తరణ, సామాజిక పరివర్తన, మేధో ప్రబోధనం – ఈ మూడింటి పట్లా దృష్టి పెట్టి ముందుకు సాగుతాం’ అని దత్తాజీ అన్నారు.

అను : విద్యారణ్య కామ్లేకర్‌

About Author

By editor

Twitter
Instagram