చక్రవర్తి రాజగోపాలాచారి బస్ట్ పరిమాణంలోని విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. రాజ గోపాలా చారి లేదా రాజాజీ స్వతంత్ర భారత దేశంలో గవర్నర్ జనరల్ (1948 – 1950) పదవిని చేపట్టిన ఏకైక భారతీయుడు. అశోక మంటపం దగ్గరి ప్రధాన మెట్ల దారి వద్ద ఈ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. మొదటిసారి రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో రాజాజీ ఉత్సవాలు (ఫిబ్రవరి 24-మార్చి1) నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిపించారు. ఇప్పటి వరకు అక్కడ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యుటెన్స్ విగ్రహం ఉండేది. ఎదురుగా గాంధీజీ విగ్రహం ఉంటుంది. దేశంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్న కార్యక్రమంలో భాగంగానే ల్యుటెన్స్ విగ్రహం తొలగించి, రాజాజీ విగ్రహం ఆవిష్కరించారు. రాజాజీ రచనలు, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలియచేసే ఫోటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణియం జైశంకర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, రాజాజీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భారతదేశాన్ని వలస జాడల నుంచి విముక్తం చేయడానికి జరుగుతున్న కృషిలో ఇది చెప్పుకోదగిన చర్య అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్‌గా రాజాజీ ఒకప్పుడు వైస్రాయ్ హౌస్ అని పిలుచుకున్న రాష్ట్రపతి భవన్‌లో ప్రవేశించారు. అప్పుడు ఆయన రామకృష్ణ పరమహంస, గాంధీజీ చిత్రపటాలను తన గదిలో ఏర్పాటు చేయించుకున్నారని ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ నిండా భారతదేశాన్ని దోచుకు తిన్న అధికారుల ఫోటోలు వేలాడుతూ ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో పరమ వీర్‌చక్ర పురస్కారాలు పొందిన యోధుల ఫోటోలు వచ్చాయి. మన పురాతన భాషలలోని గ్రంథాలు, ఇతర తాళపత్ర గ్రంథాలు భద్రపరచడానికి రాష్ట్రపతి భవన్‌లో గ్రంథ కుటీర్‌ను ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రపతి భవన్ కాదని, దేశానికి చెందినదని, ప్రజలందరిదేనని ముర్ము వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా, మన పురాతన సంస్కృతిని తెలియచేసే గ్రంథాల కోసం సిమ్లా, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలోని రాష్ట్రపతి నిలయాలను ప్రజలు సందర్శించవచ్చునని వెల్లడించారు. వలసవాద జాడలను నిర్మూలించడానికి మోదీ ప్రభుత్వం రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చింది. ప్రధానమంత్రి కార్యాలయం పేరు సేవాతీర్థ అయింది. కేంద్ర సచివాలయం కర్తవ్య భవన్ అయింది.
బ్రిటిష్ కాలంలోనే కాకుండా, స్వతంత్ర భారతదేశం లోను దుర్భిక్షాలు ఏర్పడినాయని, సాటి భారతీయుల బాధను అర్ధం చేసుకున్న రాజాజీ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోనే సేద్యం చేయించారని గుర్తు చేశారు రాష్ట్రపతి. తానే నాగలి పట్టి పొలం దున్ని, గొప్ప మార్గదర్శ కునిగా మిగిలారని తెలియచేశారు. మన స్వదేశీ, ఆత్మ నిర్భర భారత్ చింతనల వెనుక రాజాజీ ఆలోచనలు ఉన్నాయని అన్నారు. గాంధీజీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారాయన.
రాజగోపాలాచారిది ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానం. తమిళనాడు నుంచి వచ్చిన ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. న్యాయవాది, రచయిత, సంగీత విమర్శకుడు. పరి పాలనాదక్షుడు. రామా యణం, భారతం ఇంగ్లిష్‌లో తనదైన శైలిలో రాశారు. అవే రాజాజీ రామా యణం, రాజాజీ భారతం. భారతీయ తాత్త్విక, ఆధ్యాత్మిక చింతన గురించి ఆయన అందించిన రచనలు, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాటలకు ఇచ్చిన పరిచయం ఇప్పటికీ స్మరణీయంగానే ఉన్నాయి. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 1954లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
దేశ విభజన సీఆర్ ప్రణాలిక
చక్రవర్తి రాజగోపాలాచారి (1878 – 1972) దక్షిణ భారతదేశంలో జరిగిన స్వాతంత్య్ర పోరాట సారథులలో ప్రముఖులు. రాజాజీగా, సీఆర్‌గా ప్రజలు పిలుచుకున్న రాజగోపాలాచారి గాంధీజీ ఆత్మసాక్షి నిర్దేశకునిగా పేర్గాంచారు. గాంధీజీకి ఆయనకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. గాంధీజీ కారాగారంలో ఉంటే, యంగ్ ఇండియా సంపాదకత్వ బాధ్యతలు రాజాజీ స్వీకరించేûవారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చినప్పుడు వేదారణ్య సత్యాగ్రహం నిర్వహించారు. సహాయ నిరాకరణోద్య మంలో, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో, వైకోమ్ సత్యాగ్రహంలో కీలకంగా వ్యవహరించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రిగా (1937 – 1939) ఆయన అనేక సంస్కర ణలు చేపట్టారు. ఆలయ ప్రవేశ చట్టం తీసుకువచ్చి, అందరికీ దైవదర్శన భాగ్యం కలిగించారు. కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఆయన స్వేచ్ఛాజీవి. కాంగ్రెస్‌తో అంత అనుబంధం ఉన్నా, గాంధీజీతో అంత సాన్నిహిత్యం ఉన్నా కొన్ని విషయాలలో విభేదించారు. కేంద్రీకృత సామ్యవాద ప్రణాళికలను వ్యతిరేకించారు. అందుకే 1959లో స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. వ్యక్తి స్వేచ్ఛకు, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు స్థానం కల్పించాలని ఆశించారు.
భారత స్వాతంత్య్ర పోరాటం అంతిమ దశలో వెలువడిన రాజాజీ ప్రణాళిక చాలా ముఖ్యమైనది. రెండో ప్రపంచ యుద్ధం, ఆ యుద్ధంలో పాల్గొన్న జపాన్ ఆసియాలో వీర విహారం చేయడం, లాహోర్ సమావేశాలలో (1940, మార్చి) ముస్లిం లీగ్ పాకిస్తాన్ ఏర్పాటు అనివార్యమని తీర్మానించడం, విశాఖపట్నం, మద్రాస్, కాకినాడ పట్టణాల మీద జపాన్ నౌకలు తూర్పు తీరానికి రావడం, విమానాలు బాంబులు ప్రయోగించడం (ఏప్రిల్ 6,1942) వంటి చారిత్రక ఘట్టాల నేపథ్యంలో రాజాజీ ఒక ప్రణాళి కను తయారు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అయోమయ స్థితిని ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ నుంచి భారత్‌కు స్వాతంత్య్రం తెచ్చుకోవడం, అంతకు ముందు ఒక తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడడం రాజాజీ ప్రయత్నాన్ని వేగవంతం చేశాయనాలి. ప్రతిష్టంభనకు సంబం ధించి భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల నడుమ ఏర్పడిన ప్రతిష్టంభనకు విరుగుడుగా రాజాజీ తన ప్రణాళికను ముందుకు తెచ్చారు. ముస్లిం లీగ్ పాకిస్తాన్ కోరికకు సంబంధించి, అంటే దేశ విభజనకు సంబంధించి అప్పుడు బయటకు వచ్చిన నాలుగు ప్రణాళికలలో రాజాజీ ప్రణాళిక ఒకటి. అవి`సీఆర్ ఫార్ములా (1944), వేవెల్ ప్రణాళిక (1945), కేబినెట్ మిషన్ (1946), మౌంట్‌బాటన్ ప్రణాళిక (1947). సీఆర్ ఫార్ములా లేదా రాజాజీ ప్రణాళిక మొదటి స్థానంలోనే ఉన్నా దీనిపై తగిన చర్చ కనిపించదు. ఈ నాలుగు దేశ విభజనను సూచన ప్రాయంగా చెప్పినవే. మూడు వలస ప్రభుత్వ ప్రతిపాదనలు. ఒకటి రాజాజీ ప్రణాళిక. ఆయన ప్రణాళికపై నాటి చారిత్రక పరిస్థితులను బట్టి అంచనాకు రావాలి. రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ పరిస్థితి దిగజారింది. అలాంటి సమయంలోనే మన తూర్పుతీర సముద్ర జలాలలోకి జపాన్ నౌకలు వచ్చాయి. ఇంగ్లండ్ ఓడిపోతే, జపాన్ చేతికి భారత్ వెళ్లిపోతుందన్న భయాలు ఆనాడు గాఢంగా ఉన్నాయి. జిన్నా తన డిమాండ్‌కు పదునుపెడుతున్నాడు. కానీ కాంగ్రెస్‌లోని హిందూ ముస్లిం నాయకులు ద్విజాతి సిద్ధాంతానికి, దేశ విభజనకు వ్యతిరేకంగానే ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం తరువాత కాంగ్రెస్‌ను నిషేధించారు. గాంధీ సహా నేతలంతా కారాగారాలలో ఉన్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి ముస్లింలీగ్ నాయకుడు జిన్నా పితలాటకం పెట్టారు. ఆ నేపథ్యంలో రాజాజీ ప్రణాళిక వచ్చింది. ఏమిటి రాజాజీ ప్రణాళిక?
భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని ఆంగ్లేయుల మీద కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలసి ఐక్యంగా పోరాడాలి.
కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ముస్లిం లీగ్ కాంగ్రెస్‌తో సహకరించాలి. ప్రభుత్వంలో ఆ రెండు సంస్థల వారు సభ్యులుగా ఉండాలి.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారత్‌లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ముస్లిమేతరులకు కూడా ఓటు హక్కు ఇస్తూ సార్వత్రిక ఓటింగ్ పద్ధతిలో ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) చేయాలి. ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరమా కాదా అన్న అంశం మీద ఈ ప్రజాభిప్రాయసేకరణ జరగాలి. ఓటింగ్ నిర్వహించడానికి ముందే అదే అంశం (ముస్లింలకు ప్రత్యేక దేశం) మీద అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకోవాలి. ఈశాన్య, వాయువ్య భారతదేశంలో ఎక్కడ ముస్లింలు అత్యధికంగా ఉన్నారో గుర్తించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
ఒకవేళ విభజనను ఆమోదించినట్టయితే, కమ్యూని కేషన్లు, రక్షణ, వాణిజ్యాలు తదితర అంశాల మీద రక్షణకు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకోవాలి.
ఇదంతా విఫలమైన పక్షంలో ఒక తాత్కాలిక ఏర్పాటు చేసుకోవాలి. దానితో అత్యవసర ప్రయోజనాలను రక్షించుకోవాలి. జనాభా మార్పిడి ఆలోచన ఉంటే అది కచ్చితంగా స్వచ్చందంగానే జరగాలి.
అయితే పైన చెప్పుకున్న వాటిలో ఏది విజయవంతం కావాలన్నా మొదట బ్రిటన్ మనకు అధికార బదలీ చేసినప్పుడే సాధ్యం.
తన ప్రణాళిక గురించి ఆగాఖాన్ భవంతిలో నిర్బంధంలో ఉన్న గాంధీజీకి రాజాజీ తెలియచేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన గాంధీజీ, కస్తూర్బా, సరోజినీ నాయుడు తదితరులంతా అక్కడే ఉన్నారు. ఈ ప్రణాళికకు గాంధీజీ ఆమోదం తెలిపారు. అయితే జిన్నా రాజాజీ ప్రణాళికను ఆమోదించ లేదు. కానీ 1944లో గాంధ – జిన్నా చర్చలకు ఇది దోహదం చేసింది.
కానీ జిన్నా వెనకడుగు వేయలేదు. కాంగ్రెస్ ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించాలని పట్టుపట్టాడు. ఇక ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో రిఫరెండం నిర్వహించవలసి వస్తే అందులో ముస్లింలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని కూడా జిన్నా చెప్పాడు. ఇక జాతీయ ప్రభుత్వం ఏర్పాటు గురించి తనకు ప్రత్యేక ఆసక్తి ఏమీ లేదని చెప్పాడు. అలాగే ఇంగ్లండ్ నుంచి స్వాతంత్య్రం తెచ్చుకోవడం కంటే, ముస్లింలకు ప్రత్యేక దేశం తెచ్చుకోవడమే తనకు ప్రధానమని తెలియ చేశాడు. అది ఈ దేశం నుంచి బ్రిటిష్ జాతి వైదొలగడానికి ముందే జరగాలని కూడా చెప్పాడు.
జిన్నా మాత్రమే కాదు, సిక్కులు కూడా రాజాజీ ప్రణాళికను వ్యతిరేకించారు. ఎందుకంటే, పంజాబ్‌ను చీల్చడం వారికి ఆమోదయోగ్యం కాదు. వీరితో పాటు ఇండియన్ నేషనల్ లిబరల్ ఫౌండేషన్ నాయకుడు వీఎస్ శ్రీనివాసశాస్త్రి, హిందూ మహాసభ నేతలు వినాయక్ దామోదర్ సావర్కర్, శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా రాజాజీ ప్రణాళికను వ్యతిరేకించారు.
ముస్లింలు అధికంగా ఉన్నట్టు జిన్నా ప్రకటించు కుంటున్న ప్రాంతాలలో హిందువులు కూడా ఉన్నారని పరోక్షంగా తెలియచేయడమే రాజాజీ లక్ష్యమని విశ్లేషకులు చెబుతారు. అందుకే ఆయన ముస్లింలతో పాటు ముస్లిమేతరులకు కూడా అభిప్రాయసేకరణలో ఓటు హక్కు ఇవ్వాలని కోరారు. కానీ దీనిని జిన్నా మొదటే వ్యతిరేకించాడు. తాత్కాలిక ప్రభుత్వంలో స్థానం సంపాదించుకోవడం కంటే, బయట ఉండి ముస్లింలకు ప్రత్యేక దేశం సాధించుకోవడమే ప్రధానమన్న ఆలోచన జిన్నాది. కాబట్టి రాజాజీ ప్రణాళిక అంతకాలం సాగించిన ముస్లిం లీగ్ ఉద్యమానికి బ్రేకులు వేయగలుగుతుంది. మరొక కొత్త దశకు కూడా తీసుకుపోయి ఉండేదేమో కూడా. అసలు వేరే దేశంగా ఏర్పాడాలని ముస్లింలు భావిస్తుంటే ఇక రక్షణ, వ్యాపార వాణిజ్య కమ్యూ నికేషన్ రంగాలలో ప్రత్యేక ఒప్పందాలు ఎందుకు అన్నది కూడా జిన్నా ప్రశ్న.
రాజాజీ ప్రణాళిక విఫలం కావడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జిన్నా ప్రత్యేక దేశం ఆలోచన తప్ప మరొక దానిని అంగీకరించడం లేదు. ప్రతిష్టంభన నివారణకై జరిగిన భూలాభాయ్ దేశాయ్ (కాంగ్రెస్), లియాఖత్ ఆలీ ఖాన్ (లీగ్) చర్చలు కూడా విఫలమైనాయి. రెండో ప్రపంచ యుద్ధం పుణ్యమా అంటూ ఇంగ్లండ్ నుంచి జపాన్ చేతికి భారత్ వెళ్లిపోకుండానే స్వాతంత్య్రం తేవాలన్న రాజాజీ యోజన గొప్పది.
– జాగృతి డెస్క్