‘‌దుబ్బాక ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను!’

రాష్ట్రంలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుంచి మాధవనేని రఘునందన్‌ ‌రావు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎన్నడూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేదని, టీఆర్‌ఎస్‌ ‌కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని రఘునందన్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్షపూరిత రాజకీయాలను ప్రజలు ఎప్పుడూ స్వాగతించరని దుబ్బాక ప్రజలు మరోసారి నిరూపించారని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గాన్ని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలతో పోటీగా అభివృద్ధి చేయడమే తన తక్షణ కర్తవ్యమని చెబుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో జాగృతి జరిపిన ముఖాముఖీ వివరాలు పాఠకుల కోసం..


–       ఈ ఉపఎన్నికలో నూటికి నూరు శాతం యువత భారతీయ జనతా పార్టీ వైపే నిలిచింది.

–       ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

–       ముంపు బాధితుల పరిహారం విషయంలో దుబ్బాక పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రశ్నిస్తాను.

–       దేశవిభజన మరొకసారి జరగకుండా ఉండాలంటే ఎంఐఎంను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

–      నిజాం నిరంకుశ పాలను నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17‌న ఈ గడ్డ మీద జాతీయ జెండాను ఎగరనివ్వకుండా అడ్డుపడటమంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమే.


మొదటిసారిగా చట్టసభకు ఎన్నికయ్యారు. ఈ అనుభూతి ఎలా ఉంది?

ఈ గెలుపు నా బాధ్యతను మరింత పెంచింది. కార్యకర్తలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికలో నిరూపించారు.

స్వల్ప ఓట్ల మెజారిటే అయినా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విశ్లేషకులు దీనిని చారిత్రక విజయంగా అభివర్ణిస్తున్నారు. మీ గెలుపుకు తోడ్పడిన అంశాలేమిటి?

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి దుబ్బాక నియోజకవర్గాన్ని ఎన్నడూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ నిజాన్నే నేను ఇక్కడి ప్రజల ముందుంచే ప్రయత్నం చేశాను. ఇక్కడి సమస్యల మీద నా గొంతును గట్టిగా వినిపించాను. గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వచ్చాను. ప్రజలు నన్ను నమ్మారు. అందుకే ఇంతటి ఘనవిజయాన్ని అందించారు. బూత్‌ ‌కమిటీ అధ్యక్షుడి దగ్గరనుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరూ అందించిన సహకారం, కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే ఈ ఉపఎన్నిక ఫలితం ఇంత గొప్పగా, చారిత్రాత్మ కంగా వచ్చిందని భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం యువత భారతీయ జనతా పార్టీ వైపే నిలిచింది. ఒకప్పుడు జై తెలంగాణ అని నినదించిన ఆ గొంతులన్నీ నేడు జైశ్రీరాం అని నినదించడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది.

భారతీయ జనతా పార్టీ ఈ విజయం ద్వారా అధికార టీఆర్‌ఎస్‌కి ఎలాంటి హెచ్చరికను పంపించిందని భావిస్తున్నారు?

టీఆర్‌ఎస్‌ ‌కుటుంబ పాలనను తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఫామ్‌హౌజ్‌ ‌పాలన సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్‌ అవలంబిస్తున్న నిరంకుశ, నియంతృత్వ, అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దాని ఫలితమే దుబ్బాక తీర్పు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి బీజేపీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్ముతున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోలీసులు ప్రవర్తించిన తీరును ఎలా చూడాలి?

జ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ఎవరు చేసినా ప్రజలు స్వాగతించరు. ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తమకున్న విస్తృత స్థాయి అధికారాలను దుర్వినియోగం చేసింది. మా పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మా బంధువుల ఇళ్లలో అక్రమంగా సోదాలు నిర్వహించి వారిని ఇబ్బందులకు గురిచేశారు. మా అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌గారితో పోలీసులు ప్రవర్తించిన తీరు అధికార పార్టీ నియంతృత్వ పాలనకు అద్దంపట్టింది. అయితే ఈ కుట్రలన్నిటినీ భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుంచింది. అధికార పార్టీ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అహింసాపూరిత విధానాలు, కక్షపూరిత రాజకీయాలకు చోటుండదని దుబ్బాక ప్రజలు నిరూపించారు.

మల్లన్నసాగర్‌ ‌ముంపు బాధితుల విషయంలో ప్రభుత్వంతో ఏ విధమైన పోరాటం చేస్తారు?

ఈ విషయంలో న్యాయపరంగా, శాసనపరంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముంపు బాధితుల పరిహారం విషయంలో దుబ్బాక నియోజకవర్గం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రశ్నిస్తాను.

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తాను. వెనకబడ్డ దుబ్బాక నియోజక వర్గాన్ని ముఖ్యమ్రతి కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌, అల్లుడు హరీశ్‌రావులు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌, ‌సిరిసిల్ల, సిద్ధిపేటలతో సమానంగా అభివృద్ధి చేయడమే ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం. దుబ్బాక ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాను.

ఇటీవలి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు?

ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం పార్టీ విస్తరణ ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. గతంలో జరిగినటువంటి దేశ విభజన మరొకసారి జరగకుండా ఉండాలంటే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న ఎంఐఎంను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఎమ్మెల్సీ నియామకాలను ఎలా చూడాలి?

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఏం చేసినా ఓట్ల కోసమే చేస్తారు. అందుకే కులాల ప్రాతిపదికన ఇటీవలి ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టారు. రానున్న జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కులాల పేర్లతో ఓట్లు సంపాదించేందుకు పదవుల పందేరాన్ని మొదలు పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అంతేతప్ప ఆ కులాల మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని నేను అనుకోను.

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో టీఆర్‌ఎస్‌ ‌వైఖరిని చట్టసభల్లో మీరు, మీ పార్టీ ఎలా ఎండగట్టదలుచుకున్నారు?

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినది. నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున జాతీయ జెండాను ఆవిష్కరించకపోతే ఈ గడ్డ మీద జన్మించిన ప్రజలకు తీరని అవమానంగా నేను భావిస్తాను. కానీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావే ఈ విషయంలో మాట మార్చడం చూశాం. ఇందుకు కారణం ఎంఐఎంతో తమ పార్టీకి ఉన్న స్నేహపూర్వక ఒప్పందమేనని అందరికీ తెలిసిందే. అయితే రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఎంతమాత్రం సరికాదు. కచ్చితంగా సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయంలో శాసనసభ్యుడిగా చట్టసభలో నా గొంతు మరింత బలంగా వినిపిస్తాను.

దుబ్బాక ఫలితం జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు?

ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. అదే ఉత్సాహంతో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కూడా మరింత కష్టపడి పనిచేసేందుకు మా కార్యకర్తలకు దుబ్బాక ఫలితం స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను.

ఇంటర్వ్యూ : కోరుట్ల హరీష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram