‌ప్రపంచ చరిత్రలో అక్షరం పాత్ర అత్యంత కీలకమైంది, విప్లవాత్మకమైంది. అక్షరం కేవలం భాషను రాసే సాధనం మాత్రమే కాదు. మానవ నాగరికత- సంస్కృతి, విజ్ఞానం, పరిపాలనలను తరతరాలకు అందించే పునాది. అక్షరాల ద్వారా విజ్ఞానం, సాహిత్యం, శాస్త్రీయ అంశాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, ఒక తరం నుండి మరో తరానికి వ్యాపిస్తాయి. మణిపూర్‌లో నిప్పురాజేసింది అక్షరమే. మణిపూర్‌ ‌కవిత్రయం దంగ్జం ఇబోపిషక్‌ ‌సింగ్‌, ఇబోంచసింగ్‌, ‌డబ్ల్యూ.రంజిత్‌ ‌వారి రచనలు మణిపూర్‌ ‌ప్రజలను రెచ్చగొట్టాయి. ఉదాహరణకు దంగ్జం గేయం-
ఇప్పుడీ నేపై / ఒక్కరూ బిగ్గరగా మాట్లాడుకో లేరు / ఒక్కరూ స్వేచ్ఛగా ఆలోచించుకోలేరు / చావాలనుకునే వారిని చావనీ / నీ వనరులను పిండేస్తున్న వారిని / మోసగిస్తూ, దొంగిలిస్తూ, బెదిరిస్తూ / ఏడు తరాలకోసం సంపద పోగేస్తున్న వారిని / వాళ్లని నీ కోసం చావనీ / నేనెందుకు చావాలి.
నీలకాంత సింగ్‌ ‌వ్రాసిన కవిత ‘పుట్టుకతో నేను జింకను / కానీ ఇప్పుడు పెద్దపులిగా మారాలని వుంది’ అయితే ఇక్కడ శాంతి కోసం పరితపించే కవులు కూడా లేకపోలేదు. ఇరోం చానూ షర్మి కవిత –
మరణించిన నా శరీరాన్ని / భూమిలో కుళ్లి కృషించిపోనీ / భావి తరాలకు అది కొంత ఉపయోగపడనీ / అక్కడ నుంచే ప్రపంచమంతా రాబోయే తరాలకు / నేను శాంతి పరిమళాల్ని వ్యాపింపచేస్తాను. నేల అదే – నేల కడుపులో దాగిన విత్తనాలు వేరు, పెరిగే పైరు వేరు, పండే పంట వేరు. కానీ పంచుకొని తీర్చుకోవాల్సిన క్షుధార్తి మాత్రం వొకటే. ఆకలి తీరాక ఆస్వాదించే కవిత్వ మాధుర్యం, దాని అనుభూతి ఒక్కటే. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ.
భారతదేశపు ఈశాన్య ప్రాంతాలైన అస్సోం, అరుణాచలప్రదేశ్‌, ‌మిజోరాం, మణిపూర్‌, ‌నాగాలాండ్‌, ‌మేఘాలయ, త్రిపురలను సప్త సోదరీమణులు ( 7 సిస్టర్స్ ) ‌ప్రాంతంగా పిలుస్తారు. ఈశాన్య భారతం మానవ పరిణామశాస్త్ర సంగ్రహా లయం. సుమారు 400 భాషలు, మాండలికాలు, 7వరకూ వర్గాలతో విభిన్న జాతుల ప్రజల మతాల సమ్మేళనం. భారతదేశ చరిత్రలో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన అంతగా కన్పించదు, దురదృష్టం.
సాహిత్య విషయానికొస్తే ఈశాన్య ప్రాంతానిది కేవలం సంఘర్షణ ప్రధానమైన సాహిత్యమే కాదు, ప్రాంతీయ అస్తిత్వం, సాంస్కృతిక మూలాలు, గత వైభవం మొదలైనవి బలంగా వేళ్లునికొని ఉన్నాయి. భక్తి ఉద్యమం మొదలుకొని, సంస్కరణ ఉద్యమాలు, వలసపాలన ప్రభావం క్రైస్తవం, ఆంగ్లభాష విస్తరణ, పశ్చిమ దేశాల ఆధునికత కూడా ఇక్కడ కన్పిస్తున్నాయి.
గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సహజంగానే మౌఖిక సాహిత్యం ఉంటుంది. తెగలు మాట్లాడుకునే భాషలకు సాహిత్యం, వ్యాకరణం, లిపి లేక పోయినా మౌఖిక సంపద ఉండకపోదు. మాటను పాటను నమోదు చేసుకునేందుకు శతాబ్దాల క్రితం ఏ విధమైన ధ్వని యంత్రాలు లేకపోయినా లిపి ద్వారా నిక్షిప్తం చేయగలిగారు. లిపి, రాత రానప్పుడు కూడా మనస్సుకు హత్తుకునే భావాల మూలంగా ఒకరి నుండి ఒకరికి జ్ఞాపకాల ద్వారా వచ్చిన సాహిత్యం దొరికింది. ప్రపంచ సాహిత్యంలో గ్రీకు హోమర్‌, ‌ఫిన్నిష్‌, ‌కలవెల, సుమేరియ బాబిలోనియన్ల గిల్‌గిమిష్‌ ‌లాంటి మహాకావ్యాలు లేకపోలేదు.
మణిపూర్‌ ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక అందమైన రాష్ట్రం. దీని రాజధాని ఇంఫాల్‌ ‌రత్నాల భూమిగా పిలిచే పచ్చని కొండలు లోయలతో కూడి మయన్మార్‌ ‌సరిహద్దులో ఉంది. ‘మెయితీ’ వీరి ప్రధాన భాష.
మణిపూర్‌కు ఉత్తరాన నాగాలాండ్‌, ‌దక్షిణాన మిజోరాం, పశ్చిమాన అస్సాం, రాష్ట్రాలు ఉన్నాయి. తూర్పున మాయన్మార్‌ ‌దేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. 1949 సెప్టెంబర్‌ 21, ‌మణిపూర్‌ ‌విలీన ఒప్పందంపై సంతకం చేసిన తరువాత అక్టోబరు 15, 1949లో భారత్‌ ‌యూనియన్‌లో భాగమైంది. తూర్పు స్విట్జర్లాండ్‌గా కూడా ఈ ప్రాంతాన్ని భావిస్తారు.
ప్రాచీన చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని గంధర్వ దేశంగా చెబుతారు. మహా భారతంలో మణిపూర్‌ ‌ప్రస్తావన ఉంది. అర్జునుడు మణిపూర్‌ ‌రాకుమారి చిత్రాంగదను వివాహమాడినట్టు, వారి కుమారుడే బభ్రువాహనుడు. గొప్ప సాహసి, యోధుడు. ఆగ్నేయాసియా దేశాలకు మణిపూర్‌ ‌ముఖద్వారం కావడంతో ఈ ప్రాంతంగుండా చైనా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక వ్యాపారాలు కొనసాగాయి. మణిపూర్‌లోని మోరే పట్టణం భారత్‌-‌మయన్మార్‌ ‌సరిహద్దుల్లో ఉంది. ఇది ఆగ్నేయాసియాతో వాణిజ్యానికి ప్రధాన కేంద్రం. ఆసియా హైవే మణిపూర్‌ ‌ద్వారా మయన్మార్‌కు అక్కడి నుండి థాయ్‌లాండ్‌, ఇతర ఆగ్నేసియా దేశాలతో అనుసంధానత ఉంది.
మణిపూర్‌లో కూకీ, మైతీ, నాగా, పంగల్‌, ‌మిజో లాంటి ప్రధాన తెగల విభిన్న సంస్క ృతులు, భాషలు గల ప్రాంతం. పోలో ఆటకు జన్మస్థలం. కీ।।శ।। 33వ సంవత్సరంలో ‘‘శంఖగ్బ’’ రాజు నుండి మొదలై 1949 వరకు చివరిరాజు బుధచంద్రవరకు 109మంది రాజులు పాలించారు. సమయానుకూ లంగా ఈ ప్రాంతం అనేక పేర్లతో గుర్తింపు పొందింది. అవి- సన్నలైపక్‌, ‌టిల్లీ కోక్తోంగ్‌ ‌పోయి రైలం, మితైలిపక్‌, ‌మైత్రబక్‌ ‌మొదలైనవి. 16వ శతాబ్దంలో సనహిహోన్‌ ‌హన్‌, 17‌వ శబాబ్దంలో గరీబ్‌ ‌నివాజ్‌, ‌బర్మా (మాయన్మార్‌) ‌లోనికి చొచ్చుకుని పోయి రాజ్యాన్ని విస్తరించారు. 18వ శతాబ్దంలో పాలించిన మహారాజా భాగ్యచంద్ర (1762-1798) బర్మా సేనలతో పోరాడి మాతృభూమిని జయప్రదంగా కాపాడుకున్న వీరుడు. అలాగే వైష్ణవ ప్రజాదరణకు కూడా కారకుడు. మణిపురి నృత్యంగా ప్రసిద్ది చెందినవారి శాస్త్రీయ నృత్యం ‘‘రాసలీల’’ సృష్టికర్తగా చరిత్రలో అతడు నిలిచిపోయాడు. అయితే 1891లో ఆంగ్లేయులతో ఖొంగోంలో పోరాడి ఓడిపోయాక 1947 వరకు పరాధీనమైంది.
మణిపూర్‌ ‌భాష టిబెట్‌ ‌జర్మన్‌ ‌భాష అయిన మైతైలోన్‌, ‌లేదా మీతై• భాష (ఏడు మండలి కాల మిశ్రమం) ఈ భాష మాట్లాడేవారు అస్సోం, మిజోరాం, త్రిపుర, బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌లో కూడా ఉన్నారు. మణిపురిలో వున్న 29 వివిధ తెగల మధ్య అది సంపర్కభాషగా గుర్తింపును పొందింది. దీని లిపి భాష విష్ణుప్రియ. మణిపురి, మయన్మార్‌, ‌బాంగ్లాదేశ్‌, ‌మేఘాలయ, అస్సాం, అరుణాచల ప్రదేశ్‌ల్లో కూడ ఈ భాష వాడుతున్నారు. బెంగాలీ లిపిలో ఉన్న విష్ణుప్రియ మణిపురిలో కూడా కొంత సాహిత్యం ఉంది. సుమారుగా 8వ శతాబ్దంలో మణిపూరి సాహిత్యం ప్రారంభమైంది. దీన్ని 3 కాలాలుగా విభజి స్తారు. ప్రాచీన కాలం 8వ శతాబ్ది నుండి 1074 వరకూ మౌఖిక జానపద గేయాలే నాటి సాహిత్యం. మధ్యయుగకాలం 1074 నుండి 1709 వరకు, ఆధునిక యుగం 1709 నుండి నేటి వరకు మణిపురేర్‌ ఇతిహాస 1890లో ముద్రితిమైంది.
మణిపూర్‌ ‌చరిత్రను మలుపు తిప్పింది గరీబ్‌ ‌నిహాజ్‌ను మహారాజ్‌ (1709-1748). ఇతని కాలంలోనే మైతీలను హిందూమతంలోనికి మార్చింది. అంతే కాక, 1709లో తూర్పు బెంగాల్‌ ‌నుండి వచ్చిన హిందూ ప్రచారకుడు శాంతిదాస్‌ ‌గోసైన్‌ ‌ప్రోద్బలంతో మైతీ రాత ప్రతుల్ని తగలబెట్టిం చాడు. మైతీ లిపిని సైతం బెంగాలీ లిపిలోనికి మార్చాడు. అప్పటి నుండి సంస్కృతం, బెంగాలీ, బ్రజ్‌ ‌బోలీల్లో నుంచి హిందూ కట్టుబాట్లు రావడం మొదలైంది. సంస్కృతం, బెంగాలీ నుండి ధార్మిక పౌరాణిక అనువాదాలు ఎక్కువయ్యాయి. కవి అంగోం గోపి (1710-1780) బెంగాలీ నుండి సంస్కృతం నుండి అనేక గ్రంధాలు కావ్యాలు అనువాదం చేశాడు.
అంగోం గోపి గంగాదాస్‌ ‌సేన్‌ ‌వ్రాసిన మహా భారతంలోని పరీక్షిత్‌ను బెంగాలీ నుండి అనువదిం చారు. ఉత్తర కాండను కూడా అనువదించారు, తరువాత యుబరాజ నబానంద రామకృష్ణ దాస్‌ ‌రాసిన విరా• పర్వాన్ని బెంగాలీ నుండి అనువదిం చాడు. 18వశతాబ్దం చివరిభాగంలో లాంగ్జామ్‌ ‌పరశురామ్‌ ‌బెంగాలీలో రాసిన మహాభారతంలోని గంగాదాస్‌ ‌రాసిన అశ్వమేధ పర్వాన్ని మైతేయి భాషలోకి అనువదించాడు. ఈ కాలంలో రాసిన మరో గొప్ప అనువాదం గోవింద మిశ్రపండిట్‌ ‌భగవత్‌గీతను పరశురాం అనువదం. అతడు పాంహీ బారాజు (1709-1748) ఆస్థానంలో పనిచేసేవాడు. 1940 నాటికి బెంగాల్‌ ‌నుండి చైతన్య మహాప్రభు నవ్య వైష్ణవవాదం మణిపూర్‌ ‌సాహిత్యంలోకి చేరింది. ఆంగ్లేయుల ఆక్రమణ తరువాత ఆంగ్లం కూడా వారి రాతల్ని ప్రభావితం చేసింది. ప్రకృతి ఆరాధన, మణిపూర్‌ ‌ప్రాభవాన్ని కీర్తించడం నాటి కవిత్వమైంది.
భారత స్వాతంత్రానంతరం చెప్పుకోదగ్గ కవి పద్మశ్రీ క్వైరక్పం చవొబసింగ్‌ (1895-1950) ‌దేశాభిమానం, మానవీయ దృక్పధం, సార్వత్రిక వాదం పునరావృతమవుతూ లంబం కమల్‌సింగ్‌ 1899-1934 ‌హిజం అంగం ఘల్‌ ‌సింగ్‌ (1892-1944)‌ల కవిత్వం వచ్చింది. మణిపూర్‌ ‌జానపద ప్రభావంతో అంగంఘల్‌ ‌సింగో వ్రాసిన 39 వేల చరణాల ‘‘ఖంబ దోయిభి షైరెంగ్‌ ‌మణిపూర్‌ ‌జాతీయ కావ్యంగా సర్వోత్తమమైనదిగా ప్రసిద్ది చెందింది.
అమలవుతున్న నరకానికి ఆశిస్తున్న స్వర్గానికి మధ్య గల వ్యత్యాసం, కవులు తమను తామే ప్రశ్నించుకుని తెలుసుకున్న జవాబులే కవిత్వం కావడం మొదలైంది. వాస్తవాలు, అసమ్మతి, అవిశ్వాసం, సంశయం, అర్ధం కాని అనిశ్చిత ప్రపంచంలో వ్యక్తుల ఔన్నత్యం సమాజంలో కవుల వస్తువులయ్యాయి. ఈ కోవలోని పండితుడే ఎలంగ్బం నీలకాంతసింగ్‌ (1927-2000). ‌హాస్యరసంతో మానవతావాదం మేళవించిన అశంగ్భం మీనాకేతన్‌ ‌సింగ్‌ (1906-1995) ‌దంగ్జం ఇబోపిషక్‌ ‌సింగ్‌ (1948). ‌తమకోసం తాము రాసుకుంటున్నట్లు కవిత్వం రాసారు. లైష్రం సమరేందర్‌సింగ్‌ (1925) ‌కవిత్వం ఈ కోవలోకే వస్తుంది.
మణిపురి కవిత్వంలో ఆధునికతకు బాటలు వేసిన ఇద్దరు ముఖ్యమైన కవులలో ఒకరు ఎలాగ్జాంమ్‌ ‌నీలకాంతసింగ్‌, ‌మరొకరు ఎల్‌.‌సమరేంద్ర సింగ్‌. ‌నీలకాంతసింగ్‌ ‌వ్రాసిన ‘ది లాఫ్‌ ఆప్‌ ఎ ‌గర్ల్’ ‌మణిపురి భాషలో బాగా పేరు తెచ్చింది. చట్లాసిన్‌, ‌కడైదానో ఇబాని తీర్థయాత్ర, పుక్నింగ్‌ ‌చెప్పుకోదగ్గ కవితా సంపుటాలు. ఇతర కవులకు వస్తే, హెచ్చ్. ‌నబదీప్చంద్ర (1897-1946) అషంగ్బం మీనకేతన్‌ ‌శింఘ్‌ (1906-1995) ఆర్‌.‌కె.శితల్జిత్‌ (1913-2008) ఆర్‌.‌కె.సురేంద్రజిత్‌ ‌సింగ్‌ (1925-1982) ‌ఖైరుద్దీన్‌ ‌చౌధురి (1934) యుంలెంబం ఇబొంచసింగ్‌ (1949) ‌మొదలైన వారు నాటి ప్రముఖ కవులు. అక్కడ కవియిత్రులు తక్కువేం కాదు. యుంలెంబం గంభిని దేవి (1945) ఆర్‌.‌కె.భుబోన్సన (1951) ఇలబంత యుమ్నం (1952) ఆరంభం ఓంగ్బి మెంచేబి (1955), రొబిన్‌ ఎస్‌.‌నగం గొం (1959) రఘు వైసంగ్దెం (1959) సరత్చంద్‌దియం (1961) బిరేంద్రజిత్‌ ‌నవొరెం (1962) క్షేత్రిమయుం రాజేన్‌సింగ్‌ (1968) ‌గంభిని సొరొక్కైబం(1971) నవొరెం బిద్యాసాగర్‌ (1972) ‌సగొల్సెం లంచెంబమై పై మొదలైనవారు ఈ సాహిత్యానికి వన్నె తెచ్చారు.
ఇప్పటి వరకూ మణిపురి సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు11 లభించాయి. వారు ఇతర రాష్ట్రాలవారితో పోటీ కంటే వారితో వారే పోటీపడి సమాజానికి మంచి సాహిత్యం అందిస్తున్నారు. ఒక మిత్రుడు అడిగాడు మన మాతృభాష తెలుగు సాహిత్యమే ఎవరూ పట్టించుకుని చదవడం లేదు. ఈశాన్య రాష్ట్రాల గురించి, వారి సాహిత్యం గురించి రాస్తే ఎవరు చదువుతారు అని. నిజమే ఝార్ఖండ్‌ ఆదివాసీ కవయిత్రి జసింత కర్కెట్ట ‘ఉరావ్‌’ ‌భాషలో వ్యక్తం చేసిన అభిప్రాయం.
నా మాతృభాష / అమ్మ నోటిలోనే / ఖైదీ అయిపోయింది / కలల భారం కింద / మాతృభాష నలిగి పోయింది.
ఈశాన్య భారతాన్ని ప్రాంతం, జాతి, భాష మైదాన దేశంలోని సాంస్కృతిక వైవిద్యాన్ని అర్ధం చేసుకొని దాన్ని కాపాడుకోవడానికి కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారివరకూ, గుజరాత్‌ ‌నుండి మణిపూర్‌ ‌వరకూ భిన్న కాలాల్లో వెళ్లి విరిసిన కవిత్వం దోహదపడుతుందని, ఈ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని నేను నమ్ముతాను. అందుకే ఈ నా మొదటి ప్రయత్నం బ్రిటిష్‌ ‌వారికి ఒక భాష, ఆ భాషలోని కొత్తదనం, గొప్పతనాన్ని తెలుసు కోవడం, ఆ విధంగా వారికి ఆ తర్వాత ఎంతగానో ఉపయోగపడింది. దాని మూలంగానే వారు భారతదేశంలోనికి సంపూర్ణంగా చొచ్చుకొని వచ్చి అన్నాళ్లు రాజ్యమేల గలిగారు. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి ఆదే నేల, అదే గాలి, అదే ఆకాశం, కాని భాషల విషయంలో బెధమెందుకు ‘మేరా భారత్‌ ‌మహాన్‌’.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.