దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ ఆధునిక రుషి. బహుముఖ ప్రజ్ఞాశాలి. పూజనీయ గురూజీ, మాననీయ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సిద్ధాంతానికి ఆయనే వ్యాఖ్యాత, భాష్యకారుడు. సిద్ధాంతాలను స్వయంగా ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. వారిది అసామాన్యమైన వ్యక్తిత్వం. కానీ అతి సామాన్యుడిగానే జీవించారు.  సామాన్య ప్రజల కోసమే తపించారు. శ్రామికశక్తికీ, జాతీయతాశక్తికీ నడుమ ఉండే నిర్మాణాత్మక భావనకు స్వరూపం ఇచ్చి, ఆ శక్తులను అనుసంధానం చేయగలిగిన అద్భుత చింతనాపరుడాయన.

సహజ సిద్ధమైన ప్రతిభ, లోకానుభావంతో వచ్చిన నైపుణ్యం, సంఘం పనిలో గడించిన అనుభవం; వీటన్నింటికి మించి పూజనీయ గురూజీ సాన్నిహిత్యం వల్ల ఠేంగ్డీజీకి లభించిన జ్ఞానసంపద అపురూపమైనవి. ఆ సంపదే వారి గ్రంథాలలో గుబాళిస్తూ ఉంటుంది. అధర్వం నుండి బైబిల్‌ ‌వరకు, సంత్‌ ‌జ్ఞానేశ్వర్‌ ‌నుండి ఒమర్‌ ‌ఖయ్యాం వరకు, డయోనిసిస్‌ ‌నుండి కార్ల్‌మార్కస్ ‌వరకు, పతంజలి యోగసూత్రాల నుండి ఎమర్సన్‌, ‌కార్లైల్‌ ‌వరకు, కాళిదాసు నుండి టెనిజన్‌ ‌వరకు, యేసుక్రీస్తు నుండి మహమ్మద్‌ ‌ప్రవక్త వరకు, సంత్‌ ‌రామదాస్‌ ‌నుండి జోసెఫ్‌ ‌మేజిని వరకు, నారద భక్తి సూత్రాల నుండి విశ్వగుణాదర్శ చంపువు వరకు, యోహాను సువార్త నుండి వండర్లాండ్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌మేనేజిమెంట్‌ ‌వరకు అనేక ఉదాహరణల, ఉల్లేఖనల భాండాగారం దర్శనమిస్తుంది.

దత్తోపంత్‌ ‌క్రియాశీలక కార్యకర్త. ప్రచారక్‌గా, జనసంఘ్‌ ‌వ్యవస్థాపకులలో ఒకరిగా, మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌స్థాపకునిగా, కిసాన్‌ ‌సంఘ్‌, ‌స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌, ‌ప్రజ్ఞ ప్రవాహ, సామజిక సమరసత, అధివక్త పరిషత్‌ ‌లాంటి ఎన్నో సంస్థలను స్థాపించడమే కాదు, వాటికి మౌలిక సిద్ధాంతాన్నీ, కార్యపద్ధతినీ వికసింపచేశారు. సంస్కార భారతి మౌలికదృష్టి కూడా ఆయనదే. ఇలా వారి నుండి ఎన్నో సంస్థలు ప్రేరణ పొందాయి. హిరేన్‌ ‌ముఖర్జీ నుండి జార్జ్ ‌ఫెర్నాండజ్‌ ‌వరకు నాటి సామజిక, రాజకీయ, ధార్మిక రంగాలలో పనిచేసిన విభిన్న సిద్ధాంతాల వారందరితోనూ దత్తోపంత్‌ ‌సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. వారందరు ఆయన్ని తమ కుటుంబ సభ్యునిగా చూసేవారు.

దత్తోపంత్‌ ‌పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో వామపక్ష నాయకులతో స్నేహంగా ఉండేవారు. దానివల్లనే తర్వాత కాలంలో కార్మిక సంఘాల జాతీయ అభియాన్‌ ‌సమితి (National Campaign Committee) ఏర్పడి, సమైక్య పోరాటానికి ఉపయోగపడింది. ఎస్‌ఏ ‌డాంగే, చతురానన్‌ ‌మిశ్రా, సి.రామ్మూర్తి, భూపేష్‌ ‌గుప్త, బేని, రోజా దేశ్‌పాండే ఎం.కే.పాధే లాంటి వారందరితో ఆత్మీయ సంబంధాలుండేవి. రామ్మూర్తి కుటుంబంలో దత్తోపంత్‌ ‌సభ్యుడే అన్నట్టు ఉండేవారు. దత్తోపంత్‌ ‌మానవ సంబంధాలు ఎంతో ఆత్మీయంగా ఉండేవి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బయట కూడా సమాజం కోసం నిబద్ధతతో పనిచేసేవారుంటారని ఠేంగ్డీ నమ్మేవారు. అదే చెప్పేవారు. డాక్టర్‌ ఎం.‌జి. బొకరే నాగ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయ కులపతి. వామపక్ష మేధావి. కార్డుహోల్డర్‌ ‌కూడా. కానీ నిజాయితీపరులు. వారితో ఠేంగ్డీ సత్సబంధాన్ని కలిగి ఉండేవారు. ఇద్దరి మధ్య సిద్ధాంతపరమైన చర్చలు జరిగేవి. చివరికి బొకరే ‘హిందూ ఎకనామిక్స్’ అనే పుస్తకం రాశారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఆర్థిక శాస్త్ర వేత్తలలో నూతన దృష్టి ప్రారంభమైంది. ఆధునిక భారత చరిత్రలో జాతీయ పునరుజ్జీవన సాహిత్యంతో, స్వామి వివేకానంద సమగ్ర గ్రంథావళితో నూతన దిశా దర్శనం ప్రారంభమైనది. ఠేంగ్డీ చింతన దీనిని కొనసాగించింది.

ఠేంగ్డీ హిందీలో 35, ఆంగ్లంలో 10, మరాఠీలో 3 పుస్తకాలు రచించారు. దాదాపు 12 పుస్తకాలకు ముందుమాటలు రాశారు. గురూజీ రాసిన ‘రాష్ట్ర’ పుస్తకానికి ఠేంగ్డీ 150 పేజీల ప్రస్తావన వ్రాసారు. అది వారి మహోన్నత ప్రతిభకు తార్కాణం. ఠేంగ్డీ పుస్తకాలు ఏ కాలానికైనా దర్శనాల వంటివే. భారతీయ ఆర్థికరంగ ఆలోచనలో ఏకాత్మమానవ దర్శనంతో వారు భారతీయ సైద్ధాంతిక భూమికను పునర్‌ ‌జాగృతం చేసారు.

ఠేంగ్డీ రాసిన Third Way పుస్తకం ఆర్థిక యోజనలో ఉన్న మేధావులందరికి నూతన దృష్టిని ఇచ్చి, చర్చకు అవకాశం కల్పించింది. సరియైన దారి చూపుతోంది. విశ్వమంతటిని ప్రభావితం చేస్తూ విజయయాత్రలో దూసుకు పోతున్న సామ్యవాద రథాన్ని ఆపడం ఆ రోజుల్లో పెద్ద సవాలు. కానీ కొద్ది కాలంలోనే ఠేంగ్డీ కార్మిక శ్రేయస్సు, శోషిత, పీడిత, ఉపేక్షిత ప్రజలకు సేవ చేయడంలో, కాలాను గుణమైన పరివర్తనను తీసుకురావడంలో విజయం సాధించారు. నూతన ఒరవడిని నిర్మించడంలో సఫలీకృతులయ్యారు.

జాతిని పారిశ్రామికీకరణ చేయాలి. పరిశ్రమలను శ్రామికీకరణ చేయాలి. కార్మికులలో జాతీయ భావన నింపాలి. ఇది ఠేంగ్డీ దృష్టి. ఈ నూతన దృష్టినే దేశ క్షేమానికీ, ప్రగతికీ అన్వయింప చేశారు.

దీనిని ఆయన ఒక చమత్కారం నింపి ప్రబోధించేవారు. మనం పిచ్చివాళ్లం, అందుకే భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌లో ఉన్నాం. పేదలను పేదరికం నుంచి విముక్తం చేయడానికీ, కష్టాలతో దుఃఖించే వారి కన్నీరు తుడువడానికీ, సమాజం అట్టడుగును ఉండిపోయిన వారి అభ్యుదయానికీ పనిచేసేవాళ్లం మనం. ఆ పని చేయడానికే మనం పిచ్చివాళ్లమయ్యాం అనేవారాయన.

నవంబర్‌ 13-20, 1990‌లో మాస్కోలో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య సమావేశాలు జరిగాయి. కార్మిక సంఘాలు రాజకీయాల కతీతంగా కార్మికోద్యమం పనిచేయాలంటూ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రపంచమంతా అంగీకరించింది.ఇది మన ఆలోచనా విధానానికి నైతిక విజయం. 135 దేశాల నుండి 1250 ప్రతినిధులు పాల్గొన్న సమావేశాలవి. అందులో 400 మంది కమ్యూనిస్టు సంస్థల ప్రతినిధులు.

భారతరత్న బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌తో ఠేంగ్డీ ఆత్మీయ సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. అప్పటికి ఠేంగ్డీ వయసులో చిన్నవారు. సంఘలో పెద్ద బాధ్యత కలిగినవారు కూడా కాదు. కానీ వారి దూరదృష్టి, సమగ్ర హిందూ సమాజ దృష్టి వలన వారు బాబాసాహెబ్‌తో కలసి పనిచేయగలిగారు. వారి విశ్వాసం పొందగలిగారు. ఒక ఎన్నికలో ఠేంగ్డీ బాబాసాహెబ్‌ ‌తరఫు ఏజెంట్‌గా పనిచేశారు. ప్రబంధక్‌గా సేవ చేశారు. సంఘం చేస్తున్న హిందూ సమాజ సంఘటన గురించి వివరంగా చర్చించారు కూడా.  బాబాసాహెబ్‌ ‌గురించి ఠేంగ్డీ ఒక పుస్తకం రాశారు. భారత దేశ చరిత్రలో, సామజిక జీవితంలో దానికి సుస్థిర స్థానం ఉంది.

 చైనా కార్మిక సంఘాల సమాఖ్య ఆహ్వానం మేరకు 1985లో ఠేంగ్డీ ఆ దేశంలో పర్యటించారు. అప్పుడు కార్మిక రంగం గురించి ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని పెకింగ్‌ ‌రేడియో ప్రసారం చేసింది. అమెరికా, సోవియెట్‌ ‌రష్యా, తూర్పు యూరోప్‌ ‌కమ్యూనిస్ట్ ‌దేశాలన్నింటిలో ఆయన పర్యటించారు.

భారత ప్రభుత్వం ఠేంగ్డీకి పద్మభూషణ్‌ ‌పురస్కారం ప్రకటించింది. ఆ పురస్కారాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. నాటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాంకు ఆ విషయమే వినయ పూర్వకంగా లేఖ ద్వారా తెలియచేశారు.

‘పద్మభూషణ్‌ ‌వంటి పురస్కారంతో నన్ను సన్మానించదలచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

నిజాయితీగా ఆలోచించినప్పుడు నాకు అంతటి పాత్రత ఉన్నదా అనిపిస్తున్నది.

మీపట్ల నాకు ఎంతో గౌరవభావం ఉంది. అది మీరు ప్రస్తుతమున్న పదవి వల్ల వచ్చినది మాత్రమే కాదు. మీ మహోన్నతమైన, శ్రేష్టమైన వ్యక్తిత్వం వలన ఏర్పడినది.

ఎప్పటిదాకా పూజనీయ డా.హెడ్గెవార్‌, ‌పూజనీయ శ్రీ గురూజీని భారత రత్న పురస్కారంతో సన్మానించరో అప్పటిదాకా ఈ పురస్కారాన్ని స్వీకరించలేను.’

1989లో పూజనీయ డాక్టర్జీ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఉద్ఘాటన నాగ్‌పూర్‌లో జరిగింది. రాబోయే దశాబ్దంలో ప్రపంచమంతటా కమ్యూనిజం విఫలమవుతుంది. భగవాధ్వజ ప్రభావం పెరుగుతుందని ఠేంగ్డీ భవిష్యవాణి వినిపించారు. అంతా నిబిడాశ్చర్యంతో చూశారు. ఆ తర్వాత పరిణామాలకు చరిత్రే సాక్ష్యం.

బాకారం గోండ్‌ అనే హోటల్‌ ‌కార్మికుడు ఠేంగ్డీ బాల్య స్నేహితుడు. స్వాతంత్య్రోద్యమంలో వారిద్దరు కలసి పాల్గొన్నారు. ఠేంగ్డీ రాజ్యసభ సభ్యులైన తర్వాత ఆ బాల్య స్నేహితుడిని పిలిపించి, ఢిల్లీ అంతా చూపించారు. ప్రముఖులకు కూడా తన చిన్ననాటి స్నేహితుడని పరిచయం చేశారు. అలాగే ఢిల్లీ సౌత్‌ అవెన్యూలో బషీర్‌ అనే క్షురకుడు ఠేంగ్డీకి కేశ ఖండనం చేసేవాడు. వారిద్దరి మధ్య ఎంతో ఆత్మీయత. బషీర్‌ ‌దుకాణంలో ఒక మసీద్‌ ‌ఫోటో, పక్కనే ఠేంగ్డీ ఫోటో ఉండేవి. ఉత్తరప్రదేశ్‌ ‌నుండి చౌదరి సాహెబ్‌ అనే పార్లమెంట్‌ ‌సభ్యుడు ఠేంగ్డీ ఫోటో చూసి, ఆయన ఫోటో ఎలా పెట్టావు? ఆయన ఎవరో తెలుసా? సంఘం వాడాయన అని చులకనగా మాట్లాడారు. మీరు ఆయన్ని అవమాన పరుస్తారా! మీకు గడ్డం గీయనని పంపించేశారు బషీర్‌. అదీ ఠేంగ్డీ వ్యక్తిత్వం.

సంఘ్‌ ‌సింద్ధాంతాన్ని వివరించడంలో వారికి వారే సాటి. ఏ ఉపాసనా పధ్ధతితో నైనా మోక్షం సాధించవచ్చు. ఏ ఉపాసనా పధ్ధతీ లేకపోయినా సత్కర్మతో, సదాచారంతో అది పొందవచ్చు. కానీ మా ఉపాసన పధ్ధతి ద్వారా మాత్రమే మోక్షం పొందవచ్చునని చెప్పటం మానవతకే వ్యతిరేకమైనది, సంకుచితమైనది అనేవారు ఠేంగ్డీ.

మనమంతా వేర్వేరు, సంఘటితమవుదామన్న ఆలోచన సరియైనది కాదు . మనమంతా ఒకటే, కానీ వేర్వేరుగా కనపడుతున్నాం.

We are one entity but in different forms. See the underlying unity in Diversity.

సంఘం కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఒక వ్యక్తి గణవేష సమకూర్చుకుంటాడు. శాఖా కార్యక్రమాలలో పాల్గొంటాడు. అది అవసరమే. దానివల్ల అతడు శారీరకంగా, సాంకేతికంగా స్వయంసేవక్‌ అవుతాడు, కానీ, అది సరిపోదు. అతడు మానసికంగా, సిద్ధాంత పరంగా కూడా స్వయంసేవక్‌ ‌కావాలి అని ప్రబోధించేవారాయన.

comfort loving cadre, status concious leadership అయితే సంస్థ పతనమవు తుంది అని హెచ్చరించారు.

1968లో భాగ్యనగర్‌ ‌పర్యటనలో భాగంగా వారు శ్రీరామ్‌ ‌సాయం శాఖ గురుదక్షిణ ఉత్సవంలో పాల్గొన్నారు. మనం ఆర్జించేదంతా సమాజినిదే. తిరిగి సమాజానికి సమర్పించాలి. ఎలాగైతే గంగలో నీరు రెండు చేతులతో తీసుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తూ తిరిగి గంగలో పోసినట్టుగా అని వివరించారు. అలా ఎన్నో విషయాలకు ఎంతో సరళంగా ఉన్నాయనిపించే లోతైన భాష్యాలు చెప్పేవారు.

అత్యవసర పరిస్థితి (1975-1977)లో ఠేంగ్డీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి నేతృత్వం వహించారు. లోక్‌ ‌సంఘర్ష సమితిలో వారు క్రియాశీల సభ్యులు. రవీంద్రవర్మ అరెస్ట్ ‌తరువాత నుంచి దాదాపు ఆఖరి వరకు ఠేంగ్డీ సమితి బాధ్యతను నిర్వహించారు.

ప్రతిపక్షాలన్నీ కలసి జనతా పార్టీగా ఎన్నికలలో పోటీచేసి గెలిచే వరకు ప్రజాస్వామ్య పునరుద్ధరణ వరకు ఉద్యమాన్ని ఠేంగ్డీ సమన్వయం చేశారు. అందరినీ కలుపుకుని వెళ్లడంలో వారిది కీలకపాత్ర. అయితే ఒకసారి నిరంకుశత్వం పతనమై ప్రజాస్వామ్యం గెలవగానే ఠేంగ్డీజీ ప్రశాంతంగా తన మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌కార్యకలాపాలలో, మిగతా సామాజిక కార్యక్రమాలలో శక్తినంతా ధారపోసి పనిచేశారు.

వారి జీవితం, సంఘటనా కౌశలం, సైద్ధాంతిక వ్యాఖ్యానం మహా సముద్రాన్ని తలపిస్తాయి. ఎంతో లోతైన వారి మాటలను ఆధ్యయనం చేస్తూ, ఆలోచిస్తూ, నిరంతరం పనిచేస్తూ వారి రుణం తీర్చుకోవాలి.

    -వి. భాగయ్య : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహ సర్‌కార్యవాహ, కోల్‌కతా

About Author

By editor

Twitter
Instagram