– జంధ్యాల శరత్‌బాబు

రాజ్యాంగ అమలు నాందికి 72 ఏళ్లు

మన భారతావని భువన పావని. భారత రాజ్యాంగం గణతంత్ర ప్రియ జన సంజీవని. జాతి యావత్తు ఏటా నిర్వర్తించే జనవరి 26 పర్వదినోత్సవానికి ఒకటి కాదు-రెండు ప్రత్యేకతలున్నాయి. దేశవ్యాప్త రిపబ్లిక్‌ ‌డేగా ప్రకటితమైందీ, రాజ్యాంగం ఆచరణకు వచ్చిందీ ఈ రోజునే. అంటే ఇప్పటి ఈ జనతంత్ర పాలనా వ్యవస్థకు నాందీవాచకాన్ని ఏడు దశాబ్దాల కిందటే పలికారన్న మాట. దీనికి మూలాధారమైన రచనా పక్రియలో పలు ప్రాంతాల రాజకీయ కోవిదులతో పాటు విభిన్న రంగాల్లో నైపుణ్యం గల ప్రముఖులూ చేయీ చేయీ కలిపారు. రూప నిర్మాణ క్రియ ముగిసేందుకు ముచ్చటగా మూడేళ్లు పట్టింది. ఇందులో భాగంగా అనేకానేక చర్చోపచర్చలు, నిర్ణయాల శర పరంపరలు! వీటన్నింటినీ కొనసాగించిన మహా బృందంలో, వివిధ సంఘాల సముదాయంలో 15 మంది మహిళా మణులున్నారు.


వారందరిలోనూ ప్రధానంగా నలుగురు మేరు శిఖర సమానులు. జాతీయ సౌధ స్థాపన క్రతువులో నాలుగు స్తంభాల వంటివారు. సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, ‌విజయలక్ష్మీ పండిట్‌, ‌సుచిత్రా కృపలానీ. తొలి ఇద్దరూ తెలుగు మూలాలు కలిగినవారు. మరొకరు సాటిలేని వనితా నేత, వేరొకరు మేటి రాజకీయ వేత్త. ‘ఘన విజయం నీదేనని విశ్వసించు, స్వజాతి ధర్మం సంరక్షించు, ప్రజాస్వామ్యంతోనే మన ఘనత, ఎన్నటికీ అజేయం భారతీయత’ అన్నదే ఆ శిష్ట చతుష్టయ ఆశ-శ్వాస. రాజకీయ స్వతంత్రత, నిస్వార్ధ ప్రభుత్వ పాలననే నలుగురూ లక్షించారు. హక్కుల కోసం పోరాడటం ఎంత ప్రధానమో, బాధ్యతల గురించి ఆరాట పడటమూ పౌరులకు అంతే ప్రథమ కర్తవ్యంగా ఉండితీరాలన్నారు. కీలకమైన రాజ్యాంగాన్ని రూపుదిద్దే క్రమంలో పరిషత్‌ ‌ప్రతినిధులుగా వారంతా నిర్వహించిన పాత్ర నిరుపమానం. ఆదర్శప్రాయం.

నారీ సురాజ్య భేరి

సురాజ్యం అనేది ఎవరో ఇస్తే పుచ్చుకునేంత ఉచితమేదీ కాదన్నారీ నారీరత్నాలు. అదంతా భారతదేశ వాసుల సర్వ సహజ వ్యక్తీకరణ శక్తిగా అభివర్ణించారు. మరీ ముఖ్యంగా సరోజినీ నాయుడు. ఎవరైనా సరే-గతం నేర్పిన పాఠాలతో భవితవ్యానికి బంగరు బాట వేసుకోవాలన్నదే ఆమె ప్రగాఢ అభిమతం. ఏది విన్నా, మరేది చూసినా మరుపంటూ లేకపోవడం మొదటినుంచీ ఆమె విలక్షణం. బెంగాలీ అయినా పుట్టినచోటు హైదరాబాద్‌ ‌కావడంతో బాల్యం నుంచే బహు భాషా వికాసం వెల్లివిరిసేది. ఏ పాట పాడినా, ఏది మాట్లాడినా ప్రతి ఒక్కరికీ వినసొంపుగా ఉంటుండేది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా- భావ పటుత్వం నిండిన కవితాగానం చేయడం కూడా ఆ కోకిలకు పరిపాటి. శాస్త్ర పరిణతిని తండ్రి నుంచే సొంతం చేసుకున్నారు. సమాజపరంగా అభిలషణీయ మార్పుచేర్పులను ఏ విధంగానైనా తేవాలన్న తపనా ఎక్కువే. సంస్కరణ వాదాన్ని అణువణువునా పుణికిపుచ్చుకున్న స్ఫూర్తిదాయిని.

రూప నిర్మాణ శోభ

తెల్లదొరల మొహాలు తెల్లబోయేలా, వారి గుండెలు దడదడలాడేలా వాదులాడటం సరోజినీ నాయుడుకి అలవాటు. జంకి వెనక్కి తగ్గడం, భావ ప్రకటనకు జడిసి వెన్ను చూపడం సుతరామూ నచ్చేది కాదు. జాతిపితతో పాటు ఎంతటి అగ్ర నాయకులతో నైనా మాటలు కలపడం నిత్య కృత్యంగా ఉంటుండేది. స్వాతంత్య్ర సమర సమయంలో ఆమె కార్యదక్షత ఎంతటిదంటే… పెద్దపెద్దవారే ముగ్ధులయ్యే వారు. వారి అభిమాన ఆదరాలే తనకు ప్రథమ మహిళా గవర్నర్‌ ‌హోదాను కట్టబెట్టాయి. మనకంటూ సొంత వ్యవస్థ ఉండాలంటూ ఆ అతివ నిర్వహించిన పర్యటన, సాధించిన సమీకరణ తిరుగులేనిది. స్వాతంత్య్ర సాధనకు 22 ఏళ్ల ముందు కాన్పూరులో ఏర్పాటైన మహాసభకు ఏకైక ఆధ్వర్యం ఆమెదే. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో కూడా మడమ తిప్పని ఘటికురాలు. ఆ సంభాషణా చతురత, ధైర్య సాహస ప్రదర్శనే అనంతర కాలంలో రాజ్యాంగ రూపనిర్మాణ ప్రతిభకు దోహదమయ్యాయి. ఎక్కడ ఎటువంటి సంక్షోభం తలెత్తినా, పరిష్కరణకు ముందుగా వినిపించింది సరోజినీ పేరే!

ఆమె తండ్రి నివసించిన బంగళాయే (హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ ‌ప్రాంతం) పరిణామ క్రమంలో – గోల్డెన్‌ ‌త్రెషోల్డ్ అయింది. రచయిత్రిగా తాను వెలువరించిన స్వర్గ ద్వారం, కాలవిహంగం పుస్తకాలు సైతం భారతీయాత్మను ప్రతిఫలించేవే. మహిళాభ్యుదయ ఆశయంతో, వారికి మరింత విద్య అందాలన్న తదేక దీక్షతో పలు ప్రదేశాలను సందర్శించారు. జనావళిలో భావ విప్లవ కారకులయ్యారు. ‘జాతి, మత, కుల సంబంధ అంతరాలొద్దు. స్త్రీ పురుష భేదభావం కూడదు. విమోచన కోసం బానిస సంకెళ్లు తెంచుకునేందుకు ఇంకా జాప్యమెందుకు’ అని ఎలుగెత్తి చాటిన ధీమంతురాలు. తన భావనల్లో అనేకవాటిని రాజ్యాంగ రచనలో పొందుపరచిన క్రియాశీలి. ఆ ధన్యురాలి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం మునుపే విడుదల చేసిన తపాలా బిళ్ల, సికింద్రాబాద్‌ ‌ప్రాంతంలో సరోజినీదేవి రోడ్డు పేరిట నామకరణం, అదే కోవలో కంటి ఆసుపత్రి స్థాపన… ఆ మహిళా నేతకు జన హృదయాల్లో ఉన్న స్థానాన్ని సుస్థిరం చేస్తున్నాయి. స్త్రీ ప్రతినిధులతో కూడిన భారత రాజ్యాంగ పరిషత్‌ ‌ప్రథమ సమావేశం ఢిల్లీలో ఏర్పాటైంది. అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చించి ఏకాభిప్రాయ సాధనకు కృషిచేశారు. మరికొన్ని సాధారణ చట్టాలకూ ఆమోదం తెలిపారు. మరో కీలకాంశం- జాతీయ పతాకను 1947 జులై 22న ఆమోదించడం.

మహోద్యమ దుర్గం

సామాజిక సేవలో ఎంతో పేరొందిన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ అసలు పేరు బెన్నూరి దుర్గాబాయమ్మ. ఊరు రాజమహేంద్రవరం. రాజ్యాంగ సభ సభ్యురాలిగా వివిధ చట్టాలపై చర్చలు సాగించారు. అదే హోదాలో 1950 వరకు ఉన్నారు. 1952లో ప్రణాళికా సంఘ సభ్యురాలయ్యారు. స్వేచ్ఛా సమర యోధురాలిగానే కాక- పూర్తిస్థాయి కార్యకర్తగా, న్యాయవాదిగానూ ఆమెకు చిర ప్రశస్తి. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డులో అమూల్య సేవలందిం చారు. హైదరాబాద్‌ ‌వేదికగా 1958లో ఆంధ్ర మహిళా సభ స్థాపకులయ్యారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్త్రీ వసతి గృహం ఏర్పాటు చేశారు. వివిధ కళాశాలల, వనితా వృత్తి విద్యా కేంద్రాల, వసతిగృహాల వ్యవస్థాపకురాలు. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. గాంధీజీ రాక సందర్భంలో తన బాల్యంలోనే విరాళాల సమీకరణ చేపట్టారు దుర్గాబాయి. వాటిని ఆయనకు తెలుగు నేలపై సమర్పించారు. దేశ విమోచన ఉద్యమ తరుణంలోనే కాకుండా, అనేకానేక సమాజ సేవ పనులలోనూ ముందడుగు ఆమెదే. పోరుబాటలో దూసుకెళ్లిన కారణంగా ఆంగ్ల పోలీసుల దౌర్జన్యానికి గురయ్యారు. అయినా ఆగక, పట్టిన పట్టు విడవక ఆడ సింహంలా ముందుకే కొనసాగారు. ఆ నాయకురాలి అభిప్రాయంలో – సేవాభావం అనేది ఒకరు నేర్పితే నేర్చుకునేది కాదు. స్థితిగతుల ప్రాబల్యాన్నీ కారణంగా చెప్పలేం. నిజానికి తాను సహజసిద్ధంగా సమాజ సేవిక. అంతే! కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆమె. మహిళా విద్య జాతీయ మండలికీ మొట్టమొదటి అధ్యక్ష బాధ్యతలు వహించారు. ముదితల పత్రికకు సంపాదకురాలు. అన్నిటికంటే మించి, దుర్గాబాయి విఖ్యాత న్యాయవాదిగా కీర్తి గడించారు. తన స్మృతిచిహ్నంగానే కోటిపల్లి బస్టాండు ప్రాంతంలోని పార్కులో విగ్రహం నెలకొల్పారు.

విజయీభవ

ఉడుంపట్టు పట్టి మరీ పెద్ద చదువులు చదువుకున్న విజయలక్ష్మీ పండిట్‌- ‌మోతీలాల్‌ ‌దంపతుల గారాలపట్టి. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూకు సహోదరి. ఈమెను మొదట్లో స్వరూప కుమారిగా పిలిచేవారు. పెళ్లి తదుపరి, నాటి సంప్రదాయ అనుసారం పేరు మారింది. తాను స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ భారత మహిళా రాయబారి బాధ్యతలు వహించారు. బహు సున్నిత మనస్తత్వం, వెంటనే స్పందించే స్వభావం. దేశీయ రాజకీయ పరిణామాలపై కంటే, స్వాతంత్య్ర మహోద్యమ నిర్వహణ తీరుతెన్నులపైనే అనురక్తి. ఉప్పు సత్యాగ్రహ సమయంలో దీటుగా పాల్గొని, పర పాలకుల ధోరణిని ఘాటుగా ధిక్కరించారు. లక్నో కారాగారంలో శిక్ష విధించినా ఎంతమాత్రం లెక్క చేయలేదు. దేశమాతకు శృంఖలాలు విడివడిన వేళ, సరికొత్త విధులు స్వీకరించి వైద్య-విద్యా రంగాలకు సమధిక ప్రాధాన్యమిచ్చారు.

వనితా సాధికారత

ఆచార్య కృపలానీ సతీమణి సుచిత్ర (సుచేత). స్వాతంత్య్ర సమరయోధ, రాజకీయ నాయకురాలు. హర్యానా ప్రాంతీయురాలు. హిందూ విశ్వవిద్యా లయం (బెనారస్‌)‌లో రాజ్యాంగ చరిత్ర అంశానికి సంబంధించి ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. ఇతర నేతలతో పాటు క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలోకి దూకి రణ పటిమ చాటారు. రాజ్యాంగ సభా సదస్సులో స్వతంత్ర దినోత్సవం రోజున తాను వందేమాతరం గీతం ఆలాపన చేయడం మరో విశేషం. ఇంకొక సామాజిక క్రియాశీల కార్యకర్త అమ్ముకుట్టి స్వామినాథన్‌. ‌మన రాజ్యాంగ పరిషత్‌లోని ఇతర మహిళా నాయకుల్లో మరి కొందరు: రాజకుమారి అమ్రిత్‌ ‌కౌర్‌, ‌హంసా మెహతా, దాక్షాయణి వేలాయుధన్‌, ‌పూర్ణిమా బెనర్జీ. భారత నవీన రాజ్యాంగ ఆమోదం 1949 నవంబర్‌ 26‌న. తుది సమావేశంలో సభ్యుల సంతకాలన్నీ జత చేరింది 1950 జనవరి 24న. ఆ తర్వాతే జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సువిశాల ప్రజానీకం నిత్య అవసరాలను తీర్చేది, నిరంతర ప్రయోజనాలను నెరవేర్చేదీ పరిషత్తు. ఆ వ్యవస్థకు సార్వభౌమత ఉండేదనుకుంటే, అందులోని (రాజ్యాంగ సభ) వనితా ప్రతినిధులూ భావ సార్వభౌములే కదా!

About Author

By editor

Twitter
Instagram