ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న సమయంలో సామ్యవాద నినాదానికి, కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ పెరగాల్సిన సమయంలో, భారతీయ కమÖ్యనిస్టులకు నేడు మిగిలిందేమిటి? అనే బాధతో అవుట్‌లుక్ పత్రిక (డిసెంబర్ 21, 2025) కవర్‌పేజీ కథనం ప్రచురించింది. ఒక రకంగా శతజయంతి సంబరాలను సరిగా జరుపుకోలేనంతగా బలహీనపడిన భారతీయ కమ్యూనిస్టులను ఉత్సాహ పరచటానికి ఆ సంచిక ప్రచురించిందేమో!
అయితే ఆ పత్రికలో ప్రత్యేక వ్యాసాలు రాసిన సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎమ్.బి.బేబీ, పొలిట్ బ్యూరో సభ్యురాలైన బృందాకరాత్‌లు కమÖ్యనిస్టు భావజాలం వెనకబడటాన్ని అంగీకరిస్తూనే, ఇది తాత్కాలికమేనని, అంతిమంగా తిరిగి పుంజు కుంటాం అనే ఆశాభావం వెలిబుచ్చారు. కార్మికు లతో, సామాన్య ప్రజలతో తమ పార్టీ సంబంధాలు మెరుగుపడే ఉద్యమాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఒక పార్టీని నడిపించేవారు అటువంటి ప్రోత్సాహక మాటలు చెప్పక తప్పదు.
అదే సంచికలో కమ్యూనిస్టుల వెనకబాటు తనానికి ఆ పార్టీల్లో సభ్యులు కాకున్నా, భావజాల పరంగా దగ్గరి బంధువులు అయిన మరో ముగ్గురు విశ్లేషించారు. అందులో ఆ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ ఎన్.కె.భూపేష్ కమÖ్యనిస్టులు కుల ప్రభావాన్ని సరిగా అర్థం చేసుకోలేదని, అంబేద్కర్ వెంట నడవక, ఆయన్ని కాదనుకుని తన సొంత బ్రాహ్మణాధిపత్య ధోరణిలో పార్టీని నడిపినందున ప్రజలకు దూర మయ్యారని సూత్రీకరించగా, అజయ్ గుడవర్తి వామపక్షాలు బ్రాహ్మణీకంలో మునిగిపోగా బహుజనులు బీజేపీవైపు నడిచినందువల్ల పార్టీ నష్టపోయిందని విశ్లేషించారు. ఒకరు షెడ్యూల్ కులాలు పార్టీకి దూరమైన విషయం వివరిస్తే, రెండవవారు వెనకబడిన కులాలు వెంట నడవని విషయం ప్రస్తావించారు. జె.ఎన్.యు.కె చెందిన అమీర్ ఆలీ వామపక్షాలు ముస్లింలను పట్టించుకో లేదని, వారి అంశాలను పార్టీలో చర్చించటంలో నాయకత్వానికి ఏదో ఇబ్బంది ఉందని, అందుకే వెనుకపడ్డారని అన్నాడు. వామపక్ష ఉద్యమకారిణి, రచయిత్రి సైరాషా హలీమ్ ఉమెన్ లెఫ్ట్ అవుట్ అనే టైటిల్ కింద రాసిన వ్యాసంలో వామపక్ష ఉద్యమాల్లో మహిళల పాత్ర పెంచకపోవటాన్ని కారణంగా ఎత్తి చూపింది.
మొత్తంమీద ఆయా రచయితల అంచనాల ప్రకారం సంఖ్యాపరంగా బలమైన నాలుగు వర్గాలకు వామపక్షం దూరమైంది. అయితే ఆయా వర్గాలు కమ్యూనిస్టులను ఎందుకు కాదనుకున్నారు అనే విషయంమీద వారు సరైన విశ్లేషణ చెయ్యలేదు. సి.పి.ఎం.నాయకులు కూడా ప్రత్యర్థులు సృష్టించిన మోసపూరిత ప్రచారంలో ఓటర్లు పడిపోతున్నారన్న నిర్ణయానికి వచ్చారు. అటువంటి ప్రచారానికి అన్ని వర్గాలు పడిపోతాయా? మరేదైనా ఇతర కారణాలవల్ల వామపక్షాలు తిరస్కరణకు గురయ్యాయా? పశ్చిమ బెంగాల్‌లో 1977 నుండి 2011వరకు వరసగా ఎన్నికలు గెలిచిన వామపక్షాలు నేడు ఒక్క ఎమ్.ఎల్.ఏ ని అసెంబ్లీలో లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? త్రిపురలో ప్రతిపక్షంలోకి ఎందుకు నెట్టబడ్డారు. మొన్న జరిగిన ఎన్నికలలో కేరళలలో కమ్యూనిస్టులు ప్రతిపక్ష్‌లోకి ఎందుకెళ్ళారు? ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని కమ్యూనిస్టులు ఊహించి ఉండరు. కాని వారు అనుసరించిన విధానాలే ప్రజల తిరస్కరణ కూడా కారణమని వామపక్ష నేతలు అంగీకరించలేని పరిస్థితి.
నిజానికి కమ్యూనిస్టుల్లో జాతీయతాభావం కొరవడటం, వారు పెట్టుకున్న నిబద్ధతకు కట్టుబడి ఉండలేకపోవటమే వారి వెనకబాటుతనానికి కారణం.
కమÖ్యనిస్టులు భారతదేశాన్ని ఒక జాతిగా ఎన్నడూ అంగీకరించలేదు. 1925లో వారి పార్టీ ఏర్పాటురోజున పార్టీకి పేరు పెట్టే సమయంలోనే ఆ విషయం స్పష్టమైంది. అప్పటికే రంగంలో ఉన్న పార్టీ ఆలిండియా కాంగ్రెస్‌పార్టీ. ఆ వరవడిలోనే ఆలిండియా కమ్యూనిస్టు పార్టీ అని పేరు పెట్టాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. ఇది అంతర్జాతీయ భావజాలం. 1925న కాన్పూర్‌లో వారు పెడుతున్న పార్టీని అంతర్జాతీయ కమÖ్యనిస్టు పార్టీకి భారతీయ విభాగంగానే భావించారు వారు. అందుకే వారి పార్టీ లెటర్ హెడ్‌మీద కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా బ్రాకెట్‌లో సెక్షన్ ఆఫ్ ది కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అని రాసుకున్నారు. కమÖ్యనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారత జాతీయపార్టీ కాదు అనేది స్పష్టం.
కమ్యూనిస్టులది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న భావజాలం. భారత జాతి మÖలంతో సంబంధాలు లేవు. లెనిన్, స్టాలిన్‌లు ఏమి చెప్పారో దానికి అనుగుణంగా భారతదేశంలో రాజకీయం నడిపారేగాని భారతీయత ఆధారంగా వారు పార్టీని నిర్వహించలేదు. 1930లో స్వతంత్ర ఉద్యమం మహాత్మాగాంధీó నేతృత్వంలో పతాకస్థాయిలో నడుస్తున్నది. ఉప్పుసత్యాగ్రహం, పూర్ణ స్వరాజ్ నినాదం ప్రజలందరిని కదిలిస్తున్న వేళ, కమ్యూనిస్టులు గాంధీ బహిష్కరణ సంఘాన్ని కలకత్తాలో(నేటి కోల్‌కతా) ప్రారంభించారు. ఇది ఆ తర్వాత లీగ్ ఎగెనెస్ట్ గాంధీ యిజమ్‌గా పేరు మార్చుకుంది. ఆ సమయంలో అటువంటి గాంధీ వ్యతిరేక వేదిక నిర్మాణం చెయ్యటమంటే దేశ స్వతంత్ర పోరాటాన్ని దెబ్బతీయటమే.
1942 క్విట్ ఇండియా ఉద్యమం వేళ కమ్యూనిస్టులు ఎటువంటి జాతి వ్యతిరేక విధానం అనుసరించింది, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఒక గాడిదలాగా, జపనీయుల చేతిలో తోలుబొమ్మలాగా దాడి చేసింది, కార్టూన్లు వేయించింది అనేందుకు వారి పత్రిక పీపుల్స్‌వార్ సాక్ష్యం. సోవియట్ ప్రయోజనాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను మార్చుకున్నారేగాని కమ్యూనిస్టులు భారతజాతికి అనుకూలంగా కాదు.
బ్రిటిష్ వలసపాలకులు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు రెండవ ప్రపంచ యుద్ధం కల్పించింది. అయితే దేశాన్ని మతపరంగా విభజించాలన్న కుట్ర వారి మదిలో ఉంది. దానిని వ్యతిరేకించాల్సింది పోయి కమ్యూనిస్టులు భారత్ ఒక జాతి కాదని, బహుభాషా జాతుల సమÖహం అని, కాబట్టి 17 ముక్కలుగా విడగొట్టి స్వాతంత్య్రాన్ని ఇవ్వమని క్రిప్స్‌మిషన్‌కి మెమోరాండం ఇచ్చిన ఘనులు వారు. ఈ భాషా జాతుల బాట సోవియట్ నాయకులు వేయగా వీరు అనుసరించినదే. మతపరంగా భారత్‌ని విడగొట్టి ముస్లింల కోసం ప్రత్యేక పాకిస్తాన్ దేశం ఏర్పాటుకు కమ్యూనిస్టులు మద్దతు పలికారు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారం ఉందని నాడు కమ్యూనిస్టు నాయకులు వాదించారు. ముస్లింలకు మాత్రమే స్వయం నిర్ణయాధికారం ఏమిటి? మిగిలిన మతాలకు అదే అధికారం ఉండి తీరాలికదా? అనే ఆలోచన నాటి కమ్యూనిస్టులకు కలగకపోవటమే వారికి జాతీయతాభావం లేదనడానికి తార్కాణం.
ఆగస్టు 15, 1947న భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశమంతా స్వతంత్ర సంబరాలలో ఉండగా ఆ స్వాతంత్య్రాన్ని అంగీకరించం అన్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఏ ఆజాదీ జూట్ (ఈ స్వాతంత్రం బూటకం) అనే నినాదం కమÖ్యనిస్టు నాయకుడు బి.టి.రణదివే ఇచ్చాడు. ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ఏక పార్టీ నియంతృత్వ పాలనకు ఇదే తగిన సమయం అని వాదించిన వాడు బి.టి.రణదివే. ఈ జాతి వ్యతిరేక భావజాలం వల్లనే నాడు జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రప్రథమ కేంద్రమంత్రివర్గంలో కమ్యూనిస్టులకు చోటు లేదు. హిందూ మహాసభ ప్రతినిధిగా శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి నెహ్రూ చోటిచ్చాడుగాని కమ్యూనిస్టులకు స్థానం ఇవ్వలేదు.
ఈ స్వాతంత్య్రం అంగీకరించేది లేదన్న కమ్యూనిస్టు భావజాలం నుండి పుట్టిందే నైజాం విమోచన పోరాటం. నిజాం నిరంకుశ పాలనకు అది వ్యతిరేక పోరాటం అయి ఉంటే సెప్టెంబర్ 17, 1948న నిజాం లొంగిపోయినపుడు కమ్యూనిస్టులు తమ బందూక్‌లను కిందపడవేయాలి.కానీ బలహీన నిజాంని ఓడించి, కమÖ్యనిస్టు జెండా కింద కొత్త దేశం ఏర్పాటు వారి లక్ష్యమా? లేకుంటే ఆ పోరాటం నిలుపుదల అంశం మీద నిర్ణయం తీసుకునేందుకు స్టాలిన్‌తో మంతనాలు ఎందుకు? రహస్యంగా మాస్కో వెళ్లి, స్టాలిన్‌ని కలిసి ఆయన సూచన మేరకే సాయుధ పోరాటం ఆపాం అని పి.సుందరయ్య తన పుస్తకంలో రాశాడు. మన దేశ అంతర్గత అంశంపై ఒక విదేశీ పాలకుడి సలహాను తీసుకోవటం ఏ విధంగా జాతీయ భావమవుతుంది?
కమÖ్యనిస్టులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించటానికి చాలా సమయం తీసుకున్నారు. వారిది ఏక పార్టీ నియంతృత్వపు ఆలోచన. భారతీయ చింతనకు భిన్నమైనది. 1952లో ప్రధాన ప్రతిపక్షంగా లోకసభలో నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత క్రమంగా వెనకపడటానికి కారణం వారి దృష్టి జాతీయపరమైనది కాకపోవటమే. వారు అనుసరించిన రాజకీయ వ్యూహాలు, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దానికి అదనంగా తోడయ్యాయి.
1957లో కేరళలో తొలిసారిగా కమÖ్యనిస్టు పార్టీ గెలిచి, ప్రపంచంలోనే మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం ఏర్పాటుచేసి రికార్డ్ సృష్టించింది. సంకుచిత భావనతో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతిపాలన విధించింది. మరోసారి తిరిగి ఆ పార్టీ స్వతంత్రంగా కేరళలో అధికారంలోకి రాలేక పోయింది. పార్టీ చీలిక కొంత కారణం. ఆ బలహీనతను కప్పిపుచ్చుకుని, అధికారంకోసం తమ లౌకిక విధానానికి తిలోదకాలిచ్చింది కమ్యూనిస్టు పార్టీ. ముస్లింల కోసం ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటును చేసింది. మల్లపురం జిల్లా అలా ఏర్పడినదే. యు.పి.ఏ. ప్రభుత్వ హయాంలో ఓట్ల కోసం పంజాబ్‌లో ముస్లింల కోసం కొత్త జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించకపోగా సమర్థించారు. లౌకికవాదం విషయంలో కాంగ్రెస్ బాటనే కమ్యూనిస్టులది. మార్క్స్ చెప్పిన మతం ఒక మత్తుమందు అనే దానిని హిందూ మతానికీ పరిమితంచేసి, మైనారిటీ మతాలను వెనకేసుకు రావటంలో వారిది కుహనా లౌకికవాదం అన్న ప్రత్యర్థుల ఆరోపణ బాగా అతికింది. క్రమంగా హిందూ వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి.
చైనా దురాక్రమణ సమయంలో కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన తీరు వారికి జాతీయభావన కరువైంది అనడానికి మరో నిదర్శనం. ‘చైనా దురాక్రమణదారు కాదు’ అన్నారు నాటి కమ్యూనిస్టు నేతలు. బ్రిటిష్‌పాలకుల ద్వారా భారత్‌కి దక్కిన చైనా భూభాగాన్ని తిరిగి ఆ దేశం తీసుకుంటున్నదే తప్ప భారత భూభాగం ఆక్రమించలేదని చైనాను సమర్థించారు. అంతటితో ఆ పార్టీ జాతి వ్యతిరేకత ఆగలేదు. చైనాతో జరిగిన యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికుల కోసం కమ్యూనిస్టు కార్యకర్త లెవరూ రక్తదానం చెయ్యవద్దన్న పిలుపు నిచ్చింది. ఇదీ వారికున్న దేశభక్తి. ఆ నిర్ణయం సరికాదని వాదించిన తమ సొంత పార్టీ నాయకుడు అచ్యుతా నందన్‌ని పార్టీ నిర్ణాయక కమిటీ నుండి బహిష్కరించారు. ఇది దేశ వ్యతిరేక చర్య. దీనిని వారు ఎలా సమర్థించుకుంటారు? చాలామంది భారతీయులకు కమ్యూనిస్టు పార్టీ పట్ల వ్యతిరేకత పెరగటానికి కారణం చైనా యుద్ధ సమయంలో వారి పాత్రనే.
స్వేచ్ఛ గురించి గొంతు చించుకునే కమ్యూనిస్టులు భారతదేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, స్వేచ్ఛను హరించిన అత్యవసర పరిస్థితి విధింపునకు బహిరంగంగా మద్దతు పలికారు. ప్రజా హక్కులను అణిచివేసి, హేబిస్ కార్పస్ పిటీషన్ వేసే హక్కును రద్దుచేసిన సుప్రీంకోర్టు తీర్పుకు కమÖ్యనిస్టుల మద్దతు ఉంది. జడ్జిల సీనియారిటీని పక్కన పెట్టినా, కమిటెడ్ జ్యుడిషియరీ ఉండాలని ఇందిరాగాంధి వాదించినా అన్నింటికి వారి సంపూర్ణ మద్దతు నివ్వటం కమ్యూనిస్టులకే చెల్లింది.
1977లో బెంగాల్‌లో వామపక్షం అధికారంలోకి వచ్చింది. 2011 వరకు వారిదే ప్రభుత్వం. ఆ సమయంలో కాంగ్రెస్, ఇతర పార్టీల పాలన కన్నా ఏమైనా భిన్నంగా పాలన సాగిందా అక్కడ? కేవలం భూసంస్కరణల అమలు అంశంలో తప్పించి మరే విషయంలోనూ వారు భిన్నంగా వ్యవహరించలేదు. అసమ్మతి ఆవశ్యకత గురించి మాట్లాడే కమ్యూనిస్టులు బెంగాల్‌లో అసమ్మతివాదులను అణిచివేసిన వైనం చరిత్రలో నమోదు అయింది. వారు అధికారంలోకి వచ్చిన రెండవ సంవత్సరంలో మరిచిఝాపి (Marichjhapi) దీవిలో పాల్పడిన ‘కిరాతక చర్య’ జుగంతర్ పత్రికలో 25.9.1979 సంచికలో వచ్చింది. కాని ఆ వివరాలతో కూడిన రెండవ వ్యాసాన్ని బయటకు రానివ్వలేదు జ్యోతిబసు ప్రభుత్వం. బెంగాల్‌లో నడిరోడ్డుమీద ఆనందమార్గ కార్యకర్తలను దహనం చేసారు. వారి పాలనలో బెంగాల్‌లో దాదాపు 29వేల రాజకీయ హత్యలు జరిగాయి.
మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ – అమెరికా అణు ఒప్పందాన్ని కమÖ్యనిస్టులు వ్యతిరేకించారు. ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. 2007లో ఆ నిర్ణయం చైనా ప్రోద్భలంతో నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరాత్ తీసుకున్నదని పీపుల్స్ డెమోక్రసీలోని వ్యాసాన్ని ఉటంకిస్తూ రుద్రంష్ ముఖర్జీ ‘ది టెలిగ్రాఫ్ పత్రికలో (7.1.24)న వ్యాసం రాసాడు. జాతి ప్రయోజనాలకు కమÖ్యనిస్టులు వ్యతిరేకం అన్నది ఆ వ్యాసానికి హెడ్డింగ్ (The Red Blunders : The Communists have Consistently betrayed national interests)
1990 తర్వాత ఆర్థిక సంస్కరణల అమలుతోనే సోషలిజం నినాదానికి, కమ్యునిష్టు పార్టీ కాలం చెల్లింది. ఆర్థిక సంస్కరణలను వారు బెంగాల్‌లో అనుసరించటంలో సొంత ఆర్థిక విధానం లేకుండా పోయింది.
తమ కంటూ ప్రత్యేక స్థానం లేకున్నా తామే జాతి ప్రయోజనాలను కాపాడే వారం అంటూ కమ్యునిస్టులు చేసే ప్రకటనలు హాస్యాస్పదంగా మారాయి. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల వేళ జాతీయ కోణంలో కాక మాస్కో, చైనాల కోసం ఆలోచించి, అనుసరించి, భారతీయతను త్యాగం చేసిన వారు కమ్యునిస్టులు.
రాజకీయాలలో ఏ పార్టీ అయినా తప్పులు చేస్తుంది. అయితే ఆ తప్పులు తమ సొంత ఆలోచనా శక్తి లోపంతో చేస్తుంది. కమ్యునిస్టుల తప్పిదాలు మాస్కో, బీజింగ్‌ల ఆలోచనలకు అనుగుణంగా చేసినవే. అందుకే వారు జాతీయ స్రవంతిలో ఎన్నడూ భాగస్వామ్యులు కాలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీ నుండి చీలి అడవిబాట పట్టిన మావోయిస్టుల అగ్రనాయకత్వం తుపాకీ వదలి, పోలీసుల ముందు లొంగిపోవటం కూడా ‘కాలంతో మారలేకపోయి నందుకే’ నని ఒక నాయకుడు అంగీకరించాడు. విదేశీ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుని, భారతీయ చింతన లేనందునే వారు చరమాంకానికి చేరారు. ఇది కమ్యూనిస్టు పార్టీలన్నింటికి వర్తిస్తుంది.
డా॥ దుగ్గరాజు శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్