నేటి వేగవంతమైన, సాంకేతిక విప్లవ కాలంలో గురుశిష్యుల సంబంధం కేవలం ‘బోధన-అభ్యాసన’కు మాత్రమే పరిమితం కాకూడదు. శిష్యుడు గురువు అనుభవాన్ని, గురువు శిష్యుడి ఆలోచనలను, సందేహాలను గౌరవించాలి.  అప్పుడే ఆరోగ్యకరమైన చర్చకు తావుంటుంది.

విద్యావ్యవస్థలో గురుశిష్యుల బంధం ఆదర్శవంతంగా లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మారుతున్న సామాజిక పోకడలు, ఆర్థికపరమైన మార్పులు ఈ పవిత్రమైన బంధాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చాలా విద్యాసంస్థలు కేవలం లాభాపేక్షతో నడుస్తున్నాయి. గురువు ఒక ‘ఉద్యోగి’గా, శిష్యుడు ఒక ‘కస్టమర్‌’‌గా మారిపోతున్నారు. ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి మాకు కావలసింది లభించాలి అనే ధోరణి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. దీనివల్ల గురువు పట్ల ఉండాల్సిన భక్తిశ్రద్ధలు తగ్గుతున్నాయి. విద్యావ్యవస్థ కేవలం ర్యాంకుల చుట్టూ తిరుగుతోంది. సిలబస్‌ ‌పూర్తి చేయడం, మంచి ఫలితాలు రాబట్టడంపైనే గురువు దృష్టి పెడుతున్నారు. విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సమయం వారికి దొరకడం లేదు. విద్యార్థులు కూడా మార్కుల కోసం పడే ఆరాటంలో గురువు నుండి నేర్చుకోవాల్సిన ‘జీవన నైపుణ్యాలను’ విస్మరిస్తున్నారు.

స్నేహపూర్వక మార్గదర్శనం

గురువు కేవలం పుస్తకాల్లోని పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు, ఒక దిక్సూచిగా ఉండాలి. విద్యార్థి మానసిక స్థితిని అర్థం చేసుకుని, వారిలోని సృజ నాత్మకతను వెలికితీయాలి. గురువును ఒక స్నేహితుడిగా భావిస్తూనే, శిష్యుడు క్రమశిక్షణను విస్మరించకూడదు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం అపరిమితంగా అందుబాటులో ఉంది. గురువు తాను కూడా నిరంతరం నేర్చుకుంటూ కొత్త విషయాలను విద్యార్థులకు పరిచయం చేయాలి. శిష్యుడు కేవలం మార్కుల కోసం కాకుండా, విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల బంధం ఎంత పవిత్రమైనదో వివరించడానికి ఎన్నో అద్భుతమైన పురాణ పాత్రల ఉదాహరణలు ఉన్నాయి. వారిలోని నిబద్ధత, త్యాగం, నేర్చుకోవాలనే తపన నేటికీ మనకు ఆదర్శం.

విశ్వామిత్రుడు – శ్రీరాముడు

(ఆజ్ఞాపాలనకు నిదర్శనం)

విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం దశరథుడి అనుమతి తీసుకుని రాముడిని తీసుకువెళ్తాడు. దారి పొడవునా విశ్వామిత్రుడు చెప్పే కథలను వింటూ, ఆయన నేర్పిన అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకుంటూ రాముడు గొప్ప శిష్యుడిగా మెలిగాడు. గురువు ఆజ్ఞ మేరకు తాటకను సంహరించడం, యాగ రక్షణ చేయడం ద్వారా శిష్యుడికి ఉండాల్సిన బాధ్యతను రాముడు చాటిచెప్పాడు.

శ్రీకృష్ణుడు – సాందీపని మహర్షి

(వినయానికి నిదర్శనం)

సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు సకల విద్యలు తెలిసినవాడైనా, సాధారణ మానవుడిలా సాందీపని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు.ఎంతటి గొప్ప వారైనా గురువు ముందు వినయంగా ఉండాలని, గురుసేవ చేయడం ద్వారానే విద్య సంపూర్ణమవు తుందని ఈ ఉదాహరణ నేర్పుతుంది. గురువు అడిగిన ‘గురుదక్షిణ’ (మరణించిన గురుపుత్రుడిని తిరిగి తీసుకురావడం) కోసం కృష్ణుడు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు.

ద్రోణాచార్యుడు – అర్జునుడు – ద్రుపదుడు

ద్రోణాచార్యుడికి అర్జునుడంటే అమితమైన ప్రేమ. అర్జునుడి ఏకాగ్రతను చూసి, అతడిని ప్రపంచంలోనే ‘‘అజేయ విలుకాడు’’గా చేస్తానని ద్రోణుడు మాట ఇస్తాడు. విలువిద్య పూర్తి కావచ్చాక, ద్రోణుడు పాండవులను గురుదక్షిణగా ‘పాంచాల రాజు ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మని’ కోరతాడు. ద్రుపదుడిని ఓడించడం కౌరవుల వల్ల కాదు. కానీ అర్జునుడు తన యుద్ధ నైపుణ్యంతో ద్రుపదుడిని బంధించి ద్రోణుడి పాదాల చెంత నిలబెడతాడు. ద్రోణుడు ద్రుపదుడిని అవమానించ కుండా, తన పాత స్నేహాన్ని గుర్తు చేస్తూ.. ద్రుపదుడి రాజ్యంలో సగాన్ని (దక్షిణ పాంచాలం) తాను తీసుకుని, మిగిలిన సగాన్ని ద్రుపదుడికి తిరిగి ఇస్తాడు.ఈ అవమానాన్ని భరించలేని ద్రుపదుడు, ద్రోణుడిని చంపే కుమారుడు, అర్జునుడిని వివాహం చేసుకునే కుమార్తె కోసం ‘పుత్రకామేష్టి’ యజ్ఞం చేస్తాడు. అలా దృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మిస్తారు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు అబద్ధం (అశ్వత్థామ హతః) చెప్పిన సందర్భంలో ద్రోణుడు ఆయుధాలు త్యజించగా, దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తలనరికి చంపుతాడు.ఒకరి అవమానం మరొకరికి పగగా, ఆ పగ శిష్యుడి ద్వారా ప్రతీకారంగా మారి.. చివరికి వంశాల వినాశనానికి దారితీసిన ఘట్టం ఇది.

ద్రోణాచార్యుడు – ఏకలవ్యుడు

(గురుభక్తికి నిదర్శనం)

ఏకలవ్యుడు ప్రత్యక్షంగా ద్రోణాచార్యుడి దగ్గర విద్యను అభ్యసించకపోయినా, ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించుకుని విద్యను నేర్చుకున్నాడు. గురువు పట్ల అచంచలమైన విశ్వాసం ఉంటే ఏదైనా సాధించ వచ్చని ఏకలవ్యుడు నిరూపించాడు. ద్రోణుడు, గురుదక్షిణగా ఆతని కుడిచేతి బొటనవేలును అడిగినా ఏ మాత్రం సంకోచించకుండా సమర్పించడం అతని నిస్వార్థ గురుభక్తికి నిదర్శనం.

పరశురాముడు- కర్ణుడు

(విద్య పట్ల తపనకు నిదర్శనం)

కర్ణుడు అబద్ధం చెప్పి విద్యను నేర్చుకున్నప్పటికీ, గురువు పట్ల అతను చూపిన సహనం అమోఘం. గురువు (పరశురాముడు) తన తొడపై తలపెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు, ఒక కీటకం కర్ణుడి తొడను తొలుస్తున్నా గురువు నిద్ర చెడకూడదని ఆ నొప్పిని భరించిన ధీశాలి కర్ణుడు. ఇది గురువు పట్ల శిష్యుడికి ఉండే సహనాన్ని, భక్తిని సూచిస్తుంది.

శుక్రాచార్యుడు- కచుడు

శుక్రాచార్యుడు-కచుడి కథ కేవలం గురుశిష్యుల బంధమే కాదు, అది వారి ధర్మనిరతికి నిలువుటద్దం. శుక్రాచార్యుడు రాక్షస గురువు. కచుడు తన శత్రువులైన దేవతల పక్షానికి చెందినవాడని, ‘మృతసంజీవని’ విద్యను తెలివిగా నేర్చుకోవడానికి వచ్చాడని తెలిసినా, ధర్మాన్ని అనుసరించి, కచుని శిష్యునిగా స్వీకరించాడు. ఆతని కులం లేదా జాతిని చూడకుండా విద్యాదానం చేయడం ఆయనలోని నిష్పాక్షిక ధర్మానికి నిదర్శనం. మృతసంజీవని విద్యను సాధించిన మొట్టమొదటి వ్యక్తి శుక్రాచార్యుడు (భృగు మహర్షి కుమారుడు). పరమశివుడిని మెప్పించి, ఘోరమైన తపస్సు చేసి ఈ విద్యను వరంగా పొందాడు. యుద్ధంలో మరణించే రాక్షసులను ఆయన ఈ విద్యతో తిరిగి బతికించేవాడు. దేవతలకు విజయం లభించడం కష్టమయ్యేది. శుక్రాచార్యుడు ఈ విద్యను దుర్వినియోగం చేయకుండా ఉండేం దుకు, పరమశివుడు కొన్ని కఠిన నిబంధనలను కూడా విధించాడని పురాణాలు చెబుతాయి. ఇది కేవలం ధర్మబద్ధంగా, గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. శరీరం పూర్తిగా నశించిపోకముందే (అంటే ఆత్మ శాశ్వతంగా విడిచిపోకముందే) ఈ మంత్రాన్ని ప్రయోగించాలి. కచుడు తన గురువు కడుపులో ఉండి కూడా ఈ మంత్రాన్ని గ్రహించడం ఒక విశేషం.

‘మృతసంజీవని’ అంటే కేవలం చనిపోయిన శరీరాన్ని బ్రతికించడం మాత్రమే కాదు. అజ్ఞానంలో ఉన్న మనిషిని జ్ఞానంతో చై••తన్యవంతుడిని చేయడం, అంటే ‘‘మృత్యోర్మా అమృతంగమయ’’ (మృత్యువు నుండి అమరత్వానికి) నడిపించే విద్య అని కూడా అర్థం. కచుడు ఏళ్లపాటు ఎంతో నిష్టతో, వినయంతో గురుసేవ చేశాడు. శుక్రాచార్యుడు అతడిని తన సొంత కొడుకులా ప్రేమించి విద్యను బోధించాడు. కచుడు సంజీవని విద్య నేర్చుకుంటే తమకు ప్రమాదమని గ్రహించిన రాక్షసులు అతడిని చంపడానికి ప్రయత్నించారు. మొదటిసారి కచుడిని చంపి అడవిలో పడేశారు. శుక్రాచార్యుడు తన విద్యతో బ్రతికించాడు. రెండోసారి కచుడిని చంపి, కాల్చి, ఆ బూడిదను సముద్రంలో కలిపారు. శుక్రాచార్యుడు మళ్లీ బ్రతికించాడు. వ•డోసారి రాక్షసులు అత్యంత క్రూరంగా ఆలోచించి, కచుడిని చంపి, కాల్చి, ఆ బూడిదను శుక్రాచార్యుడు తాగే ‘సుర’లో కలిపారు. శుక్రాచార్యుడు తన జ్ఞాననేత్రంతో కచుడు తన కడుపులోనే ఉన్నాడని గ్రహించాడు. ఈ ధర్మసంకటంలో శుక్రాచార్యుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన కడుపులో ఉన్న కచుడికి మృతసంజీవని మంత్రాన్ని ఉపదేశించాడు. గురువుగా విద్యను అతడికి ఉపదేశించి, తాను మరణించడానికి సిద్ధపడ్డాడు. శిష్యుడిని బతికించా లంటే గురువు చనిపోవాలి. తన ప్రాణం కంటే శిష్యుడికి ఇచ్చిన మాట (విద్య నేర్పడం) ముఖ్యం అని భావించాడు. కచుడు గురువు కడుపు చీల్చుకుని బయటకువచ్చి,తిరిగి అదే మంత్రంతో శుక్రాచార్యుని బతికించాడు.

కచుడు రెండు సందర్భాల్లో గొప్ప ధర్మనిరతిని కనబరిచాడు. విద్య నేర్చుకుని వెళ్లిపోకుండా, తనకు జన్మనిచ్చిన (గురువు కడుపులోంచి వచ్చాడు కాబట్టి) తండ్రిని కాపాడుకోవడం ద్వారా శిష్య ధర్మాన్ని నెరవేర్చాడు. విద్య పూర్తయ్యాక కచుడు వెనుతిరుగు తుంటే, శుక్రాచార్యుని కుమార్తె దేవయాని తనను వివాహం చేసుకోమని కోరుతుంది. ‘గురువు కడుపులో పుట్టాను, కాబట్టి నువ్వు నాకు సోదరివి అవుతావు’ అనడం అతని ధర్మనిరతికి పరాకాష్ఠ. అందుకే వీరిద్దరూ ఆదర్శ గురుశిష్యులుగా నిలిచిపోయారు.

సాంకేతికత ఎంత పెరిగినా మనిషికి సంస్కారం ముఖ్యం. గురువు తన ప్రవర్తన ద్వారా శిష్యుడికి ఆదర్శంగా నిలవాలి. శిష్యుడు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తాను నేర్చుకున్న విద్యను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తూ గురువు మార్గం చూపిస్తే, శిష్యుడు ఆ మార్గంలో పయనిస్తూ కొత్త శిఖరాలను అధిరోహించాలి. వీరిద్దరి మధ్య ఉండే నమ్మకమే రేపటి సమాజానికి పునాది.

సాంకేతికత – సమాచార విస్ఫోటనం

ఒకప్పుడు జ్ఞానానికి గురువే ఏకైక వ•లం. కానీ నేడు గూగుల్‌, •••ట్యూబ్‌ ‌తదితర సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ‘ అన్నీ తెలుసు, గురువు అవసరం లేద’నే భావం శిష్యులలో పెరుగుతోంది.సమాచారం లభిస్తోంది కానీ, ఆ సమాచారాన్ని జ్ఞానంగా (ఔఱ•శీఎ) మార్చుకునే పద్ధతిని నేర్పే గురువు విలువను విద్యార్థులు గుర్తించలేక పోతున్నారు. గురువులు విద్యార్థులను మందలించడానికి భయపడే పరిస్థితి ఉంది.

ఈ పరిస్థితి మారాలంటే…

కేవలం వ్యవస్థను నిందిస్తే సరిపోదు. మార్పు రెండు వైపుల నుండి రావాలి. పరీక్షల ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, బయట ప్రభావాలు – ఇవన్నీ పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే గురువులు విద్యార్థులతో కేవలం పాఠాలకే పరిమితం కాకుండా, వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే మార్గదర్శకుగా మారాలి. గూగుల్‌ ‌సమాచారాన్ని ఇస్తుంది కానీ, అనుభవాన్ని ఇవ్వదని శిష్యులు గ్రహించి గురువుకు తగిన గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పనితీరులో అతిగా జోక్యం చేసుకోకుండా, గురుశిష్యుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పడేలా సహకరించాలి. యాప్‌లు, ర్యాంకులు మాత్రమే కాకుండా, ప్రశాంత వాతావరణం కూడా ముఖ్యం.

తరిగొప్పుల విఎల్లెన్‌ ‌మూర్తి
8008577834

 

About Author

By editor