–  డా।। మన్మోహన్‌ ‌వైద్య
ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సహ సర్‌ ‌కార్యవాహ

మా.గో. (బాబూరావ్‌) ‌వైద్య పేరుతో అందరికీ సుపరిచితులైన మాధవ గోవింద వైద్య మా నాన్నగారు. కృతార్థ, సక్రియ, ప్రేరణాదాయకమైన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి 97 ఏళ్ల వయసులో 2020 డిసెంబర్‌ 19‌న పూర్ణత్వంలో విలీనమయ్యారు. కుటుంబ వాత్సల్యం, ధ్యేయనిష్ఠతో కూడిన తన జీవితాన్నంతా సంఘానికి సమర్పించారు. 1931లో ఆయన తమ ఊరి నుండి చదువు నిమిత్తం నాగపూర్‌ ‌వచ్చారు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘంతో పరిచయమేర్పడి స్వయంసేవక్‌ అయ్యారు. 1938లో సంఘంలో బాధ్యతలు చేపట్టిన దరిమిలా 15 ఏళ్ల వయసు నుండి 95 ఏళ్ల వయసు దాకా వారు ప్రతిరోజూ దైనందిన శాఖకు హాజరయ్యారు. తొలినాళ్లలో సంఘ బాధ్యతలు, తర్వాత జనసంఘ్‌, ‌పాత్రికేయ వృత్తి, మహారాష్ట్ర విధాన మండలి (కౌన్సిల్‌) ‌సభ్యుడిగా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖిల భారత బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌గా, ప్రచార ప్రముఖ్‌గా, సంఘ అధికార ప్రతినిధిగా ఆయన వ్యవహరించారు. ఆ తదుపరి ఏ బాధ్యత లేకపోయినా స్వయంసేవక్‌గా దైనందిన శాఖకు వెళ్లటం ఆయనకు నిత్యకృత్యమైంది. 95 ఏళ్ల వయసు తర్వాత కరోనా లాక్‌డౌన్‌ ‌దాకా వారు సాప్తాహిక్‌ ‌శాఖకు వెళ్లేవారు. వారి జీవన దృష్టి, సమయ పాలన, ఆర్థిక వ్యవహారాల పట్ల వ్యవహరించే తీరుతెన్నులు సైతం పవిత్రతకు సంకేతాలుగా కనిపిస్తాయి. చివరికి వారు నిర్యాణం చెందిన తీరు కూడా.


కేవలం ఆర్ధిక పరంగా సఫలత సాధించటం, ప్రతిష్ఠాత్మక పదవులు పొందటం జీవన ధ్యేయం కాకూడదు, కారాదు కూడా. ఎందుకంటే, జీవితాన్ని గడిపేందుకు డబ్బు సంపాదించే సాధనాన్ని వెతుక్కోవడం జీవన ధ్యేయం కాదు. జీవిత సాఫల్యం లేక సార్థకతను యోచన అనే గీటురాయితో పరీక్షించాలనే వారు మా నాన్నగారు. ఈ కారణాల వల్లే వారు స్వయంగా తన జీవితంలో, కుటుంబంలో మా సోదరీ సోదరుల్లో పదవులతో కేంద్రీకృతమైన (careerist) ఆలోచనలకు బదులుగా సమాజ కేంద్రీకృతమైన సకారాత్మక జీవితం గురించి ఆలోచించే విధంగా వేర్లు బలంగా నాటారు. అందువల్లే సకారాత్మక జీవనం వైపు చూసే దృష్టి మాలో వికసించింది. ఇలాంటి తొలి సంఘటన నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఎదురయింది. తెలంగ్‌ ‌సార్‌ ‌మాకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేందుకు వచ్చే వారు. ‘‘My aim in life’’ (నా జీవిత లక్ష్యం)అనే అంశంపై వ్యాసం రాసి తీసుకొని రమ్మన్నారాయన.

1969-70 నాటి సంఘటన ఇది. మా క్లాసులోని పలువురు విద్యార్థులు ‘‘డాక్టర్‌ ‌కావడమే నా జీవిత లక్ష్యం’’ అనే వ్యాసాన్ని రాసి తీసుకొచ్చారు. మరి కొందరేమో ఇంజనీరు కావాలనేదే తమ ధ్యేయమనీ, ఐఏఎస్‌ అధికారి కావాలనీ, మిలిటరీ ఆఫీసర్‌ ‌కావాలనేది తమ లక్ష్యమని రాసి తీసుకొచ్చారు. నేను మా నాన్నగారితో చర్చించి వ్యాసం రాశాను. ‘ది ఎయిమ్‌ ఆఫ్‌ ‌మై లైఫ్‌ ఈజ్‌ ‌టు బీ ఏ సోషల్‌ ‌రెవెల్యూషనరీ’ అని వ్యాసాన్ని మొదలెట్టమని మా నాన్నగారు సలహా ఇచ్చారు. దీని తరువాతి వాక్యంగా ‘‘టు అర్న్ ‌మై లైవ్లీహుడ్‌, ఐ ‌మే బి ఎన్‌ ఇం‌జనీర్‌, ‌డాక్టర్‌, ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆర్‌ ఎ ‌మిలిటరీ ఆఫీసర్‌’’ అని రాశాను. జీవితాన్ని గడిపేందుకు డబ్బు సంపాదన అనే సాధనాన్ని సాధించటం జీవన ధ్యేయం కాదు, జీవిత లక్ష్యం వేరుగా ఉంటుంది. తెలిసో తెలియకో ఈ ఆలోచన మదిలో నాటుకు పోయింది.
పదవ తరగతిలో నాకు మంచి మార్కులు వచ్చాయి. రసాయనశాస్త్రం నాకు ఇష్టమైన అంశం. ఎవరికయితే మంచి మార్కులు వచ్చాయో, అలాంటి పలువురు విద్యార్థులు వైద్య విద్యలో చేరేందుకు ఇష్టపడేవారు. మా సోదరీమణుల్లో ఒకామె మెడికల్‌ ‌కాలేజ్‌లో చదువుతుండేది. మా నాన్నగారితో నేను ఈ విషయం గూర్చి మాట్లాడాను. నాన్నగారు స్పష్టంగా ఇలా చెప్పారు, ‘మన దేశానికి కేవలం డాక్టర్ల ఆవశ్యకత లేదు’. మరో ఏడాది తరువాత 1971లో నేను ఇంజనీరింగ్‌లో చేరే విషయమై చర్చకొచ్చింది. అప్పుడు కూడా నాన్నగారు స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పారిలా ‘మన దేశానికి కేవలం ఇంజనీర్ల ఆవశ్యకత లేదు’. ఇలాంటి చిన్ని చిన్ని మాటలతో మన దేశానికి ఎలాంటి ఆవశ్యకత ఉంటుంది? ఈ విషయాన్ని గూర్చి చర్చించాలన్న ఆసక్తిని నాన్నగారు మా సోదరీ సోదరుల్లో కలిగించారు.
నాన్నగారు మంచి చదువరి. ఇంగ్లీషు నవలల నుండి తత్త్వజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను వారు ఎంతో ఆసక్తిగా చదివేవారు. నేను ఎమ్మెస్సీ చదివే రోజుల్లో కూడా గమనించా, నేను చదివే సమయానికన్నా నాన్నగారే ఎక్కువ సమయం చదివేవారు. వారి పుస్తకాల గది ఎంతో వ్యవస్థీ కృతంగా, వైవిధ్యపూర్ణంగా ఉండేది. అవసరమైన పుస్తకం వెంటనే చేతికి తగిలేవిధంగా.
చదువుతూ ఉండండి

విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసేందుకు ఒకవైపు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసికొని, మరోవైపు 1983లో నేను ప్రచారక్‌గా సంఘ కార్యాన్ని ప్రారంభించాను. సంఘ కార్య నిమిత్తం నన్ను గుజరాత్‌కు పంపించారు. గుజరాత్‌లో నేను ఎక్కడ పని చేయాలన్న విషయం నాకు తెలియదు. అహ్మదాబాద్‌ ‌చేరాకనే అవసరమైన వ్యవస్థకు సంబంధించిన నిర్ణయం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు నాగపూర్‌ ‌నుండి బయలుదేరే దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో నేను ప్రయాణం చేయాల్సి ఉంది. సాయం శాఖ ముగిసిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు నాన్నగారు, నేను చాలా విషయాలు మాట్లాడుకున్నాం. గుజరాత్‌లో మన బంధువులెవరూ లేరు, కొత్త ప్రాంతం, కొత్త భాష, ప్రచారక్‌గా కొత్త అనుభవం.. ఇలాంటి స్థితిలో ‘జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం పట్ల అవసరమైన జాగ్రత్తలు తీసుకో, ఉత్తరాలు రాస్తూ ఉండు’ లాంటి సూచనలు, సలహాలు ఇచ్చే బదులు నాన్నగారు నాతో స్పష్టంగా ఓ మాట చెప్పారు-
‘ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించే వ్యక్తి నిత్యం కొత్తగా ఏదో ఒక పుస్తకం చదువుతుండాలి. కార్యక్షేత్రాన్ని ఎక్కడైతే కేటాయిస్తారో అక్కడ గ్రంథాలయం ఉండే ఉంటుంది. అక్కడ సభ్యత్వం తీసుకో. మంచి పుస్తకాలు చదివే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ చిన్న ప్రాంతం, గ్రామీణ ప్రాంతం కార్యక్షేత్రంగా కేటాయించారనుకో.. అక్కడ గ్రంథాలయం లేదనుకో.. అలాంటి సమయంలో మంచి పుస్తకాలున్న పరివారంతో పరిచయం పెంచుకో.. అక్కడ మంచి మంచి పుస్తకాలు చదివేటం దుకు దొరుకుతాయి’. అంటే చదివేందుకు పుస్తకాలను ఎలా సంపాదించాలి, ప్రచారక్‌ ‌బాధ్యత నిర్వర్తించే వ్యక్తి అనునిత్యం ఏదో కొత్త విషయాన్ని, కొత్త పుస్తకాన్ని చదవాలంటూ నాన్నగారు మార్గదర్శనం చేశారు.
కుటుంబ వత్సలుడు

నాన్నగారు కుటుంబం పట్ల వాత్సల్యాన్ని కురిపించే కుటుంబ వత్సలుడు. మేము చదువుకునే రోజుల్లో మానసికోల్లాసానికి ఇతరత్రా సాధనాలు ఉండేవి కావు. వేసవి సెలవుల్లో, దీపావళి పండగప్పుడు నాన్నగారు మాతో పేకాట ఆడేవారు. పేకాటలో బ్రిడ్జ్, ‌హార్ట్ ‌లాంటి కొత్త కొత్త ఆటలు సైతం వారే మాకు నేర్పారు. మా బంధువర్గం చాలా పెద్దది. ఇవాళ్టికీ పెద్దదే. వీళ్లందరితోనూ బంధుత్వాన్ని కొనసాగించేందుకు ఆయన సమయాన్ని వెచ్చించేవారు. బంధువుల ఇళ్లల్లో జరిగే అన్ని విధాలైన కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకునేవారు. నాన్నగారికి వ్యవసాయం చేయడం వచ్చు. ఆయన మంచి రైతు కూడా. సాగు చేసే పద్ధతుల్లో అనేక ప్రయోగాలు మా గ్రామంలోనే జరిగాయి. మనుషుల్లోని గుణదోషాలను అంచనా వేసినట్టే ఎడ్లలోని గుణదోషాలను అంచనా వేసి ఎంపిక చేసేవారాయన. వ్యవసాయ భూములని నాగలితో దున్నేందుకు ఎడ్లనే ఉపయోగించే వారు. మేలు జాతి ఎడ్లని ఎంపిక చేసి కొనుగోలు చేసేందుకు నాన్న సుదూర ప్రాంతమైన తెలంగాణ దాకా వెళ్లేవారు. నేను కూడా నాన్నతో కలిసి పలుమార్లు ఎడ్ల కొనుగోలు కోసం సంతలకి వెళ్లాను. ఊర్లో మా వ్యవసాయ భూమిని అమ్మేసిన తరువాత కూడా నాన్నగారు తన జీవన పర్యంతం ఊరితో సంబంధాన్ని కొనసాగించారు. జాతర జరిగినప్పుడు, రైతుల ముఖ్యమైన పండగ ‘పోలా’ జరిగినప్పుడల్లా నాన్నగారు తప్పనిసరిగా మా గ్రామానికి వెళ్లేవారు. ‘పోలా’ సందర్భంలో మంచి ఎడ్ల జోడిని ఎంపిక చేసి బహుమతులు అందజేయ టమే కాకుండా వాటిని బాగా చూసుకోవాలని ప్రోత్సహిస్తూ సలహాలిచ్చేవారు. జీవితంలో 50 ఏళ్లు పూర్తవగానే ఆయన ఇంటి కోసం సమయం వెచ్చించడం మొదలెట్టారు. ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి దాకా చాతుర్మాస సమయంలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఒక స్తోత్రమో, భగవద్గీతలోని ఒక అధ్యాయమో చదవటం, గీతకు సంబంధించిన ఏదో ఒక పుస్తకమో సామూహికంగా పారాయణం చేసేవారం. ఎవరెక్కడ ఉన్నా కూడా రాత్రి 9 గం. వరకు ఇంటికి చేరుకోవాలని కుటుంబ సభ్యులందరికీ ఓ నియమాన్ని నిర్దేశించారు నాన్న గారు. నాన్నగారు సైతం ఈ నియమాన్ని పాటించారు, ఈ నాలుగు నెలల కాలంలో రాత్రి 9 గంటల తర్వాత జరిగే ఏ సార్వజనిక కార్యక్రమంలో పాల్గొనటానికి ఆయన ఇష్టపడేవారు కాదు.
స్వీయ అనుశాసనం

అరవై సంవత్సరాలు పూర్తవగానే సంపాదక పదవి నుండి విరమించుకోవాలన్నది ఆయన కోరిక. అయితే మరి కొన్నాళ్ల దాకా ఆయన్ని సంపాదక పదవిలో కొనసాగించాలన్నది ‘తరుణ్‌ ‌భారత్‌’ ‌నిర్వాహకుల అభిప్రాయం. కానీ తాను అనుకున్న మేరకు నాన్నగారు సంపాదక పదవి నుంచి తప్పుకున్నారు. తరువాతి కాలంలో ‘తరుణ్‌ ‌భారత్‌’‌ను నిర్వహిస్తున్న ‘నరకేసరి ప్రకాశన్‌’ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌గా, అటు పిమ్మట చైర్మన్‌గా సేవలు అందించారు. ఈ సేవలు కూడా తన డెబ్బయి ఏళ్లు వచ్చే దాకా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత బాధ్యతల్లో 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొనసాగరాదనే నిర్ణయం తీసుకున్నారాయన. ఇది 1998 సంవత్సరం నాటి మాట. ఆ తర్వాత ఆయన సాధారణ స్వయంసేవక్‌గానే కొనసాగారు. 2000 సంవత్సరంలో సంఘంలో తొలిసారిగా అధికార ప్రతినిధి నియామక ప్రస్తావన కార్యరూపం దాల్చింది. అప్పుడు సంఘ పెద్దల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు మూడేళ్ల పాటు మాత్రమే ఈ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి సరిగ్గా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగి తప్పుకున్నారాయన.
సమయ పాలన
నాన్నగారు సమయ పాలనని కచ్చితంగా పాటించేవారు. సంఘ శాఖకి, కుటుంబానికి, గ్రంథ పఠనానికి కేటాయించిన సమయాన్ని ఏ మాత్రం జవదాటే వారు కాదు. మొదట్లో రేడియోలో వార్తలు వినేవారు, తరువాత టెలివిజన్‌ ‌వచ్చాక వార్తలు చూసేందుకు సమయాన్ని వెచ్చించేవారు. ఆయన సమయపాలన కూడా విలక్షణమైన రీతిలో ఉండేది. నేను ప్రచార ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించే సమయంలో పలువురు జర్నలిస్టులు కలిసేవారు. వారిలో కొందరు నాతో చెప్పే వారు – ‘మేం అయిదు నిముషాలు ఆలస్యంగా వచ్చినా మీ నాన్న గారు మమ్మల్ని పంపించేసేవారు. ఒక జర్నలిస్టు నాతో మాట్లాడుతూ అన్నారిలా… ఆలస్యంగా వచ్చినందుకు మాట్లాడకుండా పంపించేశారు మీ నాన్నగారు, తరువాత నేను అడిగితే మరుసటిరోజు సాయం కాలం 4 గంటలకు రమ్మన్నారు. దాంతో నేను మరుసటి రోజు సాయంకాలం గం.3.30 చేరుకున్నా. గదిలో మీ నాన్నగారు ఒక్కరే పుస్తకం చదువుతూ కనిపించ డంతో వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశా, అయితే వెంటనే ఆయన సైగ చేసి ఇంకా 4 గంటలు కాలేదు కదా అని చెప్పుతూనే మళ్లీ పుస్తకం చదవటంలో లీనమయ్యారు. సరిగ్గా 4 గంటలు అవగానే వారు పుస్తకం చదవటం ఆపేసి నన్ను పిలిచి మాట్లాడారు’. నాన్నగారు సమయపాలన ఎంత కచ్చితంగా పాటించే వారో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే.
ఆర్ధిక అనుశాసనం

సంఘ అధికారుల మాట మేరకు 17 ఏళ్ల వయసులో సంపాదించుకున్న హెడ్‌మాష్టరు ఉద్యోగాన్ని వదిలేసి పాత్రికేయ వృత్తిలో అడుగెట్టారు నాన్న. కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరుగుతున్న సమయాన ఎక్కువ వేతనం వస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తక్కువ జీతం వచ్చే పాత్రికేయ వృత్తిలో చేరినందుకు నాన్న గారిది అనాలోచిత నిర్ణయమని కొందరు విమర్శించారు. నాన్నగారు మాత్రం దీన్ని సమాజ హితం కోసం, ధ్యేయనిష్ఠతో కూడిన జీవితం కోసం సహజత్వంతో కూడిన నిర్ణయంగా భావించారు. మా అమ్మ అనుమతితో, చేయూతతో నాన్నగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మా కన్నా తక్కువ వేతనంతో కుటుంబాలని నడుపుతున్న పలువురు నాకు తెలుసు అనేవారు. ఆర్ధిక అవసరాలను తగ్గించుకొని ఎవరి ముందు కూడా చేయి చాపకుండా స్వాభిమానంతో, ఆర్ధిక అనుశాసనంతో జీవితాన్ని గడిపారు. ఉన్న ఆర్ధిక వనరులను దృష్టిలో పెట్టుకొంటూనే ఆర్ధిక వ్యవహారాలను పవిత్రంగా కొనసాగించేవారు. నా చిన్న తమ్ముడు రామ్‌, ‌ప్రస్తుతం విశ్వవిభాగ్‌లో ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన విద్యార్థుల కోసం ఫీజు రద్దు పథకాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్నగారు రిటైరయిన విషయం తెలిసి కాలేజ్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ ‌విభాగం ఉద్యోగి ఒకరు సూచించడంతో రామ్‌ ‌ఫీజు రద్దు కోసం దరఖాస్తు నింపి ఇచ్చాడు. రామ్‌కు ఫీజు రద్దయింది. ఆ తరువాత నాలుగు నెలల దాకా రామ్‌ ‌ఫీజుకోసం డబ్బు అడగకపోవటంతో నాన్నగారే పిలిచి విషయం అడిగారు. ఫీజు రద్దయిన సంగతి మొత్తం నాన్న గారికి రామ్‌ ‌చెప్పాడు. దాంతో నాన్నగారు రామ్‌తో చెప్పారిలా ‘నీ ఫీజు కట్టేందుకు అవసరమైన డబ్బుని నేను సమకూర్చి పెట్టాను’ అని. అటు పిమ్మట ఆయన యూనివర్సిటీకి ఓ లేఖ రాశారు- ‘పొరపాటున మా అబ్బాయి ఫీజు రద్దయింది, కనుక ఆ నాలుగు నెలల ఫీజుని పెనాల్టీతో కట్టేస్తాను’ అంటూ కట్టేశారు.

‘తరుణ్‌ ‌భారత్‌’ ‌పత్రికా సంపాదకుడిగా నాన్నగారు కొనసాగుతున్న రోజుల్లో మా పెద్దన్న ధనంజయ్‌ ఒక వైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు ఓ చిన్నపాటి వ్యాపారాన్ని మొదలెట్టారు. ఈ వ్యాపారంలో భాగంగా ఆయన బయటి ప్రాంతాలకి ఫోన్‌ ‌చేసేవారు. ఆ ఫోన్‌ ‘‌తరుణ్‌ ‌భారత్‌’ ‌వాళ్లది. ప్రతినెలా టెలిఫోన్‌ ‌బిల్‌ ‌రాగానే ధనంజయ్‌ ‌చేసిన ఎస్టీడీ కాల్స్ ‌డబ్బు నాన్నగారు తరుణ్‌ ‌భారత్‌కు చెల్లించేవారు. నరకేసరీ ప్రకాశన్‌కి చైర్మన్‌ ‌కావటం మూలాన నాన్న గారికి కారు, డ్రైవర్‌ ‌సౌకర్యం ఉండేది. చైర్మన్‌ ‌పదవి నుండి తప్పుకున్న రోజు నాన్నగారు ఆఫీస్‌ ‌కారులో కాకుండా రిక్షాలో ఇంటికి చేరుకున్నారు. నాన్నగారిని ఇంటివరకు చేర్చడానికి డ్రైవర్‌ ‌కారు సిద్ధంగా ఉంచి ఆఫీసు బయట నిలబడ్డాడు. మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌కూడ కారులోనే వెళ్లమని విన్నవించారు. అయినప్పటికి కారును ఉపయోగించలేదు. మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌మా అన్నయ్య ధనంజయ్‌కి టెలిఫోన్‌ ‌చేసి ‘డిప్రిసియేషన్‌’ (‌ధర తగ్గింపు)తో అదే కారుని మీకు 11వేల రూపాయలకి అమ్మేస్తాం, మీరు కొనుగోలు చేయండి, నాన్న గారికి పనికొస్తుంది’ అన్నారు. ఈ విషయాన్ని అన్నయ్య ప్రస్తావించినప్పుడు నాన్నగారు ససేమిరా అన్నారు. ఆ తర్వాతి రోజుల్లో అదేకారు 55 వేల రూపాయల ధర పలికినప్పుడు నాన్నగారు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తన నిర్ణయం ఎంత సరైనదో చెప్పారు. అలా ఉండేది నాన్నగారి ఆర్ధిక అనుశాసనం, పవిత్రమైన ఆలోచనా విధానం.

సన్మానాలు, పదవులపై కోరిక లేదు

ఆ నాటి జనతా పార్టీతో రాజకీయపరమైన ఒప్పందం చేసుకొని శరద్‌ ‌పవార్‌ ‌మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే గవర్నర్‌ ‌కోటాలో శాసనమండలి సభ్యుడి నియామకం విషయమై నాన్నగారి పేరు తరచూ ప్రస్తావనకి వస్తుండేది. రాజకీయపరమైన పదవులు పొందటానికి కొందరు చేసే ప్రయత్నాలు ఎలా ఉండేవో సార్వజనిక జీవనంలో కొనసాగే సామాన్యులకు బాగా తెలుసు. పుణెలో ‘తరుణ్‌ ‌భారత్‌’ ‌తరఫున జరిగిన ఒక కార్య క్రమంలో నాన్నగారిని శరద్‌ ‌పవార్‌ ‌కలుసుకున్నారు. ఆ సమయంలో శరద్‌ ‌పవార్‌ ‌మా నాన్నగారితో ఇలా అన్నారు – ‘శాసనమండలి సభ్యుడిగా గవర్నర్‌ ‌కోటాలో మిమ్మల్ని నామినేట్‌ ‌చేయాలనే ప్రస్తావన కేవలం మీ వాళ్ల నుండి మాత్రమే వస్తోంది. అన్యులనుండి కూడా ఈ డిమాండ్‌ ‌వస్తే ఈ నియామక వ్యవహారం మాకు మరింత సులువైపోతుంది’ అని. అప్పుడు నాన్నగారు ‘నా పేరు విషయమై నేను ప్రయత్నించాలనే మాటని అలా ఉంచండి. నా పేరు విషయాన్ని కూడా అటు ఉంచేయండి.. కొద్దిరోజుల్లోనే విదర్భ ప్రాంతం నుండి యోగ్యులైన ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పేర్లు మీకు పంపిస్తాను నామినేట్‌ ‌చేసేందుకు’ అన్నారు. అయినప్పటికీ శాసనమండలి సభ్యుడిగా నామినేట్‌ ‌చేసేందుకు నాన్నగారి పేరునే ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని నాన్నగారికి తెలిపేందుకు ఆనాటి జనతా పార్టీ అధ్యక్షురాలు సుమతి తాయిజి సుకలికర్‌ ‌మా ఇంటికొచ్చారు. నేను సాయం శాఖ నుండి ఇంటికి చేరుకున్నప్పుడు సుమతి తాయిజీ మా ఇంట్లోంచి బయటకు వస్తున్నారు. ఆమెని సాగనంపేందుకు నాన్నగారు వస్తున్నారు. ఆ సమయంలో సుమతి తాయిజీ చెప్పిన మాటలు నా చెవులో పడ్డాయి. ‘బాబురావ్‌ ‌గారూ! మీరు తిరస్కరించకండి!’ అన్నారు. పదవులకోసం వెంపర్లాడే సమయంలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నాన్నగారు ఆవిడతో చెప్పారిలా ‘ఎవరయితే నాకు తరుణ్‌ ‌భారత్‌ ‌బాధ్యతని అప్పగించారో, వారితో చెప్పకుండా, చర్చించకుండా సరేనని ఎలా చెప్పగలను తాయిజీ’ అని. ప.పూ.సర్‌సంఘచాలక్‌ ‌బాలాసాహెబ్‌ ‌దేవరస్‌ ‌పర్యటనలో ఉన్నారు. మూడురోజుల తర్వాత వారు తమ పర్యటన ముగించుకొని నాగపూర్‌ ‌చేరుకున్నారు. వారితో చర్చించి, అనుమతి తీసుకున్న తర్వాతే నాన్నగారు నియామకం విషయంలో సరే నన్నారు. మా ఇంట్లో మాత్రం మూడు రోజుల తరవాతే శాసన మండలి సభ్యుడిగా నియుక్తికి సంబంధించిన సంతోషంలో మిఠాయిల వితరణ జరిగింది.

ఈ సందర్భంలోనే నాకు మరో సంఘటన గుర్తుకొస్తోంది. ప్రతిరోజూ తమ శాఖకు వచ్చే ఒక స్వయంసేవక్‌ ‌శాసన మండలి సభ్యుడైనందుకు స్వాభావికంగా శాఖలోని స్వయంసేవకులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల తరువాత గోరక్షణ శాఖలో శరత్‌ ‌పూర్ణిమ కార్యక్రమం ఏర్పాటయింది. అందులో నాన్నగారి బౌద్ధిక్‌ ఉం‌ది. ఇదే సమయంలో స్వయంసేవకులు నాన్నగారిని సన్మానించేందుకవసరమైన ఏర్పాట్లు కూడా చేసేశారు. ఆ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను. పరిచయం, సన్మానం ముగిశాక ప్రసంగించేందుకు నాన్నగారు లేచి నిలబడ్డారు. ఆరంభంలోనే కటువుగా మాట్లాడారు- ‘రాజకీయపరమైన పదవి దొరకిన తరువాత నాలో ఏం మార్పు వచ్చింది? అదే బాబురావుని, స్వయంసేవక్‌ని. రాజకీయపరమైన పదవి లభించాక సంఘ కార్యక్రమాల్లో సన్మానాలు చేయాలనే ఆలోచన స్వయంసేవకుల్లో ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి మొదలయింది? ఇతరుల్లో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే అది వేరే మాట… స్వయంసేవకుల్లో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే అది తప్పు… ఒక స్వయంసేవక్‌ ‌ప్రచారక్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మాత్రం అతడిని అభినందించాల్సిందే’.

మృత్యువు వచ్చినప్పుడు స్వాగతించాల్సిందే

ఆయన మృత్యువుని కూడా ముందే స్వాగతించారు. ‘వినా దైన్యేన జీవన, అనాయాసేన మరణం’ అనే మాటని ఆయన తరచూ ప్రస్తావించే వారు. ఒకవేళ వారు జీవించి ఉండుంటే ఈ ఏడాది మార్చి 11 వ తేదీనాటికి వారు 98 ఏళ్ల వయసు దాటి 99 ఏళ్ల వయసులో అడుగెట్టి ఉండేవారు. 2017 వారు ఇలా రాసి పెట్టారు- ఏ స్థలం (గ్రామం)లో తాను తుదిశ్వాస వదిలితే అక్కడే తన అంత్యక్రియలు చేయాలని. తన మృతదేహాన్ని ఒకవేళ ఇంటికి తెస్తే 12 గంటలకు మించి ఉంచరాదు. విద్యుత్‌ ‌దహన వాటికలోనైనా, డీజిల్‌తో అయినా తన దహనక్రియలు జరపాలని కోరారు. శ్మశానంలో ఎలాంటి శ్రద్ధాంజలి సమావేశాలు జరపరాదని, ప్రసంగాలు చేయరాదని కూడా నిర్దేశించారు. మాటకు కట్టుబడేవారు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్త్వం ఆయనది. 1947లో వారి వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు నాగపూర్‌ ‌పట్టణ కార్యవాహగా వ్యవహరిస్తున్న బాలాసాహెబ్‌జీ నాన్నగారిని అడిగారట, మే 9 నుంచి మద్రాసులో నెల రోజులు జరిగే వర్గకు వెళతావా అని. నాన్నగారి నుండి సకారాత్మకమైన జవాబు వచ్చింది. అయితే ఇటు వధూవరుల పక్షాల వారు చర్చించి మే 15న వివాహం జరపాలని నిర్ణయించారు. అయితే నాన్న గారు ఇరుపక్షాల వారితో కరాఖండీగా చెప్పేశారు. వర్గ నుండి తిరిగొచ్చాకే పెళ్లి చేసుకుంటానని. దాంతో వధువు పక్షం వారు బాలాసాహెబ్‌జీని కలిసి విషయాన్ని వివరించారు. తనని కలవమని, వేరే ప్రాంతంలో జరిగే వర్గకు పంపుతానని చెప్పమని వారితో నాన్నగారికి కబురు పంపారు. వారొచ్చి నాన్నగారితో బాలాసాహెబ్‌జీ కలవమంటున్నారని చెప్పారు. అందుకు నాన్నగారు ససేమిరా అంటూ ఒకసారి బాలాసాహెబ్‌జీకి మాట ఇచ్చాను. ఇక దానికి తిరుగు ఉండదు, బాలాసాహెబ్‌జీని ఈ విషయమై రెండోసారి కలవను. వర్గ నుండి తిరిగొచ్చాకే పెళ్లి, కనుక పెళ్లి తేదీ మార్చండి అన్నారు. దాంతో వధువు పక్షం వారు కోపోద్రిక్తులయ్యారు, తమకి ఈ తీరుతెన్నులు నచ్చలేదన్నారు. వారి వ్యవహార శైలి చూసి మా తాతగారికి సైతం కోపం వచ్చింది. ‘మీ ఇష్టం. మా అబ్బాయి వర్గ నుండి తిరిగొచ్చాకే పెళ్లి చేస్తాం. మరో అమ్మాయిని చూస్తాం మా అబ్బాయికి’ అని చెప్పేశారు. అప్పుడు మా నాన్నగారు మా తాత గారితో స్పష్టంగా చెప్పేశారిలా ‘నేనొకసారి అమ్మాయిని సరే అన్నాక నా మాటకు తిరుగు ఉండదు, రెండోసారి అమ్మాయిని చూసేందుకు వెళ్లను. ఒకవేళ ఈ పది మాసాల కాలంలో అమ్మాయికి పక్షవాతం వచ్చినా, వికలాంగురాలైపోయినా, రోగగ్రస్తురాలైనా సరే, నేనొకసారి సరే అన్నాక ఆ అమ్మాయినే పెళ్లాడుతాను’. ఇలా 1947 మే నెలలో జరగాల్సిన నాన్నగారి పెళ్లి చివరికి 1948 మార్చిలో జరిగింది.

మిగతా వచ్చేవారం…

About Author

By editor

Twitter
Instagram