జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి నిజ ఆశ్వీయుజ బహుళ నవమి – 09 నవంబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భూమి ఒకచోట కంపిస్తే- భూకంపం. భూగోళం మొత్తం కకావికలైతే ఆ ఉత్పాతాన్ని కరోనా అనవచ్చునేమో! కంపం మాదిరిగానే కరోనా కూడా శిథిలాల గుట్టలను మిగిల్చింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మొత్తం ఇప్పుడు ఆ శిథిలాల కిందే ఉంది. ఎటొచ్చి, ఆ వైరస్‌ ‌లాగే ఆ శిథిలాలూ కంటికి కనిపించవు.

 కరోనా బీభత్సం ప్రపంచాన్ని కనీసం పాతికేళ్లు వెనక్కి, అంటే నిన్నటి శతాబ్దంలోకి విసిరేసింది. ఇది శిథిలం కావడమే. సర్వం కోల్పోవడమే. ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించిన పారిశ్రామికవేత్తలు మొదలు, రోజుకూలీ, ఓ చిన్న చేతివృత్తికారుడి వరకు కరోనా కుంగదీయగలిగింది. ఇకపై ప్రతి క్షణాన్ని కోల్పోయిన ఆ శక్తులను కూడగట్టుకోవడానికి వెచ్చించాలి. స్వాతంత్య్రం సాధించుకున్నాకనో, యుద్ధ విరమణ తరువాతో ఏ దేశమైనా పునర్నిర్మాణానికి సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌ ‌సరిగ్గా అలాంటి యత్నమే. ఇది- స్వయం సమృద్ధ భారత నిర్మాణోద్యమం. కొవిడ్‌ 19 ‌కోరల నుంచే కాదు, గత తప్పిదాల బారి నుంచి కూడా తప్పించి మన ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించే మహా సంకల్పం మే 12, 2020న ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి ఆత్మనిర్భర భారత్‌ ‌నినాదాన్ని పలికించింది. రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఆ ఆశయం కోసం రూపొందించారు.

ఆత్మగౌరవం గురించి తెలిసిన దేశం, దూరదృష్టి ఉన్న ప్రభుత్వం వ్యవస్థ స్వయం సమృద్ధంగా ఉండాలని వాంఛిస్తాయి. అలాంటి దృష్టికి ఆవశ్యకమైన వాతావరణాన్ని భారత్‌ ‌చాలాసార్లు కోల్పోయింది. పారిశ్రామిక విప్లవ ఛాయలకు దేశాన్ని దూరంగా ఉంచడం అలా పోయిన అవకాశాలలో ఒకటి. ఆ లోటును ఐటీ ద్వారా కొంతయినా భర్తీ చేసుకున్నామని సంతోషించాం. దురదృష్టం, కరోనా తొలివేటుకు గురైనది ఆ రంగమే. కానీ ప్రస్తుతం భారత్‌ను ఏలుతున్న ప్రభుత్వ జాతీయశీం వేరు. చరిత్ర వారసత్వంగా ఇచ్చిన వేనవేల గాయాలతో వేదన పడుతున్న ఈ జాతి; శుష్కనినాదాలతో, విజాతీయ పంథాలతో మళ్లీ దగా పడకూడదన్న జాగరూకత కలిగిన రాజకీయపక్షం దాని వెనుక ఉంది.

 పాశ్చాత్య వ్యవస్థలతో ముడిపడి ఉన్న ఐటీ రంగాన్ని నిలబెట్టుకుంటూనే, ఇకనైనా ఈ దేశం ఊతకర్రలను వదిలి సొంత బలం మీద నిలబడాలన్నదే ఈ ప్రభుత్వం యోచన. అందుకే సేద్యం, చేనేత మొదలు, మారుమూల ఉండే చేతివృత్తి కళాకారుడిని కూడా ఆర్థికవ్యవస్థలో పూర్తిస్థాయి భాగస్వామిని చేయాలనీ, అతడి ప్రతిభను విశ్వవేదిక మీద ప్రదర్శించాలనీ మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈ దేశంలో ఎన్ని కళలు ఉన్నాయి! వాటికి ప్రపంచంలో ఎంత గౌరవం!  ప్రత్యేకత కలిగిన వృత్తులు ఎన్ని! అవి వ్యవస్థల మనుగడకు నేటికీ ఎంత అవసరం! మరి నిపుణులో-లక్షలు! ఈ వాస్తవాలు తెలుసు కాబట్టే మోదీ వాటన్నిటి వెలుగు కోసం ఆత్మ నిర్భర భారత్‌ ‌నినాదం ఇచ్చారు. ఈ ప్యాకేజీ ఓ లెక్కా అంటూ ఉబుసుపోక కొందరు వాచాలత  ప్రదర్శిస్తు న్నారు చేపను దానం చేయం, దానిని పట్టుకునే నైపుణ్యం ఇస్తాం అంటున్నారు ప్రధాని. ఇందులో కీలకం ఇదే. లేకపోతే ఆత్మ నిర్భర నినాదం అర్ధ రహితం కాదా? మన వృత్తినిపుణుల పెద్దలు వీరి రక్తంలో నింపిన, గుండెలో ఒంపిన అద్భుత నైపుణ్యాన్ని  తిరిగి స్వాగతిస్తున్నది నేటి ప్రభుత్వం. అదే సమయంలో, వారి పూర్వికుల వలె వీరిని నైరాశ్యం కమ్మేయకూడదని కోరుకుంటున్నది.

అందుకే, ‘జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక 2020’ ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌ను ఈ ఏటి అంశంగా స్వీకరించింది. కొన్ని పరిధుల మేరకే అయినా తెలుగు రాష్ట్రాలలోని వృత్తికళాకారుల ప్రతిభ, హస్తకళాజీవుల నైపుణ్యాల గురించి, ఉడతాభక్తిగా పాఠకులకు అందించాలని భావించింది. వారి బాధలను కొంచమైనా లోకం దృష్టికి తేవాలని కోరుకున్నది.

కరోనా సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచ దేశాలు సహా భారత్‌ ‌కూడా బయటపడుతుంది. ఇది తథ్యం. జీవనసత్యం. మళ్లీ జీవన ప్రమాణాలు ఒక స్థాయికి చేరుకుంటాయి. కొనుగోలు శక్తి వస్తుంది. కానీ ఈసారి కొనుగోలు శక్తికి జాతీయతా దృష్టిని జోడించడం చాలా అవసరమని నేటి ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది.మన ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు, విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి మన ఉత్పత్తులు పెరగాలి. మనం కొనుగోలు చేయవలసింది- మన వారి ఉత్పత్తులనే. చౌకధరతో వస్తువు, దానికి రోగం ఉచితం అన్నట్టు ఉండే పొరుగు దేశపు ఉత్పత్తులు వద్దు. దేశం ఎదుర్కొంటున్న నగరాలకు వలస అనే మహమ్మారినీ కరోనాతో పాటే వెళ్లగొట్టడమే మన కర్తవ్యం. నిన్నటిదాకా  రైతే. అతడే ఒక్క దుర్భిక్షంతో నగరం బాట పట్టిన కూలీ అవతారం ఎత్తకూడదు. హస్తకళా ప్రావీణ్యం ఉన్న నిపుణుడు తన గ్రామంలోనే, తన పెద్దలు ఇచ్చిన ప్రతిభను ఆధునిక పంథాకు అన్వయించి సగౌరవంగా బతకాలి. మన కొనుగోలు శక్తిలో, మన ఆలోచనా ధోరణిలో జాతీయతా స్ఫూర్తిని నిక్షిప్తం చేయడం ఇందుకు ప్రథమ సోపానమవుతుంది. మోదీ పిలుపు వెనుక ఉద్దేశం ఇదే.

About Author

By editor

Twitter
Instagram