ఆకాశంలో సగం… కనీస సదుపాయాలు అందడంలో అధః పాతాళం. చదువులు ఉద్యోగాల్లో పురుషులతో పోటా పోటీ.. రుతుక్రమం (పీరియడ్స్) విషయంలో మాత్రం కష్టాలను కనీసం చెప్పుకోలేని దౌర్భాగ్యం. బహిష్టు అంటే బూచిలా.. రుతుస్రావం అంటే అంటరానిదిలా… ఆధునిక యుగంలోనూ అతివలకు అందని ఆరోగ్యం.

మహిళ ఒకప్పటిలా ఇంటి పనులు, వంట పనులకే పరిమితం కాదు. నాలుగ్గోడల మధ్య నుంచి ఆర్థికంగా నిలబడే స్థాయికి చేరింది. అన్ని రంగా ల్లోనూ తనదైన ముద్ర వేసుకోగల్గుతోంది. కానీ ప్రకృతి సహజమైన నెలసరి విషయంలో ఇంకా అపోహల వలయాన్ని దాటలేకపోతోంది. సంప్రదాయాన్ని దాటి సైన్స్‌ను అర్థం చేసుకోలేని సమాజంలో నలిగిపోతూనే ఉంది.

“పీరియడ్ నేచురల్ … కానీ ఆలోచన విధానం అన్ నేచురల్..సైన్స్ నేచురల్ … కానీ సైలెన్స్ అన్ నేచురల్.. బయాలజీ నేచురల్… కానీ ఐడియాలజీ అన్ నేచురల” అంటూ ఇటీవల మన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా పార్లమెంట్‌లో మహిళల బహిష్టు, రుతుస్రావ సమస్యల అంశాన్ని చర్చించారు. సమాజంలో ప్రతివారు అన్ని విషయాల పట్ల అవగాహనతోనే ఉంటారు కానీ ఇటువంటి సాధారణ సమస్యను చర్చించేందుకు మాత్రం సైలెంట్ అయిపోతారన్న ఎంపీ… పీరియడ్ పావర్టీని బిల్లులో ప్రవేశ పెట్టాలంటూ డిమాండ్ చేశారు.

 ఇప్పటికే వేతనంతో కూడిన సెలవుతో సహా, మహిళల రుతుక్రమ ఆరోగ్యం ,పరిశుభ్రతను కాపాడే లక్ష్యంతో అనేక ప్రైవేట్ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఎంపీ శాంభవి చౌదరి 2024లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ఉద్యోగం చేసే మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవును హామీ ఇవ్వడంతో పాటు, మెరుగైన పరిశుభ్రత సౌకర్యాలను కూడా కల్పించాలని కోరుతోంది.

రుతుస్రావ ప్రయోజనాల బిల్లు-2024ను ఎంపీ కడియం కావ్య ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు, రుతుస్రావ సమయంలో తప్పనిసరి విరామాలు, మెరుగైన పారిశుధ్యం సహా కార్యాలయ సౌకర్యాల కోసం ఒక చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతుంది.

 ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో నెలకు 2-3 రోజుల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడానికి ‘రుతుస్రావ ప్రయోజనాల బిల్లు’, ‘మహిళలకు రుతుస్రావ సెలవు హక్కు, రుతుస్రావ ఆరోగ్య ఉత్పత్తులకు ఉచిత ప్రాప్యత బిల్లు’ వంటి సారూప్య బిల్లులను 2018, 2022లో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లులు సాధారణంగా మహిళలకు, విద్యార్థినులకు నెలకు 2 నుండి 3 రోజుల వేతనంతో కూడిన సెలవును సూచిస్తున్నాయి. పని ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలలో శుభ్రమైన, ప్రత్యేక మరుగుదొడ్లు, ఉచిత శానిటరీ ఉత్పత్తులను తప్పనిసరి చేయడం, రుతుస్రావ ప్రయోజనాలను అందించడంలో విఫలమైతే ప్రతిపాదిత చట్టంలో జైలు శిక్ష లేదా జరిమానాలను ఆ బిల్లుల్లో పొందుపరిచారు.

రుతుస్రావ ఆరోగ్యాన్ని గౌరవానికి సంబంధిం చిన ప్రాథమిక హక్కులో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో గుర్తించింది. బిహార్‌లో 1992లో, కేరళ (2023) కర్ణాటక 92026) వంటి రాష్ట్రాలు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవును అందించేందుకు, జాతీయ చట్టం కోసం మార్గదర్శకత్వం వహించాయి. అయితే ప్రత్యేక బిల్లులతో మహిళలకు అపఖ్యాతి ఎదురవుతుందని, వివక్షకు గురి చేసేలా ఉన్నాయంటూ వాదనలు కూడా ఉన్నాయి. దీంతో ఈ బిల్లులు వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా జాతీయ చట్టంగా మారలేదు, అయినప్పటికీ ఇవి మహిళల ఆరోగ్యంపై శాసనపరమైన చర్యలకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఉత్పత్తులు సరిగా లభించక పోవడం, పారి శుద్ధ్యలోపం మహిళల ఆరోగ్యానికి, గౌరవానికి పెద్ద సవాలుగా మారాయి. ఇటువంటి సమస్యలతో బాలికలు నెలలో 70 రోజులు పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారు ఉద్యోగినులు కూడా నెలలో సుమారు మూడు నాలుగు రోజులు విధులకు హాజరు కాలేకపోతున్నారు.

దేశంలో సుమారు ముఫైఐదు కోట్ల మంది మహిళలు నెలనెల ఈ రుతుస్రావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అందులో పన్నెండు కోట్ల మంది కౌమారదశలోని బాలికలు పాఠశాలలో పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిలో సుమారు రెండున్నర కోట్ల మంది బాలికలు మధ్యలో బడి మానేస్తున్నారు. అంటే బడికి వెళ్లటమే మానేస్తున్నారు. సరైన మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం వల్ల అమ్మాయిలు నెలసరి సమయంలో పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు. మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉండవు లేదా వాటిని కొనే ఆర్థిక స్థోమత ఉండదు. పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సురక్షితమైన మరుగుదొడ్లు, శుభ్రమైన నీరు, ప్యాడ్లను మార్చుకోవడానికి, పారవేయడానికి తగిన సౌకర్యాలు లేవు. ప్యాడ్లకు బదులుగా, పాత బట్టలు, ఆకులు లేదా మట్టిని వాడటం వల్ల, అవి సరిగ్గా శుభ్రం చేయకపోతే గర్భాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ నేపథóŠ్యంలో దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూ. 1 కే లభించే ‘సువిధ’ ప్యాడ్ల వంటి చౌకైన ఉత్పత్తులను పెంచడం. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం. నెలసరి పరిశుభ్రత గురించి మహిళలకు, పురుషులకు అవగాహన కల్పించడం, వారిలో మూఢనమ్మకాలను తొలగించడం ఎంతయినా అవసరం.


మే 11 నుండి 17 వరకు జరిగే “పీరియడ్ పావర్టీ అవేర్‌నెస్ వీక్ – 2026” అవగాహన వారోత్సవాల సందర్భంగా బహిష్టు సమయంలో కనీస సౌకర్యాలు లేని మహిళల కోసం పోరాడుతున్న ఏడుగురు మహిళలకు “స్పాట్ ఆన్ అవార్డ్స” ప్రకటించారు. “జేన్ ఆస్టెన్స్ పీరియడ్ డ్రామా” అనే లఘు చిత్రం 2026 ఆస్కార్ నామినేషన్ పొందింది. ఈ చిత్ర నిర్మాత జూలియా అక్స్, చిత్రంలో ఒక నటిగా కాక సహ-దర్శకత్వం కూడా వహించారు. రుతుస్రావం చుట్టూ ఉన్న సామాజిక కట్టుబాట్లను వ్యంగ్యంగా చూపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

“యు కెన్ హావ్ ఏ బెటర్ పీరియడ” అనే పుస్తక రచయిత్రి లెనీస్ బ్రదర్స్. ఈమె రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్, యోగా టీచర్. తన “పీరియడ్ స్టోరీ” పాడ్‌కాస్ట్ ద్వారా హార్మోన్లు, మెనోపాజ్, పీరియడ్ హెల్త్ గురించి వేలాది మంది మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

“ది పీరియడ్ డాక్టర”గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ చారిస్ ఛాంబర్స్ సోషల్ మీడియా ద్వారా పునరుత్పత్తి ఆరోగ్య విద్యను (Reproductive health education) అందరికీ చేరువ చేస్తున్నారు. వైద్యపరమైన అంశాలను సామాన్యులకు అర్థ మయ్యేలా వివరిస్తూ అపోహలను తొలగిస్తున్నారు.

ప్రముఖ ఫిగర్ స్కేటింగ్ ఛాంపి యన్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అంబర్ గ్లెన్. క్రీడల్లో పాల్గొనే సమయంలో మహిళలు పీరియడ్స్ వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల గురించి (ముఖ్యంగా వైట్ కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు కలిగే ఆందోళన) బహిరంగంగా మాట్లాడి, అథ్లెట్లలో ధైర్యాన్ని నింపారు.

‘మిస్ టీన్ యూ యూ ఎస్ ఏ 2025’ విజేత మెలిన్ మార్ష్, తన హోదాను ఉపయోగించి విద్యాసంస్థల్లో పీరియడ్ పావర్టీ వల్ల బాలికలు చదువుకు దూరం కాకుండా ఉండాలని పోరాడు తున్నారు. మిస్సోరి వంటి ప్రాంతాల్లో ‘డయాపర్ బ్యాంక్ ఆఫ్ ది ఓజార్క్స’తో కలిసి పీరియడ్ ఉత్పత్తుల పంపిణీ చేస్తున్నారు.

జంట వ్యాపారవేత్తలు బ్రూక్లిన్, బెయిలీ మెక్‌నైట్. వీరిద్దరూ 22 రోజుల పాటు భారీ ‘RV రోడ్ ట్రిప’ నిర్వహించి, సుమారు రెండు లక్షల డాలర్ల నిధులను సేకరించారు. ఈ నిధులతో దాదాపు 20 లక్షల పీరియడ్ ఉత్పత్తులను నిరుపేద మహిళలకు అందజేశారు.

అవగాహన వారోత్సవాల్లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి గ్రేస్ మెంగ్ కూడా పాల్గొంటు న్నారు. ఈమె పీరియడ్ ఉత్పత్తులను అందరికీ ఉచితంగా లేదా తక్కువ ధరకే అందించే “Menstrual Equity for All Ac” కోసం చట్టసభల్లో పోరాడుతున్నారు.

ఈ మహిళలందరి పోరాటం కేవలం ప్యాడ్లు పంపిణీ చేయడమే కాకుండా, సమాజంలో ఈ విషయం గురించి ధైర్యంగా మాట్లాడే వాతావరణాన్ని కల్పిస్తోంది.

జయశ్రీ ఆచంట

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE