(అయోధ్యాకాండ-4)

భద్రాచల రామదాసును చెర నుంచి విడిపించడానికి లక్ష్మణ సమేతుడై రాముడు నవాబు తానాషా కలలో కనిపించాడని చెప్పుకుంటాం. 1949లో అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి బిగించిన తాళాలు బద్దలు కావడానికి ఆ రాముడు ఎవరి కలలో కనిపించాడో తెలియదు కానీ, జరిగిన ఘట్టాలన్నీ ఒక అదృశ్యశక్తి నడిపించిన తీరులోనే కనిపిస్తాయి. రామజన్మభూమిలోని వివాదాస్పద కట్టడంలోకి హిందువులు వెళ్లకుండా నాడు బిగించిన తాళాలు ఎలా బద్దలయ్యాయి? నిజమే తాళాలు తీయలేదు. అక్షరాలా బద్దలుకొట్టారు. హిందూ సమూహాలు, విశ్వహిందూ పరిషత్‌ ‌లేదా రామభక్తులు ఆ పని చేయలేదు. సాక్షాత్తు ఫైజాబాద్‌ ‌జిల్లా కోర్డు ఆదేశం మేరకు, ఇంకా చెప్పాలంటే చట్టబద్ధంగా వచ్చిన తీర్పు మేరకు తాళాలు పగలకొట్టి పారేశారు. తాళాలు పగలుకొట్టించి, హిందువుల ప్రవేశానికి బాటలు వేసిన ఆ క్షణమే బాబ్రీ మసీదు పేరుతో పిలుస్తున్న వివాదాస్ప కట్టడం హిందూ ఆలయమేనని అంగీకరించినట్టయిందని అప్పుడే వ్యాఖ్యలు వెలువడినాయి.

రామజన్మభూమి విముక్తి కోసం గోరఖ్‌పూర్‌ ‌మహంత్‌ ‌దిగ్విజయ్‌నాథ్‌ ఉద్యమిస్తున్న కాలంలోనే, అంటే 1949 డిసెంబర్‌ 22 ‌తేదీన ఆలయ ప్రదేశంలో బాలరాముని విగ్రహం ఆవిర్భవించిందని ఎక్కువమంది చెప్పేమాట. అవతరించడం మాటెలా ఉన్నా మహంత్‌ ‌దిగ్విజయ్‌నాథ్‌, ‌దిగంబర్‌ అఖాడా (అయోధ్య) మహంత్‌ ‌రామచంద్రదాస్‌ ‌పరమహంస ఆదేశాల తోనే కొంతమంది బైరాగులు బాబ్రీ కట్టడంలోకి ప్రవేశించి రామ్‌లాలా విగ్రహం పెట్టారని కొందరు, ముఖ్యంగా ముస్లిం వర్గాల ఆరోపణ. ఆ డిసెంబర్‌ 23‌న పోలీసులు కేసును నమోదు చేశారు. దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది సాధువులు కీర్తనలు పాడుకుంటూ వచ్చి పూజలు చేశారని పోలీసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అక్కడ అర్చనలు సాగుతున్నాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయి. అయోధ్య-ఫైజాబాద్‌కు చెందిన కొంతమంది ముస్లింలు బాబ్రీకట్టడంలో నిత్యపూజ లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అటు 1950 జనవరి 16న కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఇటు ముస్లింల అభ్యంతరాలు ఎలా ఉన్నా విగ్రహాలను యూపీ ప్రభుత్వంకాని, జిల్లా అధికారులు కాని తొలగించేందుకు వీలులేదని చెప్పేసింది. ముస్లింలు మళ్లీ సివిల్‌ ‌జడ్జి కోర్టులో దావా వేశారు. కానీ తీర్పు హిందువుల పక్షాన వచ్చింది. ముస్లింలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్‌ ‌బెంచి సివిల్‌ ‌కోర్టు ఇచ్చిన ఇంటెరియం ఇంజంక్షన్‌నే ధృవపర్చింది. అంతేకాదు, జన్మభూమికి సంబంధిం చిన దావా మొత్తాన్ని శీఘ్రంగా పరిష్కరించాలని ట్రయల్‌ ‌కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పుడే నెహ్రూ ప్రభుత్వం రామ్‌లాలా విగ్రహాలను తొలగించాలని ఫైజాబాద్‌ ‌డిప్యూటీ కమిషనర్‌ ‌కేకే నాయర్‌ ‌పై ఒత్తిడి తెచ్చింది. నాయర్‌ ‌నిస్సహాయత వ్యక్తం చేశారు. తర్వాత భద్రత పేరుతో హిందువులు కట్టడంలో ప్రవేశించకుండా తాళాలు వేశారు. బయట నుంచే అర్చనలు చేసుకోవాలని ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వం నియమించిన ఒక పూజారిని మాత్రం లోపలికి అనుమతించారు. ఇదంతా నెహ్రూ సర్కార్‌ ఆదేశాలతోనే జరిగిందని అంటారు.

తాళాలు వేయడంతో హిందువుల ఆందోళన మళ్లీ మొదటికి వచ్చింది. మహంత్‌ ‌రామచంద్ర పరమహంస, గోరఖ్‌పూర్‌ ‌మహంత్‌తో కలిసి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. 1961లో కేసు కొత్త మలుపు తీసుకుంది. ముస్లిం సంఘాలు కూడా వాటి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ ఏడాది డిసెంబర్‌ 18‌న ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌సున్నీ వక్ఫ్‌బోర్డు ఫైజాబాద్‌ ‌సివిల్‌ ‌కోర్టులో శ్రీరామజన్మభూమి-బాబరి కట్టడాన్ని మసీదుగా ప్రకటించాలని, మొత్తం స్థలాన్ని తమకు అప్పగించాలని మళ్లీ కోర్టును ఆశ్రయించింది. నిజానికి యూపీ ముస్లింల అసలు ఉద్దేశం- వివాదం ఎన్నటికి తేలకుండా న్యాయస్థానాలలోనే నలిగిపోవాలి.

ఇలా దాదాపు రెండు దశాబ్దాలు చిక్కులు తెస్తూనే ఉన్నారు.1984 వరకు ఇదే జరిగింది. వరుస కేసులు వేస్తూ అడ్డుపడుతున్న కుట్రదారులకు వ్యతిరేకంగా హిందువులతో విస్తృత స్థాయిలో ఉద్యమించాలని హిందూ ధర్మాచార్యులు ఆదేశించారు.వారి పిలుపు మేరకే విశ్వహిందూ పరిషత్‌ ‌రంగంలోకి దిగి సరికొత్త ఉద్యమ కార్యచరణకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 7,8, 1984‌న న్యూఢిల్లీలోని విజ్ఞానభావన్‌లో హిందూ ధర్మసంసద్‌ ‌నిర్వహించారు. ఇది పెద్ద కదలికనే తెచ్చింది. ఉద్యమం అయోధ్య స్థల స్వాధీనానికే పరిమితం కావడం లేదని వెల్లడించిన పరిషత్‌ ‌ముస్లింలు, కుహనా సెక్యులరిస్టుల పునాదులు కదిలించింది. హిందువులకు అత్యంత పవిత్రమైన అయోధ్యలోని శ్రీరామజన్మ భూమిని, కాశీ విశ్వనాథ మందిరాన్ని, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమిని అప్పగించాలని హిందూ ధర్మాచార్యులు తీర్మానం చేశారు. గోరఖ్‌నాథ్‌ ‌పీఠం మహంత్‌ అవైద్యనాథ్‌ అధ్యక్షులుగా శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఏర్పాటయింది.సెప్టెంబర్‌ 25,1984‌న బిహార్‌లోని సీతామర్హి నుంచి శ్రీరామ జానకి రథయాత్ర బయలుదేరింది. అవైద్యనాథ్‌ ‌హిందువులను జాగృతం చేసే పని మొదలుపెట్టారు. ఆంజనేయస్వామి పేరుతో ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా హిందూ ధర్మసంసద్‌ ‌నిర్ణయించింది. బజరంగ్‌ ‌దళ్‌ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో హిందూ యువకులు ఈ సంఘటన యజ్ఞంలో చేరడం మొదలు పెట్టారు. అంటే బీజేపీ ప్రముఖుడు లాల్‌ ‌కిషన్‌ అడ్వాణి కంటే ముందు జరిగిన రథయాత్ర ఇది. అక్కడ నుంచి ఇక హిందువుల పట్టు సడలించలేదు.

 అక్టోబర్‌ 31-‌నవంబర్‌ 1‌న1985, రెండు రోజులపాటు పూజ్య పెజావర్‌ ‌స్వామీజీ అధ్యక్షతన ఉడిపిలో మరొక హిందూ ధర్మసంసద్‌ ‌సమ్మేళనం జరిగింది. హిందువుల సహనాన్ని ఇంకా పరీక్షించేందుకు ప్రయత్నించవద్దన్న ఘాటు హెచ్చరిక అక్కడ చేశారు. మార్చి 8,1986 (శివరాత్రి)నాటికి శ్రీరామజన్మ భూమిని హిందూ సమాజానికి దత్తం చేయకపోతే దేశమంతటా సత్యాగ్రహం చేయాలని ఆ సమ్మేళనం తీర్మానించింది. 1950 నుంచి ఫైజాబాద్‌ ‌సివిల్‌ ‌కోర్టులో జన్మభూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్న దిగంబర్‌ అఖాడాకు (అయోధ్య) చెందిన మహంత్‌ 75 ‌సంవత్సరాల శ్రీరామ చంద్రదాస్‌ ‌రామజన్మభూమిని స్వాధీనం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని ప్రకటించారు.

ఇంత జరిగిన తరువాత గాని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలలో గాని, నిజానికి చాలా మంది హిందువులలో గాని కదలిక రాలేదు. హఠాత్తుగా దేశంలో, సామాజిక రాజకీయ రంగాలలో అయోధ్య ప్రాముఖ్యం పెరిగింది. ఆనాటి యూపీ ముఖ్యమంత్రి వీర్‌ ‌బహదూర్‌ ‌సింగ్‌ అయోధ్యకు వెళ్లారు. ముఖ్య మంత్రి పర్యటనను విశ్వహిందూ పరిషత్‌ ‌పెద్దలు అద్భుతంగా వినియోగించుకున్నారు. జన్మభూమి ద్వారానికి అక్రమంగా తాళం వేశారని ఇది చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రిని కలసి గట్టిగా చెప్పారు. ప్రభుత్వ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటా మని ముఖ్యమంత్రి చెప్పవలసి వచ్చింది. ఇదే అవకాశంగా అశోక్‌ ‌చంద్రపాండే అనే న్యాయవాది వెంటనే శ్రీరామజన్మభూమి కట్టడం తాళాలు తెరిపించాలని కోరుతూ ఫిబ్రవరి 1, 1986న ఫైజాబాద్‌ ‌జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం రాష్ట్ర సర్కార్‌కి నోటిసులు జారీ చేసింది.

ఇక్కడే వివాదం మరొక మలుపు తీసుకుంది. రామజన్మభూమిలోకి హిందువులు ప్రవేశించకుండా 1949లో తాళాలు ఎవరు వేశారు? తాళాలు వేయాలని ఎవరు ఆదేశించారు? తాళంచెవులు ఎక్కడ ఉన్నాయి? ఈ విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి రికార్డులు లేవని విచారణలో తేలిపోయింది. ఫైజాబాద్‌ ‌కలెక్టర్‌ ఇం‌దు కుమార్‌ ‌పాండే, సీనియర్‌ ‌పోలీసు సూపరింటెండెంట్‌ ‌కర్మవీర్‌సింగ్‌లను జిల్లా సెషన్స్ ‌జడ్జి కె.ఎం.పాండే పిలిపించి విచారించారు. అయోధ్య కట్టడం తాళాలు తెరిస్తే శాంతిభద్రతల సమస్యలు ఉంటాయా? అలాంటి సమస్య ఏమీ ఉండదని ఇద్దరూ చెప్పారు. అంతే, వెంటనే తాళాలు తెరవాలని జిల్లా సెషన్స్ ‌జడ్జి కె.ఎం.పాండే ఆదేశించారు. కోర్టు తీర్పుల గురించి అందరికీ సుద్దులు చెప్పే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ముందుకు రానేలేదు. జిల్లా పోలీసులు తాళాలు తెరిచే చర్యలేవీ తీసుకోలేదు. శ్రీరామజన్మభూమి న్యాస్‌ ‌ట్రస్ట్ ‌మళ్లీ తీవ్ర హెచ్చరికతో రంగంలో దిగి తిరిగి కోర్టుకు ఫిర్యాదు చేసింది. సత్యాగ్రహానికి దిగుతామని ట్రస్ట్ ‌సభ్యులు హెచ్చరించడంతో 1986 ఫిబ్రవరి 28న చివరకు తాళాలు బద్దలుకొట్టారు. నిజానికి బద్దలు కొట్టవలసివచ్చింది. తాళంచెవులు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అందుకే తీర్పు వచ్చిన గంటలోపుననే తాళాలు పగలగొట్టి పారేశారు. 1986 ఫిబ్రవరి 1, మార్చి మొదటివారం మధ్య జరిగిన పరిణామాలే చరిత్రను మార్చాయి.

దాదాపు పాతికేళ్లుగా బిగుసుకుని ఉన్న తాళాలు పగలుతున్న దృశ్యాన్ని భారత జాతి యావత్తూ దూరదర్శన్‌లో వీక్షించింది. నాటి సమాచార, ప్రసార శాఖ మంత్రి వీఎన్‌ ‌గాడ్గిల్‌ ఆ ‌దృశ్యాన్ని ప్రసారం చేయడానికి అనుమతి ఇచ్చారు. నిజానికి రామాయణం, మహాభారతం ధారావాహికలు కూడా దూరదర్శన్‌లో ప్రసారమైనది ఈయన కాలంలోనే. అంతేకాదు, తీర్పు ఏ విధంగా వస్తుందో ముందే గ్రహించిన ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వీర్‌ ‌బహదూర్‌ ‌సింగ్‌, ‌కేంద్ర ఆంతరంగిక భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్‌ ‌నెహ్రూ కూడా తీర్పు వెలువరించే నాటికి ఫైజాబాద్‌ ‌చేరుకున్నారు. తాళాలు బద్దలు కొట్టడం వారు కూడా చూశారు. ఇంతకీ ఫైజాబాద్‌ ‌కోర్టు తీర్పుతోనే అయోధ్య తాళాలు తెరుచుకున్నాయా? ఇది నమ్మడం కొంచెం కష్టం. ఎందుకంటే అంతకు ముందు హిందువులకు అనుకూలంగా తీర్పులు వచ్చిన సందర్భాలూ, వాటిని స్థానిక యంత్రాంగం పట్టించుకోని వాస్తవాలు కనిపిస్తాయి. మరి తాళాలు తీయమంటూ ఫైజాబాద్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే, తీర్పు వెలువడిన ఒక గంటలోపుననే ఎందుకు అమలు జరిపారు. ఇందుకు షాబానో కేసు కారణమని గట్టిగా చెప్పేవారు ఉన్నారు. వారి వాదన కొట్టిపారేయలేనిది కూడా.

తలాక్‌ ‌చెప్పినప్పటికీ తన భర్త నుంచి భరణం ఇప్పించాలని షాబానో అనే ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భరణం ఇవ్వలసిందే నని కోర్టు తీర్పు ఇచ్చేసింది. దీని మీద ముస్లింలు తమ ఆచారాలు మంట కలిసిపోయాయంటూ రగడ సృష్టించారు. వారిని బుజ్జగిస్తూ అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ దీనిని తట్టుకోలేక పోయింది. షాబానో కేసులో వచ్చిన తీర్పును చట్టం తెచ్చి మార్చివేస్తామని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ హామీ ఇచ్చేశారు. దీనితో కాంగ్రెస్‌ ‌పార్టీ సెక్యులరిజం ముసుగు తొలగిపోయింది. హిందువులు మండి పడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చిన ఫైజాబాద్‌ ‌కోర్టు తీర్పును తనకు అనుకూలంగా మార్చుకోవాలని రాజీవ్‌ ‌భావించారు. అంటే సుప్రీంకోర్టు తీర్పును మార్చివేస్తామని చెప్పి ముస్లింలను, రామజన్మభూమి తాళాలు తీసి హిందువులను ఆకట్టుకోవాలని ఆయన ఎత్తువేశారనే చాలామంది అభిప్రాయం. కానీ ఆ నిర్ణయమే కాంగ్రెస్‌ ‌పార్టీని అంపశయ్యకు చేరుస్తుందని ఆయన ఊహించలేకపోయారు. ప్రస్తుత కేరళ గవర్నర్‌, ‌నాడు రాజీవ్‌ ‌మంత్రివర్గ సభ్యుడు ఆరిఫ్‌ ‌మహ్మద్‌ఖాన్‌ ‌రాజీవ్‌ ‌నిర్ణయం ముమ్మాటికీ సమతౌల్య రాజకీయ చర్య అనే అంటారు. సుప్రీం తీర్పును చట్టంతో తారుమారు చేస్తామన్న రాజీవ్‌ ‌నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆయన మంత్రిమండలి నుంచి వైదొలిగారు. షాబానో తీర్పును చట్టంతో తారుమారు చేస్తామన్న ప్రకటన జనవరి 15, 1986న వెలువడింది. రామజన్మభూమి తాళాలు పగలకొట్టిన ఉదంతం ఫిబ్రవరి 28న జరిగింది. అంటే ఆ నిర్ణయాల మధ్య దూరం రెండువారాలే. కానీ ఆ తాళాలు తీయాలన్న ఆలోచన తనది కాదనీ, తాళాలు తీయాలన్న నిర్ణయం తాను చేయలేదని రాజీవ్‌ ‌గాంధీ చెప్పినట్టు ఆయన మిత్రుడు, ఐఏఎస్‌ అధికారి వాజాహత్‌ ‌హబీబుల్లా తన గ్రంథం ‘మై ఇయర్స్ ‌విత్‌ ‌రాజీవ్‌గాంధీ: విజయం, విషాదం’లో పొందు పరిచారు. ఆనాడు రాజీవ్‌ ‌మంత్రివర్గంలో ఆంతరంగిక భద్రతా వ్యవహారాల మంత్రి అరుణ్‌ ‌నెహ్రూ (రాహుల్‌ ‌సమీప బంధువు), రాజకీయ సలహాదారు మఖన్‌లాల్‌ ‌ఫోతేదార్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నారని రాజీవ్‌ ‌చెప్పినట్టు హబీబుల్లా రాశారు.

రామజన్మభూమి స్థలానికి తాళాలు వేయించి  నెహ్రూ సెక్యులరిజం పరిరక్షకుడినని అనుకున్నారు. ఆయన మనుమడు రాజీవ్‌ ఆ ‌తాళాలు బద్దలుకొట్టించి తాను కూడా సెక్యురిస్టునేనని చెప్పుకోవాలని చూశారు. ఆధునిక భారత చరిత్ర ఆ ఇద్దరి భేషజానికి తాళాలు బిగించింది. దొంగ సెక్యులరిజం మీద ఆ ఇద్దరి ముసుగు తొలగింది.

తరువాత : ఊపందుకున్న ఉద్యమం

About Author

By editor

Twitter
Instagram