పార్టీని బట్టి కాదు, ప్రభుత్వ విధానాల మీదే స్పందించాలి

ఠేంగ్డీజీ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన సంఘ ప్రచారక్‌. ‌గొప్ప వ్యవస్థా కౌశలం గలవారు. సిద్ధాంతకర్త, రాజీపడని ఆదర్శవాది. ఆయన ద్వారా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ (‌బీఎంఎస్‌) ఈ ‌లక్షణాలన్నిటి ప్రయోజనం పొందగలిగింది. బిఎంఎస్‌ ‌కార్మిక రంగంలోకి అడుగుపెట్టేనాటికే ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఏఐటియుసి మొదలైన సంఘాలు చాలా బలంగా ఉండేవి. కానీ బీఎంఎస్‌ ‌క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల మూలంగా 34 ఏళ్లలోనే అతిపెద్ద కార్మిక సంస్థగా అవతరించింది. సంస్థను ఇలాంటి ఉన్నతమైన స్థానానికి చేర్చడంలో ఠేంగ్డీజీ చూపిన నైపుణ్యం, మార్గదర్శనం అద్భుతమైనవి. భారతీయ కార్మిక ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఆయన ఎదిగిన తీరు ఈ రంగంలో పనిచేసే అందరికీ అనుసరణీయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌జీ 1949లో గురూజీ సూచన మేరకు భారతీయ సంప్రదాయం, విలువల ఆధారంగా ఒక కార్మిక సంస్థను ప్రారంభించడంపై దృష్టి సారించారు.  మొదట ఐఎన్‌టియుసిలో చేరారు. తక్కువకాలంలోనే అందులో ఉన్న దాదాపు పది సంఘాలలో ముఖ్యమైన స్థానాన్ని పొందారు. 1950 అక్టోబర్‌లో జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులయ్యారు. మధ్యప్రదేశ్‌ ఐఎన్‌టియుసి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 1952-1955 మధ్య కాలంలో ఏఐబిఇఏ అనే బ్యాంకు ఉద్యోగుల సంఘం (కమ్యూనిస్టులది) రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేశారు. మధ్యప్రదేశ్‌, ‌విదర్భ, రాజస్తాన్‌లతో కూడిన ఆర్‌ఎంఎస్‌ ‌తపాలా కార్మికుల సంఘం అధ్యక్షుడిగా 1954 నుండి 1955 వరకు పనిచేశారు. ఐఎన్‌టియుసికి అనుబంధంగా ఉన్న ఎల్‌ఐసి, రైల్వే, టెక్స్‌టైల్‌, ‌బొగ్గు కంపెనీ కార్మిక సంఘాల అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వివిధ సంస్థలలో పనిచేస్తున్నప్పుడే కార్మిక సంఘాల పనితీరు, వాటి ఉద్యమాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. అలాగే కమ్యూనిజం గురించి, కమ్యూనిస్టు సంస్థలు పనిచేసే తీరు గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. అంతేకాదు.. ఏకాత్మ మానవవాద సిద్ధాంతపు మౌలిక విషయాలను రూపొందించడంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు కూడా సహాయం చేశారు.

కార్మికులలో ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలను కాపాడాలన్నది మొదటి నుంచి దత్తోపంత్‌జీ ప్రయత్నం. ప్రారంభంలో బిఎంఎస్‌లో కార్మిక సంఘాల కార్యకలాపాల్లో ఏమాత్రం అనుభవం లేని సామాజిక కార్యకర్తలే చేరారు. సంస్థకు అనుబంధంగా ఒక్క కార్మిక సంఘం కూడా లేదు. అంతేకాదు మొదటి 12 ఏళ్లపాటు జాతీయ కార్యనిర్వాహక వర్గమే లేదు. కేవలం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ జాతీయ స్థాయిలో ఉండేది. దత్తోపంత్‌జీ దేశమంతా పర్యటిస్తూ ప్రతిరాష్ట్రంలో సంస్థను నిలబెడుతూ వచ్చారు. మరోవైపు సంస్థకు సైద్ధాంతిక పునాదులను ఏర్పరచారు. ఈ సమయంలో గురూజీ మార్గదర్శనం పూర్తిగా లభించింది. తల్లి పిల్లలను ఎంతగా ప్రేమిస్తుందో కార్మికుల పట్ల అంతటి అభిమానం చూపాలని గురూజీ చెప్పేవారు. 1960లో గుల్జారీలాల్‌నందా కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెను కఠినంగా అణచివేయడానికి ప్రభుత్వం యత్నించింది. సమ్మె గురించి బిఎంఎస్‌ ఏమనుకుంటోందో చెప్పాలని గురూజీ అడిగారు. ప్రభుత్వోద్యోగులకు సంబంధించి బిఎంఎస్‌కు ఎలాంటి అనుబంధ సంస్థ లేదని ఆయన చెప్పారు. అయినప్పటికి సమ్మె గురించి బిఎంఎస్‌ ‌వైఖరి ఏమిటో తెలియాలని, సంఘ పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్‌ ‌ద్వారానైనా తెలియజేయాలని గురూజీ అన్నారు. ఆ సందర్భంలో గురూజీ చెప్పిన విషయాలను ఠేంగ్డీజీ తరచూ గుర్తుచేసుకుంటారు. ‘పని చేసే హక్కులోనే సమ్మె చేసే హక్కు కూడా ఇమిడి ఉంది. సమ్మె కంటే మెరుగైన పద్ధతి, మార్గం కనిపెట్టినప్పుడు సమ్మె అవసరం దానంతట అదే పోతుంది. కార్మిక రంగం పట్ల గురూజీకి ఉన్న లోతైన అవగాహనను ఈ మాటలు మనకు స్పష్టం చేస్తాయి.

కార్మిక ఉద్యమంలో ఠేంగ్డీజీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి బొంబాయిలో జరిగిన కార్మిక సంఘాల సంయుక్త ర్యాలీలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ఆ సభలో హెచ్‌ఎంఎస్‌కు చెందిన సీనియర్‌ ‌నాయకుడు ఎన్‌. ‌జీ. గోరే కూడా ఉన్నారు. సభ ప్రారంభమవుతున్న సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌ ఉన్న వేదికపై కూర్చోలేనని గోరే నిరాకరించారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఠేంగ్డీజీ స్వాగతోపన్యాసం చేసి వెంటనే ఎలాంటి నిరసన వ్యక్తంచేయకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత చాలకాలానికి ఎమర్జెన్సీ సమయంలో గోరేని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లవలసిన బాధ్యత ఆయనకు అప్పగించారు. ఠేంగ్డీజీని గోరే కలిసినప్పుడు ఆయన గతంలో జరిగిన సంఘటనకు తన విచారాన్ని వ్యక్తంచేశారు.

బిఎంఎస్‌కు ఉన్న ప్రత్యేకతను కార్యకర్తలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుని దానికి తగినట్లుగానే వ్యవహరించాలని దత్తోపంత్‌జీ అన్ని సమావేశాల్లోనూ చెప్పేవారు. ‘మౌలిక సిద్ధాంతం పట్ల ఎప్పుడూ రాజీ పడరాదు.’ అన్న ఆయన హెచ్చరిక ఇప్పటికీ బిఎంఎస్‌ ‌కార్యకర్తల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నవారితో, వివిధ కార్మిక సంఘాల నేతలతో ఆయనకు స్నేహ సంబంధాలు ఉండేవి. ఒకసారి కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలకు, సిపిఎం వారికి మధ్య ఘర్షణలు జరిగినప్పుడు సిఐటియు నాయకుడు పి. రామ్మూర్తితో కలిసి అక్కడకు వెళ్లిన ఠేంగ్డీజీ పరిస్థితిని చక్కదిద్దాడానికి ప్రయత్నించారు.

దత్తోపంత్‌జీ నిరంతర మార్గదర్శనం మూలంగా సంస్థ ఇప్పటివరకు తన మౌలిక సిద్ధాంతాల నుంచి దూరం కాకుండా నిలబడింది. ఎమర్జెన్సీ సమయంలో లోక్‌ ‌సంఘర్ష సమితి కార్యదర్శిగా పనిచేసినా ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జనతాపార్టీకి బిఎంఎస్‌ను అనుబంధ సంస్థగా మార్చాలన్న ప్రతిపాదనను మాత్రం ఆయన తిరస్కరించారు. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అని కాకుండా ప్రభుత్వ విధానాలను బట్టి కార్మిక సంఘాలు ప్రతిస్పందించా లని ఆయన చెప్పేవారు.

1984లో హైదరబాద్‌లో జరిగిన  సమావేశాల్లో బహుళజాతి కంపెనీలు, విదేశీ ఏజెంట్లపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. ఆ విధంగా స్వదేశీ జాగరణ మంచ్‌కు బీజం వేశారు. ఆ తరువాత 1991లో అది పూర్తిస్థాయి సంస్థగా మనుగడలోనికి వచ్చింది.

1991లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి క్రేద, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలు, ఆర్థిక విధానాలు ఒకే మాదిరిగా ఉండేవి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో ఈ విధానాలను వ్యతిరేకించిన కమ్యూనిస్టు కార్మిక సంఘాలు ఆ తరువాత తాము మద్ధతు తెలిపిన దేవగౌడ, గుజ్రాల్‌ ‌ప్రభుత్వాల హయాంలో మాత్రం పూర్తిగా మౌనం వహించాయి. అయితే 1991లో ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన బిఎంఎస్‌ ఆ ‌తరువాత ఎన్‌డిఏ ప్రభుత్వ హయాంలో మౌనంగా ఉండిపోతుందని అంతా అనుకున్నారు. కానీ 1999లో నాగ్‌పూర్‌ ‌సభ, 2001 ఏప్రిల్‌ 16‌న జరిగిన సభలోను ఎన్‌డిఏ ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. ఈ సంఘటన ఆధునిక రాజకీయ, కార్మిక రంగ చరిత్రలో అరుదైనది.

కార్మిక రంగానికి సంబంధించి రెండవ జాతీయ కమిషన్‌ అం‌దరినీ ఆశ్చర్యపరుస్తూ పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా మారింది. కమిషన్‌లో సభ్యులైన ఠేంగ్డీజీ వెంటనే ఒక నిరసన పత్రాన్ని తయారు చేసుకుని పుణే రావలసిందిగా నన్ను (వ్యాస రచయిత) కోరారు. న్యాయవాది ధరప్‌తో పాటు నేను పుణె చేరేసరికి రాత్రి 11గంటలు దాటింది. మా కోసం ఎదురు చూస్తూ ఆయన మెలకువగానే ఉన్నారు. అప్పుడు నేను రాసి తీసుకువెళ్లిన పత్రాన్ని చదివి అందులో అవసరమైన మార్పులు చేశారు. ఆ పత్రం రెండవ జాతీయ కమిషన్‌ ‌నివేదికలో భాగమైంది. ఆ విధంగా కార్మిక రంగంలో బిఎంఎస్‌ ‌ప్రత్యేకతను నిలిపేందుకు మరోసారి ఠేంగ్డీజీ మార్గదర్శనం ఉపయోగపడింది.

సంఘ్‌, ఇతర సంస్థలకు విలువైన మార్గదర్శనం మరింత అవసరమైన స్థితిలో ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన ద్వారా స్ఫూర్తిని పొంది పనిచేస్తున్న వేలాదిమంది కార్యకర్తల ద్వారా ఆయన సైద్ధాంతిక జీవనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ పునర్నిర్మాణంలో దోహదపడుతూనే ఉంది. భారత కార్మిక సంఘ ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఆయన స్థానం చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది.

– సజి నారాయణన్‌: బీఎంఎస్‌ అఖిల భారతీయ అధ్యక్షులు, త్రిశూర్‌, ‌కేరళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram