మైనారిటీ స్వరాలు మారుతున్నాయి

నాలుగు పెద్ద రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ నాలుగులోని మూడు రాష్ట్రాలలో మైనారిటీ ఓట్లు కీలకం. అస్సాంలో ముస్లిం జనాభా 34% కాగా, బెంగాల్‌లో దాదాపుగా 30%, కేరళలో క్రైస్తవ, ముస్లిం వర్గాలది కలిపి 45% జనాభా. ఈ గణాంకాల ఆధారంగా ఆ మూడు రాష్ట్రాలను బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలుగా రాజకీయ పండితులు పేర్కొంటారు. అయితే ఐదేళ్లుగా అస్సాంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారంలోకి వస్తామన్న ధీమా ఆ పార్టీలో కనిపిస్తున్నది. బెంగాల్‌లో అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు చెమటలు పటిస్టున్న పార్టీ బీజేపీ. పలు దశాబ్దాలు ఆ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, ‌వామపక్షాలను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది బీజేపీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఈ సంవత్సరం బెంగాల్‌లో అధికారం మాదే అని ఢంకా బజాయించి చెపుతున్నది.

కేరళలో బీజేపీది నేటివరకు కూడా నామ మాత్రపు పాత్రే. బీజేపీ ఆవిర్భవించిన తరువాత కేరళలో ఒక శాసనసభ స్థానాన్ని గెలుచుకున్నది 2016లో మాత్రమే. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒక మునిసిపాలిటీని గెలుచుకుంది. 2021లో కేరళలో బలోపేతం కావడానికి కొత్త మార్గాలను ఎంచుకుంది. అందులో ఒకటి సంప్ర దాయంగా తమను వ్యతిరేకిస్తున్న మైనారిటీ వర్గాలకు చేరువ కావటం. తమది జాతీయ భావన తప్పించి, మైనారిటీ వ్యతిరేక భావన కాదన్న వాస్తవాన్ని వివరిం చడం. భిన్నా సామాజిక వర్గాలతో సంపర్కానికి సదస్సులు, సమావేశాలు, ఇష్టాగోష్టి కార్యక్రమాలు పార్టీ నిర్వహించింది. అదే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కేరళలో వామపక్ష దాష్టీకాన్ని ఎదిరించే శక్తి తమకున్నదని ‘సంఘ్‌’ ‌నిరూపించింది. వాపమక్షాలు దశాబ్దాలుగా సాగిస్తున్న హింస, హత్యాకాండలకు బలైన వర్గాలకు ఇప్పుడు ‘సంఘ్‌’ ఒక రక్షణ కవచంలా నిలిచింది. ఆ ప్రయత్నంలో ‘సంఘ్‌’ ‌కార్యకర్తలు పలువురు అమరులయ్యారు. వారి త్యాగాన్ని, సహనాన్ని నేడు కేరళ సమాజం గుర్తించింది. నేటి వరకు అది తమకు సంబంధం లేనట్టు దూరంగా నిలబడిన క్రైస్తవ సంఘాలు హిందూ సంస్థల త్యాగ నిరతి, సేవా కార్యక్రమాలను ఇక విస్మరించలేమంటున్నాయి. ‘సంఘ్‌’ ‌చేస్తున్నది సామాజిక సేవే కాని, ఒక వర్గం కోసం పాటుపడటం కాదన్న విషయం రెండు మూడేళ్ల క్రితం కేరళలో సంభవించిన వరదల సమయంలో చాలామందికి అర్థమైంది. నేటి వరకు వామపక్షాలు చేసిన ‘సంఘ్‌’ ‌వ్యతిరేక ప్రచారంలో పడికొట్టుకుపోయిన క్రైస్తవ సంఘాలు నేడు బీజేపీతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గత రెండు సంవత్సరాల కాలంలో వచ్చిన ఆ మార్పు నేడు క్రైస్తవ సమాజపు స్వరంలో స్పష్టమవుతున్నది కూడా.

కేరళ క్రైస్తవ జనాభా అంతా ఒకే చర్చి పరిధి కిందకు రాదు. అక్కడ అనేక క్రైస్తవ సంఘాలున్నాయి. వాటిలో బాగా శక్తిమంతమైనది కేథలిక్‌ ‌క్రైస్తవ సంఘం. 1979 నుండి కేథలిక్‌ ‌క్రైస్తవులు మంగుళూర్‌ ‌ప్రధాన కేంద్రంగా ‘కేథలిక్‌ ‌సభ’ని నిర్వహిస్తున్నారు. ఇది కేథలిక్‌ ‌క్రైస్తవ జనాభా ప్రయోజనాల గురించి చర్చించి, డిమాండ్‌లని ప్రభుత్వం ముందుంచే సంస్థ.

కేరళలో దశాబ్దాలుగా సంకీర్ణ రాజకీయాలే నడుస్తున్నాయి. అందులో యునైటెడ్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (‌యుడిఎఫ్‌)‌కు కాంగ్రెస్‌ ‌నేతృత్వం వహిస్తుండగా, లెఫ్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (ఎల్‌డిఎఫ్‌)‌కి సిపిఎం నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఆ రెండు సంకీర్ణాల మధ్య మారుతుంటుంది. ఈ ఫ్రంట్‌ల విధానాల మీద అసంతృప్తి తీవ్రంగా ఉన్నప్పటికి ప్రత్యామ్నాయం కనిపించని కేరళ ఓటర్లు రెండింటిలోనే ఏదో ఒక పక్షాన్ని గెలిపించాల్సి వస్తున్నది. పైగా హిందువులను కులపరంగా విడగొట్టి ఫ్రంట్‌ల నేతలు రాజకీయం నడిపారు. మరోవైపు హిందూ సంఘాలను బూచిగా చూపించి మైనారిటీల ఓట్లను కొల్లగొడుతున్నారు. యుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌ల ఎత్తుగడల గురించి తెలియచెప్పి, ప్రజల మద్దతు పొందే తృతీయ ఫ్రంట్‌ ‌లేకపోవటం కేరళకు శాపంగా మారింది. చిరకాలం చేసిన ప్రయత్నాల తర్వాత కేరళ రాజకీయాలలో మరో ఫ్రంట్‌కి మేము నాయకత్వం వహిస్తాం, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళతాం అనే భరోసా బీజేపీ ఇవ్వగలిగింది. ఆ భరోసాకి అద్దం పట్టింది ఇటీవలి కేథలిక్‌ ‌క్రైస్తవుల సభ, జాకోబైట్‌ అనే క్రైస్తవవర్గ బిషప్‌ ‌చేసిన ప్రకటనలు.

త్రిస్సూర్‌ ‌పట్టణం వేదికగా జరిగిన కేథలిక్‌ ఆర్జిజయోసిస్‌ ఎల్‌డిఎఫ్‌, ‌యుడిఎఫ్‌లకు తీవ్రపద జాలంతో ఒక హెచ్చరిక చేసింది. ‘నేటి వరకు క్రైస్తవులను ఒక ఓటు బ్యాంక్‌గా వాడుకునే రాజకీయం నడిపారు మీరు. మీ ఫ్రంట్‌లలో ఏదో ఒక దానికి తప్పని సరిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం లేదు’ అన్న పదాలు ఆ ఆర్చిబిషప్‌ ‌వాడారు. కేరళలో సంఖ్యాపరంగా కేథలిక్‌ ‌క్రైస్తవులు అధికం. శక్తిమంతమైన వర్గం. గతంలో అధిక పర్యాయాలు యుడిఎఫ్‌కి కొన్ని ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కి వీరు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు బీజేపీ తృతీయ ఫ్రంట్‌ ఆలోచన ప్రకటించటం, అదే సమయంలో రాష్ట్రంలో తిష్ట వేసుకుని కూర్చున్న రెండు ఫ్రంట్‌లకు కేథలిక్‌ ‌క్రైస్తవులు •హెచ్చరిక చేయటం కేరళ రాజకీయాలలో వచ్చిన మార్పు.

ఇటీవల కేరళ కేథలిక్‌ ‌క్రైస్తవ మతగురువులు ప్రధాని మోదీతో భేటీ• అయ్యారు. ఆ సమావేశం ప్రధానంగా కేరళలోని రెండు చర్చి వర్గాల మధ్య చెలరేగిన ఆస్తుల పంపకాల గొడవలు, సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలకు సంబంధించినదే అయినా, దాని తర్వాతే కేరళ క్రైస్తవ వర్గాల స్వరం మారటం గమనార్హం. మోదీతో సమావేశం, అంతకముందు బీజేపీ నేతలు రాష్ట్ర స్థాయిలో జరిపిన సంప్రదింపుల ప్రభావం వలనే ఆ స్వరం మారి ఉండవచ్చు.

అయితే కేరళ మీడియా వాదన ప్రకారం రాష్ట్రంలోని హైందవ, క్రైస్తవ వర్గాలు రెండూ ‘లవ్‌జిహాద్‌’ ‌బాధితులైనందునే దగ్గరవు తున్నాయి. ప్రారంభంలో ముస్లింలు హిందూ మహిళలే లక్ష్యంగా ‘లవ్‌జిహాద్‌’ ‌సాగించారు. ఆ సమయంలో మౌనం వహించి తప్పు చేశామనే భావన నేడు క్రైస్తవులలో కలుగుతోంది. క్రైస్తవ యువతుల మీద కూడా ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌వల పన్నడం, చిక్కిన వారిని సిరియాకు పంపి ఐసిస్‌లో చేర్చిన సంఘటనలు బయటపడి నాయి. ఐసిస్‌ ఉ‌గ్రవాదుల లైంగిక అవసరాలు తీర్చే బానిసలుగా కొందరు క్రైస్తవ అమ్మాయిలను చెరలో ఉంచారు. ఈ పరిణామాలను గమనించాక క్రైస్తవ సంఘాలు ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌విషయంలో హిందువులతో గొంతు కలుపుతున్నాయి.

మతాంతర వివాహాలకు మేం వ్యతిరేకం కాదు అని క్రైస్తవ సంఘాలు వివరణ ఇస్తున్నాయి. కేరళలో మతాంతర వివాహాలు అనేక దశాబ్దాలుగా జరుగుతున్నాయి. క్రైస్తవ, హిందూ యువతీ యువకుల మధ్య జరిగిన ఆ వివాహాలు సామాజిక ఘర్షణలకు దారి తీయలేదు. అందుకు కారణం అవి వలవేసి చేసుకున్న పెళ్లిళ్లు కాకపోవటం. ప్రేమ, పరస్పరం ఇష్టపడి చేసుకున్నవి. ఆ వివాహాలలో ఎన్నడూ పెళ్లి కూతురు మతం మార్చుకోవాలన్న ఒత్తిడి లేదు. దంపతులిరువురు వారి వారి స్వధర్మాలను వివాహం తర్వాత కొనసాగించేవారు. ఇరు మతాల ఉత్సవాలలో కలిసి పాల్గొనేవారు. అందుకే ఆ వివాహాలు ఘర్షణ వాతావరణం సృష్టించలేదు.

కాని ‘లవ్‌జిహాద్‌’ ‌వివాహాలలో అమ్మాయి మతం మార్పిడి తప్పనిసరి చెయ్యటాన్ని తాము వ్యతిరేకిస్తు న్నట్టు క్రైస్తవ సంఘాలు ప్రకటించాయి. మతం మార్పు, పేరు మార్చుకోవటాన్ని అమ్మాయిల నెత్తిన బలవంతంగా రుద్దుతున్నందనే ‘లవ్‌ ‌జిహాద్‌’‌కి వ్యతిరేకత పెరిగింది. తమ ఆడపిల్లలను ఇస్లాం బలవంతంగా బురఖాలోకి నెట్టే విష సంస్కృతికి కేరళ సమాజం అభ్యంతరం చెబుతోంది.

‘లవ్‌ ‌జిహాద్‌’ ‌విషయంలో తమ ఫిర్యాదులకు సరిగా స్పందించని అధికార ఎల్‌డిఎఫ్‌ ‌మీద కేరళలోని జాకోబైట్‌ ‌క్రైస్తవులు వ్యతిరేకతను ప్రకటించారు. గతంలో ఎన్నో ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కి తాము మద్దతుగా నిలిచామనీ, ఈ సారి సీపీఎమ్‌ ‌విధానాలను వ్యతిరేకిస్తున్నట్లుగా జాకోబైట్‌ ‌క్రైస్తవ బిషప్‌ ‌వర్గీస్‌ ‌మార్‌ ‌కూరిలోస్‌ ‌ప్రకటించాడు. పైగా సీపీఎమ్‌ ‌గెలుపుకోసం మత రాజకీయాలను ప్రోత్సా హించటం జాకోబైట్‌లు నిరసిస్తున్నారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ కుదుర్చుకున్న ఒప్పందాలను క్రైస్తవులు తప్పుపడు తున్నారు. కేరళలో ముస్లింల పార్టీగా వెల్‌ఫేర్‌ ‌పార్టీ నమోదు అయింది. దాని స్థాపన వెనకున్నది జమాత్‌-ఎ-ఇస్లామ్‌. ‌వెల్‌ఫేర్‌ ‌పార్టీ అనేది ఒక ముసుగు. ఆ పార్టీ ఛాందస ఇస్లామ్‌ని ప్రచారం చేస్తున్నది. అటువంటి పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకుంది కాంగ్రెస్‌. ఈ ‌విషయం మీద కేరళ క్రైస్తవులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. కేరళలో వచ్చిన సామాజిక మార్పు బీజేపీకి తక్షణ రాజకీయ లబ్ధి చేకూరుస్తుందా లేదా అనేది అనవసరం. కాని ఆ మార్పు వల్ల దేశానికి మేలు జరుగుతుంది. క్రైస్తవ, హైందవ సమాజాల మధ్య అవగాహన పెరగటం సమాజానికి మంచిది.

 మైనారిటీ స్వరంలో ఇటువంటి మార్పే బెంగాల్‌ ‌నుండి కూడా వినిపిస్తున్నది. అక్కడ త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించినా అక్కడి ముస్లిం సమాజం వినిపిస్తున్న కొత్త గొంతును స్వాగతించాలి.

బిహార్‌లో ఐదు సీట్లు గెలుచుకున్న ఉత్సాహంతో మజ్లిస్‌ ‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఒవైసీ రాకను మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. కలకత్తాలోకి రహస్యంగా అడుగుపెట్టి ముస్లిం నేతలతో మంతనాలు జరిపాడు ఒవైసీ. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయటం తథ్యమని ప్రకటించాడు.

అయితే, బెంగాల్‌లో ఇండియన్‌ ‌సెక్యులర్‌ ‌ఫ్రంట్‌ (ఐ.ఎస్‌.ఎఫ్‌.) అనే కొత్త పార్టీ పుట్టింది. దాని వ్యవస్థాపకులు స్థానిక ఇస్లాం మత ప్రచారకుడు పీర్‌జాదా అబ్దుల్‌ ‌సిద్ధిఖి. అతని వయసు నాలుగు పదులకు లోపే. ఒక విధంగా ఆ రాష్ట్ర ముస్లిం యవతకు ప్రతినిధి. కొత్త పార్టీ ముస్లిం ప్రయోజనాల కోసం అంటూ అబ్దుల్‌ ‌సిద్ధిఖి చేసిన ప్రకటన బెంగాల్‌ ‌సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. ‘ఇదంతా బీజేపీ కుట్ర.. ముస్లిం ఓట్లను చీల్చి నన్ను ఓడించే ప్రయత్నంలో భాగం’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేశపడింది. బీజేపీ గెలుపుకోసం ముస్లిం వర్గాలలోని కొందరు వేస్తున్న ఎత్తుగడ అని, దీని వెనుక అసదుద్దీన్‌ ఒవైసీ ఉన్నాడని కాంగ్రెస్‌, ‌సీపీఎమ్‌ ‌కూడా ఆరోపించాయి. 2009 ఎన్నికల వరకు ఆంధప్రదేశ్‌లో మజ్లిస్‌ ‌పార్టీ, కాంగ్రెస్‌ ‌రాజకీయ మిత్రులు. అసదుద్దీన్‌ ఒవైసీ అండతోనే కాంగ్రెస్‌ ‌పలు సీట్లు తెలంగాణ ప్రాంతంలో గెలిచేది. అటువంటి ఒవైసీని నేడు కాంగ్రెస్‌ ‌బీజేపీ ఏజంట్‌ అం‌టూ వర్ణించటమే చిత్రం.

రాజకీయ అంశాలు పక్కన పెడితే ఐఎస్‌ఎఫ్‌ ‌వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ‌సిద్ధిఖి ఇచ్చిన సమాధానం, చేసిన ప్రకటనలు గమనార్హం. కొత్త పార్టీ అవసరం ఏమిటన్న ప్రశ్నకు ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ ప్రశ్న కొత్త పార్టీలు పెట్టే వారందరికి మీరెందుకు వెయ్యరు అని నిలదీశారు.

‘ముస్లింలకు మరోపార్టీ అవసరమా?’ అని మరొకరు వేసిన ప్రశ్నకు ‘హిందవులకు వందలాది పార్టీలు ఉండటాన్ని ప్రశ్నించని మీడియా ముస్లింలు మూడోపార్టీ పెట్టుకోవటాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నదో నాకు అర్థం కావటం లేదు’ అన్నాడు సిద్ధిఖి.

మీరు మరో పార్టీ పెట్టటం వల్ల ముస్లింల ఓట్లు చీలవా అనే ప్రశ్నకు ‘‘అసలు ముస్లిం ఓట్లు మొత్తం ఒక పార్టీకే పడాలని మీరు ఎందుకు కోరుకుంటు న్నారు. హిందువుల ఓట్లు చీలిపోతే లేని బాధ ముస్లిం ఓట్ల చీలిక మీద ఎందుకు?’’ అన్నది అతని ప్రశ్న.

‘ముస్లింలంతా గొర్రెల్లా ఒక పార్టీ వెంట పడాలన్నా కోరికే తప్పు. అటువంటి మనస్తత్వాన్ని ముస్లింల మీద బలవంతంగా మీడియా అలవరస్తు న్నది. ఈ మనస్తత్వం ఆధారం చేసుకుని సెక్యులర్‌ ‌పార్టీలు మమ్మల్ని ఓటు బ్యాంక్‌గా మలచుకున్నాయి. నేటి పాలక పక్షం తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌సహా అన్ని పార్టీలు మమ్మల్ని ఓటుబ్యాంక్‌గా వాడుకోవటమే తప్పించి మాకు చేసిన మేలు ఏదీ లేదు’ అన్నది అబ్దుల్‌ ‌సిద్ధిఖీ స్పష్టం చేసిన విషయం.

నిజానికి దశాబ్దాలుగా జాతీయవాదులు మైనారి టీలకు వినిపిస్తున్న విషయం ఇదే. అనవసరంగా ఒక పార్టీకి బానిసలవకండి. ఒక పార్టీ మీద చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకండి. స్వతంత్ర భావాలు కలిగి, స్వతంత్రంగా ఆలోచించి, మతానికి అతీతంగా ఓటు వెయ్యండి అని చెప్పగా చెప్పగా నేటికి ఆ వర్గాలకు అర్థమైనట్లుగా కనిపిస్తోంది.

 మైనారిటీలు వినిపిస్తున్న ఈ స్వరాలను స్వాగతించాలి. వీటిని విస్త్రతంగా ప్రచారం చేయాలి. మైనారిటీ, మెజారిటీ అనే విభజన పోయి భారతీయత పరంగా అన్ని వర్గాలు కలిసి పనిచేసే సమయం వచ్చింది. ఇదే పలు దశాబ్దాలుగా అశిస్తున్న పరిణామం.

– డా।। దుగ్గరాజు శ్రీనివాస్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram