1893లో చికాగో ప్రపంచ మతాల సభలో స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు భారత ఆధ్యాత్మిక ప్రపంచ దృక్పథాన్ని పరిచయం చేసిన ఒక శతాబ్దానికి పైగా గడిచిన తరువాత, ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఇటీవల పాశ్చాత్య ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఒక సారూప్య నాగరిక వాదనను పునరుజ్జీవింపజేసింది. హిందుత్వాన్ని రాజకీయ ద్వంద్వాలకు కుదించే ముద్రల ద్వారా కాకుండా బహుళత్వం, సార్వత్రిక ఆమోదం, వసుధైవ కుటుంబకం అనే సూత్రాల ద్వారా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చింది. డాక్టర్ మోహన్ భాగవత్ పాశ్చాత్య ప్రపంచానికి అందించిన సందేశం అనేక కారణాల రీత్యా అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఇది ప్రధానంగా హిందుత్వంలోని ‘అందరినీ కలుపుకుపోయే’ (సమ్మిళిత) స్వభావాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తుంది. అలాగే దీనికి ఉద్దేశపూర్వకంగా లేదా అనాలోచితంగా అంటగట్టిన అనేక అపోహలను సవాలు చేస్తుంది.
హిందుత్వ ఉగ్రవాదం వంటి పదబంధాల చుట్టూ ఒక కథనాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, హిందుత్వం వాస్తవానికి దేనిని సూచిస్తుందో, అంతకంటే ముఖ్యంగా దాని నాగరికతా తత్వం ఆచరణలో ఎలా వ్యక్తమైందో అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఈ సందేశం సారాంశం కొత్తదేమీ కాదు. 130 ఏళ్లకు పైగా క్రితమే, స్వామి వివేకానంద పాశ్చాత్య ప్రపంచం ముందు ఇటువంటి భావననే వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 11, 1893న చికాగోలో జరిగిన ‘ప్రపంచ మతాల సభ’ (World’s Parliament of Religions)లో స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై పరిచయం చేశారు. ఆయన ప్రసంగం భారతదేశం, దాని తాత్విక సంప్రదాయాల పట్ల ప్రపంచ దృక్పథంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. హిందూ ధర్మం ఇతరులను తిరస్కరించడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకునే ధర్మంగా కాకుండా, తన సొంత అస్తిత్వాన్ని కోల్పోకుండానే వైవిధ్యాన్ని స్వీకరించగల ఒక నాగరికతగా వివేకానంద దానిని ఆవిష్కరించారు.
“ప్రపంచానికి సహనాన్ని, విశ్వ ఆమోదాన్ని బోధించిన ధర్మానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను. మేము విశ్వ సహనాన్ని విశ్వసించడమే కాకుండా, అన్ని మతాలను సత్యంగా అంగీకరిస్తాము” అని ఆయన ప్రకటించారు. ఇవి కేవలం విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చెప్పిన దౌత్యపరమైన మాటలు కావు. అవి వేళ్లూనుకున్న నాగరిక ప్రపంచ దృక్పథాన్ని ప్రతిబింబించాయి. హింసను ఎదుర్కొంటున్న వర్గాలకు ఆశ్రయం కల్పించడంలో భారతదేశం పోషించిన చారిత్రక పాత్ర గురించి ప్రస్తావిస్తూ “భూమిపై ఉన్న అన్ని మతాలు, అన్ని దేశాలకు చెందిన పీడితులకూ, శరణార్థులకూ ఆశ్రయం కల్పించిన జాతికి చెందినందుకు నేను గర్విస్తున్నాను” అని అన్నారు. హిందుత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన కోణంగా ఉంటుంది. దీనిని తరచుగా సంకుచిత రాజకీయ దృక్కోణంతోనే వ్యాఖ్యానిస్తారు. కానీ దాని నాగరిక, తాత్విక పునాదులను విస్మరిస్తారు. హిందూ సంప్రదాయం చారిత్రాత్మకంగా బహుళ ఆలోచనా విధానాలను, ఆరాధనా రూపాలను, తాత్విక వ్యాఖ్యానాలను స్వీకరించింది. హిందూ సమాజంలోనే వైవిధ్యం ఉండటమే, భారతీయ నాగరికతలో సామాజిక సమైక్యతకు ఏకరూపత ఎన్నడూ ఏకైక ఆధారం కాదని నిరూపిస్తుంది. ఈ సూత్రం ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమే ఒక కుటుంబం) అనే ప్రాచీన భారతీయ భావనలో ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఆధునిక దౌత్యం కోసం సృష్టించిన నినాదం మాత్రమే కాదు. ఇది మానవాళిని వర్గాలు ,నాగరికతల మధ్య ఉండే శాశ్వత సంఘర్షణల కోణంలో కాకుండా, పరస్పర అనుసంధానత ద్వారా అర్థం చేసుకునే ఒక ప్రపంచ దృక్పథాన్ని సూచిస్తుంది. భారత్ తన G20 అధ్యక్షత కాలంలో ఈ నాగరికతా దృక్పథాన్ని ప్రముఖంగా చాటిచెప్పింది. “వసుధైవ కుటుంబకం – ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు” అనే ఇతివృత్తం, ఒక ప్రాచీన భారతీయ తాత్విక భావనను సమకాలీన ప్రపంచ వేదికపై కేంద్ర బిందువుగా నిలిపింది. అందుకే హిందుత్వ భావనను సరళమైన రాజకీయ ముద్రలకు అతీతంగా అర్థం చేసుకోవాలి. హిందుత్వాన్ని కేవలం ఒక ఎన్నికల నినాదంగా పరిగణిస్తే, దాని నాగరికతా కోణాలు చర్చ నుండి కనుమరుగవుతాయి. హిందుత్వంతో ముడిపడి ఉన్న విస్తృత భారతీయ భావన భారతదేశం గురించిన సాంస్కృతిక, నాగరికతా అవగాహనలో వేళ్లూనుకుంది. అది భూమిని ఒక ఉమ్మడి నివాసంగా గుర్తించి, విభిన్న నాగరికతా గుర్తింపును నిలుపుకుంటూనే బహుళత్వాన్ని గౌరవిస్తుంది. చికాగోలో స్వామి వివేకానంద చెప్పిన మాటలు నేటికీ సందర్భోచితంగా ఉన్నాయి. ఎందుకంటే అవి ఈ దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మేధోపరమైన చట్రాన్ని అందిస్తాయి. ఆయన ఆత్మవిశ్వాసం న్యూనతా భావం నుండి పుట్టలేదు. భారతదేశం తన నాగరికతా మూలాలను విడిచిపెట్టడం ద్వారా ఆధునికమవుతుందని ఆయన పాశ్చాత్య దేశాలకు చెప్పలేదు. దానికి బదులుగా, ఆయన భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రదర్శిస్తూనే, ఇతర సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఏకకాలంలో నొక్కిచెప్పారు. నాగరికతా ఆత్మవిశ్వాసం, సార్వత్రిక ఆమోదం అనే ఆ కలయిక, బహుశా సమకాలీన ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత ముఖ్యమైన కానుకలలో ఒకటిగా నిలిచిపోతుంది. నేడు, ప్రపంచ రాజకీయాలు ధ్రువీకరణ, గుర్తింపు సంఘర్షణలు, పోటీ నాగరికతా కథనాలతో అంతకంతకూ నిండిపోతున్న తరుణంలో, భారతీయ విధానం మరో అవకాశాన్ని అందిస్తోంది. వైవిధ్యం అనేది శాశ్వత సంఘర్షణకు మూలం కానవసరం లేదని ఇది సూచిస్తుంది. ఒక సమాజం ఇతరుల గుర్తింపులను, నమ్మకాలను గౌరవిస్తూనే తన సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోగలదు. అందువల్ల, ఆరఎసఎస్ నాయకత్వం నుండి వెలువడుతున్న సందేశాన్ని ఈ విస్తృత చారిత్రక, నాగరికతా సందర్భంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. హిందుత్వం అంటే ఏమిటి? భారత్ అనే భావన సమాజాన్ని, వైవిధ్యాన్ని, మానవత్వాన్ని ఎలా అర్థం చేసుకుం టుంది? అనే దానిపై కొనసాగుతున్న సంభాషణలో ఇది ఒక భాగమవుతుంది. హిందుత్వంను కేవలం హింస లేదా “ఉగ్రవాదం” అనే కోణం నుండే చిత్రీకరించడానికి ప్రయత్నించేవారు, ఈ మేధోపరమైన, చారిత్రక సంప్రదాయంతో కూడా గంభీరంగా మమేకం కావాలి. ప్రజాస్వామ్యంలో విమర్శ సమంజసమే. కానీ విమర్శతో పాటు, విమర్శకు గురవుతున్న తత్వం గురించిన నిజాయతీతో కూడిన చర్చ కూడా ఉండాలి.