రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. మరోవైపు రాష్ట్రంలో క్షే•త్రస్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పునాదులు పటిష్టమవుతున్నాయి. ఈ రెండు అంశాలు పూర్తి విభిన్నంగా కనిపించినప్పటికీ.. మే 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఒకేరోజు..ఈ రెండు అంశాలు వెలుగు జిలుగుల సంకేతాలను ఇచ్చాయి.
రాష్ట్రం అధికారంలో ఉన్నది ఎవరు? అని కాకుండా ప్రగతే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా దూసుకు వెళుతుండడం, రూ. వేల కోట్ల విలువైన ప్రతిపాదనలను సాక్షాత్కారం చేస్తున్న తీరు.. అదే సమయంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీగా, రాష్ట్రంలో పునాదులను పటిష్టం చేసుకుంటున్న తీరు పార్టీ శ్రేణులకు ముచ్చటగొలుపు తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 10వ తేదీ మధ్యాహ్నం కర్ణాటక పర్యటన ముగించుకొని హైదరాబాద్ రావడం బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. అధికారిక కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభ వేదిక నుంచి కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సంబంధాలు, ప్రగతి గురించే మాట్లాడారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నామనే అంశాలనే ప్రస్తావించారు. మరోవైపు.. అదేరోజు సాయంత్రం పార్టీ తరపున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క రోజులో రెండు కార్యక్రమాలు అధికారిక వేడుకలు, పార్టీ బహిరంగ సభ. రెండింటికీ మోదీ సమాన ప్రాధాన్యత ఇచ్చారు. దేశ నాయకుడిగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అదే మోదీ, పార్టీ నాయకుడిగా వేలాది కార్యకర్తల మనసులు దోచుకున్నారు. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు.. ఇది ఒక సందేశం. ఎక్కడ చేయాల్సిన ప్రసంగం అక్కడ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే పార్టీ అసాధారణమైన ఉత్సాహం. రోడ్లు, పార్కులు, పందిళ్లు ఎక్కడ చూసినా పార్టీ పతాకాలు, జాతీయ జెండాలు. రాష్ట్రంలో బీజేపీ వేళ్లూనుకుంటోందని, ఆ వేళ్లకు నీరు పోసేవాడు నరేంద్ర మోదీ అన్న భావనను స్ఫురింప చేసింది. ముఖ్యంగా దక్షిణాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. తెలంగాణను ‘గేట్ వే’గా ఎంచు కుంది. పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించే ప్రయత్నాలను చాపకింద నీరులా కొన్నేళ్లుగా చేపట్టింది. ప్రజలను అభివృద్ధితోనే ఆకట్టుకునే యత్నాలను ముమ్మరం చేసింది. ఇవి ప్రధాని తాజా పర్యటనతో మరింత ఊపు తెచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా దాదాపు రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితాలు జరిగాయి. రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, టెక్స్‌టైల్స్, ఎనర్జీ, ఆరోగ్యం.. ఇలా ఆరు కీలక రంగాల్లో ఒకే రోజున పెద్ద ఎత్తున పనులు మొదలుకావడం తెలంగాణ చరిత్రలో అపూర్వం. జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపైంది. రైల్వే పెట్టుబడి రూ. వెయ్యి కోట్ల నుంచి రూ. 5,500 కోట్లకు చేరింది. కేంద్రం పదకొండేళ్లలో రూ.1.75 లక్షల కోట్లు జాతీయ రహదారుల కోసం ఖర్చు చేసింది. పారిశ్రామిక కారిడార్లు, టెక్స్‌టైల్ పార్కులు, ఎనర్జీ ప్రాజెక్టులు ఇవన్నీ ‘వికసిత తెలంగాణ – వికసిత భారత్’ అన్న మోదీ విజన్ అమలులో భాగం. రాష్ట్ర జనాభా 3 శాతమే అయినా జాతీయ జీడీపీలో 5 శాతం వాటా ఇస్తోంది. ఆ శక్తిని మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే కేంద్రం తెలంగాణలో పెట్టుబడులను కొనసాగిస్తోంది.
‘167’ విస్తరణకు రూ.3,175 కోట్లు
గుడేబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167ని రూ.3,175 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్-పనాజి ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా నిర్మించే ఈ రహదారి తెలంగాణ-కర్ణాటక మధ్య అనుసంధానతను బలోపేతం చేస్తుంది. ప్రయాణ సమయం దాదాపు గంటన్నర తగ్గనుంది. ఇంధన వినియోగం, వాహన నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయి. పారిశ్రామిక వికాసానికి ఈ రోడ్డు కీలక లింక్ అవుతుంది.
జహీరాబాద్ పారిశ్రామికాభివృద్ధి
సంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన జరిగింది. 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,350 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ జోన్ పూర్తయితే దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలదని అంచనా. వాహన తయారీ, యంత్ర పరికరాలు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. జాతీయరహదారి-65 వెంబడి ఉన్న ఈ ప్రాంతానికి జాతీయ రహదారులు, రైలు నెట్‌వర్క్, విమానా శ్రయాలు, ఓడరేవులతో నేరుగా అనుసంధానత ఉంటుంది. రాష్ట్ర కార్మికులకు, రైతులకు ఈ ప్రాజెక్టు కొత్త జీవనాధారం అవుతుందని మోదీ స్వయంగా హామీ ఇచ్చారు.
వరంగల్‌లో పీఎం మిత్ర పార్క్
వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పేరిట నిర్మించిన పీఎం మిత్ర పార్క్ ప్రారంభోత్సవం మోదీ పర్యటనలో అత్యంత చారిత్రాత్మక క్షణం. ఇది దేశంలోనే మొదటి పూర్తిస్థాయి పీఎం మిత్ర పార్క్. రూ.1,700 కోట్లతో 1,327 ఎకరాల్లో నిర్మితమైంది. అంతర్గత రోడ్ల నెట్‌వర్క్, విద్యుత్ సబ్‌స్టేషన్, నీటి సరఫరా వ్యవస్థ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సాంకేతికతతో కూడిన ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్.. ఇవన్నీ ప్రపంచస్థాయి సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తుం దని మోదీ స్పష్టం చేశారు. నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉన్న ఈ పార్క్ అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా అనువైన లోకేషన్.
రూ.1,535 కోట్లతె రై•ల్వే ప్రాజెక్టులు
కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ (118 కి.మీ.), కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రాజెక్టులు జాతికి అంకితమయ్యాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే ఫ్రెయిట్ కారిడార్లలో ఒకటైన ఈ మార్గంలో రద్దీ తగ్గి సామర్థ్యం పెరుగు తుంది. 2014కి ముందు అవిభక్త ఆంధప్రదేశ్‌కు ఏడాదికి రూ. వెయ్యి కోట్లకు మించి రైల్వే కేటా యింపు ఉండేవి కాదని, ఇప్పుడు ఒక్క తెలంగాణకు ఏటా దాదాపు రూ.5,500 కోట్లు కేటాయిస్తున్నట్లు మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం రూ.50,000 కోట్ల విలువైన రైల్వే పనులు ఒకేసారి అమలవుతున్నాయి. ఇప్పటికే ఐదు వందేభారత్, ఆరు అమృత్ భారత్ రైళ్లు తెలంగాణ మీదుగా నడుస్తున్నాయి.
మల్కాపూర్ ఇండియన్ ఆయిల్ టెర్మినల్
హైదరాబాద్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.600 కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ మల్కాపూర్ పెట్రోలియం టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ, సరఫరా సామర్థ్యాన్ని పెంచే ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ టెర్మినల్ ఎంత అవసరమో ఈ ప్రాజెక్ట్ ద్వారా మోదీ వివరించారు.
సింధు హాస్పిటల్‌ను జాతికి అంకితం చేశారు. కాన్సర్ చికిత్సపై దృష్టిపెట్టిన ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 1,500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లు, 33కి పైగా సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక ఆసుపత్రి కాదు.. తెలంగాణలో ప్రపంచస్థాయి వైద్యం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక.
ఓట్లు కాదు…అభివృద్ధి ప్రధానం
తెలంగాణలో బీజేపీ కేవలం ఓట్ల కోసం తిరగడం లేదు. అభివృద్ధి ద్వారా ప్రజల గుండెల్లోకి నేరుగా చేరడమే వ్యూహం. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, పథకాలు అందిస్తూ వస్తోంది. ఆ లెక్కలు పత్రికల్లో మాత్రమే కాదు, తెలంగాణ వీధుల్లో కూడా కనిపిస్తున్నాయి. రోడ్లు మారుతున్నాయి. రైళ్లు సకాలానికి నడుస్తున్నాయి. డిజిటల్ ఇండియా రాష్ట్రంలోని గ్రామాలకు చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థులు ఏం చేసినా, ప్రజలు అభివృద్ధిని చూస్తారు. తాగునీళ్లు వచ్చాయా? పిల్లలకు స్కాలర్షిప్ వచ్చిందా? రైతుకు కిసాన్ నిధి అందిందా? ఇవే ప్రశ్నలు వేసుకునే వర్గాలకు మోదీ పాలన సమాధానంగా నిలుస్తోంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభకు రాష్ట్రం నలువ•లల నుంచి కార్యకర్తలు తరలి వచ్చిన దృశ్యం ఒక్కసారిగా రాజకీయ పరిశీలకులను ఆలోచింపజేసింది. ఇది కేవలం ఒక బహిరంగ సభ కాదు.. ఇది తెలంగాణ బీజేపీ తన బలాన్ని చాటుకున్న వేదిక. ఈ ప్రజలతో మాకు అనుబంధం ఉంది అని చెప్పిన క్షణం. మోదీ చేసిన ప్రసంగం సభికులను కదిలించింది. ఆయన మాటల్లో కేందప్రభుత్వం చేసిన పని ఉంది, తెలంగాణ ప్రజల పట్ల అభిమానం ఉంది, రాష్ట్రానికి బీజేపీ ఇస్తున్న భరోసా ఉంది. ఆయన చెప్పిన ఒక్కో అంశం ఒక్కో నినాదమై ఆ గ్రౌండ్‌లో ప్రతిధ్వ నించింది. తెలంగాణ బీజేపీలో మోదీ ప్రభావం మాటల్లో చెప్పడం కష్టం. కానీ ఆ రోజు సికింద్రాబాద్ గ్రౌండ్లో కనిపించింది. కార్యకర్తల కళ్లలో కొత్త వెలుగు. సంవత్సరాల కష్టాలు, ఎన్నికల్లో నష్టాలు, ప్రజలను చేరుకోవడంలో ఇబ్బందులు.. వాటన్నిటినీ మోదీ ఒక్క పర్యటనతో కడిగేసినట్టు అనిపించింది.
తెలంగాణ – దక్షిణాదికి గేట్‌వే
దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టడం కోసం బీజేపీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఆంధప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సవాలు. కానీ తెలంగాణ మాత్రం మినహాయింపు. ఇక్కడ బీజేపీకి ఒక సహజమైన పునాది ఉంది. హైందవ సంస్కృతి, చారిత్రక అనుబంధం, పట్టణ మధ్యతరగతి ఓటర్లు. వీళ్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో తెలంగాణను దక్షిణాదికి ‘గేట్‌వే’ గా బీజేపీ ఎంచుకోవడం కొన్నేళ్లుగా పార్టీ తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. బూత్ స్థాయిలో కార్యకర్తల సంఖ్యను పెంచడం, స్థానిక నాయకులతో సంప్రదింపులు, మహిళలు, యువత, వ్యవసాయ దారులతో సేవాకార్యక్రమాలు.. ఇవి మీడియాలో కనపడవు, కానీ మండలస్థాయిలో కనిపిస్తున్నాయి. నరేంద్రమోదీ పర్యటనతో బీజేపీ కొత్త ఉత్సాహంతో, కొత్త లక్ష్యాలతో ముందుకు కదులుతోంది. ఒక్కో మండలంలో పార్టీ బలపడుతోంది. ఒక్కో ఓటర్ పార్టీని నమ్ముతున్నాడు. ఒక్కో కార్యకర్త మరింత చురుకుగా పనిచేస్తున్నాడు. అభివృద్ధే ఆయుధంగా, ఐక్యతే శక్తిగా, మోదీయే మార్గదర్శకుడిగా.. తెలంగాణ బీజేపీ భవిష్యత్తువైపు.. నమ్మకంగా ముందుకు కదులుతోంది.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068