ఆంధప్రదేశ్‌ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా మే 15వ తేదీన భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశీయంగా ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ల అభివృద్ధి, తయారీకి మార్గం సుగమం కానుంది. పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు అనకాపల్లి జిల్లాలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నావల్ సిస్టమ్స్ యూనిట్, కర్నూలులో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ సహా మొత్తం రూ.4,145 కోట్ల విలువైన మరో 12 రక్షణ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. రక్షణ శాఖ ఏర్పాటు చేసిన పరిశోధనా పరికరాలను పరిశీలించారు.
దేశం రక్షణ రంగంలో స్వయం శక్తిగా ఎదుగు తోందని, గతంలో దేశ రక్షణ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆ దిశలో ముందుకెళుతున్నామని అన్నారు. ‘2014 వరకు దేశంలో రక్షణ ఉత్పత్తులు రూ.46 వేల కోట్లు మాత్రమే ఉండేవి. 2024 సంవత్సరానికి రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి. వచ్చే నెలకు అవి రూ.1.75 లక్షల కోట్లకు చేరతాయి’ అని వివరించారు. దశాబ్దం కిందట రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.400 కోట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు రూ.40 వేల కోట్లకు చేరాయని చెప్పారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ పరిశోధన సంస్థ ఐదోతరం యుద్ధ విమానాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ‘ఏఎంసీఏ’ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15,000 కోట్లు కేటాయించింది. ఇందులో డీఆర్‌డీఓ అనుబంధ సంస్థ ‘ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ’ పరిధిలో రూ.2,000 కోట్లతో ఏర్పాటయ్యే ‘కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్’ ఓ కీలక భాగంగా ఉంటుంది. గగనతలంలోకి ఐదో తరం యుద్ధ విమానాలను ప్రవేశపెట్టగల ప్రపంచం లోని అరుదైన ప్రదేశాల జాబితాలో పుట్టపర్తి కూడా స్థానం సంపాదిస్తుంది. శత్రువును రెప్పపాటులో మట్టుపెట్టే సామర్థ్యం కలిగిన అత్యాధునిక యుద్ధ విమానానికి ఇదొక జన్మభూమిగా మారుతుంది’ అని రాజ్‌నాధ్ సింగ్ అభివర్ణించారు.
విశాఖలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యాన సముద్ర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే అండర్ వాటర్ వెహికల్ రూపొందనున్నాయని రక్షణమంత్రి చెప్పారు.కర్నూలులో ఏర్పాటు చేయబోయే డ్రోన్ సిటీ రాబోయే సాంతికాభివృద్ధిలో ఎంతో కీలకం కానుందని తెలిపారు. సూరత్ వజ్రాల పరిశ్రమగా, బెంగళూరు సిలికన్ వ్యాలీగా పిలుస్తున్నట్లే కర్నూలును డ్రోన్ హబ్‌గా రాబోయే రోజుల్లో పిలుస్తామని చెప్పారు.
దేశానికి రక్షణ కవచంగా ఏపీ: చంద్రబాబు
రాయలసీమలో డిఫెన్స్ యూనిట్ ఏర్పాటుతో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలుస్తుందని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఏఎంసీఏను రాష్ట్రానికి ఇవ్వాలని కోరగానే రాజ్‌నాధ్ సింగ్ సానుకూలంగా స్పందించి పుట్టపర్తికి వచ్చేలా కృషి చేశారని ధన్యవాదాలు తెలిపారు. ఏఎంసిఏ రాకతో పుట్టపర్తి దేశంలోనే గర్వించదగ్గ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా గుర్తింపు పొందుతుందని చెప్పారు. దీనికోసం 600 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఈ యూనిట్ ద్వారా 7,500 ఉద్యోగాలు వస్తా యన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వచ్చే నెలలో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని, 2028 డిసెంబర్ నాటికి స్టీలు ప్లాంట్ పనులు పూర్తవుతాయని చేస్తామని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతం పర్రిశమలు, సోలార్ ద్వారా అభివృద్ధి అయ్యే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. కర్నూలు జిల్లా జిజిఎఫ్ (జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్)లో బంగారం తవ్వకాలు త్వరలో ప్రారంభం కాను న్నాయని, మొదటి ఏడాది 600 కిలోల బంగారం వెలుగులోకి వస్తుందని చెప్పారు. రెండో ఏడాది నుంచి 1,500 కిలోలు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఉత్తరాంధ్రలోని విశాఖలో ఐటి, డేటా కేంద్రం ఏర్పాటు కానున్నా యని, అమరావతి క్వాంటమ్ కంప్యూటరింగ్, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందనుందని చెప్పారు. విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో మరిన్ని విమాన సర్వీసులకు కృషి చేస్తానని తెలిపారు.
‘స్టెల్త్’ అద్భుత సాంకేతిక విజయం
స్టెల్త్ అంటే శత్రువు రాడార్‌కు కనిపించకుండా ఉండే విశేష సామర్థ్యం. అంతేకాదు ఇవి బహుముఖ యోధులు. శత్రువుల ప్రాంతంలోకి ప్రవేశించి వైమానిక దాడులు చేయడం, ఎలక్ట్రానిక్ యుద్ధం నిర్వహించడం, అవసరమైతే గాల్లో శత్రు విమానాలను కూల్చడం ఇవన్నీ ఒకే విమానం చేయగలదు. ఈ విమానాలు పదునైన కోణాల ఆకృతి, రాడార్ తరంగాలను గ్రహించే ప్రత్యేక పూత, లోపలే దాచిన ఆయుధాలు, ఇంజన్ వేడిని తగ్గించే వ్యవస్థ వంటి నాలుగు పద్ధతుల వల్ల శత్రుదేశపు రాడార్‌కు ఇవి కనిపించవు. ప్రపంచంలో ఇప్పుడు అమెరికా (ఎఫ్-22, ఎఫ్-35), రష్యా (సుఖోయ్ ఎస్‌యూ-57), చైనా (జే-20) మాత్రమే ఈ విమానాలు తయారు చేస్తున్నాయి. అమెరికా ఎఫ్ -35 ఒక్కో విమానం ధర దాదాపు 80 నుండి 110 మిలియన్ డాలర్లు. భారత్ గతంలో రష్యా నుండి సుఖోయ్-30 ఎంకేఐ, ఫ్రాన్స్ నుండి రఫేల్ విమానాలు కొనుగోలు చేసింది. కానీ ఇవి 4వ తరం విమానాలు మాత్రమే. 5వ తరం స్టెల్త్ విమానాలు ఏ దేశం అమ్మడానికి ముందుకు రాలేదు. మన రక్షణ రంగం బలోపేతం చేసేందుకు భారత్ స్వయంగా ఏఎంసిఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) అభివృద్ధి చేపట్టింది. ఈ కార్యక్రమం డీఆర్‌డీ•ఏ, హెచ్‌ఏఎల్ నేతృత్వంలో జరుగుతోంది. 2034 నాటికి ఏఎంసీఏ భారత వాయుసేనలో చేరుతుందని అంచనా. 25 టన్నుల బరువుతో తయారుకానున్న ఈ యుద్ధ విమానంలో కృత్రిమ మేధతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్, ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. ఈ విమానాల తయారీ వల్ల భారత్‌కు వ•డు పెద్ద లాభాలు కలుగుతాయి. మొదట, చైనా జే-20 ముందు వ్యూహాత్మక సమానత్వం చేకూరుతుంది. రెండవది, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గి వేల కోట్లు ఆదా అవుతాయి. వ•డవది, ఏరోస్పేస్ రంగంలో వేలాది ఉద్యోగాలు వస్తాయి. భారత్ రక్షణ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధిస్తుంది.
స్టెల్త్ టెక్నాలజీ విశిష్టత
1. ఆకృతి: స్టెల్త్ విమానం బాడీ డిజైన్ చేసే తీరే భిన్నంగా ఉంటుంది. సాధారణ విమానం గుండ్రటి ముక్కు, వేలాడే ఇంజన్ పాడ్లు, నిటారైన తోకతో ఉంటుంది. ఇవన్నీ రాడార్ తరంగాలను నేరుగా వెనక్కి పంపే అద్దాల్లా పని చేస్తాయి. స్టెల్త్ విమానం మాత్రం పదునైన వజ్రపు ఆకృతితో, అన్ని ఉపరితలాలూ రాడార్ సిగ్నల్‌ను పక్కగా చెదిరేలా వంచబడి ఉంటాయి. ఏఏంసీఏలోని సర్పెంటైన్ (వంకర) ఎయిర్ ఇన్‌టేక్ ఇందుకు అద్భుతమైన ఉదాహరణ. ఇంజన్ ఫ్యాన్ బ్లేడ్లు రాడార్‌కు నేరుగా కనిపించకుండా వంకర సొరంగంలో దాచబడతాయి.
2. ఆర్‌ఏఎం (రాడార్ అబ్‌సార్పెంట్ మెటీరియల్స్)
కార్బన్, ఫెర్రైట్ రేణువులతో తయారైన ప్రత్యేక పెయింట్, కాంపోజిట్ మెటీరియల్ విమానం పైన పూస్తారు. ఈ పదార్థాలు రాడార్ విద్యుదయస్కాంత శక్తిని వెనక్కి పంపించకుండా తనలోనే వేడిగా మార్చి శోషిస్తాయి. 70 నుండి 80 శాతం రాడార్ శక్తి ఇలా నిర్మూలమవుతుంది.ఎఫ్-117 నైట్‌హాక్ విమానం ఇదే పద్ధతి ద్వారా 1991 గల్ఫ్ యుద్ధంలో శత్రు రాడార్లకు చిక్కకుండా దాదాపు అదృశ్యంగా ఉంది.
3. అంతర్గత ఆయుధ బేలు
సాధారణ విమానం రెక్కల కింద క్షిపణులు, బాంబులు అమరుస్తారు. ఇవి అతిపెద్ద రాడార్ రిఫ్లెక్టర్లు. ఒక్కో క్షిపణి విమానం రాడార్ క్రాస్ సెక్షన్‌ను పది రెట్లు పెంచగలదు. స్టెల్త్ విమానం అన్ని ఆయుధాలనూ శరీరం లోపల దాచు కుంటుంది. దాడి చేసే క్షణంలో మాత్రమే బేల్ తలుపు కొన్ని సెకన్లు తెరుచుకుని క్షిపణి వదులుతుంది. ఆ సమయంలో మాత్రమే రాడార్‌కు కొంచెం కనిపిస్తుంది.
4. ఉష్ణ నిర్వహణ
రాడార్ మాత్రమే కాదు. ఆధునిక క్షిపణులు ఇంజన్ వేడిని ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల ద్వారా గుర్తిస్తాయి. స్టెల్త్ విమానాలు ఇంజన్ నాజిల్ నుండి వెలువడే 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి గాలిని చల్లటి వాతావరణ గాలితో కలిపి మిక్సింగ్ డక్ట్ ద్వారా 400 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువకు తగ్గిస్తాయి. నాజిల్ ఆకృతి కూడా వేడిని ఒక దిశలో కాకుండా విస్తరింపజేసేలా చదునుగా ఉంటుంది.
5. ఎలక్ట్రానిక్ నిశ్శబ్దం
సాధారణ రాడార్ బలమైన పల్స్ పంపుతుంది. శత్రువు దాన్ని పట్టుకుని ‘‘అక్కడ విమానం ఉంది’’ అని తెలుసుకుంటాడు. స్టెల్త్ విమానంలో ప్రాబబిలిటీ ఎఫ్ ఇంటర్‌సెప్ట్ రాడార్ ఉంటుంది. ఇది సిగ్నల్‌ను చాలా బలహీనంగా, వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో చెల్లా చెదురుగా పంపుతుంది. శత్రువు దాన్ని నేపథ్య శబ్దం నుండి వేరు చేయలేడు. యుద్ధం మొదలయ్యే వరకు విమానం పూర్తి రేడియో నిశ్శబ్దం పాటిస్తుంది.
ఈ అయిదు పద్ధతులు ఒకేసారి పని చేస్తాయి. ఒక్కో పద్ధతి మాత్రమే ఉంటే ప్రభావం తక్కువ. అన్నీ కలిసినప్పుడే నిజమైన స్టెల్త్ సాధ్యమవుతుంది. ఎఎంసీఏ ఈ అన్ని అంశాలనూ స్వదేశీయంగా అభివృద్ధి చేయడమే భారత్‌కు అతి పెద్ద సాంకేతిక సవాలు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్