భయానక నిజాలు వింటామా?

కరోనా కల్లోలంతో ఊహాన్‌ ‌నగరం (చైనా) ప్రపంచానికి పరిచయమైంది.

అంత స్థాయిలో కాకున్నా, అంతుబట్టని వింతవ్యాధి కలకలంతో ఇప్పుడు ఏలూరు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.

ఏలూరులో బయటపడిన వ్యాధికి గల కారణా లేమిటో పూర్తిగా తెలియకున్నా కొన్ని అంచనాలు వస్తున్నాయి. కారణాలను తేల్చేందుకు పంపుతున్న నమూనాలను పరీక్షిస్తున్న డాక్టర్లు విస్తుపోతున్నారని తెలిసింది. అసలు ఇలాంటి పరిస్ధితుల్లో జనం అక్కడ ఎలా బతుకుకున్నారన్న ప్రశ్న వస్తున్నదని చెబుతు న్నారు. ఎక్కువ మంది ఊహించినట్టే నీటి కాలుష్యమే ఈ వింతవ్యాధికి ప్రధాన కారణమా? ఈ అనుమానాల నేపథ్యంలోనే క్రిమిసంహారకాల శాతం వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలడం విభ్రాంతికి గురిచేసేదే. వ్యవసాయం కోసం విచ్చలవిడి పురుగు మందుల వాడకమే ఈ పరిస్థితికి మూలమని భావించవలసి వస్తున్నది.

ఈ వింతవ్యాధి కారణాలను వెలికితీసేందుకు ముందుగా రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినప్పుడు వాటిలో లెడ్‌ (‌సీసం), నికెల్‌ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు, తరువాత నీటి నమూనాలను పరీక్షించే పనిలో పడ్డారు. దీనితో మరిన్ని విభ్రాంతి కర వాస్తవాలు బయటికొచ్చాయి. నీటి కాలుష్యం తారస్థాయిలో ఉందనీ, వైరస్‌ ఆనవాళ్లు లేకపోయినా పురుగుమందుల అవశేషాలు వేల రెట్లు అధికంగా ఉన్నాయని నిర్ధారణకొచ్చారని తెలిసింది. దీంతో వీటిని మరింత లోతుగా పరీక్షించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు.

ఏలూరుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ నీరు, మరికొన్ని ప్రాంతాలకు గోదావరి నీళ్ల• తాగునీటిగా మార్చి అందిస్తున్నారు. ఈ రెండు నదుల నీళ్ల నుంచి సేకరించిన నమూనాలలోనూ క్రిమిసంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటిలో కలుపు మొక్కల నివారణ మందులతో పాటు దోమలు, ఈగలు, బొద్దింకల నివారణకు వాడేవి, పంటల్లో చీడపీడల నివారణకు వాడే ప్రమాదకర రసాయనాల అవశేషాలు ఈ నీళ్లలో ఉన్నట్లు తేలింది.

కృష్ణా కాలువ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో మెథాక్లీక్లోర్‌ ఏకంగా 17,640 రెట్లు ఎక్కువగా ఉందని డాక్టర్లు తేల్చారు. తాగునీటిలో ఈ రసాయనం అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కేవలం 0.001 మిల్లీ గ్రాములకు మించకూడదు. కానీ తాజా పరీక్షల్లో ఇది 17.64 మిల్లీ గ్రాములున్నట్లు తేలడం డాక్టర్లను సైతం కలవరపెడుతోంది.

ఏలూరులో ఆరు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా.. అన్ని చోట్లా దాదాపు ఒకే ఫలితాలు రావడంతో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా నగరానికి సరఫరా అవుతున్న క ృష్ణా, గోదావరి జలాలు విషతుల్యం కావడం వల్లే రోగుల శరీరాల్లో సీసం, నికెల్‌ ‌చేరాయన్న అనుమానాలు ప్రజలలో బలపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యం, విచ్చలవిడి రసాయనాల వినియోగం బయటికొస్తున్నాయి.

వ్యాధి బయటపడిన తరువాత నగరంలో 9, 10,12,15 డివిజన్‌లలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ‌కమిషనర్‌ ‌శానిటేషన్‌ ‌పనులను చేయిం చడం ఒకింత వింతే. మురుగు కాలువల్లో పూడిక తీయించడం,  రోడ్డు పక్కన, ఖాళీ స్థలాల్లో మొక్కలు తొలగించే అవసరం ఇప్పుడే కనిపించడం కూడా వింతే. పందుల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌ ‌నిర్వహిస్తు న్నట్లు చెప్పారు. ఏమైనా ప్రధాని మోదీ అంతగా చెబుతున్నా స్వచ్ఛభారత్‌ ‌గురించి పట్టని నగరాలు, పట్టణాలు ఇప్పటికే మిగిలే ఉన్నాయని అనిపిస్తున్నది.

ఇలాంటి నీటిని ఇన్నేళ్లుగా ఏలూరు  జనం ఎలా వాడుతున్నారని వైద్యబృందాలు విస్తుపోతున్నాయి. ఇలాంటి హానికర రసాయనాలు నీటిలో ఉండడమే చేటు అనుకుంటే, వేల రెట్లు ఎక్కువగా ఉన్న నీటిని అలాగే వినియోగించటంతో జనం శరీరాల్లో భారీగా సీసం, నికెల్‌ అవశేషాలు చేరిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ వింతవ్యాధి బారిన పడినవారినే కాదు, ఈ ప్రాంతంలో ఉంటున్న వారందరినీ పరీక్షించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. మరి ప్రభుత్వం అందుకు సిద్ధమవు తుందా లేక తీవ్రత బయటపడితే అభాసుపాలు కావాల్సి వస్తుందని వదిలేస్తుందా చూడాలి.

మనుషులే ఇలా బతికేస్తుంటే, ఇక జంతువుల మాట వేరే చెప్పాలా? సమస్య తీవ్రతను ఇప్పటికైనా గుర్తించి ఏలూరు ప్రజలందరికీ పరిశుభ్రమైన మంచినీటి సరఫరాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. ప్రజలందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి. కేవలం ఓదార్పు మాటల తోనే సరిపెడితే, ఏలూరు ప్రజల కథ.. మరో ఉద్దానం (శ్రీకాకుళం) విషాదంలా మిగలిపోతుంది. గోదావరి, కృష్ణ నదులు అందుబాటులో ఉన్నా ఏలూరి ప్రజల దుస్థితి ఇది.

– దండు కృష్ణవర్మ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram