‌బీజేపీ హవా

జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి కార్తీక శుద్ధ పాడ్యమి – 16 నవంబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఇది బీజేపీ యుగమని మరొకసారి రుజువైంది. నరేంద్ర మోదీ నాయకత్వం మీద ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదని రూఢి అయింది. తాజా ఉప ఎన్నికలతో అయినా బీజేపీ వ్యతిరేకులు కళ్లు తెరవడం అవసరం కాదా! ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించడానికి నడుం బిగించడం అవసరంకాదా! పదకొండు రాష్ట్రాలలో, 58 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిహార్‌లోని ఒక లోక్‌సభ నియోజక వర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. కరోనా నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలలో కొన్నిచోట్ల ఓటింగ్‌ ‌శాతం తక్కువే అయినా, ప్రజలు విజ్ఞతతోనే తీర్పు ఇచ్చారని అంగీకరించాలి. దీనిని ఆమోదించడం, హుందాగా ఓటమిని అంగీకరించడం అన్ని రాజకీయపక్షాల బాధ్యత. ఈ సంపాదకీయం రాసే సమయానికి నలభయ్‌ ‌వరకు స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. కాబట్టి ఇప్పుడు వీచినది కూడా బీజేపీ గాలే.

గుజరాత్‌, ‌కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ‌చత్తీస్‌గడ్‌, ‌హరియాణా, జార్ఖండ్‌, ‌మణిపూర్‌, ‌తెలంగాణలలో కూడా ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌, ‌యూపీ, కర్ణాటక, మణిపూర్‌లలో బీజేపీ హవా కనిపించింది. ఏదీ ఎక్కడ? అయోధ్యలో శంకుస్థాపన తరువాత వినిపించిన రంకెల ప్రభావం? ఏదీ, బీజేపీకి మతం రంగు పులిమే ప్రయత్నం విజయవంతమైనది ఎక్కడ? సెక్యులరిజం, ప్రజాస్వామ్యం అడుగంటిపోతున్నాయంటూ చేసిన ఆక్రోశాలు ఏవీ, ఎవరు విన్నారు? అసలు కరోనాను, వలస కార్మికులను పట్టించుకో లేదంటూ కొన్ని విపక్షాలు చేసిన విమర్శల ప్రభావం ఏదీ? ఎక్కడ?

ఇందులో కొన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల గురించి సమీక్షించుకోవాలి. మధ్యప్రదేశ్‌ అం‌దులో ప్రధానమైనది. ఇక్కడ 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌లోని అంతర్గత పోరు ఈ ఎన్నికలకు కారణం. కాంగ్రెస్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా, ఆయన అనుచరులు ఆ పార్టీని వీడి, బీజేపీలో చేరడంతో కమల్‌నాథ్‌ ‌ప్రభుత్వం కుప్పకూలింది. అందుకే రాజకీయంగా ఈ ఉప ఎన్నికలకు ఉన్నంత ప్రాముఖ్యం మిగిలిన వాటికి లేదు. ఈ ఉప ఎన్నికలలో బీజేపీయే విజయపథంలో ఉంది. ఈ విజయం అక్కడ శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌నాయకత్వంలోని ప్రభుత్వ సుస్థిరకు తక్షణావసరం. మిగిలిన ఉప ఎన్నికలు సాధారణ కారణాలతోనే జరిగాయి.

తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే విజయమంటూ చాటుకునే టీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపు శరాఘాతం వంటిదే. బీజేపీ అభ్యర్థి ఇంటి మీద దాడి చేయించడం, డబ్బు కట్టలు దొరికాయని ప్రజలను నమ్మించే యత్నం చేయడం వివాదాస్పదమైంది. ఈ ఫలితంతో కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీలేదు. కానీ ఇక్కడ బీజేపీ బలం పుంజుకుంటున్న సంగతిని అంతా అంగీకరించవలసి ఉంటుంది. అది మాత్రం టీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు వినిపించేదే. బీజేపీ అభ్యర్థి 1400 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచారు. హోరాహోరీగా ఈ ఎన్నిక జరిగింది. ఫలితం కూడా దోబూచులాడినా చివరికి కమం వైపే మొగ్గింది.

ఇవి అమిత్‌షా వంటి బలమైన వ్యూహకర్త పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత బీజేపీ ఎదుర్కొన్న ఎన్నికలు. ఈ విషయం చూసినా బీజేపీ ఘనత తెలుస్తుంది. తన బలాన్ని పార్టీ యథాతథంగా చూపగలిగింది. బీజేపీ కుటుంబ పార్టీ కాదనీ, వంశ పారంపర్య హక్కుగా పదవులను పందేరం చేయదనీ ఇతర పార్టీలు గుర్తించవలసి ఉంటుంది. నాయకుడు ఎవరైనా పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధులైన కార్యకర్తలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. నిజానికి బీజేపీ పోరాట పటిమ ఎన్నికల పరిధిలోనే వీర విహారం చేసేది కూడా కాదు. ఆ పోరాటం ఒక చారిత్రక అవసరం కోసం జరుపుతున్నదే తప్ప, కేవలం పదవీ రాజకీయాల కోసం కాదు.

ఈ ఎన్నికలలో మళ్లీ బొక్కబోర్లా పడిన పార్టీ కాంగ్రెస్‌. ‌చాలాచోట్ల చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఆ పార్టీకి నూరేళ్లు దాటి చాలా కాలమే అయింది. కానీ ఇంతవరకు మంచి నాయకత్వం లేదు. నిర్మాణాత్మకమైన కార్యక్రమం లేదు. అందులో యువతరం అసలే లేదు. ఉన్న యువనాయకుడల్లా రాహుల్‌ ‌గాంధీ ఒక్కరే. యువనేత అని ఏమిటి? పార్టీకి ఆయనే దిక్కు. ఆయనే పెద్ద. ఆయనే దిక్సూచి వగైరా. నాయకత్వం మార్చండి మహాశయా అంటూ అనుభవజ్ఞులైన పాతిక మంది నాయకులు లేఖ ద్వారా మొర పెట్టుకున్నా అధినాయకత్వం పెడచెవిన పెట్టింది. ఆ పార్టీది ఎప్పుడూ ఒక్కటే విధానం. నెహ్రూ కుటుంబాన్ని అంటకాగేటట్టు నాయకులకు తర్ఫీదు ఇవ్వడం. సోనియా భజన చేయించడం. రాహుల్‌ ‌లేదా ప్రియాంకా వాద్రాను పార్టీ అధ్యక్ష స్థానంలో ప్రతిష్టించాలని మెలకువ వచ్చినప్పుడల్లా ఒక ప్రకటన ఇప్పించడం. భారతదేశంలో ప్రధాని పదవికి ఆ కుటుంబీకులు తప్ప అన్యులు అనర్హులన్న అభిప్రాయం కలిగించడం.. ఇవి తప్ప ఆ పార్టీకి మరొక పనేమీ లేదు. పుల్వామా దాడిని ఎన్నికల కుట్రగా అభివర్ణించగలిగిన తెంపరితనం, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాత్రమే జరిగే అఘాయిత్యాలను భూతద్దాలలో చూపడం, నాసిరకం కరోనా సేవలంటూ గంతలు కట్టుకుని, గొంతెత్తి అరవడం మినహా ఆ పార్టీ చేస్తున్నదేమీ లేదు, ఈ దేశం కోసం. అందుకే ఆ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు ప్రజలు. రేపు కూడా ఇదే స్థానంలో ఉంచుతారని కచ్చితంగా భావించవచ్చు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *