– ‌రాజనాల బాలకృష్ణ

కొద్దివారాల క్రితం వరకు దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు ఆంధప్రదేశ్‌ ‌కూడా కొవిడ్‌ 19‌తో తల్లడిల్లి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలు ఆ మహమ్మారితో కకావికలైనాయి. ఆ రెండు జిల్లాల్లోని పశ్చిమ గోదావరి  ఇప్పుడు మరొక భయానక సమస్యతో విలవిలలాడింది. డిసెంబర్‌ ‌నెల మొదటి వారంలో పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని ఏలూరు నగరం గజగజ వణికిపోయింది. చలితో కాదు, వింత వ్యాధి భయంతో. డిసెంబర్‌ 5‌వ తేదీ మధ్యాహ్నం మొదలు వారం రోజుల పాటు, అంతుచిక్కని వింతవ్యాధి బారినపడింది. వ్యాధి మూలాలేమిటో ఇప్పటికీ తెలియకపోవడం మరొక వింత.


ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో తెలియకుండా అంతవరకు ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు, తమతమ పనుల్లో నిమగ్నమైన పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్దులు వారూవీరన్న తేడాలేకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం కనిపించింది. మొదట మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూర్చ వచ్చినట్టు కొట్టుకున్నారు. నురగలు కక్కారు. తరువాత వాంతి చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి జారిపోయారు. ఒకరో ఇద్దరో కాదు వరసపెట్టి అనేక మందికి ఒకే విధమైన అస్వస్థత. అవే వ్యాధి లక్షణాలు. ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే అసుపత్రిలోని పడకలు నిండిపోయాయి. బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోయింది. ఇటు ప్రజల్లో అటు వైద్యుల్లో, ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన ఉధృతమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్త మయ్యాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ ‌వైద్యబృందం కూడా వచ్చింది. రోజురోజుకు కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. ఎనిమిది రోజుల్లో మొత్తం 600 మందికి పైగా వింతవ్యాధి బారినపడ్డారు.

ఈ వ్యాధికి కారణం బాధితుల రక్తనమూనాలలో బయటపడిన లెడ్‌ (‌సీసం), నికెల్‌ ‌పదార్థాలని నిపుణులు మొదట ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇవి మాత్రమే కారణమని చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 45 నమూనాలలో 25 నమూనాలను ఎయిమ్స్ (‌ఢిల్లీ) పరిశీలించింది. లెడ్‌, ‌నికెల్‌ ఉన్నట్టు వాటిలో బయటపడింది. కరోనా నివారణ చర్యలలో భాగంగా బ్లీచింగ్‌ అతిగా చల్లారా అన్న అంశం మీద కూడా స్థానికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎయిమ్స్‌తో పాటు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌న్యూట్రిషన్‌, ‌సీసీఎంబీ కూడా పరీక్షల కార్యక్రమం చేపట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా పరిస్థితిని సమీక్షించారు.

ముగ్గురు బాధితులలో లెడ్‌ ‌స్థాయి 83.4, 53.6, 53.5 మైకోగ్రాముల వంతున ఉన్నట్టు తేలింది. అంటే ఒక డెసీ లీటర్‌ ‌నమూనాలో బయటపడిన పదార్ధాలు. ఇంత పెద్ద మొత్తంలో లెడ్‌ ఆ ‌పదార్థంతో కూడిన వస్తువులు తయారు చేసే సంస్థలలో పనిచేసే వారిలో తప్ప, సాధారణ ప్రజల రక్తంలో ఉండడం సాధ్యం కాదు. గాలీ, నీరూ కలుషితం కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పలేమని ఏలూరు నగర పాలక సంస్థ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చెబుతున్నాయి. మరి ఇవేవీ కాకపోతే వారి రక్తంలోకి ఆ పదార్థం ఎలా ప్రవేశించింది. పళ్లు, కూరగాయలు, పాలు, బియ్యం, మాంసం వంటివాటితోనా? ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావాలన్నా నివేదికలు రావలసిందే. నీటి కాలుష్యం వల్ల రాలేదంటూ నగర పాలక సంస్థ, కాలుష్య నియంత్రణ బోర్డు చెప్పడానికి కారణం లేకపోలేదు. మినరల్‌ ‌వాటర్‌ ‌తాగే అలవాటు ఉన్నవారు కూడా బాధితులలో ఉన్నారు. నీటిలో లెడ్‌ ‌శాతం పెరిగిపోవడం వల్లనే ఈ దుష్పరిణామం సంభవించిందనీ నిపుణులు గట్టిగా చెప్పలేక పోతున్నారు. లెడ్‌ ‌విష పదార్థం పెద్ద వయసు వారిలో కంటే పిల్లలలోనే ఎక్కువ ఉన్నట్టు తేలింది. కానీ వ్యాధి బారిన పడినవారిలో పిల్లల కంటే పెద్దలే ఎక్కువ. అలా అని వైరస్‌ ‌వల్లనే ఇదంతా జరుగుతున్న దనీ చెప్పలేకపోతున్నారు. కృష్ణా, గోదావరిల నుంచి కాలువల ద్వారా ఏలూరుకు నీరు అందుతుంది. ఈ కాలువలు సహజంగానే వ్యవసాయ భూముల మధ్య నుంచి సాగుతాయి. చేలల్లో ఉపయోగించే పురుగుమందులు, ఎరువుల వల్ల నీరు కలుషితమై, ఇలాంటి పరిస్థితికి కారణమైందన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఈ వ్యాధి బారిన పడిన వారందరికి కొవిడ్‌ ‌పరీక్షలు కూడా చేశారు. ఏ ఒక్కరికి ఆ వైరస్‌ ‌లేదని తేలింది. ఈ వింత వ్యాధి ఏలూరు నగరంలోని 70 శాతం మంది మీద ప్రభావం చూపించిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది.

ఏలూరువాసుల మీద విరుచుకు పడిన వింతవ్యాధి ప్రస్తుతానికి కొంత శాంతించింది. వారం తిరక్కుండానే అనారోగ్యానికి గురైనవారిలో ఒకరు మినహా అందరూ ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన వారంతా కోలుకుని ఇళ్లకు చేరారు. విజయవాడ, గుంటూరు ఆసుపత్రులలో ఇంకా కొందరు చికిత్స పొందుతున్నా అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు చెపుతున్నారు. ఇది సంతోషించవలసిన విషయమే అయినా, ప్రజల ముందు, ప్రభుత్వం ముందు వందల ప్రశ్నలు సమాధానం కోసం వేచి ఉన్నాయి. వాటికి ఎప్పటికైనా సమాధానాలు ఇవ్వక తప్పదు.

ఏలూరు వింతవ్యాధికి మూలం ఏమిటో, ఒకేసారి, ఆ ఒక్కచోటే ఇలా విరుచుకుపడటానికి గల తక్షణ కారణం ఏమిటో మాత్రం ఇంతవరకు ఎవరికీ అంతు చిక్కలేదు. అందుకే కావచ్చు ఈ వ్యాధిని అంతుచిక్కని వింత వ్యాధిగా పిలుస్తున్నారు. ఏలూరు నుంచి ఢిల్లీ దాకా వైద్యులు, శాస్త్రవేత్తలు వ్యాధి మూలాలు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాధి సోకినవారి రక్త నమూనాలతో పాటుగా, అక్కడ ప్రజలు వినియోగిస్తున్న నీళ్లు, పాలు, పంటపొలాల్లో మట్టి- ఇదీ అదనికాదు, అన్నీ పరీక్షిస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశోధనలు చేస్తున్నారు. అయినా, ఇంతవరకు నిర్దిష్టంగా ఇదీ కారణమని ఎవరు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. ఇది కావచ్చు … కాకపోవచ్చు… అది కావచ్చు … అదీ కాకపోవచ్చు అనే దగ్గరే అందరూ ఆగిపోతున్నారు.

అస్వస్థతకు గురైనవారి రక్త నమూనాల్లో లెడ్‌, ఆర్గానో క్లోరిన్‌, ఆర్గానో ఫాస్పరస్‌ ‌కనిపిస్తోందని ఎయిమ్స్ ‌వైద్యులు గుర్తించారు, కానీ, వ్యాధికి పూర్తిగా అవే కారణమని నిర్ధారణకు రాలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఒకేసారి ఇంతమంది ఇంత తీవ్ర అనారోగ్యా నికి గురి కావడానికి గల కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించా లని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి ఏలూరు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అలాగే, కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో ఒకటికి రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. నిపుణులు వ్యక్తపరిచిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏలూరులో ప్రజలు తాగుతున్న నీటిని ఒకటికి రెండు సార్లు పరీక్షించాలని, బాధితుల రక్తనాళాల్లోకి లెడ్‌, ఆర్గానో క్లోరిన్‌, ఆర్గానో ఫాస్పరస్‌ ఎలా చేరాయో, కచ్చితంగా కనిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే..అస్వస్థత ఎలా వచ్చిందనేది కచ్చితంగా తెలుసుకోవాలని, ఈ కోణంలో అందరూ దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ఈ సమయంలోనే పురుగుమందుల విపరీత వినియోగం తెర మీదకు రావడంలో ఆశ్చర్యం లేదు. రైతును ఇవి నష్టాల నుంచి కాపాడుతూ ఉండవచ్చు. అదే సమయంలో భూమికి అవి చేస్తున్న నష్టం గురించి అంగీకరించక తప్పదు. పురుగు మందులు, నిషేధిత పురుగు మందుల వినియోగాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ఏలూరు పర్యటనలో చెప్పారు. అంటే వింత వ్యాధికి కారణం కనిపెట్టలేనిది కాదని చెప్పకనే చెప్పారు. అడ్డూ అదుపూ లేకుండా పురుగు మందులు, రసాయనాలు వాడడం వలన పంట దిగుమతి పెరిగినా పెరగక పోయినా, రసాయన అవశేషాలు అటు పండిన పంటలను, ఇటు పంట పొలాలను, నేటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఇలా పంచభూతాలు కలుషితం కావడం వలన వింత వ్యాధులు, చిత్ర విచిత్ర ఆరోగ్య సమస్యలు, వేగంగా విస్తరిస్తున్నాయి. కేవలం మనుషులనే కాదు, జంతుజాలం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.

నిజానికి మన దేశంలోనే కాదు, అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో అనేక రకాల వింత వ్యాధులు బయట పడుతున్నాయి. వైద్యశాస్త్రం దీన్ని ‘క్రానిక్‌ అన్నోన్‌ ‌డిసీజ్‌’ అని వ్యవహరిస్తోంది. ప్రకృతిని, పర్యావరణాన్ని ఉపేక్షించడం వలన కొత్త జబ్బులు పుట్టుకు రావడమే కాదు, వేగంగా విజృంభించే లక్షణాలు కూడా కలిగి ఉంటున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌, ‌ఫ్లోరోసిస్‌ ‌వంటి వ్యాధులు విజృం భించడం కూడా చూస్తున్నాం. ఆంధప్రదేశ్‌ ‌విషయాన్నే తీసుకుంటే, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రతి ఇంటినీ పలకరించింది. ఆ వ్యాధిగ్రస్తులు లేని ఇల్లు లేని పరిస్థితి. ఇప్పుడు అదే కిడ్నీ వ్యాధి కృష్ణా జిల్లాలో విస్తరిస్తోంది. సుమారు 300 గ్రామాలు, 13 మండలాలలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఆరు మండలాలలో పరిస్థితి చేదాటిపోతోందని, ముఖ్యంగా గిరిజన తండాలలో పరిస్థితి విషమిస్తోందని స్వచ్ఛంద సంస్థల అధ్యయనంలో తేలింది.

అంతుపట్టని ఈ వ్యాధి ఇప్పుడు ఏలూరులో కనిపించి ఉండవచ్చు. నీరు, ఇతర కాలుష్యాల వల్ల తెలుగు ప్రాంతాలలో వ్యాధులు రావడం కొత్త కాదు. ఉదాహరణకి ఫ్లోరోసిస్‌ ‌సమస్య. ఇంతవరకు ఆంధప్రదేశ్‌లో పెద్దగా లేదని భావిస్తున్న ఫ్లోరోసిస్‌ ‌సమస్య ఇప్పుడు తలెగరేస్తోందని ప్రభుత్వ గణాంకాలే సూచిస్తున్నాయి. పంచాయతీరాజ్‌, ‌పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా, విడివిడిగా విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 261 ఫ్లోరైడ్‌ ‌ప్రభావిత ప్రాంతాలున్నాయి. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దాదాపు 10వేల మంది పిల్లల్లో ఫ్లోరోసిస్‌ ‌లక్షణాలు కనిపిస్తున్నాయి. నిజమే, పొరుగునే ఉన్న తెలంగాణతో పోలిస్తే, ఆంధప్రదేశ్‌లో ఫ్లోరైడ్‌ ‌సమస్య కొంత పలచగానే ఉందనిపిస్తుంది. అయితే, ప్రజలు తాగే నీటిలో ఇంకా ఫ్లోరైడ్‌ ఉం‌దన్న వాస్తవమే విస్మరించారన్నది చేదు నిజం. అంతేకాదు గమనించ వలసిన విషయం, వాస్తవం ఏమంటే, ఫ్లోరోసిస్‌ను తొలగించడం అంత సులభం కాదు. ఆ పని ఇప్పుడు మొదలుపెడితే, మరో 30, 40 ఏళ్లకు గానీ, ప్రస్తుతమున్న ఫ్లోరోసిస్‌ ‌ప్రభావం మనుషులలో, జంతుజాలంలో తొలగిపోదు. ఇప్పుడు తెలంగాణ లోని నల్గొండ తదితర జిల్లాల్లో ఇదే పరిస్థితిని చూస్తున్నాం.

ఈ నేపథ్యంలో ఏలూరులో బయట పడిన వింత వ్యాధి వారం రోజుల్లోనే వెళ్లిపోయిందనే ‘చిన్నచూపు’ పరికిరాదు. నిజానికి, ఏలూరు వింత వ్యాధి పొంచి ఉన్న మరో మహా ప్రమాదానికి సంకేతం. ముందస్తు హెచ్చరికగానే చూడాలని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే, హెచ్చరికలను ప్రభుత్వం పట్టించు కుంటుందా, అంటే సందేహమే.. ఎందుకంటే, కాలుష్యాన్ని కట్టడి చేసి పర్యావరణాన్ని పరిరక్షించ వలసిన ఆంధప్రదేశ్‌ ‌కాలుష్య నియంత్రణ మండలి నిస్తేజంగా మారిపోయింది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పనిచేసే వ్యవస్థ లేదు. అలాగే, ఇటీవల విశాఖలో ఎల్జీ పాలిమార్స్‌లో గ్యాస్‌ ‌లీక్‌ అయిన సందర్భంలో గానీ, ఏలూరు వింతవ్యాధి విషయంలో గానీ, రాష్ట్ర కాలుష్య మండలి కనీసం స్పందికపోవడం విమర్శలకు తావిస్తోంది. నీటిలో రసాయనాలు కలిసినా, ప్రమాదకర మూలకాలు కలిసినా, అవి తాగిన జనం ఆస్పత్రుల పాలవుతున్నా కాలుష్య మండలిలో కదలిక లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ప్రజలకు ఇబ్బందులు ఎదురైన తర్వాతైనా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యం ఏ స్థాయికి చేరిందో పరిశీలించడంతో పాటు నియంత్రణకు కార్యాచరణను రూపొందించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు మండలిని మాత్రమే విమర్శించడం సరికాదని, ప్రభుత్వ, రాజకీయ జోక్యం, సరైన పరిశోధనా సదుపాయాలు లేకపోవడం వలన కాలుష్య మండలి సమర్థంగా పనిచేయలేక పోతోందన్న వాదనలో కూడా నిజం లేకపోలేదు. మొత్తంగా చూస్తే, కాలుష్య నియంత్రణ కంటితుడుపు వ్యవహారమే అనిపిస్తుంది.

ఇక ప్రతిపక్షం తెలుగుదేశం యథావిధిగా తన విమర్శలు గుప్పించడానికే పరిమితమైంది. అయితే ఇందులో కొన్ని ఆరోపణల గురించి ప్రజలు ఆలోచించక తప్పదు. ఎయిమ్స్ ‌వంటి సంస్థల నివేదికలను జగన్‌ ‌ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామా నాయుడు ప్రశ్నించడం అర్ధం చేసుకోదగినదే. రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో టీడీపీ ప్రభుత్వం రూ.23వేల కోట్లతో చేపట్టిన జలధార, స్వచ్ఛధార, ఎన్టీఆర్‌ ‌సుజలస్రవంతి ప్రాజెక్టులను జగన్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపేసిందన్న ఆరోపణ కలవరపెట్టేదే మరి! ఈ ఆరోపణ ఇప్పుడు చర్చకు రావడం అవసరం కూడా. ఏలూరు పంపుల చెరువు నీరు తాగి 20, 30 మంది అంతక్రితమే ఆసుపత్రుల్లో చేరినా, ప్రభుత్వం ఎందుకు మేల్కొనలేదని, ఎందుకు గుర్తించలేకపోయిందని ఆయన లేవదీసిన ప్రశ్న కూడా సందర్భోచితమే. ఆ చెరువు నీరు కలుషితమైనా, తాగునీరు సరఫరా అయ్యే కృష్ణా కాలువలో కొవిడ్‌ ‌వ్యర్థాలు కలిసినా ప్రభుత్వం, ఎందుకు చర్యలు చేపట్టలేదన్న నిమ్మల ఆగ్రహం నిజమైతే ప్రభుత్వం నిర్లక్ష్యం సామాన్యమైనది కాదనే అనాలి. కరోనా విజృంభిస్తున్న సమయంలో పారాసిటామాల్‌, ‌బ్లీచింగ్‌ ‌పౌడర్‌ అం‌టూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం, చివరకు 7వేల మందిని బలి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. వింతవ్యాధికి గురైన బాధితులందరికీ వారికున్న సమస్యల దృష్ట్యా యూరాలజిస్టులతో వైద్యం చేయించాలి కాని, ప్రభుత్వం జనరల్‌ ‌ఫిజీషియన్లతోనే చికిత్స చేయించడమేమిటన్న ప్రశ్న కూడా ఆలోచించదగినదే.

ఆరోగ్యరక్షణ, పరిసరాల పరిశుభ్రత అవసరాల గురించి కూసాలు కదిలేటట్టు హెచ్చరికలు చేసిన కరోనా భయమైనా మనలని మేలుకొలుపుతున్నాదా? అదీ చెప్పలేని పరిస్థితి. ఆ మహమ్మారి వెళ్లిపోయిందని గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. అది ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యాధి. కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధుల సంగతి ఏమిటి? ఇప్పుడు దేశం ఆందోళనగా చూస్తున్న ఏలూరుకే కాకుండా అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్టాలు, దేశాలకు కూడా, ఒకటి కాదు, ఇంకా అనేక వింత వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ఒక వ్యాధి నుంచి ఒక ప్రాంతానికి తాత్కాలికంగా ఉపశమనం లభించినా, మానవాళికి పొంచి ఉన్న వింతవ్యాధుల ముప్పు పూర్తిగా తొలిగిపోయిందని సంతోషించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఎందుకు లేదో వివరంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రకృతిని మనం రక్షించుకుంటే, ప్రకృతి మనలను రక్షిస్తుంది. అది లేదు కాబట్టి ఇది లేదు. నిజం. ఇప్పుడు కాదు ఇంచుమించుగా అర్ధ శతాబ్దికి పైగా, మనం తింటున్న తిండి, తాగే నీరే కాదు, మనం పీల్చే గాలి కూడా కలుషితం అయిపోయిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తునే ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రపంచ దేశాలు పర్యావరణ రక్షణ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం పారిస్‌ ఒప్పందం ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి సారధ్యంలో, ‘క్లైమెట్‌ ‌యాంబిషన్‌ ‌సమ్మిట్‌-2020’ ‌పేరిట శిఖరాగ్ర సదస్సు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. మన దేశం 2015 పారిస్‌ ఒప్పందం లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. నిజమే స్థూలంగా చూస్తే, ముఖ్యంగా ప్రధానమంత్రి సంకల్పం, ప్రోత్సాహాలతో స్వచ్ఛ భారత్‌ ‌కార్యక్రమం మొదలైన తర్వాత మన దేశంలో పర్యావరణ పరిస్థితు లలో సానుకూల మార్పులు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, స్వచ్ఛభారత్‌ ‌కార్యక్రమంతో దేశంలో పర్యావరణ స్పృహ పెరిగింది. కానీ ఇది చాలదనే చెప్పాలి.

రాష్ట్రంలో ఇటు సముద్రతీరం వెంబడి, అటు నదుల ఒడ్డున అనేక పరిశ్రమలున్నాయి. వాటిలో ఏ పరిశ్రమ అయినా ప్రమాదకర రసాయనాలను నీటిలోకి వదిలినా, లేక ప్రమాదకర స్థాయిలో కాలుష్యం, రసాయనాలు వెలువడినా, వెంటనే సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలి. అవేవీ జరగడం లేదు కాబట్ట్టే ఏలూరు వంటి కాల్వల వెంట ఉండే పట్టణాలు, గ్రామాల ప్రజల ఆరోగ్యంపై పరిశ్రమల కాలుష్యం ప్రభావం చూపుతోంది. అలాగే, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వలన కలిగే ప్రమాదాన్ని కాలుష్య మండలి, ఇతర ప్రభుత్వ సంస్థలు ఎప్పటికప్పడు గుర్తించి చర్యలు తీసుకోవాలి. ప్రజలను, ప్రజారోగ్య యంత్రంగాన్ని హెచ్చరించాలి, అంటే అనేక శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే కాలుష్యం కోరల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంతవరకు అవేవీ సక్రమంగా జరగలేదు, అందుకే ఏలూరును వింతవ్యాధి వణికించింది. అయితే ఈ నేపథ్యంలో, ఒక్క ఏలూరు సంఘటన అందరి కళ్లు తెరిపించేయగలదని, పరిస్థితి అంతా చక్కబడుతుందని ఆశించడం మంచిది కాదు.

నిజానికి ఏలూరును వణికించింది వింత వ్యాధి కాదు, మన నిర్లక్ష్యం..

– వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram