జై ‘అష్ట’ దిగ్బంధనం!

 – డా. రామహరిత

చైనా పట్ల అనుసరించవలసిన విధానాన్ని భారత్‌ ‌సవరించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు, వ్యూహకర్తలు చాలాకాలంగా చెప్తున్నారు. ఏడు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే దిశగా భారత విదేశాంగమంత్రి ఎస్‌. ‌జయశంకర్‌ ‌రెండు దేశాల సంబంధాలకు ఎనిమిది సూత్రాలను ప్రతిపాదించారు. చైనాతో మున్ముందు సాగే చర్చలకు ఒక ముసాయిదాను సిద్ధంచేశారు. నకులా వద్ద ఉద్రిక్తతలు తలెత్తిన కొద్దిరోజుల తరువాత ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌చైనా స్టడీస్‌’ ‌సంస్థ ఏర్పాటుచేసిన 13వ అఖిల భారత సమావేశంలో మాట్లాడిన జయశంకర్‌ ‌బీజింగ్‌కు ఒక వ్యూహాత్మక సందేశం పంపారు.

ప్రతిపాదనలు

–      ఇప్పటికే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను తప్పక పాటించాలి.

–      వాస్తవాధీన రేఖను పూర్తిగా గుర్తించి, యథాతథ స్థితిని కొనసాగించాలి. ఏకపక్షంగా దానిని మార్చే ప్రయత్నం చేయరాదు.

–      రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో శాంతి చాలా అవసరం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఈ సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి.

–      రెండు దేశాలు భిన్న ధృవాలు కలిగిన ప్రపంచాన్ని కోరుకుని, గౌరవిస్తాయి కాబట్టి అలాంటి ప్రపంచానికి భిన్న ధృవాలు కలిగిన ఆసియా చాలా ముఖ్యమని గుర్తించాలి.

–      ప్రతి దేశానికి దాని ప్రయోజనాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. వాటిని పరస్పరం గౌరవించుకునే స్థితి ఉండాలి. కాబట్టి రెండు పెద్ద దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటాయి.

–      ప్రతి దేశానికి కొన్ని ఆకాంక్షలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని పరస్పరం గౌరవించుకోవాలి.

–      అభిప్రాయ భేదాలు, విధానపరమైన తేడాలు ఎప్పుడూ ఉంటాయి. సత్సంబంధాల కోసం వాటిని అదుపులో ఉంచుకోవాలి.

–      పురాతన నాగరికత కలిగిన భారత్‌, ‌చైనా వంటి దేశాలు దీర్ఘకాలిక ధోరణిని అవలంబించాలి.

వుహాన్‌ ‌వైరస్‌ ‌ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నా చొరబాట్లకు చైనా ప్రయత్నిస్తూనే ఉండటం, 1975 తరువాత ప్రత్యక్ష ఘర్షణలో రెండు వైపులా సైనికులు చనిపోయిన గల్వాన్‌ ‌సంఘటన వంటివాటి నేపథ్యంలో భారత్‌ ‌తన వైఖరిని స్పష్టం చేయవలసిన అవసరం ఏర్పడింది. గల్వాన్‌ ‌ఘటనలో భారత సైనికుల ధైర్యపరాక్రమాలు, శక్తి చైనాకు తెలిసి వచ్చాయి. కైలాస పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా చైనా సైన్యానికి వ్యూహాత్మకమైన, బలమైన సందేశాన్నే పంపింది భారత సైన్యం. గల్వాన్‌ ‌ఘటన తరువాత భారత్‌ ‌మరింత అప్రమత్తం అయింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను భారీ సంఖ్యలో మోహరించడమే కాక మిస్సైల్‌ ‌పరీక్షలు జరపడం, ఆయుధాల కొనుగోలు, స్వదేశంలోనే ఆయుధాల ఉత్పత్తి వంటి చర్యలపై దృష్టి పెట్టింది. గతంలో మాదిరిగా చైనా దుందుడుకు, చొరబాటు చర్యలను మౌనంగా భరించకుండా దీటైన సమాధానం ఇచ్చింది.

వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడిన ఉద్రిక్తతలను నివారించేందుకు రెండు దేశాలు తొమ్మిదిసార్లు చర్చలు జరిపాయి. సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని కొనసాగించాలని భారత్‌ ఎన్నిసార్లు కోరినా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత్‌ను అన్నీ వైపుల నుంచి దిగ్బంధనం చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్న చైనా తాజాగా నేపాల్‌ను ఉసిగొల్పడానికి ప్రయత్నించింది. కానీ అప్రమత్తంగా ఉన్న భారత్‌ ‌దానిని తెలివిగా తిప్పికొట్టింది. నేపాల్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం ప్రకటించడం, కొవిడ్‌ ‌వ్యాప్తిని ఎదుర్కొనేందుకు వైద్యసహాయం చేయడం ద్వారా భారత్‌ ఆ ‌దేశంతో సంబంధాలను మరింత దృఢపరచుకుంది.

దక్షిణాసియా దేశాలను ప్రభావితం చేసి తనవైపు తిప్పుకోవాలన్న చైనా కుతంత్రాన్ని కూడా భారత్‌ ‌తిప్పికొట్టింది. తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో శ్రీలంకపై పట్టు బిగించడానికి చైనా ప్రయత్నిస్తోంది. అయితే నౌకా సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు, చైనా దుస్సాహసాన్ని ఎదుర్కొనేందుకు శ్రీలంక, మాల్దీవ్‌లతో త్రైపాక్షిక చర్చలను భారత్‌ ‌మళ్లీ ప్రారంభించింది. వీటికి బంగ్లాదేశ్‌, ‌సిషల్స్, ‌మారిషస్‌లు పరిశీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఢాకాను గుప్పిట బిగించాలను కున్న చైనా ప్రయత్నాలను వమ్ముచేయడానికి కూడా చురుగ్గా కదలిన భారత్‌ అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు చేపట్టింది. వుహాన్‌ ‌వైరస్‌ ‌వ్యాప్తిపై పోరాటం సాగించడంలో సార్క్ ‌దేశాలకు (పాకిస్తాన్‌ ఈ ‌సహాయాన్ని తిరస్కరించింది) పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన భారత్‌ అదనపు వైద్య సహాయం అందించడమేకాక, వైద్య సిబ్బందికి శిక్షణను కూడా ఇచ్చింది.

ప్రపంచాన్ని కరోనా బారిన పడేసినందుకు పశ్చాత్తాపం చెందాల్సిందిపోయి నాసిరకం మందులు, వాక్సిన్‌లను విదేశాలకు అంటగట్టాలని చైనా ప్రయత్నించింది. దీని వల్ల ఆ దేశానికి చెడ్డ పేరు వచ్చింది. దక్షిణాసియా దేశాలు కూడా చైనా ఎగుమతులను తిరస్కరించాయి. ‘లోపాయకారి ప్రయోజనాలు’ కలిగిన చైనా వాక్సిన్‌ ‌పరీక్షలను బంగ్లాదేశ్‌ ‌నిరాకరించింది.

మరోపక్క భారత్‌ ‌మాత్రం కొవిడ్‌ ‌వాక్సిన్‌ ‌విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే పొరుగున ఉన్న భూటాన్‌, ‌నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌, ‌మాల్దీవ్స్, శ్రీ‌లంక, మయన్మార్‌, ఆఫ్గానిస్తాన్‌లకు వాక్సిన్‌లు అందజేసింది. అలాగే సెషల్స్, ‌మారిషస్‌, ‌బహరైన్‌ ‌వంటి దేశాలకు కూడా వాక్సిన్‌ అం‌దజేయడానికి ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇరుగుపొరుగు దేశాలతో సంబంధా లను పటిష్టపరచుకుంటోంది. భారత్‌ అనుసరిస్తున్న ఈ ఉదారవాద విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా పెద్దఎత్తున దుష్ప్రచారం ప్రారంభించింది.

గల్వాన్‌ ‌సంఘటన తరువాత ఒకపక్క చైనాతో తలపడుతూనే ‘స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతం’ కోసం భారత్‌ ‌కృషి చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అమెరికాకు ఉన్న ప్రాబల్యాన్ని తగ్గించి, ఆ స్థానాన్ని ఆక్రమించాలన్న చైనా ఆలోచనల్ని భారత్‌ ‌ముందుగానే పసిగట్టింది. అందుకే ఈ ప్రాంతపు దేశాలతో సైనిక సంబంధాలను పటిష్టపరచుకునేందుకు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా వంటి ప్రజాస్వామ్య దేశాలను ఈ విన్యాసాల్లో భాగం చేస్తోంది.

సరిహద్దు వెంబడి తన ప్రాబల్యం పెంచుకునేం దుకు చైనా అమలు చేస్తున్న జియావోకియాన్‌ (‌సంపన్న) గ్రామాల కార్యక్రమానికి దీటుగా భారత్‌ ‌పెద్దఎత్తున భూమిని సేకరించడం ప్రారంభించింది. అయితే ఈ విధానాన్ని భారత్‌ ‌చాలా ఆలస్యంగా అమలు చేసినా, తాజాగా జయశంకర్‌ ‌ప్రతిపాదించిన సూత్రాలు చైనా పట్ల భారత్‌ అనుసరిస్తున్న విధానంలో పెను మార్పులను సూచిస్తున్నాయి.

‘భారత్‌కు పొరుగున ఉన్న చైనా గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం చాలా అవసరం’ అన్న జయశంకర్‌ ‌రెండు దేశాల మధ్య సంబంధాల గురించి వివరిస్తూ 1962 యుద్ధం తరువాత ఆ సంబంధాలను పునరుద్ధరించడానికి ఎంతో సమయం పట్టడమేకాక, ఎంతో కష్టంతో కూడుకున్నద’ని అన్నారు. తూర్పు లద్దాఖ్‌ ‌వద్ద హింసని ప్రస్తావిస్తూ- ‘ఇది రెండు దేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే హింసకు పాల్పడటం ద్వారా వాళ్లు సరిహద్దు వద్ద సైన్యం సంఖ్యను తక్కువగా ఉంచాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేకాక శాంతి, సద్భావనలను దెబ్బతీయడానికి వెనుకాడబోమని చెప్పినట్లయింది’ అన్నారు. ‘ఇలా ప్రవర్తించడానికి గల కారణాలను చైనా ఇప్పటివరకు తెలియజేయలేదు. అందువల్ల చైనా ధోరణి ఎలా ఉంటుంది, దానికి మన ప్రతిస్పందన ఎలా ఉండాలన్నది రెండు దేశాల మధ్య సంబంధాలను తప్పక ప్రభావితం చేస్తుంది’ అని ఆయన స్పష్టంచేశారు.

2020కి ముందు భారత, చైనా సంబంధాలు ‘సహకారం, పోటీ’ అనే రెండు ధృవాల మధ్య ఊగిసలాడాయన్న జయశంకర్‌ ఏడు అంశాల్లో తేడాలు వచ్చాయని పేర్కొన్నారు.

–      స్టేపుల్‌ ‌వీసా జారీ (తమదని చెప్పే అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నుంచి, వివాదాస్పద ప్రాంతమని చెప్పే జమ్ముకశ్మీర్‌ ‌నుంచి వెళ్లే భారతీయుల వీసాలపై నేరుగా ముద్ర వేయకుండా, ఆ వీసాకు ఒక తెల్లకాగితాన్ని జోడించి దానిపైన ముద్ర వేసి, వాళ్లు తిరిగి వస్తున్నప్పుడు ఆ కాగితాన్ని చింపివేస్తారు చైనా అధికారులు. ఈ పద్ధతినే స్టేపుల్‌ ‌వీసా అంటారు. ఈ విధంగా అరుణాచల్‌, ‌జమ్ముకశ్మీర్‌లను వివాదాస్పద ప్రాంతాలని చైనా చెపుతోంది. సాధారణంగా ఏదైనా దేశంతో సత్సంబంధాలు లేవని చెప్పడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. భారత్‌ ‌చాలా కాలంగా ఈ పద్ధతి పట్ల నిరసన వ్యక్తం చేస్తోంది.)

–      సైనిక అధికారులతో చర్చలకు నిరాకరించడం.

–      అణు సరఫరా దేశాల బృందంలో, ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌ను వ్యతిరేకించడం.

–      తమ మార్కెట్‌లలో భారత్‌కు అనుమతినిస్తామని చెప్పినా అది అమలు చేయకపోవడం.

–      పాకిస్తాన్‌లోని తీవ్రవాద సంస్థలను ఐక్యరాజ్యసమితి నిషేధించకుండా అడ్డుకోవడం.

–      చైనా, పాకిస్తాన్‌ ఆర్థిక నడవా ద్వారా భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం, సవాలు చేయడం.

–      తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీయడం.

2017లో ఆస్థానా (కజగిస్తాన్‌ ‌రాజధాని)లో సమావేశంలో ‘చిన్న భేదాలు వివాదాలుగా మారకుండా జాగ్రత్త వహించాలి’ అని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. కానీ 2020లో చైనా ధోరణి వల్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ‘పరస్పర గౌరవం, ప్రయోజనాలు అనేవి సంబంధాలను నిర్ధారించే ముఖ్యమైన అంశాలు. ఈ విషయాలను పట్టించుకో కుండా వ్యవహరించడం, సరిహద్దుల వద్ద పరిస్థితులు ఎలా ఉన్నా అవి సజావుగానే సాగుతాయని అనుకోవడం యథార్ధాన్ని గ్రహించకపోవడమే అవుతుంది’ అని జయశంకర్‌ ‌స్పష్టం చేశారు. భారత, చైనాల మధ్య సంబంధాలు సందిగ్ధంలో ఉన్నాయని, ఈ రెండు దేశాలు కలిసి పనిచేసే అవకాశం, సామర్ధ్యం పైన ఈ శతాబ్దపు ఆసియా పరిస్థితులు ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు.

చర్చలకు భారత్‌ ఎప్పుడు సిద్ధమేనని తెలియ జేస్తూనే ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న చైనా ధోరణిని జయశంకర్‌ ఎం‌డగట్టారు. ఇది చైనాకు గట్టి సందేశాన్నే పంపింది. జయశంకర్‌ ‌సందేశానికి స్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఝవో లిజియాన్‌ ‘‌రెండు దేశాల మధ్య సంబంధాల ప్రాధాన్యతను జయశంకర్‌ ‌ప్రస్తావించడం చూస్తే చైనాతో సత్సంబంధాలకు భారత్‌ ఎం‌తటి విలువనిస్తుందో అర్ధమవుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి చర్చించగలగాలని చెప్పదలచుకున్నాను. అందువల్ల విభేదాలను తొలగించుకుని సహకారానికి దారులు వేయడంలో భారత్‌ ‌మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.

ఇలా సరిహద్దు వివాదాలను ప్రస్తావించకుండా చర్చలకు సిద్ధపడాలన్న చైనా వాదనను భారత్‌ అం‌గీకరించడం లేదు. సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు చర్చలు సజావుగా ఎలా సాగుతాయని ప్రశ్నిస్తోంది. అయితే ఈ వివాదాలను పక్కన పెట్టి చర్చించాల్సిందేనని చైనా పట్టుబట్టడం చూస్తే సరిహద్దు ఉద్రిక్తతలు వెంటనే సర్దుమణిగే అవకాశం కనిపించడం లేదు. అందుకు నకులా వద్ద సైనిక ఘర్షణే తాజా ఉదాహరణ.

అను: కేశవనాథ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram