భిన్నత్వం ఐక్యతకు నిదర్శనమని, మానవ సేవ దేశం శాశ్వత సంప్రదాయమని ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. ఆగస్టు 30న కెనడా, టొరంటోలో “హిందూ విశ్వ బంధు – స్నేహభావంతో ప్రపంచాన్ని ఆలింగనం చేసుకోండి” కార్యక్రమంలో వసుధైవ కుటుంబకం అనే భారత నాగరిక స్ఫూర్తిని ప్రముఖంగా ప్రస్తావిం చారు. “వసుధైవ కుటుంబకం అనే భావనను అంటే సమస్త భూగోళం ఒకే కుటుంబం అనే విశ్వాసాన్ని విశాల దృక్పథం, జ్ఞానం కలిగిన వారు అంగీకరి స్తారు. భౌతిక ప్రపంచంలోని వ్యక్తులు శరీరం, ఆకారం, రంగులపరంగా భిన్నంగా కనిపించిన ప్పటికీ, అంతర్గతంగా మనమందరం ఒక్కటే. కాబట్టి, ఇతరులకు సేవ చేయడం మన కర్తవ్యం. శాశ్వతమైన ఆనందాన్ని నిరంతర సంతృప్తిని కలిగించే జ్ఞానాన్ని మనం పొందాము” అని అన్నారు. ప్రపంచానికి సహాయపడటం, ఐక్యత అనే భారత్ అంతర్గత సంస్కృతిని ప్రధానంగా ప్రస్తావించారు. భిన్నత్వాన్ని ఎప్పుడూ కూడా ఐక్యత సహజ రూపంగానే భారత్ సంప్రదాయం భావిస్తుందని పేర్కొన్నారు. “ప్రపంచంలో ఎవరైనా సరే, భారత్‌ను సాయం కోరినప్పుడు అది ఎప్పుడూ నిరాకరించలేదు. పైగా, ఎవరూ అడగకపోయినా సరే భారత్ ఆపన్న హస్తం అందిస్తుంది. ఇదే మన సంప్రదాయం. ఇదే భారత్ డీఎనఏ. అందుకే ‘హిందువులు మేల్కొంటే, ప్రపంచం మేల్కొంటుంది’ అనే మాటను మీరు వినే ఉంటారు” అని అన్నారు. మానవాళి, ప్రకృతి మధ్య ఐక్యతను భారత ఆధ్యాత్మిక వారసత్వం ఎలా పెంపొందిస్తుందో మరింతగా వివరించారు. “వారు ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేనివాటిని రెండింటినీ తమవిగా భావిస్తారు… భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలని వారికి బోధించారు. అందుకే భారతదేశంలో భిన్నత్వం ఐక్యతకు ఎన్నడూ అడ్డంకి కాదు. భిన్నత్వంలో ఏకత్వం ఉండటమే కాకుండా, భిన్నత్వమే ఒక రకమైన ఐక్యత అని మన సంప్రదాయం మనకు బోధిస్తుంది,” అని అన్నారు. ప్రపంచమంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒకే కుటుంబం అనే అవగాహనతో కూడుకున్న ‘వసుధైవ కుటుంబకం’ అనే ప్రాచీన తత్వాన్ని స్వీకరించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. బాహ్య భేదాలను అధిగమించి, మానవాళి అంతర్లీన ఆధ్యాత్మిక ఐక్యతను గుర్తించడంలోనే నిజమైన జ్ఞానోదయం ఉందని అన్నారు. అంతేకాకుండా, భారత్ తన స్వభావరీత్యా మహాశక్తిగా కాకుండా విశ్వగురువుగా ఎలా మారిందీ వివరించారు.“ఒకానొక సమయంలో భారత్‌ను అగ్రరాజ్యం అని పిలవవచ్చు. కానీ అది అగ్రరాజ్యం కాదు. అది ప్రపంచానికి సేవ చేసింది. దాని స్వభావరీత్యా, అది మహాశక్తిగా కాకుండా విశ్వగురువుగా మారింది. కాబట్టి భారత్ ఎదుగుదల అంటే మరింత ఐక్యమైన, మరింత విముక్తి పొందిన మానవాళి అని అర్థం” అని అన్నారు.
అంతర్జాతీయ మానవతా సంక్షోభాల సమయంలో భారత్ ముందుకొచ్చిన చారిత్రక, సమకాలీన ఉదాహరణలను డాక్టర్ భాగవత్ గుర్తుచేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పోలిష్ శరణార్థులు ఎదుర్కొన్న దుస్థితిని ప్రస్తావిస్తూ, వారు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్ళే వరకు జామ్‌నగర్ మహారాజు వారికి ఆశ్రయం, రక్షణ కల్పించిన వైనాన్ని వివరించారు. సంక్షోభ సమయాల్లో సహాయం అందించే భారత్ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, “ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. ఇటీవల మధ్యప్రాచ్యంలో సంఘర్షణల సమయంలో ప్రజలను తరలించిన విషయాన్ని ప్రస్తావించారు. భారత సైనిక రవాణా విమానాలు కేవలం భారతీయ పౌరులనే కాకుండా, యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఇతర ఏడు దేశాల పౌరులను కూడా ఎలా రక్షించిందీ వివరించారు.
ప్రపంచానికి జ్ఞానాన్ని, నాగరికతకు సంబం ధించిన విలువలను అందించాలనే లక్ష్యం మన పూర్వికులకు ఉండేదని గుర్తుచేశారు. “చాలా కాలం క్రితం రోడ్లు, పడవలు, విమానాలు లేదా మోటారు వాహనాలు ఏమీ లేని, కేవలం ఎడ్లబళ్లు, గుర్రాలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో మన పూర్వికులు మెక్సికో నుంచి సైబీరియా వరకు ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు జ్ఞానాన్ని అందించారు. వారు కాలినడకన హిమాలయాలను దాటి చైనా, సైబీరియా, మంగోలియా ప్రాంతాలకు వెళ్లారు. చిన్న పడవల ద్వారా ఆగ్నేయాసియాకు చేరుకున్నారు. ఆ క్రమంలో వారు ఏ దేశాన్నీ జయించలేదు. ఎవరినీ మతమార్పిడి చేయలేదు. వారు ఎక్కడికి వెళ్లినా జ్యోతిషశాస్త్రం, ఆయుర్వేదం వంటి జ్ఞానాన్ని పంచారు, నాగరికతా విలువలను అందించారు” అని చెప్పారు. హిందూ తత్వ సారాంశాన్ని వివరిస్తూ, హిందూ గుర్తింపు అనేది సంకుచిత భాషా లేదా మతపరమైన పరిధులకంటే ఉన్నతమైనదని స్పష్టం చేశారు. “నేను ‘హిందువును’ అని అన్నప్పుడు, ఆ పదాన్ని ఏదైనా నిర్దిష్ట భాష, నిర్దిష్ట ఆరాధనా విధానం లేదా జీవనశైలి ద్వారా నిర్వచించలేము,” అని పేర్కొన్నారు. హిందువులు “అందరినీ గౌరవిస్తారని”. “అందరినీ అంగీకరిస్తా రని” తెలిపారు. “అన్ని దేశాలు వర్ధిల్లుతాయి. అభివృద్ధి చెందుతాయి. పరస్పరం సహకరించు కుంటాయి, మానవాళి అలాగే సృష్టి పురోగతికి తమ వంతు కృw చేస్తాయి అనేది హిందువులు కనే కల. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఒక పువ్వులా వికసించి, తన సువాసనను చుట్టూ ఉన్న వాతావరణం అంతటికీ పంచేలా మనం తయారవ్వాలి. తద్వారా మనం అభివృద్ధి చెందడమే కాకుండా, మానవ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేసేవారిగా మారాలి.
హిందువు జీవన విధానం ఇదే. ఒక వ్యక్తి ఎంతటి విజయం సాధించినప్పటికీ, తన కుటుం బానికి మేలు చేయకపోతే అతన్ని మంచి వ్యక్తిగా పరిగణించరు. అలాగే, ఒక కుటుంబం ఎంత సంపన్నమైనదైనప్పటికీ, అది తన గ్రామానికి మేలు చేయకపోతే దానిని మంచి కుటుంబంగా భావించరు. సైన్యానికి ఎంతోమంది ధైర్యవంతులైన జవాన్లను, సమాజానికి ఎంతోమంది సంస్కర్తలను అందించే గ్రామాలనే ఆదర్శవంతమైన గ్రామాలుగా పరిగణిస్తారు. ‘ఈ విశ్వమే నా ఇల్లు, నేనే విశ్వం, విశ్వమే నేను’ అని భావించే స్థాయికి తన ‘ఆత్మీయత’ పరిధిని విస్తరించుకున్న వ్యక్తి భారత్‌లో అత్యంత గౌరవనీయుడిగా నిలుస్తాడు. మన చరిత్రలో ఎంతోమంది రాజులు, వారి గాథలు ఉన్నాయి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన రాజు కథకే మనం అత్యంత విలువనిస్తాం. మీరు ఒక్క రాత్రిలోనే భగవాన్ రాముడిలా లేదా మన పూర్వికులలా మారిపోలేరు. అది సాధ్యం కాదు. కానీ నెలకు, వారానికి లేదా సంవత్సరానికి, మీకు కుదిరిన కాలవ్యవధిలో రెండు చిన్న అడుగులు వేయగలరు కదా? మిమ్మల్ని మీరు మరింత జ్ఞానవంతులుగా, సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఇలాంటి పనులు చేస్తూ సమాజంలో ఎంతోమంది జ్ఞానాన్ని వెదజల్లుతున్నారు” అని అన్నారు.
మానవాళిలోని అంతర్లీన ఐక్యతను గుర్తిస్తూనే, భిన్నత్వాన్ని స్వీకరించాలని డాక్టర్ భాగవత్ పిలుపునిచ్చారు. “మనం ఈ భిన్నత్వాన్ని సేవించాలి, అంగీకరించాలి, గౌరవించాలి. ఎందుకంటే ఇది ఐక్యతకు ఒక వ్యక్తీకరణ. ఇది దానికి అందాన్నిస్తుంది. ఇది ఒక అలంకరణ. మనం దానిని వేడుకగా జరుపుకుంటాము” అని అన్నారు. భారతదేశపు ప్రాచీన సంస్కృతి భిన్నత్వాన్ని సహజమైనదిగా గుర్తిస్తూ, ఐక్యతను ప్రాథమిక వాస్తవికతగా పరిగణిస్తుందని తెలిపారు. “వాస్తవికతకు వ్యక్తీకరణ అయిన ప్రకృతి భిన్నత్వంతో కూడుకున్నది. భిన్నత్వం సహజమైనది. ఐక్యతే వాస్తవికత. అదే భారతదేశపు ప్రాచీన సంస్కృతి,” అని తెలిపారు. “మన ప్రార్థనలన్నీ భారతదేశం అనే నేల నుండి ఉద్భవించాయని మనం చెబుతాము. కానీ అవి ఎప్పుడూ కేవలం భారతదేశం కోసం మాత్రమే కాదు. అవి మనకు తెలిసిన మొత్తం విశ్వం కోసం ఉన్నాయి” అని తెలిపారు.
హిందువులు, సిక్కుల విలువలు ఒకటే
హిందువులు, సిక్కులు వేర్వేరు ధర్మాలను అనుసరించవచ్చు, కానీ మేము ఒకే విలువలను, స్ఫూర్తిని పంచుకుంటాము అని సిక్కు నాయకుడు కశ్మీర్ సింగ్ ధాలివాల్ అన్నారు. కెనడాలోని టొరంటోలో జరిగిన ‘హిందూ విశ్వ బంధు – స్నేహంతో ప్రపంచాన్ని ఆలింగనం చేసుకోండి’ కార్యక్రమంలో, ఆరఎసఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, కెనడా మాజీ రక్షణ మంత్రి అల్బెర్టా, మాజీ ప్రధాని జాసన్ కెన్నీల సమక్షంలో హిందువులు, సిక్కుల ఉమ్మడి వారసత్వం, విలువలు, సామాజిక బంధాల గురించి కశ్మీర్ సింగ్ ధాలివాల్ మాట్లాడారు. ఉత్తర అమెరికా యునైటెడ్ సిక్కు, హిందూ సంఘం (USAHA) తరపున ఈ రోజు మాట్లాడటం నాకు దక్కిన గౌరవం.హిందువులు, సిక్కులు వేర్వేరు ధర్మాలు, సంప్రదాయాలను అనుసరించవచ్చు, కానీ మనం ఒక అమూల్యమైన విషయాన్ని పంచుకుంటాము. మనం భాషలు, ఆహారం, సంగీతం, కుటుంబ సంప్రదాయాలు, పండుగలు, విలువలు అన్నింటికంటే ముఖ్యంగా, సమాజ సేవ స్ఫూర్తిని పంచుకుంటాము” అని తెలిపారు. “మా పూర్వికులు కెనడాకు వచ్చినప్పుడు, వారు కేవలం హిందువులుగా లేదా సిక్కులుగా మాత్రమే కాకుండా, భారతీయులుగా, పంజాబీలుగా, దక్షిణాసియా వాసులుగా వచ్చారు. మా విశ్వాసాన్ని ఆచరించడానికి, మా వారసత్వం పట్ల గర్వంతో మా పిల్లలను పెంచడానికి కెనడా మాకు స్వేచ్ఛను ఇచ్చింది. ఈ రోజు, కెనడా బహుళ సాంస్కృతిక సమాజానికి అత్యధికంగా దోహదపడే వర్గాలలో హిందూ, సిక్కు వర్గాలు ఉన్నాయి,” అని చెప్పారు. “ప్రపంచంలోనే అత్యంత పురాతన బహుళ సాంస్కృతిక దేశమైన భారతదేశంలో జన్మించి, ప్రపంచంలోనే అత్యంత నూతన బహుళ సాంస్కృతిక దేశమైన కెనడాలో నివసిస్తున్నందుకు మేము నిజంగా గర్వపడుతున్నాము” అని అన్నారు. “మా మొదటి గురువు గురునానక్ దేవ్ జీ, ‘హిందువు లేడు, ముస్లిం లేడు’ అనే గొప్ప మాటను పలికారు. ముందు మనిషి, ఆ తర్వాతే హిందువు, ముస్లిం, సిక్కు లేదా క్రైస్తవుడు” అని తెలిపారు. “ఆయన కులం, రంగు, మతం, లింగ వివక్షను తీవ్రంగా ఖండించారు. కెనడాలోని మా యువత పట్ల మాకు ఎంతో గర్వంగా ఉంది. వారు కులం, రంగు, మతం, లింగపరమైన అడ్డంకులను ఛేదించి, వివిధ వర్గాల మధ్య కొత్త అనుబంధాలను ఏర్పరుస్తారు. మా యువత గురించి మాకు నిజంగా గర్వంగా ఉంది” అని చెప్పారు.
పంజాబీ భాషలోకి మారుతూ “హిందూ, సిక్కు ధర్మాల గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ నా పాఠశాల గోడల నుండే నేర్చుకున్నాను. అక్కడ ‘సభే సంజీవాల్ సదాయిన’ (అందరూ భాగస్వాములే), ‘కోయి నా దిసై బాహరా జియో’ (ఎవరూ పరాయివారు కారు), ‘మానస్ కి జాత్ సభై ఏకై పెహచాన్బో’ (మానవ జాతి అంతా ఒక్కటే అని గుర్తించాలి), ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమే ఒక కుటుంబం) వంటి వాక్యాలు రాసి ఉండేవి.” అని ధాలివాల్ అన్నారు. ఇవన్నీ సమానత్వం అనే ఒకే సందేశాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. “ఒక పసిబిడ్డకు మొదటగా ‘నువ్వు ఒక మనిషివి’ అని నేర్పిస్తే, నేడు మతాలు, కులాలు, భాషల పేరుతో జరుగుతున్న ఘర్షణలకు ముగింపు పలకవచ్చు” అని అభిప్రాయపడ్డారు. “భారతదేశంలో జన్మించడం మన అదృష్టం. భారతదేశం మన మాతృభూమి. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం” అని చెప్పారు. ప్రస్తుతం తాము కెనడాలో నివసిస్తున్నామని, విస్తీర్ణంపరంగా ఇది కూడా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటని పేర్కొన్నారు. “ఈ రెండు దేశాలతో మనకున్న సంబంధాల పట్ల మనం గర్వపడాలి” అని అన్నారు. భారతదేశం చుట్టుపక్కల అనేక దేశాలలో కత్తులు, కర్రలు లేదా తుపాకుల ద్వారా ప్రభుత్వాలు మారుతుంటాయని ధాలివాల్ పేర్కొన్నారు. దీనికి భిన్నంగా, “మన దేశంలో ప్రజలు తమ ఓటు బటన్‌ను నొక్కడం ద్వారా ప్రభుత్వాలను మారుస్తారు” అని అన్నారు. “మన దేశంలో ప్రజాస్వామ్యం ఉండటం, మనం ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తుండటం నిజంగా మన అదృష్టం” అని తెలిపారు.
– జాగృతి డెస్క్