రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని చీల్చి చంపి, హరిభక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ హిందువులంతా దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారని కథలు ఉన్నాయి.

శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై… లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే దీపావళి అని చెప్పే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఈ పర్వదిన ప్రాముఖ్యం, ఆచార సంప్రదాయాల సమాహారమే ఈ వ్యాస జాగృతి.

  • • •

దీపావళిరోజు పిల్లలకు తలంటు పోసి కొత్తబట్టలు తొడిగి, రకరకాల పిండివంటలతో బొజ్జనిండా భోజనం పెట్టి, సాయంత్రం పూట దీపాలు వెలిగించి, దగ్గరుండి మరీ వారిచేత కాకరపువ్వొత్తులూ, చిచ్చుబుడ్లూ, మతాబులూ కాల్పించడం ప్రతి తల్లీతండ్రీ చేసే పనే!

ఈ పండుగను ఎందుకు చేసు కుంటున్నామో వాళ్లకి చెప్పే ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఈ రోజులలో. పండుగనైనా, పర్వదినాన్నయినా ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుని, వాటి వెనుక ఉన్న తాత్త్వికతను అర్థం చేసుకుని చేసుకోవడం వల్ల ఎన్నో రెట్లు ప్రయోజనం కలుగుతుందన్నది శాస్త్రోక్తి. ప్రతి పండుగ, పర్వదినం భారతీయతనూ, దాని ఆత్మనూ దర్శింపచేసేదే. అలా అర్థం చేసుకుంటే కొన్ని విలువలకూ, సత్సంప్రదాయాలకూ మనం వారసులమన్న సాంస్కృతికపరమైన స్పృహ నిరంతరం నిలిచి ఉంటుంది.

  • • •

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం

దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే

శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం, దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షంతో  దూరం కావడ•మే దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాస ప్రారంభంలో దేవీనవరాత్రులు, అమావాస్యలో నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. త్రయోదశి రోజున రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందుంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చెయ్యాలి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు తైలాభ్యంగన స్నానం చెయ్యాలని భవిష్య పురాణం చెప్పింది. దీపావళి అంతరార్ధం చీకటి నుంచి వెలుగులోకి రావడం. అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని విజ్ఞానపు వెలుగులోకి ప్రవేశించడం.

శ్రీరాముడు ఆశ్వీయుజ మాసంలో విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్క రోజు పరిపాలన చెయ్యి’ అని వరమిచ్చాడు. దీపావళి రోజు వెలిగించే దీపాన్ని ‘బలిదీపం’ అంటారందుకే.

  • • •

నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. రాజై ఉండి, దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. ఆ హింసలు భరించలేక దేవతలు, మునులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నారు. కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు, సత్యభామా సమేతంగా. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి ఉండగా, అదే అదనుగా సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే  విల్లందుకుని యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, నరకుని సంహరిస్తాడు. లోకకంటకుడైన ఆ రాక్షసుని భయం శాశ్వతంగా వదిలిన రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి. సత్యభామ రూపంలో ఉన్న భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమిమీద జీవించే ప్రతి ఒక్కరికి తల్లే కదా! పుత్రశోకాన్ని మరచి నరకుని పేరుమీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్ధించింది. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ. ఆ వేళ అన్ని లోకాల వారూ దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి పండుగ జరుపుకున్నారు. నాటినుంచి ప్రతి యేటా ఆశ్వీయుజ బహుళ అమావాస్యనాడు దీపావళి పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

  • • •

కుటుంబ వృద్ధికోసం తాతముత్తాతలు ఎంతగానో తపన పడి ఉంటారు. వారే కాదు, ఎంతోమంది శ్రేయోభిలాషులు మనకు సాయం చేయబట్టే మనమీ స్థితికి చేరుకున్నాం. దానికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన బాధ్యత మన మీదుంది. దీపావళి నాటి సాయంకాలం వారందరినీ పేరు పేరునా తలచుకుంటూ వారి కోసం ఒక్కోదీపం వెలిగించాలి.

  • • •

మనందరికీ సంపదను ప్రసాదించేది లక్ష్మీదేవి. ఆమెకు ప్రీతిపాత్రమైన రోజు దీపావళి అమావాస్య. అందుకే ఈ రోజున తప్పనిసరిగా ఆమెను పూజించాలి. ఆ తర్వాత టపాసులు కాల్చడం, సంబరాలు చేసుకోవడం. ముందుగా తల్లిదండ్రులు తాము తప్పకుండా ఆచరించి, ఆ తర్వాత తమ పిల్లల చేత ఆచరింపచేయాలి.

  • • •

లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్నిరకాలైన చీకట్లను, అంటే… అవిద్యను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు. జ్ఞానప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లు తుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర వస్తువులతోను, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసిని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్త్తి. పరధనం కోరని వారు, అబద్ధాలాడని వారు, అప్రియంగా మాట్లాడనివారు… లక్ష్మీదేవికి ప్రీతిపాత్రులు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళినాడు బాణాసంచా కాల్చడం ఆనవాయితీ. టపాసులు కాల్చేముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్త్రాన్ని చుట్టి, దానిని కాలుస్తూ దుబ్బూదుబ్బూ దీపావళీ మళ్లీ వచ్చే నాగులచవితి.. అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ. వెలుగు లేక జగతిలేదు అన్నారు. అంటే వెలుగు లేని ప్రపంచం శూన్యం అన్నమాట. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో పేదవారికి దానధర్మాలు చేయడం, సాటివారికి సాయపడే బాధ్యత పురుషులది, బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం బాధ్యత.

  • • •

దీపావళి అంటే దివ్వెల వరుస. దీపావళి రోజు సాయంకాలం…

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే… అని మననం చేసుకుంటూ నువ్వులనూనె లేదా ఆవునేతిని మట్టి ప్రమిదెలలో నింపి, దీపాలు వెలిగించాలి. అనంతరం దీపతోరణాలతో గృహాన్ని అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు అందరూ మందుగుండు సామగ్రిని కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఆశ్వీయుజ అమావాస్య నాడు తప్పనిసరిగా లక్ష్మీపూజ చేయాలి.

  • • •

అర్ధరాత్రి చీపురుతో ఇల్లంతా చిమ్మి, ఉప్పునీట•తో కడగడం లేదా తుడవడం వల్ల అలక్ష్మి దూరంగా పారిపోతుందని నమ్మకం. అనంతరం గృహం మధ్యలో ఒకచోట కొత్త తుండు వేసి, దానిమీద నవధాన్యాలు పోసి, వాటి మీద లక్ష్మీదేవి ప్రతిమను ఉంచి యథాశక్తి పూజించి, కర్పూర హారతినివ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని శాస్త్రవచనం.

  • • •

నరకుడు సత్యభామకూ, శ్రీకృష్ణునికీ కొడుకే! శ్రీమన్నారాయణుడు వరాహావతారం ధరించి హిరణ్యాక్షుడి బారినుంచి భూదేవిని కాపాడే సమయంలో భూదేవికీ, విష్ణువుకూ జన్మించాడతడు. ఆ భూదేవే సత్యభామగా అవతరించిందని, శ్రీదేవి రుక్మిణీదేవిగా, శ్రీమహావిష్ణువు కృష్ణావతారం ధరించాడనీ పురాణ గాథ.  వరం ప్రకారం తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నరకుడు చావకూడదు. కన్నతల్లి చూస్తూ చూస్తూ కొడుకును చంపుకోదు కదా! కానీ కొడుకు దుర్మార్గుడై లోకాలను పీడిస్తున్నాడు. మామూలు తల్లి దండ్రులైతే, ఎంత చెడ్డ వాడైనా కొడుకునే వెనుకేసు కొస్తారు. కాని జగన్మాత లోకక్షేమం కోసం వాడిని హతమార్చేందుకు యుద్ధం చేసింది. దుర్మార్గుడైనవాడు కొడుకైనా వదలకూడదన్నదే నీతి. సంతానాన్ని తల్లిదండ్రులు చక్కగా పెంచాలి. దొంగబుద్ధి, హింస, దౌర్జన్యం వంటి అవలక్షణాలు ఉంటే చిన్ననాడే తొలగించాలి. రేపటి పౌరులు ఉత్తములుగా ఉండాలంటే, ఇవాళ్టి తల్లిదండ్రులు ఉత్తమోత్తమమైన నడవడి కలిగి ఉండాలి.

  • • •

ఉప్పునీటితో ఇంటిని తుడవడం, దీపాలు వెలిగించడం వెనుక ఉద్దేశం ఆరోగ్యం. ప్రస్తుత స్థితిలో అంతటి పరిశుభ్రతను దీపావళికి పరిమితం చేస్తే సరిపోదు. ఒకేరోజు, ఒకే సమయంలో అందరి ఇళ్లలో దీపాలు వెలగడం సమైక్యత దిశగా వేసే అడుగని గుర్తించాలి. ఇలాంటి అడుగులు ఇప్పుడు మరిన్ని అవసరమని దీపాల సాక్షిగా గుర్తిద్దాం. పరిశుభ్రత భారతీయ జీవనంలో అంతర్భాగమని ప్రతిన చేద్దాం. కరోనా నేపథ్యంలో వచ్చిన ఈ దీపావళి కొన్ని శాశ్వత విలువలను, సంప్రదా యాలను మనకు బోధిస్తున్నది. వాటిని విస్మరించ బోమని, మనసావాచా ఆచరిస్తామని ఈ కోట్ల దీపాల సాక్షిగా ప్రమాణం చేద్దాం.

About Author

By editor

Twitter
Instagram