‘మీకు అభివాదాలు’ అంటూ మొదలైంది ఆ లేఖ.
‘వైద్యం అంటే నాకు ప్రాణం. నేను ఇపుడు వైద్యవిద్యలోనే ఉన్నాను. మీరు మొట్టమొదటిసారిగా అందరూ మహిళా వైద్యులతోనే నడిచే వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని నాకూ తెలుసు. విద్యార్థినినీ అయినా నేనూ మీ శిబిర సేవలో పాల్గొంటాను. దయతో నాకు అనుమతి ఇవ్వండి. అన్నట్లు, నేనూ మీ మహిళా వైద్యకళాశాలలో చదువుతున్న అమ్మాయినే’ అని కొనసాగింది ఆ లేఖంతా. ఆ విద్యార్థిని పేరు ఆనందీబాయి. ఆ సంస్థ అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా వైద్యకళాశాల. ఆమె లేఖ రాసింది అదే కాలేజీ డీన్ రెచెల్ బాడ్లీకి!
‘ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు డీన్. ‘ఇక్కడే ఈ కాలేజీలోనే తను చదువుతూ ఉంటే, వైద్యశిబిరంలో పాల్గొనేందుకు అభ్యంతరం ఏముంటుందీ?’ అని ప్రశ్నించుకున్నారు. తీరా వాకబు చేస్తే….
ఆనందీబాయి స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. భర్త గోపాలరావు, చిన్నపాటి ఉద్యోగి. అదీ తరచుగా బదిలీలు జరిగే ఉద్యోగం. ఎంత పని ఒత్తిడి ఉన్నా, కుటుంబానికి తగినంత సమయం కేటాయించే వ్యక్తి. భార్య ఆనందీకి చదువుమీద ఉన్న అనురక్తిని గ్రహించారు. పలు భాషలు నేర్చుకునేలా చేశారు. ఆ దంపతుల జీవితంలో పెనువిషాదం ఏమిటంటే, పుట్టిన బిడ్డ కొద్దిరోజుల్లోనే వ్యాధిబాధతో మరణించడం!
ఎంతగానో కుంగిపోయిన ఆనందీ ‘అసలు ఏమిటీ వ్యాధులూ బాధలూ’ అని మానసికంగా తల్లడిల్లారు. తను వైద్యురాలు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రయత్నంలో భాగంగా, అమెరికాలోని వైద్యకళాశాలకు దరఖాస్తు చేసుకున్నారు. అదే పెన్సిల్వేనియా! తను దరఖాస్తుదారే అయినా, ఆ కళాశాల విద్యార్థినే అన్నంత విశ్వాసాన్ని కనబరిచారు. మహిళా వైద్య శిబిర నిర్వహణలో తనవంతు సేవ అందించాలనే అలా డీన్‌ని అభ్యర్థించారు. ‘అంతా అర్థమైంది. మీరు శిబిర సేవలు అందించండి’ అని ప్రత్యుత్తరం!
ఆనందీ మరణించింది ఫిబ్రవరి 26న. 138 సంవత్సరాల కిందట. మరణించే నాటికి ఆమె వయసు 21 సంవత్సరాలు.
ఆనందీ అసలు పేరు యమున. తల్లిదండ్రుల పెట్టింది ఆ పేరే. ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే ఆ పిల్లను చూసి ‘ఆనందీ’ అని పిలిచేవారు. అందువల్ల ఆమెకి ఆ పేరే స్థిరపడింది. భర్త పేరుతో కలగలిపి ఆనందీ గోపాల్. మన దేశం నుంచి విదేశానికి వెళ్లి, అక్కడి వైద్యశాస్త్రంలో పట్టా సాధించుకున్న తొలి వైద్యురాలు.
పెన్సిల్వేనియాలో ప్రవేశం ఆనందీ వృత్తి జీవితాన్ని పెనుమలుపు తిప్పింది. అంతకన్నా మిన్నగా ముందస్తుగా ఆమె తన ప్రాంతంలో చేసిన ప్రసంగంతో అనంత స్పందన అందుకుంది. ‘నేను భారతీయురాలిని. ఇక ఆధునిక వైద్యశాస్త్రాన్ని అమెరికాలో అభ్యసిస్తాను. అన్ని మెళకువలూ తెలుసుకుంటాను. తిరిగి మన దేశానికి వచ్చి, ఏకంగా మహిళా వైద్యకళాశాల ఆరంభిస్తాను. ఎందుకంటారా? సేవలు అక్కడికంటే ఇక్కడే ఎక్కువ అవసరం!’
ఈ మాటలు మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న భారతీయసంతతివారిలో ఉత్సుకత, ఉత్సాహం కలిగించాయి. ఆర్థికంగానే కాక అన్ని విధాలా ఊతం అందిస్తామని ఎంతరెందరో ముందుకొచ్చారు. అంతటి ప్రోత్సాహ ఫలితంగానే, ఆనందీ అమెరికా ప్రవేశం! అప్పటికే భర్తకు ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయింది. అక్కడి నుంచి నౌకలో బయల్దేరారు ఆమె. న్యూయార్క్ చేరుకుని, అటు తర్వాత పెన్సిల్వేనియాలో అడుగుపెట్టారు.
అసలే ఆంగ్లేయుల పాలనా కాలం. అల్లకల్లోల వాతావరణం. స్వదేశం నుంచి పరదేశానికి ఆమె పయనం ఎన్నో ప్రతికూలతల మధ్య కొనసాగింది. మహిళా విద్యకు అడుగడుగునా అవరోధం!
కొందరు ఈసడించారు. ఇంకొందరు నిరుత్సాహపరిచారు. మరికొంతమంది అడ్డు తగిలారు. మరికొందరైతే దూషణలకు దిగి, ఆనందీని నిర్బంధించినంత పనిచేశారు. విదేశంలోనూ అంతే.
అమెరికావాసులు కొందరైతే ఆమె మీద నౌకాశ్రయంలోనే రాళ్లు విసిరారు. ‘భారతీయురాలు ఇక్కడికి రావడమా’ అంటూ నిందారోపణలతో దాడికి తెగబడ్డారు. వెనకడుగు వేయలేదు ఆనందీ!
ఎందుకూ అంటే – ఆమె విషాదీ కాదు. వెన్ను చూపే అలవాటు ఆమెకి లేదు. మహిళా శక్తి! మడమ తిప్పని వ్యక్తి.
న్యూయార్క్‌లో ఆమెకి ఒకరిద్దరు మనసారా స్వాగతం పలికారు. ఆత్మీయతను పంచారు. పెన్సిల్వేనియా వైద్యకళాశాలవారూ జత చేరారు. ఉపకారవేతనం మంజూరు చేశారు.
అప్పుడు ఆనందీకి 19 ఏళ్లు. వైద్యవిద్యను అభ్యసించింది రెండేళ్లు. అమెరికాలో జీవితం ఏ విధంగా చూసినా అసాధారణమే! చలి పులి చంపేస్తుంటుంది. మంచు తాకిడి నిత్య నరకం చూపిస్తుంటుంది. అన్నింటినీ తట్టుకున్నారామె. శీతల రాకాసి కోరల నుంచి బయటపడాలని ఎన్నో మార్లు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. చేసిందంతా నిరంతర పోరాటమే!
అక్కడ ఆమె చదువు నిరవధికంగా సాగింది. పగలూ రాత్రీ పరిశోధనలూ ప్రయోగాలతో కాల మంతా గడిచింది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఆమెది గట్టి పట్టుదల. తను చదువుకు సాకారం భారత్‌లోనే అన్నదే స్థిర సంకల్పం. అదీ తన ఘనత.
అవరోధాలను అధిగమించడం అంటే ఏమిటో ఆమె నుంచే తెలుసుకోవాలి ఎవరైనా. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయింది. తుది పరీక్షలు చక్కగా రాశారు. ఉత్తమ ఫలితం తథ్యమనీ ఆశించారు.
కల నెరవేరింది. వైద్య విద్యలో ఆనందీకి డాక్టరేట్! పట్టా అందుకునేనాడు ఆనందం అంబరమంటింది. డిగ్రీ ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటైంది.
ప్రశంసలతో ముంచెత్తారందరూ. ఆనందీ ఓ ఆశాదీపమన్నారు. పాశ్చాత్య వైద్య విద్యను అభ్యసించిన, డాక్టర్ అనిపించుకున్న తొలి వనితా మూర్తిగా కితాబిచ్చారు. ఇవన్నీ లభించింది సహచర విద్యార్థినుల నుంచే! కళాశాల పెద్దలూ ఆశీస్సు లిచ్చారు.
ఇక్కడే మరొక ఆదర్శనీయను మనం గుర్తుచేసు కోవాలి. రమాబాయి సరస్వతి. సంఘ సంస్కర్త. మహిళలకు విద్య ఎంత అవసరమో తేల్చి చెప్పిన పండితురాలు. సాక్షాత్తు అంతటి విద్వాంసురాలే పట్టా ప్రదానోత్సవ సమావేశంలో ప్రసంగించారు. ‘ఆనందీ! నువ్వు మా అందరి హదయబందీవి’ అని కొనియాడారు.
మరికొన్నాళ్లు గడిచాక, స్వదేశం వెళ్లడానికి సంసిద్ధమయ్యాక, ఆనందీకి మరో అవరోధం ఎదురైంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు రోజూ ఇంట్లో వేసుకున్న పొగ ఆమెకి సరిపడలేదు. గది లోపలి ఫైర్ ప్లేస్ తగిన విధంగా లేనందున, పొగ ఎక్కువై ఊపిరితిత్తుల్లోకి చేరి, వ్యాధిగా పరిణ మించింది!
ఆమెకి డాక్టరేట్ ప్రదాన ఉత్సవానికి వచ్చిన భర్త అక్కడే మరికొంత కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఆనందీబాయికి అనారోగ్యం ఎక్కువవడం ఆయననీ తీవ్ర క్షోభకు గురిచేసింది. ‘ఇప్పుడు ఏం చేయాలి, భారత్‌కు ఏ విధంగా తిరిగి వెళ్లాలీ’ ఇదే… ఆ దంపతుల ఆలోచన! కాలమైతే ఆగదు కదా?
చిట్టచివరికి తిరుగు ప్రయాణం మొదలైంది. నౌకలో ఉండగానే, ఆనందీబాయి ఆరోగ్యం విషమించసాగింది. ఏదో విధంగా స్వస్థ లానికి చేరుకున్నారామె.
కలకత్తాకి చేరుకున్న తర్వాతా, అనారోగ్య పీడ వదిలిపోలేదు. ఆమె చిక్కి శల్యమయ్యారు. కొంత మంది శ్రేయోభిలాషులు తమవంతు పనులతో ఆమెకి స్వస్థత కలిగేలా ప్రయత్నించారు. ఎందరు ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా సాయపడాలని చూసినా, ఆ అన్నీ నిష్ఫలమై, ఒకరోజున శాశ్వత నిద్రలోకి జారుకున్నారు ఆనందీ!
ఆమె లేకున్నా, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆనందీ మనోభావనలు, చేసిన వైద్య పరిశోధనల పరంపరలు చరిత్రలో సుస్థిరంగా నిలిచాయి. జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవ కారణంగా వైద్యవృత్తిని ఎంచుకోవడం, ఆ సేవలను స్వదేశంలో సాగించడానికి నడుం కట్టడం, అంతటి కృషిలో ఆఖరికి తన ప్రాణాన్నే కోల్పోవడం… ఎటువంటి ఉదాత్త జీవనం ఆమెది! అందువల్లనే దేశం ఆమెను ఎన్నో రూపాల్లో గుర్తు చేసుకుంటోంది..
హిందూ వనిత, స్త్రీ ధర్మ నీతి పుస్తకాలు డాక్టర్ ఆనందీబాయి జీవిత ధన్యతను విపులీకరించాయి. వైద్యరంగంలో ఆమె పేరిట అవార్డును ప్రత్యేకంగా నెలకొల్పారు. మహారాష్ట్రలో యువతులకు ఉపకార, ప్రోత్సాహక వేతనాలు అందిస్తున్నారు. పడతుల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించినవారికి ఆర్థిక పురస్కారాలు బహూకరిస్తున్నారు.
ఆనందీబాయి స్మారక ఫలకం మీద ‘త్యాగ మయీ, అనురాగమయీ’ అని రాసి ఉంటుంది అక్షర సాక్ష్యంగా ఆమెకి ఆ పేర్లు రెండూ పూర్తిగా వర్తిస్తాయి ఏనాటికీ!

జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్