హరిహరాంశ తుంగభద్రాయై నమః

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా..

కృష్ణవేణమ్మ బిడ్డ(లు)గా భావించే తుంగభద్ర పుష్కరాలు గురువు మకరరాశిలో ప్రవేశించడంతో నవంబర్‌ 20‌వ తేదీ మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలో పుష్కరయోగం గలిగిన ఉపనది ఇది. రాశి చక్రంలోని ప్రతి రాశికి ఆయా నదీపరీవాహక ప్రాంతాలపై ఆధిపత్యం ఉంటుంది. ఆ క్రమంలోనే మకరరాశికి తుంగభద్రపై ఆధిపత్యం ఉంటుంది. అందుకే ఆయా రాశుల్లోకి గురువు ప్రవేశించడాన్ని ఆయా నదులకు పుష్కరాలు అని నిర్ధరించారు. పుష్కరశక్తితో పాటు మూడున్నర కోట్ల పవిత్రతీర్థాల అంశలు కూడా కలుస్తాయని చెబుతారు.


దేశంలో ఎన్నోనదులు, ఉపనదులు ఉన్నా జీవనదులైన కొన్నిటికే పుష్కరాలు వస్తాయి. అలాంటి వాటిలో తుంగభద్ర ఒకటి. కృష్ణానదికి ఉపనదులైన తుంగ, భద్ర ఉపనదుల సంగమం తుంగభద్ర. ఈ నది హరిహర అభేదత్వాన్ని సూచిస్తుంచడం మరో విశేషంగా చెబుతారు. ‘తుంగా నారాయణః సాక్షాత్‌/‌భద్రాదోవో మహేశ్వరః/తుంగభద్రాదత్మకం విద్ధి/ హరి శంకరయోర్వపుః…’ – ‘తుంగ’ సాక్షాత్తు శ్రీమన్నా రాయుణుడు. ‘భద్ర’ మహేశ్వరుడు. తుంగభద్ర అంటే సాక్షాత్తు హరిహరుల శరీరమని ఆది నుంచి వస్తున్న ప్రశస్తి. ‘గంగాస్నానం.. తుంగాపానం’అనే నానుడి ఉండనే ఉంది.

‘కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమీ

భాగీరధీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః’ అని పంచగంగలుగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ నది పేరు కనిపిస్తుంది.

పురాణేతిహాస కావ్యాలలో తుంగభద్ర నది ప్రసిద్ధంగా ప్రస్తావనకు వచ్చింది. ‘తుంగభద్రా కృష్ణా భీమరథీ విశ్వేతి మహానద్యః’ అని భాగవతం ప్రస్తావించింది. పోతనామాత్యుడు తన శ్రీమదాంధ్ర మహద్భాగవతంలో ‘తుంగభద్రయు, కృష్ణవేణయు, భీమరథియ, గోదావరియు..’ అంటూ దక్షిణాది పుణ్య నదుల పేర్లను తుంగభద్రతోనే ఆరంభించారు. కవిత్రయ మహాభారతంలో ‘గంగయు తుంగ భద్రయు, వేత్రవతియు, వేదవతియు’ అని ఈ నదీ ప్రస్తావన ఉంది.

సహ్య పర్వతశ్రేణిలో వరాహపర్వతంలో గంగ మూలలో జన్మించి ‘తుంగ’ శృంగేరిని దాటి షిమోగా సమీపంలో కుడ్లీ అనేచోట ‘భద్ర’తో సంగమించడాన్ని ‘సహ్యపాద సముద్భూత పవిత్ర జలపూరితా/తుంగభద్రేతి ప్రఖ్యాతా మమ పాపం వ్యపోహతు’ అనే పుష్కర పురాణంలోని పంక్తులు ఈ నదీమాత ఉన్నతిని చెబుతున్నాయి. హంపీ విజయనగరాన్ని చుట్టి ఆంధప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాల సరిహద్దులో ప్రవహించి అలంపురం దాటి సంగవమేశ్వరం వద్ద కృష్ణమ్మను చేరుతుంది. కృష్ణానదిలో కలిసే అనేక ఉపనదుల్లో ఇదే ప్రధానమైంది. అలాగే తుంగభద్ర కృష్ణమ్మకు ఉపనది కాగా, హంద్రీ నది తుంగభద్రకు ఉపనదిగా కర్నూలు వద్ద కలుస్తుంది.

ఈ నదీతీరంలో వెలసిన క్షేత్రాలు, నగరాలు ఉన్నతమైనవే. హంపీ విజయనగర సామ్రాజ్యం ఈ నదీతీరాన్నే విలసిల్లి ‘నాటి రాయల పేరును నేటికి తలపోస్తూ’ గత స్మృతులను పంచుతోంది. జగత్ప్రసిద్ధమైన విరూపాక్ష ఆలయానికి హంపీ క్షేత్రం ఆలవాలం. హంపీ పీఠం ప్రసిద్ధమైనది. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు పాదుకొల్పిన ‘శృంగేరి’ క్షేత్రం దక్షిణాదిన శారదా పీఠంగా పేరెన్నిక గన్నది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి బృందావనం ఆధ్యాత్మికవాదులను అలరిస్తోంది. తుంగభద్ర కృష్ణలో సంగమించే అలంపురం దగ్గర నిర్మితమైన శక్తిపీఠం ఇతర ఆలయాలు సుప్రసిద్ధాలు.

తుంగ-భద్ర ప్రేమికులు!

తుంగభద్రకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథ ప్రకారం, నేటి కన్నడ దేశంలో పూర్వం తుంగడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. గొర్రెలను కాచేందుకు వెళుతూ పిల్లనగ్రోవిని తీసుకు వెళ్లేవాడు. వేణువును ఆలపించడంతో అలనాటి నల్ల గోపయ్యకు తీసిపోయేవాడు కాడట. ఒకసారి పచ్చిక మైదానం వైపు వచ్చిన రాకుమారి ‘భద్ర’ అటుగా వినవస్తున్న వేణునాదానికి పరవశించి, ఆ వేణుగానం తుంగడిదని చెలుల ద్వారా తెలుసుకున్న ఆమె దానిని వినేందుకు నిత్యం వచ్చేది. అలా వారి పరిచయం ప్రేమగా మారగా, అది తెలిసిన రాజు ఆతనిని దండించి, కుమార్తెను అంతఃపురంలో బంధించాడు. ఎడబాటును భరించలేని తుంగడు, భద్ర ‘కరిగి నీర’య్యారు. అలా ప్రవహిస్తూ ఇద్దరూ ఏకమయ్యారు. విడివిడిగా ప్రవహించి, ఒక్కటిగా మారిన ఆ ప్రేయసీ ప్రియులను కృష్ణవేణి తల్లిలా ఒడిన చేర్చుకుంది. తనతో పాటే హంసలదీవి వద్ద సాగర సంగమం చేసింది. ఇది ఐతిహ్యమో లేక కథో అయినప్పటికీ ఔచిత్యవంతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సుగుణాలకు నిలయమైన ‘తుంగభద్ర’ను నేరుగా కలుపుకునేందుకు సముద్రుడికి అవకాశం లేకపోయిందని వికటకవి తెనాలి రామకృష్ణుడు ‘పాండురంగ మహాత్మ్యం’లో చమత్కారంగా పేర్కొన్నాడు. ఒకవేళ ఈ నదినే ప్రత్యక్షంగా కలుపుకుంటే గంగా సంగమాన్ని కోరేవాడా?అని సందేహం వ్యక్తం చేశాడు.

‘గంగా సంగమమిచ్చగించునె? మదిన్‌ ‌గావేరి  దేవేరిగా?

నంగీకారమొనర్చునే? యమునతోనానందముం బొందునే?

రంగత్తుంగ తరంగ హస్తములతో  రత్నాకరేంద్రుడు నీ

యంగంబంటి సుఖించునేని తుంగభద్రానదీ’….

(సముద్రుడు నిన్నే గనగ విలీనం చేసుకుంటే కావేరిని దేవేరిగా మనసులోనైనా అంగీకరిస్తాడా? యమునతో ఆనందిస్తాడా?) అని చమత్కరించాడు. అయితే యుమున నేరుగా సాగరసంగమం చేయదు. గంగతో కలిసే చేరుతుంది. అయినా యమునను ప్రస్తా వించడం వెనుక తుంగభద్ర విశిష్టతను చెప్పడమే ప్రధానం తప్ప తర్కానికి తావులేదని సాహితీ విశ్లేషకులు అంటారు.

పుష్కరం మహాపర్వదినం

కడిమి చెట్టు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తుంది. జీవనదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కనుక పుష్కరం మహా పర్వదినం. గురు (బృహస్పతి) గ్రహం ఏడాదికి ఒక రాశి వంతున పన్నెండు రాశులను పన్నెండేళ్లలో చుట్టి వస్తుంది. అలా ఒక్కొక్కరాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి మహత్వం కలుగుతుందంటారు. అప్పుడు ఆ నదికి పుష్కరాలు వచ్చినట్లు. ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తాయి. అవే ప్రస్తుత తుంగభద్ర పుష్కరాలు. దక్షిణ భారత• దేశంలో పుష్కరయోగం గలిగిన ఉపనది ఇది. పరమశివుడికి ప్రదోష పూజ చేయడం వల్ల లభించేంత పుణ్యం పుష్కర సమయంలో నదీస్నానంతో ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. సమస్త జీవులకు ఆహారం కంటే విలువైనవి గాలి, నీరు. వాటి గొప్పదనాన్ని, వాటిని గౌరవించి, రక్షించుకునే శ్రద్ధాసక్తులను, నైపుణ్యాన్ని సమజానికి తెలియచేయడమే పుష్కర ప్రాశస్త్యం.

పుష్కారాల ఆవిర్భావ నేపథ్యాన్ని స్మరించు కుంటే… సృష్టి ఆరంభంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోరతపస్సుతో పరమేశ్వరుడిని మెప్పించాడు. ఈశ్వరుడిలో శాశ్వతస్థానం పొందేలా వరం కోరాడు. తథాస్తు అన్న పరమేశ్వరుడు, తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలుడికి శాశ్వత స్థానం కల్పించాడు. అలా మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి అయ్యాడు. జలాలకు అధికారి అయినందున పుష్కరుడు అయ్యాడు. పుష్కరుడు అంటే పుణ్యజలమనీ అర్థం చెబుతారు. అంటే ఆయన నివాసం ఉన్నంత కాలంలో ఆయా నదులు మరింత పుణ్యదాయినీలుగా భావిస్తారు.

సృష్టి నిర్మాణ క్రమంలో విధాతకు జలంతో అవపసరం ఏర్పడి శివుడి వద్ద నుంచి జలాధికారి పుష్కరుడిని గ్రహిస్తాడు. దాంతో పుష్కరుడు బ్రహ్మ కమండంలో ప్రవేశిస్తాడు. కాగా సకలజీవరాశిని పునీతం చేసేందుకు, వాటికి జీవానాధారమైన జలం ఇవ్వాలని కోరుతూ బ్రహ్మదేవుడిని బృహస్పతి అర్థించాడు. కానీ ఆ కమండలాన్ని వీడివెళ్లేందుకు పుష్కరుడికి మనస్కరించలేదు. చివరికి విధాత వారిద్దరి మధ్య సానుకూల ఒప్పందం కుదుర్చుతాడు. బృహస్పతి ఒక నది నుంచి మరో నదికి మారేటప్పుడు పుష్కరుడు ఆయనను అనుసరించి పన్నెండు రోజులు, ఏడాది చివర బృహస్పతి మరో నదికి మారేటప్పుడు పన్నెండురోజులు ఉండేలా అవగాహన కుదురుతుంది. మిగిలిన రోజులలో ప్రతిదినం మధ్యాహ్నం రెండు ముహూర్తముల (నాలుగు గడియలు) సమయం మాత్రమే బృహస్పతితో ఉండి, మిగతా కాలమంతా తన కమండంలోనే ఉండేలా పుష్కరుడిని బ్రహ్మ ఒప్పించాడు. అలా బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఆ ప్రకారం మేషంలో (గంగ), వృషభం (రేవ), మిథునం (సరస్వతి), కర్కాటకం (యమున), సింహం (గోదావరి), కన్య (కృష్ణా), తుల (కావేరి), వృశ్చికం (భీమారథీ), ధనుస్సు (బ్రహ్మపుత్ర), మకరం (తుంగభద్ర), కుంభం (సింధు), మీనం (ప్రాణహిత)… ఇలా పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరుడితో పాటే సమస్త దేవతలు, రుషులు, ఇతర నదీమ దేవతలు కూడా ప్రవేశిస్తారని, పుష్కరాల విశిష్టతకు అదీ ఒక కారణమని చెబుతారు.

పుష్కర విధులు

‘జన్మప్రభృతి యత్పాతం స్త్రియావా పురుషైనవా

పుష్కరేత్‌ ‌స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి’.. పుట్టినప్పటి నుంచి సంక్రమించే పాపాలు తొలగిపోవాలంటే పుష్కర సమయంలో నదీ స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఏ నదిలోనైనా బృహస్పతి ఏడాదిపొడవునా ఉన్నా, తొలి పన్నెండు రోజులు, తుది పన్నెండు రోజులు శ్రేష్టతరమైనవని చెబుతారు. వాటినే ఆది, అంత్య పుష్కరాలని అంటారు. ముఖ్యంగా.. పుష్కర స్నానం సమయంలో పాటించవలసిన క్రమశిక్షణను, విధినిషేధాలను శాస్త్రం నిర్దుష్టంగా చెప్పింది. పుణ్యస్నానం అంటే మునకలు వేయడమే కానీ ఈతగొట్టడం, జలాకాటలు కాదు. నీటిలో ఉమ్మకూడదు. పాదరక్షలతో నీటిలో దిగకూడదు. మలమూత్ర విసర్జన చేయకూడదు. వస్త్రాలను శుభ్రపరచకూడదు. నిద్రాసమయంలో ధరించిన దుస్తులతో కాకుండా శభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి. ఒడ్డున ఉన్న మృత్తికను (మట్టిని) లేదా పసుపును తీసుకొని నీటిలో వదిలిన తరువాతే స్నామమాచరించాలి.

స్నానానంతరం శాస్త్రానుసారం జమం, హోమం, అర్చన, దానం, పితృతర్పణం వంటివి చేయాలి. పుష్కరసహితుడైన బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు నదిలో ఉంటారని పురాణ వచనం. పితృదేవతలు అంటే జన్మనిచ్చిన వారో, వంశంలోని పెద్దలో కారని, దేవగణాల మాదిరిగానే పితృగణాలు 33 ఉన్నాయని ప్రవచనకర్తలు చెబుతారు.

పుష్కరస్నానం వేళ ‘శంనో దేవీరభీష్టయ ఆపోభవంతు పీతయే/శంయోరభిస్రవస్తునః’ (దివ్యములైన ఈ జలాలు మంగళకరములై మా అభీష్టములును నెరవేర్చుగాక! తాగేందుకు అనువైన నీటిని ఇచ్చుగాక! నీరు మా వైపు ప్రవహించుగాక) అని రుషిప్రోక్తమైన జలదేవతా ప్రార్థన చేయాలి, చేస్తారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *