దూరదృష్టే తప్ప దురుద్దేశాలు ఉండవు

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డా।। మోహన్‌జీ భాగవత్‌ ‌చేసిన విజయదశమి ప్రసంగం మీద అనేక విశ్లేషణలు వచ్చాయి. ఒక వార్తా చానెల్‌ ఆ ‌ప్రసంగాన్ని ‘జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంగా’ అభివర్ణించింది. మరికొందరు కేవలం రాజకీయ కోణం నుండే ఆ ప్రసంగాన్ని విశ్లేషించటం దురదృష్టకరం. ఇంకొందరు విశ్లేషకులు ప్రసంగాన్నీ, ఆయననూ అభినందించారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌.‌చరిత్ర ఏ కొంచెం తెలిసిన వారైనా రాజకీయాల పట్ల సంఘానికి ఉన్న అభిప్రా యాన్ని తేలికగా అవగాహన చేసుకుంటారు. ఒక జాతి జీవనంలో రాజకీయాలు ఒక పార్శ్వం మాత్రమేనని సంఘం అభిప్రాయం. రాజకీయాలే సర్వస్వం కాదు. అయితే దీనర్ధం రాజకీయాల పట్ల సంఘానికి ఆసక్తి లేదని కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే సంఘం ప్రత్యక్షంగా రాజకీయాలలో దిగింది. ఆత్యయిక పరిస్థితికి ముందు దేశమంతా పెల్లుబికిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సంఘం కీలక పాత్ర పోషించింది. ఆత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి నాయకత్వాన్ని అందించింది కూడా సంఘమే. అలాంటి ప్రత్యేక సందర్భాలలో తప్ప, దైనందిన రాజకీయల పట్ల సంఘానికి అంత ఆసక్తిలేదు. సంఘానికి ఉన్న కార్యకర్తల సంఖ్యాబలంతో పోల్చితే వారిలో రాజకీయాలలో పాల్గొనేవారి నిష్పత్తి చాలా తక్కువేనని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ మాతృక భారతీయ జనసంఘ్‌కు దానికంటూ ప్రత్యేక అజెండా ఉంది. స్వతంత్రంగా పనిచేసిన వ్యవస్థ కూడా దానికి ఉంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తరువాత వివిధ అంశాలపై అభిప్రాయాలను పరస్పరం తెలుసు కొనేవారు. సలహాలు అడిగేవారు. తీసుకొనేవారు. నిర్ణయాలు మాత్రం బీజేపీ నాయకత్వమే తీసుకొనేది. 2014లో అధికారంలోకి వచ్చి పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిన తరువాత కూడా సంఘమే బీజేపీని నియంత్రిస్తున్నదని విశ్లేషకులు రాస్తే అది అసంబద్ధం.

సంఘానికీ, దాని భావజాలానికీ దగ్గరగా ఉన్న సంస్థలు అనేక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని మలచటానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఒక అంశం గురించో, విధానం గురించో అనుకూలం గానో, ప్రతికూలంగానో ప్రజాశ్రేయస్సును, దేశశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే పనిలో అవి నిమగ్నమై ఉంటాయి.

సంఘాన్ని విజయదశమి నాడు ప్రారంభించారు. విజయదశమి ఉత్సవానికి ఉన్న ప్రాధాన్యం అదే. ఏటా విజయదశమినాడు సర్‌సంఘచాలక్‌ ‌స్వయం సేవకులకు రాబోయే సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి దిశానిర్దేశనం చేస్తూ ప్రసంగించటం 1925 నుండి నేటివరకు ఆనవాయి తీగా వస్తున్నది. ఒకానొక కాలంలో ఆ ప్రసంగాలను ఎవరూ పట్టించుకొనేవారు కాదు. పత్రికలు, ప్రసార సాధనాలు ఆ ప్రసంగం ఊసే లేకుండా వార్తా ప్రసారాలు చేసేవి. స్థానిక పత్రికలకే సర్‌ ‌సంఘ చాలకుల ప్రసంగం గురించిన వార్తలూ, విశ్లేషణలూ పరిమితమయ్యేవి. విజయదశమి నాడు జాతికి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి ప్రసంగించటం ఈనాడు కొత్తగా ప్రారంభించింది కాదు. అది అవిచ్ఛనంగా ఆనాటి నుండి ఈనాటి వరకు అనుసరిస్తున్న ఒక సత్సంప్రదాయం. జాతి వర్తమానాన్ని గాని, భవిష్యత్తును గాని ప్రభావితం చేసే రాజకీయాలు గురించి ప్రస్తావించటమూ కొత్తకాదు. కాబట్టి సంఘచాలక్‌లు లేవనెత్తిన రాజకీయ అంశాల గురించే విమర్శకులు గాని, శ్రేయోభి లాషులుగాని ఆ కోణంలో నుంచే విశ్లేషిస్తే, అది సంఘం పట్ల మారిన వారి దృష్టికోణం నుంచి చేస్తున్న విశ్లేషణే తప్ప, అంతకు మించి ప్రత్యేకత ఏమీలేదు. ఒక స్వయంసేవకుడిగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత చేసిన ప్రసంగాన్ని నేను విన్నాను. జాతీయ ప్రాముఖ్యం గల వివిధ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

సర్‌ ‌సంఘచాలక్‌లు ప్రతి కోవిడ్‌ ‌పోరాట యోధుడినీ అభినందించారు. వారి ఆరోగ్యాన్నీ, జీవితాన్నీ పణంగా పెట్టి, జాతికోసం నిర్విరామంగా పనిచేస్తున్న కొవిడ్‌ ‌యోధులకు ఆయన తన కృతజ్ఞతను తెలియచేస్తూ హృదయ పూర్వకంగా అభినందించారు. కొవిడ్‌ ‌వ్యాధి తన క్రమాన్ని మార్చుకున్న వైనాన్ని గుర్తుచేస్తూనే, ఏ విధంగా కొవిడ్‌ ‌కారణంగా కొత్త సామాజిక, ఆర్థిక సమస్యలు మనముందుకు వచ్చాయో ప్రస్తావించారు. స్వరాష్ట్రాలకు, స్వగ్రామాలకు వలస కార్మికులు తిరిగి వచ్చారు. కానీ, వారందరికి ఉపాధి కల్పించటం ఇప్పుడు ప్రధాన సమస్య అయిందని మోహన్‌జీ చెప్పారు. చిరు వ్యాపారులు ఎదుర్కొం టున్న కష్టనష్టాలు గురించి గుర్తుచేశారు. వారి పరిస్థితి దిగజారిన వైనాన్ని మన దృష్టికి తెచ్చారు. బ్రతకటానికి వారికి ఉన్న ప్రస్తుత నైపుణ్యాలు సరిపోవనీ, కొత్త నైపుణ్యాలలో వారికి శిక్షణ ఇవ్వాలనీ ఆయన చెప్పారు. జీతాలు లేని ఉపాధ్యాయులు ఒకవైపు, ఫీజులు కట్టలేని విద్యార్ధులు మరొకవైపు, పాఠశాలలు నడపవలసిన యజమానులు ఇంకొకవైపు కొత్త పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. చిరు వ్యాపారులకు కూడా నిధుల కొరత సమస్య తీవ్రంగా ఉంది. మనం చేపట్టే సేవా కార్యక్రమాలు ఈ కొత్త సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలని ఆయన ఉద్భోదిం చారు. సేవాకార్యక్రమాలు దీర్ఘకాలం కొనసాగించ వలసిన అవసరం గురించి కూడా గట్టిగా చెప్పారు.

ప్రజల మానసిక ఆరోగ్యం గురించిన సమస్యలను కూడా డా।।భాగవత్‌ ‌మన ముందుకు తెచ్చారు. రాజకీయనేతలు, విధాన నిర్ణేతలు అంతగా దృష్టి పెట్టని అంశమిది. ఉద్యోగాలు మాయమై, వృత్తులు కుంటుపడి, వ్యాపారాలు సన్నగిల్లి, ఉపాధులు కరువై, ఆదాయాలు పడిపోతుండటంతో అనేకమంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగాలు ఉన్న వారిలో సైతం, ఇంటినుండి పనిచేసే పక్రియలో మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. ప్రజల మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం వెదకటం కూడా ఈనాడు ప్రధాన సవాలు అని ఆయన అన్నారు. సామాజిక సంతులనానికి ప్రజల మానసిక ఆరోగ్యం ప్రధానమైనది, కనుక పెద్దపెట్టున ఈ సమస్య మీద దృష్టి పెట్టమని ఆయన కార్యకర్తలను ఆదేశించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌నాయకత్వం ఏవిధంగా ఇతరుల కంటె భిన్నంగా మనోభావాల సంతులన ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నవారో దీనిని బట్టి మనం తెలుసుకొనవచ్చు. కాలగర్భంలో కలిసిపోయిన మన ప్రాచీన సంప్రదా యాలు, అలవాట్ల ప్రాముఖ్యాన్ని జనసామాన్యం తిరిగి తెలుసుకొని, ఆచరించటానికి పూనుకుంటున్న సంగతినీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంక్షోభం సమసి పోయాక మనం వాటిని మర్చిపోకూడదని హితవు చెప్పారు. ఎందుకంటె మన పెద్దల శాస్త్రీయ దృష్టి ఆధారంగానే అవి మనుగడలోకి వచ్చాయన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆయన మనకు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ‌కాలంలో పర్యావరణం దానంతట అదే వేగంగా పునరుజ్జీవనం చెందటాన్ని గుర్తించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి, ఆనందించే మన వికృత మనస్తత్వాన్ని మార్చుకోవటం అవసరమని కూడా ఆయన హితవు పలికారు.

వ్యవసాయరంగం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు విలువైనవి. రైతులు తమకు కావలసిన విత్తనాలును తామే ఉత్పత్తి చేసుకోవాలన్న సందేశం ఇచ్చారు. బహుళజాతి సంస్థలు మార్కెట్‌ను నియంత్రిస్తూ, రైతులను పేదరికంలో నెట్టి వేస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టటానికి, విత్తన స్వయం సమృద్ధి సాధించటం తక్షణ అవసరమని వారు చేసిన సూచన విలువైందే. ప్రకృతి ఆధారిత వ్యవసాయం, పర్యావరణ హిత క్రిమిసంహారక మందులు స్వావలంబనకు అవసరమని ఆయన నిశ్చయంగా చెప్పారు. రైతుల ఆత్మహత్యలు నివారించగల శక్తి వాటికి మాత్రమే ఉంది. రైతు మన జీవితాలకు ఎంత అవసరమో ఆయన చెబుతూ రైతాంగం పట్ల మనకున్న బాధ్యతను ఆయన గుర్తుచేయటం సమయోచితమే. రైతుల స్వయం సమృద్ధికోసం, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వటం, రైతులకు, వినియోగదారులకు మధ్య ఉన్న దళారీలను తొలగించటం అవసరమని ఆయన చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సేవలు శ్లాఘనీయం

కొవిడ్‌ 19 ఉత్పాతం వేళ సమాజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎం‌తో చురుకుగా సేవలు అందిస్తున్న దని భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ‌బ్యారీ ఓఫేర్వెల్‌ ‌కొనియాడారు. ఈ నెల 15న సర్‌ ‌సంఘ చాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ను బ్యారీ నాగ్‌పూర్‌లో కలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్‌ ‌చేస్తూ, తమ సమావేశంలో మోహన్‌జీ, కొవిడ్‌ ‌బాధితుల కోసం సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారని తెలియ చేశారు. వారి సమావేశం ఫొటోలు కూడా షేర్‌ ‌చేశారు. గత ఏడాది జర్మనీ దౌత్యవేత్త వాల్టర్‌ ‌జె లిండర్‌ ‌కూడా మోహన్‌జీని కలుసుకున్నారు.


స్వదేశీ భావనను మారిన సందర్భానికి తగ్గట్లుగా ఎలా అన్వయించుకోవాలో భాగవత్‌ ‌చెప్పారు. స్వదేశీ భావన నుండి స్ఫూర్తిని పొంది స్వావలంబన దిశగా కృషి చెయ్యాలని మార్గదర్శనం చేశారు. విద్యారంగం లోనూ స్వదేశీ భావనలు పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తూ, నూతన విద్యావిధానం అందుకు కొన్ని బీజాలు నాటినప్పటికీ, ఇంకా విద్యారంగంలో చేయవలసింది చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

హిందూత్వం ఏ విధంగా స్వదేశీ, స్వాభిమాన భావాలను పెంపొందిం చేందుకు దోహదపడుతుందో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత వివరించారు. హిందూత్వం అంటే మన శక్తిసామర్ధ్యాల పట్ల, గతం పట్ల, మనదైన ప్రతి అంశం పట్ల అంటే ‘స్వదేశీ’ భావన పట్ల మనకున్న విశ్వాసాన్ని వ్యక్తీకరించటం తప్ప మరేదీ కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతి సర్‌ ‌సంఘచాలక్‌లు గతంలో చేసినట్లుగానే ఈ విజయ దశమి సందర్భంగా ఆయన ‘హిందూ’ ‘హిందుత్వ’ భావనలను నిర్వచించటానికీ, వివరించటానికీ పూనుకొన్నారు. గురూజీ గోల్వాల్కర్‌ ఇచ్చిన నిర్వచనాన్ని పునరుద్ఘాటించారు. విదేశీ దురాక్రమణ దారుల అత్యాచారాల వల్ల, సామాజిక దురన్యాయల వల్ల హిందూత్వ పరిధి ఆవల ఉన్న మన సోదరులను దృష్టిలో పెట్టుకొని, వారిని కూడా కలుపుకొని పోయేందుకు వీలుగా హిందూత్వాన్ని, మరింత విస్తృతంగా నిర్వచించారు. సమాజానికి మేలు చేసే ఏ కార్యక్రమాన్నయినా రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం గొడుగు కింద చేపట్టవచ్చని ఆయన ఇంతకు ముందు కూడా అనేకసార్లు చెప్పారు. అయితే రెండు ప్రాథమిక అంశాలకు సంబంధించి ఎటువంటి రాజీ లేదు. హిందూత్వం, భారతదేశం ఒక హిందూరాష్ట్రం అనే ప్రాథమిక సత్యాలకు సంబంధించి మాత్రం ఎటువంటి రాజీ లేదని ఆయన ప్రసంగం తేటతెల్లం చేసింది.

పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు, 370వ అధికరణం రద్దు ఇటీవల కాలంలో జరిగిన రెండు ముఖ్య పరిణామాలు. ఈ రెంటిపై సంఘానికి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. గత 73 సంత్సరాల నుండి సంఘం వీటి అవసరం గురించి జాతిని హెచ్చరిస్తూనే ఉన్నది. వార్షిక సమా వేశాలు నిర్వహించటం మొదలుపెట్టి, జాతీయ అంశాలపై తీర్మానాలు చేయటం మొదలు పెట్టిన 1950వ దశకం నుండి సంఘం ఈ అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూనే ఉంది. కనుక ఇదంతా ఇవాళ కొత్తగా బీజేపీ ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యలను సమర్ధించటానికి చేసిన ప్రయత్నం ఏమీకాదు. వాస్తవానికి విధాన పరమైన ఈ చర్యల ఆవశ్యకతపై సంఘానికి ఉన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించటమే ఆయన చేసిన పని.

దేశాన్ని విచ్ఛిన్నం చేసే ముఠాల పట్ల అప్ర మత్తంగా ఉండాలని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌హెచ్చరించారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దీనిని కొందరు రాజకీయ అంశంగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఇది కూడా దేశశ్రేయస్సుకు, జాతి సమైక్యతకు సంబంధించిన అంశమే. ఇది రాజకీయ అంశం ఎలా అవుతుందో విమర్శకులే చెప్పాలి. రాజకీ యంగా విభేదించవచ్చు. విధానాలను తప్పుపట్ట వచ్చు. దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అయితే విమర్శలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు సామాజిక సంతులనాన్ని, జాతి ఐక్యతను బలహీన పర్చకూడదని ఆయన చెప్పారు.
విమర్శకులు, విశ్లేషకులు వారి రాజకీయ కళ్లద్దాలను తీసివేసి నిష్పక్షపా••ంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.‌ను చూడటం అవసరమని నేను అనుకొంటున్నాను. అందుకు తగిన సమయం వచ్చిందని కూడా భావిస్తున్నాను. జాతికి సంబంధించి, ప్రాముఖ్యం గల అంశాలపై సంఘం ఎప్పుడూ ధృఢ వైఖరినే తీసుకొంటున్నది. అవి ‘రాజకీయ’ అంశాలా, కాదా అన్నది సంఘం ఎప్పుడూ పట్టించుకోలేదు. పట్టించుకోదు కూడా. జాతి ప్రయోజనాలే సంఘానికి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ప్రధానం తప్ప మిగిలినవి కావు. ఈ విజయదశమి సందర్భంగా సర్‌ ‌సంఘచాలక్‌ ‌చేసిన ప్రసంగం రాజకీయపరమైనది కాదు. ఎప్పటిలాగా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రసంగమే. స్వయంసేవకులు ఆ ప్రసంగాన్ని అర్ధం చేసుకొని, దేశానికీ, జాతికీ• తాము చేయగలిగినంత మంచి చెయ్యాలి.

ప్రముఖ రచయిత, విశ్లేషకులు రతన్‌ ‌శారద ‘ఆర్గనైజర్‌’‌లో రాసిన వ్యాసం.
అనువాదం డా।। బి. సారంగపాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *