ఎన్‌డీఏ కూటమి 125 మహాఘట్‌ ‌బంధన్‌ 110

దాదాపు అన్ని ఎన్నికల సర్వేలు బొక్కబోర్లా పడ్డాయి. ఈసారి జరుగుతున్న బిహార్‌ ‌శాసనసభ ఎన్నికలలో  రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) నాయకత్వంలోని మహా ఘటబంధన్‌దే రాజ్యమని అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పేశాయి. జేడీ(యు) నాయకుడు నితీశ్‌కుమార్‌ ‌నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం దాదాపు అసాధ్యమనే ఆ సర్వేలు ఘోషించాయి. కానీ ఫలితాల ధోరణి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అంచులోనే అయినా ఎన్‌డీఏ కూటమి ఆధిక్యం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ సాధించింది. ఓట్ల లెక్కింపు జరిగిన పదో తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అందిన సమాచారం ప్రకారం ఎన్‌డీఏ కూటమి మ్యాజిక్‌ ‌నెంబర్‌కు చేరువైంది. 243 స్థానాలు ఉన్న బిహార్‌ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 122 స్థానాలు అవసరమవుతాయి. ఎన్‌డీఏ కూటమి 125 స్థానాలు సాధించినట్టు వార్తలు వెలువడినాయి. మహా ఘటబంధన్‌ 110 ‌స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.


కొవిడ్‌ 19 ‌పోలింగ్‌ ‌మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ కౌంటింగ్‌ ‌మీద మాత్రం తన ఉనికిని చాటుకుంది. ఎక్కువ పోలింగ్‌ ‌బూత్‌లు పెట్టడంతో కౌంటింగ్‌లో అసాధారణ జాప్యం నెలకొన్నది. ఫలితాలు ఆలస్యంగా రావడం ఒక ఎత్తయితే, వచ్చిన ఫలితాలు పోటాపోటీగా రావడం మరొక ఎత్తు. కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో విధించిన అన్ని నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్‌ ‌జరిగింది. దీనితో ఆలస్యం తప్పలేదు. జనంలో ఉత్కంఠ తప్పలేదు. ఎవరు ఎన్ని చెప్పినా బిహార్‌ ఓటరు నాడి పట్టుకోవడంలో సర్వేక్షకులు దారుణంగా విఫలమయ్యారు. వారు చాలా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలుస్తుంది. యువకుని పట్ల బిహార్‌ ‌మొగ్గు అంటూ నితీశ్‌ ‌పెద్ద వయసును గుర్తు చేసే ప్రయత్నం, ఆ విధంగా ఆయన విజయావకాశాలకు గండి కొట్టే యత్నం ఏమాత్రం సాగలేదు. ఇటీవల కాలంలో ఏ ఎన్నిక చూసినా ఎన్‌డీఏను ఓడించే క్రమంలో విపక్షాలు ఎన్ని ఎత్తులు వేస్తున్నాయో, ఒక వర్గం మీడియా కూడా ఎత్తులు పైఎత్తులు వేయడంలో అంతే కష్టపడుతున్నది. నామినేషన్ల ఘట్టం వరకు పెద్దగా ఎవరి దృష్టి పడని తేజస్వీ యాదవ్‌ను హఠాత్తుగా నితీశ్‌కు పోటీ దారునిగా నిలబెట్టడం అందులో భాగమే.

మూడుసార్లు వరసగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద అసంతృప్తి తప్పని సరిగా పనిచేస్తుందని గత ఎన్నికల అనుభవం. ఎన్‌డీఏ కూటమి, నితీశ్‌కుమార్‌ ‌నాయకత్వంలో మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగింది. రాజస్తాన్‌, ‌మధ్యప్రదేశ్‌; ‌కొంతవరకు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఈ విధమైన ప్రజా అసంతృప్తితోనే ఓడిపోయాయని, అదే ఫలితం బిహార్‌లో పునరా వృతం అవుతుందని చాలామంది వేసిన అంచనాతో రాజకీయ నేతలు ఎవరూ విభేదించడానికి సిద్ధపడలేదు కూడా. ఒక్క రాజస్తాన్‌లో మినహా మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కూటమికి, కమలం పార్టీకి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువ. ఈ వాస్తవాన్ని చాలా సౌకర్యంగా మేధావులు మరుగుపరిచారు. బిహార్‌లో అలా జరగలేదన్నది నిజం. ఆర్‌జేడీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్‌, ‌రబ్రీదేవీల కుమారుడు తేజస్వీ యాదవ్‌ ‌నిజంగానే గట్టి పోటీ ఇవ్వగలిగారు. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, అమాంబాపతు ఐదు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడి ఎన్‌డీఏతో తలపడ్డాయి.

బీజేపీ, జేడీ (యు) హిందుస్తాన్‌ అవాం మోర్చా, కొన్ని చిన్నాచితకా పార్టీలు ఎన్‌డీఏ కూటమిగా బరిలో ఉన్నాయి.

నితీశ్‌కుమార్‌ ‌పాలన మీద బిహార్‌ ‌ప్రజలు నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన బం ఎన్‌డీఏ కూటమికి కట్టబెట్టారు. ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ నితీశ్‌కుమార్‌ ‌నాయకత్వంలోనే తరువాత ప్రభుత్వం ఏర్పడుతుందని మాట ఇచ్చింది. కానీ ఈ ఎన్నికలలో జేడీ(యు)కు యాభయ్‌ ‌లోపు స్థానాలే దక్కాయి. బీజేపీకి మాత్రం 73 స్థానాలు దక్కాయి. ఆర్‌జేడీకి 76 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌ ‌పార్టీకి 19 వచ్చాయి. ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌, ఆయన సోదరుడు తేజ్‌ ‌ప్రతాప్‌ ‌యాదవ్‌ ‌కూడా ఈ ఎన్నికలలో గెలుపొందారు. హిందుస్తాన్‌ ఆవాం మంచ్‌ ‌నాయకుడు జీతన్‌రామ్‌ ‌మాంఝీ, నితీశ్‌కుమార్‌ ‌గెలుపు లాంఛనమే అయింది. ఎన్‌డీఏ భాగస్వామి వికాశ్‌శీల్‌ ఇన్‌సాన్‌ ‌పార్టీ నాలుగు స్థానాలు గెలిచింది. మాంఝీ పార్టీ కూడా నాలుగు స్థానాలు గెలిచింది.

తేజస్వీయాదవ్‌
(ఆర్‌జేడీ)

బిహార్‌ ‌శాసనసభ తాజా ఎన్నికల ఫలితాలు ఎంత ఉత్కంఠభరిత వాతావరణంలో వెలువడి నాయో, అంత తీవ్ర స్థాయి ప్రశ్నలను కూడా దేశం ముందు ఉంచాయి. నితీశ్‌కుమార్‌ అభివృద్ధి కాముకుడు. ఆయన వెనుక బీజేపీ, ఎన్‌డీఏ కూటమి ఉంది. అయినా ఆయన పార్టీ యాభయ్‌ ‌లోపు స్థానాల వద్ద ఆగిపోవలసి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మరొకసారి బిహార్‌లో జంగిల్‌ ‌రాజ్‌ను రానవ్వవద్దని ప్రజలను ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరడం సమంజసమే. లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌పాలన బిహార్‌ ‌చరిత్రలోనే ఒక మచ్చ. ప్రజాస్వామ్యం, బడుగుల అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి నినాదాల మాటున ఆర్‌జేడీ అనే కుటుంబ పార్టీ ఆ వెనుకబడిన రాష్ట్రంలో జంగిల్‌ ‌రాజ్యాన్నే ఏర్పాటు చేసింది. కొన్నేళ్ల పాటు యథేచ్ఛగా సాగించింది. ఆ ఆటవిక పాలన ఆ పార్టీ నేతల అవినీతి కారణంగానే, కోర్టులు జోక్యం చేసుకుని శిక్ష విధించడంతోనే ఆగింది. నిజానికి ప్రతిపక్షాలు నాడు ఏమీ చేయలేక పోయాయి. అలాంటి సమయంలో బీజేపీ సాయంతో నితీశ్‌కుమార్‌ ఆ ‌పేద రాష్ట్రంలో ఆశాజ్యోతిగా ఆవిర్భవించారు. తేజస్వీ యాదవ్‌ ‌తన ప్రచారం తండ్రి లాలూ ఫొటోకానీ, తల్లి రబ్రీ ఫొటోకాని ఉపయోగించలేదంటే, ఆనాటిది జంగిల్‌ ‌రాజ్‌ అని ఆయన పరోక్షంగా అంగీకరించనట్టే. ఇప్పుడు కూడా కుటుంబ పార్టీ లక్షణాల నుంచి ఆర్‌జేడీ బయట పడిందని అనలేం. ఆర్‌జేడీ విజయం నాలుగైదు స్థానాల వెనుక ఉండిపోయింది. అదే అధికారంలోకి వచ్చి ఉంటే కుటుంబ సభ్యులు ఎందరు పాలనలో భాగస్థులయ్యేవారు బాహాటంగా తెలిసి ఉండేది. ఈ పార్టీకి వంశ పాలనలో అపారమైన విశ్వాసం ఉన్న కాంగ్రెస్‌ ‌మద్దతు ఇచ్చింది. నిజానికి ఆర్‌జేడీ అనే ప్రాంతీయ పార్టీకి ఆ జాతీయ పార్టీ చిరకాలంగా తోక వలే వ్యవహరిస్తున్నది.

కానీ నితీశ్‌కుమార్‌ ‌నిజమైన ప్రజాస్వామ్యవాది. వారసులను ప్రకటించుకోలేదు. లాలూ వలే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోలేదు. కోట్లు గడించలేదు. అవినీతి మచ్చతో భవిష్యత్తులో జైలుకు వెళ్లే అవకాశం లేదు కూడా. బిహార్‌ ఆయన హయాంలో నిశ్చయంగా పురోగతి సాధించిందనే అంతా చెబుతారు. అయినా నితీశ్‌ ఓటమిని చాలామంది మేధావులు ఎందుకు కోరుకున్నారు? నితీశ్‌ ఓటమిని కోరుకోక పోతే తేజస్వీ యాదవ్‌ను ఎందుకు ఆయనకు పోటీదారునిగా నిలిపారు? నితీశ్‌ ఎన్‌డీఏ కూటమిలో ఉండడం, బీజేపీ వెంట ఉండడమే అందుకు కారణం. ఆయన చేసిన తప్పిదం అదే. బీజేపీని ఓడించాలంటే ఆ పార్టీ మిత్రులను ఏదో విధంగా దూరం చేసే వ్యూహం సాగుతోంది. మహారాష్ట్రలో జరిగిన రాజకీయ  పరిణామాలు ఇందుకు రుజువు.

అదంతా విపక్షాల కోణం. కానీ ఎన్‌డీఏ కూటమి కూడా ఇప్పుడు ఇబ్బందికర వాతావరణంలో పడిందనే అనిపిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఎన్‌డీఏ కూడా ఇరకాట పరిస్థితులను ఎదుర్కొనవలసి రావచ్చుననే అనిపిస్తుంది. బీజేపీకి సొంతంగా 73 స్థానాలు వచ్చాయి. నితీశ్‌ ‌పార్టీ 43 స్థానాల దగ్గర ఆగిపోయింది. అయినా తక్కువ స్థానాలు ఉన్న పార్టీకి ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వడం అనేది కూటమి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యవాది అయిన నితీశ్‌ ఇం‌దుకు అంగీకరిస్తారా? పదవీలాలసుడన్న అపఖ్యాతిని ఈ వయసులో మూటగట్టుకుంటారా? ఇవే తన ఆఖరి ఎన్నికలని ప్రచారం చివరి రోజున ఆయన ప్రకటించడమే పెద్ద సంచలనమైంది. దాదాపు పాతిక స్థానాలు అధికంగా ఉన్న పార్టీ మద్దతు తాను తీసుకోవడం సబబేనని భావిస్తారా? లేదంటే తానే హుందాగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ముఖ్య మంత్రి బరి నుంచి తప్పుకుంటారా? ఇది అప్పుడే ఊహకు అందదు. కానీ వేసుకోక తప్పని ప్రశ్న.

ఎన్‌డీఏ కూటమికీ, మహా ఘటబంధన్‌కూ మధ్య సీట్ల తేడా పన్నెండు లోపే. తేజస్వీ యాదవ్‌ ‌వంటి నాయకుడు ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోకుండా మిన్నకుంటాడా? నిజమే, ఇప్పుడు ఎన్‌డీఏకు అత్తెసరు మెజారిటీ ఉన్నది. రాజకీయ బేరసారాలకి ఇది అనువైన వాతావరణమే.

చిరాగ్‌ ‌పాశ్వాన్‌ (ఎల్‌జేపీ)

ఈ ఎన్నికలలో మరొక అవాంఛనీయ పరిణామం ఎంఐఎం ఐదు స్థానాలలో పోటీ చేసి అన్నింటిలోను దాదాపు మెజారిటీ తెచ్చుకోవడం. అవన్నీ ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలే. అలాగే సీపీఐ (ఎంఎల్‌) ‌కూడా తన ఉనికిని చాటుకుంది. ఈ రెండు పరిణామాలు ప్రజాస్వామ్యం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రెండు పార్టీల ఫలితాలను బట్టి చూస్తే పెద్ద పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి ఉంటుంది. చిరాగ్‌ ‌పాశ్వాన్‌ ‌నాయకత్వంలోని ఎల్‌జేపీకీ, నితీశ్‌కూ చుక్కెదురు. చిరాగ్‌ ఎన్నికలలో ఒక వింత నినాదం ఇచ్చారు. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని. ఆయన ఆ విధంగా ఎన్‌డీఏ అనుకూల ఓటర్లలో గందరగోళం సృష్టించారన్న విమర్శ ఉంది. చిరాగ్‌ ‌నితీశ్‌ ఓటమిని మాత్రం కోరుకుంటున్నానని చెప్పారు. జేడీ(యు) ఓట్లకి దారుణంగా గండి కొట్టిన పార్టీగా ఇప్పుడు జేడీ(యు) చిరాగ్‌ను నిందిస్తున్నది. అలాగే కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంఐఎంను ఇదే తరహాలో విమర్శిస్తున్నది. సెక్యులర్‌ ఓట్లను చీల్చి మజ్లిస్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌సీట్లకు గండి కొట్టిందని ఆ పార్టీ విమర్శిస్తున్నది. పైగా ఇప్పుడు చాలాచోట్ల కాంగ్రెస్‌ ‌విమర్శిస్తున్నట్టే, మజ్లిస్‌ అం‌టే బీజేపీకి బీ టీం వంటిదని బిహార్‌ ‌కాంగ్రెస్‌ ‌కూడా పల్లవి అందుకుంది. అంటే మజ్లిస్‌ ‌రాకతో బిహార్‌ ‌రాజకీయ వాతా వరణంలో కులంతో సమంగా మతం పాత్రను కూడా పెంచేందుకు దారి ఏర్పడింది. బిహార్‌ ఎన్నికలంటేనే కులాల గొడవ.

ఇంతకీ ఇలాంటి బొటాబొటీ మెజార్టి వచ్చిన సమయంలో రాజకీయ సుస్థిరత ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న తప్పదు. అవతలి పక్షం కూడా ఈ సుస్థిరత గురించి పట్టించుకునేటంత ఔదార్యం ఉన్నది కాదు. తేజస్వీ యాదవ్‌కు జైలు నుంచి సందేశాలు అందుతాయని కూడా చెప్పవచ్చు. రేపు 28వ తేదీన లాలూ బెయిల్‌ ‌పిటిషన్‌ ‌మీద విచారణ కూడా ఉంది. బీజేపీని ఏదో విధంగా నితీశ్‌ ‌వెనకే ఉంచాలన్న ధ్యేయంతో అప్పుడే కొన్ని శక్తులు పనిచేయడం ఆరంభించాయి. శివసేన నాయకుడు సంజయ్‌ ‌రౌత్‌ ఇం‌దుకు సంబంధించిన ఒక అస్త్రం వదిలిపెట్టారు కూడా. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం, నితీశ్‌ ‌ముఖ్యమంత్రి అవుతారని భావిద్దాం అంటూ రౌత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. మరాఠా ప్రముఖుడు శరద్‌ ‌పవార్‌ ఎన్నికలలో తేజస్వీ యాదవ్‌ ‌చూపిన పోరాటపటిమను వేనోళ్ల ప్రశంసించారు. అంటే బీజేపీని ఆ రాష్ట్రంలో ఎదుర్కొనే ఒక వీరుడు లభించాడని ఆయన దేశానికి చెప్పదలుచుకున్నారు.

వీటన్నిటికీ మించినది మరొకటి ఉంది. భావి భారత రాజకీయనేతగా వామపక్షాలు భావిస్తున్న కన్హయకుమార్‌ ఈ ఎన్నికలలో ఏమైపోయారు? లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆర్‌జేడీ అనుసరించినట్టు చెప్పే వ్యూహమే ఇప్పుడు కూడా అనుసరించారా? కన్హయకుమార్‌ ఎదిగితే తేజస్వీకి అడ్డు వస్తాడనే లాలూ యాదవ్‌ ‌పకడ్బందీ వ్యూహంతోనే తుక్డాతుక్డా గ్యాంగ్‌కి సంబంధించిన కన్హయను ఓడించారని చెబుతారు. ఇప్పుడు అసలు పోటీకే నిలపలేదు. అప్పుడే రంగు తేలిపోయిందా? ఆ సంగతేమో కానీ, ఎంఎల్‌ ‌పార్టీ శాసనసభకు ప్రతినిధులను పంపడం మాత్రం ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు.

ఏమైనా బిహార్‌ ఎన్నికల ఫలితాల ప్రకారం ఎన్‌డీఏ కూటమికి మరొకసారి  పట్టం కట్టింది. దీనిని అంతా గౌరవించవలసి ఉంటుంది. ఎన్‌డీఏ కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశం వారే తేల్చుకుంటారు. అలాంటి సంకేతాలు అప్పుడే ఆరంభమయ్యాయి. బీజేపీ నేత సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ, ఇతర బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ను కలుసుకున్నారు. బిహార్‌ ‌వంటి రాష్ట్రానికి కేవల కులరాజకీయం కంటే, కేవల పదవీ రాజకీయాల కంటే పురోగతి దృష్టి ఉన్న రాజకీయాలు కావాలి. ఆ నేపథ్యం ఉన్న రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వం కావాలి.

About Author

By editor

Twitter
Instagram