ఆకాశంలో తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష్యశాస్త్రం తరువాత అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది భవిష్యత్తును చెప్పేది మాత్రమే అనుకోరాదు. ఇది మూడు భాగాలు` సిద్ధాంత, సంహిత, హోర. కల్పారంభం నుండి గ్రహ గణితం కలిగిన దానిని సిద్ధాంతమని, ఒక మహాయుగం నుండి గ్రహ గణితం కలిగిన దానిని సంహిత అని, ఒక శక సంవత్సరం నుండి గ్రహ గణితం కలదానిని హోరా అని అంటారు. సంహిత విభాగంలో ఖగోళంలో గ్రహ భ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు, గ్రహణాలు మొదలైన వాటితో ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది శాస్త్రమేనని వారు నిర్ధారించారు. కానీ సంభాషణ చాతుర్యంతో వాగ్దేవి కటాక్షంతో అవతలివారిపై ఆధిపత్యం చేస్తున్నామన్న స్పృహ కలిగిన వారు కూడా ముందు నుంచి ఉన్నారు.
జ్యోతిష్కుడు ఎలా ఉండాలో చెప్పారు. ద్వేష స్వభావం లేనివారు, ప్రతినిత్యం జీవితాన్ని సంతోషంగా గడిపేవారు, గణితశాస్త్రంపై అవగాహన కలిగినవారు, ముహూర్తం గుణదోషాలు తెలిసిన వారు, మంచి సంభాషణ చాతుర్యం గలవారు, ఎదుటివారిని నొప్పించక మృదువైన సంభాషణ గలవారు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. అట్టివారిని ఆ వాగ్దేవి రక్షించి కాపాడుతుంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ జ్యోతిష్యానికి ఒక భూమికను ఏర్పాటు చేసినవారు పరాశరుడు “పరాశర హోర” అనే పేరుతో జ్యోతిష్య గ్రంథం ప్రసిద్ధి చెందింది. ఈయన సాక్షాత్తూ వ్యాసభగవానుని తండ్రి.
ఊహించని సంఘటనలు ఎల్లప్ప్పుడూ చరిత్ర గమనాన్ని మార్చగలవు కాబట్టి భవిష్యత్తును సంపూర్ణ నిశ్చయంతో అంచనా వేయడం అసాధ్యం అయితే కొంతమంది వ్యక్తులు చెప్పిన అంచనాలు చాలా ఖచ్చితమైనవిగా నిరూపితమయ్యాయి. ముఖ్యంగా భారత్‌కు చెందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్, బల్గేరియాకు చెందిన బాబా వంగా, జపాన్‌కు చెందిన ర్యోటాట్సూకి (న్యూబాబా వంగా), పెర్డినాండ్ పోచ్ మొదలైనవారి అంచనాలు చాలా వరకు జరిగాయి. కాబట్టి వీరు చెప్పే భవిష్యవాణిని ప్రజలు అంగీకరిస్తున్నారు.
వ్యాస భగవానులు రచించిన పద్దెనిమిది పురాణములో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అద్భుతము గోచరించుచున్నది. “భవిష్య మహాపురాణము”న రాబోవు కాలము చరిత్ర వర్ణితమైంది. త్రికాల జ్ఞాన సంపన్నులగు రుషులకు తప్ప యిట్టి దివ్య దర్శనము కలుగదు. ఈ పురాణము నందు 18000ల శ్లోకములు కలవు. ఇందు బ్రహ్మపర్వము, మధ్యమ పర్వము, ప్రతిసర్గపర్వము, ఉత్తరపర్వము నను నాలుగు పర్వములున్నవి. సృష్టికెల్ల కారణము సూర్యభగవానుడని, యదియే బ్రహ్మపద వాచ్యమగు తత్వమని నిరూపించబడినది. ఇదంతట సూర్యమహిమ వర్ణితమైంది. మÖడవది యగు ప్రతి సర్గ పర్వమున మనువు దగ్గర నుండి ఆరంభమై సృష్టి క్రమము వర్ణితమైనది.
శ్రీ వేదవ్యాస భట్టారకులు ప్రసాదించిన మహా పురాణములు జ్ఞాన విజ్ఞాన భాండారములు అవి సర్వ మానవులకు ధర్మార్ధ కామమోక్షములనెడి పురుషార్ధములను బోధించుచున్నవి. ద్వాపరము చివర రమారమి ఆరువేల సంవత్సరములకు మున్నవతరించి కృష్ణద్వైపాయనులను పేర వ్యాసపీఠము నధిష్టించిన ఆ మహర్షి వాగ్దర్పణము నందు భూత భవిష్యద్వర్తమానములు మÖడును ప్రతిబింబించియున్నవి.
పరమేశ్వరుడు సృష్టికి ముందాపస్సులను సృజించెను. అందు దనవీర్యముంచెను. అది సూర్యునట్లు వెలుగు ఒక బంగారు గ్రుడ్డయ్యెను (అదే బ్రహ్మాండము) సుమారుగా కృత్రిమ గర్భధారణను ముందుగానే వ్యాసులవారు చెప్పియున్నారు.
భరద్వాజ మహర్షి సూత్ర గ్రంథమును రచించినారు. ఇది సూర్యకిరణములను గూర్చిన శాస్త్రము.
వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరిగినవిగా భావిస్తున్న కొన్ని విషయాలు:
- నీళ్లతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్)
- ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి యంత్ర వాహనములు.
- ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది.
- తెర మీద బొమ్మలు గద్దెనెక్కుతారు. ఎన్.టి.ఆర్., జయలలిత, పవన్‌కళ్యాణ్.
- రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి.
- ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదములు)
- జనాభా విపరీతంగా పెరుగుతుంది.
- బ్రాహ్మణ అగ్రహారాలు నశిస్తాయి.
- హైదరాబాదులో ఒకరినొకరు నరుకుకొని చస్తారు. (మత కలహాలు)
- దేవస్థానాల్లో దొంగలు జేరి దేవుని విగ్రహాలు చోరీ చేస్తారు.
వీర బ్రహ్మేంద్ర స్వామి ఇలా వ్రాశారు.
కోయ రాజ్యంబంత గొడవల పాలవును
కోయ నాయకుడతి కోపంబుతో
కువలయపతికి బహు కష్టములు కలిగించి
అవనిలో అదృశ్యుడయ్యీనిమా
భారతస్వాతంత్య్ర సంగ్రామంలో కోయలను సమీకరించి వారికి నాయకునిగా అల్లూరి సీతారామరాజు విషయం కావచ్చును.
అయిదు వేల నాలుగు సంవత్సరంబు నాను
అవనీంద్రుడు అస్తమించేను మా
అయిదు వేల ముప్పదారింటి మీదట
అమితముగా యుద్దములు జరుగునుమా
కలియుగం 5004 అంటే క్రీ॥శ॥ 1904లో ఒక రాజు అస్తమిస్తాడు అంటే 1903 జూన్ ॥న కింగ్ అలెగ్జాండర్ ఆఫ్ సెర్బియా హత్య చేయuడ్డాడు. కలియుగం 5036 అంటే 1936 తరువాత యుద్ధం జరుగుతాయని చెప్పారు. 1939-45 మద్య జరిగిన 2వ ప్రపంచ యుద్ధం జరిగింది.
ఇప్ప్పుడు మనం చూస్తున్న విపరీత పరిణామాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే భారతదేశంలో వివరించిన మహాజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో క్రీ॥శ॥ 1500-1510 మధ్య కాలంలో జన్మించి ఉండవచ్చునని కొందరి అంచనా. బ్రహ్మం గారికి సమకాలీనంగా ఐరోపా ఖండంలో “నోస్ట్రాడమస” జన్మించాడు.
నాస్ట్రాడమస్ 1503 డిసెంబర్‌లో ప్రాన్స్‌కు దక్షిణాన సెయింట్`రెమీ`డి`ప్రోవెన్స్‌లో మైఖేల్ డి నోస్ట్రాడమేగా జన్మించాడు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వతాల పేలుళ్లవంటి ఘటనలు జరగవచ్చు అని ఆయన పేర్కొన్నాడు. నాస్ట్రాడామస్ తన ప్రవచనాలను “శతాబ్దాలు (1555)” అనే పుస్తకంలో ప్రచురించాడు. అతడు తన ప్రవచనాలను క్వాట్రైన్‌లలో వ్రాశాడు. నాలుగు పంక్తుల ప్రాసపద్యం. క్వాట్రైన్‌లను వందల సంఖ్యలో రాశాడు. నూరు క్వాట్రైన్‌లు గల ప్రతీ సెట్‌ను సెంచరీ అని పిలుస్తాడు. నాస్ట్రాడామస్ తన జీవితకాలంలో తన అంచనాలలో కొన్ని భిన్నంగా జరిగినప్ప్పుడు అపఖ్యాతి పాలయ్యాడు. అయినా కేదరిన్`డి`మెడిసి ప్రాన్స్ దేశపు రాణి ఆయనకు ఆరాధకురాలైంది. కేధరిన్`డి`మెడిసి 1519 ఏప్రిల్ 13న ఇటలీలో జన్మించినది. ఆమె ప్రాన్స్ రాజు 2వ హెన్రీ భార్య. ఆమెకు 10మంది పిల్లలు. వారి జాతకాలు రాయించడానికి నాస్ట్రాడామస్‌ను ప్రాన్స్‌కు పిలిపించింది. 1556లో 2వ హెన్రీ చావు గురించి చెప్పాడు. పైగా ఆచారబద్ధమైన పోటీలకు దూరంగా ఉండాలని 2వ హెన్రీకి సూచించాడు. అతడు చెప్పిన మÖడు సంవత్సరాలకు హెన్రీ మరణించాడు. నాస్ట్రాడామస్ తన ప్రచురించిన అంచనాలను న్యాయ జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడినట్లు పేర్కొన్నాడు. భూమికి సంబంధించిన గ్రహాలు, నక్షత్ర వస్తువుల గణన ద్వారా భవిష్యత్తు సంఘటనలను అంచనా వేసే కళను అభ్యసించాడు.
“బాబావంగా” 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమె అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. ఈమె వైద్యురాలు, ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్కురాలు, తన 12వ ఏట భారీ తుఫాన్ ప్రమాదంలో కంటి చూపును కోల్పోయింది. అప్పటి నుండే ఆమె భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చింది అని అంటారు. ఆమె 1996లో మరణించారు. ఆమె చెప్పిన భవిష్యవాణిలో ప్రధానాంశాలు, 2001లో న్యూయర్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబాయి ఉగ్రదాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రేయిన్ వివాదము ఇలా ఎన్నో విషయాలు ముందుగా చెప్పింది. తద్వారా “నాస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స” గా ప్రసిద్ధి కెక్కారు. 1985లో తన తల్లి తత్సుకిర్యోకి ఒక నోట్‌బుక్ ఇచ్చినప్ప్పుడు ఆమె తన కలలను రికార్డు చేయడం ప్రారంభించింది. దానిలో ఆమె కోవిడ్-19 మహమ్మారి, 2011లో సునామీలను గురించి రాసింది.
అంతిమంగా జ్యోతిష్యశాస్త్రం నిజమా, అబద్ధమా అనేది వ్యక్తిగత నమ్మకమని, కొందరు దీనిని ఆధ్యాత్మిక అన్వేషణకు ఉపయోగకరంగా భావిస్తే మరి కొందరు దీనిని ఎటువంటి శాస్త్రీయ మద్దతు లేని మూఢ నమ్మకంగా చూస్తారు. జ్యోతిష్యశాస్త్రం సంభావ్య ప్రయోజనాలు, పరిమితులు రెండింటిని గుర్తించి విమర్శనాత్మక, వివేచనాత్మక మనస్సుతో అర్ధం చేసుకోవాలి.
మూలం:
1.భవిష్య మహా పురాణము బై శ్రీవిద్వాన్ కల్లూరి వేంకట సుబ్రమణ్య దీక్షుతులు. (వ్యాస వా్మఙయ సమితి) పేజి 2 టు3, 6
2. Chronology of Ancient Hindu History by Pandit Kota Venkata Chala Paakayaaji, Page -1
3. Michal Noftradamus “-His Prophecies”
4. ABN Published date Apr 02, 2025 Sakshi Dec 11, 2024
5. The Complete prophecies of Nostradamus Editor Roberts, Henry.C
6.పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితము. రచనల పరిశీలన – కన్నెగంటి రమల్లాచారి పేజీ-195-196

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు