డిసెంబర్‌ ‌మాసంలో ప్రవేశించింది ప్రపంచం. అంటే భూగోళానికి కరోనా పరిచయమై సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఎంత ఉత్పాతం! ఎంత విలయం. కానీ అదేమీ కంటికి కనిపించలేదు. ప్రతి తొమ్మిది సెకన్లకు ఒకరి వంతున బలి తీసుకుంది కొవిడ్‌ 19. ఒక వారంలో సగటు కరోనా మరణాలు ఇవి. రెండు లేదా మూడోదశను భరించిన గడచిన రెండు మాసాలలోనే ఐదు లక్షల మంది కరోనా కాటుకు గురై మరణించారు. గడచిన వారం చూస్తే సగటున నిత్యం 10,000 మరణాలు నమోదైనాయి. మరి మొత్తం మరణాలు! పదిహేను లక్షలు. ఈ ప్రపంచం మొత్తం మీద ఆరు కోట్ల యాభయ్‌ ‌లక్షల మందికి కరోనా సోకింది. ఇందులో అగ్రస్థానం అగ్రరాజ్యం అమెరికాదే. అమెరికాకు ఇంకా కరోనా బెడద వదలిపోలేదని, వచ్చే రెండు మాసాలలో దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆ దేశానికే చెందిన సెంటర్స్ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌ప్రివెన్షన్‌ ‌సంస్థల అధిపతి రాబర్ట్ ‌రెడ్‌ఫీల్డ్ ఇటీవలనే హెచ్చరించారు.ఈ వైరస్‌ ‌దాడి అమెరికా ఆరోగ్య చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా చెప్పాలని కూడా అన్నారాయన. అక్కడ ఒక్కచోటే 2,77,691 మరణాలు (డిసెంబర్‌ 2 ‌వరకు) సంభవించాయి. మొత్తం కేసులు 1,41,50,813. అక్కడ ఇప్పుడు కరోనా మూడోదశ ప్రతాపం కనిపిస్తున్నది. కొన్ని దేశాలలో రెండోదశ కొనసాగుతున్నది. తొలిదశ విజృంభణ కంటే రెండు, మూడు దశలే ఆయా దేశాలను దారుణంగా కుంగదీస్తున్నాయి. కరోనా మరణాలు చాలా రికార్డులను బద్దలు కొట్టాయి. 2019 నాటి క్షయ మరణాల కంటే కరోనా మరణాలు ఎక్కువ. మలేరియా చావుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన గణాంకాలు. భారత్‌లో కరోనా కేసులు 95,34,964. మరణాలు 1,38,648 (డిసెంబర్‌ 3 ‌నాటికి).

భారత్‌లో కేసుల సంఖ్య కోటికీ, మరణాల సంఖ్య లక్షన్నరకీ చేరుతున్న సమయంలో కరోనా వ్యాక్సిన్‌ ‌వస్తున్న శుభవార్త తెలిసింది. వ్యాక్సిన్‌ ‌కోసం ఇంకొన్ని వారాలు ఆగితే చాలునని మన ప్రధాని మోదీ కూడా చెప్పారు. డిసెంబర్‌ 4‌న ఆయన వ్యాక్సిన్‌ ‌గురించి అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. ధర, వ్యాక్సిన్‌ అం‌దించడంలో పాటించే క్రమం వంటి అంశాలన్నీ ఆయన వివరించారు. డిసెంబర్‌ 2‌వ వారం నుంచి ఇది అందుబాటులోకి వస్తున్నది. కరోనా నిరోధక టీకా తయారీకి పోటాపోటీగా సాగుతున్న ప్రయోగాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ ‌వెనువెంటనే అందరికీ అందుబాటులోకి రాకపోవచ్చు. కానీ వచ్చే వేసవికి మాత్రం పది రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడం ఖాయమని తేలింది. అమెరికాకు చెందిన విఖ్యాత ఔషధ తయారీ ఫైజర్‌, ‌జర్మనీ వారి బయో ఎన్‌ ‌టెక్‌ ‌సంస్థ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. ప్రజలందరికీ కూడా టీకా అందించడానికి జరుగుతున్న పోటీలో ఈ విధంగా ఇంగ్లండ్‌ ‌ప్రథమ స్థానంలో నిలబడింది. ఇంగ్లండ్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఎంహెచ్‌ఆర్‌ఏ ‌ఫైజర్‌ ‌వినియోగానికి ఆమోదం తెలియచేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జరిగిన అధ్యయనాలను బట్టి ఈ టీకా 95 శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్టు తేలిందని ఇంగ్లండ్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి హాంకాక్‌ ‌చెప్పారు. కరోనా మీద జరుగుతున్న పోరాటంలో ఇది పెద్ద అడుగు అని టీకా పంపిణీ మంత్రి వ్యాఖ్యానించారు. ఒక్క ఇంగ్లండ్‌లోనే కాదు, టీకా లేదా వ్యాక్సిన్‌ ‌రాక తొలిదశలో ఉత్పత్తి కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి, ఏ దేశమైనా ప్రాధాన్యాలను నిర్దేశించుకోక తప్పదు. ఇంగ్లండ్‌ ‌ప్రభుత్వం నాలుగు కోట్ల మోతాదులకు ఆర్డర్‌ ఇచ్చింది. 21 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ఈ టీకా తీసుకోవాలి. అమెరికా కూడా డిసెంబర్‌ ‌మధ్యలో ఈ టీకాకు అనుమతించే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో  తన జనాభాలో 60 శాతానికి వ్యాక్సిన్‌ ఇవ్వవలసి ఉంటుందని ఆఫ్రికా తేల్చింది. 1.3 బిలియన్‌ ‌జనాభా ఉన్న ఆఫ్రికా ఖండంలో దాదాపు 22 లక్షల మందికి (రాయ్‌టర్స్ ‌వార్తా సంస్థ నివేదిక) వైరస్‌ ‌సోకింది. 130 కోట్లకు మించి జనాభా కలిగిన భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ అం‌దచేయడం పెద్ద సవాలని అంచనా వేస్తున్నారు. ఇక్కడే ఒక వాస్తవం గమనించాలి. డిసెంబర్‌ ‌మాసాంతానికి ఐదు కోట్ల మోతాదులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్‌ ‌చెప్పింది. అందులో ఒప్పందం మేరకు సగం అమెరికాకు చెందుతాయి. మనిషికి రెండు మోతాదులు అవసరం కనుక, అమెరికా, బ్రిటన్‌లకు రెండున్నర కోట్ల మోతాదులు వెళ్లిపోతాయి. నిజానికి అమెరికా మొత్తం పది కోట్ల మోతాదులకు, యూరోపియన్‌ ‌యూనియన్‌ 20 ‌కోట్ల మోతాదులకు ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి, ఫైజర్‌ ఉత్పత్తినే ఎంచుకుంటే మూడో ప్రపంచ దేశాలు కొద్దికాలం ఆగక తప్పదన్నది నిజం. కానీ ప్రపంచంలో అన్నిచోట్ల ఏకకాలంలో వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రావలసిన అవసరం ఉందని మాత్రం చెప్పాలి. ఒకచోట ఆలస్యంగా వ్యాక్సిన్‌ అం‌దితే, సమస్య పరిష్కారం కూడా ఆలస్యం కాకతప్పదు.

 దేశంలో వేయబోయే వ్యాక్సిన్‌ ‌తొలి ప్రాధాన్యం కరోనా యోధులకు- వైద్య సిబ్బందికి, పోలీసులకు ఇస్తామని ప్రధాని మోదీ కొద్దిమాసాల క్రితమే ప్రకటించారు. మొదట పెద్దతరం వారికి, తరువాత తక్కువ ప్రమాదం పొంచి ఉన్న వయసు వారికి, చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇస్తారు. దేశంలో వ్యాక్సిన్‌ ‌పరిశోధన పురోగతి గురించి డిసెంబర్‌ 1‌వ తేదీన ప్రధాని  స్వయంగా తెలుసుకోవడానికి అహ్మదాబాద్‌, ‌పుణే, హైదరాబాద్‌ ‌నగరాలలోని ఔషధ పరిశోధనాల యాలను  సందర్శించారు కూడా. భారత్‌లో వ్యాక్సిన్‌ ఇవ్వవలసిన జనాభా 130 కోట్లు. అవసరమయ్యే మోతాదులు 260 కోట్లు. ఏటా టీకాలు ఇచ్చే నవజాత శిశువులే 2.67 కోట్లు ఉంటారు. నిజానికి ప్రపంచంలో ప్రజలందరికీ టీకా అనే కార్యక్రమాన్ని నిర్వహించే దేశం మనదే. ఇందుకు పటిష్టమైన వ్యవస్థ కూడా ఉంది. వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం నిర్వహించే నర్సులు 40 లక్షలు ఉన్నారు. మనకు 27,000 శీతల గిడ్డంగుల చైన్లు ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్‌కు ఇవి కూడా చాలవని అనుమానం ఉంది. వీటి సామర్ధ్యం కూడా ఆ వ్యాక్సిన్‌కు చాలదని చెబుతున్నారు. మన దేశంలో ఏ వ్యాక్సిన్‌ అయినా 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ‌దగ్గర నిల్వ ఉంచుతారు. ఇక, ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీ, దేశీయంగా తయారు చేసుకునే భారత్‌ ‌బయోటెక్‌ ‌వ్యాక్సిన్‌లను సాధారణ రిఫ్రిజిరేటర్‌లలో ఉంచితే చాలు. కానీ, మోడెర్నా వ్యాక్సిన్‌ను 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ‌వద్ద నిల్వ చేయాలి. ఫైజర్‌ ‌వ్యాక్సిన్‌ను 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచుతారు. భారత ప్రభుత్వం ఈ చివరి రెండు వ్యాక్సిన్‌ల మీద దృష్టి పెట్టింది. ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం వారి ఆస్ట్రాజెనికా, మోడెర్నా వ్యాక్సిన్‌లకు పూర్తి స్థాయి సామర్ధ్యం ఉందని తేలినట్టయితే భారత్‌ ‌కూడా తన 130 జనాభాకు వ్యాక్సిన్‌ ఇచ్చే బృహత్తర పథకం గురించి ఆలోచించ వలసి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్‌ను (ఏ సంస్థ తయారీ అయినా) మూడు లేదా నాలుగు వారాలలో రెండుసార్లు తీసుకోవాలి. ఈ రెండు మోతాదులకు కలిపి భారత్‌లో వేయి రూపాయలుగా నిర్ణయించినట్టు ఆక్స్‌ఫర్డ్  ఆ‌స్ట్రాజెనెకా టీకా తయారు చేస్తున్న సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ (‌పుణే) ప్రకటించింది. మొత్తంగా ఈ టీకా మీద లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి ఉంటుంది.

వచ్చే రెండుమూడు నెలలో వ్యాక్సిన్‌ ఎక్కువగా అందుబాటులోకి వస్తుందని ఇప్పుడు అంతా చెప్పగలుగుతున్నారు. ఫైజర్‌కు బ్రిటన్‌ ఆమోదం తెలియచేయగా, స్పుత్నిక్‌ ‌వి వ్యాక్సిన్‌కు రష్యా అనుమతి ఇచ్చింది. అక్కడ కూడా వచ్చే వారం నుంచే ఆ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వవలసిందని అధ్యక్షుడు వ్లాదిమర్‌ ‌పుతిన్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. స్పుత్నిక్‌ ‌వి డిసెంబర్‌ ‌నుంచే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కానుంది కూడా. ప్రస్తుతానికి 20 లక్షల మోతాదులు అక్కడ సిద్ధమయ్యాయి. నిజానికి ఇదే ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌. ‌దీనిని లక్షమందికి ఇచ్చినట్టు కూడా రష్యా ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

 ఫైజర్‌ ‌సంస్థ వ్యాక్సిన్‌ ‌వలెనే, అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌ ‌కూడా 95 శాతం సురక్షితమని తేలింది. అమెరికాదే ఇనోవియో ఫార్మాస్యూటికల్‌ ‌సంస్థ వ్యాక్సిన్‌ ‌కూడా ఆశించిన ఫలితాలను ఇస్తున్నదని నివేదికలు చెబుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం వారిదే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ‌వృద్ధులకు బాగా పనిచేస్తున్నదని నివేదికలు చెబుతున్నాయి. భారత్‌ ‌బయోటెక్‌, ఐసీఎంఆర్‌ ‌కోవాగ్జిన్‌ ‌మూడోదశ ప్రయోగాల్లో ఉంది. అయినా వచ్చే ఏడాది ఆరంభంలో ఇది కూడా అందుబాటు లోకి వస్తుందని అంచనా.

పొరుగువారికి జీవించే హక్కు ఉండాలి!

బహిరంగ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించకపోతే ఇతరుల ప్రాథమిక హక్కు- జీవించే హక్కును, ఆరోగ్య హక్కును హరించినట్టేనని తేల్చి చెప్పింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయంలో కేంద్రం ఎప్పుడో విధివిధానాలు రూపొందించింది. ఇప్పుడు ఇలాంటి అదేశాలు ఇవ్వవలసిన అవసరం ఏం వచ్చింది? బహిరంగ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించనందుకు పట్టుబడ్డవారు కొవిడ్‌ ‌కేర్‌ ‌కేంద్రాలలో పని చేయాలని గుజరాత్‌ ‌హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం  కోర్టుకెక్కింది. గుజరాత్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేసినా, మాస్కులు ధరించకపోతే అవతలి వారి హక్కులకు భంగం వాటిల్ల చేసినట్టేనని మాత్రం అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. గుజరాత్‌ ‌హైకోర్టు తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయవలసి వచ్చింది. హైకోర్టు వారి ఆశయం మంచిదే అయినా, సాధారణ ప్రజలని, అంటే నిపుణులు కాని వారిని కొవిడ్‌ ‌కేంద్రాలలో సేవల కోసం పంపిస్తే కేసులు మరిన్ని పెరుగుతాయని సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదించారు. దీనికి సుప్రీం కోర్టు ఆమోదించి, హైకోర్టు ఆదేశాలు కొట్టి వేసింది.

అయినా దేశంలో కరోనా అంతమైపోయినట్టు, ఇక ముక్కు గుడ్డకు వీడ్కోలు చెప్పవచ్చునన్నట్టు దేశంలో చాలామంది వ్యవహరించడం సరైనదే కాదు. ఒకరోజు తగ్గినా ఇంకొక రోజు కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్యలో పెద్ద మార్పు లేదు. డిసెంబర్‌ 3 ‌నాటికి దేశంలో 95 లక్షల కేసులు పైగా నమోదైనాయి. కోటి సంఖ్యకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. ఇలాంటి సమయంలో కేంద్రం ఇచ్చిన సామాజిక దూరం, మాస్క్ ‌ధరించడం వంటి ఆదేశాలను పాటించక తప్పదు. దీనిని సుప్రీంకోర్టు గుర్తు చేయవలసి రావడమే వింత.

About Author

By editor

Twitter
Instagram