రైతు సంక్షేమమే దేశ ప్రగతికి సోపానం

వ్యవసాయాభివృద్ధితో రైతు సంక్షేమం, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి సాధించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నారు. సంస్కరణలతో కూడిన పథకాలను అమలు చేయడం ఇందుకే. ప్రపంచంలో చాలా దేశాల కన్నా మనదేశంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మనది వ్యవసాయ ప్రధాన దేశమే కూడా. జనాభాలో అధికశాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి నేటికీ మనుగడ సాగిస్తున్నారు. అంటే దేశం మొత్తం మీద సుమారు 12 కోట్ల పైబడి జనాభా వ్యవసాయంతో తమ జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు వీరి కుటుంబ సభ్యులు, వ్యవసాయ కార్మికులు వ్యవసాయపనుల్లో నిమగ్నులై ఉన్నారు. వ్యవసాయంతో పాటు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యాపకాలలోను అధిక సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. ఇన్ని కోట్లమందికి జీవనోపాధి కల్పనతో పాటు, ప్రజల ఆహార భద్రతకు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు అందించేందుకు, పశుగ్రాసాన్ని సమకూరుస్తూ మూగజీవాల ఆహార భద్రతకు కూడా సేద్యమే దోహదకారి అవుతున్నది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వారా దళారులకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వానికి ఆర్థిక వనరులను సమకూర్చడంలోను తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది.


ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి జాతీయ ఆహార భద్రత పథకం, కార్మికుల పని భద్రత కోసం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలవుతున్నాయి. కొన్ని జాతీయ గణాంకాల ప్రకారం రైతు కుటుంబానికి రాబడి పలు రాష్ట్రాల్లో నెలకు రూ.7,000 అని తేలింది. ఆరుగాలం పంటలు పండించి శ్రమించే రైతన్నలకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆటుపోట్లతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి స్థిరమైన రాబడి లేక, వ్యవసాయంపై నిరాసక్తత పెంచుకుంటున్నారు. మెరుగైన జీవనం కోసం ఇతర వ్యాపకాలపై మక్కువ చూపిస్తూ, నగరాలకు వలసలు పోతున్నారు.

వాస్తవం ఏమిటంటే, ఇప్పటికీ దేశంలో వ్యవసాయరంగం కల్పించినంత పని ఏ ఇతర రంగం కల్పించటం లేదు. ఆహార భద్రతకు, ఉపాధి కల్పనకు, ఆర్థిక ప్రగతికి దోహదకారియైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవలసిన అగత్యాన్ని ప్రభుత్వం గుర్తించి అనేక పథకాలతో వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నది.

వ్యవసాయం బలోపేతానికి అమలులో

ఉన్న పథకాలు

–              రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే యోజన

–              భూసార స్థితిగతులు – పోషకాలపై గుర్తింపు కార్డులు

–              యూరియాకు వేపపూత

–              పరంపరాగత వ్యవసాయ విజ్ఞాన యోజన – సేంద్రియ సాగు

–              ప్రధానమంత్రి నీటిపారుదల యోజన

–              పంట రుణాలపై వడ్డీ రాయితీ

–              ప్రధానమంత్రి పంటల బీమా యోజన

–              జాతీయ వ్యవసాయ మార్క్లె యోజన (ఇ-నమో)

–              ప్రధానమంత్రి అన్నదాత, అభియాన్‌ ‌యోజన

–              పంటలకు కనీస మద్దతు ధరల పెంపు.

–              చిరుధాన్యాలను సిరిధాన్యాలుగా గుర్తించి, ప్రోత్సహించడం

–              తేనె ఉత్పత్తి పెంపు- తేనెటీగల పెంపకం

–              జాతీయ ఆహార భద్రత మిషన్‌ – ‌పప్పుధాన్యాల ఉత్పత్తి, పెంపు.

–              నూనెగింజల అధికోత్పత్తి వంగడాల ఉత్పత్తి పెంపు.

–              కొబ్బరిపంటలో ఉత్పత్తి పెంపు పథకం

రైతు సంక్షేమం కోసం అమలవుతున్నవి:

–              క్రిషోన్నతి యోజన

–              మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

–              గ్రామీణ సడక్‌ (‌రోర్డు) యోజన

–              గ్రామీణ కౌశల్‌ (‌నైపుణ్య) వికాస్‌ ‌యోజన

–              ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన

–              ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా

–              ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన

–              ప్రధానమంత్రి ఉజ్జ్వల్‌ ‌యోజన

ఇంకా, వ్యవసాయానికి అత్యవసరమైన నీటి సౌకర్యం, భూసార స్థితిగతులను పెంపొందించడం, పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయానికి పెట్టుబడి, ప్రకృతి వైపరీత్యాలతో రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకం, పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ ‌సౌకర్యాల పెంపు వంటి వాటి కోసం కూడా కేంద్రం కృషి చేస్తున్నది

రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ పంటల సాగులో వచ్చే రాబడిని 2022కు ద్విగుణీకృతం  చేసేందుకు ప్రభుత్వం బృహత్పథకాన్ని ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్నది. ఇలా రాబడిని రెండింతలక• పెంచే క్రమంలో వాతావరణ పరిస్థితులలో చోటు చేసుకునే మార్పులనూ, ఆయా వ్యవసాయిక పరిస్థితులనూ దృష్టిలో ఉంచుకొని, ఆయా ప్రాంతాలకు అనువైన పంటల ప్రణాళికలన• సాంకేతికంగా రూపొందించి, తగిన పరిజ్ఞానంతో అమలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన పెట్టుబడిని ప్రతి సన్న, చిన్నకారు రైతులకు అందజేస్తున్నారు. ఖర్చులకు అవసరమైన పెట్టుబడులను బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలతో రైతులకు అందిస్తూ వారికి అండగా ప్రభుత్వం ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఎదుర్కొనే పంటనష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి, పంటల బీమా పథకాల ద్వారా నష్టపరిహారం చెల్లించే ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. ఈ పంట నష్టపరిహారాలను సకాలంలో, అదే పంటకాలంలో ఇప్పించగలిగితే రైతులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది.

నీటి వనరులున్న ప్రాంతాల్లో వ్యవసాయోత్పత్తు లకు తగిన సౌకర్యం ఉన్నప్పటికీ, వర్షాధారపు ప్రాంతాల్లో వ్యవసాయం దయనీయంగా ఉంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వర్షాలు లేక పంటలు పూర్తిగా దెబ్బతినటం, మిగిలిన సంవత్సరాల్లో అరకొర దిగుబడులతోను రైతుల పరిస్థితి కష్టంగా ఉంది. అటువంటి ప్రాంతాల్లో తగిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పంటల ప్రణాళికలు అమలు చేయాలి. ఎటువంటి పరిస్థితులలో అయినా దిగుబడులను, రైతుల, కార్మికుల శ్రమను దృష్టిలో ఉంచుకొని కనీస మద్దతు ధరలను నిర్ణయించి అమలు చేయవలసిన అవసరం ఉంది.

ఈ దిశగా తొలిసారి ప్రభుత్వం కనీస మద్దతు ధరలు నిర్ణయంచేటప్పుడు వ్యవసాయ ఖర్చులకు అదనంగా 50 శాతం చేర్చి, నిర్ణయించటం ముదావహం. ఖర్చులను లెక్క వేసేటపుడు సాగుకు అయ్యే ఖర్చులతో పాటు భూమిపై లీజ్‌, ‌రైతు శ్రమశక్తిని, పంటల దిగుబడుల స్థాయిని కూడా (ముఖ్యంగా వర్షాధారపు పంటలు) పరిగణలోనికి తీసుకోవాలి.

రైతుల వ్యవసాయోత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, వ్యాపారస్తులు రైతులు ముందుగానే పంట ఉత్పత్తుల ధరలు పరస్పర అంగీకారంతో నిర్ణయించుకొని, సాగు చేస్తే రైతులకు మంచి ధర లభించిగలదని ప్రభుత్వం చెబుతున్నది. దీనికే చట్టాలు చేసింది. అలాగే ఇరువురి అంగీకారంతో హెచ్చు ధర వచ్చే ఎక్కువ ధరల పంటల సాగును కూడా ప్రోత్సహించి, రైతుల ఆదాయాన్ని ఇనుమడింప జేయవచ్చని ప్రభుత్వం సంకల్పించి వ్యవసాయ సంస్కరణలను ప్రభుత్వం చట్టాల ద్వారా తీసుకు వచ్చింది. వీటితో రైతుల ఆదాయాన్ని పెంపొందిం చడం, స్వేచ్ఛా మార్కెటింగ్‌ను, ఆధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగుకు ప్రోత్సాహించేందుకు వీలవుతుందని ప్రభుత్వం సత్సంకల్పంతో ముందుకు వచ్చింది. ఇందులో ప్రభుత్వ సంకల్పాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. ఈ చట్టాలలోని మంచిని, సదుద్దేశాలను పరిగణలోకి తీసుకుని రైతులు వ్యవసాయం చేస్తే మేలు జరిగే అవకాశం ఎక్కువే. ఇందులో రైతులకున్న అపోహలను తగిన కార్యాచరణ ద్వారా ప్రభుత్వం తొలగించవచ్చు. కనీస గిట్టుబాటు ధరలను వ్యవసాయ ఉత్పత్తులకు కల్పించే విధంగా, రైతుల ఆదాయాన్ని పెంపొందించే విధంగా తగిన చర్యలను తీసుకుని రైతులలో ఆత్మస్థైరాన్ని పెంపొందించాలి.

రైతులకు లభించే ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే తలంపును ప్రభుత్వం మరింత పటిష్టంగా అమలు చేయాలి. రైతుల నెలసరి ఆదాయాన్ని ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో కనీసం పాతికవేలకు తక్కువ లేకుండా వచ్చే విధంగా తగిన పథకాలను ప్రభుత్వం అమలు చేయాలి. అప్పుడే రైతులు కూడా తమ మనుగడను ఇతరులవలె కనీస స్థాయిలోనైనా సాగించగలరు.

ఇందుకు అనుగుణంగా క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకుని, తగిన చర్యలను తీసుకుంటే రైతులకు సాంత్వన లభిస్తుందని విశ్వసించవచ్చు.

– వాతావరణ పరిస్థితులను, మార్పులను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు అనువైన, లాభసాటిగా ఉండే పంటలను, పంటల ప్రణాళికలను ప్రోత్సహించాలి.

– ఆయా ప్రాంతాల్లో అధిక ఆదాయాన్నిచ్చే ప్రత్యేక పంటల సాగును కూడా ప్రోత్సహించాలి.

– మన ఆహార అవసరాలను, ఆరోగ్యవంతమైన ఆహార పంట ఉత్పత్తుల సరఫరాకు, ఎగమతులు చేసేందుకు అవసరమైన, వాటి డిమాండ్‌ ‌మేరకు ఆయా పంటలను (వాటికి తగిన విస్తీర్ణంలో) సాగు చేయడానికి ప్రోత్సహించాలి.

– మనదేశంలో ఉన్న వైవిధ్యమైన, అనుకూలమైన వ్యవసాయ పరిస్థితుల వల్ల సంవత్సరం పొడుగునా పలు పంటలను సాగు చేయవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎగుమతులక• అనువైన పంటలను ప్రత్యేకంగా సాగుచేసి విదేశీ మారకాన్ని ఆర్జించవచ్చు.

– బాదం చెట్లకు ఉష్ట వాతావరణం అనువైనప్పటికి కాలిఫోర్నియా నుండి మనం ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. అనువైన వాతావరణం ఉన్నప్పటికి మనం ఎందుకు బాదం ఉత్పత్తిని సాధించుకోలేకపోయాం? అలాగే సారపప్పు ముఖ్యంగా రాయలసీమలో ప్రముఖంగా ఉంది. ఖాళీగా ఉన్న భూముల్లో దీనిని మనం ఎందుకు పండించలేకపోతున్నాం?

-Market intelligence ద్వారా పంటల ప్రణాళికను ఆయా పరిస్థితులకు అనువుగా ప్రోత్సహించాలి.

– ఆయా పంటల సాగుకు అనువైన పరిస్థితు లలో తగిన సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు పొందేందుకు దోహదం చేయాలి.

– పంటల సాగులో వైవిధ్యాన్ని పాటించాలి. సాగుకు ఉపయోకరమైన పంటలు 300 పైగా ఉంటే మనం 50 పంటలనే సాగు చేస్తున్నాం.

– వ్యవసాయానికి అత్యవసరమైన నీటి వనరులను పెంపొందించేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.

– పంటల సాగులో వరి, గోధుమ, చిరు ధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య పంటలను ప్రోత్సహించాలి.

– ముఖ్యంగా వర్షాధారపు ప్రాంతాల్లో తగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, తగిన కార్యాచరణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలి. ఉదాహరణకు వర్షాధారపు పంటల దిగుబడులను, స్థితిగతులను ఖర్చులను, ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని పంటల ఉత్పత్తులకు ప్రత్యేక ప్రోత్సాహక ధరలను హెచ్‌ఎస్‌పికి అదనంగా ఏర్పాటు చేయాలి.

– ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు సకాలం (అదే పంట కాలంలో)లో నష్ట పరిహారం రైతులకు అందివ్వాలి.

 వ్యాపారస్తులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొనకూడదు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందులో వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు. మద్దతు ధరకు పైన ఖర్చులపైన వారు ఆదాయం వేసుకుని మాత్రమే రిటైల్‌ ‌ధరలు నిర్ణయించడం జరుగుతుంది.

– విలువ ఆధారిత పంట ఉత్పత్తులను ప్రోత్సహించాలి.

– పంట ఉత్పత్తులను తగిన మార్కెటింగ్‌ ‌వ్యవస్థలను సంస్కరణలతో మరింతగా పటిష్టపరచాలి.

– రైతులకు సాగుకు అవరమైన పెట్టుబడులకు (రైతుబంధు పథకాలతో పాటు) సరళమైన విధానాలతో బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయాలి. ఈ దిశలో రైతులందరికి కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డులను యుద్ధ ప్రాతిపదికన 2022 కల్లా పూర్తి చేయాలి. క్రెడిట్‌ ‌కార్డు పరిమితిని నిర్ణయించేటప్పుడు వారికున్న పొలాలకు అవసరమయ్యే పూర్తి సాగు ఖర్చు, 50 వేలు ఇంటి ఖర్చులను పరిగణలోనికి తీసుకోవాలి.

-పొలాల వివరాలతో కూడిన ఐ.డి. కార్డును కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డులతో అనుసంధానం చేయాలి.

– కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డుల ద్వారా పొందిన రుణాల• మొదటి 6 నెలలు పూర్తి వడ్డీ రాయితీ, ఆ తర్వాత తక్కువ వడ్డీతో అందజేయాలి.

రైతుల స్థితిగతులను, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా పరిస్థితులకు అనువైన తగిన పంటలతో పెట్టుబడి, సాంకేతికతలతో మంచి దిగుబడులను సాధించి, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, కనీస మద్దతు ధరల కన్న మిన్నగా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకుని, వారి ఆదాయాన్ని ఇనుమడింపజేసి, వారి సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి, దేశ ప్రగతికి నేటి ప్రభుత్వం దోహదం చేయగలద•ని ఆశిద్దాం!

– ప్రొ।। పి. రాఘవరెడ్డి

ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram