ఒక వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన తరువాత దానిని వినియోగించే దశలో ప్రతిఘటనలు సహజమని అంటున్నారు ప్రఖ్యాత న్యూరోసర్జన్‌ ‌డాక్టర్‌ ‌దేమె రాజారెడ్డి. ప్రపంచ చరిత్రలో స్మాల్‌పాక్స్ ‌నివారణకు కనిపెట్టిన వ్యాక్సిన్‌కు తీవ్ర ప్రతిఘటనే ఎదురైందని ఆయన చరిత్రను గుర్తు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్‌ ‌ప్రజల దగ్గరకు చేరడానికే దాదాపు నూట యాభయ్‌ ఏళ్లు పట్టింది. 1977 నాటికి గాని స్మాల్‌పాక్స్ ‌ప్రపంచాన్ని వీడిపోలేదు. వైరస్‌ ‌నిర్మూలనకి వ్యాక్సిన్‌ ఒక్కటే విరుగుడు. తాజాగా కరోనాను నిరోధించడానికి వ్యాక్సిన్‌ ‌రూపకల్పనలో సీరం ఇనిస్టిట్యూట్‌ ‌శాస్త్రబద్ధంగానే వ్యవహరించిందని, అన్ని ప్రమాణాలు పాటించిందని డాక్టర్‌ ‌రాజారెడ్డి చెబుతున్నారు. వ్యాక్సిన్‌ ‌మూడోదశ క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌పరిపూర్ణంగా జరగలేదన్న అంశంతో వివాదం తలెత్తినా, ఇప్పుడు ఆ పక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసిన  భారత ప్రభుత్వం వ్యాక్సిన్‌ ‌మీద వెంటనే నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుందని డాక్టర్‌ ‌రాజారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏ విధంగా చూసినా వ్యాక్సిన్‌ ‌వేయడం అనివార్యమనే చెప్పాలని ఆయన చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌ అనుమతి తరువాత తలెత్తిన వివాదాల నేపథ్యంలో జాగృతి పాఠకుల కోసం డాక్టర్‌ ‌రాజారెడ్డితో ముఖాముఖీ.


దాదాపు పది నెలల పాటు కరోనా వైరస్‌తో భారతదేశం అతలాకుతలమైంది. టీకా అనండి లేదా వ్యాక్సిన్‌ అనండి. దాని కోసం ఎదురుచూడని వ్యక్తి ఎవరూ భారతదేశంలో లేరు. తీరా వ్యాక్సిన్‌ ‌బయటకు వస్తున్న తరుణంలో ఈ వివాదం ఏమిటి? ఎందుకు?

ఇదంతా ఒక మహాయుద్ధంలో ఇంకొక ఘట్టం మాత్రమే. వైరస్‌లకీ, మానవజాతికీ; వైరస్‌లకీ, మానవ హక్కుల భావనకీ నడుమ సాగుతున్న దీర్ఘ యుద్ధమది. నిజానికి వందల ఏళ్లుగా సాగుతున్న యుద్ధం! క్రీస్తుపూర్వం 1122 సంవత్సర నుంచి స్మాల్‌పాక్స్ (‌మశూచి, సామాన్యుల పరిభాషలో పెద్దమ్మవారు) వైరస్‌ ఉనికి మానవాళికి తెలుసు. దానికి జన్మనిచ్చినది కూడా చైనాయేనని చరిత్ర చెబుతోంది. క్రమంగా అది ఇంగ్లండ్‌లో చొరబడింది. బ్రిటిష్‌ ‌వైద్యుడు ఎడ్వర్డ్ ‌జెన్నర్‌ (1749-1823) ‌దానికి వ్యాక్సిన్‌ ‌కనుగొన్నాడు. కౌపాక్స్ ‌వైరస్‌ని స్మాల్‌పాక్స్ ‌నిరోధించడానికి ఉపయోగించవచ్చునని ఆయన తెలుసుకున్నాడు. అలా 1796లో జెన్నర్‌ ‌స్మాల్‌పాక్స్‌కు వ్యాక్సిన్‌ను కనుగొని మానవాళి ముందు పెట్టాడు. కానీ ఏం లాభం? దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 1840లో ఈ వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం తప్పనిసరి చేయాలని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అనుకుంది. ఇందుకు వ్యతిరేకంగా ఇంగ్లండ్‌లోనే గ్లాస్గో దగ్గర పదిలక్షల మందితో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒక బయటి పదార్ధాన్ని శరీరంలోకి ఎలా పంపిస్తారు? శరీరం ఎలా తట్టుకుంటుంది? బయటి పదార్థం శరీరంలోకి చేరితే వికటించకుండా ఉంటుందా? కొత్త సమస్యలకు దారి తీయదా? ఇవీ, వాళ్ల ప్రశ్నలు. మొదటి నుంచి జెన్నర్‌ ‌వాదన ఒక్కటే! వ్యాక్సిన్‌ ‌తీసుకోండి! స్మాల్‌పాక్స్ ‌తగ్గుతుంది. ఆలస్యం గానే అయినా వ్యాక్సిన్‌ను ప్రపంచం తీసుకోకతప్పలేదు. కానీ ఆ ఆలస్యానికి చెల్లించుకున్న మూల్యం గురించి తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. వ్యాక్సిన్‌ ‌సిద్ధంగానే ఉన్నప్పటికీ ఏటా ఐదులక్షల మంది బ్రిటిష్‌ ‌జాతీయులు స్మాల్‌పాక్స్‌తో చనిపోయేవారు. యాభయ్‌ ‌వేల మంది జర్మన్లు బలయ్యేవారు. ప్రపంచం మొత్తం మీద చూస్తే- ఏటా ఇరవై లక్షలమంది. ఇవన్నీ నమోదైన గణాంకాలు మాత్రమే. ఆఖరికి 1958లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్మాల్‌పాక్స్ ‌నివారణకు చర్యలు చేపట్టి, వ్యాక్సిన్‌ను ప్రపంచమంతటా అందుబాటులోకి తీసుకువచ్చింది. తప్పనిసరి చేసింది. 1977 నాటికి భూగోళం మీద స్మాల్‌పాక్స్ ‌సమసిపోయిందని ప్రకటించగలిగింది. విజ్ఞానశాస్త్రం, వైద్యశాస్త్రం, వాటిలో జరిగే పరిశోధనల మీద అవగాహన, సరైన దృష్టి లేకపోవడం వల్లనే కదా అదంతా! 1796లోనే జెన్నర్‌ ‌కనుగొన్న వ్యాక్సిన్‌ను ఉపయోగించినట్టయితే ఎంత ప్రాణనష్టాన్ని నివారించుకుని ఉండేది ప్రపంచం! 1796లో వ్యాక్సిన్‌ ‌సిద్ధమైతే, దానిని ఆధునిక పద్ధతులలో అందించడానికి 1958 వరకు ఆగవలసి వచ్చింది. అంటే దాదాపు నూటయాభయ్‌ ఏళ్లు. ఎన్ని ప్రాణాలంటారు! మరొకటి- జెన్నర్‌ ‌వ్యాక్సిన్‌కు వెంటనే విజయం లభించినట్టయితే, ఇంకొన్ని వైరస్‌లకి నివారణ కనుగొనడానికి ఊతం వచ్చేది కూడా. వైద్యశాస్త్ర పరిశోధన ఆనాడే వేగం పుంజుకునేదని అనిపిస్తుంది.

ప్రపంచం అందుకున్న తొలి వ్యాక్సిన్‌ ఏది? ఆ ఆవిష్కరణ ఎలా సాధ్యమైంది? ఎలాంటి పరిస్థితు లలో దానిని బాధితులకు అందించారు?

జెన్నర్‌ ‌కనుగొన్న స్మాల్‌పాక్స్ ‌నిరోధక వ్యాక్సిన్‌ ‌ప్రపంచం చూసిన తొలి వ్యాక్సిన్‌. అవసరమే కాదు, కల్లోలం కూడా కొత్త కొత్త విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలకి కారణమవుతుంది. స్మాల్‌పాక్స్ ‌వ్యాక్సిన్‌ ‌కూడా అంతే. స్మాల్‌పాక్స్, ‌కౌపాక్స్ అని రెండు రకాలు. ఇందులో కౌపాక్స్ ‌ప్రమాదకరమైనది కాదు. స్మాల్‌పాక్స్ ‌ప్రాణాంతక వైరస్‌. ‌కౌపాక్స్ ‌పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు వస్తుంది. కౌపాక్స్ ‌సోకినవారికి స్మాల్‌పాక్స్ ‌రాదని జెన్నర్‌ అధ్యయనంలో మొదట తేలింది. ఈ సూత్రమే స్మాల్‌పాక్స్ ‌నిరోధక వ్యాక్సిన్‌ ‌కనుగొనడానికి దారి చూపింది. వ్యాధి నిరోధక వ్యాక్సిన్ల మెథడ్‌ ఆఫ్‌ ‌మేకింగ్‌-‌తయారీ, అనేక రకాలు. నిజానికి ఫ్లూ సంబంధిత వ్యాధులతో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే స్మాల్‌పాక్స్‌కు బలైన వారి సంఖ్య తక్కువే అనిపిస్తుంది. కరోనా ఫ్లూ జాతి వైరస్‌. ఆ ‌సంగతి అలా ఉంచి తొలి వ్యాక్సిన్‌ అవతరణ దగ్గరకి వద్దాం.

కౌపాక్స్ ‌వచ్చిన వారి నుంచి వైరస్‌ను సేకరించి, స్మాల్‌పాక్స్ ‌వచ్చిన వారి చర్మం మీద రుద్దేవారు. మే 14, 1796లో 8 ఏళ్ల బాలుడు జేమ్స్ ‌ఫిప్స్ ‌మీద మొదటిసారి ఈ ప్రయోగం చేశారు. కౌపాక్స్ ‌సోకిన శారా నెల్మెస్‌ అనే మహిళ నుంచి వైరస్‌ను తీసి అతడికి ఇచ్చారు. జీవితంలో ఎప్పుడూ తిరిగి అతడికి స్మాల్‌పాక్స్ ‌సోకలేదు. అప్పుడు అలా చేశారు. ఇప్పుడు ఇంజక్షన్‌లతో వైరస్‌ ఎక్కిస్తున్నారు. చర్మం మీద రుద్దడం వల్ల కూడా ఆ వైరస్‌ ‌శరీరంలోకి చొచ్చుకు వెళ్లగలుగుతుంది. దాంతో తేలికపాటి కౌపాక్స్ ‌వస్తుంది. అదే స్మాల్‌పాక్స్‌ను నిరో ధిస్తుంది. కానీ స్మాల్‌పాక్స్ ‌తీవ్రంగా ఉన్న దశలో అది పని చేయదని తేలింది. అంటే వైరస్‌ ‌కారక క్రిమి నశించదు. ఈ అంశం, ఈ మొత్తం అధ్యయనంలో ఒక కోణం మాత్రమే. ఏ విధంగా చూసినా స్మాల్‌పాక్స్ అనే వైరస్‌ ‌తగ్గాలంటే వ్యాక్సిన్‌ ‌తీసుకోక తప్పదు. అదే జెన్నర్‌ ‌చెప్పాడు. వ్యాక్సిన్‌ను ఉపయోగించడం మొదలైన తరువాతే స్మాల్‌పాక్స్ ‌పోయింది. ఆ తరువాత వ్యాక్సిన్‌ ‌తోనే పోలియో పోయింది. మీజిల్స్ ‌నిరోధం వ్యాక్సిన్‌తోనే సాధ్యమని తేలింది. వైరస్‌ ‌నిర్మూలన వ్యాక్సిన్‌తోనే సాధ్యమని రుజువవుతూనే ఉంది.

కరోనా వైరస్‌ ‌నివారణ వ్యాక్సిన్‌ ‌పరిణామక్రమం ఏమిటి?

వ్యాక్సిన్‌ ‌రూపకల్పన, ప్రయోజనం కూడా బహుముఖాలుగా ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్‌ ‌నిర్మూలనకు అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్‌లు కొన్ని ఉన్నాయి. ఇందులో ఫైజర్‌ ‌చూడండి! శరీరంలోని కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి వేరొక వైరస్‌ను ప్రవేశపెట్టే సూత్రంతో రూపొందినదే ఈ వ్యాక్సిన్‌. ‌దానినే అడినో వైరస్‌ అం‌టారు. ఇది కూడా వైరస్‌ అని గుర్తుంచుకోవాలి. కానీ చెడ్డది కాదు. ఇది సజీవ వైరస్‌. ఇక సీరం ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌లు ఉన్నాయి. అవి కిల్డ్ ‌వైరస్‌ ‌మందులు. ప్రపంచంలో మొదట ఆమోదం పొందిన కరోనా నిరోధక వ్యాక్సిన్‌ ‌ఫైజర్‌. ‌కొన్ని వ్యాక్సిన్‌లు ప్రోటీన్ల ఆధారంగా రూపొందిస్తారు. కొన్ని సజీవ వైరస్‌లతోను, ఇంకొన్ని మృత వైరస్‌తోను తయారుచేస్తారు. సాధారణంగా సజీవ వైరస్‌తో తయారుచేసినదే అత్యంత ప్రతిభా వంతంగా పనిచేస్తుందన్నది శాస్త్రవేత్తల అనుభవం.

దేశీయంగా తయారు చేసుకున్న (నిజానికి ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం సహకారంతో) వ్యాక్సిన్‌ల మీద కొందరు వ్యక్తంచేస్తున్న అనుమానాలు హేతుబద్ధంగా ఉన్నాయా?

సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా, భారత్‌ ‌బయోటెక్‌ ‌పరిశోధనలు, ట్రయల్స్ ‌శాస్త్రీయంగా చేస్తున్నాయి. ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)ఆ ‌పరిశోధనలను నిర్దేశిస్తున్నది. ఇద్దరు డాక్టర్ల అనుభవాలు నేను ఇక్కడ చెబుతాను. ఈ ఇద్దరు కూడా క్లినికల్‌ ‌ట్రయల్స్‌లో భాగమైనవారే. ఇందులో ఒకరు హైదరాబాద్‌లోనే ఉంటారు. సీనియర్‌ ‌కార్డియాలజిస్ట్. ‌గాంధీ ఆసుపత్రిలో నాతో కలసి పనిచేశారు. ప్రముఖ వైద్యుడు కూడా. రెండో వారు ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రిలో జరిగిన ట్రయల్స్‌లో భాగస్వామి. ఇందులో హైదరాబాద్‌ ‌కార్డియాలజిస్ట్ ‌డబుల్‌ ‌బ్లైండెడ్‌ ‌ట్రయల్స్‌లో ఉన్నారు. రెండోవారు ఆయనకు పాజిటివ్‌ అని తేలిన తరువాత ట్రయల్స్‌లో పాల్గొన్నారు. డబుల్‌ ‌బ్లైండెడ్‌ ‌పరీక్షలో పాల్గొన్న కార్డియాలజిస్ట్‌కి వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ యాంటీ బాడీస్‌ ఏర్పడలేదు. లీలావతి ఆసుపత్రి ట్రయల్స్‌లో కరోనా పాజిటివ్‌తో పాల్గొన్న డాక్టర్‌కు యాంటీ బాడీస్‌ ఏర్పడినాయి. కాబట్టి క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌సశాస్త్రీయంగా జరిగాయనే అనాలి.

కరోనా నిరోధక వ్యాక్సిన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్ ఏ ‌రీతిలో జరిగాయి?

వ్యాక్సిన్‌ ‌కోసం మూడు నుంచి నాలుగు దశలలో ట్రయల్స్ ‌జరుగుతాయి. మొదటిదశలో కనిపెట్టిన వ్యాక్సిన్‌ను ఎంపిక చేసిన కొందరికి ఇచ్చుకుంటూ వెళతారు. వికటించడం, కొత్త సమస్యలు వంటివి ఇక్కడే బయటపడిపోతాయి. అంటే ఒక వ్యాక్సిన్‌ ‌సురక్షితమా కాదా అనేది తొలి దశలోనే తేటతెల్లమై పోతుంది. రెండోదశ ట్రయల్‌లో డబుల్‌ ‌బ్లైండెడ్‌ ‌పద్ధతి ఉంటుంది. తనకు ఇచ్చిన మందు ఏదో రోగికి తెలియదు. ట్రయల్స్‌లో ఉన్నవాళ్లలో కొందరికి ఇస్తారు. ఇంకొందరికి ఇవ్వరు. లేదా ప్లసిబో మాత్రం ఇస్తారు. వ్యాక్సిన్‌ ఎం‌త ప్రభావాత్మకమో తెలిపే దశ ఇది. మూడోదశలో ఎక్కువ సంఖ్యలో జనం మీద వ్యాక్సిన్‌ ‌ప్రయోగిస్తారు. నాలుగోదశ కూడా ఉంటుంది. పిల్లలకు ఇవ్వడం, ఎవరికైనా ఏ మోతాదులో ఇవ్వాలి వంటి అంశాలను ఈ దశ నిర్దేశిస్తుంది. ఈ మూడోదశ ట్రయల్స్ ‌పూర్తి కానప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆమోదించాలి అంటున్నారు చాలామంది. కానీ ఇంగ్లండ్‌ ‌తాజా అనుభవాన్ని బట్టి ప్రభుత్వం వ్యాక్సిన్‌ అం‌దించే పనిని వేగవంతం చేయవలసి వచ్చిందనిపిస్తుంది.

మరి వివాదం ఎక్కడ ఉంది?

మన దేశంలో కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ- మూడోదశ క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌ ‌వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నదే. కానీ ఆ మూడోదశ ట్రయల్స్ ఈ ‌నెల ఆరు, ఏడు తేదీలతో పూర్తయ్యాయి. ప్రతి దశలోను విశ్లేషణలు తయారుచేస్తారు. మూడోదశ విశ్లేషణలు రూపొందించడంలో కొంత జాప్యం జరిగింది.

అంటే భారత ప్రభుత్వ నిర్ణయం తొందర పాటుతో కూడుకున్నదేనా? అన్ని దశలు పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌ ‌వేసే ప్రయత్నాలు ఎందుకు ఆరంభించినట్టు?

తొందరపాటు అంటే… తొందరపడక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇంగ్లండ్‌ ‌తాజా అనుభవం చూడండి! అక్కడ వ్యాక్సినేషన్‌ ‌పని ఆరంభించారు. అయినా వైరస్‌ ‌దాని రూపం మార్చుకుని విజృంభించింది. ఇప్పుడు లండన్‌ ‌పరిస్థితి భయానకంగా ఉంది. మళ్లీ పూర్తి లాక్‌డౌన్‌ ‌విధించారు. ఆసుపత్రులన్నీ కేసులతో నిండిపోయాయి. ఆ స్థితిలో ఉన్నవాళ్లకి వ్యాక్సిన్‌ ఎం‌త వరకు పనిచేస్తుందో కూడా తెలియదు. ఈ స్థితిని చూసే మన కేంద్ర ప్రభుత్వం వేగంగా వ్యాక్సినేషన్‌ ‌యత్నాలు ఆరంభించింది. అయినా భారత్‌ ‌బయోటెక్‌ ‌వారి వ్యాక్సిన్‌ను ‘అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే’ షరతుతో అనుమతించింది. ప్రత్యామ్నాయ వ్యాక్సిన్‌ అనే చెప్పింది. మరో కారణం ఉంది. భారత్‌ ‌బయోటెక్‌ ‌వ్యాక్సిన్‌ ‌లభ్యత పరిమితం. అది ఐదు కోట్ల మోతాదులు తయారుచేసింది. ఇంకో ఐదు కోట్ల డోసులు సిద్ధం చేయాలంటే చాలా సమయం కావాలి. ఇంతలోనే ఇంగ్లండ్‌ ‌పుణ్యమా అని మనదేశంలో కూడా వైరస్‌ ‌రూపు మార్చుకుని చల్లగా వ్యాపిస్తే పరిస్థితులు అదుపులో ఉండవు. అలాంటి స్థితి కనుక దాపురిస్తే ఒక ప్రత్నామ్నాయ వ్యాక్సిన్‌గా భారత్‌ ‌బయోటెక్‌ ‌వారి వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేశారు. ఇంగ్లండ్‌ ‌నుంచి మన దేశానికి రోగులు వచ్చారు కూడా. వారి నుంచి మరింతగా వైరస్‌ ‌విస్తరించకుండా చూడడానికి ఈ వ్యాక్సిన్‌ ‌వేస్తే ఎంతవరకు పనిచేస్తుందో కూడా తెలియదు. ఏ విధంగా చూసినా దేశంలో ఒక్కసారిగా వైరస్‌ ‌విజృంభిస్తే ముందుజాగ్రత్తగా ఒక వ్యాక్సిన్‌ అం‌దుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతోనే కేంద్రం ఆమోదం తెలిపింది.

ప్రపంచంలో వచ్చిన మిగిలిన వ్యాక్సిన్‌ల మాటేమిటి?

స్పుత్నిక్‌ ‌పేరుతో రష్యా తీసుకు వచ్చింది. రెండునెలల క్రితమే అక్కడ వ్యాక్సినేషన్‌ ఆరంభమైంది కూడా. కానీ వాటిని విశ్వసించలేం.

దేశీయంగా తయారైన వ్యాక్సిన్‌, ఆక్స్‌ఫర్డ్ ‌వారి ఫైజర్‌ ‌పని తీరు మీద అంచనాలు సరే. మిగిలిన సమస్యలు ఏమిటి?

ఫైజర్‌ 95 ‌శాతం విజయవంతంగా పని చేస్తున్నది. మనం ఉత్పత్తి చేసుకున్న వ్యాక్సిన్‌ 70 ‌శాతం విజయవంతంగా పనిచేస్తున్నది. ఫైజర్‌ను మైనస్‌ 70 ‌డిగ్రీల దగ్గర భద్రపరుచుకోవాలి. మన దేశంలో తయారైన వ్యాక్సిన్‌ను మైనస్‌ 2‌నుంచి 8 డిగ్రీల వద్ద భద్రపరిస్తే చాలు. కాబట్టి ఫైజర్‌ను దిగుమతి చేసుకుని మన వేడి దేశంలో నలుమూలలకీ పంపాలంటే పెద్ద సమస్య అవుతుంది. అందుచేత అందరికీ వ్యాక్సిన్‌ అం‌దించాలన్న ఆశయం కూడా నెరవేరదు.

కాబట్టి అత్యవసర వ్యాక్సినేషన్‌ ‌మినహా మరో మార్గమేది ఇప్పుడు ప్రభుత్వం ముందు లేదు. అంతేకదా!

వ్యాక్సినేషన్‌ను తప్పించుకోలేం. వాయిదా వేయలేం కూడా. పైగా వైరస్‌ ‌తన లక్షణాలు మార్చు కుంటోంది. మరో దశ వైరస్‌ ‌వచ్చిందనుకుందాం. ఎంత ప్రమాదం? ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి జీవన్మరణ సమస్య. ఎస్‌పి బాలసుబ్రహణ్యం వంటి కళాకారులు, ప్రపంచ వ్యాప్తంగా మంత్రులు, మన దేశంలో ఎంపీలు, ఎంఎల్‌ఏలు చనిపోతున్నారు. అమెరికాలో అయితే నలభయ్‌ ఒక్క ఏళ్ల ఒక కాంగ్రెస్‌ ‌సభ్యుడు చనిపోయారు. వ్యాక్సినేషన్‌కు అనుసరిస్తున్న క్రమం కూడా అర్థవంతంగా ఉంది. మొదట వైద్యులకు, నర్సులకు వ్యాక్సిన్‌ ఇస్తామంటున్నారు. ఇందుకు జాబితాలు తయారు చేస్తున్నారు. ఇది అంత ఆషామాషీ వ్యవహారం కూడా కాదు.

ఎవరు ఏ విధంగా వ్యాఖ్యానించినా వ్యాక్సిన్‌ను అందించడం అనివార్యమన్నది నిజం. ఇది పెద్ద యజ్ఞమే. దీనిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ఎలా పూర్తి చేస్తారని అనుకోవచ్చు?

దేశంలో కరోనాను ఎదుర్కొనడంలో డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌కృషిని అభినందించాలి. ఆయన స్వయంగా ఈఎన్‌టి స్పెషలిస్ట్. ఇప్పుడు రాజకీయ నాయకుడయ్యారు. దేశంలో పోలియో నిర్మూలన కృషిలో ఆయన పాత్ర కీలకమైనది. చాలా వాస్తవికంగా ఆలోచించి పనిచేస్తారాయన. పోలియో వ్యాక్సినేషన్‌లో చూడండి! ఎక్కడ తయారవుతుంది? ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి ఎలా రవాణా చేయాలి? వ్యాక్సిన్‌ను ఎలా భద్రపరచాలి? ఈ డ్రై రన్‌లో ఆయనది అపారమైన అనుభవం. ఇదంతా ఎలా రూపకల్పన చేయగలిగారో ఆయన నోటి నుంచే నేను విన్నాను.

మోదీ ప్రధాని కావడానికి రెండు మూడు నెలల ముందు ఒక సమావేశం కోసం డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌హైదరాబాద్‌ ‌వచ్చారు. ఆ సమావేశానికి 20మంది వరకు వైద్యులను పిలిచారు. నాకూ ఆహ్వానం వచ్చింది. దాదాపు గంటసేపు పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడే వివరించారు నాకు. చాలా మంచి అనుభవాలు ఆయనవి. ఆయన ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ ‌సమర్ధంగానే జరుగుతుందని అనుకోవచ్చు.

About Author

By editor

Twitter
Instagram