‌ప్రపంచం మొత్తం ఎదురు చూసే ఫలితం- అమెరికా అధ్యక్షుని ఎన్నిక. అది అగ్రరాజ్యం కావడం ఒక్కటే అందుకు కారణం కాదు. భూగోళం తలరాతను మార్చే శక్తి ఆ ఎన్నికల ఫలితానికి ఉంది. కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికకు అనేక కోణాలు ఉన్నాయి. ఎన్నో వివాదాల మధ్య, మారిన పరిణామాల మధ్య జరిగిన ఎన్నిక కూడా. ఇంకా చెప్పాలంటే చైనా, పాకిస్తాన్‌తో సంబంధాలు పూర్తిగా బెడిసి, భారత్‌తో బంధం బలపడిన నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. నిజానికి ఆ వివాదాలకు కేంద్ర బిందువు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ‌జాన్‌ ‌ట్రంప్‌కూ (రిపబ్లికన్‌ ‌పార్టీ), అమెరికా రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన జోసెఫ్‌ ‌రాబినెట్‌ ‌బైడెన్‌కు (డెమాక్రటిక్‌ ‌పార్టీ) మధ్య జరిగిన హోరాహోరా పోటీ ఇది. అంతా ముందునుంచీ ఊహిస్తున్నట్టే కొంచెం తేడాతోనే అయినా బైడెన్‌ 46‌వ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.


కమలా హ్యారిస్‌

అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావాలంటే 270 ఎలక్టొరల్‌ ఓట్లు సాధించాలి. ఎక్టొరల్‌ ఓట్లలో బైడెన్‌ 290 ఓట్లు (50.8 శాతం, ఓట్‌ ‌కౌంట్‌ 7,63,43,332) ‌సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా చాలా దేశాల నేతలు ఆయనను, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనా కమలా హ్యారిస్‌లను అభినందించడం కూడా అయింది. కానీ చైనా నేత జిన్‌గ్‌పింగ్‌, ‌రష్యా అధినేత వ్లాదిమర్‌ ‌పుతిన్‌లు మాత్రం అధికారికంగా ప్రకటన వెలువడిన తరువాతనే బైడెన్‌ను అభినందిస్తామని ప్రకటించడం మరొక మలుపు. ఏ విధంగా చూసినా బైడెన్‌ ఎం‌పిక ప్రకటన లాంఛనమే. ట్రంప్‌కు 214 ఎలక్టొరల్‌ ఓట్లు (47.5 శాతం, ఓట్‌ ‌కౌంట్‌ 7,14,44,567) ‌వచ్చాయి. ఆ ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగిందని అనుకుంటున్నా అమెరికా చరిత్రలో ఇంత భారీ మెజాటీతో గెలిచిన అధ్యక్షునిగా బైడెన్‌ ‌చరిత్ర కెక్కుతున్నారు. ఆయన డిలావేర్‌ ‌నుంచి అమెరికా కాంగ్రెస్‌లోని సెనేట్‌కు 36 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. బరాక్‌ ఒబామా హయాంలో ఎనిమిదేళ్లు ఉపాధ్యక్షుడు. ఆరోగ్యం, పర్యావరణం వంటి ప్రస్తుత ప్రపంచ కీకాంశాలలో నాటి అధ్యక్షునికి బైడెన్‌ అం‌డగా నిలిచారు.

 జో బైడెన్‌ ‌వయసు 77 సంవత్సరాలు. ఆ దేశ చరిత్రలో అత్యధిక వయసు గల దేశాధినేతగా కూడా ఆయన పేరు చరిత్రలో చేరింది.  వయసుకు తగ్గట్లే బైడెన్‌ ‌ముందు బోలెడు సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అగ్రదేశం జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆయనే స్వయంగా పేర్కొన్నట్లు కరోనా అమెరికా ముందున్న అతి పెద్ద సవాల్‌. ‌కరోనా పట్ల ట్రంప్‌ ఎం‌త అహంకారపూరితంగా వ్యవహరించారో, అది ఆయన ఎన్నిక మీద ఎంతటి ప్రతికూల ఫలితం చూపిందో బైడెన్‌ ‌వెంటనే గమనించారు. ‘నేను జనవరి 20వ తేదీ వరకు అధ్యక్షుడిని కాకపోవచ్చు. కానీ అమెరికా పౌరలందరికీ ఒక్క విన్నపం. దయచేసి మాస్క్ ‌ధరించండి!’ అని బైడెన్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.ఈ మహమ్మారికి గురై ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయింది ఇక్కడే కావడం గమనార్హం. కరోనా కట్టడి తన ప్రథమ ప్రాధాన్యమని బైడెన్‌ ‌ముందే చెప్పారు. తన ఆప్తమిత్రుడు, అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రవేశపెట్టిన అనేక పథకాలు ట్రంప్‌ ‌హయాంలో వివాదంలో పడినాయి. అందులో ఆరోగ్య పథకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని బైడెన్‌ ‌పునరుద్ధరిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసి ఉంది. నిజానికి ఆరోగ్యానికి ప్రాధాన్యం బైడెన్‌ ‌విధానంగా కనిపిస్తుంది. కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లివచ్చిన ట్రంప్‌ ‌నోటికి ఉన్న మాస్క్‌ను విసిరేయడం వివాదానికి కారణమైంది. కానీ బైడెన్‌ ‌వైఖరి వేరు. మనం మాస్క్ ‌ధరిస్తే చాలు వేలాది ప్రాణాలు కాపాడవచ్చు. ఆ ప్రాణాలు డెమొక్రాట్లవా, రిపబ్లికన్‌లవా అన్నది ప్రశ్న కాదు. మనం రక్షించుకునేవి అన్నీ అమెరికా వాసుల ప్రాణాలు అని అద్భుతమైన ప్రకటన చేశారు బైడెన్‌. ‌కరోనాతో లాక్‌డౌన్‌ ‌విధించి ఆర్థిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం సమ్మతం కాదన్న ట్రంప్‌ అ‌ప్రకటిత విధానాన్ని అమెరికా ఓటర్లు పూర్తిగా తిరస్కరించారనే అర్థం చేసుకోవాలి. ఎన్నికల ద్వారా ఎప్పుడూ లేని విధంగా అమెరికా సమాజం విధానపరంగా రెండుగా చీలిపోయింది. పార్టీలను పక్కనపెడితే ట్రంప్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మానసిక విభజన కనిపించింది. ఆఖరికి ట్రంప్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ ‌పార్టీలో కూడా ఇలాంటి విభజన రేఖ కనిపించదని విశ్లేషకులు అభిప్రాయానికి రావలసి వచ్చింది. ఇందుకు కారణం- ట్రంప్‌ ‌వివాదాస్పద ప్రకటనలు. తాను గెలిస్తే ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగినట్టనీ, ఓడితే అక్రమాలు జరిగినట్టనీ కూడా ఆయన తేల్చేశారు. అక్కడితో ఆగలేదు. ఒకవేళ ఓడితే, అవి ఎలాగూ అక్రమ ఎన్నికలు కాబట్టి తాను పదవి నుంచి వైదొలగే ప్రశ్నే లేదని కూడా ఆయన చెప్పేశారు. ఇలాంటి ప్రకటనలు చేటు తెచ్చాయనే అనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో వచ్చిన ఒక అదృశ్య చీలిక నుంచి మళ్లీ అమెరికన్లందరినీ ఒక్కటి చేసి దేశాన్ని ముందుకు నడిపించడం బైడెన్‌ ‌బాధ్యతల్లో ఒకటి. ఎర్ర రాష్ట్రాలు, నీలి రాష్ట్రాలు అన్న భేదం తనను అంటదనీ, తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడుననీ బైడెన్‌ ‌ప్రకటించడంలోని ఆంతర్యం ఇదే. కొన్ని నెలల క్రితమే పోలీసుల చేతిలో ఒక నల్లజాతీయుడు మరణించడం, దరిమిలా చెలరేగిన అలజడి అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా ఆలోచింప చేసింది. జాతి వివక్ష నేటికీ ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటన్న చేదు నిజాన్ని అంగీకరించతప్పదు. ఎప్పుడో 1776లో స్వాతంత్య్రం పొందిన అమెరికాలో నల్లవారికి ఓటు హక్కు 1960 దశకంలోనే వచ్చింది. ఒక నల్ల అమెరికన్‌ ‌దేశ అధ్యక్షుడు కావడానికి దాదాపు మూడు వందల ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి మొదటిసారి ఒక మహిళ ఎన్నికయ్యారు. అది కూడా భారతీయ మూలాలు, జమైకా మూలాలు ఉన్న మహిళ ఆమె. తాను దేశంలోని నల్లజాతి మహిళలతో నేరుగా మాట్లాడతానని కమలా హ్యారిస్‌ ‌ట్వీట్‌ ‌చేయడం వెనుక కూడా ఒక చారిత్రక ఛాయ కనిపిస్తుంది. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య నెలకొంది. దీనికి హేతుబద్దమైన పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత బైడెన్‌పై ఉంది. ట్రంప్‌ ‌తనకేమీ శత్రువు కాదని, ఆయన బాధను అర్థంచేసుకోగలనని, అమెరికా సమాజాన్ని ఏకం చేయడమే తనముందున్న అతి పెద్ద బాధ్యత అని ప్రకటించడం ద్వారా బైడెన్‌ ‌హుందాతనాన్ని చాటుకున్నారు.

అంతర్జాతీయంగా కూడా బైడెన్‌ ‌ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అగ్రదేశంగా మనుగడ సాగించడానికి చైనా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఒకప్పుడు నాటి సోవియట్‌ ‌యూనియన్‌ (‌ప్రస్తుత రష్యా) నుంచి ఎలాంటి సవాల్‌ను ఎదుర్కొన్నదో ఇప్పుడు బీజింగ్‌ ‌నుంచి కూడా అలాంటి పోటీనే ఎదుర్కొంటోంది. ట్రంప్‌ ‌హయాంలో దెబ్బతిన్న వాషింగ్టన్‌-‌బీజింగ్‌ ‌సంబంధాలను చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ట్రంప్‌ ‌తొందరపాటు నిర్ణయాల కారణంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలకు అమెరికా దూరమైంది. ఇది పరోక్షంగా అగ్రదేశం పరిధిని, స్థాయిని కుదించుకోవడమే అవుతుంది. ట్రంప్‌ ‌నిర్వీర్యం చేసిన పారిస్‌ ‌వాతావరణ ఒప్పందాన్ని తిరిగి పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ ‌వైదొలగారు. ట్రాన్స్ ‌పసిఫిక్‌ ‌వ్యూహాత్మక ఆర్థిక భాగస్వమ్య ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్‌ ‌సంక్షోభంపై తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకున్నా కూడా అక్కడ శాంతి ఎండమావిగానే మిగిలింది. అక్కడ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తెస్తానన్న ట్రంప్‌ ఆనాటి ఎన్నికల హామీని నెరవేర్చే అవకాశం ఆయనకు చిక్కలేదు.  జెరూసలెమ్‌ను ఇజ్రాయెల్‌ ‌రాజధానిగా గుర్తించడం ద్వారా మధ్య ప్రాచ్యంలో రేగిన మంటలను చల్లార్చడం బైడెన్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. 2008‌లో పాకిస్తాన్‌ ‌రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘హిలాల్‌ ఎ ‌పాకిస్తాన్‌’‌ను బైడెన్‌కు అందజేసింది. ఈ కారణంగా ఇస్లామాబాద్‌ ‌పట్ల ఒకింత మెతకవైఖరి ప్రదర్శించగలరన్న అనుమానాలు లేకపోలేదు. అయితే విదేశాంగ విధానం కేవలం ఒక అంశంపైనే ఆధారపడి ఉండదని దౌత్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏడో దశకంలో మొరార్జీ దేశాయ్‌ ‌ప్రధానిగా ఉండగా పాకిస్తాన్‌ ఆయనకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్‌ – ఎ- ‌పాకిస్తాన్‌’ ‌ప్రకటించింది. ఇది మన భారతరత్నతో సమానం. కానీ నాటి పరిస్థితులు వేరు. ఇవాళ్టి అంతర్జాతీయ సంబంధాలు వేరు.

భారత్‌కు సంబంధించి, బైడెన్‌ ‌విధానంలో పెద్దగా మార్పుండకపోవచ్చు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్‌తో కలసి పనిచేయాల్సిన అవసరాన్ని అమెరికా ఎప్పుడో గుర్తించింది. అగ్రదేశాధినేతగా ఎవరున్నా ఈ విధానం నుంచి వైదొలగలేరు. చైనా ఉమ్మడి శత్రువుగా మారిన నేపథ్యంలో ఉభయ దేశాల బంధం మరింత బలోపేతమయ్యే అవకాశమే ఉంది. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో బీజింగ్‌ ‌దూకుడును అడ్డుకునేందుకు ఇప్పటికే చతుర్భుజ కూటమి పేరుతో అమెరికా, భారత్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి దేశాలు ఈనెల ప్రారంభంలో మలబార్‌ ‌విన్యాసాలు పేరుతో సముద్ర జలాల్లో తమ సత్తాను ప్రదర్శించిన విషయం గమనార్హం. మొదటినుంచీ అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ ‌పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ వారు బైడెనె వైపే నిలిచారు. ఇక ఏకంగా ఉపాధ్యక్షరాలు కమలా హ్యారిస్‌ ‌భారతీయ మూలాలున్న మహిళ కావడంతో ఉభయ దేశాల సంబంధాలు మరింత ఉచ్ఛస్థితికి చేరగలవన్నది దౌత్యవేత్తల అంచనా.

—————–

భారత్‌తో బైడెన్‌

‌ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఉగ్రవాదం మీద అంతర్జాతీయ పోరాటం, పెచ్చరిల్లుతున్న చైనా, పాకిస్తాన్‌ ‌మోసం వంటి అంశాల నేపథ్యంలో భారత్‌, ‌బైడెన్‌ ‌నాయకత్వంలోని అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అమెరికాలో అధ్యక్షులు మారినంత మాత్రాన కీలక విధానాలలో మార్పులను ఊహించనక్కరలేదు. క్వాడ్‌లో అమెరికా భాగ స్వామ్యం, చైనాతో పోటీ నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు అమెరికాకు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో బైడెన్‌ ‌భారతీయుల వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను ప్రకటించారు. పైగా చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రవాస భారతీయుల సమస్యలను పట్టించుకుంటానని కూడా ఆయన చెప్పారు. భారత్‌, అమెరికా సహజ భాగస్వాములన్న తన చిరకాల విధానాన్నే బైడెన్‌ ఆ ‌ప్రణాళికలో వెల్లడించారు. నిజానికి 2000 సంవత్సరం నుంచి కూడా భారత్‌ ‌ప్రాధాన్యాన్ని అమెరికా సరైన రీతిలో గుర్తిస్తున్నది.

2001లో సెనేటర్‌ ‌హోదాలో బైడెన్‌ ‌నాటి అధ్యక్షుడు జార్జ్ ‌డబ్ల్యు బుష్‌కు రాసిన లేఖను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అప్పుడు విదేశ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు. భారత్‌ ‌మీద అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలనే బైడెన్‌ ఆ ‌లేఖలో కోరారు. 2008లో అదే హోదాలో ఉన్న బైడెన్‌ ‌భారత్‌- అమెరికా పౌర అణు ఒప్పందం ఖరారుకు కూడా సిఫారసు చేశారు.

 కానీ పాకిస్తాన్‌, ‌పర్యావరణం, మానవహక్కులు వంటి అంశాలలో బైడెన్‌ ‌నుంచి కొన్ని సవాళ్లు తప్పక పోవచ్చునని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి బైడెన్‌ ‌ప్రభుత్వం అంతర్గత సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనీ, అగ్రరాజ్యాధిపత్యం అనే మత్తును వదిలించుకోవచ్చునని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ దృష్ట్యా కొన్ని ప్రపంచ సమస్యలకు బైడెన్‌ ‌దూరంగా ఉండవచ్చునని విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఈ వైఖరిని అమెరికన్లు ఆమోది స్తారా? ఫ్రాన్స్ ‌తాజా పరిణామాలు, తాలిబన్‌ ‌సమస్య, అల్‌కాయిదా సమస్య ఇప్పటికీ పాశ్యాత్య ప్రపంచాన్ని వేధిస్తూనే ఉన్నాయి. అయినా బైడెన్‌ ‌హయాంలో ఇండో-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయని ఎక్కువ మంది నిపుణులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.

—————–

ఆద్యుడు వాషింగ్టన్‌

‌ప్రపంచంలోని అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా, జనాభాపరంగా మూడో అతిపెద్ద దేశంగా, మెరుగైన రాజ్యాంగం కలిగిన దేశంగా అమెరికా కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. అవి ఆసక్తి కలిగినవి. తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు అధ్యక్ష పదవిని చేపట్టడం ద్వారా దేశంపై చెరగని ముద్ర వేశారు. 1789 ఏప్రిల్‌ 30‌న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 1797 మార్చి 4న పదవీ విరమణ చేశారు. అమెరికా అధ్యక్షులు వైట్‌హౌస్‌ ‌మెట్లపైన జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది.

అప్పట్లో వాషింగ్టన్‌ ‌ప్రస్తుతం ఐరాస కొలువు దీరిన న్యూయార్క్ ‌నగరంలో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. వాషింగ్టన్‌ అహర్నిశలు అమెరికా ప్రగతి కోసం పాటుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారు కారు. అప్పటికి దేశంలో ఇంకా పార్టీల వ్యవస్థ పురుడు పోసుకోలేదు. పార్టీల వ్యవస్థ దేశ ప్రగతికి అడ్డంకిగా ఉంటుందని వాషింగ్టన్‌ ‌భావించారు. ఒక వ్యక్తి రెండుసార్లు అధ్యక్షపదవి చేపట్టడంపై రాజ్యాంగం దృష్టి సారించాలని ఆయన కోరారు. జార్జి వాషింగ్టన్‌ అమెరికా జాతిపితగా పేరుగాంచారు.

దేశ చరిత్రలో నాలుగుసార్లు అధ్యక్షుడైన నేతగా ఫ్రాంక్లిన్‌ ‌డి రూజ్వెల్ట్ ‌చరిత్ర సృష్టించారు. ఆయన వరుసగా 1932, 1934, 1940, 1944 ఎన్నికల్లో విజయం సాధించారు. నాలుగోదఫా పదవిలో కొనసాగుతూనే 1945 ఏప్రిల్‌ 12‌న కన్నుమూశారు. అప్పటివరకు అధ్యక్ష పదవిని ఎన్నిసార్లయినా చేపట్టే అవకాశం ఉంది. నిషేధం లేదు. ఏ నాయకుడూ, ఎంత బలం ఉన్నప్పటికీ రెండుసార్లకు మించి పోటీ చేయరాదని 1951లో రాజ్యాంగాన్ని సవరించారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తరవాత అయిదుగురు నాయకులు డ్వైట్‌ ‌డి ఐసెన్‌ ‌హోవర్‌, ‌రొనాల్డ్ ‌రీగన్‌, ‌బిల్‌ ‌క్లింటన్‌ ‌ప్రతి నాలుగేళ్లకోసారి జార్జి బుష్‌, ‌బరాక్‌ ఒబామా మాత్రమే రెండుసార్లు అధ్యక్షులయ్యారు. ఈ నిబంధన కారణంగానే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ‌రెండో దఫా బరిలోకి దిగారు.  అతి తక్కువ కాలం పనిచేసిన అధ్యక్షుడు విలియమ్‌ ‌హెన్రీ హారిస్‌. ఓహియోకు చెందిన ఆయన 1841లో కేవలం 31రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. పదవిలో ఉండగానే మరణించారు.

—————–

ఎన్నిక తేదీలన్నీ స్థిరం

మనదేశంలో ప్రమాణ స్వీకారానికి నాయకులు ప్రత్యేకంగా ముహుర్తాలు ఎంచుకుంటారు. కానీ అమెరికా పరిస్థితి వేరు. అక్కడ అధ్యక్షులు ఎప్పుడు ఎన్నికైనప్పటికీ జనవరి 20నే ప్రమాణ స్వీకారం చేస్తారు. 1933 నాటి 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసేవారు. వైట్‌ ‌హౌస్‌ ‌భవనం మెట్లపై నూతన అధ్యక్షుడి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అగ్రదేశ అధినేతలకు మత విశ్వాసాల• ఎక్కువ. అందువల్లే ప్రమాణ స్వీకార సమయంలో ఒక చేత్తో బైబిల్‌ ‌పట్టుకుంటారు. అమెరికా ఎన్నికలు కూడా విభిన్నం. ప్రజలు ప్రత్యక్షంగా అధినేతను ఎన్నుకోరు. పార్టీ తరఫున ఎన్నికైన ఎలక్టోరర్లు అధ్యక్షుడిని ఎన్నకుంటారు. భారత్‌లో మాదిరిగా కేంద్ర ఎన్నికల సంఘం ఉండదు. ఈ కారణం చూపే ఇప్పుడు ట్రంప్‌ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని విమర్శలకు దిగారు. రాష్ట్రస్థాయిలో ఉండే ఎన్నికల సంఘాలే ఎన్నికల క్రతువును పర్యవేక్షి స్తాయి. ఎన్నికల తేదీని మన దేశంలో మాదిరిగా ఎన్నికల సంఘం ప్రకటించదు. ప్రతి నాలుగేళ్లకోసారి నవంబరు నెల మొదటి సోమవారం తరవాత వచ్చే మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పట్లో నెలకొన్న స్థానిక పరిస్థితుల కారణంగా ఈ నిబంధన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇదే విధానం కొనసాగు తోంది. అమెరికా రాజ్యాంగానికి రెండు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. అయి నప్పటికీ కేవలం 27సార్లే సవరించడం విశేషం. చివరిసారిగా 1992 మే 7న సవరించారు. మొదట్లో ఓటు హక్కకు కనీస వయసు 21 సంవత్సరాలు. 1971లో చేసిన 26వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 18 సంవత్సరాలకు తగ్గించారు.

  స్వేచ్ఛ, సమానత్వం గురించి అమెరికా ఎంత గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్కడ మహిళల పట్ల వివక్ష అన్నది చేదునిజం. 1920వరకు అక్కడ మహిళలకు ఓటు హక్కు లేదు. 19వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హక్కు లభించింది. ఒక మహిళ (హిల్లరీ క్లింటన్‌) అధ్యక్ష పదవికి పోటీ చేయడానికే రెండు శతాబ్దాలు పట్టింది. హిల్లరీ గతఎన్నికల్లోనే అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను ఢీకొంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న మహిళ కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే 60ల్లో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఎన్నికైంది. శ్రీలంకలో సిరిమావొ బండారు నాయకే ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానిగా గుర్తింపు పొందారు. గోల్డా మీర్‌, ‌మార్గరెట్‌ ‌థాచర్‌ ఇ‌జ్రాయెల్‌, ‌బ్రిటన్‌ ‌దేశాధినేతలుగా ఎప్పుడో చక్రం తిప్పారు. కొంత కాలం సైనిక పాలనలో కొనసాగిన బంగ్లాదేశ్‌లో షేక్‌ ‌హసీనా, బేగం ఖలీదా జియా, పాకిస్తాన్‌లో బెనజీర్‌ ‌భుట్టో దేశానికి నాయకత్వం వహించారు. బంగ్లా పీఠంపై ఇప్పటికీ షేక్‌ ‌హసీనానే కూర్చుని చక్రం తిప్పుతున్నారు. అమెరికా ఎంత ప్రగతి సాధించినప్పటికీ  ఈ కోణంలో చూసినప్పుడు వెనకబడినట్లే. కమలా ఎన్నిక ద్వారా ఇప్పుడు  లోపం భర్తీ అయింది.

—————-

భారత్‌లోను బైడెన్‌లు

అమెరికా సంయుక్త రాష్ట్రాల కొత్త అధ్యక్షుడు జోసెఫ్‌ ఆర్‌ ‌బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇద్దరికీ భారత్‌తో ఎంతో కొంత అనుబంధం ఉంది. ‘నా బంధువులు కూడా భారత్‌లో ఉండొచ్చు’ అన్నారు బైడెన్‌. ఇది ఈ ఎన్నికల ముందు అన్నమాట మాత్రం కాదు. ఆయన ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు 2013లో మొదటిసారి ముంబై వచ్చారు. అప్పుడన్నమాట. అంటే, ఎన్నికల నేపథ్యంలో గుర్తుకు వచ్చిన చుట్టరికం కాదిది. 1972లోనే బైడెన్‌ ఇం‌టిపేరుతోనే ఉన్న ఒక ముంబై వాసి రాసిన ఉత్తరంలో ఈ విషయం ఉంది. ఉత్తరం రాసిన వారి గురించీ, తమ బంధుత్వం గురించీ తెలుసుకోవడానికి ఆనాడు బైడెన్‌ ‌ప్రయత్నించారట గానీ, సాధ్యపడలేదట. నాటికి బైడెన్‌ ‌వయసు 29 ఏళ్లు. అప్పుడే ఆయన సెనేట్‌కు ఎంపికయ్యారు.

ఈస్టిండియా కంపెనీలో పనిచేసిన జార్జి బైడెన్‌తో తమకు బంధుత్వం ఉన్నట్టు తెలిసిందని మరొక సందర్భంలో మాట్లాడినప్పుడు జో బైడెన్‌ ‌గుర్తు చేసుకున్నారు. అంటే తాతముత్తాతల నాటి తరంవాడాయన. కంపెనీలో కెప్టెన్‌ ‌గా పనిచేసిన జార్జి ఒక భారతీయురాలిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. జార్జి గురించి రికార్డులు లేనప్పటికీ క్రిష్టోఫర్‌ ‌బైడెన్‌, ‌విలియం హెన్రీ బైడెన్‌ అనే వారు కూడా కంపెనీలో కెప్టెన్లుగా పనిచేశారని గేట్‌వే హౌస్‌ ‌సమాచారం ద్వారా తెలుస్తున్నది. గేట్‌వే హౌస్‌ అం‌టే ముంబై కేంద్రంగా పనిచేసే విదేశ వ్యవహారాల వేదిక.

క్రిష్టోఫర్‌కు 12 ఏళ్లు, అతడి కంటే చిన్నవాడైన సోదరుడు లండన్‌- ‌భారత్‌ ‌మధ్య నౌకాయానం చేశారు. యువరాణి చార్లోట్‌ ఇం‌గ్లండ్‌-‌కలకత్తా మధ్య ప్రయాణించిన నౌకలోను అతడు కెప్టెన్‌గా పనిచేశాడు. ఇవన్నీ కూడా ఏడాది పాటు సాగిన ప్రయాణాలేనని టిమ్‌ ‌విల్లసె విస్లే (కింగ్స్ ‌కాలేజ్‌, ‌లండన్‌) ‌తెలియచేశారు. క్రిష్టోఫర్‌ ‌సోదరుడు విలియం 1843లో రంగూన్‌ (ఇప్పుడు యాంగూన్‌)‌లో గుండెపోటుతో చనిపోయాడు. తరువాత క్రిష్టోఫర్‌ ‌మద్రాస్‌లో (ఇప్పుడు చెన్నై)లో స్థిరపడ్డారు. ఆ నగర ప్రముఖులలో ఒకరిగా పేర్గాంచారు.

క్రిష్టోఫర్‌ 1830‌లో నౌకాయానం గురించి, రావలసిన చట్టాల గురించి ఒక పుస్తకం కూడా రాశారు. ఇది ఇప్పటికీ ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నదట. రకరకాల వర్గాల నుంచి వచ్చే నౌకా సిబ్బంది, మద్యపానంతో నౌకలో తలెత్తే సమస్యలు, దొంగతనాలు, మానసిక స్థిమితం లేనివారితో వచ్చే ఇబ్బందులు, ప్రయాణంలో గాలివానలు వంటి విషయాల గురించి కొన్ని వాస్తవిక కథనాలతో ఆ పుస్తకం ఉంది. హేరియెట్‌ ‌ఫ్రీత్‌ అనే మహిళను క్రిష్టోఫర్‌ ‌వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు, కూతురు. వీరిలో ఒకరు ఇంగ్లండ్‌ ‌నుంచి భారత్‌ ‌వస్తున్నప్పుడు నౌకలో కన్నుమూశారు. శవాన్ని సముద్రంలోనే వదిలిపెట్టారు.

 క్రిష్టోఫర్‌ ‌తన 19వ ఏటనే మద్రాస్‌ ‌చేరుకున్నాడు. అనాథలు, నౌకా విభాగంలో పని చేస్తూ చనిపోయిన వారి భార్యలు (విధవలు, ఇందులో భారతీయులు కూడా ఉన్నారు) వంటివారి సంక్షేమం కోసం పాటుపడేవారు. ఇతడి కుమారుడు హొరాషియో మద్రాస్‌ ‌సైనిక విభాగంలో కల్నల్‌ ‌హోదాకు వచ్చాడు. 1858లో క్రిష్టోఫర్‌ ‌మద్రాస్‌లోనే చనిపోయాడు. పెంపుడు కుక్క సహా ఇతడి చిత్రం, వివరాలతో కూడిన ఫలకం మద్రాస్‌ ‌కెథడ్రల్‌లో ఉంది. కానీ భారత చరిత్రలో చాలా అంశాల మాదిరిగానే ఇక్కడ స్థిరపడిన బైడెన్‌ల గురించి కూడా వివాదం ఉంది. ఇప్పుడు వీళ్లు చెబుతున్న జార్జి బైడెన్‌ ‌కాకుండా, ఇంకొక బైడెన్‌ ‌కూడా ఉండవచ్చునని చరిత్రకారుడు వి. శ్రీరామ్‌ అం‌టున్నారు. నేను కూడా ఈ అంశాలతో వ్యాసం చదివాను గాను, నా దగ్గిర పూర్తి సమాచారం లేదని ప్రముఖ చరిత్రకారుడు, నవలాకారుడు విలియం డాల్రింపుల్‌ ‌చెప్పారు.

ఇక కమలా హ్యారిస్‌ ‌విషయంలో ఇలాంటి శషభిషలు ఏమీ లేవు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ ‌తమిళనాడుకు చెందినవారు. జమైకా జాతీయుడిని ఆమె అమెరికాలో ఉండగా వివాహం చేసుకున్నారు. ఇప్పటికి తమిళనాడులోని తన బంధువులతో కమలా హ్యారిస్‌కు ఎంతోకొంత బంధమే ఉంది.  ఆమె గెలుపు కోసం తమిళనాడులోని శ్యామల గ్రామం వారు పూజలు కూడా చేశారు.

About Author

By editor

Twitter
Instagram