పురాతన కాలం నుంచి ఇండోనేషియా భారతదేశంతో మరీ ముఖ్యంగా ఆంధప్రదేశ్, కళింగప్రాంతాలతో, సముద్రమార్గం ద్వారా సుసంపన్నమైన వ్యాపార సంబంధాలు కలిగి ఉండేది. శాతవాహనులు, కాకతీయుల కాలంలో సముద్ర వ్యాపారం అత్యున్నత స్థాయికి చేరింది. టక్కోలా, కెడా వంటి ఇండోనేషియా ఓడరేవులు నాటి భారతీయ నావికులకు ముఖ్య వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. ఇండోనేషియా భారత్ మధ్య గల వ్యాపార చారిత్రక సంబంధాలను గురించి చరిత్రకారులు, నేతలు ‘మా భాషలో సగం సంస్కృతం నుంచే వచ్చిందే, మా పేర్లు అనేకం సంస్కృత పేర్లే, అందుకే ఇంత సాన్నిహిత్యం ఉంది. మేం సహకార నాగరికతను ఆహ్వానిస్తాం’ అని అన్నారు.
భౌగోళిక సర్వే ప్రకారం ఇండోనేషియా దేశంలో మొత్తం 17,508 దీవులు ఉన్నాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రమాణాల ప్రకారం ఇండోనేషియా ప్రభుత్వం అధికారికంగా పేరు పెట్టి నమోదు చేసిన దీవుల సంఖ్య 16,671. వీటిలో ప్రధాన దీవులు సుమత్రా, జావా, బాలి, బోర్నియో (ఇందులో కొంతభాగం ఇండోనేషియా) సులవేసి, న్యూ గినియా, ఇండోనేషియా రాజధాని జకార్తా. ఇది జావాదీవిలో ఉంది కాని అది మునిగిపోతుందని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలడంవల్ల రాజధానిని బోర్నియోలోని ‘సు సంతారా’కు మారుస్తోంది.
ఈ ఆలయం (ప్రంబన్ త్రిమూర్తి), భారతదేశం -ఇండోనేషియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, నాగరిక సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది, అంటూ ఇండోనేషియా సాంస్కృతికశాఖ మంత్రి పేర్కొనడం గమనార్హం. పురాతన కాలంలో ఇండోనేషియా, భారతదేశం (ముఖ్యంగా ఆంధ్రా తీరం) మధ్య వర్ధిల్లిన ప్రసిద్ధ సముద్రయాన మార్గాలు, వాటి నావికులు ప్రధానంగా ప్రకృతి శక్తులపై ఎలా ఆధారపడేవారు. కళింగ, సుమత్రా మార్గం, నావికులు విశాఖపట్నం లేదా ఒడిశా తీరం నుండి ప్రయాణం ప్రారంభించి, బంగాళాఖాతం దాటి, అండమాన్ నికోబార్ దీవుల మీదగా ప్రయాణించి సుమత్రా చేరుకొనేవారు.
కృష్ణా గోదావరి డెల్టా మార్గం: ఆంధప్రదేశ్లోని మచిలీపట్నం,ఘంటసాల రేవుల నుండి ప్రయాణించి నేరుగా ఆగ్నేయాసియా దేశాలకు నౌకలు చేరేవి. మలక్కా జలసంధి సుమత్రా, మలేషియా, మధ్య ఉండటమే కాదు, ఇది సరుకు రవాణాకు అత్యంత కీలకమైనది. చైనా, ఇండోనేషియా, భారత్ను కలిపే ప్రధాన సముద్ర కూడలి. నాటి కాలంలో ఇంజన్లు లేవు కనుక, ఓడలు ప్రయాణించ డానికి గాలి దిశ (రుతు పవనాలు) చాలా ముఖ్యమైనది. ఒక పొడవాటి కర్రకు ఒక పొడవైన గుడ్డను కట్టి నిలబెట్టేవారు. గుడ్డ ఏ దిశగా ఎగురుతుందో దానిని బట్టి ఓడలు బయలుదేరేవి. ఆంధ్రాతీరం నుండి ఇండోనేషియాకు వెళ్ళాలంటే సుమారు 30 నుండి 45 రోజులు పట్టేది. తూర్పు గాలులు వీచేవి, ఓడలను ఇండోనేషియా వైపు నెట్టేవి. తిరుగు ప్రయాణం మే, జూన్ నెలలో వచ్చే నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉండేవి, పడమట గాలి ఓడలను భారత్ తీరాలకు చేర్చేవి. రుతు పవనాలు దిశ మారడానికి కొన్ని నెలల సమయం పట్టేది. అందువల్ల భారతీయ వ్యాపారులు ఇండోనేషి యాలోని శ్రీ విజయ సామ్రాజ్యంలో (సుమత్రా) రేవులో దాదాపు 5 నుండి 6 నెలలు బస చేయాల్సి వచ్చేది. వీరు ఈ కాలంలో అక్కడ సంస్కృతి, వ్యాపారాలను విస్తరించారు.
నావికులు నాడు ఉపయోగించిన ఓడలను ముఖ్యంగా శాతవాహన రాజులలో చివరి వాడైన యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ గుర్తుగల నాణాలు ఎక్కువగా ముద్రించాడు. దానిలో రెండు స్థంభాలు కలిగిన పెద్ద ఓడల గుర్తులు స్పష్టంగా కన్పిస్తాయి. ఈ నాణాలు దేశీయ వ్యాపారానికేగాక ఇండోనేషియా, రోమ్ వంటి దేశాలతో చేసిన వ్యాపారాలలో కూడా చలామణీలో వుండేవి.
ఓడల రకాలు
ద్విశృంగ ఓడలు (డబుల్ మాస్టెడ్ షిప్స్): ఇవి కూడా శాతవాహనులు చేసినవే. ఈ ఓడలు కూడా సుదూర ప్రాంతాలకు, ఇండోనేషియాకు ప్రధానంగా (సుమత్రా జావా) సముద్ర తీర ప్రాంతాలకు సరుకును చేరవేసేవి.
మధ్యమ ఓడలు: సాధారణ సముద్రతీర ప్రాంతాలకు (దేశీయంగా) సరుకును చేరవేసేవి.
సామాన్య ఓడలు: ఇవి సముద్రం నుండి నదులలోగల పడవలకు సరుకును చేర్చేవి.
శ్రీ విజయరాజ్యంపై చోళరాజైన మొదటి రాజేంద్రుడు 1025 సి.ఇ. ఆగ్నేయ ఆసియాలోని శ్రీ విజయ చక్రవర్తి సంగ్రామ విజయ తుంగవర్మన్ను ఓడించి బంధించాడు. దానికి కారణం చైనా-భారత్ మధ్య సిల్క్ రోడ్ వ్యాపార మార్గాలపె,• మలక్కా జలసంధిలో వర్తక నౌకలకు పదే పదే అడ్డంకులు సృష్టిస్తు న్నాడు. దీనితో, అండమాన్-నికోబార్ దీవులను కేంద్రంగా చేసుకొని శ్రీ విజయ రాజధాని పాలెం బాంగ్ను ముట్టడించాడు. తరువాత పనై మలయూర్, కడారం (నేటి మలేషియా) రేవులను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. ఆ తరువాత శ్రీ విజయరాజు చోళులకు కప్పం కట్టడానికి అంగీక రించాడు. తద్వారా మణిగ్రామం, అయ్యవోలేవంటి తమిళవర్తక సంఘాలు తమ వ్యాపారాన్ని విస్తరిం చాయి. ఇండోనేషియాను పరిపాలించిన ప్రధాన రాజవంశాలలో (హిందూ) శైలేంద్ర రాజవంశం ప్రముఖమైంది. వీరు ఆంధ్రాలోని శ్రీశైల ప్రాంతానికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. తారుమా నగర సామ్రాజ్యం. ఈ వంశంలో జయ సింహవర్మన్ తెలుగురాజుగా గుర్తింపు పొందాడు. మాతరం రాజవంశం, సంజయ రాజవంశం, మజాపాహిత్ సామ్రాజ్యం – వీరు ప్రధాన పాలకులు.
నేడు కూడా అంతర్జాతీయ సరుకు రవాణాకు కూడలిలాంటి మలక్కా జల సంధికి సమీపంలో ఇండోనేషియా వుంది. అక్కడ కొన్నేళ్ళుగా చైనా నౌకాదళ ఉనికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సముద్ర భద్రతకు సమిష్ఠిగా పరిశ్రమించడానికి, తీరరక్షక దళాల మధ్య సహకారాన్ని పెంపొందించు కోవడానికి ఢిల్లీ – జకార్తా అంగీకరించడం డ్రాగాన్ దుస్సాహాసాన్ని నిలువరించడానికి తోడ్పడుతుంది.
ప్రాచీన నౌకాయానం గురించి వివరించే అద్భుతమైన విజ్ఞానాన్ని తెలుగులో నౌకాశాస్త్రం లేక నావ శాస్త్రం అంటారు. వేల సంవత్సరాల క్రితమే భారతీయులు సముద్రాలపై సుదూరప్రాంతాలు ప్రయాణం చేసి ప్రపంచదేశాలతో వాణిజ్యం సాగించారు. ఇంగ్లీషు పదం ‘‘నావిగేషన్’’ సంస్కృత పదం ‘‘నౌగతి:’’ నుండి, అలాగే ‘నావీ’ అనే పదం నౌ అనే పదం నుండి పుట్టాయి.
ఆధునిక జి.పి.ఎస్. సాంకేతికత లేని రోజుల్లో దిక్కులు కనుగొనే పద్ధతులు (ఎ) నక్షత్రాల పరిశీలన, రాత్రి వేళల్లో ధ్రువ నక్షత్రం (పోల్స్టార్), ఇతర నక్షత్ర మండలాలను బట్టి దిక్కులను అక్షాంశాలను గుర్తించేవారు. దీనికోసం ‘‘వృత్తశంగ భాగ’• (సెక్ట్సాన్ లాంటి పరికరం) ను వాడేవారు. ఆకాశం మేఘావృతమై నక్షత్రాలు కనిపించకపోతే మరో పద్దతి ‘‘మత్స్య యంత్రం’’ వాడారు. దిక్కులు తెలుసుకోవడానికి దీనిని వాడేవారు. చింతపండుతో బాగా తోమిన రాగి పాత్రలో నువ్వుల నూనె పోసి దానిలో అయస్కాంత గుణమున్న ఇనుప చేపను పాత్రలో ఉంచగా అది ఉత్తర – దక్షిణ దిక్కులను చూపేది. వేరే పద్దతి పక్షులను గాలిలోకి వదిలేవారు. ఆ పక్షులు భూమి ఎటువైపు ఉంటే అటే ఎగిరిపోయేవి (ముఖ్యంగా కాకులను వదిలేవారు). రుతుపవనాల అవగాహన బాగా తెలిసుండాలి. అందుకే భారతీయు లకు సింధునాగరికతలోనే (కీ।।పూ।। 2500) లోథాల్ ఓడరేవు కలదు. ఆ సమయంలో రోమ్, ఈజిప్టు, గ్రీసు, ఇండోనేషియా, ఆఫ్రికా వంటి దేశాలతో పెద్ద ఎత్తున నౌకాయానం సాగింది. నాడే సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ముత్యాల, రత్నాలను ఓడల ద్వారా ఎగుమతి చేసారు.
ఇండోనేషియాలో వేలకొద్ది దేవాలయాలున్నాయి. వీటిని ‘‘పురా’’ అని పిలు స్తారు. భారతీయ సంస్కృతి పురాణాల ప్రభావంతో కీ।।శ।। 8-10 శతాబ్దం మధ్య నిర్మించిన పురాతన దేవాలయాలు జావా ద్వీపం లోనూ, దాదాపు 90 శాతం హిందువులు నివసించే బాలీ ద్వీపంలోనూ అత్యంత ప్రసిద్ధి చెందాయి. వీటిలో ప్రధానమైనది యోగ్యకర్తా నగరంలో 9వ శతాబ్దానికి చెందిన ప్రంబనన్ హిందూ దేవాలయం, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితం చేశారు. యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఈ ఆలయం ఆగ్నేయాసియాలోనే అత్యంత ప్రసిద్ధ, పురాతన హిందూ దేవాలయ సముదాయం. ఈ ఆలయాన్ని కీ।।శ।। 9వ శతాబ్దంలో (కీ।।శ।। 850 ప్రాంతంలో) జావా దీవిని పాలించిన సంజయ్ రాజవంశానికి చెందిన రాజులు నిర్మించారు. ఇది త్రిమూర్తుల ఆలయం ఈ సముదాయం అన్నింటికంటే మధ్యలో ఉండే ప్రధాన ఎత్తైన ఆలయం శివాలయం. స్థానికులు దీనిని ‘‘శివగృహ’’ అని పిలిచేవారు. హిందూ నిర్మాణ శైలి భారత్లోని హిందూ దేవాలయ విధానాన్ని అనుకరించారు. దీనిలో వందలాది ఉపాలయాలు ఉండేవి, కాని కాలక్రమేణా సరియైన పోషణ లేక, భూకంపాలు, అనేక ఇతర ప్రకృతి విపత్తుల వలన శిథిలమవ్వగా ప్రస్తుతం ప్రధాన ఆలయాన్ని పునరుద్ధరించారు.
రామాయణ శిల్పాలు ఆలయం లోపల రాతిగోడపై ఉన్నాయి. రామాయణం , కృష్ణలీలలకు సంబంధించిన కధలను ఎంతో అద్భుతంగా చెక్కించారు. సీతాపహరణం, హనుమంతుడు లంకను దహనం చేయడం వంటి ఘట్టాలు ఇక్కడ శిల్పాల రూపంలో కన్పిస్తాయి. ఇండోనేషియాలో రామాయణాన్ని ‘కకావిస్ రామాయణ’ అని పిలుస్తారు. నేడు ఈ ప్రదర్శనలు ఇండోనేషియన్, జావానీస్ లేదా బాలీస్ భాషల్లో జరుగుతాయి. ప్రధానంగా యోగ్యకర్తలోని ప్రంబనన్ దేవాలయం, బాలి ద్వీపంలో రామాయణ నాటకాలు ప్రదర్శితం అవుతాయి. అలాగే కేకక్ ఫైర్ డాన్స్’ బాలిలోని ఉలువతు ఆలయంలోను, వయాంగ్ కులిలో తెలుగు తోలుబొమ్మలాటతో రామాయణం కథ చెప్పుతారు. ఇండోనేషియాలో ప్రతీ వారు రామాయణ కథను వింటారు.
శివాలయంలోని ఉత్తర భాగంలో దుర్గాదేవి విగ్రహాన్ని స్థానికులు ‘‘రారా జోంగ్ గ్రాంగ్’’ (స్లెండర్ వర్జిన్) అని పిలుస్తారు. రారాజోంగ్ గ్రాంగ్ అంటే జావానీయులు భాషలో సన్నని నడుము గల కన్య అని అర్థం. ఈ విగ్రహం వెనుక ఒక రసవత్తరమైన ప్రేమ కథ ఉంది.
బాలి ద్వీపంలో ఉన్న అత్యంత పవిత్రమైన అతి పెద్ద, ముఖ్యమైన హిందూ దేవాలయ సముదాయం, అగుంగ్ పర్వతంలో గల గుడి సముదాయము. ఇక్కడ 86 కంటే ఎక్కువ విడి ఆలయాలు ఉన్నాయి. దీనిని స్థానికంగా ‘‘మదర్ టెంపుల్ ఆఫ్ బాలి’’ అని పిలుస్తారు. వీటిలో ‘‘పురా పెనతారన్ అగుంగ్’’ అనేది అతి పెద్ద ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం బాలీ హిందువుల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. 1963లో అగ్ని పర్వత విస్ఫోట నంతో లావా ప్రవహించి బాగా పాడైంది.
ఇండోనేషియాతో వ్యాపారం చేయాలంటే వ్యూహాత్మక మలక్కా, సుండా జలసంధిల గురించి తెలియాలి. మలక్కా, సుండా జల సంధులు ప్రపంచ కూడలి. భారతదేశం, చైనా, అరేబియా, రోమ్ దేశాలతో వ్యాపారం చేసే వారంతా మలక్కా జలసంధిని దాటాలి.
తెలుగు వ్యాపారస్తులు సుమత్రాలోని పాలెంబాగ్ శ్రీ విజయ సామ్రాజ్య రాజధానిగా, ప్రధాన ఓడరేవుతో వ్యాపారం చేసేవారు. ఘంటసాల, మోటుపల్లి రేవుల నుండి బయలుదేరిన ఓడలను పాలెంబాగ్ ఓడరేవులో నిలిపి సరుకు అమ్ముకునే వారు. శ్రీ విజయరాజు ఓడ దొంగల నుండి రక్షణ కల్పించి పన్ను వసూలు చేసేవాడు. భారతదేశం నుండి ఏనుగు దంతాలు, రంగురంగుల వస్త్రాలు తీసుకువెళ్ళేవారు. చైనా నుండి పట్టు, పింగాణి పాత్రలను తీసుకు వెళ్ళేవారు. సుగంధ ద్రవ్యాలతో వస్తు మార్పిడీ విధానంలో వ్యాపారం జరిగేది. వాతావరణం అనుకూలించకపోతే పాలెం బాగ్ రేవులోనే విడిది చేసేవారు.
శ్రీ విజయ కేవలం వ్యాపారం కేంద్రంగానేగాక గొప్ప విద్యాకేంద్రంగా కూడా విలసిల్లింది. ‘‘మువారోజింబి’’లోని బౌద్ద విద్యా కేంద్రంలో చైనా యాత్రికుడు ఇత్సింగ్ నలందా విశ్వవిద్యాలయంలో చేరే ముందు చాలాకాలం ఇక్కడ సంస్కృతం నేర్చుకున్నాడు. బోరోబుదూర్లో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ ఆలయం ఉంది. వైశాఖ పౌర్ణమిరోజు వేడుకలు జరుగుతాయి. ప్రపంచం నలుమూలల నుండి దీన్ని చూడ్డానికి భక్తులు వస్తారు. ఇంతకీ ఇండోనేషియా ముస్లిం దేశం. ఇండోనేషియా జాతీయ నినాదం ‘‘భిన్నేక తుంగల్ ఇల్’’ అంటే భిన్నత్వంలో ఏకత్వమని నేటికీ ఇండోనేషియాలో కన్పిస్తుంది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు