ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..

విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది విజయానికి సంకేతమైన రోజు. ఆనాడు ఏ పని ప్రారంభించినా విజయాన్ని పొందడం ఖాయమని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆసురీ శక్తితో సంఘర్షణ చేసిన ఆదిశక్తి కేవలం తన వ్యక్తిగతమైన శక్తి సామర్థ్యాలతో మాత్రమే చేయలేదు. వివిధ దేవీదేవతలు, సజ్జనులు, రుషిమునులు తమ ధార్మిక ఆధ్యాత్మిక, శక్తి యుక్తులు ధారపోస్తే వాటిని స్వీకరించి ఆదిశక్తి ఒక మహాశక్తిగా అవతరించింది. అంటే సంపూర్ణ సమాజ సంఘటనాశక్తికి ప్రతిరూపం ఆదిశక్తి. అటువంటి సామూహిక సంఘటనా శక్తే దుర్గముడు, మహిషాసురుడు వంటి రాక్షసులను అంతం చేయగలిగింది. అయినా సమాజ జీవనంలో మహిషాసురుని వంటివారు పుడుతూనే ఉంటారు. వారు అంతం కావల్సిందే. మారణహోమం సృష్టించే తీవ్రవాదం, మహిళలపై మానభంగాలు చేసే మానవమృగాలు, సమాజంలో అల్లకల్లోలం సృష్టించే పాశవిక దుష్టశక్తులను కూడా నిర్మూలించవలసిందే. అది జరగాలంటే సజ్జనశక్తి జాగృతం కావాలి. సంఘటితం కావాలి. అప్పుడే సమాజ సంక్షేమం జరుగుతుంది. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈ సందేశాన్నే అందిస్తుంటాయి. అందుకే గతంలో దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం జాతీయ నాయకులు దుర్గామాత పూజలను వేదికగా చేసుకొని ప్రజా చైతన్యాన్ని, సమైక్యతాశక్తిని సాధించారు. దేశానికి స్వాతంత్య్రం లభించడానికి ఆ శక్తే దోహదపడింది.

ఎన్నో విజయాలతో ముడిపడి ఉన్న విజయ దశమినాడే ‘‘విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌’’ అనే ఉద్దేశంతో, పరం వైభవన్‌ ‌నేతు మేతత్‌ ‌స్వరాష్ట్రమ్‌ అనే లక్ష్యంతో పూ।।డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ 1925‌వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. సంపూర్ణ హిందూ సమాజ సంఘటనా శక్తి ఆధారంగా లక్ష్య ప్రాప్తి జరగాలని డాక్టర్‌ ‌హెడ్గేవార్‌జీ ఆకాంక్ష. దీనికోసం శాఖా పద్ధతికి రూపకల్పన చేశారు. శాఖ కేంద్రంగా హిందూ సమాజ సంఘటన జరగాలి. ఒక శక్తిమంతమైన సమాజం ఏర్పడాలి. ఒక దేశం, ఒక సమాజం తనను తాను రక్షించుకోవాలంటే శక్తిని ఉపాసించాలి. ప్రపంచంలో అనేక దేశాలు శక్తిని కలిగి ఉన్నందు వలనే శత్రుదేశాల కుయుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. గౌరవాన్ని పొందుతున్నాయి. బలం, శక్తి సామర్థ్యాల దృష్ట్యా అవి అగ్రరాజ్యాలుగా గుర్తింపును పొందాయి. శక్తిమంతుడే గౌరవాన్ని పొందుతాడనేది చారిత్రక సత్యం. కాబట్టి నేడు మనం స్వశక్తి భారతదేశాన్ని నిర్మించుకోవాలి. విజయదశమి మనకందించే సందేశమదే.

అనాది కాలం నుండి శక్తిని ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఛాందోగ్యోపనిషత్తులో నారద సనత్కుమార సంవాదంలో సనత్కుమారుడు నారదునితో విజ్ఞానం కంటే బలం గొప్పది. విజ్ఞానవంతులు నూరుగురున్నా బలవంతుడొక్కడు ఆ నూరుగురిని భయపెడతాడు. బలం ఉన్నవాడు మాత్రమే వేరే శక్తిని కలిగి ఉంటాడు. పిపీలకాది సమస్త సృష్టి బలం వల్లనే నిలిచి ఉంది. కాబట్టి బలాన్ని బ్రహ్మంగా ఉపాసించు. ‘‘బలేన లోకస్తిష్ఠతి బలముపాస్య’’ అని ఉపదేశిస్తాడు. నాయమాత్మా బలహీనేవ లభ్యః! అంటే బలహీనులకు ఆత్మసాక్షాత్కారం కలగదు అని ముండకోపని షత్తులోని వాక్యం. అందుకే స్వామి వివేకానంద ఆత్మవిస్మృతితో బలహీనపడిన ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి ఇనుపకండరాలు, ఉక్కునరాలు, వజ్రతుల్య సంకల్పం కలిగిన యువకులు ఇప్పుడు నా దేశానికవసరమని పిలుపునిచ్చి భారత జాతిలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌వివేకానందుని పిలుపును స్వీకరించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో అలాంటి యువకులను నిర్మాణంచేసే ప్రత్యక్ష కార్యాచరణ రూపుదిద్దుకొంది. శక్తిశాలి సమాజం నిర్మాణం కాకపోతే జాతికి మనుగడ ఉండదు. సంస్కృతంలో

అశ్వంనైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ

అజాపుత్రో బలిం దద్యాత్‌ ‌దేవో దుర్బలఘాతకః।।

అని ఒక సుభాషితం ఉంది. బలి యిచ్చేటప్పుడు గుర్రంను, ఏనుగును, పెద్దపులి వంటి జంతువులను కాకుండా బలహీనమైన మేక పిల్లను ఇస్తుంటారు. అంటే దేవుడు కూడా బలహీనులనే దెబ్బకొడు తుంటాడు. నిత్యవ్యవహారంలో కూడా బలహీనులే బలవంతుల చేతుల్లో బాధితులు అవుతారు. అవమానాల పాలవుతుంటారు. ఇది అందరి అనుభవంలో ఉన్న వాస్తవమే.

మహాభారతంలో భీష్ముడు చేతులు లేనివాటిని చేతులున్న ప్రాణులు, చిన్న జీవులను పెద్ద జీవులు, చిన్న చేపలను పెద్ద చేపలు మ్రింగినట్టుగా బలవంతులు బలహీనులను భక్షిస్తారని చెప్పాడు. ఈ మాత్స్య న్యాయాన్ని అటవీన్యాయం అని కూడా అంటారు. ఇది వ్యవహారంలో ఉన్నంతకాలం ఆ వ్యక్తిగాని దేశంగాని బలాన్ని సముపార్జించుకొని శక్తివంతంగా ఉండక తప్పదు. లేకపోతే శరీరం బలహీనమైనప్పుడు రోగాలు దాడి చేసినట్లుగా, జాతి బలహీనంగా ఉంటే దురాక్రమణకు అవమానాలకు గురవుతుంటారు. రావణుడు బాహుబల సంపన్నుడు కాబట్టే కైలాసపర్వతాన్ని పెకలించాడు. అతనికంటే బలవంతుడైన వాలి ముందు తలవంచాడు. కృష్ణుడు కంసుడు పంపిన రాక్షసులను, కంసుణ్ణి కూడా శక్తియుక్తులతోనే చంపాడు. శివాజీ అఫ్జల్‌ఖాన్‌ను యుక్తితోను, శక్తితోను వధించాడు. అలాగే స్వామి వివేకానంద కూడా తనను అవమానించిన ఇద్దరు పాశ్చాత్యులకు బాహుబలంతోనే బుద్ధి చెప్పాడు.

నేడు భారత్‌లో జరుగుతున్నదిదే. బలపరాక్రమా లతో, శక్తియుక్తులతో ఉన్నప్పుడు జగద్గురువుగా విరాజిల్లిన జాతి బలహీనమైనప్పుడు దోపిడీలకు, దురాక్రమణలకు, అవమానాలకు గురయింది. పొరుగు దేశాలు కూడా ఎప్పుడూ భారత్‌ ‌బలహీనం గానే ఉండాలని భారత్‌ను తమ గుప్పెట పెట్టుకొని ఒక ఆట ఆడించాలనే కుయుక్తితోనే ఉంటుంటాయి. ఉంటున్నాయి కూడా. అందుకు ప్రత్యక్ష నిదర్శనా లున్నాయి. పాకిస్తాన్‌ ఏర్పడిన నాటి నుండి భారత్‌లో అశాంతిని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు కోకొల్లలు. భారత్‌ను ఆక్రమించుకోడానికి చేసిన ప్రయత్నానికి పి.ఓ.కె ప్రత్యక్ష ఉదాహరణ. అంతర్జాతీయ నిబంధనలనుల్లంఘిస్తూ సరిహద్దులలో జరుపుతున్న కాల్పులకు, ఉరి, పూల్వామా దాడులకు దీటుగా జవాబు చెప్తూ తీవ్రవాదుల ఏరివేత చర్యలు చేపట్టి భారత్‌ ‌దృఢవైఖరి అవలంబించిన కారణంగా నేడు భారత్‌పై దురాక్రమణ దుశ్చర్యలు తగ్గుముఖం పట్టాయి.

మరోవైపు కమ్యూనిస్టు చైనా సామ్రాజ్యవాద తత్వంతో భారతదేశాన్ని ఆర్థికంగా, భౌగోళికంగా తమ కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి మొదటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉంది. తడిగుడ్డతో గొంతుకోసే వైఖరి అవలంభిస్తూ 82 లక్షల చదరపు మీటర్ల భూభాగాన్ని 1962లో అన్యాయంగా ఆక్రమించుకొని ఆనాటి నుండి భారతదేశంతో దొంగాట ఆడుతూనే ఉంది. చైనా భారత్‌ ‌సరిహద్దుల వద్ద డోక్లామ్‌ ‌ప్రదేశం తమదని వాదిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం, అలాగే గాల్వాన్‌లోయ వద్ద సైన్యాన్ని దించి ఎల్‌ఓసీ• దాటి ఆక్రమించుకునే దుందుడుకు చర్యలకు పాల్పడటం డ్రాగన్‌ ‌విస్తరణ కాంక్షకు అద్దం పడుతోంది. ఈ రెండు సందర్భాల్లోను భారతదేశం కూడా సైన్యాన్ని మోహరించి సమర్థ వంతంగా శక్తిని ఉపయోగించి ప్రతిఘటించడంతో డ్రాగన్‌కు తోక ముడవక తప్పలేదు. ఒక శక్తిశాలియైన సమాజం, దేశ లక్షణం ఆ విధంగా ఉంటుంది.

చైనాలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న హైడ్రోచైనా కార్పోరేషన్‌ 10 ‌సంవత్సరాల క్రితమే భారత్‌ ‌భూభాగంలోని అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని తమ ప్రణాళికా పటంలో అధికారికంగా తమ భూబాగంగా చూపించుకున్నారు. అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ఆనకట్టలు తామే కట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. పైపెచ్చు అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌భారత్‌ ‌భూభాగం కాదని అది దక్షిణ టిబెట్‌ అనే వాదనను ముందుకు తీసుకు వస్తోంది. ఇలాంటి దుశ్చర్యలను ప్రతిఘటించి మన దేశ భూభాగాలను సంరక్షించుకోవాలంటే మరింత శక్తిమంతంగా జాతి నిర్మాణం కావాలి. ఇప్పటికే చైనా వస్తువులను బహిష్కరించడం, చైనాకు చెందిన యాప్‌లను నిషేధించడంలోనే చైనాకు మన శక్తి సామర్థ్యాలు తెలిసి వస్తున్నాయి. మరింత శక్తిశాలి సమాజంగా భారత్‌ ‌రూపొందినప్పుడే దేశాన్ని రక్షించుకోగలం.

ఒక దేశం ఒక సమాజం సురక్షితంగా ఉండాలంటే ముఖ్యంగా రెండు రకాల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, 1. బాహ్య శత్రువులు, 2. అంతర్గత శత్రువులు. చైనా, పాకిస్తాన్‌లు బాహ్య శత్రువులైతే దేశం లోపల సమస్యలు విభేదాలు, అలజడులు సృష్టించి అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరించడం అంతర్గత శత్రుత్వ లక్షణం. ఇది మొదటిదానికంటే పెద్ద ప్రమాదకారి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత. వీళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే చందాన వ్యవహరిస్తుంటారు. సమాజంలో వ్యక్తుల మధ్య ఎన్ని రకాల విభేదాలు సృష్టించడానికి అవకాశంముంటుందా అని రంధ్రాన్వేషణ చేస్తుంటారు. కులవిభేదాలు, మతఘర్షణ లతో సమాజంలో అలజడి, అశాంతిని సృష్టిస్తుంటారు.

ప్రతి దేశంలో, పౌరసత్వ చట్టం ఉంటుంది. ఇది ఆ దేశ భద్రతకు దోహదంగా ఉంటుంది. ఇది మన దేశంలో కొందరికి అభ్యంతరకరమైంది. •రెచ్చ గొడుతూ, సీఏఏ వ్యతిరేక ఉద్యమాల వంటివి చేస్తుండటం, చేయిస్తుండటం దేశభద్రతకు ముప్పు కలిగిస్తుంది. వ్యక్తిగత కలహాలను కులకలహాలుగా, వ్యక్తిగత దాడులను మూకదాడులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారు.ఇటీవల హాత్రాస్‌లో జరిగిన దుస్సంఘటన బాధాకరమైంది. మహిళలపై దాడులు, అత్యా చారాలు, హత్యాచారాలు గర్హించదగినవి. ఇందులో కుల, మత వివక్షలుండకూడదు. మహిళకు అన్యాయం జరుగరాదు. అయితే హాత్రాస్‌ ‌ఘటనను సాకుగా చేసుకొని సంఘ విద్రోహశక్తులు కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి విద్రోహ సంస్థ పిఎఫ్‌ఐకి విదేశీ నిధులు రావడం తదితర అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా సంస్థల్లో కొన్ని దీనితో కుమ్మక్కు కావడం దారుణం. మోసగాళ్ల కుట్రల్లో, వాళ్ల మాటల్లో సామాన్య ప్రజలు పడకూడదు. వాస్తవాన్ని గుర్తించే విజ్ఞతను పాటించాలి. సమైక్యత, సంఘటన బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. వ్యక్తిగతంగా, నష్టపోయినా సమాజం, దేశం నష్టపోకూడదనే దేశభక్తి భావన పెంపొందించు కోవాలి. దేశద్రోహులను తరిమిగొట్టగలిగే శక్తిని సముపార్జించుకోవాలి.

సమాజం శక్తిసంపన్నంగా ఉన్నప్పుడే అవతల వాళ్లు కన్నెత్తి వక్రదృష్టితో చూడకుండా ఉంటారు. వాళ్ల మనస్సుల్లో చెడు ఆలోచనలు కూడా రాకుండా చేస్తుంది. విద్వేషాలు రగిలించకుండా ఉంటారు.  విజయదశమినాడు పొలిమేరలకు వెళ్లి సీమోల్లంఘన చేసి శత్రువుల కదలికలను సమీక్షిస్తూ సరిహద్దుల రక్షణ చేసుకుంటుంటారు. సమాజం కూడా ఎప్పటికప్పుడు అంతర్మథనం చేసుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటూ, ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిరంతరం సమాజ జాగృతికి ప్రయత్నం చేస్తుంటుంది. శక్తిలో రెండు రకాలుంటాయి. మొదటిది రాక్షస శక్తి. ఇదే పాశవిక శక్తి. అధార్మిక శక్తి. రెండవది దైవీశక్తి దీనినే ధార్మికశక్తి, సాత్విక మహాశక్తి అనవచ్చు. సజ్జన శక్తి శిష్టరక్షణకు దుష్టశిక్షణకు ఉపయోగపడుతుంది. సంఘం ‘‘అజయ్యాంచ విశ్వస్య దేహీశ శక్తిం’’ అనగా ప్రపంచమంతా ఏకమై దాడి చేసినప్పటికీ మేము అజేయులుగా ఉండగలిగే శక్తిని మాకు ప్రసాదించు’’ అనే శక్తిని నిర్మాణం చేయాలనే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచం మీద దండెత్తడానికి శక్తి కావాలని సంఘం కోరుకోవడం లేదు. ఇది సంఘ ప్రత్యేకత. భారతీ యుల శక్తి ఉపాసనలో అంతరార్థమిది. ఇప్పుడిప్పుడే ప్రపంచం మళ్లీ భారతీయ శక్తిని గుర్తిస్తోంది. సమాజంలో చైతన్యం కలుగుతోంది. కరోనా వైరస్‌ను పారద్రోలడానికి సంఘీభావాన్ని తెలియజేయటానికి సంకేతంగా నిర్ణీత సమయానికి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి గంటలు లేదా చప్పట్లు కొట్టమని ప్రధానమంత్రి పిలుపునిచ్చినప్పుడు సమాజంలో అనూహ్యమైన స్పందన వచ్చింది. జాతి సమైక్యతకు ఇదొక సంకేతం. అలాగే దేశ సురక్ష- దేశాభివృద్ధి విషయంలో సమాం సర్వకాల సర్వావస్థలలో సన్నద్ధమయ్యేలా సమాజాన్ని చైతన్య పరచడం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌చేస్తున్న పని. శక్తిశాలి సమాజంగా నిర్మాణం చేయాలనే స్ఫూర్తిని విజయదశమి మనకంది స్తోంది. సంఘటిత సమాజ శక్తి నిర్మాణ యజ్ఞంలో మనమందరం సమిధలం కావాలి. అధ్వర్యులం కావాలి. రుత్విక్కులం కావాలి.

– డా।। అన్నదానం వేం.సుబ్రహ్మణ్యం : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రాంత సహకార్యవాహ

About Author

By editor

Twitter
Instagram