దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు.. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో సంచలన విజయాన్ని నమోదుచేశారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ ‌తేదీ దాకా దుబ్బాక కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఓట్ల లెక్కింపు రోజున నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. దేశ విదేశాల్లో కూడా ఈ స్థానంలో గెలుపు ఎవరిదన్న అంశంపై బెట్టింగ్‌లు సాగాయి. ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. రఘునందన్‌రావు గెలుపుతో అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య రెండుకు పెరగనుంది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉపఎన్నిక వచ్చింది. సిట్టింగ్‌ ‌స్థానం కావడంతో ఇక్కడ గెలుపు నల్లేరు మీద నడకే అని అధికార పార్టీ భావించింది. కానీ, ఆ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. మొదటి నుంచి దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నువ్వా? నేనా? అన్నట్లు తలపడ్డాయి. ఎన్నికల ప్రచారం దగ్గరనుంచీ పోలింగ్‌ ‌దాకా రెండు పార్టీలు సై అంటే సై అన్నాయి. క్షేత్రస్థాయిలో తమదైన శైలిలో ఓటర్లను ప్రభావితం చేశాయి.

ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ ‌నుంచీ బీజేపీ ఆధిక్యం కొనసాగింది. మధ్యలో కొన్ని రౌండ్లలో తడబడినప్పటికీ చివరి దశలో మళ్లీ ఆధిక్యం కొన సాగించింది. రౌండ్‌ ‌రౌండ్‌కూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌మధ్య గెలుపు దోబూచులాడింది. టీఆర్‌ఎస్‌ 10 ‌రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించగా.. బీజేపీ 12 రౌండ్లలో ఎక్కువ ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి చెరకు సుధాకర్‌రెడ్డి ఒక రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం తర్వాత ఈ స్థాయిలో దుబ్బాక ఎన్నిక ఫలితం ఉత్కంఠ రేపింది. హరీష్‌రావు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. అక్కడ బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఓ దశలో ఎన్నికల ప్రచారంలోనే సహనం కోల్పోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలోనే బీజేపీ గెలుపు దాదాపు ఖాయమై పోయిందన్న ప్రచారం జరిగింది. ఎప్పుడూ ఆవేశం చూపించని హరీష్‌రావు సహనం కోల్పోవడమే దీనికి నిదర్శనమన్న విశ్లేషణలు వినిపించాయి.

గతంలో పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్‌రావుపై దుబ్బాక ప్రజాతీర్పులో సానుభూతి స్పష్టంగా కనిపించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, గతేడాది మెదక్‌ ‌పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌రావు ఓటమిపాలయ్యారు. ఆ సానుభూతి ఇప్పుడు పనికొచ్చింది. అదేవిధంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీపై దుబ్బాక ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా ఈ ఫలితాలకు కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ ఫలితం భవిష్యత్తు ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో వ్యక్తమవుతోంది. మున్ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం కనిపించే ప్రమాదం ఉందని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధినేతతో పాటు.. ఆ పార్టీ శ్రేణులు కూడా పసిగట్టాయి. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి చుక్కెదురు కావడం తథ్యం అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఓటమిని హరీష్‌ ‌రావుపైకి నెట్టేందుకు కేసీఆర్‌ ‌వర్గం ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో నివురుగప్పిన నిప్పులా పోగైన అసహనం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల్లో పెరిగిన అసంతృప్తి, ఇటీవలి హైదరాబాద్‌ ‌వరదల్లో ప్రభుత్వ వైఫల్యం వంటివి అధికార పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక పరిస్థితులను సరైన సమయంలో ఒడిసి పట్టుకోవడంలో భారతీయ జనతాపార్టీ సఫలమైంది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకర్షించడానికి కాషాయం కదన రంగంలోకి దూకింది. బీజేపీ అడుగ డుగునా టీఆర్‌ఎస్‌కు సవాల్‌ ‌విసిరింది. టీఆర్‌ఎస్‌ను మట్టికరిపించి దుబ్బాకలో పాగా వేయాలని వ్యూహాలు రచించిన బీజేపీ విజయం సాధించింది.

సహజంగానే రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ ‌దుబ్బాక సిట్టింగ్‌ ‌స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బీజేపీ దుబ్బాకను టార్గెట్‌ ‌చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌కు ఓ రకంగా ముచ్చెమటలు పట్టాయి. దీంతో అన్ని రకాల అస్త్ర శస్త్రాలనూ ఆ పార్టీ ప్రయోగించింది. ఎలాగైనా ఈ స్థానాన్ని నిలబెట్టు కోవాలన్న పట్టుదలతో ప్రచారం కొనసాగించింది. బీజేపీ ఆరోపణలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యారోపణలు చేస్తూ టీఆర్‌ఎస్‌ ‌ముఖ్యనేతలు ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం లేకుండాపోయింది.

అంతేకాదు, బీజేపీకి వచ్చిన ఆదరణను టీఆర్‌ఎస్‌ అస్సలు తట్టుకోలేక పోయింది. అనేక రకాలుగా తనదైన శైలిలో బీజేపీ అభ్యర్థిని, ఆ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసింది. పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహ రించిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆరోపణలు వినిపించడమే కాదు.. పరిణామాలన్నీ అలాగే కనిపించాయి. ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, ఉద్రిక్తతలు, పోలీసుల అత్యుత్సాహం కేంద్రం జోక్యం చేసుకునేలా చేశాయి. చివరకు ఈ ఎన్నిక కోసం ప్రత్యేకంగా తమిళనాడుకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని ఎన్నికల పరిశీలకునిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌నియమించాల్సి వచ్చింది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తాయి.

బీజేపీ నుంచి ముప్పు ఎదురవుతుందని ముందుగానే ఊహించిన టీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసులను ఉపయో గించుకుని బీజేపీ నాయకులను వెంటాడిన దృశ్యాలు నిత్యం కనిపించాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే బీజేపీని టీఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌ ‌చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసులు ఎడాపెడా సోదాలు చేశారు. ఎలక్షన్‌ ‌కోడ్‌ ‌లేని ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు చేయడం ఆశ్చర్యపరిచింది. అలాగే బీజేపీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లినా వాహనాలు తనిఖీ చేశారు పోలీసులు. ఆ విధంగా ఆయన ప్రచార సమయాన్ని వృథా చేశారు. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ ‌చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మీద సిద్ధిపేట పోలీసులు భౌతికదాడికి దిగారు. ఈ విషయంలో జాతీయ బీసీ కమిషన్‌ ‌వెంటనే స్పందించింది. సిద్ధిపేటలో రఘునందన్‌రావు బంధు వుల ఇళ్లలో సోదాలు చేసి 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు. కానీ, అక్కడ పోలీసులే బయటనుంచి డబ్బులను తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. దీనికి బలం చేకూర్చేలా ఓ వీడియో కూడా సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

పోలింగ్‌కు రెండు రోజుల ముందు హైదరా బాద్‌లో రఘునందన్‌రావు బావమరిది నుండి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేసి డబ్బులు దొరికితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తారు. కానీ, దుబ్బాక ఎన్నికల సందర్భంగా అటు సిద్ధిపేట పోలీసులు, ఇటు హైదరాబాద్‌ ‌పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న వాదనలు బలంగా వినిపించాయి. ఈ రెండు ప్రాంతాలలో ఎన్నికల కోడ్‌ అమలులో లేకున్నా.. పోలీసులు కేవలం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. భారీగా డబ్బులు పట్టుబడ్డాయంటూ ప్రకటనలు చేశారు. ఈ పరిణామాలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పోలీసులు పాటించారన్న సందేహాలకు బలం చేకూర్చాయి.

ఎవరూ ఫిర్యాదు చేయకుండా, ప్రత్యేకమైన కారణం లేకుండా ప్రైవేట్‌ ‌వ్యక్తుల ఇళ్లలో డబ్బు కోసం సోదాలు చేసే అధికారం పోలీసులకు ఉండదు. కానీ, ఈ రెండు సందర్భాలలోనూ దొరికిన డబ్బు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థికి సంబంధించినదని పోలీసులు ప్రకటించారు. అసలు అలా చెప్పే అధికారం పోలీసులకు ఉందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. ఎవరి వద్దనైనా నగదు లభిస్తే దానికి లెక్కలు చెప్పాల్సింది ఆదాయపుపన్ను శాఖాధికారులకే గానీ, పోలీసులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జన్‌కుమార్‌ ‌పరిధి అతిక్రమించి మరీ రఘునందన్‌రావు బావమరిది వద్ద దొరికిందని చెబుతున్న కోటి రూపాయలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అంతేకాకుండా రఘునందన్‌రావు బావమరిదిని కూడా నిందితుడిగా చిత్రీకరించారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా, లేకపోయినా ప్రైవేట్‌ ‌వ్యక్తుల ఇళ్లలో నగదు కోసం సోదాలు చేసే అధికారం పోలీసులకు ఉందా? అన్నది మరో ప్రశ్న. దొరికిన నగదు దుబ్బాకలో లభించినది కూడా కాదు. అక్రమ నగదు ఆదాయ నిల్వలు ఉన్న సందర్భాలలో ఆదాయపుపన్ను అధికారులు మాత్రమే తనిఖీ చేస్తారు. రఘునందన్‌ ‌రావు బావమరిది దగ్గర దొరికిన నగదును ఆదాయపు పన్ను అధికారులకు అప్పగించకుండా, డబ్బును ఆకర్షణీయంగా పేర్చి విలేకరులకు చూపించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ పరిణామాలన్నీ దుబ్బాకలో అధికార పార్టీకి నష్టం కలిగించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

దుబ్బాకలో విజయంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీలోకి పెద్దఎత్తున వలసలు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ‌నుంచే కాకుండా అధికార పార్టీ నుంచి కూడా పలువురు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టీఆర్‌ఎస్‌ ‌నాయకులు కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నరని సమాచారం.

– సుజాత గోపగోని, 6302164068

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram