నిన్న సైనిక దళాలను, వారి త్యాగాలను ఎద్దేవా చేసిన విపక్షాలు  ఇవాళ భారత శాస్త్రవేత్తలను, వైద్యులను అవమానపరిచే పని మొదలుపెట్టాయి. కరోనా నిరోధక వ్యాక్సిన్‌ ‌గురించి అవి చేస్తున్న విమర్శలు ముమ్మాటికీ ఆ కోవకు చెందినవే. కరోనా కట్టడికి భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌లను భారత ఔషధ నియంత్రణ సంస్థ అధిపతి (డీసీజీఐ)  వీజీ సోమాని ‘అత్యవసర వినియోగానికి’ అనుమతించారు. జనవరి 3వ తేదీన వీటికి అనుమతి వచ్చింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ ‌బయోటెక్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా కొవాగ్జిన్‌. ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం (ఇంగ్లండ్‌) ‌టి-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన, సీరం ఇనిస్టిట్యూట్‌ (‌పుణే)ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

అది ‘బీజేపీ వ్యాక్సిన్‌’ అం‌టూ మరుక్షణంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌వ్యాఖ్యానించేశారు. కానీ కొద్దిసేపటికే తాను బీజేపీని విశ్వసించడం లేదు తప్ప, శాస్త్రవేత్తలను కాదు అని సవరణ ఇచ్చుకున్నారు. తన పనికిమాలిన వ్యాఖ్యతో వచ్చిన నష్టాన్ని పూడ్చడానికి ఆయన నానా తంటాలు పడ్డారు. వ్యాక్సిన్‌ ‌మీద విపక్షాలు లేవనెత్తే అభ్యంతరాలకు ప్రభుత్వం వివరణ ఇచ్చి తీరాలి కదా! అంటూ తర్కం వెలగబెట్టారు. వివరణకి సమాధానం ఇస్తారు గానీ, తలాతోకా లేని విమర్శకు ఎవరు సమాధానం చెబుతారు! మళ్లీ ఎదురుదాడి తప్పదు. ఈయన పార్టీ వాడే మీర్జాపూర్‌ ఎమ్మెల్యే అశుతోశ్‌ ‌సిన్హాకి ఈ భూప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని విషయం అర్ధమైంది. ‘బీజేపీ వ్యాక్సిన్‌’ ‌తీసుకుంటే నపుంసకులైపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఈ వ్యాక్సిన్‌ ‌తీసుకుంటే నపుంసకులైనా కావచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు అని  సిన్హా  భయపడిపోతున్నారు. ప్రజల ప్రాణాలంటే ఎంత విలువైనవి? తరువాత బాధపడకూడదనే మా నాయకుడు అలా అన్నాడు అంటూ సిన్హా గారు వివరణ కూడా ఇచ్చారు. అఖిలేశ్‌ ‌వాగుడు విన్న బీజేపీ అధికార ప్రతినిధి ‘అఖిలేశ్‌ ‌రాహుల్‌ ‌గాంధీకి గట్టి పోటీ ఇస్తున్నారు’ అంటూ కితాబు ఇవ్వవలసి వచ్చింది. అఖిలేశ్‌ ‌మాత్రమేనా! రాహుల్‌ ‌పార్టీలో వారు కూడా రాహుల్‌ అజ్ఞానంతో పోటీ పడుతున్నారు. వారే- ఆనంద్‌ ‌శర్మ, శశిథరూర్‌, ‌జైరాం రమేశ్‌. ఇం‌త హడావుడిగా ఇలాంటి వ్యాక్సిన్‌కి అనుమతులు ఇవ్వడం ఏమిటి అంటారు ఈ ముగ్గురు. అవతల ప్రపంచం మీదకి మళ్లీ స్ట్రెయిన్‌ ‌రూపంలో కరోనా దూసుకు వస్తుంటే ఈ నేతలు ఇలాంటి అవాకులు చెవాకులు పేలుతున్నారు. కానీ మోదీ మీద, బీజేపీ మీద ఎంత గుర్రుగా ఉన్నా జమ్ముకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నాలుగు మంచి మాటలే చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా రాజకీయ పక్షానికి సంబంధించిన వ్యాక్సిన్‌లు ఉండవు. ఎక్కడైనా వ్యాక్సిన్‌లు మానవాళికి సంబంధించినవే అన్నారాయన. మిగతావాళ్ల మాట నాకొద్దు. వ్యాక్సిన్‌ ‌కోసం నా వంతు వస్తే చొక్కా చేతులు మడిచి మరో ఆలోచన లేకుండా తీసుకుంటాను అని కుండబద్దలు కొట్టారాయన.

స్ట్రెయిన్‌ ‌రూపంలో వస్తున్న కరోనాకి ఈ వ్యాక్సిన్‌ ఎం‌తవరకు పని చేస్తుందో చెప్పలేం కదా! అని మరికొందరు. కాబట్టి ఆ స్ట్రెయిన్‌ ‌టీకా కూడా వచ్చేదాకా ఇంకో సంవత్సరమో, వీలైతే ఇంకో దశాబ్దమో ఆగి, ఇలాంటి వైరస్‌లు ఇంకా పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి, అవి వచ్చాక, వాటికి కూడా వ్యాక్సిన్‌ ‌కనుగొన్నాక, తాపీగా కొవిడ్‌ ‌స్ట్రెస్‌, ‌కొవిడ్‌ ‌స్ట్రెయిన్‌, ‌మిగిలిన వాటికి కలిపి ఒకేసారి టీకాలు సంధిస్తే బాగుంటుందని వీరి అంతరంగం కాబోలు. ఈ వ్యాక్సిన్‌కు మూడోదశ ట్రయల్స్ ‌పూర్తి కాలేదన్న వివాదం పరిగణనలోనికి తీసుకోవలసిందే. కాదనలేం. కానీ దీనికి సంబంధించిన వివరణలు వస్తున్నాయి. ఈ దశ విశ్లేషణ ఇంకా అందని మాట నిజమే అయినా, సామర్ధ్యం, భద్రతలకి సంబంధించి కొవాగ్జిన్‌ అత్యున్నత స్థాయిలో రూపొందుతున్న సంకేతాలు మాత్రం నిజమని ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌బలరాం భార్గవ వివరణ ఇచ్చారు. ‘భద్రతపరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు. ఈ టీకాలు 110 శాతం సురక్షితం. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నాక కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలర్జీ కనిపించే అవకాశం ఉంది. ఇది ఏ వ్యాక్సిన్‌కయినా సహజమే’ అంటున్నారు డీసీజీఐ డైరెక్టర్‌ ‌సోమాని. వ్యాక్సిన్‌ ‌రావడంతో బాధపడుతున్న వారు ఇద్దరే. ఒకరు కాంగ్రెస్‌, ‌రెండు కరోనా వైరస్‌ అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి. నిజమే.

ఈ విమర్షలు ఎలా ఉన్నా నరేంద్రమోదీ ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాస్సినేషన్‌ ‌మొదలవుతోంది.

About Author

By editor

Twitter
Instagram