ఆ పుస్తకం చదివితే క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటి హిందూ మహాసముద్రపు అలల ఘోషను వినవచ్చునంటే అతిశయోక్తి కాదు. తూర్పు దేశాల నుంచి జరిగిన నౌకా వాణిజ్యం గురించి ఆ పుస్తకం విస్తుపోయే విశేషాలు చెబుతుంది. కొన్ని శతాబ్దాల పాటు ప్రాశ్యపాశ్చాత్య దేశాల నావికులను, చరిత్రకారులను ఆకట్టుకుంటున్న ఈ పుస్తకం ప్రధానంగా నౌకా వాణిజ్యం గురించి చర్చించిన మాట నిజమే. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఆ కాలంలో జరిగిన ఉత్పత్తులు, ఎగుమతులు, నౌకాయానంతో అవగతమయ్యే భౌగోళిక వాస్తవాలు, జాతుల వివరాలు, చరిత్ర వంటి విషయాలను కూడా ఆ పుస్తకం స్పృశించింది. ఇంకా- పశ్చిమాన ఉన్న ఈజిప్ట్ ‌నుంచి తూర్పున ఉన్న మాలే ద్వీపకల్పం వరకు భౌగోళికాంశాల ప్రాతిపదికగా నడిచిన రాజకీయ పరిణామాలను కూడా ఆ పుస్తకం చర్చించింది. ఆ పుస్తకమే- ‘పెరిప్లస్‌ ఆఫ్‌ ఎరిత్రియన్‌ ‌సీ’. కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్ర గతిని మార్చాయి. కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్ర తన గతిని మార్చుకున్న తీరును అధ్యయనం చేయడానికి ఉపకరిస్తాయి. ఈ రెండో కోవకు చెందినదే పై పుస్తకం. హిందూ మహాసముద్రం మీదుగా నాడు జరిగిన నౌకా వాణిజ్యానికి ఆ పుస్తకం ఒక మార్గదర్శి. అరేబియా, ఆఫ్రికా, భారత్‌, ‌పర్షియన్‌ అగాధం, మాలే ద్వీపకల్పాల నుంచి సాగిన నౌకా వాణిజ్యం గురించి ఈ పుస్తకమంతా ప్రస్తావనలు కనిపిస్తాయి. భారత్‌కు సంబంధించి సింధ్‌, ‌దక్షిణ భారత నౌకాశ్రయాల ప్రస్తావన ఇందులో ఉంది.

అందుకే భారతదేశంలో ప్రతి చరిత్ర పరిశోధకుడికీ, విద్యార్థికీ, చరిత్రకారుడికీ ఈ పుస్తకం గురించి తెలిసే ఉంటుంది. గ్రీకులో దీని పేరు, ‘పెరిప్లస్‌ ‌మారిస్‌ ఎరిత్రియ’ (పెరిప్లస్‌ ఆఫ్‌ ‌ది ఎరిత్రియన్‌ ‌సీ). ఈజిప్ట్ ‌నుంచి భారత్‌ ‌వరకు ప్రయాణించిన ఒక నావికుడు లేదా వాణిజ్యవేత్త అనుభవాలే ఇవన్నీ. చాలామంది అభిప్రాయం ప్రకారం ఎవరో ప్రధాన నావికుడే వీటిని నమోదు చేశాడు. నౌకామార్గ అన్వేషణలో చరిత్ర సృష్టించిన, చరిత్రను కొత్త మలుపు తిప్పిన మార్కోపోలో, కొలంబస్‌, అమెరిగో వెస్పూచి వంటివారు నమోదు చేసినట్టు ప్రాచీన కాల నౌకా వాణిజ్యం గురించి, నౌకాయాన చరిత్రను ఈ పుస్తకం తెలియచేస్తోంది. ఈ పుస్తకాన్ని సవరణలతో క్రీస్తుశకం 1800 సంవత్సరంలో మొదటిసారి విలియం విన్సెంట్‌ ‌గ్రీకు నుంచి ఆంగ్లంలోకి అనువదించాడు. ఆంగ్లానువాదానికి పెట్టిన పేరు, ‘ది పెరిప్లస్‌ ఆఫ్‌ ‌ది ఎరిత్రియన్‌ ‌సీ- యాన్‌ అకౌంట్‌ ఆఫ్‌ ‌ది నేవిగేషన్‌ ఆఫ్‌ ‌ది ఏన్షియంట్స్: ‌ఫ్రంది సీ ఆఫ్‌ ‌సూయోజ్‌ ‌టు ది కోస్ట్ ఆఫ్‌ ‌జంగ్యుయెల్స్’. ఈ ‌పుస్తకం అసలు ప్రతులు ప్రస్తుతం రెండే ఉన్నాయి. ఒకటి హైలెడ్‌బర్గ్‌లో ఉంది, మరొకటి అమెరికాలోని ప్రముఖ డెట్రాయిట్‌ ‌గ్రంథాలయంలో ఉంది.

14, 15 శతాబ్దాలకు చెందిన ఒక వ్రాతప్రతి బ్రిటిష్‌ ‌మ్యూజియంలో ఉంది. అయితే ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇది 10వ శతాబ్దానికి చెందిన బైజాంటైన్‌ ‌వ్రాతప్రతి. ఈ వ్రాతప్రతినే రోమ్‌ ‌నుంచి హీడెల్‌బర్గ్‌కు తీసుకువెళ్లారు. అది కూడా 1618-1648 మధ్య జరిగిన ముప్పయ్యేళ్ల యుద్ధం సందర్భంలో తీసుకువెళ్లారు. నెపోలియన్‌ ‌బోనాపార్టీ యుద్ధాల సమయంలో పారిస్‌కు వెళ్లింది. తరువాత కొన్ని కారణాల వల్ల మళ్లీ 1816లో హీడెల్‌బర్గ్ ‌విశ్వవిద్యాలయం గ్రంథాలయానికి చేరుకుంది. ఇంగ్లీష్‌లో ఉన్న ఈ వ్రాతప్రతిని మొదట 1533లో అచ్చువేశారు. కొన్ని కొన్ని మార్పులతో సవరణలతో తరువాత కూడా ఇది అచ్చువేశారు. అంత ప్రాధాన్యం ఉంది ఈ పుస్తకానికి.

చిత్రం : 1 నహపాణునికి కాలానికి చెందిన నాణెం. ఇందులో బొమ్మ వైపు ఉన్న ఆ చిత్రం పాలకునిది. బొరుసు వైపు ఉరుము, బాణం గుర్తు ఉన్నాయి. పాలకుని బొమ్మ చిత్రించిన వైపున గ్రీకులో అక్షరాలు ఉన్నాయి. రెండో వైపున ఖరోష్టి లిపిలో అక్షరాలు ఉన్నాయి.

 డెట్రాయిట్‌ ‌గ్రంథాలయంలోనే ఆ వ్రాతప్రతిని నేను చదివాను. ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాలయం ఎంతో అపురూపంగా చూసుకుంటున్నది. అతి కష్టం మీద ఆ గ్రంథాలయ అధికారి పుస్తకం నా ముందు పెట్టాడు. నా చేతికి తొడుగులు వేసుకోమన్నారు. అక్కడి మహిళా ఉద్యోగిని నాకు కాపలా ఉంచారు. పుస్తకం మీద ఒత్తిడి పెట్టకూడదు, పేజీలను ఫొటోలు తీయకూడదన్న ఆంక్షలు సరేసరి.

ఈ పుస్తకంలో భారతీయులకీ, తెలుగువారికీ కూడా ఆసక్తి కలిగించే విషయాలు విశేషంగా ఉన్నాయి. క్రీస్తుశకం మొదటి శతాబ్దం ద్వితీయార్థంలో, అంటే ఆ అనుభవాలు అక్షరబద్ధమైన కాలంలో ఇక్కడ ఏ రాజ్యాలను ఏ వంశాలు పాలిస్తున్నాయి? పశ్చిమ క్షాత్రపు వంశీయుడు నహపాణుడు విశాల సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. అయితే అప్పటికి శాతవాహన వంశీకుడు గౌతమీపుత్ర శాతకర్ణి అతడి మీద దండయాత్ర చేసి నష్టం కలిగించలేదు. ఆ పుస్తకంలో తరచూ కనిపించే నంబనస్‌ అం‌టే నహపాణుడే. బ్రోచ్‌ ‌లేదా బరూచ్‌ ‌నౌకాశ్రయాన్ని క్రీస్తుశకం మూడో శతాబ్దంలో బరుగాజాగా పిలిచేవారు. ఇంచుమించు అదే పేరుతో అంటే, బార్యాగాజా అంటూ అదే నౌకాశ్రయం పేరును ఈ పుస్తకం పేర్కొన్నది. చేర వంశం, తొలితరం పాండ్యరాజుల కాలం నాటి ముజిరిస్‌ (‌కొడంగల్లూరు దగ్గర) నౌకాకేంద్రం గురించి కూడా ఎరిత్రియన్‌ ‌సీ ప్రస్తావించింది. ఇక్కడ నుంచి మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు విరివిగా ఎగుమతి అయ్యేవని చెప్పింది. తమిళగం అన్న పేరు, ఇండో చైనా సరిహద్దుల గురించి కూడా ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి.

 గాలి వాటును బట్టి, రుతుపవనాలను బట్టి గ్రీకులు వారి నౌకను హిందూ మహాసముద్రంలో నడుపుకొచ్చారు. అప్పటి ఎగుమతులు, దిగుమతుల వివరాలు తెలుసుకున్నారు. ఈ మార్గమంతా ఉన్న రాజ్యాల గురించి, పాలక వంశాల గురించి ఆ పుస్తకంలో తెలియచేశారు. కుషాణులు ఉత్తర భారతాన్ని ఏలుతున్నారు. మధ్య భారతంలో నహపాణుడి విశాల రాజ్యం ఉంది. దక్షిణ భారతం లోను, పశ్చిమ తీరంలోను శాతవాహనులు, పాండ్యులు రాజ్యాలు ఏలుతున్నారు.

శాతవాహనులు, పాండ్యులు… ఈ వంశాల పేర్లు తెలుగు ప్రాంతాల వారిని ఆకర్షించకుండా ఉండవు. అలాగే నహపాణుని పేరు కూడా ఆసక్తి రేపేదే. శాతవాహనులు పురాతన భారతంలో విఖ్యాతులైన, ప్రజారంజక పాలకులుగా చరిత్ర ప్రసిద్ధులు. వాయువ్యాన పశ్చిమ క్షాత్రపులు ఉండేవారు. ఈ వంశం మూలాలు ఉన్నవి క్షహరాట కుటుంబాలు. అవి రెండు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. అనంతరకాలాలలో వీరినే కర్దమకులు అన్నారు. భూమక, నహపాణ ఈ కుటుంబంలోని వారే. వీరు విడుదల చేసిన ప్రతి నాణెం మీద ఉరుము, బాణం గుర్తులు ఉండేవి. కర్దమక కుటుంబీకులుగా పేరు పడిన వీరి వారసులు కూడా చిరకాలం పాలించారు. కానీ వారు మాత్రం ఆ గుర్తులను నాణేలను (మొదటి చిత్రం) ముద్రించలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి దండెత్తి వచ్చి నహపాణుని ఓడించడమే కాకుండా, సుదీర్ఘ కాలంగా ఆ రెండు రాజవంశాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వాలకు తుదివాక్యం పలుకుతూ అతడిని చంపాడని చారిత్రక గాథ.

ఇంతకీ చరిత్రలో ఇంత పేరు తెచ్చుకున్న ఈ పుస్తక రచయిత ఎవరో తెలియదు. గ్రీక్‌ ‌భాషలో, 6,300 పదాలతో ఉన్న ప్రాచీన గ్రంథమిది. గ్రంథకర్తే కాదు, ఏ కాలంలో అక్షరబద్ధమైందో కూడా ఇదమిత్థంగా తెలియదు. ఏ ఉద్దేశంతో ఆ రచయిత ఈ పుస్తకం రాసుకున్నాడో కూడా ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలి ఉంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుశకం మొదటి శతాబ్దం ద్వితీయార్ధంలో ఈ రచన జరిగి ఉంటుంది. రాసినది మాత్రం ఒక్క రచయితే. అలాగే ఇతడు ఈజిప్ట్‌కు చెందినవాడని కూడా తేల్చారు. ఈ అంశం మీద కూడా వాదోపవాదాలు ఉన్నాయి. ఇతడికి భారత పశ్చిమ భాగంలో ఉండే హిందూ మహా సముద్రంతో పాటు, ఎర్ర సముద్రం గురించి కూడా పరిజ్ఞానం ఉంది. ఇతడు నావికుడు కావచ్చు. లేదా నౌకా వాణిజ్యం చేసే వ్యాపారవేత్త కూడా కావచ్చు. అయితే ఈ వివాదాలేవీ ఆ పుస్తకం ఘనతను మాత్రం ప్రశ్నించలేవు. ఇతరులు ఇచ్చిన సమాచారం, స్వీయానుభవాలను మేళవించి అతడు రాశాడని మాత్రం అర్ధమవుతుంది. కానీ ఆ అజ్ఞాత రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు, సంస్కృతుల గురించిన అపోహలు ఇందులో ఉన్నాయన్న ఒక ఆరోపణ మాత్రం ఉంది.

చిత్రం : 2

ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసి అంశం ఒకటి ఉంది. తెలంగాణలో కొండాపూర్‌ (‌చిత్రాలు 2,3), పెద్దబంకూరు, కోటిలింగాలలోను, ఇంకా సంగారెడ్డి, హైదరాబాద్‌ ‌ప్రాంతాలలో దొరికిన కొన్ని నాణేల మీద సరిగ్గా ఆ గుర్తులే – ఉరుము, బాణం ఉన్నాయి. కానీ ఇవి భూమకుడు లేదా నహపాణుడు విడుదల చేసిన నాణేలు కావని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతారు. దీనిని బట్టి ఒక అంశం అర్ధమవుతుంది. ఆ రెండు రాజవంశాల మధ్య వైరం చిరకాలం కొనసాగింది. నహపాణుడు మరణించినా, అంతిమ విజయం శాతవాహనుల పరం కాలేదని కూడా చెప్పుకోవచ్చు. శాతవాహనుల నాణేల మీద బొరుసు వైపున ఉజ్జయిన్‌ ‌గుర్తు ఉంటుంది. కానీ క్షాత్రపుల నాణేల మీద ఉరుము గుర్తు కనిపిస్తుంది. కానీ ఉరుము, బాణం గుర్తు ఉన్న నాణేలు, అరుదుగానే అయినా, తెలంగాణలోని ఈ ప్రాంతాలలో లభ్యమయినాయంటే, అప్పటికి స్థానిక పాలకులతో క్షాత్రపులు సంబంధాలు కలిగి ఉన్నారా?

చిత్రం : 3 –  చిత్రాలు 2,3 ఈ రెండు కొండాపూర్‌లో దొరికిన నాణేలు. ఒకటి రాగి నాణెం కాగా, రెండవది సత్తు నాణెం. ఉరుము, బాణం అలాగే స్వస్తిక్‌ ‌గుర్తులను ఈ నాణేల మీద చూడవచ్చు.

ఉరుము, బాణం గుర్తులతో ఉండి, కొండాపూర్‌ (‌తెలంగాణ)లో దొరికిన నాణేలను ప్రఖ్యాత చరిత్రకారుడు మిరాసి పరిశోధించారు. తరువాత మరొక ప్రఖ్యాత చరిత్రకారుడు సర్కార్‌ ‌కూడా అధ్యయనం చేశారు. పశ్చిమ క్షాత్రపులు దక్కన్‌లోని ఈ ప్రాంతాన్ని ఏనాడూ పాలించలేదు. అయినా వారికి చెందిన నాణేలుగా చెప్పదగినవి ఇక్కడెందుకు దొరికాయి అన్నది ఆసక్తి రేపే అంశమే. ఇవన్నీ 80 నుంచి 458 గ్రెయిన్ల బరువుతో, 0.70 నుంచి 1.80 అంగుళాల పరిమాణంలో ఉన్నాయి. కానీ వీటిలో ఒకే ఒక్క నాణెం మీద మాత్రం అక్షరాలు అసంపూర్ణంగా (2,3 చిత్రాలు) ఉన్నాయి. ప్రాకృతంలో ఉన్న ఈ రాతలను విశ్లేషించడంలోనే అటు మిరాసి, ఇటు సర్కార్‌ ‌కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మిరాసి అభిప్రాయం ప్రకారం, ఆ అక్షరాలను ఇలా చదవాలి, ‘మహాసేనాపతి స రాదాజిపుతాస సగమాన చుతుకులాస’. దీనర్ధం- చుతు కుటుంబీకుడు, రాదాజి కుమారుడు అయిన మహాసేనాపతి సాకా మానా. మిరాసి ప్రకారం వీరిది మహిష రాజవంశం. సర్కార్‌ అభిప్రాయం ప్రకారం, ఆ అక్షరాలు ఇలా చదవాలి, ‘ మహాసేనాపతి భారద్వాజిపుత్ర సగమ వంశీక చుతుకుల. వారిది సగమ వంశమే కానీ, మహిష వంశం కాదని ఆయన వాదన. చుతుకుల అనేది వ్యక్తినామం. శంకరనారాయణ అనే మరొక చరిత్రకారుడు 1972 ప్రాంతంలో ఈ రెండు వాదాల మధ్య సమన్వయం తేవాలని భావించినా సాధ్యపడలేదు. నహపాణుని ఓటమి తరువాత ఆ వంశీకులు కొందరు ఉజ్జయిన్‌ ‌నుంచి నేటి తెలంగాణ ప్రాంతానికి వచ్చారని మిరాసి వాదన. నహపాణుని రాజధాని అదే. శాతవాహనుల పతనం తరువాత వీరే పై చేయి సాధించి ఉండవచ్చు.

చరిత్ర రచన అనేది ఒక నిరంతర పక్రియ. కొత్త సమాచారం బయటపడితే కొన్ని కొత్త వాక్యాలు చరిత్రకు తోడవుతాయి. తెలంగాణ లేదా తెలుగువారి చరిత్ర కూడా అంతే. తెలంగాణ వారి సంపూర్ణ చరిత్రను నిర్మించుకోవాలంటే ఈ ప్రాంతాన్ని ఏలిన అన్ని రాజవంశాల చరిత్ర సేకరించాలి. ఆ పాలకులు చిరకాలం పాలించినా, స్వల్పకాలం ఏలినా చరిత్ర నిర్మాణంలో భాగంగానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించిన నాణేలు ఒక కొత్త విషయాన్ని మనకి చెబుతున్నాయి. అలాగే పారమార్లు, గజపతులు కూడా కొద్దికాలమే అయినా తెలంగాణను పాలించిన మాట నిజం. వారు ఇక్కడి చరిత్రలో భాగమన్నది అంతే నిజం. శాతవాహన వంశ నిర్మాత చిముకుడు జున్నార్‌ ‌ప్రాంతాన్ని జయించి, అక్కడ మాత్రమే నివశించే సింహం గుర్తుతో నాణేలు ముద్రించాడు. శాతవాహనుల పతనం తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన నహపాణుని వంశీకులు కూడా జున్నార్‌ ‌సింహం ముద్రతో ఉన్న నాణేలు ముద్రించారు. అయితే వీటిని ఎప్పుడు విడుదల చేశారో స్పష్టంగా తెలియదు. నహపాణుని శిలాశాసనాలను పూర్తిగా అధ్యయనం చేస్తే ఈ సంగతి తెలియడానికి మార్గం ఏర్పడుతుంది. కర్దమక కుటుంబ వ్యవస్థాపకుడు చాస్తానాకు, గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు వాసిష్టపుదుమావికి మధ్య వైరం ఉన్నట్టు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తున్నది. మరొక విచిత్రమైన సంగతి కూడా ఉంది. పశ్చిమ క్షాత్రపులకు, ఇక్ష్వాకులకు మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్ష్వాకులు శాతవాహనుల తరువాత కృష్ణ లోయలో రాజ్యాన్ని ఏలిన వారు ఇక్ష్వాకులే. తెలుగు ప్రాంతాలతో రకరకాలుగా బంధం ఉన్న ఈ రాజవంశీకుల చరిత్రను రేపటి చరిత్రకారులైనా వెలుగులోకి తెస్తారని ఆశిద్దాం.

– ‌డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్‌, అపోలో

By editor

Twitter
Instagram