ఆ ఉత్తర కుమారులకు ఓ ప్రశ్న

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలకు రెండురోజుల ముందు కొన్ని తెలుగు దినపత్రికలు ఓ బహిరంగ లేఖను ప్రచురించాయి. దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ జాతీయవాద ఆలోచనాపరులైన మేధావులు తీవ్రంగానే పరిగణించారు. ‘గంగా జమునా తహజీబ్‌ ‌కాపాడుకుందాం’ అన్న శీర్షికతో ఇది దర్శనమిచ్చింది. కొందరు కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారుల సంతకాలతో వచ్చిన ఆ లేఖను గమనిస్తే వాళ్ల కంట్లో దూలాలు ఉన్నా, ఎదుటివారి కంట్లోని నలక తీస్తామని బయలుదేరినట్టే ఉంది. హైదరాబాద్‌ ‌నగరంలో విద్వేషానికి తావులేదని అంటూనే, ఉత్తరాది శక్తుల కుట్ర, హైదరాబాద్‌ ‌సహజీవన సంస్కృతిని భగ్నం చేసే కుట్ర, మత విద్వేషం అంటూ పెద్ద పెద్ద మాటలతో అత్యంత కృతకంగా సాగింది ఈ లేఖ.

 ఉత్తరాది దాష్టీకాన్ని ఎదిరిద్దాం, మత విద్వేష శక్తుల కుట్రలను నిలువరిద్దాం అంటూ హాస్యాస్పదంగా పిలుపొకటి.

వాస్తవానికి ఈ లేఖ ఎవరినీ ఉద్దేశించలేదు. సందర్భాన్ని గమనిస్తే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు రాష్ట్రంలోని అధికార పార్టీకి వత్తాసుగా, బీజేపీకి వ్యతిరేకంగా దీన్ని విడుదల చేసినట్లు ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఎవరి పేర్లు నేరుగా వాడలేదు కాబట్టి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కాబోలు ఎవరూ ఈ లేఖకు స్పందించలేదు కూడా. కానీ అందులోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. లేఖను విడుదల చేసిన వారంతా వామపక్ష నేపథ్యం ఉన్నవారు, ప్రభుత్వం ద్వారా పదవులు లేదా, మరో రూపంలో దండిగా లబ్ధ్ది పొందినవారే. జాతీయవాదమంటే వీరిలో చాలామందికి గిట్టదు. సెక్యులర్‌ ‌ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలకడమే ఈ లేఖ లక్ష్యంగా కనిపించింది.

మతవాద విస్తరణ అన్నారు.. మత వాదాన్ని ఎవరు రెచ్చగొట్టారో తెలియనిది ఎవరికి, దొంగ నిద్ర నటించే ఇలాంటి మేధావులకి తప్ప. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయిన, అనేక నేరాలతో సంబంధాలు ఉన్న మతోన్మాద పార్టీ వీరికి కనిపించదెందుకు? కేవలం పదిహేను నిమిషాల పాటు పోలీసులు పక్కకి జరిగితే చాలు, హిందువులకు మా సత్తా చూపడానికి అని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం బతుకమ్మ మీద, మహాలక్ష్మి మీద వ్యంగ్య బాణాలు విసిరింది ఎవరు? ఇది విద్వేషంగా కనిపించలేదా? పాతబస్తీలో పన్నులు కట్టకుండా, అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ అధికారులపై దాడులు చేస్తున్నదీ, చట్టాలేవీ తమకు వర్తించవు అన్నట్లుగా దౌర్జన్యాలు, గుండాయిజం చేస్తున్నదీ ఎవరో తెలియదంటే ఈ సంతకాలు చేసినవాళ్లంతా దివాంధులే అనక తప్పదు.

దేశవ్యాప్తంగా ఎక్కడ మతఘర్షణలు, బాంబుదాడులు జరిగినా దాని వెనుక హైదరాబాద్‌ ‌మూలాలు ఎందుకు ఉంటాయో అడగరెందుకు? హైదరాబాద్‌ ‌లో అక్రమంగా తిష్టవేసిన పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశీయుల గురించి మాట్లాడరెందుకు? మైన్మార్‌ ‌తరిమేస్తే వచ్చిన రోహింగ్యాలకు హైదరాబాద్‌లో ఆశ్రయం కల్పించింది ఎవరు? ఈ కాందిశీకుల పేర్లు ఓటర్‌ ‌లిస్టులో ఎలా చేరాయి? వాళ్లకి పాస్‌పోర్టులు, రేషన్‌ ‌కార్డులు, ఆధార్‌ ‌కార్డులు ఇప్పించింది ఎవరు? బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ‌మీద హైదరాబాద్‌ ‌ప్రెస్‌క్లబ్‌లో దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు?

హిందుగాళ్లూ బొందుగాళ్లూ అంటూ మెజారిటీ ప్రజల మీద చౌకబారు వ్యాఖ్యలు చేసినవారు ఎవరు? భైంసాలో మత ఘర్షణలు రెచ్చగొట్టిన పార్టీకి వత్తాసు పలికింది ఎవరు? హైదరాబాద్‌లో అల్లర్లు జరుగుతున్నాయనే ప్రచారం చేసింది ఎవరు? ఇక్కడ విగ్రహాలు కూల్చేస్తాం అంటే ఖండించేందుకు మీ నోళ్లు ఎందుకు పెగలలేదు? ఎన్నికల సందర్భంగా కులసంఘాల సమావేశాలు పెట్టడాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?

గంగా జమునా తహజీబ్‌ అం‌టూ కమ్మని కబుర్లు చెబుతూ ఉత్తరాది దాష్టీకం అనే పదం ఎందుకు వాడారు? అసలు ఆ లేఖ రాసిన మేధావి స్పృహలో ఉన్నాడా అని! గంగాయమున ఉన్నది ఉత్తరాదిలో కాదా! ఆ నదుల పేర్లను మీ అవసరానికి వాడుకుంటూ, ఉత్తర భారతదేశ ప్రజల మీద విషం కక్కడం ఏమిటి? ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ప్రజలు శతాబ్దాలుగా హైదరాబాద్‌ ‌నగరంలో వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉండే ఈ నగర సంస్కృతిలో భాగస్వాములైన వారి మీద మీకు కోపం, ద్వేషం ఎందుకు కలిగింది? వారు భారతీయులు కాదా?

 మీలో ఎంత మంది పాత నగరం వెళ్లి అక్కడి ప్రజల కష్టాలను అధ్యయనం చేశారో చెప్పగలరా? వారి కష్టాలకు కారణం ఎవరు అని అడిగారా? ఒక వర్గం ప్రజలు పాత నగరాన్ని ఎందుకు వదిలిపోతున్నారో తెలుసుకోవడానికి ఎప్పుడైనా ‘నిజనిర్ధారణ’కు వెళ్లారా? కరోనా సంక్షోభ సమయంలో వలస కార్మికులను ఆదుకున్నది, వారికి ఆహార వసతులు కల్పించి, స్వస్థలాలకు వెళ్లేందుకు తోడ్పాటును అందించింది ఎవరు? వరదల సమయంలో నిస్వార్థంగా నగర ప్రజలకు సేవ చేసింది ఎవరు? వీరందరినీ ద్వేషించడానికి మీ మనసు ఎలా ఒప్పుకుంది? ఓటు, దాని విలువల గురించి మీరేనా ప్రజలకు చెప్పేది! అసలు మీలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు ఎందరు?

అన్నిటికన్నా విడ్డూరం- హిందూధర్మం మీద విషం చిమ్మే ఈ స్వయం ప్రకటిత మేధావుల మూక ‘సర్వభూతస్థమాత్మానం సర్వ భూతాని..’ అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ ఇదే నిజమైన హిందూవాదం.. ఇదే హైద్రా బాదీయత.. అదే నిజ జాతీయత అంటూ సుద్దులు పలకడం ప్రపంచ వింత. మంచిదే.. కానీ సందర్భోచితంగా లేఖలో ఉల్లేఖించే బదులు దీన్ని మీరు నిజ జీవితంలో ఆచరిస్తున్నారా? ఆత్మ విమర్శ చేసుకోండి!

భాగ్యనగరాన్ని సౌభాగ్య నగరంగా మారుస్తాం అంటే మీకు భయం ఎందుకు? భాగ్యలక్ష్మిని తలచుకోవడానికి మనసు ఒప్పని మీది ఏ రకమైన తహజీబ్‌?

‌హైదరాబాద్‌ ‌విశ్వనగరం. ఇక్కడ అన్ని కుల, మత, ప్రాంతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇది భారతదేశంలో అంతర్భాగం. ఈ సత్యాన్ని సౌకర్యంగా మరచిపోయిన మీకు దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చారు? కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారుల ముసుగులో ఇలా అసందర్భంగా రాతలు రాస్తూ ప్రజల్లో భయాందోళనలు రగిలించే హక్కు ఎవరిచ్చారు? ఎవరికి అనుకూలంగా ఈ భజనో అందరికీ తెలుసు. ముసుగులో గుద్దులాట ఎందుకు? నేరుగా పేర్లు పెట్టి రాస్తే మరింత స్పష్టంగా మీకు సమాధానాలు కూడా వస్తాయి కదా!

– ‘క్రాంతి’


భాగ్యలక్ష్మి గుడి కథ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేయడానికి (వరద బాధితులకు సాయం ఆపవలసిందిగా ఆయన ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారంటూ వచ్చిన ఆరోపణలు తప్పని చెప్పడానికి) వెళ్లిన సందర్భంగా సోషల్‌ ‌మీడియాలో ఆ ఆలయ ప్రాశస్థ్యం బాగా వైరల్‌ అయింది. అది అందరికీ తెలియాలని ఆసక్తికరమైన ఈ పోస్టు పెట్టారు.
ఇందుకు సంబంధించిన చక్కని స్థలపురాణమిది. 430 ఏళ్ల నాటి ముచ్చట ఇది.. గోల్కొండ సుల్తాన్‌ ‌మహమ్మద్‌ ‌కులీ కుతుబ్‌ ‌షా హైదరాబాద్‌ ‌నగర నిర్మాణం చేపట్టాడు.. ఈ నగరానికి కేంద్రంగా చార్మినార్‌ ‌కట్టడం మొదలైంది.
అప్పట్లో ముచికుందా నది ఒడ్డున ఉండే ఈ ప్రాంతమంతా అడవి.. చార్మినార్‌ ‌నిర్మాణ పని దగ్గర ఓ కాపలాదారుడు ఉండేవారు.. రాత్రి వేళ ఓ ముదుసలి అక్కడికి వచ్చి అతనితో మాటలు కలిపేది.. కాపలాదారుడు ‘అవ్వా.. నేను ఇంటికి పోయి అన్నం తినొస్తా.. అప్పటి వరకూ ఇక్కడే ఉంటావా?..’ అని అడిగేవాడు. ‘పోయి అన్నం తినిరా నాయనా.. నువ్వొచ్చే దాకా ఇక్కడే ఉంటా..’ అని ఆమె ఒప్పుకునేది.
ఇలా కొంత కాలం సాగిన తర్వాత ఆ కాపలాదారుకి ఈ అవ్వ ఎవరో కాదు, దేవత అని అర్థమైంది.. మరునాడు ఎప్పటిలాగా ‘అవ్వా.. నేను ఇంటికి పోయి అన్నం తినొస్తా.. అప్పటి వరకూ ఇక్కడే ఉంటావా?..’ అని అడిగాడు. ‘పోయిరా నాయనా.. నువ్వొచ్చేదాకా ఉంటా..’ బదులిచ్చింది.. కానీ వెళ్లిన కాపలాదారు మళ్లీ తిరిగి రాలేదు.. పాపం ఆ అవ్వ ఇచ్చిన మాట ప్రకారం అక్కడే ఉండిపోయింది.. భాగ్యలక్ష్మమ్మగా స్థిరపడిపోయింది..
హైదరాబాద్‌లో మన తాత ముత్తాతల కాలం నుంచి వినిపిస్తున్న భాగ్యలక్ష్మి మందిర స్థల పురాణం ఇది.. చార్మినార్‌ ‌కన్నా ముందు నుంచే అక్కడ మందిరం ఉన్నదని పెద్దలు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం నిర్మాణంలో పాల్పంచుకున్న కూలీలు రోజూ పూజలు చేసుకోవడానికి అక్కడ గుడి కట్టుకున్నారు. భాగ్యలక్ష్మమ్మకు ‘చార్మినార్‌ ‌మైసమ్మ’ అనే ఇంకో పేరు కూడా ఉంది. ఏటా బోనాల పండుగ ఇక్కడ ఘనంగా చేస్తారు.
1908లో మూసీనది వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయి. వేలాది మంది చనిపోయారు. ప్రధానమంత్రి మహారాజా కిషన్‌ ‌పర్షాద్‌ ‌సూచన మేరకు ఆరో నిజాం మీర్‌ ‌మహబూబు అలీఖాన్‌ ‌మూసీ నదికి పూజలు చేశారు. అప్పట్లో వరద నీరు చార్మినార్‌ ‌వరకూ వచ్చింది. నవాబు భాగ్యలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు చేశాక వరదలు తగ్గాయి. అసలు భాగ్యనగర్‌ ‌పేరు భాగ్యలక్ష్మి పేరుతో వచ్చిందని కూడా చెబుతారు..
భాగ్యలక్ష్మి మందిరం మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఒకటి మాత్రం నిజం. నిజమైన మత సామరస్యానికి ఈ ఆలయం ప్రతీకగా నిలిచింది. కొందరు మతతత్వ వాదులకు భాగ్యలక్ష్మి మందిరం అంటే గిట్టదు. అసలు అక్కడ గుడే లేదు అని గొడవలకు దిగుతారు.. వారికి కొందరు సెక్యులరిస్టు బిరుదాంకితులు వత్తాసుగా నిలుస్తారు.
చార్మినార్‌ ఎం‌త నిజమో.. భాగ్యలక్ష్మి మందిరం అంతే నిజం.. ఇది చారిత్రక సత్యం.. మన నగర దేవత భాగ్యలక్ష్మమ్మ.

About Author

By editor

Twitter
Instagram